ఎన్నికలలో ఎన్ని కథలో-2

1
3

[box type=’note’ fontsize=’16’] మన దేశంలో జరిగే ఎన్నికల గురించి, ఎన్నికల నియమావళి గురించి, అభ్యర్థుల అర్హతలు అనర్హతల గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి సరళంగా వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. [/box]

[dropcap]“వ[/dropcap]దినా… ఓ వదినా” అంటూ వీథి తలుపు తీసుకుని వచ్చింది పక్కింటి పార్వతి.

“ఏమిటి పార్వతీ… రా లోపలికి” అంటూ వాకిట్లోకి పిలిచింది సరస్వతి

“ఏమీ లేదు ఇంట్లో సందడిగా ఉంటే ఎవరో వచ్చినట్లుంటేనో..” అంది పార్వతి

“ఏమీ లేదు. మామయ్యగారు పల్లెనుంచి వచ్చారు. పిల్లలకు ఆయనొస్తే కొండెక్కినంత సంబరం కదా. వచ్చినప్పటినుండి తాతయ్యా తాతయ్యా అంటూ వెంట తిరుగుతూ ముచ్చట్లే… ముచ్చట్లు.”

“అలాగా…” అంటూ లోపలికి వచ్చి సోఫాలో కూచున్న పరంధామయ్య గారి చూసి “బాగున్నారా బాబాయ్ గారూ” అంది పార్వతి.

“ఆ… ఆ… బాగానే ఉన్నానమ్మా. నీవెలా ఉన్నావు. మీ ఆయన నాగభూషణమూ, పిల్లల కిన్నెర, మహేంద్ర కులాసాయేనా” అని ప్రశ్నించాడు పరంధామయ్య.

“బాగానే … అంటే ఏదో ఇలా ఉన్నాం బాబాయ్ గారూ.”

“అలా అంటున్నావేమమ్మా? ఏదన్నా ఇబ్బందా…”

“ఇబ్బందంటే ఇబ్బందే బాబాయ్ గారూ. ఇదో ఈ ఎలక్షన్‌ల పుణ్యమాని గత నెలన్నరగా ఆయన, అదే మీ అల్లుడుగారు ఉదయమనగా ఆఫీసుకెళితే రాతిరెప్పుడో రావడం, ఉడకేసిందేదో… వేడిగా ఉందో? చల్లబడిపోయిందో? అని కూడా చూడకుండా తినేసి పడుకోవడం. ఆయన అలసట చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఏదో పనంతా తనదే అన్నట్టు, తను లేకపోతే ఈ ఎలక్షన్లు జరుగవన్నట్లు అంత పడీ పడీ పని చేయడం ఏమిటో…?”

“తప్పదమ్మా. ఎలక్షన్లు అంటే అధికార యంత్రాంగం అందరు చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు పని చేయాల్సిందే. పనిదినాలయినా పండగ రోజులైనా అవసరమైనప్పుడు అందరూ పని చేయాల్సిందే…” అన్నాడు పరంధామయ్య.

“ఆ…ఆ… భలే చెప్పారు బాబాయిగారూ. మా ఆయనా, మీ అబ్బాయి లాంటి అమాయకులు, నోట్లో వేలు పెడితే కొరకడం చేతకాని రకం వాళ్ళు, వొళ్ళు హూనం చేసుకుని పని చేస్తుంటే ఆ పైన.. పైపైన ఉండే అధికారులూ, జిల్లా అధికారులూ అందరూ కాలు మీద కాలేసుకుని అది చెయ్యండీ ఇది చెయ్యండి అంటూ హుకుం చెలాయిస్తూ చల్లగా నిమ్మళంగా ఉంటారు…” అంది కసిగా, ఉక్రోశంగా పార్వతి.

“లేదమ్మా పార్వతీ… ఎలక్షన్ల సమయంలో అందరూ అదనంగా అధికంగా పనిచేయాల్సిన వాళ్ళే. అది రాష్ట్ర స్థాయి అధికారులు మొదలుకొని గ్రామస్థాయి వరకూ, ఐఏయస్ అధికారి మొదలుకొని అటెండరు వరకూ ఎంతో శ్రమతో ఏకాగ్రతతో పని చేయాల్సిందే. మీ ఆడవాళ్ళు చేసే సంతోషిమాత వ్రతంలాగా ఇంకా చెప్పాలంటే అంతకంటే నిష్టగా చేయాల్సిందే” అన్నాడు పరంధామయ్య.

