మనసులోని మనసా-15

1
4

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజున ఇంటా బయటా కూడ నేరప్రవృత్తి, కక్ష సాధింపులు, పగలూ, ద్వేషాలు హెచ్చుమీరి పోవడం కనిపిస్తుంది. మాట దుడుకులూ, ఆవేశాలూ ఎక్కువయి పోతున్నాయి.

ఇక టి.వి సీరియల్స్‌లోనయితే చెప్పనవసరం లేదు. రాక్షసాకారంలో మేకప్పులు చేసుకుని, తెల్లని పిశాచాల్లా తయారయి ఒకరి మీద మరొకరు ఒకే హాల్లో చేరి చేసుకునే కుట్రలూ, మాటలూ, కళ్ళురిమి చూడటాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇందులో పని చేసేవారికి కేవలం ధనార్జనే కాని, సామాజిక బాధ్యత లేదా? డబ్బుని బట్టి గొప్ప వ్యక్తులమయిపోతామనే భ్రాంతిలో వున్నారా? రేటింగులే ఉత్తమత్వాన్ని నిరూపిస్తుందా? మంచి సీరియల్స్ తీస్తే మంచి ఆదరణ లభిస్తుందని వారెందుకనుకోరో నాకెంతకీ అర్థం కాని విషయం.

ఇక బయట కూడ అందరూ అసహనంగానే ప్రవర్తిస్తున్నారు. నేడు ఏ న్యూస్ ఛానెల్స్ చూసినా హత్యలూ, దోపిడీలు, మానభంగాలు – మనసు చెదరిపోతుంది.

సహజంగా స్త్రీలు సౌమ్యులు. ప్రేమ, దయ జాలి ఆదరణ – కలిపితే స్త్రీమూర్తి తయారవుతుందంటారు.

అలాంటి స్త్రీలు కూడ హత్యలు, నేరాలూ చేయడం వారిని ప్రోత్సహించి వెనుకేసుకొచ్చే వర్గాలు తయారవడం బాధాకరం.

ఎందుకు సంఘం ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో అర్థం కాని విషయం.

నేను చిన్నప్పుడు అనేక ప్రదేశాలు తిరిగేను. కాని నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వూళ్ళు మాత్రం రెండు. ఒకటి మా అమ్మమ్మ గారి వూరు కాకినాడ. రెండవది నాకు ఊహతెలుస్తుండగా అనేక విషయాలు తెలియ జేసింది మాచర్ల. ఈ రెండూ చాలా విరుద్ధమైన ప్రదేశాలు. నాగరికత, విద్య, బ్రిటీష్ డచ్ పరిపాలనలో సుందరంగా తీర్చబడిన నగరం కాకినాడ. అక్కడసలు చిన్న చిన్న తగాదాలూ లాంటివి తప్ప హత్యలూ, దోపిడీలు, గురించి నేను ఎన్నడూ వినలేదు.

ఇక మాచర్ల చాల విరుధ్ధమయిన పల్లెటూరు. ఒకప్పుడు గుంటూరు, తర్వాత కాలంలో ప్రకాశం జిల్లాకి తరలింపబడిన ప్రదేశం.

పాములూ, తేళ్లూ, మండ్రగప్పలూ లాంటి విష జంతువులతో పాటూ కక్షలూ, చంపుకోవడాలూ కూడ చాలా ఎక్కువ.

ఆ వూరిని చూసినప్పుడు మేము చిన్నపిల్లలం. ఇంకా స్కూల్లో చేరలేదు. గుంటూరు నుండి మీటర్‌గేజ్ రైలు ఎక్కి మాచర్లకి బయలుదేరగానే వాతారవణం మారిపోయేది. ప్రయాణికుల ప్రవర్తన భాష, అన్నీ చూసి బిత్తరపోయి ఏడ్చేవాళ్ళం.

కాని… రైలు దిగి మా యింటికి ఎడ్లబండిలో వెడుతున్నప్పుడు ఆ మట్టిరోడ్లు, రోడ్డు కిరవైపులా ఆకాశంలోకి దూసుకుపోయి ఒకదానితో మరొకటిగా అల్లుకుపోయి ఆకుపచ్చని పందిరిలా వున్న వేప, మర్రి, రావి చెట్ల నీడ ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. ఊరిని చుట్టుకుని ప్రవహిస్తున్న చంద్రవంక గలగలలూ, చెన్నకేశవ ఆలయం, దగ్గరలోని ఎత్తిపోతల, నాగర్జున కొండ – ఇవన్నీ మంచి ఆకర్షణలు. మా క్వార్డర్స్ పెద్దవి. మా అమాయికమైన రన్నర్స్, మాకు తెలుగు భాష మీద ఎక్కువ మక్కువ కల్గించిన మాస్టర్లూ… మేము త్వరగానే అక్కడ మానసికంగా కుదురుకున్నాం. రోజూ ఎన్ని పాముల్ని, తేళ్ళని చూసినా వాటి బారిన పడకుండా మూడేళ్ళక్కడ వున్నాం.

