[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది రెండవ భాగం. [/box]
అధ్యాయం- 2
[dropcap]అ[/dropcap]ది విశాఖపట్నంలోని బీచ్ వ్యూ కాలనీ లోని ఒక అధునాతనమైన భవనం. దాదాపు రెండెకరాలు విస్తీర్ణంలో నిర్మించబడిన ఆ భవంతిలో సెక్యురిటీ, నౌకర్లూ కాకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు. గేటు దగ్గర నుంచి దాదాపు ఒక అర ఫర్లాంగు దూరంలో ఉన్న ఆ భవనం బయట నుండి చూడడానికి ఒక రాజభవనంలా ఉంది. ఆ భవనం నాలుగు వైపులా వన్ వే సీ త్రూ గ్లాసెస్ అమర్చబడి లోపల ఉన్నవారికి బయటవారు కనపడే సౌకర్యం కలిగిస్తోంది.
ఆ బిల్డింగ్‌కు కొద్దిగా వెనుకగా పెద్ద రాక్ గార్డెన్ దానిని అనుకునే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టబడి ఉంది. ఆ ప్రదేశం నుండి చూస్తే దూరంగా ఉన్న సముద్రం నుండి వచ్చే అలలు కనబడుతూ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ స్విమ్మింగ్ పూల్ లో ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తూ పెద్ద మునక వేసింది బ్లూ కలర్ బికినీలో ఉన్న సుకన్య.
యోగా, ఎక్సర్సైజులు వీటిలో సహజసిద్ధమైన ప్రావీణ్యం కలిగిన ఆమె రెండు నిమిషాలు సేపు నీటిలోనే శబ్దం లేకుండా ఉంది ఆ తరువాత ఊపిరి తీసుకోవడానికి బయటకు వచ్చింది. ఆ స్విమ్మింగ్ పూల్‌ని అనుకునే అత్యంత ఖరీదైన చెక్కతో చెయ్యబడిని వాలు కుర్చీలు ఉన్నాయి. వాటిల్లోని చివరి దాంట్లో బ్రౌన్ కలర్ త్రీ ఫోర్త్ షర్ట్స్, వైట్ మీద ఎల్లో ఫ్లవర్స్ ఉన్న కాటన్ షర్టు, తలపైన తాటాకులతో చేసిన హ్యాట్ ముఖాన నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు నాచిరెడ్డి.
చూసిన వారు ఎవరైనా వారిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట అని అభిప్రాయపడతారు. కానీ నాచిరెడ్డికి సుకన్యకు పెళ్ళయ్యి పన్నెండు సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఇద్దరూ చాలా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. కేంద్రమంత్రిగా ఒకసారి కాబినెట్లో పనిచేసిన నాచిరెడ్డి గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత విశ్రాంతి తీసుకుంటున్నాడు అని కూడా మీడియా గుసగుసలాడడం జగమెరిగిన విషయమే.
దీర్ఘంగా పుస్తక పఠనంలో లీనమైన నాచిరెడ్డి తన పక్కనే రెండవ కుర్చీలో ఉన్న సెల్ ఫోన్ గట్టిగా వైబ్రేట్ అవ్వడంతో ఉలిక్కిపడి చూసి ఆ ఫోన్‌ను కట్ చేసాడు. తరువాత ఒకసారి స్విమ్మింగ్ పూల్‌లో జాలీగా ఈత కొడుతున్న సుకన్య వైపు చూసి విసుక్కుని మళ్ళీ పుస్తకంలో పడ్డాడు. ఈ సారి సెల్ మరింత గట్టిగా వైబ్రేట్ అవ్వడంతో ఒకసారి చేతిలోకి తీసుకుని పుస్తకం అడ్డుగా పెట్టి చూశాడు.
అందులో చరణ్ అనే పేరు కనిపించింది, అది చూడగానే అతని చిరాకు మరింత ఎక్కువై, ఏం చేద్దామా అని ఎదురు చూస్తున్న నాచిరెడ్డి చేతిలో నుండి అమాంతం ఫోన్ తీసుకుంది సుకన్య. ఆమె ఒళ్ళు అంతా అక్కడ పడుతున్న ఎండలో గోధుమరంగు వర్ణంలో అత్యద్భుతంగా గోచరిస్తోంది.
ఫోన్ ఆన్సర్ చేసిన సుకన్య “ఆ చరణ్ చెప్పు. సారీ ఇందాకా మా హస్బెండ్ కట్ చేసారు నేను స్విమ్ చేస్తున్నాను” నాచిరెడ్డి వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండమన్నట్లుగా నోటిపై చూపుడు వేలు ఉంచి సైగ చేసింది. ఆమె వంటి నుంచి కేశాల నుండి ఇంకా ధారలుగా నీరు కారుతూ ఉన్నాయి. ఆమె పక్కనే ఉన్న రెండవ కుర్చీ మీద ఉన్న ఆకాశ నీలం రంగు టర్కీ టవల్ తో తుడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతోంది.
“ఆ యా యా నాకు గుర్తుంది. ఎలా మర్చిపోతాను అస్సలు. ఈవెనింగ్ డెఫినెట్‌గా పార్టీకి వస్తాను. ఆఫ్ కోర్స్ నువ్వు గుర్తుపెట్టుకుని పిలవకపోయినా వచ్చేదాన్నే. అయినా కానీ నాకు షాపింగ్ చేసే ఉద్దేశం ఉంది. అదవ్వగానే డైరెక్ట్‌గా వచ్చేస్తాను డోంట్ వర్రీ” కొద్దిగా ఉత్సాహంగా చెప్పింది సుకన్య. అటుపక్కన ఏం మాట్లాడుతున్నారా అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు నాచిరెడ్డి.
“హుం. అంతేలే ఇంకేంటి కబుర్లు. నేను లాస్ట్ టైం నీకు ఇచ్చిన బుక్ చదివావా” ఆమె ఫోన్లో అలా మాట్లాడుతూనే ఉంది. కాసేపటికి కొద్దిగా ఇబ్బంది పడడం గమనించాడు నాచిరెడ్డి
“నో నో నాట్ పాజిబుల్ చరణ్. నీకు తెలుసు కదా అయన మనలా సోషల్ బటర్ ఫ్లై కాదు. నా పక్కనే ఉన్నారు, ఇవ్వనా” ఆమె నాచిరెడ్డి వైపు చూస్తూ అడిగింది.
కాసేపటికి మళ్ళీ నవ్వుతూ“ పర్లేదులే నేను పెద్దగా ఫీల్ అవ్వను. హా..హా.. కుదిరితే మిడ్ నైట్ షో కి కూడా వెళ్దాం. ఒకే మరి నేను ఉంటాను. కొన్ని పర్సనల్స్ అటెండ్ అవ్వాలి” అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కనే పెట్టి ఆ కుర్చీ మీదే వాలింది. సూర్యుడు డైరెక్ట్ గా కళ్ళ మీద పడకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆమె వంకే చూస్తున్న నాచిరెడ్డిని ఉద్దేశించి ఏమిటి అన్నట్లుగా సైగ చేసింది సుకన్య.
