మనసున్న మొక్క

16
4

[box type=’note’ fontsize=’16’] మొక్కలకు కూడా మనసుంటుందున్నది నిజమని నమ్మిన మహిళ మాటలకు మొక్క ప్రతిస్పందించిన వైనాన్ని తోట సాంబశివరావుమనసున్న మొక్క” కథలో వివరిస్తున్నారు. [/box]

[dropcap]జా[/dropcap]తీయ బ్యాంకులో శాఖాధిపతిగా పనిచేస్తున్న నీలకంఠానికి హైదరాబాద్ నుండి తన స్వస్థలమైన గుంటూరుకు బదిలీ అయింది. మరో సంవత్సరంలో పదవీ విరమణ చేయబోతున్నందున బహుశా ఇదే చివరి బదిలీ కావచ్చు. తదుపరి గుంటూరులోనే స్థిరపడి, బంధుమిత్రుల మధ్య శేష జీవితం గడపాలని నీలకంఠం కోరిక. భార్య దాక్షాయణికి కూడా గుంటూరు రావడం చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలిద్దరూ ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించి, తమ జీవిత బాగస్వాములతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఇకపై వాళ్ళు ఇక్కడకు తిరిగి వచే అవకాశాలు బహు తక్కువ. అందుకే గుంటూరులో తమవారి మధ్య ఉంటే అండడండలు మెండుగా వుంటాయని విశ్వసిస్తుంది దాక్షాయణి.

పది రోజుల క్రితమే ప్రాంతీయ కార్యాలయంలో తన పదవిలో చేరాడు నీలకంఠం. తమ సొంత ఇంట్లో అద్దెకున్నవారిని ఖాళీ చేయించి, అవసరమైన రిపేర్లు చేయించి, రంగులు వేయించి హైదరాబాద్ వచ్చాడు. ఈ వారంలో సామాన్లు సర్దించడం, వాటిని గుంటూరుకు చేరవేయించడం, మరల అక్కడ సర్దుకోవడం పూర్తి చేయాలి. బదిలీ సమయాల్లో ఈ ప్రక్రియ చాలా కష్టమైనది. శ్రమతో కూడినది.

***

ఆ రోజు లారీలో సామాన్లు ఎక్కిస్తున్నారు. కూలీలకు తగిన సూచనలిస్తూ జాగ్రత్తలు చెబుతున్నాడు నీలకంఠం. చివరిగా దాక్షాయణి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మొక్కల కుండీలను, ప్రతి నిత్యం పూజ చేసుకునే తులసి కోటను లారీలోకి ఎక్కించారు.

సాయంత్రానికి సామాన్లు గుంటూరు చేరాయి. కూలీలు సామాన్లను దించి సర్దడం పూర్తి చేశారు. దాక్షాయణి ఇంటి ముందున్న ప్రహరి గోడ లోపలి ఖాళీ స్థలంలో కుండీలను సర్దించి, తులసి కోటను ప్రతిరోజూ పూజ చేసి ప్రదక్షిణ చేయడానికి అనువైన ప్రదేశంలో పెట్టించింది. మొక్కలు ఎండలో ప్రయాణం చేశాయి కదా! కొంచెం ఒడిలిపోయి తన వైపు దీనంగా చూస్తున్నాయనిపించింది దాక్షాయణికి. వెంటనే మొక్కలన్నింటికి సరిపడా నీళ్ళు పోసి వాటి సేద తీర్చింది.

***

ఉదయాన్నే లేచి దాక్షాయణి మొక్కల దగ్గరకు వెళ్ళింది. పరవాలేదు, తేరుకున్నాయి. పిల్లగాలులకు తలలాడిస్తూ దాక్షాయణిని పలకరిస్తున్నాయి. ఇక ఈ కుండీల విషయానికొస్తే, అవి ఎప్పటి నుండో వారు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడకు వారి వెంట వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని పాడవడం, కొన్ని కొత్తగా రావడం జరుగుతుంటుంది.

దాక్షాయణి అనుదినం వాటి బాగోగులు చూసుకుంటూ ఆ మొక్కలతో విడదీయలేని బంధాన్ని పెంచుకుంది. ఎంతగా అంటే… దూరదేశాల్లో వుంటున్న పిల్లలు రమ్మంటున్నా వెళ్ళకుండా, వాళ్ళనే ఇక్కడకు వచ్చి తమతో కొద్ది రోజులు వుండి వెళ్లమని చెప్పేటంతగా!! మరి తను వెళ్తే ఆ మొక్కలను తనలా ఎవరు చూసుకుంటారు? వాటికేమయినా అయితే తను తట్టుకోగలదా?

ఆ మొక్కల్లో మల్లె చెట్లు, గులాబీ చెట్లు, అలోవీర, పచ్చ గన్నేరు, మనీప్లాంటు, వివిధ రకాల అందమైన క్రోటన్స్ ఉన్నాయి. ఇంటికి వచ్చిన వారంతా చిన్న తోటని తలపించే ఆ మొక్కలను చూసి చాలా సంబరపడిపోతారు. వాటిని అంత జాగ్రత్తగా పెంచుతున్నందుకు దాక్షాయణిని ఎంతగానో అభినందిస్తారు.

***

రోజులు గడుస్తున్నాయ్.

***

ఉదయాన్నే లేచి మొక్కలను గమనిస్తూ తిరుగుతోంది దాక్షాయణి. ఉన్నట్టుండి “ఏవండోయ్… ఒకసారిలా రండి” అని కేక పెట్టింది.