కాని… రోజూ ఏదో హత్య గురించి విన్నప్పుడు మాత్రం బిగుసుకు పోయేవాళ్ళం. ఆ చుట్టుపక్కల పల్లెటూర్లలో ఎప్పుడూ హత్యలు జరుగుతూనే వుండేవి. ఇంతకూ వాళ్ళు దాయదులే. అన్నదమ్ముల పిల్లలే అయినా అంతే.

అప్పుడే డాక్టర్ సుగుణగారు మా వూరు ట్రాన్స్‌ఫర్ అయి వచ్చేరు. ఆమె క్రిస్టియన్. గుంటూరు హిందూ కాలేజీలో చదివేటప్పుడు మా నాన్నగారికి డిగ్రీలో క్లాస్‌మేటట. తర్వాత ఆమె మెడిసెన్ చేసేరు. ఆమె ఆ రోజుల్లో ఆఫీసర్స్ క్లబ్ కెళ్ళి, తోటి ఆఫీసర్స్‌తో బాడ్మింటన్ ఆడేవారని అందరూ విచిత్రంగా చెప్పుకునేవారు. నాకు మాత్రం ఆ చిన్న వయసులో ఆమె ఒక హీరోలా అనిపించేవారు. ఇక ఆవిడ మా నాన్నగారి క్లాస్‌మేట్ కాబట్టి నేను ఏ చిన్న దెబ్బతగిలా మా యింటికి దగ్గర్లోనే వున్న ఆస్పత్రికి పరిగెత్తి టింక్చర్ రాయించుకు ఆనక ఆవిడ స్టెత్ తీసుకుని ఆడేదాన్ని. ఆవిడా ఏమనేవారు కాదు.

ఆమె క్వార్టర్స్ హాస్పిటల్ కేంపస్‌లోనే వుండేది.

అంత పెద్ద కాంపౌండ్‌లో ఆమె ఎలా వుంటారో అని ఆశ్చర్యమేసేది. “నీకు భయం వేయదా అత్తా” అని అడిగే దాన్ని. ఎందుకంటే అక్కడే మార్చురీ కూడా వుండేది.

“మాకే భయం, రోజూ శవాల్ని కోస్తాం” అని చెప్పేది ఆవిడ.

అయితే ఆమెకు కూడా భయపడే క్షణాలు, ఇబ్బందులూ వచ్చిపడ్డాయి. చుట్టూ పల్లెటూళ్ళలో జరిగే హత్యల తాలుకు పోస్ట్‌మార్టమ్‌లు తారుమారు చేయాలని, లేని పక్షంలో ఆమెను హత్య చేస్తామన్న బెదరింపులు ఎక్కువయిపోయాయి. ఆమె ఆవివాహిత. ఒంటరిగా వుండేవారు. రాత్రి అయితే ఆ కేంపస్ భయంకరంగా వుండేది. కొన్నాళ్ళు మొండిగా వున్నా ఆమె క్వార్టర్స్ చుట్టూ ప్యాక్షనిస్టులు భయపెడుతూ అరుస్తూ తిరుగుతే ఆమె మా యింటికొచ్చి నాన్నని, అమ్మని కొన్ని రోజులు యింట్లో వుంటానని అడిగారు. ఆమె పరిస్థితి చూసి అమ్మానాన్నా సరేనని మా యింట్లో పక్కగా వున్న రెండు గదులామెకిచ్చేరు.

ఇక మా సంతోషానికి అవధులు లేవు. ఆవిడొచ్చేకా ఆవిడతోనే ఆటలూ, పాటలూ కబుర్లూ.

థర్మామీటరు ఎలా చూడాలో, స్టెతస్కోపులోని లబ్ డబ్ లకి అర్థం ఏమిటో అడగడం – ఇలా సరదాకా గడిచిపోయేది.

అయితే ఆ సరదా ఎన్నాళ్ళు జరగలేదు.