ఏమి లేదన్నట్లుగా భుజాలెగరేసి మళ్ళీ పుస్తకంలో పడ్డాడు నాచిరెడ్డి. మెల్లిగా అతని దగ్గరకు వచ్చి పక్కనే మోకాళ్ళ పైన తల పెట్టుకుని కూర్చుంది సుకన్య. ఆమెను అలా చూడడంతో ఇంక పుస్తకం మీద ధ్యాస కుదరక పక్కన పడేసాడు నాచిరెడ్డి.
“నువ్ చరణ్ వాళ్ళతో ఇలా పదే పదే తిరగడం నాకు ఇష్టం లేదు సుకన్య” వెంటనే విషయంలోకి వస్తూ ఆమెతో అన్నాడు నాచిరెడ్డి.
“మై డియర్ హస్బెండ్, ఎప్పుడూ లేనిది పీక్ సమ్మర్ టైంలో నీకు నా మీద ఒక్కసారిగా అసూయ కలగడం ఏంటో. పైగా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు తరువాత. నేనేమైనా నీకు దూరమైపోతానా” కూర్చున్న చోటనే ఉండి అతని వైపు చూస్తూ అడిగింది సుకన్య. అప్పుడు సమయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయ్యింది. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రెండు పెద్ద గాజు గ్లాస్లలో మాంగో జూస్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది నలభై ఏళ్ళ మెయిడ్ స్టెల్లా.
“ప్రతీదానికీ జోక్స్ కాదు సుకన్య. యు హావ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్ టు మీ. ముఖ్యంగా నీ అవసరం ఎక్కువైన ఈ టైం లో” కొద్దిగా బాధ పడుతూ అన్నాడు నాచిరెడ్డి
“చూడు డార్లింగ్. ఒకరితోడు ఒకరికి అవసరమై ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవదానికీ మనకేమి కొత్తగా పెళ్లి అవ్వలేదు, అంతే కాకుండా మనకిప్పుడు పీకలమీద పడిపోయే కష్టాలు కూడా పెద్దగా ఏమి లేవు కూడాను. అందుకే నీ వృత్తి నుండి నీకు లభించిన ఈ తాత్కాలిక విరామాన్ని పూర్తిగా ఆస్వాదించి అనుభవించు. అంతేకాని నాకు అడ్డు చెప్పకు.” ఈసారి కొద్దిగా కఠినంగా సమాధానం చెప్పింది సుకన్య.
“నాకు నీతో గడపడమే ఇష్టం ఆ టైంలో మనం ఏమీ మాట్లాడుకోకపోయినా పర్వాలేదు. అయినా నాకొకటి అర్ధం కాదు నువ్వు ఎందుకు బేబీని మన నుంచి దూరం చేసావ్. ఈ టైంలో బేబీ మన దగ్గర ఉండకుండా మీ పేరెంట్స్ దగ్గరకి వెళ్లడం అంత అవసరమా. అందరం కలిపి ఇక్కడే ఉండలేమా” బాధ నిండిన స్వరంతో అన్నాడు నాచిరెడ్డి. అతనికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది తమ పదేళ్ళ కూతురు బేబీ.
“ఓహ్ గిమ్మీ ఏ బ్రేక్. తనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా తనే మమ్మీ వాళ్ళ దగ్గరకు వెళ్తాను అంది. ఇందులో నేను పంపడం ఏముంది. అయినా పాప ఉన్నప్పుడు అస్సలు ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా ఆ లైబ్రరీ లోనే ఉంటావ్. ఎవరు ఒచ్చి మాట్లాడినా పెద్దగా రెస్పాండ్ అవ్వవు. ఇంక ఎలా చెప్పు.
ఏదేమైనా నువ్వు చాలా టిపికల్ క్యారెక్టర్ బాస్. మన పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో కూడా నీ గురించి నాకు సగం మాత్రమే తెలుసేమో అనిపిస్తుంది నాకు. అందరికీ అన్నీ నచ్చవ్ అలా అని చెప్పి ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే ఉండలేము కదా నాకు కూడా పెళ్ళికి ముందు నీ పేరు నచ్చలేదు. బట్ ఏం చేస్తాం అడ్జస్ట్ అయ్యాను కదా, ఎక్కువగా ఆలోచించకు డియర్. జస్ట్ లీవ్ ఇట్ ఏజ్ ఇట్ ఈజ్” అని కటువుగా ఉన్నా నిజమైన మాట నిర్మొహమాటంగా చెప్పి చేతులో ఉన్న టవల్ వంటికి చుట్టుకుని భవంతి వైపు నడిచింది సుకన్య. ఆమె వెళ్ళిన వైపు నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాడు నాచిరెడ్డి.
***
నాచిరెడ్డిది గత కేంద్ర ప్రభుత్వంలో ఒక విలక్షణమైన స్థానం. అతి చిన్న వయసులోనే ఎంపి అవ్వడమే కాకుండా కేవలం రెండవ ఎన్నికలోనే మంత్రి పదవి దక్కించుకున్నాడు. గతంలో జరిగిన ఎన్నికల్లో విజయం తరువాత అత్యంత కీలకమైన మంత్రిత్వశాఖ అతనిని వరించింది. అందుకు కారణం ప్రజలలో అతనికున్న గుర్తింపు పలుకుబడి ఒకటైతే, అతను అందుకున్న పట్టాలు యువతరంలో అతనికున్న క్రేజ్ మరొకటి.
ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నాచిరెడ్డి రచయిత కూడా. ఆంగ్లంలో రచనలు చేసే చాలా తక్కువమంది రాజకీయ నాయకులలో అతడు ఒకడు కావడం కూడా అతడి మంత్రి పదవికి దోహదపడింది. ముందుసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన యువతరం అతడి గెలుపుకి పరోక్షంగా కారణం అయ్యింది. ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి నలభై సంవత్సరాల వయసులో ఉన్న వోటర్లను తన వైపుకి తిప్పుకోవడంలో అతను కృతకృత్యుడయ్యాడు. అతడిలోని రచయితను పార్టీ ప్రెసిడెంట్ గుర్తించి ప్రజల స్పందనను బట్టి అతనికి మంత్రిపదవి కట్టబెట్టడం జరిగింది.
సాహిత్యరంగంలో లోతైన విమర్శకుల్లో కూడా నాచిరెడ్డి అభిమానులను సాధించుకోగలిగాడు. కేవలం పోలిటిక్స్, హిస్టరీ గురించే కాకుండా తన సహజసిద్ధమైన ప్రవృత్తిని అనుసరించి ఫిక్షన్‌ను కూడా అలవోకగా రాయగల సిద్ధహస్తుడు నాచిరెడ్డి. అతనిది చాలా విచిత్రమైన స్వభావం, ఎన్ని పార్టీ మీటింగ్లకు, బహిరంగ సభలకు అటెండ్ అయ్యిన తన వ్యక్తిగత జీవితం మీద వాటి ప్రభావం పడకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.
సామాజిక అనుసంధాన వేదికల ద్వారా నిరంతరం ప్రజల్లో నోట్లో నానే నాచిరెడ్డి వాటిని అనుసరించే వారిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అతడు తన భార్య సుకన్యను తన రచనలకు స్పూర్తిగా తీసుకుంటాడు. తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టమైన క్రైం ఫిక్షన్‌లో అతడు రాసిన “నా భార్య స్నేహితుడు” అనే నవల బాగా అమ్ముడుపోవడం ఒక ఎత్తయితే ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలు ఎదురుకోవడం మరొక ఎత్తు.