ఇంట్లో దినపత్రిక చదువుకుంటున్న నీలకంఠం ఆ కేక వినగానే… జరక్కూడనిదేదో జరిగిందేమోనని… ఒక్క ఉదుటన దాక్షాయణి దగ్గరకు వచ్చాడు.

“ఏమైంది దాక్షాయణి… ఆ కన్నీళ్ళేంటి?” ఆదుర్దాగా అడిగాడు నీలకంఠం.

కుంచించుకుపోయినా ఆకులు, వ్రేలాడిపోతున్న కొమ్మలలో ఉన్న ఒక గులాబీ మొక్కను చూపిస్తూ… “ఏవండీ… ఈ మొక్క రెండు రోజుల నుంచీ ఇలా నీరసించి వుంటోంది. బాధ పడుతూ నాకేదో చెప్తోందండీ… నాకు చాలా దిగులుగా వుంది” ఏడుపునాపుకుంటూ చెప్పింది దాక్షాయణి.

“ఏమిటి… ఈ మొక్క నీతో ఏదో చెప్తోందా? ఆశ్చర్యంగా ఉందే… సరేలే… ఆ మొక్కకేమీ కాదుగానీ… నువ్వు బాధపడకు” అంటూ దాక్షాయణిని ఓదార్చడానికి ప్రయత్నించాడు నీలకంఠం.

“కాదండీ… ఆ మొక్కకు ఏదో అయ్యింది. అందుకే అలా వుంది. ఎలాగైనా ఆ మొక్కను కాపాడండి” అంటూ దీనంగా వేడుకొంది దాక్షాయణి.

“అలాగేలే… ఆఁ! అన్నట్టు నా మిత్రుడొకడు ప్రభుత్వ వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాడు. వాడ్ని పిలిపించి చూపిస్తాను. నువ్వేం దిగులుపడకు” అంటూ అప్పటికి దాక్షాయణిని ఓదార్చడంలో సఫలీకృతుడయ్యాడు నీలకంఠం.

తరువాత ఆ వ్యవసాయాధికారి ఇంటికి రావడం, మొక్కలన్నింటికీ పోషక పదార్థాల కోసం ఎరువులను వేయడం, చీడ పీడలను నివారించడానికి క్రిమిసంహారక మందులను వాడడం అన్నీ వడివడిగా జరిగిపోయాయ్. నీరసించిన ఆ మొక్కకు ప్రత్యేక చికిత్స కూడా చేశాడు.

హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంది దాక్షాయణి.

***

మరుసటి రోజు ఉదయానికి మొక్కలన్ని రోజుటికంటే బాగున్నాయనిపించింది దాక్షాయణికి. ఏ మొక్క గురించి తాను అంతగా బాధపడిందో ఆ మొక్క బాగా తేరుకుని, నిటారుగా నిలుచుని తనకు ధన్యవాదాలు చెప్తున్నట్టనిపించింది దాక్షాయణికి. ఆ మొక్కను తనివితీరా ముద్దు పెట్టుకుని మనసులోనే ఆ దేవుడికి నమస్కరించింది.

***

రోజూలాగే ఆ రోజు కూడా ఉదయాన్నే మొక్కలను పరిశీలిస్తోంది దాక్షాయణి. నీలకంఠం కూడ ఆమెతో పాటు మొక్కలను చూస్తున్నాడు. పచ్చగన్నేరు మొక్కను చూపిస్తూ… “ఏవండీ… ఈ మొక్కను దాదాపు నాలుగు సంవత్సరాల నుండి పెంచుతున్నాం… మొక్కైతే ఏపుగా పెరిగింది కానీ, ఇంతవరకూ ఒక మొగ్గా లేదు, ఒక పూవూ లేదు. తీసేసి వేరే మొక్క పెడదామా…?” అంటూ ఆ మొక్క వైపు నడిచింది దాక్షాయణి. ఎక్కడ తనను పీకేస్తుందనే భయంతో ఆ మొక్క వెనక్కి వంగడం గమనించింది దాక్షాయణి. ఎందుకో దానిపై ఒకింత జాలి వేసింది దాక్షాయణికి. మనసు మార్చుకుని “మరో రెండు మూడు రోజులు వేచి చూద్దాం లెండి… అప్పటికీ మొగ్గలు రాకపోతే… అప్పుడు చూద్దాం” అంది.

ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు.

***

రెండు రోజుల తర్వాత….

ఉదయ్యాన్నే మొక్కలను గమనిస్తున్న దాక్షాయణికి పచ్చ గన్నేరు మొక్కకు నాలుగు మొగ్గలు కనిపించాయి. ఆశ్చర్యానికి లోనైన దాక్షాయణి, నీలకంఠాన్ని పిలిచి ఆ మొగ్గలను చూపించింది. కొంచెం సేపటివరకు ఇద్దరికీ నోట మాట రాలేదు.

“మొన్ననే కదా… నువ్వు ఈ మొక్కని పీకేద్దామన్నావ్… ఆ మాటలు విన్న ఈ మొక్క నిన్ను వదిలి వెళ్ళడం యిష్టం లేక మొగ్గలు తొడిగింది. ఇక పూలు పూస్తుందిలే…” అని దాక్షాయణికి భరోసా ఇచ్చాడు నీలకంఠం.

“అవునండీ… మొక్కలకు కూడా మనసుంటుందున్నది నిజం. ఎందుకంటే ఈ మొక్కను పీకేద్దాం అని నేనన్న మాటలు విని, అర్థం చేసుకుని, ఈ రోజుకి మొగ్గలు తొడిగింది” అంటు ఆ మొక్కని తనివితీరా హృదయానికి హత్తుకుంది దాక్షాయణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here