అశ్రుభోగ-3

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ కావ్యం.. దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. ‘నష్టోమోహః స్మతిర్లబ్దా’ అన్న దశ లేదు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి’ అనే జగద్గురువు అభయహస్తం కోరుకుంటున్నారు కవి కోవెల సుప్రసన్నాచార్య. [/box]

ఎటు దరియందలేక ప్రవహించుచు పోయేద వార్ధి చేరు టె
ప్పటికిని సాధ్యమౌనొ, తటభావము లెప్డు తొలంగు భూతపుం
బటలము ముందు వేల్ జనుల బాధల తీరులు గుర్తు పట్టనా
చిటుకున మ్రింగు మృత్యువది చెల్లు చీరోరగ దంష్ట్ర బంధమై

ఈ యేడ నిన్నెటుల్ పలువరింతును, కోర్కెలు తల్లడిల్లు ప్రీ
త్యాయతి కాదు కన్ముడుచుటైన వచస్సులు దూరమై చనెన్
ధ్యేయ ఉదారసింహ! గురుదేవ! దయానిధి నీవె దిక్కు నా
రాయిడి తీర్పుమయ్య అఘరాశిని ధ్వంసముచేయుమిచ్చటన్

వయనము సేయు నీ ప్రకృతి వర్గము చిక్కుల చొక్కినాడనో
ప్రియమగు నీదు సన్నిధిని వీడుచు చీకటి చిక్కినాడనో
నయ పథమందు నిల్పి శరణాగత వత్సల చేర్చుకోవె నన్
భయము తొలంగి శ్రీవిభవ భాగమున నడిపింపవే దయన్

ప్రియమానందము దూరమై జననవార్ధిన్ చేరుకొన్నాడనో
నియతాధ్వంబున ప్రాణ పంచకము నిర్ణేయస్థితిన్ నిల్పగా
వియదగ్రంబుగ మేలుకొన్న ప్రభువా! విచ్చేసి నన్నేలవే
జయశ్రీరమ్య దశావతార విభవా! సర్వాప్త నారాయణా!

గరిక కొసన్ హిమాంబువును గాంచిన తెమ్మెర గాలి తాకి త
త్తర పడినట్టివేళ విరిదారుల తావులు ఘ్రాణమేలినన్
పరువడి రూపరేఖ యొక పట్టున లాగుచు డిగ్గజేసినన్
పరువము తన్ను క్రమ్మదొ అభావమునందున నిల్చిపోవగా

అర్థము కోలుపోవు నుడియంగడి స్వార్థమె ఆవరింపదో
స్వార్థము కుంచితంబయి విశాల వియత్తున భీ ప్రచోదితం
బర్థము కామమన్న ఇరు అంచుల వాగయి పారుచుండుటన్
వ్యర్థములౌను రాజ్యరతి యాత్మ విచారము వత్సలత్వమున్

పుట్టువు చావులన్ కొసల పొందున మానస వృత్తిసాగు నా
పట్టున సౌఖ్యలోభమున వాగయి చేడ్పడు ఘర్షణంబులున్
కట్టెదుటన్ కనంబడిన కర్మఫలానుభవంబు తప్పదీ
చెట్టది తేనెపట్టయి విచిత్రత మిశ్ర ఫల ప్రగల్భమై

తొలగని మృత్యువున్ గెలుచు తొందరయేల మృగాంక శేఖరున్
కొలిచిన దేహమేననెడు కుంచిత భావము దూరమై చనున్
విలువలు మారిపోవొ ముఖవిద్యుతి మాటలతీరు వేరుగా
చెలగదొ శేషసాయి దయచేయుము లోని వియత్తలానికిన్

చిత్తంబందున మోహమల్లుకొనినన్ జీవమ్ము శోషిల్లుచున్
మత్తానేకపయానలై మదన సామ్రాజ్య ప్రభారేఖలై
ఉత్తుంగ స్తన ధన్య మోహనలునై ఉల్లాస హాసాస్యలై
వృతోల్లాసత నేల డిగ్గిరొ రసావేశాత్మలై యచ్చరల్

పల్లములెత్తులున్ బురద పట్టులు గుట్టలు కందకంబులున్
పెల్లగు కాననంబులును భీతిని గూర్చెడి కొండదారులున్
లొల్లులు శాంతభూములును లోభము దాతృత లిట్లు నిండుగా
నెల్ల జగంబు బద్ధమగు నెట్లు, దశాకృతి తల్లి చిన్మయీ!

