ప్రాంతీయ దర్శనం -11: కొంకణి సినిమా – నాడు

0
5

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కొంకణి సినిమా ‘పల్టడచో మునిస్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘పల్టడచో మునిస్’

[dropcap]గో[/dropcap]వా రాష్ట్రం కొంకణి భాషలో 1950ల నుంచే సినిమాలు నిర్మిస్తున్నా సంఖ్యాపరంగా ఇప్పటికీ తక్కువే తీస్తున్నారు. ఏడాదికి నాల్గైదు మించి వుండవు. 2009కి పూర్వం తీసినవి కూడా హిందీ సినిమాల సరళిలో ఫార్ములా సినిమాలే. వీటిలో ఆంగ్లో ఇండియన్ సంస్కృతికి చెందినవి కొన్ని. కొంకణి సినిమాలకి చెప్పుకోదగ్గ చరిత్ర 2009 నుంచే ప్రారంభమయింది. ఇప్పట్నుంచి ప్రపంచ దృష్టి నాకర్షించసాగాయి. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ సినిమాలనేవి మొదట్లో వాస్తవిక సినిమాలుగానే వుండేవి. తర్వాత ఈ మధ్య కాలంలో కమర్షియల్స్ అయిపోయాయి. దీనికి విరుద్ధంగా ప్రాంతీయ కొంకణి సినిమాలు కమర్షియల్స్‌గా ప్రారంభమై వాస్తవికత లోకొచ్చాయి. ఇదో విచిత్రం. ఇప్పుడు తీస్తున్నవన్నీ వాస్తవిక సినిమాలే. దేశమంతటా ప్రాంతీయ సినిమాలు వాస్తవికతని వదిలించుకుని వ్యాపార సినిమాలుగా మారిపోతే, కొంకణి సినిమా వ్యాపార సినిమాల నుంచి వాస్తవికత లోకొచ్చింది. 2009లో దీనికి బాట వేసింది ‘పల్టడచో మునిస్’ అనే అవార్డు సినిమా.

  కొంకణి వాస్తవిక సినిమాలని నాడు – నేడుగా విభజిస్తే, 2009 -12 మధ్య తొలి దశగా, 2012 నుంచి మలి దశగా చెప్పుకోవాలి. తొలి దశలో దర్శకుల తరం వేరు. మలి దశలో డిజిటల్ టెక్నాలజీ దర్శకుల తరం వేరు. అందరూ కలిసి ఏదో వొక జాతీయ అంతర్జాతీయ అవార్డు సాధించి పెడుతున్న వారే. 2009లో లక్ష్మీకాంత్ షెట్గాంకర్ ‘పల్టడచో మునిస్’ తీసినప్పటికే ‘ఏ సీసైడ్ స్టోరీ’ అనే 45 నిమిషాల లఘుచిత్రంతో జాతీయ అవార్డు నందుకున్నాడు. ‘పల్టడచో మునిస్’తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఏకాంతం – ప్రేమ – మతం ఈ మూడిటిని అతి సున్నితంగా మేళవిస్తూ సినిమా కళని ఒపోసన పట్టిన మేధావిగా మెరిశాడు. థియేటర్ ఆర్ట్స్‌లో నటనలో శిక్షణ పొంది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అధ్యాపకుడుగా పనిచేసిన నేపథ్యంలోంచి వచ్చాడు. ‘పల్టడచో మునిస్’కి మహాబలేశ్వర్ సైల్ రచన చేశాడు. ఛాయాగ్రహణం అరూప్ మండల్ నిర్వహిస్తే, వేద్ నాయర్ సంగీతం సమకూర్చాడు. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్ డిసి) నిర్మాణం చేపట్టింది. చిత్తరంజన్ గిరి, వీణా జమ్కర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.

గోవా కోస్తా తీర ప్రాంతపు ఒక గ్రామం నేపథ్యంగా ఈ కథ వుంటుంది. ఈ గ్రామం అడవి పక్కనే వుంటుంది. గ్రామానికీ అడవికీ మధ్య వాగు మీద ఒక బలహీన వెదురు వంతెన వుంటుంది. అడవిలో ఒక పాతబడిన చిన్న పోర్షన్‌లో ఫారెస్ట్ ఉద్యోగి వినాయక్ (చిత్తరంజన్ గిరి) ఒంటరిగా వుంటాడు. అడవి మృగం భార్యని చంపేసిన బాధలోంచి తేరుకోలేకుండా వుంటాడు. ఉదయం యూనిఫాం వేసుకుని డ్యూటీ చేయడం, సాయంత్రం గ్రామానికి వెళ్లి కిరాణా షాపులో సరుకులు తెచ్చుకుని వండుకుని తినడం. గ్రామంలో ప్రతీ రోజూ గిరిజనుల సంతే వుంటుంది.