“అవునా…” అన్నారు అంతవరకూ మౌనంగా సంభాషణ అంతా వింటున్న పిల్లలు.

“అవునర్రా. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభ ఐదేళ్ళకాలం అమలులో ఉంటుంది. ఆ పదవీకాలం ముగియగానే ఎన్నికల నిర్వహణ చేపట్టి కొత్త సభకై ప్రతినిధుల ఎన్నిక చేపడతారు.”

“మరి ఇప్పుడు ఏదో ముందస్తు ముందస్తు ఎన్నికలు అంటున్నారు కదా తాతయ్యా” అన్నాడు రాజేశ్ ప్రశ్నార్థకంగా ముఖాన్ని పెట్టి.

“భలే ప్రశ్న వేశావురా. ఆధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజా ప్రతినిధుల విశ్వాసం కలిగిన మంత్రివర్గం వివిధ కారణాల వల్ల శాసనసభ పదవీకాలం అంటే పూర్తి ఐదేళ్ళు నిండకుండానే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడమే ముందస్తు ఎన్నికలు అంటారు.”

“మరి మధ్యంతర ఎన్నికలు అని అంటారు. అవేమిటి బాబాయిగారూ” అంది పక్కింటి పార్వతి.

“అంటే శాసనసభ పదవీకాలంలో ఇలా ఆరునెలలో సంవత్సరము ముందో కాకుండా ఒక ప్రజాప్రతినిధి కానీ ఎక్కవ మంది ప్రజాప్రతినిధులు కానీ రాజీనామా చేసినా ఆయా నియోజక వర్గాల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందే.”

“ఇంకా” అంది సాలోచనగా చూస్తున్న సరస్వతి.

“ఒకవేళ ఎన్నియిన ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినా ఆ నియోజకవర్గంలో మధ్యంతరం నిర్వహించాల్సిందే. అంతేకాదు ఎన్నికయిన ఎమ్మెల్యే లేదా ఎంపీ అనర్హుడని ఎన్నికల కమీషన్ నిర్ధారించి ఎన్నికను రద్దుచేసినా అక్కడ మధ్యంతర ఎన్నికలు ఆరునెలల లోపు నిర్వహించాల్సిందే…” అన్నాడు పరంధామయ్య

“ఇంతేనా లేక మధ్యంతర ఎన్నికలు వచ్చేందుకు ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా తాతయ్యా” అంది రాగిణి

“లేకేం” అన్నాడు పరంధామయ్య పక్కనున్న నీళ్ళగ్లాసు అందుకుంటూ తాగడానికి.

“మరి చెప్పు తాతయ్యా” అన్నాడు రాజేశ్.

“ఆగరా.. తాతయ్యని నీళ్ళుతాగనీ” అంది రాగిణి తాతయ్య జట్టు కట్టేస్తూ…

ఖాళీ నీళ్ళగ్లాసు పక్కన పెట్టేస్తూ, “ఎన్నికయిన ఎమ్మెల్యేలను లేదా ఎంపీలను కలిగిన ఏ పార్టీకీ తగినంత మెజారిటీ రాకపోయినా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు.”

“మెజారిటీ అంటే ఏమిటి బాబాయ్ గారూ” అంది పార్వతి.

“మెజారిటీ అంటే ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్న సీట్లు అనగా ప్రతినిధుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ సీట్లు రావడం. ఉదాహరణకు వంద సీట్లు ఆ శాసన సభలో ఉంటే యాభై సగం అవుతాయి… యాభై ఒకటి … మెజారిటీ కదా తాతయ్యా!” అందుకుంటూ అంది రాగిణి.

“అంటే రెండువందలుంటే నూటాఒకటి మెజారిటీ అవుతుంది కదా తాతయ్యా” అన్నాడు రాజేశ్ నేనేమైనా తక్కున తిన్నానా అన్నట్టు.

“అవును. సగానికంటే కనీసం ఒక్కసీటైనా ఎక్కవ ఉండటం మెజారిటీ” అన్నాడు పరంధామయ్య.

“ఇదే సూత్రం లోకసభకు కూడా వర్తిస్తుంది కదా మామయ్యా” అంది సరస్వతి.

