వెలగపండూ-వైరాగ్యం

2
3

[box type=’note’ fontsize=’16’] మార్కెట్‌లో కూరలమ్మిని తన తెలివితో బురిడీ కొట్టించాననుకున్న ఓ మహిళకి వెలగపండుపై వైరాగ్యం ఎందుకు కలిగిందో చెబుతున్నారు కె.ఎస్.ఎన్.రాజేశ్వరి ఈ కథలో. [/box]

[dropcap]“కొ[/dropcap]బ్బరికాయ ఎలా ఇచ్చావమ్మాయ్?” మొహమ్మీద నవ్వూ, గొంతులో వీలైనంత చనువూ ప్రదర్శిస్తూ అడిగాను.

“కాయ ముప్ఫై రూపాయలు” నా వైపు చూడకుండానే దాని దగ్గర సామాను సరిగా సర్దుకొంటూ జవాబిచ్చింది.

నా పక్కనే మా వారు పేంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డారు. స్టైల్‌గా కాదు. స్టైలుకి అంతకన్నా కాదు. వినాయక చవితి ముందురోజు మార్కెట్‌లో విపరీతమైన జనం. ఎవరూ జేబులు కొట్టెయ్యకుండా అలా జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డారు నా సలహా మీద.

నేను మావారి జేబులోంచి నా సెల్ తీసి (నేను ఆయనతో బయటికి వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బాగ్ తీసుకెళ్ళను. రుమాలు నా బొడ్లో దోపుకుని సెల్ ఆయన జేబులో పెట్టేస్తాను).

“అది ఎందుకూ ఇప్పుడు?” అని ఆయన అంటూంటే శ్రావణమాసంలో నేను చేసిన వరలక్ష్మీ పూజ ఫోటోలు గేలరీ లోంచి తీసి “ఇదుగో చూడమ్మాయ్”అని కొబ్బరికాయలు అమ్మే అమ్మాయికి చూపించాను.

నేను వరలక్ష్మీ పూజకి కొబ్బరికాయ తీసుకుని దానికి స్వంతంగా ముక్కూ చెవులూ పెట్టి, కళ్ళు దిద్ది అలంకారం చేస్తాను. “అబ్బా అబ్బా” వచ్చిన పేరంటాళ్ళు అంటూ ఉంటే గొప్ప ఫీలవుతాను.

ఆ ఫొటో చూసి అది “ఓరిది” అని అడిగింది. అప్పుడు నేను “ఈ కొబ్బరికాయ నీ దగ్గర తీసుకున్నదే. దీన్ని ఇలా బొమ్మలా తయారు చేసి పూజ చేశాను. చూడు ఎంత బాగుందో” అన్నాను.

ఇంతలో ఏ మాత్రం టాక్టిక్స్ లేని మా వారు “అదేమిటి! ఆ కొబ్బరికాయ” అని ఏదో అనబోయారు. నేను ఓ కనుసైగతో మావారి సత్య హరిశ్చంద్రత్వానికి అడ్డుకట్ట వేశాను.

అది లేచొచ్చి ఫొటోకి దణ్ణం పెట్టి “నీకేటి గావాల?” అనడిగింది.

“ఏముందీ! రేపు పూజకి పళ్ళూ, పూలూ, పాలవెల్లికి కట్టడానికి కాయలూ అన్నీ కావాలి. మరీ రేట్లు వేసెయ్యకు” అన్నాను. “అదేటిదమ్మా మీకాడ ఎక్కువ తీసుకుంటానా?” అని ఒక్కొక్కటీ ఎంచి తీసి సంచీలో వెయ్యడం మొదలెట్టింది.

అన్నీ వాటి ధరలడిగి కొంచెం రీజనబుల్ అనిపించడంతో నా ఫొటో ఎఫెక్ట్ బాగానే ఉంది అనుకున్నాను. అయినా అది చెప్పినదానికి ఒకట్రెండు రూపాయలు తగ్గించి లెక్కపెట్టమని మా ఆయనకి చెప్పాను. మొత్తం అంతా అయ్యాక రెండు వందల రూపాయలు అయ్యిందమ్మా, రెండు వందలు యివ్వండి చాలు” అంది.

“అబ్బా! అంతే” అని అంటూ కొంచెం అటు తిరిగేసరికి వెనగ్గా ఉన్న వెలక్కాయల మీద దృష్టి పడింది.

“అమ్మా! మంచి వెలక్కాయలు వెనక్కి పెట్టేసుకుంది” అనుకున్నాను.

“ఔను కానీ పచ్చడికి కొంచెం మంచి వెలక్కాయలు పండినవి ఉంటే ఇద్దూ, వెలగ పచ్చడి తిని చాలా రోజులయిందీ, కాస్త పండినవి చూడు” అన్నాను. ఇప్పటికి దానికీ నాకూ ఏదో తెలీని బంధం ఏర్పడిందని నేననుకుంటున్నానని అదనుకోవాలని.

“అయ్యో! అలగెనమ్మా కొంచెం పండినవి ఉంటే పిల్లలు తింటారని వెనక్కి పెట్టాను. మాకేటి, మళ్ళీ రేపొచ్చినప్పుడు తింటారులెండి. మీరొట్టుకెల్లండి” అని రెండు పళ్ళుచేతిలో పెట్టింది.

“అమ్మా అయ్యీ…. ” అని పక్కనే ఉన్న దాని కూతురు ఏదో చెప్పబోతే,

“ఒల్లకోయే, మళ్ళీ రేపొచ్చినప్పుడు తిందుగాన్లే” అని దాన్ని గదిమింది.

“ఎంతకిచ్చావ్” అనడిగితే “ముప్పైరూపాయలమ్మా… పాతికివ్వండి చాలు” అంది.