జనితామర్షము చిత్త విచ్యుతము నాశ్చరాగతాలక్ష్యమి
ట్లని చెప్పంగను వీలుకాని యటు విన్యాసంబు సంక్షోభణం
బనయం బీయెడ కాల్చుచున్నయది నిత్యాకార సౌదామనీ
ప్రణవస్వాన వినోద బంధుర రస ప్రహ్లాద వాఙ్మంజరీ

ఒక సంభావ్యము సామరస్యమది సంయోగించి ఈ సృష్టిలో
ప్రకటంబైనది భేద దృష్టిగన నీ భావంబునన్ నిల్వదే
అకృతంబై కృతమైనదెల్ల హృదయాహ్లాదార్చి మండించు నన్
వికృతుంజేసెదవేల తల్లి ప్రియతావేశాన నన్నేలుకో

మన కల్పించిన లోకపుం బరిధులున్ మర్యాదలున్ రూపముల్
మన చిత్తాంబుజ మాధుబిందుచయముల్ మన్నించి పైపైకి చే
రిన హృత్కోశమునందు వెల్గు కనుటే హ్రీంకార సాయుజ్యమౌ
వనటంబెట్టిన భేదదృష్టి గన నీ భావంబునన్ నిల్వదే

చిన్మోదాకృతి తైలధారవలే దుర్‌జ్ఞేయంబునున్ జేరుటే
కన్మూయంగను విప్పుకొన్న జగతిన్ గణ్యాధ్వముం జూచుటే
సన్మాన్యంబగు చిత్తశాంతి మొలకల్ సారంగ విస్మేరతన్
ధన్యత్వస్థితి మన్కి సాగవలె అమౌనంబు వాసంతమై

ఈ విశ్వంబది నీ విలాపమె, చిదగ్నిశాన బ్రహ్మాండముల్
నీ వీక్షావధినేర్పడున్ తొలగు మన్నింపంగదే నన్ను నీ
భావంబందున నా యహంభృతిని తప్పంజేయవే దేవమా
తా విశ్వేశ్వరి మాయత్రోవ పడుటల్ తప్పింపవే ఈశ్వరీ

అంబుధు లంబరం బవని అర్చులు నరుడు నబ్జవైరి సూ
నాంబకు దగ్ని నెచ్చెలియు నన్ని జగన్మయతల్ వికాసిలన్
శంబరవైరి కప్పువడి సర్వజగమ్మిది భ్రాంతచిత్తమై
సంబరమేది దుఃఖముల సంగతి వేంగలినైతి ముగ్ధ నై

రుజయు బుభుక్ష రెండు నవరోహణముం బొనరించు జీవునిన్
యజన తపఃక్రియల్ బ్రతుకుటంచుల నిచ్చెన లెక్కజేయు, నం
బుజమయి జీవయాత్ర ప్రభువొక్కడు విచ్చును రేకురేకులన్
నిజముగ నీవే కావవలె నిండుగ లోకములెల్ల ప్రీతితో

ప్రాణము మొల్కయై పృథివి పట్టును చీల్చుచు పైకి వచ్చినో
ఆ నిముసాన సూర్య కిరణావళి క్రమ్ముచు ఊయలూగెనో
మానవు డేక్షణాన తరుమండలి గొడ్డట కూల్చివేసెనో
ఆ నిముసాన మృత్యుభయ మన్నది ఎల్లెడ లావరించెనే

చెట్టులు పుట్టలై ఇసుక చేరిక వాకలు కీట సంతతుల్
పట్టిన వేటయాటలును వన్య మృగంబులు గ్రామ్య జంతుసం
ఘట్టన మీ బుభుక్ష శిఖి గమ్యత మృత్యుముఖా లవెన్నియో
చెట్టగు భీతి ఈ వివృతి చిత్తము ధీ వికటాట్టహాసమై