“కరెక్ట్ అమ్మా. లోకసభలో ఎంపీల సంఖ్య సగానికంటే ఎక్కవ ఉంటే అది మెజారిటీ అవుతుంది. ఒక్కరు ఎక్కవ ఉన్నా ఆ పార్టీదే మెజారిటీ. అంతేకాదు రాజ్యసభకైనా శాసనమండలికైనా వర్తించే సూత్రం ఇదేనమ్మా” అన్నాడు పరంధామయ్య.

“అలా మెజారిటీ రాని పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలులేదు. ఆ సమయంలో భావసారూప్యత కలిగిన పార్టీలు కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కొన్ని సమయాల్లో ఇండిపెండెంట్‌ల మద్దతు కూడా తీసుకుంంటాయి మెజారిటీ చూయించుకోవడానికి.”

“మరి ఆ విధంగాను కూడా వీలుకాకపోతే బాబాయి గారూ” అంది పార్వతి.

“అలా మెజారిటీ ఏవిధంగాను ఒక పార్టీకి గానీ ఒక కూటమికి గానీ సాధ్యంకానప్పుడు గవర్నర్ అలా ఎన్నికయిన సభను రద్దుచేస్తారు.”

“మరి కొన్ని పార్టీలు కొంతకాలం పాలన సాగించాక వాళ్ళ పట్ల అవిశ్వస తీర్మానం పెడితే…” అంది సరస్వతి

“మంచి ప్రశ్న అడిగావమ్మా… ప్రభుత్వంలో ఉన్న పార్టీ విశ్వాసం కోల్పోయినపుడు కూడా, మరో పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితిలో లేనట్లయితే కూడా మళ్ళీ సభను లేదా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిని కూడా మధ్యంతర ఎన్నికలు అని అంటారు” అన్నాడు పరంధామయ్య.

“సరే తాతయ్యా… ముందస్తు అంటే ఏమిటంటే దాంతో పాటు కొసరుగా మధ్యంతరం కూడా చెప్పేశావు. యు ఆర్ గ్రేట్ తాతయ్యా” అన్నాడు రాజేశ్.

“రేయ్ మనవడా… ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయిరా చెప్పేందుకు” అన్నాడు పరంధామయ్య.

“పార్వతీ చాప తీసుకుని వచ్చి పరుస్తాను. ఇలా నిలబడి వింటూంటే సమయమే తెలియదు. కానీ తరువాత కాళ్ళనొప్పులూ…” అంటూ చాప తీసుకుని వచ్చి పరిచింది సరస్వతి.

మిత్రురాళ్ళిద్దరూ కూచున్నాక తనకు చెరోపక్కన సర్దుకున్ప మనవడూ మనవరాళ్ళపై చేతులు వేసి గొంతు సవరించుకున్నాడు పరంధామయ్య.

“ఈ ఎన్నికల నిర్వహణ చాలా కఠినంగా ఉండేట్లు ఉందిగా బాబాయి గారూ” అంది పార్వతి.

“అవునమ్మా… ఎంతో శ్రద్ధతో, నిబద్ధతతో చేయాల్సిన పని కదమ్మా. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చేయాల్సివచ్చినా ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కలెక్టరు మొదలుకొని అతి చిన్న స్థాయి ఉద్యోగి వరకూ ప్రభుత్వం నుండి వేతనం పొందుతున్న అందరికీ ఇది వర్తిస్తుంది” అన్నాడు పరంధామయ్య.

“అంటే అధికారి మొదలుకొని అటెండరు వరకూ అన్నమాట” అంది రాగిణి తన వంతుగా సంభాషణలో పాలు పంచుకుంటూ.

“అవునమ్మా… నామినేషన్ మొదలుకొని కౌంటింగ్ పూర్తయ్యి గెలిచిన అభ్యర్థిని ప్రకటించే వరకు ఎంతో మంది ఎన్నెన్నో స్థాయిల్లో పనిచేయాల్సిందే. అది కూడా రాత్రింబవళ్ళు పని చేయాల్సిందే..”

“మరిచేపోయాము తాతయ్యా… ఈ నామినేషన్ అంటే ఏమిటి. మీరు భోజనం కంటే ముందే చెబుతానన్నారు. మరిచిపోయారు” అన్నాడు.

