[box type=’note’ fontsize=’16’] “విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విమర్శకులలో అత్యంత ప్రతిభాశాలి. ఆయనలో సృజనాత్మక విమర్శన శక్తులు పరస్పరపోషకంగా వికసించినాయి” అంటున్నారు కోవెల సుప్రసన్నాచార్య “విశ్వనాథ విమర్శ” అనే ఈ వ్యాసంలో. [/box]
[dropcap]వి[/dropcap]శ్వనాథ సత్యనారాయణ తెలుగు విమర్శకులలో అత్యంత ప్రతిభాశాలి. దార్శనికుడైన ఈ కవిలో భావుకత తాత్త్వికత అనే రెండు లక్షణాలూ విలక్షణంగా సంగమించాయి. ఆయనలో సృజనాత్మక విమర్శన శక్తులు పరస్పరపోషకంగా వికసించినాయి.
(అ)
భ్రష్టయోగి అన్న ఖండకావ్వం 1928 నాటిది. ఆనాటికే కవిలో విలక్షణమైన తాత్త్విక దృష్టి ఆవేశించినది. ‘బ్రహ్మకును వాక్కునకు భేద భావ మెంచి, ఈ జగతత్వమున బ్రహ్మ యోజచేసి భ్రష్టయోగిని కవిజన్మబడసినాడ’ అని పేర్కొనినాడు. ఇక్కడ కవి తాత్త్వికముగా జగదనిత్య భావనా నిరతి నుంచి తొలగి పట్టరాని సౌందర్య పిపాస దవిలి ఈ సృష్టిలోని సరస్వతిని – నిత్యమైన బ్రహ్మముతో నభేదముగా భావించినాడు. అది దార్శనిక దశ నుండి భావుక దశకు దిగివచ్చుట. గాఢమైన ఈ వివేచనా శీలము కవిని విశిష్టమైన భావుకునిగా తీర్చిదిద్దినది.
‘కవిభృంగము’ అన్న ఖండ కావ్యములో
‘గుణముల్ దోషములేల యెన్నికలు నీకున్ సాటియేలేదు నీ
ధ్వని సౌందర్యము పుష్పవాటికలలో వ్యాఖ్యాన రమ్యంబ య
య్యెను, సప్త స్వరముల్ భవద్గళము నం దేపారె దీవ్యన్మహా
ధ్వని రాజ్యంబున నీకె కట్టితమిరా పట్టంబు పుష్పంధయా’
అని ధ్వని సిద్ధాంత పారమ్యాన్ని ప్రకటించారు.
1928 నాటికే రచితమైన మరొక ఖండ కావ్యము శ్రీహర్షుడు. ఈ కాలం నాటికి ప్రచారములోనున్న సాధారణ సాహిత్య వాదనలను స్పృశించి వాటిని ఖండించేది. కవిత్వం కోమలముగా ఉండవలెననీ, మారుమూల పదాలు వాడకూడదనీ, ‘అమిత తేలికగా’ ఉండవలెననీ, అందరికీ అర్థం కావాలెననీ వ్యాప్తంగా ఉన్న గాలిమూటలు.
‘చికిలి మెఱుంగు సన్న నగిషీ పని బంగరు సేత మెచ్చలే
రకలుషమౌ వనాంతర మహాఝరిణీ పరివేగ మోర్వలే
రకృత పరిశ్రముల్ శ్రమగతాలసబుద్ధులు వారి మెచ్చుకో
లొక పని పెట్టు కొంటి’ వని అలసులైన పాఠకుల తత్త్వాన్ని కవి ఆక్షేపించినారు.
సొగసైన సుసూక్ష్మకౌశలంగల శిల్ప లక్షణాన్ని గానీ మహోల్బణంగల ఆవేశ ప్రవాహాన్ని గానీ సరిగా అనుభవములోనికి తెచ్చుకోలేనితనాన్ని గూర్చి నిరసించినాడు కవి.
ఉదిత మాధుర్య రసోత్కటంబయిన పల్కు పలికే జాషువా, ఉల్లోలమగు కూర్పులలో మేటి అయిన కృష్ణశాస్త్రి, పంచమ స్వరంలో పలికే గౌతమీకోకిల వేదుల, చక్కగ సన్నగా పాడగల పింగళి, కాటూరులు ఉండగా నిన్నెవరు మెచ్చుకుంటారు? అని తన్ను తాను ఆక్షేపించుకుంటాడు కవి. దానికి కారణం కవి తన పలుకు పెళుసు కావడం. ఇంకా లోతైన కారణం దుఃఖంబల్ల ఆనంద భాగస్వామిత్వం పేర పంచడం. ఇది ‘కవిదుఃఖము’ అన్న ఖండకావ్యంలోది.
విశ్వనాథ రచనలన్నిటిలో – అది కావ్యమైనా, నాటకమైనా, కథయైనా నవలయైనా, దేనిలోనైనా విమర్శకు సంబంధించిన అంశాలు ఎక్కడో అక్కడ స్పృశించడం కనిపిస్తుంది. ఆయన వ్యాసాలు, విమర్శ గ్రంథాలు సాంకేతిక పదాల మర్యాదకు లొంగక సహృదయ సంవాదం ప్రధానంగా వ్యాఖ్యానం చేయబడ్డ గ్రంథాలు.