ఒకరకంగా చెప్పాలంటే తాను మొన్న జరిగిన ఎన్నికలలో పరాజయం పాలవ్వడానికి కొంతవరకు ఇలాంటి పుస్తకాలు కూడా కారణం. ఇవే కాకుండా బొద్దింకలంటే భయం ఉన్న తన భార్యను బొద్దింకను ఉపయోగించి ఒక భర్త ఎలా చంపాడు అనే కధాంశంతో అతను రాసిన “బొద్దింక” అనే పుస్తకం అతడికి తీవ్రమైన తలఒంపులు తీసుకువచ్చింది. ఇదే పుస్తకంలో సూచించిన విధంగా దేశంలో రెండు మూడు ఇలాంటి కేసులు ఆ మధ్యకాలంలో సంచలనం సృష్టించి మీడియాకి మంచి ఆహారాన్ని అందించాయి.
దానితో తన పార్టీలోని మహిళల నుంచి అతను వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇంత జరిగినా కానీ సుకన్య ఎప్పుడూ అతడిని తప్పు పట్టలేదు, అలా అని చెప్పి అతడిని సమర్థించినట్లుగా కూడా కనిపించలేదు. తనదాకా రానంతవరకు ఆమె ఇటువంటివి పెద్దగా పట్టించుకోదు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అతను ఎప్పుడూ తన పంథా మార్చుకోలేదు, నిరంతరం తనదైన ప్రపంచంలో విహరిస్తూ, రచనలు చేస్తూ ప్రజలకు తాను యే విధంగా మంచి చెయ్యవచ్చో వేరే వారి ప్రమేయం లేకుండా తానే నిర్ణయించుకుంటూ ఇంతవరకు ముందుకు సాగాడు.
తాను పరాజయం పాలైనా అతడు ఎప్పుడూ వేరే వారిని విమర్శించిన పాపాన పోలేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం అతని పార్టీ కార్యక్రమాలకీ, మీటింగ్లకు దూరంగా వుంటూ తన వ్యక్తిగత జీవితంలో ఇంతకు మునుపు ఏర్పడిన మనస్పర్ధలను రూపమాపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు సింహాచలంలో ఉంటారు. సుకన్య తండ్రికి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలన్నీ సుకన్య తమ్ముడు తేజా చూస్తూ ఉంటాడు, తేజా నాచిరెడ్డి కలిపి భాగస్వామ్యంగా ఒక షాపింగ్ మాల్ కూడా స్టార్ట్ చేసారు ఆ వ్యవహారాలన్నీ తేజా చూసుకుంటూ ఉంటాడు. అతడు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ ఉంటాడు.
అతడు పెద్దగా సుకన్యతో మాట్లాడడు కానీ నాచిరెడ్డితో అతనికి సంబంధం బానే కుదిరింది. సుకన్య విద్య మొదలైనది అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది. ఆమెకు వ్యాపార విశేషాల్లో పెద్దగా ఆసక్తి లేదు కానీ, ఎక్కువమందిని పరిచయం చేసుకోవడం, నిరంతరం స్నేహితులతో ఉండడం, కొత్త కొత్త ప్రదేశాలకు తిరగడం ఆమెకు ఎక్కువగా ఇష్టం.
పెళ్ళైన కొత్తలో ఇలాంటివన్నిటికీ అతను కూడా ఆసక్తి చూపాడు కానీ ఆమె రానురాను అతడు ఆమె తీరుపట్ల విసుగు చెందడం ప్రారంభించాడు. బేబీ పుట్టిన తరువాత కూడా ఆమె తీరులో పెద్దగా మార్పు రాలేదు. పెంపకం విషయంలో ఏ విధమైన లోటూ చెయ్యకపోయినా ఆమెను చూస్తే ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది బహుశా అది దూరం చేసుకోవడానికేనేమో ఆమె నిరంతరం పరుగులు తీస్తూ ఉంటుంది.
పదవిలో ఉన్న సమయంలో గమనించినా కానీ ఆమెతో మనసు విప్పి ఈ విషయం మాట్లాడడానికి అతనికి సమయం దొరకలేదు, ఇప్పుడు సమయం దొరికినా ఆమె దొరకడం లేదు. ఇదిలా వదిలేస్తే తన బేబీ పైన ఏమైనా ప్రభావం చూపుతుందేమో అని అతని భ్రమ. ఎంత ప్రజల మనిషి ఐనప్పటికీ కూడా తన కుటుంబం పట్ల బాధ్యత చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఎలాగైనా సరే ఆమెతో ఈ విషయం చర్చించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుని దానికి అణువైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
***
“బావా నువ్వొకసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది” అటు నుంచి కొంచెం ఆసక్తిగా వినవచ్చింది తేజా కంఠం. సుకన్య వెళ్ళిన తరువాత స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి తన లైబ్రరీ లోకి వచ్చిన నాచిరెడ్డి తన ఫోన్ రింగవ్వడంతో ఎత్తగా బావమరిది తేజా మాట్లాడాడు.
“ఏమైంది తేజా ఏదైనా ముఖ్యమైన విషయమా” కొంచెం ఉత్సుకతతో అడిగాడు నాచిరెడ్డి. తాను నిర్మించిన షాపింగ్ మాల్ విషయంలో తరచుగా నాచిరెడ్డిని సంప్రదిస్తూ ఉంటాడు తేజా. తనకు ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నప్పటికీ బావమరిది ఉత్సాహాన్ని ఎప్పుడూ కాదనలేదు. పైగా తన తల్లిదండ్రులు ఇద్దరూ తన చిన్నతనంలోనే చనిపోవడం వల్ల సుకన్య కుటుంబమే తన కుటుంబంగా భావిస్తాడు నాచిరెడ్డి.
“ఏం లేదు బావా మన షాపింగ్ మాల్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయ్యింది కదా దానికోసమని ఆనివర్సరి జరుపుదామని ఫిక్స్ అయ్యాం. సో స్టాఫ్ అంతా నిన్ను ఇంకా మన నకుమా గారినీ ఆహ్వానించమని అడుగుతున్నారు. నువ్వు ఎలాగా ప్రస్తుతం బిజీగా ఉండడం లేదు కదా అందుకే వస్తావేమో అడుగుదాం అని” కొద్దిగా ఉత్సాహంగా అడిగాడు తేజా.
“నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తేజా. అందులోనూ ఇప్పుడు నేను పదవిలో లేను కదా మీ ఫ్రెండ్స్ అందరూ నన్ను లైక్ చెయ్యకపోవచ్చు., ఇంక నకుమా గారి విషయం అంటావా. ఆయనకు పెద్దగా ఒంట్లో బాగోడం లేదనే నాకు నిన్ననే తెలిసింది. మరి ఈ టైంలో ఆయాన్ని అడగడం బాగోదని నా అభిప్రాయం. అయినా ఎంతకాలం ఇంకా పదవిలో లేని వారిని పదవిలో లేని వారిని పట్టుకుని వేళ్ళాడడం. గో అండ్ సెర్చ్ ఫర్ సం యంగ్ బ్లడ్” అని చెప్పాడు నాచిరెడ్డి. అతనికి ఎందుకో ఈ సంభాషణ ఒక్కసారిగా ముగిస్తే బాగుండును అని అనిపించింది.