“మరువలేదురా…. ఎన్నికల ఎందుకొస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి వాటి నిర్వహణలో ఉన్న బాగోగులు చర్చించుకున్నాము. అంతే. సరే ఇక చెపుతాను విను…”

“చెప్పు తాతయ్యా…” అన్నారు పిల్లలిద్దరూ.

“ఎన్నికల్లో ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే అతను లేదా ఆమె ఒక పార్టీ అభ్యర్థిగా అయినా పోటీ చేయవచ్చు. లేదా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయవచ్చు.”

“స్వతంత్ర అభ్యర్థి అంటే” అంది పార్వతి

“ఏ పార్టీకి చెందని వ్యక్తి లేదా ఏ పార్టీ చేత ఎన్నికల బరిలోకి దింపబడని వ్యక్తి….”

“ఓహో అలాగా.. అంటే కాంగ్రెసు, బీజేపీ, బీయస్పీ, తెరాస, తెలుగుదేశం, సీపీయం, మజ్లిస్, వై.యస్.ఆర్ కాంగ్రెసు మొదలైన పార్టీలకు చెందని వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి అన్నమాట” అంది సరస్వతి.

“అవును. ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయాలంటే తనను బలపరుస్తున్న లేదా ప్రతిపాదిస్తున్న పదిమంది వ్యక్తుల సంతకాలతో నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి వద్ద సమర్పించాలి.”

“ఈ రిటర్నింగ్ అధికారి ఎవరు మామయ్యా” అంది మళ్ళీ సరస్వతి.

“ఒక నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థి ఎన్నికను ధృవీకరించే కీలకమైన అధికారి. నామినేషన్ మొదలుకొని చివరివరకూ అన్నింటికీ రిటర్నింగ్ అధికారియే బాధ్యుడు…” అన్నాడు పరంధామయ్య.

“నామినేషన్ నుంచి మళ్ళీ దూరంగా జరిగిపోయాము తాతయ్యా” అంది రాగిణి

“నిజమేనమ్మా… మీ అమ్మ అనుబంధ ప్రశ్నలు వేస్తుంటే సమాధానం ఇవ్వాల్సిందే కదా…” అని సన్నగా నవ్వాడు పరంధామయ్య.

“తప్పయిపోయింది మామయ్యా” అంటూ తనూ నవ్వింది సరస్వతి.

“ఇక వినండి శ్రద్ధగా. ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలంటే పదిమంది ప్రతిపాదించేవాళ్ళు ఉండాలి. కానీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు ఉంటే చాలు. అలాగే ఈ ప్రతిపాదించే వ్యక్తులందరూ ఆ నియోజకవర్గంలో ఓటును కలిగి ఉండాలి. ఓటరులయి ఉండాలి.”

మరి పోటీ చేసే అభ్యర్థి… ???” ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు రాజేశ్

“మంచి ప్రశ్న వేశావురా. అభ్యర్థి ఆ నియోజక వర్గానికి చెందిన ఓటరు అయినా కాకపోయినా ఫర్వాలేదు. కానీ ఆ రాష్ట్రంలో ని ఏదేని ఒక నియోజక వర్గంలో ఓటరుగా నమోదయి ఉండాలి.”

“భలేగుందే… నియోజకవర్గంలో ఓటరుకాని వ్యక్తి వాళ్ళ ప్రతినిధిగా ఎన్నికవడం…” అంది పార్వతి.

“అవునమ్మా. ఇది కొంత వెసులుబాటే. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజాసేవ చేయాలంటే తన స్వంత నియోజకవర్గమే అంటే ఓటు ఉన్న ప్రాంతమే అవసరమా. ఎక్కడైనా ప్రజల ప్రతినిధిగా మారి వారికి సేవ చేయవచ్చుకదా. అంతేగాక ఒక అభ్యర్థి గరిష్టంగా అంటే ఎక్కువలో ఎక్కువగా రెండుచోట్ల పోటీ చేసే వీలు రాజ్యాంగం, ప్రజాప్రతినిధుల చట్టం కల్పించాయి కదా. ఆ వీలు…. ఓటు ఉన్నచోటే అభ్యర్థి పోటీ చేయాలంటే మరోచోట పోటీ చేయడానికి వీలుపడదుగా.. అందుకని..” అన్నాడు పరంధామయ్య

