మన సినిమాల్లో మహిళ – పాట చిత్రీకరణ

0
3

[box type=’note’ fontsize=’16’] సినిమా పాటలలో మహిళ అంతరంగం ప్రదర్శితమయిన తీరు, వారి వ్యక్తిత్వాలను ప్రదర్శించిన తీరును లోతుగా విశ్లేషించి వివరిస్తున్నారు ఇంద్రగంటి జానకీబాల ఈ ఫీచర్‌లో.  [/box]

[dropcap]1[/dropcap]933లో ‘భక్త ప్రహ్లాద’ సినిమాతో తెలుగు సినిమా టాకీ మొదలైంది. మన సినిమా అంటే పాటలతో, పద్యాలతో మాయలతో మంత్రాలతో రకరకాల చిత్ర విచిత్ర అంశాలతో అనుక్షణం ప్రేక్షకుడికి వినోదం కలిగించే తెలుగు సినిమా అన్నమాట.

ఇన్ని అంశాలలోనూ అందరికీ మరింత చేరువైంది పాట. ముఖ్యంగా మహిళాలోకానికి సినిమాలో పాటంటే పంచప్రాణాలు. వారు ఆ పాటల్ని విని, నేర్చుకుని, పేరంటాలలోపాడి, మెప్పుపొందడం ఒక గొప్ప అనుభూతి. పాట పాడటం అంటే వున్నదున్నట్లు అద్భుతంగా పాడేస్తారని కాదు గానీ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటారు. ఆ విధంగా సినిమా ప్రేక్షకుల మన్ననలు పొంది, వారి మనసులో పొదరిండ్లు కట్టుకుని వుండి పోయిన తెలుగు సినిమా పాట చరిత్రేం తక్కువది కాదు.

సాహిత్యంలో అన్ని ప్రక్రియలకంటే పాట (గేయం) అనేది జనాలకి చాలా దగ్గరగా వుండే ప్రక్రియ – చదువు – అక్షరజ్ఞానం – పాండిత్యం – భాష మీద పట్టు – చమత్కారాలు చేసి మెప్పించే ప్రతిభ – ఇవేమీ పాటకి అక్కరలేదు. సులువైన మాటలతో – విన్నంతనే ఎదుటి వారి మనస్సులోకి భావం సూటిగా వెళ్ళి గిలిగింతలు పెట్టే లక్షణం పాటకి ముఖ్యం – అందుకే సినిమాకి పాట అందమైన ఆభరణం.

పాట లేని సినిమా మన ఊహక్కుడా అందదు. అయితే పాశ్చాత్య సినిమాకి పాట వుండదు. వాళ్ళకి పాటల సినిమా అని వేరుగా తయారు చేసుకుంటారు. మనం సంఘటనని బట్టి పాటని అమర్చుకుంటాం. ముఖ్యంగా స్త్రీ మీద పాటలు చిత్రీకరించాలనుకున్నప్పుడు మరింత శ్రద్ధ వహించేవారు. 1945ల నుంచి తెలుగు సినిమా పాటకి ఒక రూపం ఏర్పడింది. సొంత గొంతు సవరించుకుంది. అంత వరకు వచ్చిన నాటకం బాణీలు పక్కకి తప్పుకున్నాయి.

ఆనాటి సమాజంలో మహిళ అంటే ఒక లాంటి భావం పాతుకుపోయి వుండేది. మంచితనం, నమ్రత, కుటుంబ బాధ్యత – వీటన్నిటికీ మూలం దైవ భక్తి అని భావించేవారు. అప్పటి స్త్రీ పాత్రలు భక్తితో దేవుడ్ని ముఖ్యంగా అమ్మవారిని పూజించటం చేస్తున్నట్టు సూచించేవారు.

దైవ భక్తి- పతి భక్తి, దాన్ని ఆనుకుని పాతివ్రత్యం… ఇవే ఆనాటి మహిళ పాత్రలో చూపించేవారు. వారికే కష్టమొచ్చినా, అమ్మవారి ముందు కూర్చుని ప్రార్థించటం ఒక సర్వసాధారణ విషయంగా వుండేది.

