ఎమ్మెస్వీ గంగరాజు వ్రాసిన 33 కథల సంపుటి ‘ఎమ్మెస్వీ కథలు’. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను వస్తువులుగా తీసుకొని హాయిగొలిపేలా అల్లిన కథల సంపుటం ఇది.
***
” ‘ఎమ్మెస్వీ కథలు’ చదివాక నాకనిపించింది కథల్లో పైకి కనిపించని పెంకితనమేనన్న మాట అనిపిస్తోంది.
సరళంగా, సహజంగా, సంసారపక్షంగా చెప్పబడ్డాయి గనక ఇవి సాధారణమైన సత్తాలేని కథలేమో అని పొరబడ్డాను. వర్గీకరణ అనే నా దుర్మార్గపు పనికి ఏ మాత్రం లొంగకుండా తమ స్వంత మార్గాన్ని తామే సృష్టించుకునేంత షడ్రసోపేతమైన సరుకు ఉన్నవి ఈ కథలని పోల్చుకున్నాను” అన్నారు అవసరాల రామకృష్ణారావు తమ “‘ఎమ్మెస్వీ’ని ‘యశస్వి’ని చేస్తాయని”లో.
***
“గంగరాజు గారు తన జీవితంలోంచి, తన పరిధుల్ని ఎరిగి రచన ‘రుచి’ని పట్టుకున్న రచయిత.
గంగరాజుగారి కథల మొదటి గొప్ప లక్షణం హాయిగా చదివిస్తాయి, ఫాల్స్ ట్రెమోర్స్‌తో భయపెట్టకుండా. ఆ కథల నేపథ్యం – విస్తృతం, సరళం, నిత్యనూతనం. చదివించడానికి అది మరొక కారణం.
ఆత్మీయత, ఆర్ద్రత, త్యాగం, మంచితనం, సౌహార్ధం, స్నేహం, దయ – యిలాంటి సార్వజనీనమైన పనిముట్లు – ఆయన రచనలకు పెట్టుబడి. హాయిగా, తృప్తిగా, ఉల్లిపాయ పకోడీల్లాగ ‘ఆహా!’, ‘ఓహో!’ అని చదివిస్తాయి. చదివేక చాలాకాలం వెన్నాడుతాయి. ఇది ఆయా రచనలకు రచయిత అబ్బించిన పరిమళం!” అన్నారు గొల్లపూడి మారుతీరావు తమ “ముందుమాట”లో.
***
“ఇజాల కన్నా జీవిత నిజాలే గొప్పవని నమ్మే నిజాయితీ కథకుడు ఎమ్మెస్వీ! సమకాలీన సమాజంలో ఎదురు పడే సంఘటనలను కథా వస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్ని సున్నితంగా స్పృశించే కథనాలు అల్లడంలో ఎమ్మెస్వీ దిట్ట! ఆయన రచనల్లో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇజాల చట్రంలో ఇమిడి పోకుండా తెలుగు కథకి స్వేచ్ఛనిచ్చి జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు” అని ఈనాడు’ దినపత్రిక పేర్కొంది
***
ఎమ్మెస్వీ కథలు
ఎమ్మెస్వీ గంగరాజు
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్
పుటలు: 224
వెల : రూ.100/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు