[box type=’note’ fontsize=’16’] “వక్తగారి ఉపన్యాసానికి కొన్ని గుండెలు కరిగిపోతే కొన్ని కన్నులు వర్షించాయి” అని చెబుతూ, “తాగినోడి మాట తెల్లారితే సరి!” అంటున్నారు భువనచంద్ర ‘వక్త-3’లో. [/box]
[dropcap]గ్లా[/dropcap]సు ముందరి ముఖాల్లో హుషారు
తాగితే దుఃఖం పరారు
వెన్నెలలో వేదాంతం
వక్తలో వైరాగ్యం.
“సర్వగుణ సంపన్నులే దేవతలు
దయ గలిగి వుండటమే దైవత్వం
మోహంలో పడ్డ మానవుడు
తామసంతో రాక్షసుడవుతున్నాడు.
ఈ మోహం ఒక మాయాతెర.
ప్రేమతో దీన్ని పగలగొట్టుకుంటేనే
పవిత్రుడై పరమాత్ముడవుతాడు.”
“నిజం నిజం” అన్నాయి మందు నోళ్ళు,
చప్పట్లు వర్షించాయి బలిసిన వేళ్ళు.
“అన్యులను ప్రేమించాలి
అనాథలను ఆదరించాలి.
మనిషే మనిషిని చూడకుంటే,
మాధవుడెలా చూస్తాడు?”
‘వహ్వ’ అన్నాడొకడు
‘భేష్’ అన్నాడింకొకడు.
“ఆడదంటే ఎవరూ?
ఆది దేవత!
పది నెలలు మోస్తుంది
పాలిచ్చి పెంచుతుంది.
పాపపు కళ్ళతో చూస్తే
పాతకం చుట్టుకోదూ?
కళ్ళు లేని వారికి కళ్ళు
కాళ్ళు లేని వారికి కాళ్ళు
నీడ లేనివాడికి తోడూ
అన్నీ మనమే కావాలి”
వక్తగారి ఉపన్యాసానికి
కొన్ని గుండెలు కరిగిపోతే
కొన్ని కన్నులు వర్షించాయి
మందులోని మజా
మసాలా వడల్ని మాయం చేస్తే –
అర్ధరాత్రయ్యే సరికి
అన్ని గ్లాసులు ఢీకొన్నాయి.
***
రోజు మారేసరికి రీజనింగూ మారింది
కళ్ళు లేని కబోదిని
కాలిరిగేలా తన్నిన వక్త
అటేపెడుతున్న ఆడదాన్ని
ఆబగా వెంబడించాడు.
నళ్ళనీళ్ళ వేదాంతం
నిషా దిగితే సరి.
తాగినోడి మాట
తెల్లారితే సరి!