‘చెలియలికట్ట’ లో రత్నావళికి మను చరిత్ర పాఠం చెప్పడం, ‘వేయిపడగల’ లో శ్రీనాథుడు, ఆముక్త మాల్యద మొదలైన అంశాల గూర్చిన ఆలోచనలు విశ్వనాథ విమర్శనాశక్తికి ఆధారాంశాలు, ‘మ్రోయు తుమ్మెద’, ‘భ్రమరవాసిని’, ‘దూత మేఘము’ మొదలైన రచనలలో రసానుభవాన్ని గూర్చి చర్చ కనిపిస్తుంది.
అయితే ఇలా చెదురుగా ఉన్న అభిప్రాయాలు ఆధారంగా విశ్వనాథ సాహిత్య విమర్శ తత్వాన్ని విశ్లేషించడం బృహత్కార్యమే.
విశ్వనాథ సాహిత్య విమర్శలో కొన్ని కొన్ని అంశాలు క్రమక్రమంగా విస్తృతం కావడం మనం గమనించవచ్చు.
- భారతీయాలంకారిక దృక్పథాన్ని సమగ్రమైందిగా అంగీకరించి అది ఆధునిక కాలానికి కూడా అన్వయిస్తుందని, మన విమర్శ సంప్రదాయావికి అది ఆధారభూతమైనదని వెల్లడించడం. ‘రసము వేయి రెట్లు గొప్పది నవకథాదృతిని మించి’ అన్నప్పుడు కల్పనాకథకు ప్రాధాన్యము నిచ్చి రసభావములకు ప్రాధాన్యము తగ్గింపనెంచిన రామలింగారెడ్డి విమర్శన విధానాన్ని ఎదుర్కోవడం కానవస్తుంది.
- తెలుగు కవులను గురించి అంత వరకూ ఉన్న అంశాలను పునఃపరిశీలించి కొత్తగా వారి వారి స్థానాలను నిర్ణయించడం. ఈ అంశం ప్రధానంగా ‘తెలుగు ఋతువు’ల అంకిత పద్యములలో ఉన్న పూర్వ కవిస్తుతిలో (1938) ప్రారంభమయింది. అదే పద్యం కొలది మార్పులతో తరువాత నాలుగైదు సంవత్సరాలకు అచ్చైన కల్పవృక్షం బాలకాండ లోకి వచ్చింది. ‘తెలుగు ఋతువులు’లో నన్నయభట్టులు మధునవ ఝరీ జనిగిరి, అన్న భాగం ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని మారింది. చివరకు గీతంలో ‘ఒకడు నాచన – సోమన’ అని అధికంగా చేర్చబడ్డది. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి’ (1949) లో వచ్చింది. ‘యశోనన్నార్యస్యా క్రియత కలుషీభూతమధునా పునస్సం జాతోహం కృత కలుష నిష్కాసన పటుః’ అన్న చోటా ఈ విధమైన స్పష్టమైన అభిప్రాయం కనిపిస్తుంది.
‘ఆంధ్ర సాహిత్య చరిత్ర రూపకాలు’ (1961)లో ఈ విషయంలో ఒక రూపురేఖ కానవస్తుంది. అయితే పూర్వమే 1940లో నవ్య సాహిత్య పరిషదధ్య క్షోపన్యాసం ఆధునిక సాహిత్య పరిణామాన్ని దశాక్రమంగా విభాగం చేసి రచయితల స్థానాలను యధాసాధ్యంగా నిర్ణయించిన ప్రయత్నం ఇది. ఈ ప్రసంగం ‘నవ్యాంధ సాహిత్య వీధుల’ రచనకు ఆధారంగా నిలచింది. ‘ఆంధ్రపురాణం’ పీఠికలో ఆధునికాంధ్ర సాహిత్యంలో సౌందర్యనందము, శివ భారతము. రాణా ప్రతాపసింహ చరిత్రము ఆత్మ కథ, ఆంధ్రపురాణము పంచ కావ్యములని పేర్కొని వాటి స్థానాన్ని నిర్ణయించడం – నవ్య సంప్రదాయ దృక్పథం గూర్చిన ఈనాటి ఆలోచనకు బీజాన్ని వేసి లక్షణాన్ని నిర్దేశించింది. విశ్వనాథ పీఠికలలో ఇతర రచనలలో ఆంధ్రసాహిత్యాన్ని గూర్చిన అభిప్రాయాలు విస్తృతంగా వివేచన చేయదగినవిగా ఉన్నవి.
నన్నయతో పాటు అల్లసాని పెద్దన, నాచన సోమన్న, శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ఆయన దృష్టిని ఆకర్షించిన తెలుగు కవులు. వీరందరినిగూర్చిన ఆయన అంచనా వారి స్థితికి అపూర్వమైన నూత్నత్వాన్ని ప్రసాదించింది.