“వాట్. యంగ్ బ్లడా. నువ్వేనా ఆ మాట అంటున్నది బావా. గతంలో నీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది పోలిటిక్స్ లోకి వచ్చారు అనే విషయం మర్చిపోయావా. ఎనీవే నువ్వు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తే బెటర్. ఇంకా టైం ఏమి ఐపోలేదులే. నువ్వు అంతా ఒకే అనుకుని నాకొక వారం రోజులలోపు చెప్తే నేను ఇన్విటేషన్స్ అవీ ఎరేంజ్ చేస్తాను. ఆఫ్కోర్స్ నీకు అవసరం లేదనుకో కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ ఈవెంట్ నీకొక చేంజ్ ఆఫ్ ప్లేస్ లాగ ఉపయోగపడుతుంది. తరువాత నీ ఇష్టం మరి. ఉంటాను” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు తేజా.
అతనికి జీవితం అంతా సడన్‌గా శూన్యం అయిపోయినట్లు అనిపించింది. వృత్తిపరంగా తను ఎప్పుడూ అపజయం పొందలేదు. తన వృత్తికి ఎక్కడ అవినీతి ఉన్నా దానిని సమర్థంగా ఎదుర్కుని ప్రజలందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నాడు. అయినప్పటికీ ఏదో మూల మనసులో అశాంతి. తను కోరుకున్నది ఇదేనా, జీవితంలో తన అంతిమ లక్ష్యం ఏంటి ధనమా, కీర్తి, దైవమా, ఐక్యతా, పురోగామనమా ఏది అనుకున్నా అతడు సంతృప్తి చెందలేదు, తనని తాను సమాధాన పరుచుకోలేకపోయాడు. వృత్తిలో కూడా నిరంకుశుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు, కేంద్రం ప్రతిపాదించే తాత్కాలిక చట్టాలలో అనేకసార్లు అతని సలహాలు తీసుకోవడం జరిగింది.
తాను ఏ పని చేసినా అందులో శ్రద్ధ చూపించాలి అనే వ్యక్తిత్వం అతనికి చిన్న తనంలోనే అలవాటు అయ్యింది. బహుశా అందుకేనేమో ఎంతమంది ఎన్ని విధాలుగా తనపైన పరోక్ష విమర్శలు చేసినా కానీ అతడు ఎప్పుడూ పెద్దగా స్పందించడు, కానీ ఒక్క సుకన్య విషయంలో మాత్రం అతను నిస్సహాయుడు, ఆమెను ఎంతగా ప్రేమించినా కానీ ఆమె గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను అనే బాధ అతనిని నిరంతరం వేధిస్తూనే ఉంది.
గతంలో తను రాసిన పుస్తకాలు వేటి మీదా కూడా అతను ఆమె అభిప్రాయం అడగలేదు, ఆమె కూడా వాటి గురించి అతడిని అడగాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఆనందంగా భార్యభార్తల్లా జీవితం గడుపుతున్న ఒక యాంత్రికజీవులేమో అని అభిప్రాయం చూసేవారికి కలుగుతుంది. ముఖ్యంగా నిత్యం రాబందుల్లా ఆమె వెంటపడే కొన్నికొన్ని మీడియా వర్గాలు ప్రతిపక్షాల సపోర్ట్‌తో వారిద్దరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చెయ్యడం ద్వారా గడచిన ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడంలో కీలకమైన పాత్ర పోషించాయి అని నిఘావర్గాలు వెల్లడించాయి.
ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని ఆలోచించే తీరిక ఎవరికీ లేదు, ప్రజలకు కావల్సింది నిత్యం ఏదో ఒక రకమైన తాజావార్త అంతే. దాని వల్ల తమ జీవితానికి జరిగే మేలు ఏమిటి అని ఆలోచించే తత్వం చాలా తక్కువమందికి ఉంటోంది. దురదృష్టవశాత్తు అలాంటివారు నాచిరెడ్డికి వ్యతిరేకులుగా మారుతున్నారు. దీనికితోడు క్లబ్ నైన్ అనే పేరుగల బహుళజాతి సంస్థ నిర్వహించిన కొన్నిక్రీడా పోటీలలో అవకతవకలు జరిగాయని వాటికి కేటాయించిన నిధులు సుకన్య పేరున తన తమ్ముడు తేజా నడుపుతున్న సంస్థకు బదిలీ చెయ్యబడ్డాయని ఇందుకు నాచిరెడ్డి తన పదవిని దుర్వినియోగం చేసాడని ప్రతిపక్షాలు అప్పట్లో తీవ్రమైన దుమారం లేవదీసాయి.
ఈ కేస్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయవిచారణ స్థాయిలో ఉంది. అయితే ఎన్నికల ముందర తాత్కాలికంగా నిలిపివేయబడిన ఈ కేస్ అప్పటి ప్రభుత్వం కూలిపోయిన తరువాత ప్రస్తత ప్రభుత్వం హయాములో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా అయినా ఆ కేస్‌ను తిరగదోడి నాచిరెడ్డిని భూస్థాపితం చెయ్యాలని ఈ ప్రభుత్వం చూస్తోంది అని కొంతమంది రాజకీయ విమర్శకుల అభిప్రాయం.
***
విశాఖపట్నానికి చేరుకోవడానికి ముందర వచ్చే ఏరియా గాజువాక. గాజువాకలోని ఒక షాపింగ్ మాల్, నిరంతం యువత అరుపులతో గోలలతో ఎంతో సందడిగా ఉంటుంది. ఉదయం పదకొండు గంటలకు మొదలైన సందడి రాత్రి రెండింటి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. అవకాశం ఉంటే ఇరవై నాలుగు గంటలూ వ్యాపారం చేసేవారేమో. ఆ బిల్డింగ్‌లో పది అంతస్తులు ఉంటాయి ఒక్కో అంతస్థులో దాదాపు నలభై ఎభైకి పైగా షాపులు నెలకొని ఉంటాయి. అక్కడ దొరకని వస్తువంటూ లేదు, చివరి ఫ్లోర్లో ఎనిమిది థియేటర్లు కూడా ఉన్నాయి.
అందులో ఎనిమిదవ అంతస్థులో ఒక పుస్తక విక్రయశాలలో నిలుచుని ఏదో ఇంగ్లీషు పుస్తకాన్ని దీర్ఘంగా చదువుతోంది సుకన్య. ఆమెకు తన భర్త లాగే పుస్తకాలంటే చెప్పలేని అభిమానం. ఆమె పుస్తకం చదువుతుంది అన్న మాటేకానీ మొత్తం దృష్టి అంతా ఉదయం నాచిరెడ్డికీ తనుకూ మధ్య జరిగిన సంభాషణ మీదనే ఉంది. ఆమెకు ఎందుకో తన భర్త పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నానేమో అని అనిపించింది. కానీ బయట ప్రపంచం అనుకున్నట్లుగా ఈ రాజకీయ నాయకులను అస్సలు నమ్మలేము, వారి మనసులో ఏముందో కనిపెట్టడం బ్రహ్మ తరం కూడా కాదు.
