దావత్ చేసిన తెలుగు కథ

1
4

[box type=’note’ fontsize=’16’] ‘సింగిడి తెలంగాణ రచయితల సంఘం’ వారు వెలువరించిన ‘దావత్ తెలంగాణ-2017’ సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

[dropcap]గ[/dropcap]త అయిదేళ్లుగా ‘తెలంగాణ కథ’ పేరిట వార్షిక సంకలనాలు తీసుకువస్తున్న ‘సింగిడి తెలంగాణ రచయితల సంఘం’ వారు ఈసారి ‘దావత్’ పేరిట తెలంగాణ-2017 సంకలనంతో మన ముందుకు వచ్చారు.

ఇందులో 13 కథలున్నాయి. మొదటి కథ ‘దానం’ అవయవ దానానికి సంబంధించినది. మనవాళ్ళకి అవయవదానం పట్ల సరైన అవగాహన లేదు. ఇందులో కిడ్నీ, లివర్ బ్రతికున్నవాళ్ళ దగ్గర నుండి దానంగా స్వీకరించి, దగ్గరి బంధువులలో అవసరమైన వారికి మార్పిడి చేస్తారు. గుండె మార్పిడి కూడా చేసే అవకాశం వున్నప్పటికీ, దాన్ని కెడావరిక్ డొనేషన్ ద్వారానే తీసుకుంటారు. కెడావరిక్ డొనేషన్ అంటే బ్రెయిన్ డెడ్ అయినవాళ్ళ దగ్గర నుంచి అవయవదానం. ఏ యాక్సిడెంట్‌లోనో తలకి దెబ్బ తగిలినవాళ్లు, హెమరేజ్… అంటే తలలో రక్తనాళాలు చిట్లి ఎవరికైనా బ్రెయిన్ డెడ్ అయితే, వారి కుటుంబీకులు అంగీకరిస్తే అవయవదానం జరుగుతుంది. దాని కోసం అవయవ మార్పిడి జరిగే ఆసుపత్రికి వెళ్ళి పేషంట్‌ని ఎగ్జామిన్ చేయించి, మార్పిడికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నా దొరుకుతాయనే నమ్మకం లేదు. ఒకవైపు అవయవాలు సకాలంలో దొరకక మరణించేవారు  ఉన్నారు. ఇంకోవైపు రోడ్ యాక్సిడెంట్ల వల్ల గానీ, హెమరేజ్ అయిగానీ మరణించేవారు ఎందరో వున్నారు. వాళ్ళలో ఎంతమందిని బ్రెయిన్ డెడ్ స్థితిలో గుర్తించగలుగుతున్నాం? వాళ్ళ అవయవాలని మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం? అవి బూడిద కావడమో, మట్టిలో కలవడమో జరగాల్సిందేనా? మనం వాటిని అవసరమైన వాళ్ళకి అందించలేమా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ విషయమై వేదగిరి రాంబాబు ఎన్నో వ్యాసాలు రాశారు. కథలకులతో అవయవదానాలకు సంబంధించిన కథలు రాయించి ఒక సంకలనంగా తీసుకువచ్చారు. ఇదే అంశంపై కె.వి.మన్‌ప్రీతమ్ రాసిన ‘దానం’ కథలో బ్రెయిన్ డెడ్ అయిన సందీప్ గుండెను ఆస్పత్రిలో వున్న అభినయ్‌కు అమర్చుతారు. ఈ త్యాగాన్ని మర్చిపోలేని అభినయ్ డాక్టర్ అవుతాడు. కార్డియాలజీలో పీజి చేస్తున్న అభినయ్ అనుకోకుండా ఒకసారి అనాటమీ ల్యాబ్‌కి వెళతాడు. అక్కడ కనిపించిన రమణయ్య మృతదేహాన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అతను సందీప్ తండ్రి. అతను కూడా మరణాంతరం మెడికల్ కాలేజ్‌కి తన మృతదేహాన్ని దానంగా ఇచ్చాడని తెలిసి చలించిపోతాడు. రచయిత పాత్రలకు, సంఘటనలకు మధ్య కార్యకరణ సంబంధం వుండేలా చూసుకోవాలి. సంఘటనలు కూడా సినిమాటిక్‌గా కాకుండా సజీవంగా వస్తేనే బాగుంటుందని రచయిత గమనించాలి. ఇది రచయిత రాసిన మొదటి కథ కాబట్టి, ఇలాంటి మెళకువలు తెలుసుకుంటే మంచి రచయితగా ఎదగడానికి అవకాశముంటుంది.