మూడు తెలుగు కవితా జగత్తును అతిక్రమించి కాళిదాస భవభూతుల పైన స్వతంత్రమైన విమర్శను వెలయించినాడు.
సాహిత్యంలో ఆధునికతా – సంప్రదాయమూ ఎలా సంవదించవలెనో వివరించి అది విచ్ఛిన్నమవడం సహృదయతను ఎట్లా భంగించగలదో పరోక్షంగా నిర్దేశించాడు.
లిరిక్ కవిత్వం గూర్చి వివరించడం, భావకవిత్వాన్ని వివేచించడం పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను అన్వయించుకోవడం గూర్చిన ఎరుకను వెల్లడి చేస్తుంది.
ఈ మూడు పార్శ్వాలనూ, ఆయన సాహిత్య పరివాహంలోనుంచి వింగడించడం బృహత్కార్యం. పీఠికలే సుమారు వేయి పేజీల సాహిత్యం. ఇంకా వ్యాసాలు, ప్రసంగాలు, ‘ముఖాముఖి’లు. విశ్వనాథ తన సాహిత్య విమర్శలో మౌలికమయిన అనేకాంశాలను ఆవిష్కరించినాడు. అంతేకాక సంప్రదాయసిద్దంగా వస్తూ వున్న అంశాలకు ఆధునికమయిన అన్వయం కల్పించినాడు. వీటిని దేనికదిగా మూడు భాగాలుగా వివేచించవచ్చు,
కథాకథనము – సన్నివేశ రచన, సంవిధానము – శబ్దములను అక్షరములను యోజించుటలో కవి నేర్పు దాని నాద సౌందర్యముతో పాటు వాని కూర్పు కలిగించు అర్థవైపుల్యము కావ్యగత శబ్దములు కావ్య పరమార్థమును వ్యాఖ్యానించుటలో గల సామర్థ్యము కవి కౌశలమునకు కారణమైన శిల్పదృష్టి. కావ్యమునందలి అక్షరముల కూర్పు భావముల కూర్పు పద్యరచన, సన్నివేశ కల్పన, సంవిధానము, కథా కథనము ఇవన్నియు కావ్య పరమార్థాన్ని వ్యక్తం చేయడం. ఇంతవరకూ జరిగిన విశ్వనాథ విమర్శ సాహిత్య పరిశోధన అంతా ఈ పరిధిలోనే దాదాపుగ పరిభ్రమించినది.
శ్రావ్యకావ్య నిర్మాణములో పంచసంధులు మొదలైనవి సూచించడం జరిగింది. కాని కావ్య పరమార్థానికి అభిముఖంగా కథానిర్వహణం ఎలా చేయవలెనో అలంకారికులు వివరించలేదు.
‘వురాతనైర్లాక్షణికైర్న సూచిత కథాగతిః’ ‘అజ్ఞాతపూర్వా సుఖవిరపిచ పూర్వైః కాళిదాసాదిభిశ్చగాథా కథన పటురపూర్వ శక్తిః’ అని ఆయన పేర్కొన్నారు. ఇది అనంతమైన శిల్ప విశేషము. నన్నయ రచనను విశ్వనాథ వ్యాఖ్యానము చేసి సర్వ మహాకావ్యములను వ్యాఖ్యానించి తెలియవలసిన పద్దతిని నిరూపించినాడు. ఆ కథాకథనాన్ని గూర్చి విశ్వనాథ సంగ్రహంగా ఇలా వివరించినాడు.
‘నన్నయగారు కథయొక్క ప్రాణమును బట్టుకొని నొక్కును గాని కథలోని వివిధాంశములను పెంచడు’
‘ఈ రీతిగా కథను, కథలోని పాత్రలను ఒకమాట చేత ఒక వాక్యముచేత తీర్మానించుచు వెళ్ళేడివాడు విస్తరించి వ్రాయడు.. ఇది ఇతిహాసము, కావ్యముకాదు. అందుచేత నిట్లే వ్రాయవలయును’. ఈ అనుటలో కావ్య ప్రక్రియా వివేకము లేకుండ విమర్శించుటలోని అనౌచిత్యమును విశ్వనాథ బయటపెట్టినాడు. భారతమువలె ప్రబంధములు లేవనుట ఈ విధమైన విమర్శయే,
కథాకథన శిల్పమును వివేచించుచు అక్షరగతముగా వృత్తగతముగా గుణమును కూర్చుటలోను నన్నయ వ్యక్తము చేసిన శిల్పరహస్యములను విశ్వనాథ వ్యాఖ్యానించారు.
