వెంటాడే “ముక్తి భవన్”

5
3

[box type=’note’ fontsize=’16’] “చిత్రం నిడివి 99 నిముషాలు. అయినా యెక్కడా విసుగు అనిపించదు. ఆలోచింపజేస్తుంది, నవ్విస్తుంది. హాస్యమూ, నాటకీయత కలగలసిన ఈ చిత్రం నాలుగు జాతీయ అవార్డులకు నామినేట్ అయ్యింది, బాగా పేరు తెచ్చుకుంది.” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “ముక్తి భవన్” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

కొన్ని చిత్రాలు హైదరాబాదులో కూడా ఒకటీ అరా హాళ్ళల్లో అలా వచ్చి అలా వెళ్ళి పోతుంటాయి. అలా కొన్ని సినెమాలు మిస్సయిన వాళ్ళకి ఈ నెట్‌ఫ్లిక్స్‌లు, అమేజాన్‌లు చాలా సేవ చేస్తున్నాయి. అప్పట్లో నేను చూడలేక పోయిన వొక చిత్రం “ముక్తి భవన్”. ఇది 2016 లో వచ్చింది.

శుభాషిణి భుతియాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాలుగు జాతీయ అవార్డులకు నామినేట్ అయ్యింది, బాగా పేరు తెచ్చుకుంది. హాస్యమూ, నాటకీయత కలగలసిన ఈ చిత్రంలో లలిత్ బెహెల్, ఆదిల్ హుస్సేన్లు ముఖ్య పాత్రధారులు. ఇంట వో రెండు అవార్డులు సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయంగా యెక్కువే అవార్డులు పొందింది.

77 యేళ్ళ దయా (లలిత్ బెహెల్) భార్యను కోల్పోయి, కొడుకు, కోడలితో వుంటాడు. వొక సంభాషణ మొదట్లో దొర్లుతుంది. దయా భార్య చనిపోయేటప్పుడు ఇంట్లో కొడుకు యెవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ లేదు ఇంకా కాలేదు అంటాడు. ఆ వాక్యం చాలా కథనే చెప్పేస్తుంది. అది బహుశా తల్లి మృత్యువు గురించిన సంభాషణ కావచ్చు. ఇదే కారణమో, లేదా మరేదైనా కారణమో గాని దయా వో తీర్మానం చేసుకుంటాడు. తనకు మృత్యువు దగ్గర పడింది, తను చస్తే వారాణసిలోనే చావాలి అని. కొడుకు తీసుకెళ్తే సరేసరి, లేదంటే తను వొక్కడే వెళ్ళగలనంటాడు. ఇది కొడుకు రాజీవ్ (ఆదిల్ హుస్సేన్) ని కలవరపెడుతుంది. ఆఫీసులో పని వత్తిడి, శలవలు దొరకడం కనాకష్టం, తండ్రిని వొక్కడినే పంపలేడు, ఇంటి బాధ్యత భార్య నెత్తిన పడుతుంది; ఇవన్నీ అతని సమస్యలు. చివరకు తండ్రితో పాటు వారాణాసికి వెళ్ళి అక్కడి ముక్తిభవన్ లో గది తీసుకుంటాడు. అక్కడ ఇలాంటివాళ్ళే వస్తుంటారు. నిబంధన ప్రకారం కేవలం పదిహేను రోజులకు మాత్రమే గది అద్దెకిస్తారు. కాని వ్యవహారంలో పేరు మార్చి కొనసాగనిస్తారు. అక్కడి కెళ్ళాక దయా అక్కడున్న వో వృధ్ధురాలు విమల (నవనింద్ర బెహెల్) తో సన్నిహితమవుతాడు. ఆమె తన భర్తతో ఆ భవనంలోకొచ్చి పద్దెనిమిదేళ్ళు. భర్త పోయినా, తను ప్రతి పక్షమూ పేరు మార్చుకుంటూ అక్కడే కొనసాగుతుంది. కోడలు లత (గీతాంజలి కులకర్ణి) అసహాననంగా అడుగుతుంది ఇంకెన్నాళ్ళు అని. తెల్లమొహం వేస్తాడు కొడుకు, జవాబు లేక. మనవరాలు సునీత (పాలోమి ఘొష్) పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోనంటుంది. అది రాజీవ్ కు కొరుకుడు పడదు, చాలా విషయాల్లో ఆధునికుడైనా కూడా. తాత మాత్రం సమర్థిస్తాడు. వో సినెమా మొత్తం మృత్యువు గురించి తీయాలంటే ఊహించడం కష్టం. కాని ఈ చిత్రం నిడివి 99 నిముషాలు. అయినా యెక్కడా విసుగు అనిపించదు. ఆలోచింపజేస్తుంది, నవ్విస్తుంది, అన్నీ. చావడానికి యెదురు చూస్తున్న జనం అయినా టీవీ సీరియల్ “ఉడన్ ఖటోలా” (ఆకాశంలో యెగిరే తూగుటుయ్యాల) చూడాల్సిందే. జీవితం దారి జీవితానిది, మృత్యువు దారి మృత్యువుది. ఇంట్లో వున్నప్పుడు సన్నిహితంగా లేని తండ్రీ కొడుకులు ఇక్కడ కాస్త సన్నిహితులవుతారు, కాసేపు. గతాన్ని తవ్విపోస్తారు. వ్రాయడం మానేసిన కవిత్వం గురించి తలచుకుంటారు. పదిహేను రోజులు గడిచిపోతాయి. వేరే పేరుతో కొనసాగుతారు. కొడుకు మనసులో ద్వైదీ భావన. తండ్రితో వుండడమా, వూరెళ్ళి తన ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు చూసుకోవడమా. ఇలా చర్చించుకోవడానికి ఈ 99 నిముషాల చిత్రంలో చాలానే వుంది. అన్నీ వొక్కసారిగా చెప్పుకోలేము కూడానూ.