వారు చెప్పిన మాటలను నమ్మి వారిని అనుకరిస్తే ఫలితం మనం అనుకున్నట్లుగా కాకుండా వారు ఆశించినట్లుగా వస్తుంది. అందుకే సొంతవారైనా వారిని నమ్మడంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. తనకు తన మిత్రులు కొంతమంది చెప్పినట్లుగా రాజకీయ నాయకులు తమను తాము ప్రేమించినట్లుగా తమ తోటివారిని ప్రేమించడం అన్నది కల్లో కూడా జరగని పని. ఆమె తన షాపింగ్ పనులు నిమిత్తం అక్కడకి రావడం సంభవించింది. తనతోపాటుగా వస్తానన్న స్నేహితురాళ్ళు ఇద్దరూ చివరి నిమిషంలో తమ తమ భర్తలకు ఏదో పనిలో సహాయం చెయ్యాల్సిరావడంతో రాలేకపోయారు. అందుకే సుకన్య ఒంటరిగా రావాల్సివచ్చింది.
ఇంతలో తన పుస్తక పఠనాన్ని భంగపరుస్తూ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ మోగింది. ఆమె చరణ్ నెంబర్ చూసి డిస్కనెక్ట్ చేసింది. చరణ్ సుకన్య తండ్రి వాళ్ళ స్నేహితుని కుమారుడు, అతనొక టెన్నిస్ క్రీడాకారుడు, అతనికి నాలుగేళ్ల క్రితం కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. అప్పట్నుంచీ అతను మరలా వివాహం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇలా తనకు తెలిసిన సన్నిహితులతో పరిచయాలు పెంచుకుంటూ గడిపేస్తున్నాడు. ఎందుకో తెలీదు కానీ నాచిరెడ్డికి చరణ్ మీద మంచి అభిప్రాయం లేదు, అతనొక ఉమెనైజర్ అని తనకు తానుగా అనుకున్నాడు నాచిరెడ్డి. అందుకే ఇందాకా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ విధంగా స్పందించాడు.
అంతేకాకుండా ప్రస్తుతం తనమీద నడుస్తున్న కోర్ట్ కేస్ అందులో చరణ్ యొక్క ప్రమేయం కూడా అతడిని చరణ్‌కు వ్యతిరేకంగా తన అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం కలిగించింది. అయినప్పటికీ సుకన్య దృష్టిలో చరణ్ అంతగా భయపడాల్సిన వ్యక్తి కాదు, అందరికీ ఉన్నట్లే అతనికి కూడా స్త్రీలంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అంతే తప్ప అతనేనాడు తనతో అసభ్యంగా ప్రవర్తించలేదు, ఎప్పుడూ తన హద్దులు ఎరిగి ప్రవర్తించే వాడు, అందుకే ఆమె ఇప్పటివరకు అతనితో సంబంధం సాగించగలిగింది.
తన చేతిలోని పుస్తకం బాగా నచ్చడంతో ఇంటికి తీసుకువెళ్లి చదువుదామని అక్కడ కౌంటర్లో డబ్బు చెల్లించి అదే ఫ్లోర్లో పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్ళింది. అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలయ్యింది.మరి కొద్ది సేపట్లో ఆమె ఆ పై ఫ్లోర్లో ఉన్న బ్యూటీ పార్లర్ వైపు వెళ్తూ ఉండగా
“హలో మిసెస్ సుకన్యా వాటే ప్లెజంట్ సర్ప్రైజ్. గతంలో పెద్ద పెద్ద పదవులలో ఉన్న మీలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో తిరగడం ఏంటండీ, ఏ యూకేలోనో యూఎస్లోనో ఉండాలి కానీ” వెనకు నుంచి వినవచ్చిన శబ్దానికి ఆమె అటుగా తిరిగింది. ఆమెను సమీపిస్తూ మళ్ళీ అడిగాడు ఆ వ్యక్తి.
నల్లటి ఫుల్ సూట్ లోపల తెల్లటి షర్టు వేసుకుని హెయిర్‌కి బ్రౌన్ కలర్ జెల్ రాసుకుని ఐదడుగుల ఎనిమిది అంగుళాలు పొడవున్నాడు ఆ వ్యక్తి. అతని కళ్ళు నీలంగా చాలా చిన్నవిగా ఉన్నాయి. అతడి పక్కనే ఇంచుమించు అదే పొడుగున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు. బహుశా అతడి స్నేహితుడై ఉండవచ్చు. అతడు సుకన్యను చూసి వెకిలిగా నవ్వడం ఆమె కంటపడింది.
“మీరు” అర్ధం కానట్లుగా అతడిని ఉద్దేశించి అడిగింది సుకన్య.
“ఎంతమాట మేడం. నిజమే లెండి ప్రపంచం అంతా తెలియడానికి సెలెబ్రిటీ కావడానికీ, నేను కేంద్రమంత్రిని కాను, కనీసం నాకు టెన్నిస్ స్టార్స్ లాంటి స్నేహితులు కూడా లేరు సెల్ఫీస్ దిగి ఫేస్‌బుక్‌లోకి అప్లోడ్ చెయ్యడానికి. అందుకే నా గురించి నేనే పరిచయం చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది. అయినా ఎన్ని వ్యాపారాలు చేస్తే ఏంటి మేడం మీకులాగా పాపులారిటీ మాత్రం సంపాదించలేకపోయాను” అతనున్న మాటలకు పక్కనున్న వ్యక్తి పగలబడి నవ్వాడు.
“మిస్టర్ మీరు కొంచెం ఓవర్‌గా మాట్లాడుతున్నారు అస్సలు మీరెవరు. నాతో మీకు పనేంటి, ఎందుకు ఈ డిస్కషన్ అంతా చేస్తున్నారు” కొద్దిగా కోపంగా అడిగింది సుకన్య.
“కోప్పడి లాభం లేదు మేడం. మీకు ఆ చరణ్ గాడికీ ఉన్న రిలేషన్ ప్రపంచం మొత్తానికి తెలుసు. నా పేరు ప్రతాప్, భవిష్యత్తులో మన ఇద్దరికీ ఒకరి అవసరం ఒకరికి ఉండడం మాత్రం ఖాయం. అందుకే మీరు నాతో గొడవ పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఎంతైనా మనం మనం ఒకటే కోవకు చెందిన వారం కదా” ఆమె వంక చూసి చిలిపిగా నవ్వాడు ప్రతాప్.
చరణ్ పేరు చెప్పగానే ఆమెకు కొద్దిగా అనుమానం కలిగింది. అయినప్పటికీ ఇలాంటి విషయాలు తమకు తెలియని వ్యక్తులతో ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది అని “గో టూ హెల్” అని ప్రతాప్‌తో అని ఆ షాపింగ్ మాల్ నుండి విసవిసా బయటకు వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న ప్రతాప్ “ఏమయ్యా అస్సలు నీకొచ్చిన ఇంఫర్మేషన్ కరెక్టేనా. పైగా స్టింగ్ ఆపరేషన్స్ చెయ్యడంలో సిద్ధహస్తుడవని నీకు నువ్వే అనుకుంటూ ఉంటావు. అందుకే ఫ్రెండ్స్ సజెషన్ మీదట, ముందూ వెనకా ఆలోచించకుండా డాడీ పర్మిషన్ కూడా తీసుకోకుండా నాచిరెడ్డి కేసు మీద కూపీ లాగడానికి నిన్ను హైర్ చేసుకున్నాను” తన పక్కనే ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అడిగాడు ప్రతాప్.
ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న బ్యాక్ ఎండ్ మీడియా అనే సంస్థ యజమాని సుదర్శన్. టీవి చానల్స్‌కూ, వ్యక్తులకూ, రాజకీయ నాయకులకూ అవసరమైన కీలకమైన రహస్య సమాచారం అందించడం ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం.
“ఖచ్చితంగా కరెక్టే గురువుగారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ స్థాయీ క్రీడలలో అవకతవకలు జరిగాయి అన్నది వాస్తవం. అందులో టెన్నిస్ స్పాన్సర్షిప్ తన తమ్ముడి సంస్థకి దక్కే లాగ నాచిరెడ్డి భార్యకు చరణ్‌కు ఉన్న సంబంధాన్ని ఉపయోగించాడు. అంతేకాకుండా ఆ గేమ్స్ తాలూకు ప్రసార హక్కులు తన భార్య సంస్థకి దక్కేలాగా తన పదవిని దుర్వినియోగం చేసాడు. అందుకే ఎలెక్షన్స్ తరువాత నుండీ చరణ్, నాచిరెడ్డి ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదని కూడా మాకూ తెలిసింది” నిశ్చయంగా చెప్పాడు సుదర్శన్.
“ఏమిటో నువ్వు చెప్పినదంతా చాలా అవకతవకగా ఉంది, కనీసం నీకైనా సరిగ్గా అర్ధం అయ్యిందో లేదో నాకు తెలీదు. అదంటావ్ ఇదంటావ్ దేనికైనా ప్రూఫ్ ఉందా అంటే అటూ ఇటూ చూపించి దాటేస్తూ ఉంటావ్. నిన్ను నమ్మి ఏమైనా తప్పు చేసానా అనిపిస్తూ ఉంటుంది” చిరాకుగా అన్నాడు ప్రతాప్
“డోంట్ వర్రీ ప్రతాప్. నువ్వు నన్ను పూర్తిగా నమ్మవచ్చు, అయినా ఈ రోజుల్లో ప్రూఫ్స్ ఎవడికి కావాలి, కేవలం వాదించడం వల్లే చాలా వరకూ సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. అందుకని పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ మనదగ్గర ప్రూఫ్స్ లేకపోయినా పుట్టించడానికి పెద్దగా టైం పట్టదు. అది నిజమో కాదో తేల్చుకునేలోపు మనం సృష్టించిన వాటిని నిజమని నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది సులభంగా రాబట్టుకోవచ్చు.
గత ఎన్నికల్లో నాచిరెడ్డి విషయంలో జరిగినది ఇదే అని నేను మీకు మళ్ళీ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను. అందుకని మీరు మిగతా విషయాలన్నీ నాపైన ఒదిలేసి మీ వ్యాపారం మీరు శ్రద్ధగా చూసుకోండి. మిగిలింది నేను చూసుకుంటాను” హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు సుదర్శన్. ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి నిష్క్రమించాడు ప్రతాప్.
***
“వెల్‌కమ్ సుకన్యా, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.” ఆదరంగా ఆమెకు స్వాగతం చెప్తూ ముందుకు వెళ్ళాడు చరణ్.
బహిరంగ మైదానంలో పండంటి పున్నమి వెన్నెల మధ్య జరుగుతున్న ఆ ఫంక్షన్‌కు ఒకొక్కరిగా అతిథులు రావడం ప్రారంభించారు. చరణ్ టెన్నిస్ ప్లేయర్ అవ్వడం వల్ల అతనికి దేశం మొత్తం మీద అభిమానులు ఉన్నారు, అందుకే అక్కడికి నగరంలోని బిగ్ షాట్స్ పిల్లలందరూ కూడా రావడం జరిగింది.
“అయ్యో, నా బెస్ట్ ఫ్రెండ్ పిలిస్తే రాకుండా ఎలా ఉండగలుగుతాను, అందులోనూ సొంతంగా ఎప్పుడూ ఇటువంటి పార్టీలు ఇవ్వని చరణ్ తన స్నేహితుడి కోసం ఇస్తున్నాడు అంటే నాకు విచిత్రంగా అనిపించింది ఆ స్నేహితుడెవరో ప్రత్యేకమైన వాడే అయ్యుంటాడు ఇంతకీ ఎవరు చరణ్ అతడు” కొద్దిగా కుతూహలంగా అడిగింది సుకన్య. ఎప్పుడు ఆమె ఆ విషయం గురించి అడిగినా అతను సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చాడు.
“తినబోతూ రుచెందుకు సుకన్యా, ఇంతాకాలం ఆగావు కదా ఇంకొంచెం టైం వెయిట్ చెయ్యి నీకే తెలుస్తుంది. బై దీ వే మీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏరి కనపడడం లేదు. నువ్వు ఎక్కువగా వారితోనే తిరుగుతూ ఉంటావు కదా. వారిని తీసుకురాలేదా?” సంభాషణను మళ్ళించడానికి ప్రయత్నిస్తూ అడిగాడు చరణ్.
“నేను వారితో తిరగడం కాదు, వారే నాతో తిరుగుతూ ఉంటారు. వారికి నేను తప్ప వేరే స్నేహితులు లేరనుకుంటాను, అయినా ఆ ఆంటీస్ ఇద్దరూ పెద్ద నస కాండిడేట్స్. అందుకే ఒకోసారి వాళ్ళని కట్ చేస్తూ ఉంటాను. ఈ సారి నా అవసరం లేకుండానే వారంతట వారే ఎదో పని వంక చెప్పి కట్ అయ్యారు” అని ఉత్సాహంగా చెప్పింది సుకన్య.
ఆమె చెప్పిన ఇద్దరిలో, ఒకరు చరణ్ తల్లి సుమిత్ర, ఇంకొకరు సుకన్య దూరపు బంధువు ఛాయాదేవి. ఆమెకు చరణ్‌తో ఎంత మంచి సంబంధం ఉందో అతని తల్లితో కూడా అంతే రకమైన సున్నితమైన సంబంధం ఉంది. ఛాయాదేవి మానవహక్కుల సంఘం చైర్మన్ కూడా. సుకన్య అన్నమాటలకు చిన్నగా నవ్వి ఆమెకు అక్కడకు కొద్దిగా దూరంలో ఉన్న బార్ కౌంటర్ చూపించి అక్కడ నుండి పక్కకు వెళ్ళాడు చరణ్. అతని సొంత ఇంట్లో నిర్వహిస్తున్న ఆ పార్టీలో తన ఇంటి ప్రాంగణంలో ఉన్న మైదానంలో విశాలమైన స్టేజీ ఏర్పాటు చెయ్యబడింది. అక్కడ స్టేజి మీద వాద్య బృందం ఏదో ఇంగ్లీష్ గీతం వినిపిస్తోంది. చరణ్ అటువైపుగా కదిలాడు.
