‘మనోల్ల ముంబయి కతలు’ – పుస్తక పరిచయం

0
7

[dropcap]అం[/dropcap]బల్ల జనార్ధన్ వ్రాసిన 56 కథల సంపుటి ‘మనోల్ల ముంబయి కతలు’. ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే.

***

“ఈ కథలన్నీ గూడా వైవిధ్యభరితమైన వస్తు శిల్పంతో, ఆకర్షణీయమైన శీర్షికలతో, అభిరుచిని పెంపొందించి, ఆలోచనలు రేకెత్తించే విధంగా పాఠకులముందు నిలిచి, సవాలక్ష ఆలోచన రేకెత్తించే విధంగా పాఠకుల ముందు నిలిచి, సవాలక్ష ప్రశ్నలకు సముచితమైన సమాధానాలనిచ్చి రచయిత రచనా పరిపుష్టతను చాటుతున్నాయి. సామాన్య జన జీవితంలో జరిగే అతి చిన్న సంఘటనలే సన్నివేశాలే రసరమ్యమైన కథారూపకంగా మలచబడ్డాయి. ప్రతి కథలో ఏదో ఒక నీతి, కొసమెరుపు, ఊపు, లౌక్యం, హేతుబద్ధత, సర్దుబాటు సేవాభావం, ఆర్ద్రత, ప్రేమాప్యాయతలు, శ్రమ సౌందర్యం, పొదుపుమంత్రం, బడుగు బలహీనవర్గాల బతుకువేదనలు, ఆవేదనలు, నివేదనలు, సభ్వతాసంస్కృతులు, నాగరికతా పోకడలు, సంస్కారం, సంస్కరణలు, కండ్లకు కట్టినట్లు అందించడంలో జనార్ధన్ గారు కృతకృత్యులయ్యారు.

ప్రవాస తెలంగాణీయుదైనప్పటికీ రచయిత చాలా చోట్లలో తెలంగాణ మాండలికాన్ని ముంబై యాసలో సహజరీతిలో, ముచ్చట గొలిపే పద్ధతిలో పొందుపరిచారు. హృద్యమైన ఆ భాషను, యాసను పాఠకులు, తడిమి తడిమి చదువుకోవలసిన ఆగత్య మేర్పడుతుంది.

జనార్ధన్ గారు తమ భావాలను తొలిచి, కథగా మలిచి, పాత్రల ద్వారా అందించిన ప్రతి మాటలో, వాక్యంలో, హావభావాలలో, అర్థం పరమార్థం, అన్నీ తానై మనకు దర్శనమిస్తారు. సుకుమారమైన, సున్నితమైన వారి భావ వ్యక్తీకరణలో కథకుడిగా ఉన్నతమైన వారి వ్యక్తిత్వం అదృశ్య, సదృశ్యగతిగా మనకు గోచరిస్తుంది” అని వ్యాఖ్యానించారు డా. సరోజన బండ “ఉద్యమిస్తున్న సాహితీ కిరణం – అంబల్ల జనార్ధన్” అనే ముందుమాటలో.

***

“కథకుడంటే అన్వేషి, మానవ జీవితాలపట్ల జిజ్ఞాస కలిగినవాడు, క్రాంతదర్శి, మార్గదర్శి కూడా. పై గుణాలన్నీ వున్న కథకుడు అంబల్ల జనార్ధన్. ఆయన కథల్లోని అక్షరాలలో ప్రవహించే శ్రమైక జీవుల అనుభవాలు, అనుభూతులు వారికి జరిగే అన్యాయాలు, జీవిక కోసం చేసే పోరాటాలు చదువరిని మరో లోకంలోకి తీసుకు వెళ్తాయి. ముంబయి జన జీవనంలో మమేకమై ఎందరి జీవితాలనో, జరిగిన సంఘటనలలో ప్రత్యక్షంగా చూసి, అనుభవించి విషయపరిజ్ఞానం పెంచుకొని తనకు తెలిసిన విషయాలను, పరిచయమైన మనుషుల గురించి మాత్రమే అంబల్ల జనార్ధన్ కథలుగా మలిచారు.

కళ్ళముందు ఎన్నో జరుగుతుంటాయి, ఐతే అందులోని కథలను వెతికిపట్టుకునేవాడు కథకుడు. అటువంటి ప్రతిభ కలవాడే అంబల్ల” అన్నారు సి.హెచ్.శివరామ ప్రసాద్ తమ “నాలుగు మాటలు”లో.

***

“ముంబయి ఒక విశిష్ఠ నగరం. నన్ను అక్కున చేర్చుకొని తీర్చిదిద్దిన కామధేనువు. నాలాంటి కొన్ని లక్షలమందికి అండగా నిలబడ్డ కొండ, కష్టజీవులకు నేనున్నాని భరోస యిచ్చే ఛత్రఛాయ. ఈ నగరం గురించి ఎన్ని కథలు వ్రాసినా దీని సమగ్ర చిత్రణ సాధ్యం కాదు. నాకు తెలిసిన, నేను చూసిన, నేను అనుభవించిన సంఘటనలకు కథారూపం ఇచ్చి ముంబయి గురించి, తెలియని కొన్ని కోణాలను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేసాను. ఈ కథానికలను చదివి పాఠకులు తమ స్పందనలను నిర్మోహమాటంగా తెలియజేయాలని కోరుతున్నాను” అన్నారు అంబల్ల జనార్ధన్ “ముంబయి ముచ్చట్లు”లో.

***

మనోల్ల ముంబయి కతలు

రచన: అంబల్ల జనార్ధన్

ప్రచురణ: జనంబ ప్రచురణలు

పుటలు: 337, వెల: రూ.300/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, రచయిత

Amballa Janardhan

B-204, Dheeraj Kiran CHS Ltd., Near Infant Jesus School & Dalmia College, Chicholi Bunder Road, Malad (W), Mumbai – 400 064. Phone: 99875 33225

ఈబుక్ కినిగెలో లభ్యం.

http://kinige.com/book/Manolla+Mumbayi+Katalu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here