“ఇంకా… అభ్యర్థి అదే నియోజకవర్గానికి చెందిన వాడయితే తన ఓటు కలిగిఉన్న వివరాలు అంటే పోలింగుకేంద్రం, తన ఓటరు క్రమసంఖ్య తన నామినేషన్‌లో పేర్కొనాలి. ఆ నియోజక వర్గానికి చెందని వాడయితే తన నియోజకవర్గానికి చెందిన ఓటరు లిస్టునందు తన వివరాలు కల పేజీయొక్క సర్టిఫైడ్ కాపీని జతపరుచాలి.”

“అలాగా…. మరి మద్దతుదారులో…” అంది రాగిణి

“మరిచిపోయానమ్మా… ప్రతిపాదకులందరూ తప్పనిసరిగా తమ ఓటరు వివరాలు నామినేషన్ పత్రంలో తప్పని సరిగా రాయాల్సి ఉంటుంది. ఇంకా షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడిన నియోజకవర్గంలో పోటీచేయాలంటే ఆ వ్యక్తి ఆయా కులాలకు, తెగలకు చెందినవాడయి ఉండాలి. అలా అని ధృవీకరణ పత్రం కూడా జత పరుచాలి.”

“మరి ప్రతిపాదిస్తున్నవారో… వారు కూడా షెడ్యుల్ కులాలకు, తెగలకు చెందిన వారై ఉండాలా” అంటూ తనూ ఓ ప్రశ్న సంధించాడు రాజేశ్.

“అలా లేదురా. అభ్యర్థికే ఆ నిబంధన. అంతేకాదు. అభ్యర్థి కొంత సొమ్మును ధరవతు అంటే డిపాజిటుగా కట్టాలి.”

“అంటే ఎంత సొమ్ము బాబాయి గారూ” అంది పార్వతి

“అది శాసనసభ అంటే యం.యల్.ఏ. ఎన్నికలకైతే పదివేల రూపాయలు, ఎం.పీ. ఎన్నికలకైతే పాతికవేల రూపాయలు. ఇకపోతే షెడ్యూలు కులాలూ తెగలవారు ఆ డిపాజిట్ సొమ్ములో సగం మాత్రమే కట్టాలి.”

“మరి ఈ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇస్తారా…” అంది పార్వతి.

“పోటీ చేసిన అభ్యర్థి పోలయిన ఓట్లలో కనీసం ఆరవశాతం ఓట్లు పొందితే ఆ డిపాజిట్ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. అదియును నోటాకు పడిన ఓట్లను పోలయిన ఓట్లలోంచి తొలగించిన తరువాత మిగిలిన ఓట్లలో ఆరవశాతం అన్నమాట.”

“ఆహా…”

“నామినేషన్లు రిటర్నింగ్ అధికారి వద్ద ప్రస్తుత ఎన్నికల్లో నవంబరు పన్నెండవ తేదీనుండి పంతొమ్మిదో తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడుగంటల వరకూ సమర్పించవచ్చు. ఆ తరువాత తేదీలలో కానీ సమయం తరువాత కానీ తీసుకోబడవు.”

“నామినేషన్లు వేసే సమయంలో కొంతమంది పెద్దపెద్ద సంఖ్యలో మద్దతుదారులను తీసుకుని వెళతారు. కొంతమంది పరిమిత సంఖ్యలోనే వెళతారు. దీనిపైన ఏవైనా నియమ నిబంధనలున్నాయా…” అంది పార్వతి.

“అవునమ్మా… నామినేషన్ వేసే అభ్యర్థి తనతో పాటు మరో నలుగురు వ్యక్తులతో మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్ళవచ్చు. అదియును మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉపయోగించరాదు. వాహనాలు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వందమీటర్ల దూరంలోనే ఆపి కాలినడకన వెళ్ళవలెను. ఆయుధాలను, ఆయుధాలు కలిగిఉన్న రక్షణ సిబ్బందినీ తనతో తీసుకుని రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్ళకూడదు.”

“ఇంకా” అన్నారు పిల్లలు.

“తన నామినేషన్ పత్రంతో ఒక నోటరీ వద్ద లేదా మేజిస్ట్రేట్ వద్ద పొందిన అఫిడవిట్ ను సమర్పించాలి. దీనిని ఫారం 26 అఫిడవిట్ అంటారు.”

