[box type=’note’ fontsize=’16’] “ఓ.కె మేడమ్ డైరెక్టర్, నిజం మాట్లాడేటప్పుడు నాకు ఒళ్ళు తెలీదు. అబద్దం మాట్లాడం దానికి అందమైన చిరునవ్వు అతికించడం తెలీదు. ఇదిగో” అంటూ రాజీనామా తీసి బల్ల మీద పెట్టాడు డా. ధీరజ్. ఆ హాస్పిటల్లో అతను ఇమడలేకపోవడానికి కారణమేమిటో డా. మధు చిత్తర్వు రాసిన ‘ప్రెజెంటేషన్‘ కథ చెబుతుంది. [/box]
[dropcap]ధ[/dropcap]న్వంతరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఉదయం పదకొండు గంటలు.
మెడికల్ ఓ.పి పక్కన మరొక గది.
డాక్టర్ ధీరజ్, ఎండి. డయగ్నొస్టిక్ మెడిసిన్ అన్న బోర్డు ఉన్న గది లోపల…
కుర్రాడు పొడుగ్గా లావుగా వున్నాడు. ముప్ఫై ఏళ్ళుంటాయేమో. ముఖాన చెమటలు కారుతున్నాయి. నాలుగు వేళ్ళకి బంగారు ఉంగరాలున్నాయి. మెడ దగ్గర నల్లగా చర్మం కమిలినట్లుంది.
“నీరజా! వెయిట్ చూశావా?” అడిగాడు ధీరజ్.
”సార్! చూశాను! 120 కె.జీ, హైట్ 6 ఫీట్. అంటే 185 సెం.మీ. బిఎంఐ 34″.
“ఏం బాధ మిత్రమా?”
“తలనొప్పి! తల తిరుగుతోంది.”
“సార్!” అంది నీరజ మెల్లగా. “బి.పి. 180/120 వుంది. టెంపరేచర్ నార్మల్.”
“ఓ ఇంత చిన్న వయసులో ఇంత బి.పినా బాబూ! తల్లిదండ్రులకి కానీ అన్నదమ్ములకి కాని హై బి.పి వుందా?”
“లేదు సార్!”
డ్యూటీ డాక్టర్ నీరజ గొంతు సవరించి చెప్పింది, “చిన్నవయసులో మొదలయిన బి.పి అని అన్ని టెస్టులు చేయించాను సార్! కిడ్ని సి.టి స్కాన్, V.M.A ANA Profile, థైరాయిడ్, రీనల్ ఏంజియో..”
“స్టాప్” అరిచాడు ధీరజ్.
“బాబు నీ పేరేంటి?”
“హరీష్” సార్
“వృత్తి?”
“బిజినెస్… రియల్ ఎస్టేట్ సార్”.
“నిన్న రాత్రి ఏమన్నా పార్టీ చేసుకున్నారా? ఈ రోజు సోమవారం. నిన్న ఆదివారం కదా.”
అతను కొద్దిగా సిగ్గుపడి, “ఔను సార్. స్నేహితులతో కల్సి బీర్, ధాబాలో మీల్స్…”
“సిగరెట్స్ తాగుతావా?”
“కొంచెం. సార్”
“నీరజా, ఇది ఆల్కహాల్ వల్ల వచ్చిన బి.పి. ఆయన జీవన శైలి మార్చుకోమని సలహా ఇవ్వాలి. కానీ ఈ పరీక్ష లెందుకు? బాబూ సారీ! ఆరు నెలలు డ్రింక్స్ మానేయి! రోజు ఉదయం అరగంట పరిగెత్తు! అన్నం మానేసి రెండు పూట్లా రెండే రెండు పుల్కాలు తిను! సిగరెట్టు ముట్టకు! మళ్ళీ వారానికి రా! బి.పి తగ్గుతుంది!”
“తలనొప్పికి… పారిసిట్‌మాల్ టాబ్లెట్లు.”
“నీరూ… రాసియ్యి…”
నీరజ తనని ధీరజ్ సార్ అలా పిలిచే సరికి కొంచెం కోపంగా చూసి మళ్ళీ కంట్రోల్ చేసుకుంది.
“సార్, కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఇది స్టేజి 2 హైపర్ టెన్షన్. బి.పి మందులీయకపోతే ఎలా?”
ఆమెకి తను ఆమెని నీరూ… అని పిలవడం వల్ల కోపం వచ్చిందని గ్రహించి “చూడు డాక్టర్! అతనికి 3 రోజులు డ్రింక్ మానేస్తే బి.పి. తగ్గుతుంది. ఇది ఆల్కహాల్ ఎఫెక్ట్! నాక్డ్ ఎఫెక్ట్! అంతే అప్పటికీ తగ్గకపోతే చూద్దాం!”