తరచిన సూర్య రోచినిరత స్ఫురితుండగు హవ్యవాహు నా
దరమున యాజుషీ వచన తర్పితు జేసి ప్రతిష్ఠు జేసినన్
సురలును మేలుకొండ్రు భువి చొక్కగ జేతురు, నా మనస్సులో
చొరబడరేమి దోషమొ అసూత్కరమేటికి శాంతి పొందదో

పలుకుల మూలముల్ తెలియ పట్టని యప్పుడు గూఢ షడ్జమం
బులు విధి భామినీ చరణ భోగ హిరణ్మయ శింజినీ ధ్వనుల్
పొలుచును బొడ్డుతమ్మిని అభూత ‘పరా’భువన ప్రసారముల్
చెలగిన నాకుజాత పదసిక్త మనోహర కావ్య మాధురుల్

లాలిత సర్వజీవగణలక్షిత మీ తనువే విశిష్టమై
వేల సిరల్ శరీరమున పేరిచి రక్తము పారజేయుచున్
హేళిని గుండె నిల్పెదవు నీవయి యెల్లెడ చిత్ర శిల్పివై
చాలును చాలు నీ బ్రతుకు సంధుల చిక్కుల విప్పజేయవే

హేలగజూచి ఈ ప్రకృతి పిండితముంబొనరించి దివ్యతా
లోలితముంబొనర్పవె, విలోచన పంకజ పత్ర సుందరీ
పోలిక లేని నిన్నెరుగుపొందిక గుండెల తల్పు తీసెదన్
తేలగనిమ్ము నీ జనువు తీరము నీవొక దివ్వెగంబమై

అతి సాహస్రములైన పున్నమలు, దీప్తాదిత్య సంక్రాంతులున్
జతగా చేరిన దారయున్ ప్రజలు, అర్చామూర్తులున్, దేశికుల్
కృత జాప్యస్థితి కర్మజాలములు, చేకొన్నట్టి పుణ్యాఘ సం
తతులున్ దాహము తీర్చలేవు ప్రభు! సంగంబబ్బునో నీ దయన్

అగు నీ దేహము సూక్ష్మరూపమగు బ్రహ్మాండంబు ఈ వింత యం
త్రగమై పొల్చును చావు పుట్టుకలు ధారారీతి క్షున్నిద్రలున్
పగలున్ ప్రేమలు నిత్యవేదనలు సంప్రజ్ఞాతి మూర్ఖత్వముల్
సొగయింపుల్ తొలగింపులున్ నరుడు శపుండో మరిన్ ముక్తుడో

భూతగ్రామము శాంతి బొందుత రసాంభోరాశి యుప్పొంగుతన్
చేతస్సంయమమున్ దయాగుణము వాసింగాంచి ఔదార్య మిం
తై తర్పించుత స్వర్గమిట్లు దిగి చెంతన్ పూచు వాసంతమై
శ్రీతారుణ్యము పండుగావుత శ్రుతి క్షేమాధ్వముల్ చేరువై

సీతానామక యోగ విద్య నుపదేశింపంగ శ్రీ వాయుసం
జాతుండో రఘురాముడో తగుదురెంచన్ దీనికిన్ వేత్తలె
వ్వారల్ సాధన తీర్పజాలుదురు సర్వంబై ధరాజాత నా
చేతోవీధిని నిల్చి గూఢగుహ విచ్చెన్ బ్రహ్మమార్గంబునన్

తీరిక చిత్తవీధి కరుదెంచిన సీతకు జోతవెట్టి సం
తారకమైన రామపదతర్పణ వృత్తి హృదంతరాన వి
స్తారత నంజలించి గురు సంగతి చేతన మేలు కొల్పి నన్
జేరిన పద్యమర్పణము జేసెద నీశ్వర రథ్యసాగెదన్

జయ శ్రీమన్నరసింహదేవ! హృదయస్థానంబునం దేలుకో
జయ శ్రీరాఘవనందినీ, శివకరీ, చక్రేశ్వరీ, భాస్కరీ,
ప్రియ వాగ్వాదిని మాతృకామయి చిదర్చిన్ కొల్వు కల్పింపవే
జయ శ్రీమద్గురుదేవ నీవయితి రక్షా స్వర్ణహంసాకృతీ

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here