హుమాయున్ సంఘీర్ రాసిన ‘పచ్చశీర’ కథలో రాజవ్వ, మల్లయ్య కష్టజీవులు. మొత్తం ఇంటిల్లిపాదీ పొలంపనులలో పనిచేస్తుంటారు. నాలుగేండ్ల నుండి కరువు. ఆ సమయంలో ఒక్కగానొక్క కూతురుకు పట్నం సంబంధం వస్తుంది. అందునా కాబోయే అల్లుడు ఉద్యోగస్తుడు. మంచి సంబంధం వదులుకోలేరు. ఎక్కడా అప్పు బుట్టదు. వున్న పొలం అమ్మేసి బిడ్డ పెళ్ళి చేస్తాడు. పొలం అమ్మి తమ నోట్లో మట్టి గొట్టాడని కొడుకులు పోట్లాడి వెళ్ళిపోతారు. ఎవరూ లేక కూలి చేసుకుని ఆ దంపతులు బతుకీడుస్తుంటారు. ఇది ప్రథమార్థంలో ఉన్న కథ. పంటపొలాలన్నీ ప్లాట్లుగా మారిపోతాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పుణ్యమా అని చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల దాకా భూములన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేస్తారు. ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించక పడావు పడిన ఆ భూములను చూడలేక రైతులు ‘దున్నెటోన్దే భూమి.. నడ్మ రియలిస్టేట్ బచ్చాగాల్లెవలు?’ అని అంతా కలిసి నాగళ్ళు కట్టి దున్నడం మొదలుపెడతారు. పోలీసులు వస్తారు. కాల్పులు. పిస్తోలు దెబ్బకు గురయిన మల్లయ్య ‘పోయిన భూములను ఎన్కకు మల్పి దుక్కి దున్ని ఎవుసం జేశి గీ ప్రపంచం కడుపులు నింపుతా’ అనే స్టేట్‌మెంట్‌తో ఈ ద్వితీయార్థంతో వున్న కథ ముగుస్తుంది. ఇది రెండు కథల సమాహారం. రెండవ దాంట్లో రైతులు ఒకసారి అమ్మిన భూములను ఆక్రమించుకుని వ్యవసాయం చేయవచ్చునా అనేది ఒక ప్రశ్న.

డా. సరోజన బండ రాసిన ‘బర్రెంత చెట్లు… ఓ  యాది’ అనే కథ, రచయిత్రి జ్ఞాపకాలను చిత్రీకరించింది. అంతర్గత సాక్ష్యాలను బట్టి కథాకాలాన్ని 1947-48గా గుర్తించవచ్చు. అది రజాకార్ల జమానా. అప్పుడు రజాకార్లు చేసిన అన్యాయాలను, అకృత్యాలను ఇందులో తెలియజేశారు. అందులో బైరాన్‌పల్లి ఉదంతం కూడా వుంది. రెండుసార్లు రజాకార్లను ఎదుర్కొని వెళ్ళగొట్టడంతో మూడోసారి సైన్యంతో కలిసి విరుచుకుపడిన రజాకార్లు బైరాన్‌పల్లిని శ్మశానంగా మారుస్తారు. ఎందరో స్త్రీల మానప్రాణాలను బలిగొన్నారు. 88మంది చనిపోతారు. రజాకార్లు బైరాన్‌పల్లిని చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలపై దాడులు చేయడంతో రచయిత్రి వున్న లద్నూర్ మీద కూడా దాడులకు తెగబడతారు. ఈ విషయం కమ్యూనిస్టులకు తెలిపితే, వాళ్ళొచ్చి ఊళ్ళో వున్న ముస్లింలను అందర్నీ చంపిపోతారు. ఆ దాడి 17-9-1948 నాడు జరిగిందని రికార్డు చేశారు. తర్వాత రచయిత్రి బాల్య జ్ఞాపకాలు. ఇందులో తన చిన్ననాటి ఆటపాటలు, చదువు సంధ్యల గురించి వివరంగా తెలియజేశారు. చివరికి మా ఊళ్ళో చదువుకున్న ఆడపిల్లల్లో నేనే మొదటిదాన్ని, గవర్నమెంట్ వుద్యోగం చేసినదాన్ని నేనే, మొదట పిహెచ్.డి చేసింది కూడా నేనే. నన్ను చూసినంకనే మా ఊళ్ళో ఆడపిల్లలను చదివించుడు మొదలుపెట్టారని చెబుతారు.