శర్మిష్ణకథ, నలోపాఖ్యానము మొదలైనచోట నన్నయ కథా కథనమందలి నైపుణ్యమును విశ్వనాథ వివరించి చూపించినాడు. ఆ చూపులో విశ్వనాథ కావ్య నిర్మితిలో ఒక్కొక్క యంత్ర భాగాన్ని విప్పుకుంటూ దాని స్థానాన్ని దాని ప్రయోజనాన్ని గ్రహించడం దీనివల్ల సాధ్యమవుతున్నది. కావ్యాంతర్యంలోకి ప్రవేశించేప్పుడు కథ వివిధోపకథలు, వాటి పరస్పర సంధానం, పద్యం గణయతి ప్రాసాదులు వాటి ప్రత్యేక ప్రయోజనం అర్ధవ్యంజకత, శబ్దము, శబ్దార్థముల కూర్పు, సమాసకల్పన ఆయా వర్ణముల నాదవ్యంజకత, ఇట్టివన్నీ ఈ అంశాలు కావ్యమును ఒక్కొక్కటి విప్పుకుంటూ దావీ ఆంతర్యాన్ని తెలుసుకోవడం మళ్ళీ నిర్మాణ సమగ్రతలో ఆ నైపుణ్యం ఒదుగుదలను భావించడం ఈ విద్య.
విశ్వనాథ విమర్శలో ఎక్కువభాగం ఈ మార్గానికి చెందినదే, వ్యాఖ్యాన మార్గము. దీన్నే శిల్పానుశీలన మార్గమన్నారు కావ్యపరమార్థ దృక్పథమన్నారు.
కావ్య పరమార్థమన్నపుడు – ‘కాళిదాసు గొప్పతన మెక్కడనున్నదనగా, ఇట్టి భారతదేశ కావ్య పరమార్థభూతమైన రసమును ఆయన పరిత్యజించలేదు. దోష రహితుడైన దీరోదాత్త నాయకుని పరిహరించలేదు. కథను నిర్మించినాడు. అయితే కావ్య పరమార్థము రసమే. రసమును అనుభవస్థాయిలో వెలకట్టుటకు కావలసిన పరికరమే శిల్పము, పద్య విద్య, కథాకథనము, అక్షర రమ్యత, నవీన గుణములు, అల్లిక జిగిబిగి మొదలైనవి. చెల్లాచెదురుగా పడివున్న ఈ భావమును వెలికి తెచ్చి కావ్యములకు అన్వయించి చూపి వానికి శాస్త్రసోపాన పంక్తి లక్షణమును విశ్వనాథ కల్పించినాడు.
కథాకథనము సర్వకావ్య సామాన్యమే అయినా దాని నైపుణ్యము రసదీప్తి. ‘కవ్యవేక్షయా కథనములో శిల్ప మేర్పడుచున్న’దని ఆయన తీర్మానించినాడు. ఒక కథ ఒక పద్దతిగా జరుగుటకు హేతునిరూపణము శిల్పములోని భాగము. అయితే శిల్ప శబ్దాన్ని విశ్వనాథ బహుథా ప్రయోగించినాడు. ఆయన శిల్పమునకు చేసిన నిర్వచనమిది. ‘శిల్పమనగా నొక్కమాటలో చెప్పినచో, బహ్వర్ధములేకత్ర సమావేశపరచి పఠిత యొక్క మనస్సును భావనామయము చేయుట’. మరొక చోట ‘శిల్పము యొక్క ప్రధాన లక్షణము ప్రయోజన సహితత్వము అధికార్థ సంగ్రహణము, పాఠకుని గాఢ భావనాశీలుని జేయుట’ అని తెలిపినాడు. ప్రయోజనము సాధింపలేని నైపుణ్యము శిల్పము కాదు జల్పమని కూడ ఆయన ఒక చోట ప్రకటించినాడు.
విశ్వనాథ విమర్శన మార్గమంతా ఈ విధమైన వివేచనలో కావ్యాలను పరిశీలించడంగా సాగింది. మహాకవి కావ్యగతములైన శబ్దములు కథా మర్మ భేదకములుగా ఉంటవని ఆయన శాకుంతలము యొక్క అభిజ్ఞానత పీఠికా పద్యాల్లో చెప్పినాడు. ఈ శబ్దములు అన్యోన్య సంఘర్శనవల్గు కాంతులు. కల్పవృక్షంలో శారదా స్తుతిలో చెప్పినట్లు పాలితాన్యోన్య లంఘన స్పర్థములు. కథాగర్భంలో నిక్షిప్తములైన ఈ ఈ శబ్దాలు వెలికి వచ్చినప్పుడు వాటి కాంతులు కథాశరీరంలోని వివిధాంశాలను ప్రకాశింపజేస్తాయి.
విశ్వనాథ పూర్వకవుల రచనలను అపూర్వంగా వ్యాఖ్యానించినపుడు ప్రధానంగా వచ్చే సందేహం కవి యివన్నీ నిజంగా భావన చేశాడా అని, ఆయన అంటారు – ‘ఇంత మహార్థము గాలిలో నుండదు. వస్తువు నాశ్రయించి యుండును. వస్తువు లోకములో నున్నది’, (శా. ఆ. 5) ‘ఇవన్నీ ఊహించే వ్రాస్తారా?’ ‘ఇవన్నీ సంస్కార బలం చేత వస్తాయి.’ (విశ్వశ్రీ – 1954) అంటాడు. ఈ సంస్కారము కవి చైతన్యంలోని అన్ని అంతస్తులకు సంబంధించిందీ. జాగ్రచ్చేతన, అవచేతన, సుప్తచేతన, సమష్టి అవచేతన ఇవన్నీ ఈ సంస్కారాల స్థానాలే.