“ఓ.కె సార్. స్ట్రోక్ వచ్చే రిస్క్ అని భావించాను! యాజ్ యు సే.”
“ఏమీ అవదు. డు వాట్ ఐ సే!”
తలుపు మీద చిన్నగా తట్టి తెల్ల బట్టలు టోపి ఉన్న వార్డ్‌బాయ్ రంగస్వామి లోపలికి వచ్చాడు.
“సార్ అమ్మగారు అర్జంటుగా రమ్మంటున్నారండి.”
అమ్మగారంటే… చందన సి.ఇ.ఓ, ధన్వంతరీ హాస్పిటల్.
“అర్జంటా?”
“ఔ సార్! అర్జంటే. ఎవరో పెద్ద మనిషి వచ్చిండు, అర్జంటుగా మాట్లాడాలంట!”
లేచి ఎడ్మినిస్ట్రేషన్ బిల్టింగ్ ఐదో అంతస్తుకి లిఫ్ట్ మీట నొక్కాడు.
***
విశాలమైన చల్లటి ఆఫీస్ గది. పెద్ద గోధుమరంగు మెరిసే ఆఫీస్ టేబుల్ వెనక సింహాసనం లాంటి కుర్చీలో డాక్టర్ చందన నీలం పట్టు చీర, వజ్రాల దుద్దులతో, మెరిసే ఎర్రటి దట్టమైన లిప్‌స్టిక్‌తో, నల్లటి కొప్పులో సువాసన వెదజల్లే మల్లెపూల దండతో మహారాణిలా మెరిసిపోతోంది.
మరో సోఫాలో ఒక లావుపాటి వ్యక్తి గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలు, నల్ల సూటుతో హుందాగా కూర్చున్నాడు.
“ధీరజ్, మీట్ మిష్టర్ కె.ఎన్. రావ్ ఆఫ్ డక్కన్ ఫార్మాస్యూటికల్స్. రావ్ గారూ, ధీరజ్ ఈజ్ అవర్ బెస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ ఫిజీషియన్!”
షేక్ హాండ్ ఇచ్చాడు. కె.ఎన్. రావ్ మెచ్చుకోలుగా నవ్వాడు.
“గ్లాడ్ టు మీట్ యు డాక్టర్ సాబ్…”
చందన చెప్పింది “ధీరజ్, రావుగారికి కొన్ని బి.పి మెడిసిన్స్ తయారీ చేసే మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ వుంది. కొత్తగా సి.సి బ్లాకర్… ఏదో ఆ పేరు నాకు తెలియదబ్బా… జినోడిపిన్… ఏదో తయారు చేస్తున్నారు! నువ్వు దాని గురించి మన హాస్పిటల్‌లో లెక్చర్ ఇవ్వాలి.”
ధీరజ్ ఇబ్బందిగా కదిలాడు. “చందనా! నీకు తెల్సు కదా! పేషంట్లకి ఇచ్చి చూడందే నేను మాట్లాడనని! నాకు తెలుసు ఆ ప్రాడక్ట్ గురించి. కాని నేనింకా పేషంట్లకి ఇవ్వలేదు” నసిగాడు.
“దాని దేముంది డాక్టర్!” అన్నాడు రావ్. “మా దగ్గర మెటిరియల్, డేటా అంతా వుంది. పవర్ పాయింట్ స్లైడ్స్ ఇస్తాం. నీ లాంటి గొప్ప డాక్టర్ ఒక్కసారి యీ ప్రాడక్ట్ గురించి ఉపన్యాసం చెప్పి సమర్ధిస్తే చాలు! మాకు గ్రేట్ ఛాన్స్.”
ధీరజ్‌కి ఒక్కసారి కోపం చర్రున వస్తుంది. కాని ఇక్కడ చందన… హాస్పిటల్ డైరెక్టర్ వుంది. అవతల ఈ పెద్ద మనిషి.
“సారీ సర్! నేను పేషంట్లకు వాడి చూస్తే తప్ప…”
చందన ఎర్రటి ముఖం ఇప్పడు కొద్దిగా విసుగుతో కోపంతో నల్లబడింది.
“డోంట్ వర్రీ మిస్టర్ రావ్! నేను ఇంకొక ఫిజీషియన్‌ని ఎవర్నయినా అడుగుతాను!”
మిష్టర్ రావ్ నవ్వాడు, లేచి నిలబడ్డాడు.