అప్పటి సినిమాలు కూడా పౌరాణికాలు – జానపదాలు ఎక్కువగా నిర్మించబడుతూ వుండటం వల్ల, స్త్రీల మీద చిత్రంచే పాటలు భక్తి, కష్టాలలో విషాదం, విరహం, పండగల వాతావరణం ఇలాంటివి ఎక్కవగా వుంటూవుండేవి.

1945 నుండి 1950 మధ్య కాలంలో చక్కని పాటలు స్త్రీల మీద చిత్రీకరింబడ్డాయి.

‘గుణసుందరి కథ’ సినిమాలో గుణసుందరి పతివ్రతల కథలు చదువుతూ, వింటూ పెరుగుతుంది. అందు వల్లనే ఆమె ఉత్తమురాలని కథ చెప్తుంది. ఇందులో కథ షేక్‌స్పియర్ వ్రాసిన కింగ్‌లియిర్ నాటకం ఆధారంగా అల్లుకున్న మన భారతీయ సంప్రదాయం, తెలుగు వారి జీవనం చక్కగా చిత్రించి కథను పట్టుగా నడిపారు శ్రీ కె.వి.రెడ్డి.

ఇందులో ‘ఉపకార గుణాలయవై వున్నావుకదే’ అనే పాట, ‘శ్రీ తులసీ – ప్రియ తులసీ జయమునీయవే’ అనే మరో పాట ఆనాటి మహిళాలోకాన్ని ఉర్రూతలూగించిన మాట నిజం. ప్రతి వారు ఆ పాటలు పేరంటాలలో పాడి, అందరి మొప్పు పొందేవారు. అలాగే శ్రీ తులసీ అయితే ఉదయామే తులసికి దీపం పెట్టి, భక్తితో పాడుకునేవారు. ఈ పాటలు రెండూ పి.లీల పాడారు. ఓగిరాల రామచంద్రరావు బాణీలు కూర్చారు.

భక్తురాలైన స్త్రీ తన భక్తి వలన భర్తని కాపాడుకోవడం అనేది సర్వసాధారణమైన అంశం- థీమ్.

 ‘బాలరాజు’లో ఎస్ వరలక్ష్మీ తన పాతివ్రత్య మహిమ వలన భర్త శాప విమోచనం కలిగించిన విధానం చాలా అద్భుతంగా వుంటుంది.

‘పతి రూపము నీయరయా నా పతి – నా పతి శాపము బాపి – నిజరూపము నీయరయే’ అనే రాగమాలికతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేశారు. ఎస్ వరలక్ష్మి పాడిన ఈ పాటకి గాలి పెంచెల నరసింహారావు బాణీ కూర్చారు.

అప్పట్లో అయితే పౌరాణికాలు, లేక పోతే జానపద కథలు చిత్రాలుగా రూపొందించేవారు. రాజకుమారుల వీరగాథలు – మాంత్రికులు –మంత్రాలు – ఆడవాళ్ళ కష్టాలు, వారి భక్తి వారిని రక్షించిన విధానం చిత్రిస్తూ మంచి మంచి పాటలు అందులో పొందుపరిచేవారు.

కీలుగుర్రం, మాయలమారి, స్వప్నసుందరి, బాలనాగమ్మ లాంటి చిత్రాలు చిత్రించేవారు – వాటిలో ఎక్కువగా యుగళ గీతాలు, భక్తి పాటలు – చిత్రించేవారు.

‘కాదుసుమా! కల కాదుసుమా!’ కీలుగుర్రంలో ఎంతో పాపులర్ – ‘నటనలు తెలుసునులే’ స్వప్న సుందరిలో అందర్నీ ఎంతో అలరించించే.

