[box type=’note’ fontsize=’16’] సిరిసిరి మువ్వల చిందులు వేసే పిల్లలు భూమికి వరాలంటున్నారు పుప్పాల జగన్మోహన్రావు ‘బాలల గేయం‘ కవితలో. [/box]
బాలలు బాలలు బాలలు
మిలమిల మెఱసే తారలు
ఇలలో విరిసిన పువ్వులు ॥బా॥
వెలుగులు నింపెడు దివ్వెలు
కిలకిల నగవుల గువ్వలు
పువ్వులు రువ్విన నవ్వులు ॥బా॥
పువ్వులు నిండిన తోటలు
ముద్దులు గులికెడు మూటలు
వీణియ పాటల మాటలు ॥బా॥
గుడిలో మ్రోగిన గంటలు
మడిలో పండిన పంటలు
గడిలో వుండని బంటులు ॥బా॥
జిలిబిలి పలుకుల చిలుకలు
చిలుకలు పలికే పలుకులు
సరిగమ స్వరముల జిలుగులు ॥బా॥
వెన్నెల కురిసిన సోనలు
విరిసిన జాజుల వానలు
ఉరుకుల పరుగుల కూనలు ॥బా॥
సిరిసిరి మువ్వల చిందులు
కన్నుల కందిన విందులు
ధరణికి వరమగు బంధులు ॥బా॥