సమ్మెట ఉమాదేవి రాసిన ‘ద్వాలి’ కథలో – మంచితనం, స్వాభిమానం, తెలివితేటలు కలగలిసిన లంబాడా ద్వాలి కష్టజీవి. ఆమె బర్త భానోతు హేమ్లా కులాసా పురుషుడు. దానికి తోడు రాజకీయాల పిచ్చి. ఇంటి బాధ్యతలు ఆమెకే వదిలేసి, హేమ్లా స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. అనాథగా వున్న మోతీని ద్వాలి చేరదీస్తే, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న హేమ్లా ఆమెను వదిలిపెట్టనంటాడు. ద్వాలిని తనతో వుండవచ్చంటాడు. కాని ద్వాలి ఒప్పుకోక, హేమ్లా, మోతీలను పంపించి, తాను ఒంటరిగా తన బ్రతుకు తాను బతుకుతుంటుంది. పంచాయత్ ప్రెసిడెంటుగా వున్న హేమ్లా ఈసారి ఆ సీటు మహిళలకి కేటాయిస్తే, దానికి పోటీ చేయమని ద్వాలిని బ్రతిమాలుతాడు. ఎన్నికలలో గెలిచిన ద్వాలి, హేమ్లా ఆధిపత్యాన్ని ధిక్కరించి, అతన్ని హద్దులలో వుంచి తరిమేస్తుంది. పదునైన సంభాషణలు, చిక్కని కథనంతో వున్న ఈ కథకు ముగింపు హైలైట్‌గా నిలుస్తుంది.

వజ్జీరు ప్రదీప్ రాసిన ‘రంగులగూడు’ కథలో వృత్తి కళాకారులు సంచారజీవులు. వారికి కేటాయించిన గ్రామాలలో కులపురాణాలు పాడుతూ, వారిని రంజింపజేసి వారిచ్చే గింజలు, పైసలతో బతుకు వెళ్ళదీస్తుంటారు. ఇప్పుడు ప్రజాదరణ కోల్పోయిన సంచారజీవుల బ్రతుకే కష్టమైపోతుంది. అందుకని ప్రభుత్వమే వాళ్ళను చేరదీసి ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా చైతన్య రూపాల ప్రచారంలో వారికి తగిన పని కల్పించి ఆదుకోవాలని రచయిత సూచిస్తాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పని చేస్తున్నది. జిల్లాల వారీగా కళాకారులకు జీతాలిచ్చి పోషించడం, పెన్షన్‍లు అందజేయడం జరుగుతున్నది. ఇక్కడ రచయిత ఒక విషయాన్ని గమనించాలి. ఒక సమస్యను ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు ఆ సమస్యను గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించినప్పుడే దాని మీద సరైన అవగాహన ఏర్పడుతుంది. వృత్తి కళాకారులు వేరు, సంచార జాతులవారు వేరు. వీళ్ళందరిని కలిపి ఒక సభ పెట్టడం కూడా కుదరదు. ఎవరి సమస్యలు వారివి. వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవడమే పరిష్కారం కాదు. వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించాలి. ముందు వాళ్ళకు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. వాళ్ళ స్థానికతని నిర్ధారించాలి. అప్పుడే ప్రభుత్వ సహాయకాలు అందుతాయి. వారిని చదువుకునేట్లు చేస్తే, వాళ్ళే తమ జీవికను ఎంపిక చేసుకుంటారు.