అయితే ఇవన్నీ మహిళల ఆత్మగౌరవాన్ని, నిజాయితీని కించపరచని విదంగా పాటల రచన, బాణీ కూర్చేవారు. మానవుని ప్రేమించి, ఆమె ప్రేమ కోసం ఇంద్రుడ్ని సహితం ఎదిరించిన వైనం స్త్రీ వ్యక్తిత్వాన్ని చాటి చెప్తుంది.

మన సంప్రదాయంలో స్త్రీలకి ఎంత వరకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చారో అనేది పక్కన పెడితే స్త్రీలను చిత్రించటంలో సినిమాల్లో ఉదాత్త భావాలే ప్రదర్శించేవారు. మంచి స్త్రీలు, గయ్యాళి స్త్రీలు వుండేవారు. అయితే ఎప్పుడోగాని గయ్యాళి స్త్రీలకి పాటలు పెట్టేవారు కాదు.

భర్తని వేధించటం, అత్త మామల్ని ఆదరించకపోవడం, పూజలు అవీ చేయక పోవడం – చెడ్డగా మాట్లాడటం పెట్టి వారు చెడ్డవారని చూపించేవారు. అలా కాకుండా నమ్రత, భక్తి అందర్నీ ప్రేమించటం – గౌరవించటం మంచిగా చూపించేవారు. అలాంటి భావాలతో పాటలు రూపొందించేవారు.

ఒక సినిమా రూపొందించడానికి సారూప్యమైన భావాలు గల నిర్మాత, దర్శకుడు అవసరం – ఇద్దరికి నచ్చిన అంశాలు, అభిప్రాయాలు వున్నప్పుడు ఒక సినిమా నిర్మాణానికి ఒక అర్థం వుంటుంది. సినిమా నిర్మించడానికి లక్షలు, కోట్లు డబ్బు ఎంత అవసరమో, అది తిరిగి వసూలు చేసుకునే ఆశ వుండటమూ అంతే అవసరం – అయితే డబ్బు కోసం సమాజ విలువలు, మానవత్వం – మానవ శ్రేయస్సు పణంగా పెట్టే పద్ధతి మంచిది కాదు.

సినిమాలో ఒక పాటను పెట్టాలంటే, దాని భావం, భాష, సన్నివేశం, నటుల హావభావాలు, చక్కని బాణి, అందంగా పాడగలిగే గాయనీగాయకులు ఇవన్నీ ముఖ్యం. అయినా సన్నివేశం, పాత్ర చిత్రణ మరీ ముఖ్యం. మహిళ మీద పాట చిత్రీకరించాలంటే ముఖ్యంగా కథానాయిక మీద పాట రూపొందించాలంటే దానికి ఎంతో సంస్కారం, కళ పట్ల ఆరాధనా వుండాలి.

1950 మొదట్లో తెలుగు సినిమా పాట మొగ్గ తీసిన మల్లె తీగ పువ్వులుగా వికసించిన కాలం.

కథ ఆధునికమైనట్లే, సినిమా కూడా పౌరాణిక జానపద కథల నుండి సమాజంలోని సాంఘిక జీవితం మీద దృష్టి మళ్ళించింది సినిమా.

స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులు – నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం – లాంటి సమాజ రుగ్మతలు అన్ని వర్గాల వారిని బాధిస్తున్న రోజులు. అందుకే అప్పుడొచ్చిన సినిమా పాట ఆయా అంశాలతో వండేది. ముఖ్యంగా మహిళల ఆధునిక, ఆభ్యుదయ భావాలు ఆనాటి పాటలో ప్రతిఫలించేవి – అల్లరి చిల్లరి పాటలు హీరోయిన్ పాడే పద్ధతి వుండేది కాదు.

చదువుకోవడం అంటే కాలేజీలకి వెళ్ళడం లేకపోయినా, సభ్యత, సంస్కారం నీతి నిజాయితీ వాళ్ళ ఆదర్శాలుగా ఆనాటి మహిళ పాత్రలు చిత్రించేవారు. వాటిని బట్టి పాటలు, చిన్న చమత్కారం వున్నప్పటికీ, అశ్లీలం, అసభ్యం అస్సలు ధ్వనించేది కాదు.