“ఈ అఫిడవిట్లో ఏముంటుంది మామాయ్యా” అంది సరస్వతి.

“అందులో అభ్యర్థి వివరాలు అంటే తనకూ మరియు తన జీవితభాగస్వామి అంటే భార్య లేదా భర్తకు మరియు తనపై ఆధారపడిఉన్న సంతానమునకు చెందిన ఆస్తులు అంటే స్థిరాస్తులు, చరాస్థులు అలాగే చెల్లించాల్సిన అప్పులూ మొదలగు వివరాలు. అలాగే అభ్యర్థి పై ఉన్న పోలీసు కేసులు, చేసిన నేరాలకు సంబంధించిన శిక్షలూ, విడుదలయిన తేదీల వివరాలు ఇలా అభ్యర్థి గుణగణాలు సంబంధిత నియోజక వర్గ ప్రజలకు తెలియజేసేందుకు అనుగుణంగా ఉంటాయి.”

“అంటే మనం కావాలంటే ఆ వివరాలు మనకు ఇస్తారా” అంది విస్మయంగా చూస్తూ పార్వతి.

“అవునమ్మా… మనం సమాచార హక్కు చట్టం కింద ఇది అడిగితే ఇస్తారు. అలాగే ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసిన తదుపరి ప్రచార ప్రసార మాధ్యమాల్లో అంటే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వివరాలు కనీసం మూడుసార్లు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.”

“అలాంటి ఏర్పాటు కూడా ఉందా బాబాయి గారు” అంది పార్వతి

“అవునమ్మా. బ్యాలెట్ పేపరుపై లేదా ఈవీయం బ్యాలెట్ పై తన పేరు ఏ విధంగా రావాలో ఒక అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో పేర్కొనవచ్చును. అలాగే తన ముద్దు పేరును, ప్రజలు తనను ఏ పేరుతో బాగా గుర్తిస్తారో ఆ పేరును బ్యాలెట్ మీద వచ్చేలా కోరుకోవచ్చు. అలాగే తను స్వతంత్ర అభ్యర్థి అయితే తనకు కేటాయించాల్సిన గుర్తును గూర్చి కోరుకోవాలి. అయితే కోరుకున్న లేదా ఆశించిన గుర్తు కేటాయింపులో ఇతర అభ్యర్థులకు తనకూ పోటీ ఏర్పడవచ్చు కనుక కనీసం తనకు ఇష్టమైన మూడు గుర్తులను తన నామినేషన్ పత్రంలో ప్రాధాన్యక్రమంలో పేర్కొనాలి.”

“మరి పార్టీలకు స్వంత గుర్తులుంటాయిగా మరి వారి సంగతో…”

“పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి తమ పార్టీకి ఉన్న గుర్తును ఒక్కదానినే తన నామినేషన్ పత్రంలో పేర్కొన్నాలి. అయితే పార్టీ ఆఫీసు వారు ఇచ్చే బీ ఫారము తప్పకుండా జత చేయాలి. దానితో పాటు ఏ ఫారమును కూడా…”

“భలే.. భలే.. ఏ ఫారమూ, బీ ఫారమూనా” అంటూ పిల్లలిద్దరు చప్పట్లుకొడుతూ అరిచారు.

“అవునమ్మా … ఏ ఫారము అంటే పార్టీకి చెందిన ప్రసిడెంటూ లేదా సెక్రటరీ తభ తరపున ఆ రాష్ట్రంలోని కొన్నికొన్ని జిల్లాలు, ప్రాంతాలు, నియోజక వర్గాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులకు బీ ఫారము ఇచ్చేదెవరో తెలియజేసే పత్రము. ఇక పోతే బీ ఫారము ఆ నియోజక వర్గంలో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి ఇచ్చే పత్రము. అందులో ఫలానా నియోజకవర్గంలో మా పార్టీ తరపున ఫలానా అభ్యర్థి పోటీలో ఉంటాడని ఉంటుంది. అలాగే మరో అభ్యర్థిని అందులో ప్రత్యామ్నాయంగా సూచిస్తూ, ఒకవేళ మొదటి వ్యక్తి అభ్యర్థిగా విరమించుకుంటే, అనర్హుణిగా తేలితే రెండవ వ్యక్తి తమ పార్టీ తరపు అభ్యర్థి అవుతాడని ధృవీకరించి సంతకం చేసి ఇస్తారు….” అన్నాడు పరంధామయ్య.