పెద్ద నోట్ల రద్దు దేశాన్ని సంక్షోభం లోకి నెట్టివేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. డబ్బు కోసం, చిల్లర కోసం దేశప్రజలంతా పనులు మానుకొని బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సివచ్చింది. సామాన్యుల జీవితాలు అల్లకల్లోలమైనాయి. అలాంటి బాధితులలో ఒక కుటుంబాన్ని ఎంచుకుని మేరెడ్డి యాదగిరి రెడ్డి ‘పెద్ద నోటు’ కథను రాశారు. ఇందులో పార్వతమ్మ పొలాన్ని ఒక వ్యాపారి తన వద్దనున్న పాతిక లక్షల నల్లధనంతో కొనుగోలు చేస్తాడు. ఆ డబ్బు కోసం ఇంట్లో వాళ్లంతా గొడవలు పడుతుంటారు. అంతలో పెద్దనోట్లు చెల్లవని పిడుగులాంటి వార్త వినబడుతుంది. అప్పుడు ఆ డబ్బును ఎలా మార్చాలన్నదే సమస్యగా మారుతుంది. బ్యాంకుల్లో రష్. అంత డబ్బుకు లెక్క చెప్పలేరు. ఎక్కడా చిల్లర దొరకదు. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆసుపత్రి వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. చివరికి ఒక దళారిని పట్టుకుని యాభై శాతం కమీషన్‌తో మార్పిడి చేసుకుంటారు. చివరగా ఇదంతా ఎవరికి కోసం అనే చర్చలో పెద్దనోట్ల రద్దు వల్ల బాగుపడింది వున్నవాళ్ళూ, రాజకీయ నాయకులు కాగా నాశనమయింది పేద ప్రజలనే నిర్ధారిస్తారు.

ఎంత వయసొచ్చినా ఆడవాళ్ళకు పుట్టింటి మీద అభిమానం, మమకారం పోదు. దాన్ని వివరిస్తూ చందూ తులసి రాసిన కథ ‘తల్లిగారిల్లు’. బతుకమ్మ పండుగకు పుట్టింటి వాళ్ళొచ్చి కూతుర్ని తీసుకెళతారు. అక్కడ వాళ్ళు ఇరుగుపొరుగులతో, స్నేహితులతో, అమ్మాయిల ఆటపాటలతో పండుగను సందడిగా జరుపుకుంటారు. ఇంటికి పెద్దకోడలు పూలమ్మకు పుట్టింటి వాళ్ళు ఎవరు లేకపోవడంతో, ఆమె పండుగకు వెళ్ళలేకపోతుంది సరికదా, అత్తగారి వేధింపులతో క్రుంగిపోతుంది. చిన్న కోడలిని తీసుకుపోవడానికి ఆమె తండ్రి వచ్చి, పెద్దకోడలికి ఎవరూ లేకపోవడంతో.. “మా ఇంటికే తీసుకెళ్తాను. నాకు ఇద్దరు కూతుళ్ళు” అని ప్రకటిస్తాడు. అత్త ముందు నిరాకరించినా, అందరు పుల్లమ్మను వెళ్ళమనడంతో, పుల్లమ్మ సంతోషం పట్టలేక ఏడ్చేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ సంబంధాలపై వచ్చిన మంచి కథ ఇది.