‘దొంగ రాముడు’ చిత్రంలో ‘భలే తాత మన బాపూజీ’ మంటి పాట – అందులో మహాత్మాగాంధీ గురించి పిల్లలకి తెలియజెప్పడం – వారసత్వంగా దేశ భక్తి, మహానాయకుల గురించి భావి తరాలకు చెప్పడం ఇందులో ఉదాత్తంగా వుంటుంది.

జమున మీద చిత్రీకరించిన ‘భలే తాత మన బాపూజీ’ అనే పాట చాలా చక్కగా వుంటుంది. హీరో నాగేశ్వర్రావు చెల్లెలుగా జమున అందంగా ఆదర్శాలుగల యువతిగా కనిపిస్తుంది.

అదే సినిమాలో ‘అందచందాల సొగసరి వాడు’ అనేది సావిత్రి మీద చిత్రీకరించిన చక్కని ప్రేమ గీతం. అలాగే ‘బ్రతుకు తెరువు’ చిత్రంలో తండ్రి ఇచ్చిన ఆసరాతో తన భర్తని తనే ఎంపిక చేసుకునే ప్రయత్నం ‘అందమే ఆనందం’ పాట అద్భుతమన భావ గీతం – ఇది ఘంటసాల పాడటమే కాక పి.లీల కూడా పాడతారు. సావిత్రి మీద అందంగా చిత్రీకరించిన పాట ‘అందమే ఆనందం’. A.V.M (ఎ.వి.యం) తీసిన ‘సంఘం’లో ‘భారత వీర కుమారిని నేనే – నారీరతనము నేనే’ అంటూ వైజయంతీమాల, ఆధునిక యువతి ఆకాంక్షలు – ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంది. పాట రచన ఆధునిక యువతి మనోభావాల్ని చాటి చెప్తూవుంటుంది.

అలాగే దేవదాసు (వినోదా వారి) లో పార్వతి, ‘అర్థాంగి’లో పద్మ తన జీవితంలో ఓడిపోయినా ఆత్మగౌరవాన్ని కోల్పోరు, ఆత్మాభిమానాన్ని జారవిడుచుకోరు.

ఈ రెండు పాత్రలూ స్త్రీల కుండవలసిన ఉదాత్తతను చాటి చెప్తారు. ‘అంతా భ్రాంతి యేనా’ అని మనసు కుమిలిపోయినా, ధైర్యంగా నిలదొక్కుకుంటుంది పార్వతి. దారుణంగా మోసగింపబడినా ‘భర్తని మామూలు మనిషిగా చేసుకోడానికి పద్మ ప్రయత్నిస్తుంది’. వద్దురా కన్నయ్యా అంటూ అతన్ని లాలించి మామూలు మనిషిని చేసేందుకు పూనుకుంటుంది.

 ‘కోడలు దిద్దిన కాపురం’ అనే సినిమాలో పి.సుశీల పాడిన చక్కని పాట వుంది. అది ఉదాత్తమైన భావాలతో వుంటుంది.

నీ ధర్మం – నీ సంఘం

నీ దేశం నువు మరవద్దు –

జాతిని నడిపి, నీతిని నిలిపిన

మహనీయులనే మరువద్దు- అంటూ సాగుతుంది .

ఈ పాట రచనలో ఎంతో దేశభక్తి, విజ్ఞానం, చరిత్ర రచయిత పొందుపరిచారు.

రాముడు, హరిశ్చంద్రుడు – అంటూ పురాణాల ప్రస్తావన మొదటి చరణంలో ప్రస్తావించి – కుందుకూరి – గురజాడ – బ్రహ్మంగారు – వేమన అంటూ మన ఆంధ్రదేశంలోని గొప్పవాళ్ళనందర్ని స్మరించారు. దీని వల్ల ఏమి తెలియని వారికి కూడా విషయ పరిజ్ఞానం ఏర్పడుతుంది.