అందువల్లనే కవి జాగ్రచ్చైతన్యంలో భావించిన దానికంటే మించిన అర్థం కావ్యగతంగా ప్రకాశిస్తుంది. ఈ లక్షణమే కావ్యాన్ని దేశ కాలాలకు అతీతంగా సార్వకాలికంగా తీర్చిదిద్దుతుంది. బహ్వంశములేకత్ర సమావేశ పరచుట అన్న శిల్ప లక్షణం అదే.
ఈ దృష్టిలో మధుర పద్య రచనాశక్తి తత్తద్దేశమునందు చమత్కారాపాదకమైన రచన, ఏక దేశము నందు ప్రకాశించే భావ సౌందర్యము కావ్య సమష్టిని దృష్టిలో పెట్టుకొని చూచినప్పుడు ముఖ్యమైన అంశములు కావు. ఎవరు తన రచనలో సర్వ విషయములను కావ్యతత్త్వాన్ని వ్యాఖ్యానించడానికి అనువుగా అంగాంగీభావము చెదరకుండా తీర్చిదిద్దుకుంటాడో వాడే శిల్పి. మహాకవి. తాను భావించిన దానికి విరుద్ధమైన అర్థం కావ్యంలో సంభవించితే వాడు కుకవి అని ‘స్వర్గానికి నిచ్చెన’ లలో చెప్పాడు.
విశ్వనాథ నాచన సోముని గూర్చి వ్రాసినప్పుడు, శ్రీకృష్ణ దేవరాయలవారిని గూర్చి వ్రాసినప్పుడు ఈ అంశములను గూర్చియే వివరించినాడు.
విశ్వనాథ కావ్య విమర్శలో ఛందశ్శిల్పం కూడ ఒక ప్రధాన భాగము. నన్నయ గారి రచనలోని వృత్తౌచిత్యమును తెల్పడంతోపాటు తెలుగు ఛందోవికాసానికి వ్రాసిన పీఠికలో ఈ ఛందస్తత్వాన్ని వివరించినాడు. శ్రీనాథుని సీసపద్యాల రచన విషయంలో వివాదం వేయి పడగలలోనే ఉన్నది. రచనలో సమరీతిగా నాల్గుపాదాలలో ఉండటంవల్ల ఒక విధమైన మొనాటనీ (మొగము మొత్తు) లక్షణం వస్తుందని ఆయన నిశ్చయం. ఆంతటి దీర్ఘ పాదాలు నాల్గూ ఒకే ఎత్తుగడలో నిర్వహణతో సాధించడం కష్టసాధ్యమనీ, ఒకవేళ సాధించినా గీత పద్యంలో అది తేలిపోక తప్పదనీ, సీసపద్యం బహు వైవిధ్యంగల గతులతో, ప్రయోజనాలను సాధించవలెననీ విశ్వనాథ తాత్పర్యం. ఈ వివాదం మళ్ళీ 1954లో కర్నూలులో ఆయన చేసిన ఉపన్యాసం కారణంగా చెలరేగడం, శ్రీపాద కృష్ణమూర్తి గారు దాన్ని తీవ్రంగా ఆక్షేపించగా ‘ఆస్థాన కవులకు నమస్కారం’ అనే వ్యాసంలో దానికి సమాధానం వ్రాయడం అందరికీ తెలిసిన విషయమే.
(ఆ)
విశ్వనాథ ప్రతిపాదించిన మౌలింకాంశాలలో రెండవది కావ్య తత్వప్రకాశనముకోసం సాహిత్యేతర శాస్త్రాంశాల సమన్వయం సాహిత్య విమర్శ పరిధి. ఈ దిశలో ఇంతగా విమర్శను విస్తృతం చేసిన గౌరవం విశ్వనాథకే దక్కింది. కావ్యంలోని అనేక ఘట్టాలు పురాణేతిహాస ధర్మశాస్త్రాలు, సామాజిక ఆర్థిక మనశ్శాస్త్రాదులు, సాoఖ్యయోగ వేదాంతాదులు, శ్రీ విద్యాది గూఢ విద్యలూ మొదలైన ఈ యీ అంశాల వల్ల అధికంగా దీప్తిని పొందటం ఆయన చూపించినాడు.
శాస్త్రం, శిల్పం, విద్యలూ, కళలూ అన్నీ కావ్యంగాలేననీ భరతుడు పేర్కొన్నా ఆ ఆంశాలు అన్వయం చేయడం ఒక ప్రధానమైన పద్ధతి. శాస్త్ర ప్రధానమైన కావ్యాలలో భట్టి కావ్యంలో వ్యాకరణం, మహాభారతంలో ధర్మశాస్త్రం, వేదాంతము, రాజనీతి మొదలైనవి, రాయలకావ్యంలో విశిష్టాద్వైతము రాజనీతి ఉండటం అవి కథా శరీరంలో అపరిహార్యమైన అంశాలు కావడం వల్లనే, అయితే కావ్యం కావ్యంగా సహృదయునికి తెలివిడి అవుతూవున్నా అతని కావ్యంలోని నిగూఢ శబ్దాలను గ్రంథ గ్రంధులను విప్పడంవల్ల ఆ కావ్యాల నూతనపార్శ్వం వివృతమై కొత్త వెలుగులు చిమ్మడం కద్దు. పాఠకునిలోని సంస్కార బలంవల్ల ఆ కావ్యాలు తమ ఆంతర్యాన్ని వెల్లడిస్తూ ప్రకాశించినయి.
