కాశ్మీర్ యాత్ర -1

0
3

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి.[/box]

[dropcap]హి[/dropcap]మాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో మా యాత్రానుభవాలను పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నా చిన్నతనం నుండి కాశ్మీర్ గురించి చూచాయగా వింటూ వస్తున్నా. సినిమాలలో హిందీ చూపిస్తే ‘మంచు కొండలు ఎంత బాగున్నాయో!’ అనుకున్నాము. 1973 జనవారిలో హైదరాబాద్ నుండి నేపాల్ ఖాట్మండు వరకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఒరిస్సా నుండి విశాఖ మీదుగా తిరిగి స్వస్థలం చేరాము. మా నాన్నగారు, అమ్మ, నలుగురు పిల్లలం మా స్టాండర్డ్ హెరాల్డ్ కార్‌లో కొన్ని వేల కిలోమీటరులు తిరిగి వచ్చాము. గతం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే అప్పుడు మా నాన్నగారి ప్లాన్‌లో ఉన్న కాశ్మీర్ – మంచు తుఫాను వల్ల వీలు కాలేదు. అప్పటినుండి చాలాసార్లు అందరం కాశ్మీర్ చూద్దామని ఆయన కోరిక. తీరలేదు. మా అమ్మాయికి ఈ విషయం తెలుసు.

అందుకని 2017 అక్టోబర్ నెలలో మా మనవరాలి రెండవ పుట్టినరోజు కాశ్మీర్‌లో జరిపి నా చిరకాల కోరికని తీర్చింది. “అమ్మా! తాతగారి, నీ తీరని కోరిక తీరుస్తున్నా” అని అన్ని ఏర్పాట్లు చేసింది.

మేము యథాప్రకారం హైదరాబాద్ నుండి ట్రైన్‌లో బయలుదేరి ఢిల్లీ చేరాము. అక్టోబర్ 18వ తేదీన తెల్లవారు ఝామున ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి గంట ప్రయాణం తరువాత శ్రీనగర్‌లో దిగాము.

ఫ్లైట్‌లో వీలైనంతవరకు విండో సీట్స్ తీసుకోమన్నారు. ల్యాండ్ అయ్యేటప్పుడు ఎత్తైన హిమాలయ పర్వతాలను చూడటం గొప్ప అనుభూతి. విదేశీ ప్రయాణంలో ఇతర మంచు పర్వతాలను చూసినా మన హిమాలయ దర్శనం గొప్ప అనుభూతిని ఇస్తుంది. హిమగిరులను చూస్తూ లాండింగ్ ఎంజాయ్ చేసాము.

ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగిన వెంటనే భద్రతా దళ సిబ్బంది ఆయుధాలు ధరించి కనిపించారు. మాకు కొద్దిగా కలవరపాటు కలిగింది. ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోలు తీసుకోవటం నిషిద్ధం అని తెలిసి తీసుకోలేదు. బాగ్స్ తీసుకుని బైటకి వచ్చి ముందుగానే బుక్ చేసుకున్న ఇన్నోవా కార్‌లో సామన్లు పెట్టి పహల్‌గామ్ చూడటానికి బయలుదేరాము.

దారిలో ఎటుచూసినా భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. టిఫిన్ తిన్నాక సిటీలో ఉన్న ప్రఖ్యాత గార్డెన్స్ ఒక్కటైనా చూసి వెళ్లాలనుకున్నాము.

కాశ్మీర్‌లో ప్రీ పెయిడ్ సర్వీసెస్ ఉండవు. సో మా అందరి సెల్ ఫోన్స్ మూగబోయాయి. అదృష్టవశాత్తు మా అమ్మాయి ఫోన్ పోస్టుపెయిడ్. కనీసం ఒక్క ఫోన్ పనిచేస్తున్నందున ఊపిరి పీల్చుకున్నాము. అప్పుడు అర్థం అయ్యింది దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలంలో మనం అందరం ల్యాండ్ లైన్ ఫోన్ నుండి మొబైల్‌కి ఎంతగా దాసులం అయ్యామో.. అదొక వ్యసనం అని అన్న మాట నిజం అనిపించింది. తిరిగి ఫోన్‌లు లేని కాలానికి పయనించాము. అదొక విధంగా మంచిదే. లేదంటే వెంటవెంటనే సెల్ఫీలు, పోస్ట్‌ల గోల! చూసినదంతా మనస్సులో నిక్షిప్తం అయ్యింది.

***

పహల్‌గామ్‌కి బయలుదేరాము. మార్గమధ్యంలో శ్రీనగర్ లోని పురాతన పేరొందిన పూలతోటలను చూడాలనుకున్నాము. లోకల్ డ్రైవర్ మమ్మల్ని మొదటగా చష్మే షాహీ గార్డెన్‌కి దగ్గరలో ఉన్న పరి మహల్ గార్డెన్స్‌కి తీసుకువెళ్ళాడు.

 

పరి మహల్ ! దేవకన్యల నిలయం. మా చిన్ని దేవబాల పరి అదే ప్రకృతిని తీసుకుని లోపలి వెళ్ళాము. ప్రవేశ రుసుము నామమాత్రంగా ఉంది.

పరి మహల్ జాబర్వన్ పర్వత శ్రేణుల్లో శిఖరం ఫై ఏడు టెర్రస్‌ల పూదోట. శ్రీనగర్ పట్నం, దాల్ సరస్సుని చూస్తూ ఉన్నట్లుగా నిర్మించబడింది. మొఘల్, ఇస్లాం శిల్పకళా రీతిలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1600 ప్రారంభించగా, క్రీ.శ 1650లో రాకుమారుడు దారా షూకో ద్వారా పూర్తిచేయబడింది. రాకుమారుడు గ్రంథాలయాన్ని నివాసంగా చేసుకుని 1640, 1645 మరియు 1654లో ఉన్నాడట. అతని తరువాత అది ఒక ఖగోళ, జ్యోతిష శాస్త్ర అధ్యయన కేంద్రంగా ఉపయోగాపడిందిట. అదొక పురాతన పాడుపడిన బౌద్ధ ఆరామం. దారా షూకో ఆ శిథిలాల మీద తన సూఫీ గురువుకి అంకితంగా పరి మహల్ నిర్మించాడట.

ఈ పూదోటని ఒక చిన్న సెలయేరు చుట్టూ ఏడు ప్రాకారాలుగా కట్టారు. రాత్రి పూట దీపాల వెలుగుల్లో వెలిగిపోతూ ఎదురుగా ఉండే దాల్ సరస్సులో ప్రతిబింబిస్తుంది.

చరిత్ర ప్రకారం దారా షూకో తన సోదరుడైన ఔరంగజేబు చేతిలో ఇక్కడే చనిపోయాడట.

అన్నిటికన్నా ఎత్తులో ఉన్న ప్రాకారపు తోటను రాకుమారుడు అధ్యయనానికి వాడుకున్నాడట. ప్రస్తుతం అక్కడ సెలయేరు లేదు. పరి మహల్ ప్రవేశ ద్వారం నుండి అన్నీ మొఘల్ కళాకృతి రీతిలో ఉంటాయి. ఒక్క మూడవ టెర్రస్ తప్ప. వీటన్నిటిని మెట్ల ద్వారా ఎక్కవచ్చు. మేము వెళ్ళింది ఆకురాలే కాలం కావటంతో ఊహించినంత పచ్చదనం లేదు. బెస్ట్ టైం వేసవికాలం. వసంతం. పరి మహల్ చూసిన తరువాత పహల్‌గామ్‌కి బయలుదేరాము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here