ఈ పాట మహానటి సావిత్రి మీద చిత్రీకరించటం వల్ల మరీ ఉదాత్తత చేకూరింది. ఆ విధంగా మహిళా పాత్రను, ఆమె భావాలెంత ఆదర్శంగా వుంటాయో దర్శకులు చూపించారు.

అలాగే ‘ఇద్దరు మిత్రులు’ (ANR), ‘అమాయకురాలు’ లాంటి సినిమాల్లో కవితాత్మకమైన పాటలు పొందుపరచారు-

1.పాడ వేల రాధికా

2.పాడెద నీ నామమే గోపాల

‘డాక్టర్ చక్రవర్తి’ (ANR) లో కూడా ‘పాడమని నన్నడగ తగునా పదగురెదుటా పాడనా’- లాంటి పాటల ద్వారా సామాన్యూలకి సైతం కవిత్వం అర్థమయ్యేలా చేశారు..

స్త్రీల మీద అశ్లీలం లేని సరదా పాటలు చిత్రీకరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

సూర్యకాంతం – ఛాయాదేవి –గిరిజ లాంటి వారి మీద హాస్యరస ప్రధానమైన పాటల చిత్రీకరణ అందరికీ ఆహ్లాదం కలిగించింది.

‘చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి’ (భార్యాభర్తలు, ANR కృష్ణకుమారి) రేలంగి- సూర్యకాంతం.

‘ఓ కొంటె బావగారు’ – అప్పుచేసి పప్పుకూడు- గిరిజ – రేలంగి

‘కనకమా-నామాట వినుమా’

భార్యభర్తలుతో రమణారెడ్డి సంధ్య లాంటి వారి మీద పాటలు పెట్టి రాణింప చేశారు.

రానురాను కాలం మారింది. స్త్రీ పాత్రలను దిగజార్చే విధంగా పాటలు చిత్రీకరిస్తున్నారు. చవుకబారు శృంగారం హాస్యానికి ప్రాతిపదిక కావడం వల్ల మహిళల స్థాయి కిందకి జారే విధానం కనిపించటం మొదలైంది.

ఆహార్యం మారిపోయింది. కథలో పాత్ర చిత్రణ మారిపోయింది. సన్నివేశంలో బలం సన్నగిల్లింది. హీరో హీరోయిన్‌లు – ఎక్కడో డ్యూయట్లు పాడుకునే దృశ్యాల మోజు పెరిగింది.

చీర కట్టడం చిన్నతనమైంది. ఆధునికత అనే మాటకి అర్థమే మారిపోయింది.

ఈనాడు సినిమాకి సాహిత్యం, సంగీతం అవసరం లేకుండా పోయాయి. పాట అనే ప్రక్రియ ఒక వికృత రూపం దాల్చి నాట్యం చేస్తోంది.

చవుకబారు శృంగారం – హింస ప్రధానాంశాలుగా మారినప్పుడు అందమైన పాట వచ్చే అవకాశం సన్నగిల్లింది. ఎప్పుడైనా మొరపులా తళుక్కున మంచి పాట వినిపించినా అది ఎక్కువ సేపు నిలబడటం లేదు. ప్రేక్షకుల్లో, శ్రోతల్లో పెను మార్పులొచ్చేశాయి. వారూ సున్నితత్వం లేకుండా సినిమాని ఆహ్వానిస్తున్నారు.

హుందాగావున్న అమ్మాయిని ‘అమ్మమ్మ’ అంటున్నారు. రెచ్చిపోయి కనిపించిన ప్రతి వారినీ దూషిస్తుంటే ఆమె ఆధునిక మహిళ అని భావిస్తున్నారు. సొంత జీవితాల నుంచి దూరంలో వెళ్ళిపోయి, ఊహల్లో విహరించి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

ఇవన్నీ మారాలని అందరం కోరుకుంటాం. కానీ మారేదేప్పుడు? ఎలా? అనే ప్రశ్నలు భయం కొలుపుతున్నాయి. కాలం మారడం సహజం కనుక మంచి వైపుకే మార్పు వస్తుందని ఆశించుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here