విశ్వనాథ నలోపాఖ్యానంలో శివపురాణంలోని వృత్తాంతం చెప్పి రాయబారియైన హంస శివుడని నిరూపించడం ఆయన నానా పురాణవేతృత కారణంగా జరిగింది. మను చరిత్రలోని అవతారాల వర్ణనమును చరిత్రలోని వైష్ణవ తత్త్వ రహస్యాన్ని వ్యాఖ్యానిస్తున్నదని చెప్పడం మరొక విశిష్టాంశం. నాచన సోమని హరివంశంలో అన్ని కథలూ విష్ణుపారమ్యాన్ని ప్రతిపాదిస్తున్నవని చెప్పడం – నరకాసురకథ జ్యోతిర్లోకంలో జరిగిన సన్నివేశంలోనిదని తెలుపడం ఆ కావ్యాలకు నూతన చైతన్యమును కలిగిస్తున్నది. అన్నింటికంటే మిన్నగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో పంచమాంకాన్ని విశ్లేషిస్తూ ఆధునిక మనస్తత్వ శాస్త్రాన్ని అన్వయించి జాగ్రచ్చేతనకూ అవచేతనకూ మధ్య ఉన్న వైరుధ్యాన్ని రచనలో చూపించినారో ప్రతిపాదించడం ఆ కావ్యపు అభిజ్ఞానతకు నూతన పార్శ్వాన్ని ఆవిష్కరించింది.
ఈ దృక్పథముతో కావ్యమును చూచే ధోరణి, సామాజిక దృక్పథంతో పరిశీలించే అత్యాధునిక మార్గం దీనిలోనే అంతర్భవిస్తున్నది.
అయితే విశ్వనాథ ఆత్మాశ్రయమైన విమర్శకు విరోధి. ‘శీల ఇతిక వేర్జనిత గాధా ప్రతిఫలనమితి నవ పథీనాః నిర్మృష్టధ్వని మార్గాః గర్జంతి నిరంబు జలదాభాః’ అన్నప్పుడు ఆత్మకథా లక్షణాన్ని ఆధారంగా చేసే విమర్శను ఆయన తిరస్కరించాడు. ‘ఉర్విలోన మహాకవి యోగివంటివాడు సర్వమ్ము భావనావధిగ జూచు అల్పులంబోలె ఆదియెల్ల అనుభవించె ననుకొనుట వట్టి సామాన్యమైనమాట’ అని అంటాడు విశ్వనాథ పంచశతిలో.
(ఇ)
మూడవదీ చివరిదీ ఆయిన మౌలికాంశం అలంకార శాస్త్రంలో మూలంలోకి వెళ్ళి సృజనకారణమును విశ్లేషించే స్థితిలో దాన్ని వ్యాఖ్యానించడం, ఆలంకారికులు, ప్రతిభాదులు కావ్యహేతువులు అన్నమాట నిజమే. అయితే ఈ ప్రతిభాస్పందనం ఏ పరిస్థితులలో కావ్య సృజన రేఖను కదిలించేదీ విస్తృతంగా వర్ణించలేదు. శోకః శ్లోకత్వ మాగతః అన్నప్పుడు కవి పొందిన శోకం తాదాత్మ్య స్థితిలో శ్లోకమైందని తెలిపినాడు.
ఈ విషయంలో ఆయన తెలిపిన ప్రధానాంశాలు రెండు, ఒకటి బ్రహ్మసరస్సు, రెండవది జీవుని వేదన. కావ్యాంతంలో బ్రహ్మ సరస్సును గూర్చి ప్రతిపాదిస్తూ సరస్వతికి జన్మస్థానము, ఈ సరస్సునుండి ఆమె ప్రవహిస్తున్నది అని ప్రతిపాదించినారు.
ఇది ఆధునిక మనస్తత్వశాస్త్ర భాషలో సమష్టి చైతన్యాంశము. కవి సృజన వేళ తన్ను తాను మరచిపోయినపుడు అవచేతనాద్వారము తెరచుకుంటుంది. దానికి మూలమందున్న సుప్తచేతన సమష్టి అవచేతనలు మేల్కొంటవి. కవి ఎంతటి సంస్కారియో ఎంతగా సమష్టి చైతన్య స్పందాన్ని తనలోకి ఆవిష్కరించుకోగలడో అన్న అంశం ఆధారంగా ఆతనిలోకి ఆయా లోతులు విదల్చుకొని పెల్లుబికిరావడం జరుగుతుంది. వ్యక్తి చైతన్యం ఆ ఆవిష్కారానికి ముఖం మాత్రమే.