రూప్‌కుమార్ డబ్బీకార్ రాసిన ‘లచ్చుంబాయి’ అరె కటికల మీద వచ్చిన మొదటి కథ. కటిక పని చేసుకునేవాళ్ళను పెళ్ళి చేసుకోనని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు సుట్టిర్కం పేరుతో శంకర్ కిచ్చి పెళ్ళి చేస్తారు. వాడో పనిదొంగ. తన వృత్తి మీదే అసహ్యం. దాంతో మామ లచ్చుంబాయిని కబేలాకు తీసుకుపోవడం, మేక కడుపులోని వస్తువులను తీసి శుభ్రం చేయడం, అవన్నీ ఇంటికి మోసుకురావడం, రాత్రికి కల్లు దుకాణాలకు అమ్మడానికి చాక్న తయారు చేసి అక్కడ అమ్ముకుని రావడం చేస్తుంది. శమ్కర్ నల్లగొండ టౌన్ల సారా మామ్లా పట్టిన గౌండ్ల సత్తయ్య దగ్గర పనికి కుదురుతాడు. క్రమంగా తాగుడు మరిగి, పని ఎగ్గొట్టి, పెళ్ళాన్ని పీడించడం మొదలుపెడతాడు. ఇద్దరు ఆడపిల్లల తల్లి లచ్చుంబాయిని భర్త పట్టించుకోడు. అత్త కొడుకుకే వత్తాసు. అంతా తెలిసినా మామ నిస్సహాయంగా మిగిలిపోతాడు. ఇన్ని బాధలు పడుతున్న లచ్చుంబాయి మళ్ళీ నెల తప్పుతుంది. ఈసారైనా కొడుకు పుడితే బాగుండననే ఆశ ఒక వైపు, భవిష్యత్తుపై ఆశ మరోవైపుతో ‘పుల్లకు గుచ్చిన మాంసపు ముక్కలా’ నిప్పుల కుంపట్లో కాలుతున్న నిప్పు కణికలా ఉన్న ‘లచ్చుంబాయి’ అని కథ ముగుస్తుంది. నిజాయితీగా, అత్యంత సహజంగా అరె కటికల జీవితాలను చిత్రీకరించిన ఈ కథ మన హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది.

వేముగంటి ధీరజ్ కశ్యప్ రాసిన కథ ‘నాలుగేళ్ళ చదువు’. ఇందులో నాలుగేళ్ళు మెడిసిన్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు, శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వారిలో కూడా స్త్రీల పట్ల వున్న చిన్నచూపును, వారి శరీర ధర్మాల పట్ల చూపే అవహేళనను ఈ కథలో చూపించారు.

నస్రీన్ ఖాన్ రాసిన ‘పంఛీ ఔర్ పింజ్రా’ కథ ముస్లిం కుటుంబాల్లో భర్త ఆధిపత్యం, నిరంకుశత్వ ధోరణులు, ఏకపక్ష విధానాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది. ఇందులో నాయిక షెహానా భర్త వద్దంటున్నా వినకుండా హైదరాబాదులో తనకు తెలియని నెక్లెస్ రోడ్‍లో జరిగే సాగర హారానికి హాజరై తన నిబద్ధతను చూపాలనుకోవడం ఏమిటో? ఉద్యమంలోకి వద్దన్న వాడి కోసం నా సామాజిక జీవనాన్ని ఎందుకు త్యాగం చేయాలి? అని ప్రశ్నించడం ఏమిటో అర్థం కాదు.

మానవుని బలహీనతల్లో మద్యపానం ఒకటి. మద్యపానం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయనే, ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించాలనే ప్రకటనలు వినిపిస్తుంటాయి. మద్యం అమ్మకాల మీదే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, దాన్ని ఎలా నిషేధిస్తారు? కష్టజీవులు, నిరక్షరాశ్యులు మద్యానికి అలవాటు పడతారు అనుకోవడం పరిపాటి. కాని ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు అందులోనే మునిగితేలుతున్నారు. విద్యార్థి దశలోనే అలవాటు చేసుకుంటున్నారు. బ్రీతింగ్ టెస్టులో ఆడవారు కూడా దొరికిపోతున్నారనే వార్తలు చదువుతుంటే మన నాగరికత ఎన్ని వెర్రితలలు వేస్తోందో గమనించవచ్చు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు, కుగ్రామాలలోనే కాదు, మంచినీళ్ళు కూడా దొరకని ఊళ్ళలో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎంజాయ్ అంటే తాగుడు, తినుడు అనే అభిప్రాయం నుండి బయటపడాలి. డబ్బున్నవాళ్ళు ఎన్ని వెధవ్వేషాలేసినా నడుస్తుంది. రెక్కాడితే డొక్కాడనివాళ్లు తాడుగుకు బానిసలయితే వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తాయి? ఇంట్లో పోట్లాటలు, పెళ్ళాం పిల్లల్ని చావదన్ని తిండికి లేకుండా, వున్న డబ్బు తాగుడుకు పెట్టేయడం, అప్పులు చెసి మరీ తాగేస్తే వారి కుటుంబాల మనుగడ ఎలా కొనసాగుతుంది? తాగి తాగి వాడు చివరకు చస్తాడు. బతికున్నంత కాలం ఇంట్లోవాళ్ళు రోజూ చస్తూనే వుంటారు. స్కైబాబా రాసిన ‘ఊరి మీద ఉరితాడు’ కథలో తాగుబోతు భర్త పెట్టే బాధలు పడలేక భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. దాని తదనంతర పరిణామాలు ఎంత హృదయ విదారకంగా వుంటాయో ఈ కథ వివరిస్తుంది.