“ఒకరికంటే ఎక్కువ మందికి బీ ఫారములు ఇచ్చినట్లు పత్రికలలో చదువుతుంటాము కదా మామయ్యా… ఆ విషయం ఏమిటి” అంది పరంధామయ్య గారి వాక్ప్రవాహానికి అడ్డం వస్తూ సరస్వతి.

“అవునమ్మా… అప్పుడప్పుడు పార్టీలు తమ టిక్కెట్ల కేటాయింపు తరువాత నియోజక వర్గాల్లో అభ్యర్థి పట్ల పార్టీ కేడర్ నుంచి లేదా ప్రజల నుంచి విముఖత గమనించినట్లయితే మొదట ఇచ్చిన బీ ఫారమును రద్దు చేసి కొత్త బీ ఫారం ఇస్తారు. ఇందులో ముందటి బీ ఫారములోని ప్రత్యామ్నాయ అభ్యర్థిని పేర్కొనవచ్చు. లేదా కొత్తవారిని పేర్కొనవచ్చు.”

“అలాగా… ఇంత కథ ఉందా. నేనయితే డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి పార్టీ బీ ఫారము ఇస్తారని అంటుంటే విన్నాను. నిజమేనా బాబాయి గారూ….” అంది పార్వతి.

“లోగుట్టు పెరుమళ్ళుకెరుక అన్నారు కదమ్మా పెద్దలు. మనకు చెలియని విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదమ్మా” అన్నాడు పరంధామయ్య..

“తాతయ్యా… ఒక వ్యక్తి రెండుచోట్ల నుండి పోటీ చేయవచ్చు అన్నారు కదా. మరి అంతకంటే ఎక్కువ చోట్ల నుంచి పోటీ చేయాలని నామినేషన్లు వేస్తేనూ…” దీర్ఘం తీసింది రాగిణి.

“అలా కుదరదమ్మా… ఒక వ్యక్తి అలా చేసిన పక్షంలో తను నామినేషన్లు సమర్పించిన వాటిలో ఏ రెండుచోట్ల అయితే ముందుగా ఇచ్చాడో ఆ నియోజక వర్గాల్లోని నామినేషన్లను పరిశీలనకు తీసుకుని మిగతావి కొట్టివేస్తారు.”

“తాతయ్యా… నామినేషన్లు ఎన్ని వేయవచ్చు.”

“నామినేషన్లు ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో గరిష్టంగా నాలుగు సెట్లుగా వేయవచ్చు. ఒకటే వేసినా అభ్యంతరం ఏమీలేదు. కానీ ఏవైనా తప్పులుండి నామినేషన్లు తిరస్కరింపబడతాయేమోనని అందరూ నాలుగు సెట్లు వేస్తారు.”

“మరి నాలుగు డిపాజిట్లు కట్టాలా తాతయ్యా” అన్నాడు ఆరా తీస్తూ రాజేశ్.

“లేదురా అబ్బాయ్. ఒక అభ్యర్థి ఎన్ని నామినేషన్లు వేసినా ఒక డిపాజిట్ కడితే చాలు. కానీ రెండు వేర్వేరు నియోజక వర్గాల్లో పోటీ చేస్తే మట్టుకు రెండుచోట్ల డిపాజిటు కట్టాల్సిందే” అన్నాడు పరంధామయ్య.

“ఈ డిపాజిట్ సొమ్మును ఎలా కట్టాలి…” అంది రాగిణి

“అంత ఆత్రపడితే ఎలాగమ్మా. ఆగు చెబుతాగా. డిపాజిటు మొత్తాన్ని రిటర్నింగ్ అధికారి వద్ద నగదు రూపేణా చెల్లించవచ్చు. అంతేగాక ట్రెజరీయందు చెల్లించి చలానా కాగితాన్ని, లేదా రిజర్వుబ్యాంకు నందు డిపాజిట్ చేసి రసీదును తన నామినేషన్ పత్రానికి జత పరుచవచ్చు.”