వ్యక్త చైతన్యంలోని అంశాలు సంస్కారాలు లోనుంచి వెలికి వచ్చే సృజన ప్రవాహానికి రెండు పార్శ్వాలగట్లుగా – అదుపులో పెట్టటానికి, అనౌచిత్యాలను సంహరించడానికి పనికివస్తాయి.
ఈ విషయంలో విశ్వనాథ అనుభవమే మనకు స్పష్టమైన తాత్పర్యాన్ని అందిస్తుంది.
‘A Theme comes to my brain or I am asked by somebody to write a novel or some other thing. I never think of the plot nor of the style to be employed nor style to be employed no of the Art. The theme is there. I begin. The language, the plot, the art, the expression, the poetry they all come of their own accord and there is something here to say. I either dictate or compose if it is verse, at different times. If meanwhile I think of what I should write next, some Idea comes. But at the actual moment of dictation it chooses its own way. What I thought previously does not come and so the language, the plot, the art and much machinery that is seen in almost all my books is not what I thought about. Every letter I must say is an automatic outburst of the mood in which I will be placed.
This is a wonder to me and I am never able to analyse this state of mind…… when I am writing I always find myself in a high psychological fit, some thing like a trance not to be disturbed.’
(విమర్శిని-2 Page 94–95)
సృజన కళలో కవి పిలిచే ఈ విస్పష్టమైన వ్యక్తావ్యక స్థితియే సృజన ప్రవాహము నిర్నిరోధంగా ప్రవహించటానికి కారణం. ఈ ప్రవాహం మూలజగత్తు యొక్క చేతస్సు. ఆదే బ్రహ్మ సరస్పు.
ఈ విధంగా సృజన హేతువును ఆధునిక మనశ్శాస్త్రమార్గంలో నిర్దేశించాడు విశ్వనాథ.
మరొక అంశం బహుధ చర్చితమైన జీవుని వేదన అనేది. ఈ భావం జీవ భావం అన్నముడి మీద ఆధారపడి ఉన్నది. విశ్వనాథ తాత్త్వికంగా జీవ భావాన్ని ప్రాతిభాసికంగా భావించినాడు బ్రహ్మవస్తువు నుండి చ్యుతిపొందిన జీవచైతన్యం మళ్ళీ ఆ స్థితిని పొందడంకోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ వుంటుంది. ఈ ప్రయత్నంలో జీవుడు తనలోని మాయ పొరలని క్రమంగా ఛేదిస్తూ పోతాడు. చివరకు తన్ను తాను తెలుసుకోవడంతో ఈ వేదన తొలగిపోతుంది.
శృంగార వీధిలో శ్రీ కృష్ణ దేపుని నిర్వేదం అనే ఖండ కావ్యం ఉన్నది. దీనిలో శ్రీ కృష్ణుడు మాయావృతుడైన జీవుడు, రుక్మిణ్యాది అష్టభార్యల యందు; కుబ్జ రాధ మొదలైన భక్తురాండ్రయందును- అతడు తృప్తి పొందడు. తాను ఏదో తెలియని బాధను వేదనను అనుభవిస్తూ ఉంటాడు. చివరకు ఒక స్త్రీ వస్తుంది. ఆమెతో సంసర్గంలో ఒక మొరటుదనంతో ఒక విపులమైన తమస్పులో మునిగి వుంటాడు. అప్పుడు ఆమె మాయ ఆని స్ఫురణ హఠాత్తుగా కలుగుతుంది. దానితో శ్రీకృష్ణుడు పరమాత్ముడు. మాయ అంతరిస్తుంది. ఈ తెలియని వేదన, తాను తొలగిన స్థితి నుండి మరల దానిని చేరుకోవలెననే ఆర్తియే అదీ..
ఈ ఆర్తి జీవుని తోడిదే, నిత్యమైంది. ఈ అవ్యక్తమైన ఆర్తి తనను తాను లోలోతులలోనే వెదుక్కొంటూ లోనికి మరల్చుకుంటూ వెళ్ళేది. ఈ అన్వేషణలో ఈ తనను గుర్తించే ప్రయత్నంలో కావ్యం పుడుతున్నది.
శ్రీ మద్రామాయణ కల్పవృక్షావతారికలో జీపుని వేదన కావ్య హేతువని చెప్పినారు విశ్వనాథ. ఈ జాగ్రదావస్థ ఎరుంగ లేని ఆర్తి పైకి రామకథను చెప్పటం ద్వారా తన్ను తాను వెదకుకొమ్మనే మార్గం చూపింది. అందుకే కల్పవృక్షంలో అన్ని పాత్రలకూ అవ్యక్తంగానో, వ్యక్తంగానో శ్రీరాముడు పరబ్రహ్మమని తెలుసు. మహర్షులు మాత్రమే ఈ జ్ఞానం వ్యక్తంగా ఉన్నవారు. అందువల్ల అన్ని పాత్రల వ్యవహారంలోనూ రాక్షస పాత్రలలో కూడా ఈ శ్రీరామగతమైన ఈశ్వర భావన కానవస్తుంది. ఇది ఆధారంగానే ఈ ఇతిహాసం రెండంతస్తులలో కథ, ఆంతరమైన దైవాసుర సంఘర్షణ మాత్రమేకాక మూడవ అంతస్తులో సర్వ జీవులకూ సహజమైన ఈశ్వరాన్వేషణగా కానవస్తున్నది.