“మాకు డాక్టర్ ధీరజ్ సాబ్ ఎండార్సమెంటే కావాలి మేడమ్! ఆయన చాలా ఫేమస్. ఈ చిన్న సర్వీస్ చేయకపోతే నేను మా బోర్డ్ మెంబర్స్‌కి ఏమి నచ్చచెప్పలేను. ఆలోచించి చెప్పిండి! బై!” భారీ విగ్రహం కోటు, సూటుతో పాటు గంభీరంగా డోర్ బయటకి వెళ్ళిపోయింది.
తలుపులు ముసుకుని మళ్ళీ ఏ.సి కంప్రెసర్లు వెదజల్లే చల్లదనం, నిశ్శబ్దం ఆ గదిలో స్థిరపడ్డాక డాక్టర్ చందన ఒక్కసారిగా అరిచింది.
“ధీరజ్ నీకేమన్నా పిచ్చా? ఆయన ముందు నా పరువు తీశావ్? స్పీచివ్వడానికేంటి నీకు అంత గర్వం?”
చందన, చందూ… ఆమె డైరక్టర్ కదా. మనసులో గతించిన జ్ఞాపకాల దొంతర క్రింద చందనం పెట్టెలో మిగిలిపోయిన మల్లెల మాల లాంటిది. ఇప్పటికీ పరిమళాలు వెదజల్లుతూ….
ఇంకెవరో అయినా అయితే సహించడు కానీ ఈమె… గతించిన జ్వాల.
“సారీ చందూ…”
“ప్రాడక్టే కాదు! ఆ కంపెనీ మన హాస్పిటల్‌కి పది లక్షలు కేన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకునే రోగుల వార్డ్‌కి విరాళం ఇస్తోంది తెలుసా? అంతా నీ స్పీచి మీద ఆధారపడి వుంది! అర్థం చేసుకోవా?”
“ఓ.కె చందనా. నువ్వు చేప్తే ఓ.కే. డన్!”
లేచి నిల్చుని నవ్వింది “దట్స్ మై ధీరూ!” బల్ల చుట్టూ తిరిగి దగ్గరగా వచ్చి తల ఎత్తి చూసి కళ్ళతో నవ్వింది. ఆమె పెదాలు స్వల్పంగా అదుర్తున్నాయి.
ఇప్పుడేం చెయ్యాలో అతనికి తెలుసు కానీ తలతిప్పుకున్నాడు.
“నో! సారీ! చందూ. ఆ రోజులు అయిపోయినాయి. జీవితంలో కొత్త అధ్యాయాలు మొదలెట్టేవాళ్లు పాతవి తిరగేసుకోకూడదు. బట్, అఫ్ కోర్స్, నేను నీ కోసం ఆ ప్రెజెంటేషన్ చేస్తాను” చెప్పి బయటకి నడిచాడు.
***
ఆదివారం సాయంత్రం ధన్వంతరీ హాస్పటల్ ఆరో అంతస్తులోని పెద్ద సమావేశ మందిరంలో చాలా మంది డాక్టర్లు, వైద్య విద్యార్ధులు, హాస్పిటల్ స్టాఫ్ హాజరయ్యారు.
ఉపన్యాసాలు – మామూలుగా జరిగే ప్రారంభ స్వాగతాలు, దీప ప్రజ్వలన, డైరెక్టర్ చందన ఆహ్వానం… ఆ తర్వాత డక్కన్ ఫార్మాస్యూటికల్స్ యజమాని కె.ఎన్.రావ్ గారి గంభీరోపన్యాసం… కేన్స్‌ర్ వార్డుకి పదిలక్షలు రాసిన చెక్ చందన గారికి బహూకరించారు.
హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఆ తర్వాత డాక్టర్ ధీరజ్, ఎండి ఛీఫ్ ఫిజిషియన్, ‘జినోడిపిన్ అధిక రక్త పోటులో ఎలా పనికొస్తుందో ప్రజెంటేషన్’ అని మైక్‌లో ప్రకటించారు.
చిందరవందరగా గిరజాల జుట్టు, సగం మాసిన నలుపు తెల్ల గడ్డం. కొంచెం మొకాళ్ళదాకా వున్న తెల్ల కోటు, లోపల నీలి రంగు షర్టు. ధీరజ్ ఉపన్యాసం మొదలు పెట్టేసరికి అందరూ నిశ్శబ్దం అయ్యారు.
“అందరికీ నమస్కారం! మీ కందరికీ జినోడిపిన్ గురించి చెప్పడానికి ఇవిగో స్లైడ్స్.”
తెరమీద ఒకటి తర్వాత ఒకటి స్లైడ్స్ పడసాగాయి.
ఏవో గ్రాఫులు. బార్ డయాగ్రాములు. ఏవో గణాంకాలు.