వొంటరి రాత్రులు అతణ్ణి వేధిస్తూంటాయి. ట్రంకుపెట్టె తెరచి భార్య వస్తువులు చూసుకుంటూ కూర్చుంటాడు. ఒక రాత్రి బయటేదో అలికిడైతే వెళ్లి చూస్తాడు. పొదల్లో నక్కి దెయ్యంలా కూర్చున్న ఒక పిచ్చిది (వీణా జమ్కర్) కన్పిస్తుంది. దాన్ని తరిమి కొడతాడు. ఆ పిచ్చిది గ్రామంలోకి వెళ్తే పిల్లలు వెంటబడి తరుముతారు. మళ్ళీ రాత్రి అడవిలో వినాయక్ ఇంటి ముందు కూర్చుంటుంది. ఇక డ్యూటీకి వెళ్తూ వస్తూ దానికింత తిండి పడేస్తూంటాడు. ఒకరోజు భరించలేక వెళ్ళగొట్టేస్తాడు.

ఇంకో రోజు ఇంటి ముందు చెత్త కాలుస్తూంటే ఆ మంటలు చూసి కేకలేసుకుంటూ పారిపోతుంది. మళ్ళీ వస్తుంది. ఇక లాభం లేదని ఆలోచిస్తాడు. దాని మీద నీళ్ళు గుమ్మరించి స్నానం చేయిస్తాడు. భార్య చీర కట్టేస్తాడు. అన్నం వండి తినిపిస్తాడు. మంచం మీద పడుకోబెట్టి వేరే గదిలో పడుకుంటాడు. డ్యూటీకి పోతూ తాళం వేసుకు పోతాడు. దీంతో తలుపు విరగ్గొట్టుకుని పారిపోతుంది. పంజరంలోంచి బయటపడ్డ పక్షిలా ప్రకృతిలో విహరిస్తుంది. మళ్ళీ పట్టుకొచ్చి, భార్య గాజులు తొడిగించబోతే తొడుక్కోదు. అప్పుడర్ధం జేసుకుంటాడు. దీన్ని బందీగా, బానిసగా వుంచితే వూరుకోదని. స్వేచ్ఛ కోరుకుంటోందనీ.

ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ముద్దుల్లో ముంచెత్తుతాడు. భార్యగా చేసుకుంటాడు. ఇంటి పనులు నేర్పుతాడు. గ్రామంలో ఈ వ్యవహారం తెలిసి అతణ్ణి చూసి జోకులేస్తూంటారు. కిరాణా షాపు వాడు వినాయక్‌ని మళ్ళీ ఇంటి వాణ్ణి చేసినందుకు దేవుడికి దండం పెడతాడు.

ఇంకోవైపు గ్రామంలో ఒక తంతు జరుగుతూ వుంటుంది. స్థానిక నాయకుడు సంతకి వచ్చి ఉపన్యాసాలిస్తూంటాడు. గ్రామంలో గుడిలేదు, అడవిలో గుట్ట మీద గుడి కట్టిస్తానని గిరిజనుల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. నెమ్మదిగా గిరిజనులు అతడి వైపు మొగ్గుతారు. వినాయక్ దీన్ని పై అధికారికి రిపోర్టు చేస్తాడు. పై అధికారి కొట్టిపడేస్తాడు. గుట్ట మీద గుడి పనులు మొదలై పోతాయి. గుడి కెళ్ళే బాట వినాయక్ ఇంటి వెనకాల్నుంచే వుంటుంది. చెట్లు నరకడం, గుంతలు తీయడం వంటిపనులు జరిగిపోతూంటాయి. జనసంచారం పెరుగుతుంది. అడవికి మంచి జరగడం లేదని బాధపడతాడు.

ఇక మేళతాళాలతో విగ్రహం తీసుకుని వూరేగింపుగా వస్తూంటారు. వినాయక్ డ్యూటీలో వుంటాడు. విగ్రహం తీసుకుని పోతూ ఇంటి దగ్గరున్న పిచ్చిదాన్ని రాళ్ళతో కొట్టి తరిమేస్తారు.

