[box type=’note’ fontsize=’16’] “భయపెట్టే సినెమా అయితే కాదు గాని ఆత్మల చుట్టూ అల్లినా, దర్శకుని కథనంలో ఊహాబలం, కట్టిపడేసే గుణాలు స్వల్పం” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “టాక్సీవాలా” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
మరో విజయ్ దేవరకొండ చిత్రం. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఈ చిత్రం పైరసీకి గురైనా, సినెమాహాళ్ళలో బాగానే ఆడుతోంది. బహుశా విజయ్ దేవరకొండ గురించి, లేదా కొద్దిపాటి కొత్తదనం వుండడం వల్ల.
అయిదేళ్ళలో డిగ్రీ పూర్తిచేసుకున్న శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాదులో వుంటున్న తన మెకానిక్ స్నేహితుడి (మధునందన్) దగ్గరికి వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేశాక, యేదీ నప్పక/నచ్చక పోవడంతో చివరికి కేబ్ డ్రైవరుగా చేయాలని నిశ్చయించుకుంటాడు. వాళ్ళ అన్నా వదినలు ఆర్థిక సహాయం చేస్తే వో పాత మోడెల్ కారు కొని, దాన్ని రెపేర్ చేసి డ్రైవర్‌గా పని ప్రారంభిస్తాడు. మొడట్లోనే అతని భేటీ తాగి వున్న అమ్మాయి అనూష (ప్రియాంక) తో అవుతుంది. ఆమెను దిగబెట్టే లోపే ఆమె నిద్రపోతే పోలీసు స్టేషన్లో వదిలి వెళ్తాడు. అలా వాళ్ళ మధ్య సినెమా ప్రేమ కలుగుతుంది. యెందుకంటే సినెమా అన్నాక ప్రేమలూ, పాటలూ అవీ వుండాలి కదా! సరే, ఇలా కథ నడుస్తున్న క్రమంలో శివకి తన కారు విచిత్రంగా అనిపిస్తుంది. తలుపు తనంతట తనే మూసుకోవడం, తను నిద్ర మత్తులో జోగుతున్నా కారు తనంతట తనే జాగ్రత్తగా నడవడం వగైరా. అతన్ని అనుక్షణం రక్షించే ఆ కారే వేరే వాళ్ళతో మాత్రం అమానుషంగా ప్రవర్తిస్తుంది. వొక పేసెంజరునైతే రైలుపట్టాల వరకూ తీసుకెళ్ళి విసిరేసి రైలు కింద పడి చచ్చేలా చేస్తుంది. కంగారు పడ్డ శివ ఆ కారును వదిలించుకోవాలని చూస్తాడు, కాని ఆ కారు మాత్రం అతన్ని వదలదు. ఆ కారుకు దయ్యమే పూనిందో, ఆత్మే ఆక్రమించుకుందో కాని తనను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అన్న ధైర్యంతో వుంటాడు శివ. కాని కారు సంగతి తేల్చుకుందామని దాని పాత యజమాని దగ్గరికి వెళ్తాడు, కాని ఆ పెద్దమనిషి వూళ్ళో వుండడు. ఆ కారు వెనుక రహస్యం యేమిటి, ఆ ఆత్మ లేదా దయ్యం కథ యేమిటి ఇవన్నీ తవ్వి తీయాలని నిర్ణయించుకుంటాడు. వో రోజు ఆ కారు పాత యజమాని ఇంటికి తాళం పగలగొట్టి వెళ్తారు కూడా. లోపల బందీగా వున్న వో ప్రొఫెసర్‌ని రక్షిస్తారు. ఇక ఆ ప్రొఫెసర్ ద్వారా కథ తెలుసుతుంది. అతను వో కాలేజీలో సూడో సైన్స్ అధ్యాపకుడు. ఏస్త్రల్ ప్రొజెక్షన్ గురించి వోసారి చెబితే, అతని శిష్యురాలు శిశిర (మాళవికా నాయర్) ఆసక్తి చూపించి, తన మీద ప్రయోగం చేయమని పంతం చేస్తుంది. ఆ ప్రయోగాల తరవాత యేమవుతుందో మిగతా కథ.
సినెమా గురించి మంచి మాటలు వ్రాద్దామంటే పెద్దగా యేమీ కనబడట్లేదు. దర్శకుని కథనంలో ఊహాబలం, కట్టిపడేసే గుణాలు స్వల్పం. అప్పటికీ బానే నటించిన విజయ్ దేవరకొండను అభినందించాల్సిందే. అయితే అతని ఉచ్చారణ ఇప్పటికీ మెరుగు పరచుకోవాల్సిన అవసరం వుంది. యాసలు మిక్స్ చేసి మాట్లాడుతాడు. మిగతా వారి నటన అంతంత మాత్రం. చేయడానికి యెక్కువ లేకపోయినా మాళవిక పర్లేదు. సాంకేతిక అంశాలు కూడా గుర్తుపెట్టుకునేలా లేవు. హాస్యమూ, హారర్ ఈ చిత్రంలో కలపడం విఫల యత్నమే అయ్యింది. మరి ఇదివరకు ప్రేమ కథ, పాటలు, హాస్యమూ, ఆత్మ/దయ్యం వున్న చిత్రాలు రాలేదా? వస్తే అవి గుర్తుండిపోయేలా వున్నాయా లేక ఇలాంటివేనా? నాకు చప్పున గుర్తుకొచ్చే మాస్టర్‌పీస్ “మధుమతి”. తెలుగులో కూడా దెయ్యం, అన్వేషణ, అ ఫిలిం బై అరవింద్, రాత్రి, కేస్ నెంబర్ 666/2013, అనసూయ, అనుకోకుండా వొక రోజు…. ఇవన్నీ చూసిన కొన్నాళ్ళపాటూ గుర్తుందిపోతాయి. మెరుగే.
తెలుగు సినెమాలో సూడో సైన్స్ కొత్త అంశం కాకపోవచ్చు. సినెమాని సినెమాగా తీసుకునేవాళ్ళకు యేమీ కాదు గాని ససెప్టిబల్ ప్రేక్షకుల మనసుల్లో యెలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పలేము. భయపెట్టే సినెమా అయితే కాదు గాని ఆత్మల చుట్టూ అల్లిన కథనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అంటున్నాను. Willing suspension of disbelief అంటారు కదా. స్వేచ్ఛాయుతంగానే అపనమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టినా ప్రేక్షకుడిని అది కథ, కథనాలతో కట్టిపడేయాలి. ఆ పని ఈ చిత్రం చేయదు. సినెమా నిడివిని నింపడానికి ప్రేమ, పాటలు,కాస్త కామెడీ ఇవన్నీ ఇరికించి అసలు కథకు వెళ్ళడమే ఆలస్యంగా వెళ్తాడు దర్శకుడు. హాస్యం కూడా అంత బాగా పండలేదు. ఒకటీ రెండు చోట్ల వెకిలిగా కూడా అనిపిస్తుంది. ఫార్ములా చిత్రాలు తీసి వినోదం పంచిన వారు వున్నారు. ఇది మాత్రం నిరాశే మిగిల్చింది.