అంత బాగుందా! అయితే సరే

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి పంపిన హాస్యకథ “అంతబాగుందా! అయితే సరే”. కొత్తగా వచ్చిన ఓ ఉద్యోగినిని స్టాఫ్ అందరూ తమ సెక్షన్‌లోనే వేయమని ఎం.డి.ని కోరితే ఆయనేం చేశాడో ఈ కథ చెబుతుంది. [/box]

[dropcap]”సా[/dropcap]విత్రి గారిని మా సెక్షన్‌కి వేయించండి సార్ ప్లీజ్” కొర్రిజాండమ్ మీద సంతకం తీసుకుని లేస్తూ అభ్యర్థించాడు ఎం.డి. రఘురామ్‌ని, ఆఫీసర్ సుబ్రహ్మణ్యం.

“ఎందుకు?” అడిగాడు ఎం.డి.

“ఎందుకంటే నా సెక్షన్‍లోని జూనియర్ ఆఫీసర్, క్లర్కు ఎకౌంట్స్‌లో వీక్. అన్నీ నేనే స్వయంగా చూసుకోవాల్సి వస్తోంది. ఆవిడ ఎం.ఎ. మాథమెటిక్స్. ఎకౌంట్స్‌లో పర్‌ఫెక్ట్” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“చూద్దాం. ఇప్పుడెక్కడున్నారు?” అడిగాడు.

“(ఫలనా) సెక్షన్‌లో” అన్నాడు సుబ్రహ్మణ్యం. చెప్పి బయటకు వచ్చేశాడు ఆనందంగా. ఆవిడ వస్తే సగం పని తప్పుతుంది. లేకపోతే అన్నీ ఎర్రాట్టాలు, కొర్రిజాండమ్స్ పంపుతూ, వలకపోసి ఎత్తుకున్నట్లుగా ఉంది తన పని.

***

“ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఇంత అధ్వాన్నంగా ఉంది. ఏ రిటర్న్స్ టైమ్‌కి వెళ్ళడం లేదు. అన్నీ నోట్లూ, మెమోలు అందుకోవాల్సి వస్తోంది హెడ్ ఆఫీసు నుంచి” అరిచాడు ఎం.డి.

“ఇక్కడ సూపర్‌వైజర్ వీక్ సార్. ఏదీ టైమ్‌కి పంపడు. ఎన్నిసార్లు చెప్పినా రూల్స్ కూడా సరిగ్గా తెలియవు” నసిగాడు ఎడ్మిన్ ఆఫీసర్ రాజారాం.

“మరి మీరేం చేస్తున్నారు? అవన్నీ నేను చూడాలా లేక ఇలా రోజుకో మెమో అందుకోవాలా?” ఇంకా కోపంగా అన్నాడు.

మాట్లాడలేదు రాజారాం.

“వెళ్ళండి. ఇంకోసారి ఇలా జరగకుండా చూడండి. లేదంటే నేనివ్వాల్సి వస్తుంది మీకు రోజుకో మెమో” అన్నాడు కోపంగా రఘురామ్.

రాజారాం కదల్లేదు.

“ఏమిటి? వెళ్ళరేం?” మరింత కోపం వచ్చింది.

“సావిత్రిగారని కొత్తగా వచ్చారు కదా సార్. ఆవిడని ఇక్కడ వేయించండి సార్. ఆవిడ ఎగ్జామ్స్ పాసయ్యారు. రూల్ ప్రొవిజన్స్ బాగా తెలుసు. మంచి డ్రాఫ్టింగ్ వచ్చు. హెడ్ ఆఫీసుకు వెళ్ళేవి బాగా వెళ్ళాలి కదా. అప్పుడు ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు” అడిగాడు ఆశగా.

సావిత్రి కొత్తగా వేరే బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చింది రిక్వెస్టు మీద. పెళ్ళయ్యింది. భర్తకి ఇక్కడ ఉద్యోగం.

రఘురామ్ తలెత్తి రాజారాం వంక చూశాడు.

“నిజం సార్. ఆవిడని మా సెక్షన్‌కి వేస్తే ఎట్టి ప్రాబ్లమ్స్ వచ్చినా, మీరెలాంటి పనిష్‌మెంట్ ఇచ్చినా నేను భరిస్తాను. అంటే అట్లాంటి సందర్భాలు ఇంక రావని నా నమ్మకం.”

“చూద్దాం లెండి” అన్నాడు రఘురామ్.

రాజారాం ఆనందంగా బయటకి వచ్చేశాడు. అమ్మయ్య, ఆవిడ వచ్చిందంటే నిశ్చింత. నిజానికి రూప్ ప్రొవిజన్స్ అవీ తనకీ బాగా తెలియవు. తెలివిగా క్రింద వాళ్ళ మీద నెట్టేస్తాడు. ఆమె వస్తే ఆ సమస్య ఉండదు. అన్నీ ఆమెకే తెలుసు.

***

క్యాష్ బిల్లు, చెక్కూ, శాలరీ స్టేట్‌మెంట్‌తో వచ్చిన క్లర్క్ దామోదరాన్ని కోపంగా చూశాడు రఘురామ్.