“వాట్ వుడ్ యు లైక్ టు హావ్ మేడం” బార్ కౌంటర్ దగ్గరున్న వ్యక్తి ఆమెను వినయంగా ప్రశ్నించాడు. ఆమె కౌంటర్ వెనకాల ఉన్న షెల్ఫ్ లు అన్నీ ఒక్కసారి గమనించింది
“డు యు హావ్ సం ఓడ్కా” కొంతసేపటి తరువాత అడిగింది
“షూర్ మేడం” అని చెప్పి ఆమెకు ఒక యూనిట్ ఫిక్స్ చేసాడు. ఆమె ఒకే గుక్కతో ఆ యూనిట్‌ను పూర్తిచేసింది. ఆ కౌంటర్లోని వ్యక్తి ఆమె వంక విచిత్రంగా చూసాడు.
“లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్” స్పీకర్లో వినిపించిన చరణ్ స్వరానికి ఆమె అటువైపు తిరిగింది.
“మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆ సందర్భం రానే వచ్చింది” మీట్ ద బర్త్ డే బాయ్ మిస్టర్ ప్రతాప్ హూ ఈజ్ నన్ అదర్ దేన్ ది సన్ అఫ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ భూషణరావు”
***
తానున్న గెస్ట్ హౌస్‌లో అసహనంగా పచార్లు చేస్తోంది ప్రియాంక. అక్కడ గోడకు అమర్చబడి ఉన్న ఏభై అంగుళాల తరకలిగిన టీవీ అలా నిరంతరాయంగా మోగుతూనే ఉంది. ఎందుకో తెలీదు కానీ గత కొన్ని రోజులుగా ఆమె చాలా మానసిక సంఘర్షణకు లోనుకావడం జరుగుతోంది. తన లక్ష్యం ఏంటో తాను సరైన మార్గంలోనే వెళ్తున్నదో లేదో, అసలు ఇప్పటివరకు తాను సాధించినది ఏమిటి అని ఎల్లప్పుడూ తనను తాను ప్రశ్నించుకోవలసిన అవసరం కలుగుతోంది.
దానికి కారణం లేకపోలేదు కొంతకాలం క్రితం రాహుల్ ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. పత్రికలవాళ్ళూ, టీవీ ఛానల్ వాళ్ళు అతడిని వేనోళ్ళ పొగిడారు. అక్షరాల తన తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న వాడని, క్రియాశీలత కార్యనిర్వహణ విషయాల్లో తండ్రికి తగ్గ తనుయుడని కొనియాడారు. అనీ కలిసివచ్చి ప్రజల అండదండలు ఉంటే (అన్నీ కలిసి రావడం అంటే వారి ఉద్దేశం ఏమయ్యి ఉంటుందో ప్రియాంకకు అర్థం కాలేదు) దేశంలోనే గొప్ప నాయకుడు అవుతాడని, దేశానికి కాలవసినది ఆదర్సాలున్న ఉత్తేజభరితమైన స్వభావం కలిగిన ఇటువంటి యువరక్తమేనని దేశం మొత్తం వినిపించేలా ఉద్ఘాటించారు.
ఇదంతా ఒక ఎత్తైతే రాహుల్‌ను విమర్శించిన వారు కూడా ఉన్నారు, ఇదంతా అతను తన స్వలాభం కోసం చేస్తున్నాడని తన తండ్రి ప్రభుత్వానికి సమర్థింపుగా మాత్రమే అతనిలాంటి సభలు నిర్వహిస్తూ ఉంటాడని అతని వాదన. అంతే కాకుండా ఆ సభలో పాల్గొన్న వారులో “గ్రీన్ ఎర్త్” అనే సంస్థ వారు ఉన్నారని, అది రాహుల్ బంధువులకు చెందినా సంస్థని, వారికి భూమి కేటాయించడమే కాకుండా వ్యర్ధ నిర్వహణకు ఒక చట్టం తీసుకు వచ్చి వేల ఎకరాల మాగాణికి నష్టం కలిగించేలా, అతడి తండ్రిని, రాహుల్‌నూ ఆ సంస్థవారు ప్రోత్సహిస్తున్నారని, ఇది ప్రజలకు అంత శ్రేయస్కరమైన పని కాదని కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి.
అయితే ప్రజల్లో కూడా ఈ విషయంలో ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. పార్టీలకూ, రాజకీయాలకూ అతీతంగా అభివృద్ధికి సహకరించేవారు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పుకోవాలి. ఆరోజు జరిగిన సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక నలభయ్యేళ్ళు పైబడిన వ్యక్తి ఎవరితోనో మాట్లాడుతూండడం అనుకోకుండా ఆమె చెవినపడింది
“ఆఁ ఈ రాహుల్ ఉన్నాడే, ఇలాంటి వాళ్ళ గురించి ఎవరికి తెలీదు. వ్యర్థ నిర్వహణ, వైజ్ఞానిక పద్ధతులు, హరిత భూమి అంటూ నాలుగైదు ఎన్నారై పడికట్టు పదాలు వాడేసి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూంటే ప్రజలు నమ్ముతారేంటి?
తన చుట్టాలెవరో తండ్రులూ, తాతలూ సంపాదించిన ఆస్థులతో అమెరికా, ఆస్త్రేలియా, జెర్మనీ లాంటి దేశాల్లో చదువు పేరుతో తిరిగొచ్చి ఉంటారు. వారికి తెలిసీ తెలియని జ్ఞానమంతా ప్రజలమీద రుద్దడానికి ఇలాంటివేవో కొత్తకొత్త సాంకేతిక పదాలతో ప్రజల కనీస అవసరాలకు సంబధంలేని ఇటువంటి వాటిని ప్రతిపాదిస్తూ ఉంటారు.
దానికి రాహుల్ లాంటివారు వత్తాసు పలుకుతూ ఉంటారు. టు మేక్ మనీ వి నీడ్ టు స్పెండ్ మనీ అన్నది ఎంత నిజమో టు స్పెండ్ మనీ ఎట్ లీస్ట్ ఫర్ బేసిక్ ఏమినిటీస్ వీ షుడ్ హావ్ మనీ అన్నది కూడా అంతే నిజం అన్న విషయం ఈ యంగ్ ఇంటెలెక్చువల్స్‌కి ఎప్పుడు అర్థం అవుతుందో. అయినా ఇండియాలోని చెత్తంతా తుడిచెయ్యడానికి ఒక్క చీపురుకట్ట ఎలా సరిపోతుంది. ఇదంతా రాహుల్ తండ్రి పార్టీలోని కాకలు తీరిన ప్రజా నాయకులకు తెలీదా, కొత్త పిల్లకాయి రాహుల్ దగ్గరనుంచి తెలుసుకోవడానికి? ఎన్ననుకుని ఏమి లాభం, మన తలరాత చివరికి వీరిమీదే ఆధారపడి ఉంది.” తన పక్కనున్న వ్యక్తులతో అతను చెప్పడం జరిగింది.
ఇన్షర్ట్ చేసుకుని మాసిన గెడ్డంతో, కంటిచూపు కోసం కొంచెం బలమైన గ్లాస్సెస్ వాడే ఆ వ్యక్తి ప్రస్తుతం భారత దేశం ఎదుర్కుంటున్న నిరాస, నిస్పృహలకు ప్రతీకగా ఆమెకు కనిపించాడు. ఇటువంటి వారిని తను నిత్యం చూస్తూనే ఉంటుంది. వ్యవస్థలోనే ఉంటూ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. పోనీ ప్రత్యామ్నాయం ఏమిటని అడిగితే వారివద్ద సమాధానం ఉండదు, వారికి కావలసింది మాత్రం నిత్యం ఎవరినో ఒకరిని విమర్శించడమే.