ఇది అద్వైత తత్త్వ సంబంధమైన భావన. ఈ భావనతో కావ్య జగత్తు ఆధ్యాత్మిక జగత్తుతో సంధితమైంది. కావ్యరచన ఒక విధంగా లోనున్న వేదనను వెలికి తెచ్చి పై పొరలను తొలగించుట కన్నట్లయినది.
ఈ భావనకు పర్యవసానమే కావ్య ప్రయోజనమును ఈశ్వరారాధనగా భావించే దశ. తిక్కన భావన చేసిన ఈ పద్ధతిని మరల విశ్వనాథ ‘కవితారూప తపస్సు’ అన్నాడు. ఈ తపించే లక్షణము ఆంతర్యములోనిది. ఈ కవితా రూప తపస్సు ఎందుకంటే మామూలుగా యోగసాధనలో ఇంద్రియ జయము, మనస్సంయమము చేయవలసినవి. అవి కవికి సాధనలో లొంగడంలేదు. విశ్వనాథ ఎన్నుకున్న పద్ధతి వేరు. దీన్ని సాధించడంకోసం వాటిని భావనా విమల వాక్తీర్థములతో కడిగి వేస్తానన్నాడు.
ఒక విధంగా కేథారిస్ వంటి మార్గమే యిది. కావ్యసాధనలో ఇది నిరంతర భావనతో జాగ్రత్ చైతన్య పరిధిని దాటడమే కాకుండా అంతఃకరణలోని మనోబుద్ధ్యహంకారాలను దాటి చిత్తమును ప్రవేశించే దశ లోకి ప్రాకడం.
జాగ్రదావస్థ నేమియన, స్వప్న సుషుప్తుల గూడ రామ నా
మ గ్రహణంబె నావయిన మానస జిహ్వలు సేయు, తత్కథా
ప్రగ్రహ కృష్టిసం స్లథ ధురావహమై చను మన్మనోశ్వ, మో
యుగ్రుడ, నీవ సారథివ, యూనుము పగ్గములన్ కరంబులన్.
అన్నప్పుడు చైతన్యధారలో అవస్థాత్రయంలోనూ రామనామ నైరంతర్యం కలిగిన స్థితిని పేర్కొంటున్నాడు. ఈ నిరంతర భావన ఇంద్రియాదుల వికారాలను కడిగి వేస్తున్నది. అదీ ఈ తపోమార్గం. అందుకే విశ్వనాథ ఒక చోట ఇలా అన్నాడు ‘రేణువును గూడ మనసార పరిత్యజించి కేవలం రామానుగ్రహం కోసం వ్రాసిన గ్రంథమిది.’ (విమర్శిని-2 P-58). అంటే కల్పవృక్షరచన ఒక విధమైన పరివ్రాజక మనోదశలో వ్రాసింది. ఆ దశ ‘నేను మనసన్యాసిని’ అన్న బాలకాండలోని అవతారికలో వెల్లడించారు రచయిత. ఈ తపో భావనయే కాళిదాసునకు శాకుంతలం వ్రాయడంలో ఉన్నట్లు వ్యక్తం చేయడం జరిగింది.
‘కాళిదాసు ఇన్ని బహ్వర్థముల నుద్దేశించి రాజు లేడిని తరుముటతో ప్రారంభించెను. ఆ లేడి కృష్ణసారము. శ్రీకృష్ణుని యొక్క సారము. భగవంతుడైన శ్రీకృష్ణునిచేత చెప్పబడిన గీతోపనిషత్త సారమా! రాజెట్లున్నాడు. సూతునకతడు మృగానుసారియైన పినాకివలె కనిపించుచున్నాడు. మృగమనగా వెదకబడునది. ఏది వెదుకబడుచున్నది? తత్త్వము. అంతఃకరణాంతర్గతమైన సూక్ష్మ భావ భూత జీవ స్వరూపము తత్ప్రేరకుడైన శివుడు.
‘కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము సర్వవేద వేదాంత సారము. శివాద్వైత ప్రతిపాదక గ్రంథము’. (శాకుంతలము యొక్క అభిజ్ఞానత. పు. 11)
ఈ విధమైన వ్యాఖ్యానము కావ్యము నెట్లు పరమార్థ ప్రతిపాదకముగనే కాక సాధనముగా తీర్పవచ్చునో తెలియజేయుచున్నది. అందుకే శాకుంతల భరత వాక్యము శివోహం అన్న తత్త్వాన్ని వ్యాఖ్యానిస్తున్నది.
కావ్య ప్రయోజనాన్ని మోక్షపురుషార్థానికి అనువుగా నిర్మించడం దాని పరమ స్థితి, ఇది విశ్వనాథ నిశ్చయం.