“ఇంత ఆలస్యంగా తెస్తే ఎలా? నేను చెక్ చేయాల్సిన పని లేదా? లక్షల డబ్బు చెక్ చేయకుండా సంతకం ఎలా పెట్టను? తేడా పాడా వస్తే కట్టుకోవలసింది, నష్టపోయేది నేను, నా కంపెనీ. నెక్స్ట్ మంత్ నుంచి వారం ముందర తెస్తేనే సంతకం చేస్తాను. అయినా మీ జీతాల  బిల్లు మీద కూడా ఇంత అశ్రద్ధ అయితే ఎలా?”

“మా ఆఫీసర్లు బడ్జెట్, రీకన్సీలియేషన్ అవీ ఏమీ సరిగా చూడరు సార్. అన్నీ నేనే చూడాల్సి వస్తుంది. క్లర్క్ తెలివికి పైవాళ్ళ తెలివికి భేదం ఉంటుది కదా సార్. నేనేమైనా తప్పులు చేస్తానేమోనని నా భయం” అన్నాడు. “అందుకే ఆలస్యం అవుతోంది” అన్నాడు దామోదరం మెల్లిగా, భయపడుతూ.

“నీ పై వాళ్ళని విమర్శించటం, తప్పులు చూపటం డిసిప్లిన్ కాదని నీకు తెలియదా?” అడిగాడు గంభీరంగా రఘురామ్.

“తెలుసు సార్. క్షమించండి. కానీ నిజం అదే” అన్నాడు క్లర్కు,

నిండా మునిగాక చలి ఏమిటి అన్నట్టు. మొహమాటపడితే డబ్బుతో పని. ఎక్సెస్, షార్టులకి తను బాధ్యుడవుతాడు. అంత కంటే ఇదే మేలు. లేకుంటే తన జీతం, పెన్షన్‌తో ఈ తప్పులు సరిచేసుకోవటానికి సరిపోతుందేమో అనుకున్నాడు. అందుకే ధైర్యం చేసి అన్నాడు:

“సావిత్రి మేడమ్‌ని క్యాష్‌కి వెయ్యండి సార్. రీకన్సీలియేషన్ బాగా చేస్తారు. ఇప్పుడు కూడా మేడమ్ టాలీ చేస్తేనే అయ్యింది బిల్” అన్నాడు.

ఎండి సీరియస్‌గా చూడడంతోటి, బయటకి వచ్చేశాడు. కొంచెం భయమేసినా, ధైర్యం తెచ్చుకున్నాడు. ‘మరి ఎన్నాళ్ళు ఈ తల నొప్పి? వేస్తే ఆవిడని వేస్తాడు, లేదంటే తన్ని తీసేస్తాడు అంతేగా’ అనుకున్నాడు.

***

“ఏమిటండీ ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్? ఒక్క రిప్రజెంటేటివ్ కూడా టైమ్‌కి రిపోర్ట్ కావడం లేదు. పై నుంచి అవినీతి కూడా మొదలైందని వినిపిస్తోంది. ఇలా అయితే సంస్థ త్వరలో మూసేయాల్సొస్తుంది” అన్నాడు అంతకంటే గట్టిగా చెప్పలేక, స్నేహితుడు, సీనియర్ ఆఫీసర్ అయిన రాంగోపాల్‌తో. అతను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జ్. అంతేకాదు, తను లేనప్పుడు ఆఫీస్‌కి కూడా ఎం.డి.లాగా.

“సావిత్రి గారని కొత్తగా వచ్చారుటగా. ఆవిడని నా వింగులో వేయ్. ఎవరిని ఎలా భయపెట్టాలో, బ్రతిమాలాలో, పని రాబట్టాలో ఆవిడకి తెలుసు. చాలా సీనియర్ కూడా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాను” అన్నాడు రాంగోపాల్.

“అంత ఎఫీషియంటా?” సాలోచనగా అడిగాడు ఎం.డి.

“అవునట. ఆవిడకి తెలియని ఫీల్డ్ లేదట. అకౌంట్స్, క్యాష్, ఎడ్మినిస్ట్రేషన్, ఎన్‍ఫోర్స్‌మెంట్… అదీ ఇది అని లేదుట. పైనించి సిన్సియర్ కావడం వల్ల ‘యథా రాజా తథా ప్రజా’ అని స్టాఫ్ కూడా భయపడతారు. ఒకవేళ నువ్వన్నట్టు అవినీతి మొదలైతే….” అన్నాడు చనువుగా; ఆఖరి పదం మెల్లిగా “మనం కూడా ఇరుక్కోవచ్చు. హెడ్‌గా నువ్వు, ఇన్‌ఛార్జ్‌గా నేను” అన్నాడు.

ఎండి ఆలోచనలో పడ్డాడు.

“నేను వెళతాను. ఆలోచించు” అంటూ వెళ్ళిపోయాడు రాంగోపాల్.

***

మర్నాడు అందరూ వచ్చేసరికి వాళ్ళ టేబుళ్ళ మీద ఒక సర్క్యులర్ ఉంది.

అది సావిత్రిని తన ‘పర్సనల్ సెక్రెటరీ’గా వేసికుంటున్నట్లుగా ఎం.డి. రఘురామ్ ఇచ్చిన ఆర్డరు కాపీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here