నిజం చెప్పాలంటే రాహుల్ చేసేపని చాలామంచిదని ఆమె అభిప్రాయం. అయితే ఆ కార్యక్రమానికి వారు అద్దిన రాజకీయ రంగుల వల్ల అసలు విషయం మరుగున పడిపోయింది అని ఆమెకు అనిపించింది. అందుకే ఇటువంటి రాజకీయాలకు తను అతీతంగా ఉండాలి అని ఆమె నిశ్చయించుకుంది. అవసరమైతే ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థకు తిరగబడడానికి కూడా సిద్ధమే అని ఆమె మనసులో అనుకుంది. తాను ప్రత్యక్షంగా రాహుల్‌కి వ్యతిరేకం కానప్పటికీ ‘నిజంగా’ కనిపించే ఆ వ్యక్తి చెప్పిన వాదనలో బలం లేకపోలేదు. అలాంటివారి అసంతృప్తి సమాజానికి ఒక వైరస్ లాంటిది. దీనిని పరిష్కరించి ప్రజలందరినీ ఒకేబాటలో నడిచేలా అది అభివృద్ధికి దారితీసే బాటలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంది.
సాధారణంగా ఎక్కడైతే డిపెండెన్సీ ఉందో అక్కడ అసంతృప్తికి అవకాశం ఉంటుంది. అటువంటి వారిని గుర్తించి వారి మనోనిబ్బరాన్ని పెంచే విధంగా తోటి మనుషులు సహాయం అందించిన రోజున వారి శక్తి వారికే అర్థం అవుతుంది. నిరంతరం ఇటువంటి ఆలోచనలతో ఆమె అంతరంగం మాధనపడుతూనే ఉంటుంది.
“ఏంటి మేడం. రేపటి నుంచీ ప్రచారానికి వెళ్ళాలేమో అన్నట్లుగా అంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు” సిద్ధూ మాటలు విని ఆమె ఈ లోకంలోకి వచ్చింది.
“హు ప్రచారమా నువ్వు ప్రతీదీ వ్యక్తిగత లాభాపేక్షతో ఆలోచిస్తున్నట్లు ఉంటుంది సిద్ధూ. అసలు నీలాంటి వారు మీడియాకి చాలా బాగా ఉపయోగపడతారు. ఒకపక్క దేశంలో అభద్రతా భావం, పరస్పర వ్యతిరేకతా పెరిగిపోతుంటే పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన మనం ఇలా సమయం వృథా చేసుకోవడం ఏమీ బాగోలేదు” నిరాశగా అన్నది ప్రియాంక. ఆమెతో మాట్లాడితే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్నట్లుగా భావిస్తూ ఉంటాడు సిద్ధార్థ.
“సమయం వృథా చేసుకోవడం కాదు. మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రతీ ఒక్కళ్ళకీ తెలియజెప్పి వాళ్ళు అవలభించేలా చూసుకోవడానికి ప్రచారం అవసరం. అది నిజమైనా కానీ నేనేదో సరదాగా నిన్ను కదిలించడానికి జోక్ చేశానంతే, ఇంతకీ నిన్ను బాధిస్తున్న విషయం ఏంటి” అడిగాడు సిద్ధూ.
ఇంతలో గెస్ట్ హౌస్ లోని నౌకర్ ఇద్దరికీ కాఫీ తీసుకువచ్చాడు. ఒక సిప్ చేసి కప్ పక్కన పెడుతూ అంది ప్రియాంక
“ఇందాక ఒక ప్రోగ్రాం చూసాను సిద్ధూ. అందులో కొంతమంది రాహుల్‌ను టార్గెట్ చెయ్యడానికి చూస్తున్నారు. వారి బంధువులెవరికో జోగేశ్వరరావుగారు ప్రభుత్వం తరఫున భూమి కేటాయించారట. వ్యర్థ నిర్వహణ ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అందులో ప్రభుత్వంతో పాటుగా ఒక బహుళ జాతీయ సంస్థకు భాగస్వామ్యం ఉందట.
ఆ సంస్థకు ఆ భూమి ప్రజలనుంచి జోగేశ్వరరావుగారి ప్రభుత్వం లాక్కుని చాలా తక్కువ ధరకే కట్టబెట్టిందట. ఇలాంటివారిని సపోర్ట్ చెయ్యడానికి రాహుల్ ఈ బహిరంగ సభలూ, షార్ట్ ఫిల్ములు వంటి వాటిద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడట. అసలు ఇదంతా నిజమేనంటావా. ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి దౌర్జన్యంగా లాక్కుంటుందా. ఒక వ్యక్తి కనీస అవసరాల్లో భూమి ఎంతవరకూ పాత్ర పోషిస్తుంది” ఆమె అడిగిన ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలా అని ఎదురుచూస్తున్నాడు సిద్ధార్థ.
“నీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లిమిటెడ్ గానే ఉంది. అందులోనూ ఇలాంటి ప్రశ్నలు కూర్చుని మాట్లాడుకునేవి కాదు. భూ అవసరాల గురించి తెలుసుకోవాలంటే మనం సమగ్రంగా అన్వేషణ సాగించాల్సి ఉంటుంది. పూర్తిగా అవగాహన లేనిదే మనం ఏ సమస్యా అంత సులభంగా పరిష్కరించలేము. ఇంతకీ నువ్వింత బలంగా రాహుల్ గురించి ఆలోచించడానికి కారణం ఏంటి. డూ యు హావ్ సం కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్” చిన్నగా నవ్వుతూ అడిగాడు సిద్ధూ.
అతని భావాన్ని అర్ధం చేసుకున్న ప్రియాంక “హహ అలాంటిదేమీ లేదు. రాహుల్ తండ్రి జోగేశ్వరరావుగారు గతంలో మా డాడీ వాళ్ళ పార్టీలోనే ఉండేవారు కదా. అప్పట్లో ఏర్పడిన పరిచయం అంతేకానీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ లేదు. జస్ట్ ప్రొఫెషనల్ క్యూరియాసిటీ. మిగిలినదంతా నీ ఊహకే వదిలేస్తున్నాను”ఆమె కూడా చలాకీగానే సమాధానం చెప్పింది.
“ప్రొఫెషనల్ క్యూరియాసిటీనా అలాంటిదేమైనా ఉంటె మీ డాడ్‌కు వాళ్ళ డాడ్ మీద ఉండాలి కాని నీకు వాళ్ళ అబ్బాయి మీద ఉండకూడదమ్మా. ఒకవేళ ఉంటే దాన్ని ఇంకొకటి అంటారు” కొద్దిగా గంభీరంగా ముఖం పెట్టి చెప్పాడు సిద్ధార్థ.
“ఇంకోటా? ఏంటది?” ఆశ్చర్యంగా అడిగింది.
“అదేంటనేది నేను కూడా నీ ఊహకే వదిలేస్తున్నాను” ఆమెకు దగ్గరగా వచ్చి చెవిలో చెప్పాడు. ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకున్నారు.
(సశేషం)