[box type=’note’ fontsize=’16’] పెళ్ళికి వెళ్లడమంటే… కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకోడమే, మోయలేని మన భారాన్ని కొద్దిగా మనవాళ్ళ మధ్య దింపుకురావడమే… అంటున్నారు చొక్కాపు. లక్ష్మునాయుడు ఈ కవితలో. [/box]
[dropcap]పె[/dropcap]ళ్ళి కెళ్ళి చూడు…
అల్లుకున్న సుగంధాలు
ముక్కు పుటాలను తాకి
మనసును మత్తెక్కిస్తాయి.
రంగు రంగుల సీతాకోకలు
కళ్లముందరే ఎగురుతూ కనువిందుచేస్తాయి!
బంగారు లేడి కూనలు
చెంగు చెంగున దూకుతూ చూపులకు తగులుతాయి!
చేతులు చరుస్తూ.. సంకేతాలనిస్తూ
ఏ గది మూలనో చతుర్ముఖ పారాయణం చేస్తూ
సంతోషాల్ని పంచుకునే సైన్యమొకటి
సర్వత్రా సందడి చేయడం చూడవచ్చు
గుమ్మంలో చెప్పులతో పాటు
వేదనలను కూడా కాసేపు విడిచేసి
పచ్చని పలకరింపుల్లో..
కొన్ని నవ్వుల్ని పంచుకోవచ్చు
కుదురుగా కూర్చొని
ఖాళీ సమయాన్ని ముంగిట పరుచుకొని
గుర్తు తెచ్చుకున్న జ్ఞాపకాలతో
మనసుల్ని మౌనంగా తడుముకోవచ్చు.
పెళ్ళికి వెళ్లడమంటే…
జ్ఞాపకాల దొంతరల్లో ముద్దగా తడుపుకున్న క్షణాల్ని
పది కాలాలు పచ్చగా నెమరువేసుకొనే అవకాశాన్ని
గుండెలనిండా నింపుకు రావటమే!
మోయలేని మన భారాన్ని కొద్దిగా
మనవాళ్ళ మధ్య దింపుకురావడమే!!