“కానీ వాటి గురించి మాట్లాడను. అవి మీరే చూడండి. మీకు అందరికీ బి.పి గురించి తెలుసు. అధిక బి.పి నిశ్శబ్దంగా చంపుతుంది. గుండె జబ్బు, కిడ్ని జబ్బు, బ్రయిన్ స్ట్రోక్ అన్నీ కలుగజేస్తుంది. మనకి ఇప్పటికే ఏమ్లోడిపిన్, నిఫెడిపిన్ లాంటి సి.సి బ్లాకర్ మందులున్నాయి. అవి చాలా చవక కూడా. బాగా పని చేస్తాయి కూడా. వాడుతున్నాం కూడా.”
ముందు వరసలో కె.ఎన్. రావ్ ఇబ్బందిగా కదిలాడు.
“ఏ కారణం వల్ల జినోడిపిన్ వాటి కంటే బాగా పని చేస్తుందని నిర్ధారించారు? నేనయితే ఇది పేషంట్లకి వాడలేదు. పైగా ఇది ఎక్కువ ఖరీదు. ఒక్క గోలీ పదకొందు రూపాయలున్నది. మిగిలినవి రెండు నుంచి ఐదారు రూపాయలకే దొరుకుతున్నాయి.
అయితే డక్కన్ ఫార్మా మనకి ఎంతో సాయం చేసింది. కేన్సర్ వార్డుకి పది లక్షలు విరాళం ఇచ్చింది.
కాబట్టి ఈ మందులు ప్రిస్క్రైబ్ చేయండి. కొంతయినా వారికి ఆ డబ్బు తిరిగి వస్తుంది కదా!
కాని నేను ఇది ఇంత వరకు పేషంట్లలో వాడలేదు. కాబట్టి ‘దీనిని ఎండార్స్ చేయడానికి గడువు కావాలి’ అని డైరక్టర్ గారిని, ఫార్మా యజమాని గారినీ అడిగాను” అన్నాడు.
“ఇన్ని తక్కువ ఖరీధయిన మందులు ఉండగా ఇది అవసరమా? ఆలోచించండి? అంటే కాస్ట్/బెనిఫిట్ రేషియో. కాని రిస్క్ తగ్గుతుందని వారంటున్నారు. వాడి చూద్దాం. అదే నా సందేశం.”
ఒక్క స్లైడ్ గురించి వివరించి చెప్పకుండా, ఒక్కసారి చిన్న చిన్న చిరునవ్వు నవ్వి డాక్టర్ ధీరజ్ ముగించాడు.
“దట్సిట్. ఎవరికయినా ఏమయినా సందేహాలు అడగండి.”
ముందు వరసలోంచి కె.ఎన్. రావ్ కోపంగా లేచి వెళ్ళిపోవడం కనిపించింది. డైరెక్టర్ చందన, సుపరింటెండెంట్, ఆర్ఎంఓలు ఇతర డాక్టర్లు ఒక్క క్షణం షాక్ తిని ఆ తర్వాత అందరూ కరతాళ ధ్వనులు చేశారు.
***
“ధీరజ్! నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. నిన్ను మార్చడం నా తరం కాదు. ఎందకలా చేశావని అడగను. వెళ్ళిపో ఈ హాస్పిటల్ నుంచి!”
చందనలా లేదు. నాగినిలా బుసలు కొడుతోంది.
అతను రెండు చేతుల్తో ముఖం కప్పుకుని కాసేపు కూర్చుని మళ్ళీ తల పైకెత్తి చూశాడు.
“ఓ.కె మేడమ్ డైరెక్టర్, నిజం మాట్లాడేటప్పుడు నాకు ఒళ్ళు తెలీదు. అబద్దం మాట్లాడం దానికి అందమైన చిరునవ్వు అతికించడం తెలీదు. ఇదిగో” అంటూ రాజీనామా తీసి బల్ల మీద పెట్టాడు.
“అంతే కానీ నీ వల్ల హాస్పిటల్‌కి పదిలక్షలు విరాళం పోయిందని బాధే లేదా?”
“చందూ ఎంతని చెప్పను. అది అంతా ఆ గోలీల ఖరీదులా మళ్ళీ వసూలు చేసేస్తారు. అది విరాళం కాదు! ఓ మార్కెటింగ్. నీకు ఇష్టం ఉంటే ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేసే ధర్మదాతల దగ్గర తీసుకో! బై!” లేచి నిల్చున్నాడు.
“నేను ఇక్కడ ఇమడలేనని తెల్సి తెలిసీ వచ్చేట్లు చేశావు. ఇక తప్పదు. మళ్ళీ కలుద్దాం.”
అతను లేచి వెళ్ళిపోయాక కూడా చాలా సేపు ఆమె ఒంటరిగా ఆ సింహాసనంలో కూర్చుని ఆలోచిస్తూ వుండిపోయింది.