తెల్లవారుతూనే మాయింటి ముందున్న వేప చెట్టు మొదట్లో ఒకరో యిద్దరో కాన్‌స్టేబుల్స్ కూర్చునుండేవారు.

పోలీసులంటే నాకు భయం లేదు.

నేను చిన్ననాటి నుండి మా పెద్దనాన్న, మామయ్య పోలీసాఫీర్సు కావడంతో వాళ్ళని చూస్తూనే, వాళ్ళతో ఆడుతూనే పెరిగాను.

అందుకే పరిగెత్తి వెళ్ళి “ఏంటిక్కడ కూర్చున్నారు?” అనడిగేదాన్ని.

“డాక్టరమ్మ కోసం” అని చెప్పేవారు వాళ్ళు.

“ఎందుకు?” అని మళ్ళీ ప్రశ్న.

వాళ్ళు “పనుందమ్మా” అనేవారు.

“ఏం పని? నీకు వంట్లో బాగా లేదా?” అని మళ్ళీ అడిగేదాన్ని.

వాళ్ళ దగ్గర వెడల్పు సీసాలుండేవి.

“ఏంటవి? మందులా!” అని ఆసక్తిగా చూసేదాన్ని.

“ఎవడో పెళ్ళాం ముక్కు, చెవులూ కోసాడు. పోస్టుమార్టం కోసం వచ్చాం” అనేవారు.

అంతే నా గుండె ఝల్లు!

ఉలిక్కిపడి చూసి “చూపిస్తావా” అని మళ్ళీ వేధించేదాన్ని.

“వాళ్ళొద్దులే పాపా, భయపడతావు” అనేవారు.

నేను వదిలితేనా… చివరికి పీడించి పీడించి చూసేదాన్ని. అలా చేతులూ, కళ్లూ ఏవేవే రోజూ తెస్తుండేవారు.

ఇక దాంతో రాత్రి నిద్రలేదు.

ఎప్పుడూ మా నాన్నా దగ్గర పడుకునే దాన్ని మా అమ్మ దగ్గరకి షిష్టయ్యేదాన్ని. ఆవిణ్ణి గట్టిగా పట్టుకుని వణుకూతుంటే అమ్మకి అర్థమయి “ఏం చూసొచ్చేవు” అనేది కోపంగా…

 “అమ్మా.. అమ్మా.. ” అని అని చూసినవి చెప్పేదాన్ని.

“ఇలాంటి అడ్డమైన వేషాలు వేసొచ్చి ఇప్పుడెందుకు భయం! ఆ హేమ, ఇందిరా వెళ్ళి చూస్తున్నారా? నీకే రోగం!” అని తిట్టేది.

తెల్లవారి మళ్ళీ మామూలే.

చివరికి ధర్మవరం అనే వూళ్ళో ఒక మర్డర్ జరిగింది. వాళ్ళు ఒకర్ని చంపి ఆ నేరాన్ని పక్కవారి మీద పెట్టాలని నరికిన తలని కాంపౌండ్ వాల్ మీద నుండి బాల్‌లా విసురుకుంటూ పోలీసులు ఆ గ్రామం చేరే వరకూ ఆడుకున్నారట.

ఇక ఆ కేసు విషయంలో డాక్టరమ్మ మీద చాలా ఒత్తిడులొచ్చేయి.

అప్పుడు నాన్న, అమ్మ కూర్చుని డా.సుగుణ గారి చేత లాంగ్‌లీవ్ పెట్టించి ఆమె స్వగ్రామం గుంటూరుకి పంపించేసేరు.

ఆవిడ వెళ్ళిపోతుంటే మేమందరం చాలా ఏడ్చేం.

ఆమె రీ పోస్టింగు ఆర్డర్స్ వచ్చేక మళ్ళీ మా యింటికొచ్చేరు. వస్తూనే ఆమ్మకి మంచి చీర, మాకు కొన్ని గిఫ్స్ట్ తెచ్చి నాన్నని, అమ్మని చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పివెళ్లారు.

అలాగే గురజాలలో వున్నప్పడొక ఉదంతం చూశాను.

మా యిల్లూ మేజిస్ట్రేట్ గారిల్లూ కలిసి వున్నట్లుండేవి.

వారింటికి ఒకామె వచ్చేది.

వయసు ముప్ఫయిలోపునే వుంటుంది.

సన్నగా చామనఛాయగా, వహీదా రెహ్మాన్‌లా వుండేది. అలానే ముడి వేసుకుని తెల్లని నేత చీరలు కట్టుకునేది.