తన ప్రథమ ప్రయత్నంలోనే పాతికేళ్ళ ఈ దర్శకుడు చాలా బాగా తీశాడు. ఇతని నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. ఇక నటన అందరిదీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆదిల్ హుస్సేన్ ది. (ఈ మధ్యే అతని గురించి The violin player సమీక్షలో తలచుకున్నాం. తాజ్దార్ జునైద్ నేపథ్య సంగీతం బాగుంది. మైకెల్ మెక్స్వీని, డేవిడ్ హువిలర్ ల చాయాగ్రహణం చెప్పుకోతగ్గదిగా వుంది. కొన్ని సీన్లు కదులుతున్న కెమెరాతో తీస్తే, కొన్ని మాత్రం వొక చోట అమర్చిన కెమెరాతో తీశాడు : ఆ ఫ్రేం లోపల పాత్రధారులు మాత్రం కదులుతారు. ఇది కాస్త జాగ్రత్తగా చదవాల్సిన స్కీము. మరాఠీ చిత్రం “కోర్టు”లో మొత్తం దాదాపు ఇదే పధ్ధతి. జపనీస్ దర్శకుడు ఒజు కూడా, అయితే అతని షాట్లు దాదాపు నేల లెవెల్ నించీ వుంటాయి. అక్కడ వాళ్ళకు పొట్టికాళ్ళ బల్ల చుట్టూ నేల మీద (బహుశా వజ్రాసనంలో) కూర్చుని భోజనం చేయడం అలవాటు. కాబట్టి ఆ ప్రక్రియ సరిపోయింది. అక్కడ కూడా మిజాన్సెన్ లో పాత్రలు మాత్రం కదులుతుంటారు. మొత్తంగా అన్ని విధాలా ఆకట్టుకునే చిత్రం, సంతృప్తినిచ్చే చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here