“మరి చెక్కు ఇస్తేనో…” అంది పార్వతి అనుమానంతో

“నీ అనుమానం నిజమేనమ్మా. చెక్కుతో మాత్రం చెల్లింపు చెల్లదు.”

“ఇంకా ఈ నామినేషన్ల విషతంలో ఏవైనా ఇతర నియమ నిబంధనలు ఉన్నాయా మామయ్యా…” అంది సరస్వతి

“ఇంకా అంటే…. ఆఁ.. అవును. నామినేషన్‌తో పాటు అభ్యర్థి ప్రమాణం చేయాలి. నామినేషన్ చేసిన వెంటే కానీ ఆ తరువాత కానీ చేయవచ్చు. అయితే నామినేషన్ల ఆఖరితేదీ అర్ధరాత్రి లోపు అంటే అర్ధరాత్రి పన్నెండుగంటలలోపు స్వయంగా రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాలి. ఒకవేళ అతను లేదా ఆమె జైలులో ఉంటే జైలు సూపరింటెండెంట్ ముందు, డిటెన్షన్లో ఉంటే క్యాంపు కమాండెంటు ముందు, అనారోగ్యంతో ఆసుపత్రిపాలైతే ఆ ఆసుపత్రి సూపర్నెంటు ముందు, అది ప్రైవేటు ఆసుపత్రి అయితే ఆ మెడికల్ ప్రాక్టీషనరు ముందు, ఒక వేళ విదేశాలలో ఉంటే ఎంబసీ లేదా ఎన్నికల సంఘం పేర్కొన్న అధికారుల ముందు ప్రమాణం చేసి అట్టి ప్రమాణపత్రాన్ని సంబంధిత అధికారి సర్టిఫికేషన్ తో రిటర్నింగ్ అధికారికి నిర్ణీత సమయంలోగా చేర్చాలి.”

“మామయ్యా… మన ముచ్చట్లలో ఎంత సమయం అయ్యిందో గమనించనే లేదు. మీకోసం, మా ఇద్దరి కోసం కాఫీ పెడతాను. పిల్లలకు హార్లిక్సు కలిపి తీసుకొస్తా” అంటూ లేవబోయింది సరస్వతి.

“ఆగమ్మా… అంతా అయిపోయింది. ఈ నామినేషన్ల పర్వంలో మరొక్క విషయం చెబితే చాలు ఈ పూటకి ముగించవచ్చు” అంటూ ఆపాడు పరంధామయ్య.

“అలాగా…” అంటూ అలాగే కూర్చుంది. సరస్వతి.

“మిగిలిన గమ్మత్తుగా ఉండే విషయం ఏమిటంటే నామినేషన్లను అభ్యర్థి స్వయంగా సమర్పించవచ్చు. లేదా ఆ వ్యక్తిని ప్రతిపాదిస్తున్న వారు ఎవరైనా రిటర్నింగ్ అధికారి వద్ద సమర్పించవచ్చు.”

“ఇంత సులువు ఎందుకిచ్చారు బాబాయి గారూ…” అంది పార్వతి

“ఇందాక చెప్పానుగా అమ్మా ప్రత్యేక పరిస్థితుల్లో రిటర్నింగ్ అధికారి వద్దకు రాలేని వారు….”

“నే చెబుతాను…” అంటూ అందుకుని …

“జైలులో ఉన్నవారు, డిటెన్షన్లో ఉన్నవారు, ఆసుపత్రుల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు నామినేషన్ల సమయంలో అందుబాటులో ఉండి రిటర్నింగ్ అధికారి వద్ద తమ నామినేషన్ సమర్పించలేరు. అందుకని… అంతేగా తాతయ్యా” అంటూ గర్వంగా చూశాడు రాజేశ్…

“భళిరా భడవా” అంటూ మనవడి నుదుట ముద్దుపెట్టుకుని “నా కాఫీ నాకు తెచ్చేయమ్మా” అంటూ కోడలివంక చూశాడు పరంధామయ్య.

“అలాగే మామయ్యా ఇపుడే తెస్తాను. పిల్లలూ తాతయ్యను విశ్రాంతి తీసుకోనివ్వండి. మీ పుస్తకాలు తీసి హోంవర్కులు రాయండి…” అని “రా వదినా” అంటూ పార్వతిని తీసుకుని వంటింటివైపు కదిలింది సరస్వతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here