ఆవిడ రాగానే నాతో ఆడుతున్న లలిత “రా రా.. ఆవిడ కథ విందువుగాని’ అని అక్కడకి లాక్కుని వెళ్ళేది.

ఆమె పేరు నాగమ్మ. రెడ్డి కులస్తురాలు.

ఆవిడ రాగానే మేజిస్ట్రేట్ గారి భార్య చాప పరిచి “రా… రా…” అని నవ్వుతూ ఆహ్వానించేవారు. ఆమె వచ్చిందని తెలిసి మా అమ్మగారిని కూడా పిలిచేవారు.

మాకు మేజిస్ట్రేట్ గారింటికి ఒక పెరటి గుమ్మం వుండేది. అందులోంచి వెళ్ళేవాళ్ళం.

మేజిస్ట్రేట్ గారు వాలు కుర్చీలో కూర్చునేవారు.

ఆయన శ్రోత్రియ బ్రాహ్మణులు. కాని అన్ని కులాలవారిని వారు ఆప్యాయంగా చూసేవారు.

ఇక నాగమ్మ కథని వీరగాథగా చెప్పించుకునేవారు. ఆమె ఒక హత్యానేరంలో మొదటి ముద్దాయి.

కోర్టుకి వచ్చినప్పుడల్లా ఆమె మేజిస్ట్రేట్ గారింటికి వచ్చేది. అలా మేజిస్ట్రేట్ గారింటికి ఆవిడ రాకూడదేమో చట్టం ప్రకారం కాని… ఆమె వచ్చేవారు.

ఇంతకీ ఆమె కథ ఏమిటంటే గురజాలలో అప్పుడున ఏకైక పర్మినెంట్ సినిమాహాలు ఆమె నాన్నగారిది. ఆయనకు దాయాదులకి వున్న కక్షలతో ఆయన్ని వాళ్ళు చంపేసారు. ఆ చంపిన వాణ్ణి ఇరవై నాలుగ్గంటల్లో చంపి అతని తల సినిమాహాలుకి కడతానని ఈమె ప్రతిజ్ఞ చేసిందట.

అంతే. ఆ పని చేసి ఆ తలని సినిమా హాలుకి వ్రేలాడగట్టిందట.

ఇక ఈమెని చంపాలని వారి ప్రయత్నం – కేసులూ, కోర్టులూ అనేక రకాల వేషాల్లో ఆమె కోర్టుకి వచ్చేదట. దారులు మార్చేదట.

ఒక బండిలో వున్న భ్రమ కలిగించి మరో దాంట్లో టైముకి కోర్టు వరండాలో దూకి హాల్లోకి ప్రవేశించేదట.

మేజిస్ట్రేట్ గారింటికి కూడా బురఖా వేసుకుని వచ్చిందామె.

మేం చిన్నపిల్లలం.

ఆమె కథ ఆశ్చర్యంగా, వింతగా వుండేది.

ఇక మేజిస్ట్రేట్ గారి భార్య “నీ దుంపతెగ! ఇంత పని చేశావా? రేపు నిన్ను చంపెయ్యారా?” అని అడిగేవారు.

ఆమె నవ్వుతూ “చంపుతారమ్మా, నాకు తెలుసు. కానీ మా నాన్నకి మగపిల్లలు లేరు. నేనే మగపిల్లాణ్ణి. కక్ష తీర్చుకోకపోతే ఇక నా జన్మెందుకు?” అంది.

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చి నా వళ్ళు జలదరిస్తుంది. ఇంతకీ యిందులో సాధించేది ఏమీ లేదు!

పగ, ద్వేషం – ఆరని అగ్నిజ్వాలలు!

ఇప్పుడు రాజకీయాలు వాటిని పోషిస్తున్నాయి.

ఆడవారి మాటలు కూడా కఠినంగా, కుటిలంగా మారిపోతున్నాయి. వివక్షలు, స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, స్త్రీకి కోపం తెప్పించడం సహజం!

కాని వాటిని ప్రశ్నించే తీరులో కొందరు స్త్రీలు చాలా దారుణమైన భాష వాడుతున్నారు. అది కొంచెం అభ్యంతరకరమే కదా!

ప్రశ్నించడం, నిలవేయడం అందరి హక్కు!

కాని… అది వయొలెన్స్‌గా మాత్రం తయారు కాకూడదని, భాష విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలని నేను భావిస్తున్నాను.

అందరికీ తెలుసు – ప్రేమతోనే హృదయాలు గెలవొచ్చని! అదే రాజమార్గమని!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here