బాగా రాత్రయి ఇంటికొచ్చిన వినాయక్ ఆమెకోసం అడివంతా పిలుస్తూ గాలిస్తాడు. ఒక చోట కన్పిస్తే, ఇక ఇలా జరగదని హామీ ఇచ్చి ఇంటికి తెచ్చుకుంటాడు. తెల్లారి లేచి రంపంతో వెదురు వంతెనని కోసి కూల్చేస్తాడు.

కథనమంతా సింబాలిజమే. భావోద్వేగాలు మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ శైలి చిత్రీకరణే. అంతరార్ధాలు మనం తెలుసుకోవాల్సిందే. ఏ ఛాంబర్‌లో కూర్చోవాల్సిన కంపెనీ బాస్ ఆ ఛాంబర్లో కూర్చోవాలి. ఉద్యోగుల వర్క్ ప్లేస్‌లో కొచ్చి పర్యవేక్షిస్తే డిస్టర్బింగ్‌గా వుంటుంది. ఎక్కడుండాల్సిన దేవుడు అక్కడుండి పాలించాలి. ఎక్కడబడితే అక్కడికి జొరబడి వచ్చేస్తే చిరాకేస్తుంది. ప్రతీదీ డిస్టర్బ్ అయిపోతుంది. రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు కోసమే దేవుణ్ణి తెచ్చి డిస్టర్బ్ చేస్తూంటారు. ఇది వ్యక్తిగత జీవితంలోకి కూడా వచ్చేసేసరికి రంపానికి పని చెప్పాడు వినాయక్. పై అధికారులు భక్షణలో వుంటారు. కింది ఉద్యోగులే ఇలా భక్షణ నుంచి రక్షిస్తూంటారు వ్యవస్థని.

ఇక ఇంకా సూర్యుడు, చంద్రుడు, చీకటి, పగలు, నీరు, నిప్పు వంటి రూపకాలంకారాలని (మెటఫర్స్) సందర్భయుక్తంగా ప్రయోగించడం కూడా కన్పిస్తుంది. సంగీతంతో కూడా కథ చెప్పాడు దర్శకుడు. వినాయక్‌కి భార్య జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సన్నగా షెహనాయీ విన్పించడం, రాజకీయ నాయకుడు కన్పించినప్పుడు ముసురుకున్న ఈగలు చేసే రొద విన్పించడం వంటి శబ్దఫలితాలు కట్టి పడేస్తాయి. బలహీనమైన వెదురు వంతెన ఇంకో రూపకాలంకారం. అడవితో మనిషి సంబంధాలు బలహీనంగా వుంటేనే అడవి బతుకుతుందనీ, లేకపోతే అడవికే అనర్థమనీ చెప్పడం. ఆ బలహీన వారధిని కూడా మనుషులు అతిక్రమిస్తే దాన్ని కూల్చేసి – అసలు సంబంధాలే లేకుండా చేయాల్సిందే. ఇంకోటేమిటంటే, మనిషి బలహీనత. తనదాకా వస్తేగానీ మనిషి సామాజిక అవకతవకల్ని సరిదిద్దలేని బలహీనత. గుడి కడుతున్నప్పుడు పర్యావరణం దెబ్బతింటోందని బాధపడ్డాడే గానీ దాన్ని ఎదుర్కోలేదు వినాయక్. పిచ్చిదాని జోలికి వాళ్ళు వచ్చినప్పుడే వంతెన కూల్చి తనకీ, అడవికీ మేలు చేసుకున్నాడు.

చాలా నిగ్రహంతో చిత్తరంజన్ ఈ పాత్ర పోషించాడు. వీణా జమ్కర్ కూడా పిచ్చిదానిగా పకడ్బందీగా నటించింది. నటనకి వీళ్ళిద్దరూ పాఠ్యగ్రంథాలు. ఈ కళాఖండం 2009 టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇంతర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు పొందింది. 2009లోనే మన దేశంలో జరిగిన 40వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమాలో ప్రారంబోత్సవ చిత్రంగా ప్రదర్శనకి నోచుకుంది. లాస్ ఏంజిలిస్‌లో కూడా జ్యూరీ అవార్డు పొందింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెల్చుకుంది. ఇవన్నీ ఒకెత్తయితే, 2009లో ప్రపంచం లో విడుదలైన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నమోదవడం మరొకెత్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here