వస్తువు కంటే శిల్పానికి ప్రాధాన్యతనిచ్చిన కథలు రెండు ఇందులో వున్నాయి. మొదటిది పూడూరి రాజిరెడ్డి ‘బోర్లించిన చెప్పు’. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక భావుకుడిలో వున్న సౌందర్య తృష్ణను, ఆకర్షణా వ్యామోహాన్ని యథాతథంగా చిత్రించడం ఇందులో కనిపిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పిన ఇతివృత్తాన్ని పదకొండు పేజీల్లో విస్తరించడం మామూలు విషయం కాదు. ఇందులో కథ లేదు, ఉన్నదంతా కథనమే. అనుకోకుండా ఫంక్షన్‌లో కలిసిన యువతీయువకుల మధ్య కొనసాగే దోబూచులాటను ఈ కథలో అద్భుతంగా పట్టుకున్నారు. ఆకర్షించడం, ఆకర్షించబడడం యువతుల సహజ లక్షణమే అయినప్పటికీ, ఈ కథలో ఆ యువకుడితో ఆ యువతి ప్రవర్తనను అత్యంత సహజంగా చిత్రించిన విధానం బాగుంది. మొత్తానికి ఒక సన్నివేశాన్ని దృశ్యమానం చేయడంలో రాజిరెడ్డి చూపిన ప్రతిభ ప్రశంసనీయం. యవ్వనోద్రేకాలు, ప్రణయోద్వేగాలు, మోహ పారవశ్యాలతో నిండిపోయిన కథ కిరణ్ చర్ల రాసిన ‘సముద్రం నిద్రపోదు’. ఎలాంటి బంధనాలలో చిక్కుకోకుండా ఆ మోహ పారవశ్యాన్ని తనివితీరా అనుభవించి వేరు కావాలనుకునే ఒక జంట. కాని అలా విడిపోలేకపోతున్నామని గుర్తించడమే ఈ కథకు ముగింపు.

ఇందులో హుమాయున్ సంఘీర్ రాసిన ‘పచ్చశీర’, డా. సరోజన బండ ‘బర్రెంక చెట్టు… ఒక యారి’, వజ్జీరు ప్రదీప్ ‘రంగులగూడు’, స్కైబాబా ‘ఊరి మీద ఉరితాడు’ కథలు తెలంగాణ మాండలికంలో రూపొందాయి. రూప్‌కుమార్ డబ్బీకార్ ‘లచ్చుంబాయి’లో కుల మాండలికం కనిపిస్తుంది.

ఈ 13 కథకులలో లబ్దప్రతిష్ఠులు ఇద్దరు, ముగ్గురే వున్నారు. మిగిలినవాళ్ళంతా కొత్త రచయితలే. ఇదొక శుభ పరిణామం. ఇందులో వున్నవే మంచి కథలు, మిగిలినవి కాదని కాదు. వున్న పరిమితుల దృష్ట్యా అన్ని కథలను వేయలేరు కదా! అందుకని సంకలనానికి సరిపడే కథలతో పాటు చదవదగ్గ మంచి కథల జాబితాను చివరను ఇవ్వడం బాగుంది. ఇలా ప్రతి సంవత్సరం తెలంగాణ కథలతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సంకలనాలు తీసుకువస్తున్న సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్, వెల్డండి శ్రీధర్‌లు అభినందనీయులు.

***

దావత్ (తెలంగాణ కథ -2017)
సంపాదకులు: డా. వెల్డండి శ్రీధర్‌, సంగిశెట్టి శ్రీనివాస్
సింగిడి, తెలంగాణ రచయితల సంఘం
వెల: రూ.70/-
పేజీలు: 128
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, మరియు 9849220321

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here