“అబ్బో పాతికే! యిరవై ఇస్తా” అన్నాను.

“కాయలకి బీటలున్నట్టున్నాయి” అన్నారు మా వారు.

“పండిన వాటికి అలాగే చిన్న పగుళ్ళు ఉంటాయి లెండి” అన్నాను.

“అవునయ్యా! అయినా బత్తాలు ఎత్తేత్తారు గందా బాబూ, అయేటీ పాడైపోనేదు. ఒట్టుకెల్లండి. బానేపోతే తెచ్చిచ్చీండి” అంది అది.

మొత్తానికి బేరం ముగించుకుని సంచీ మోసుకుంటూ వచ్చాము.

నేను కారులో కూర్చుని ఇంటికొచ్చేదాకా అది చెప్పిన దానికీ నేనిచ్చిన దానికీ తేడాలు కట్టి, మొత్తానికి అది అడిగిందాని కన్నా తగ్గించి ఇచ్చామని తేల్చాను. ఫరవాలేదు బాగానే మార్కెటింగ్ చేశానని నన్ను నేను అభినందించుకున్నాను. ఫోటో చూపించి దాన్నిమంచి చేసుకుని బాగా డీల్ చేసాననుకున్నాను.

‘అయినా వాళ్ళకి ఇంకా లాభం ఉంటుంది లెండి, మీరేం బాధ పడకండి’ అని మావార్ని ఓదార్చాను. ఇంటికి రాంగానే, సామాన్ల లోంచి వెలక్కాయలు తీసి కడిగి పెట్టాను. మా వారు బట్టలు మార్చుకొచ్చి “మంచి కాఫీ ఇవ్వవోయ్, లెక్చర్‌కి ప్రిపేర్ అవ్వాలి అన్నారు .

“ఇస్తా, ఇస్తా కొంచెం ఆగండి “అని వెలక్కాయలు కొట్టే పనికి ఉపక్రమించా.

మొదటి కాయ పెఠేల్, నా గుండె గుభేల్. రెండో పెఠేల్ రెండో గుభేల్. వెలక్కాయంతా లోపల నల్లగా బూజు పట్టి పోయింది. నా మొహం తెల్లగా పాలిపోయింది.

మొదటి పెఠేల్‌కి నవ్వు ఆపుకున్న మా వారు, రెండో పెఠేల్‌కి పగలబడి నవ్వడం మొదలెట్టారు.

నా ముఖం చూసి బలవంతాన నవ్వు ఆపుకుని “నువ్వు కూచో, కాఫీ నేను పెడతాలే” అన్నారు. నేను కాళ్ళీడ్చుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుని మళ్ళీ లెక్కలెయ్యడం మొదలెట్టాను కుత కుతా ఉడికిపోతూ.

ఆయన ఇచ్చిన వేడి కాఫీ తాగాక, చల్లబడి, “నష్టం పాతిక” అన్నాను.

“పోనీలే, నువ్వు దాని దగ్గర బేరం ఆడకుండా కొనేశావనుకో, అప్పుడు అది నష్టం అనిపించదు” అన్నారాయన.

నేను మళ్ళీ లెక్కేశాను. “ఐనా ఇంకా ఐదురూపాయలు నష్టం” అన్నాన్నేను.

“పోనీలెద్దూ, పక్కింటి వాళ్ళ పాపకి అఖ్ఖర్లేకపోయినా చాక్లెట్ కొనిస్తావ్. అది ఆ ఐదు రూపాయలతో పిల్లకి పప్పుండలు కొంటుందని సమాధానపడు” అన్నారు, ఆయన టి.వి.రిమోట్ చేతిలోకి తీసుకుంటూ.

 “పిల్లంటే గుర్తొచ్చిందండీ, ఆ పిల్ల ఏదో చెప్పబోతుంటే అది మధ్యలో ఆపేసింది గమనించారా? ఎంత గడుసుదో!” అన్నాను.

“దాందేముందీ, కొబ్బరికాయ గురించి నేను చెప్పబోతుంటే నువ్వు నన్ను ఆపెయ్యలా? అలాగే అదీనూ” అన్నారాయన.

“మీరు దాని పక్షం మాట్లాడతారేమిటి? డబ్బులు నష్టపోయానని నేను బాధ పడుతుంటే” అన్నాను ఉక్రోషంగా.

మా వారు చాలా శాంతంగా “చూడూ, నువ్వు మనస్తత్వ శాస్త్రంలో ఎమ్మే అయితే అది జీవనపోరాటంలో డాక్టరేట్ చేస్తోంది. అది అయిదు రూపాయల లాభంకోసం ఎండలో, వానలో దుమ్మూ ధూళిలో, రోడ్డు పక్కన కూర్చుని జీవితం లాగిస్తోంది” అని ఇంకా ఏదో చెప్పబోతూ,

“అదిగో అటు చూడు” అని టివి వైపు చూపించారు.

మహా మహా మేధావులూ ఆర్థిక నిపుణులూ నడిపే పెద్ద పెద్ద బేంకులకి వందల కోట్లకి కుచ్చుటోపీ పెట్టి, విదేశాలకి పారిపోయి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ఆర్థిక నేరగాళ్ళపై వాడి వేడి చర్చ జరుగుతోంది. మా వారు నావైపు చూసి నవ్వారు. నేను నిట్టూర్చాను.

“అంతే లెండి, మనకివాళ వెలగపండు పచ్చడి తినే యోగం లేదు. ఎవరికేది ప్రాప్తమో అంతే!” అని వైరాగ్యం లోకి దిగిపోయాను.

“బాగుంది నీ వెలగపండు వైరాగ్యం…” అన్నారాయన నవ్వుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here