భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 18: మోర్తోట

0
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 18” వ్యాసంలో మోర్తోట లోని శ్రీ ముక్తేశ్వరాలయం ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఊ[/dropcap]రూ వాడా లేని ఒక ప్రదేశంలో కారు ఆగింది. ఏమైందా అనుకుంటూ దిగాము. అదే మోర్తోట శ్రీ ముక్తేశ్వరాలయం. ఇంత చిన్న ఆలయానికి కూడా ఇంత దూరంనుంచి రావాలా.. టైము వేస్టు చేస్తున్నామా అని మనసులో ఒక చిన్న పెనుభాతం.. అదేనండీ అనుమానం తొలిచేస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఎక్కడ ఏ అద్భుతం వుందో అనుకుంటూ పక్కన వున్న ఆలయానికి వెళ్ళామా… ఆలయాలంటే ఇలా వుండాలి అనుకున్నాము.

శ్రీ ముక్తేశ్వరాలయం చిన్నదే అయినా పురాతనమైనది. పైగా ముందు కృష్ణవేణీ నదీమతల్లి సొగసులతో మరింత సుందరంగా వుంది. ఆలయాన్ని ఆనుకుని పారుతున్నది ఆ నదీమతల్లి. ప్రశాంతమయిన వాతావరణం. ఆలయ ప్రాంగణం పవిత్రత. ఆ సోయగాలు వర్ణించటానికి నా మాటలు సరిపోవటంలేదు.

అన్నట్లు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. ఎక్కడైతే తీర్థం, క్షేత్రం రెండూ ఒక చోట వుంటాయో ఆ ప్రదేశం కాశీతో సమానం. అందుకే కృష్ణమ్మ తల్లి, పరమ శివుడు కొలువైన ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులో వున్న ఈ క్షేత్రం అసలు పేరు మునుల తోటట. అంటే మునులు వుండే తోట. ఆ కాలంలో చాలామంది మునులు ఇక్కడ తపస్సు చేసుకునేవారుట. కాలక్రమేణా మునుల తోట కాస్తా మోర్తోట అయింది.

ఈ క్షేత్రం బంగాళాఖాతానికి సమీపంలో వుండటంతో బేక్ వాటర్ కూడా వుంటుంది. అందుకే ఆలయం ముందు ఎప్పుడూ నీరు వుంటుంది. అంతేకాదు హ్యుమిడిటీ కూడా వుంటుంది.

ఈ ఆలయం చేరుకోవటానికి రేపల్లెనుంచి గంగడిపాలెం బస్‌లో రావచ్చు. లేకపోతే రేపల్లెనుంచే సర్వీస్ ఆటో, మామూలు ఆటోలు సమీపంలో వున్న చిన్న వంతెన దాకా వస్తాయి. ఆ వంతెన చాలా సన్నగా వుండటంతో అక్కడ దిగి నడిచి రావాలి. దగ్గరే. సొంత వాహనాలవారు ఆలయందాకా వాహనంలో వెళ్ళవచ్చు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. నుంచి 12 గం. ల దాకా సాయంత్రం 5 గం. లనుంచీ 8 గంటలదాకా.

కార్తీక మాసంలో, పరవడి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి వస్తారు. ఏదో గుడికి వెళ్ళి అర్చన చేయించి వచ్చేసే ఆలయం కాదు ఇది. ప్రతివారూ స్వామి దర్శనం తర్వాత పరిసరాల సౌందర్యాస్వాదనలో తప్పక సమయం గడిపేటంత అందమైన ప్రదేశం. అటువైపు వెళ్తే తప్పక చూడండి.

మధ్యాహ్నం 12-30 అయింది. ఇప్పుడు మోపిదేవి అన్నారు. మోపిదేవి కృష్ణా జిల్లా, పైగా చూశాము. ప్రస్తుతం మన పర్యటన గుంటూరు జిల్లాలోనే కదా అన్నాను. మోపిదేవి అక్కడికి చాలా దగ్గర. అందరు రాముళ్ళని చూస్తే సరిపోదు.. ఆత్మారాముడి సంగతి కూడా చూడాలికదా. అన్నీ చిన్న ఊళ్ళు కనుక ఎక్కడబడితే అక్కడ భోజనాలు దొరకవు సిటీలోలాగా. మోపిదేవిలో బ్రాహ్మణ సత్రంలో ముందే ఫోన్ చేసి చెప్పారు భోజనానికి వస్తామని. అందుకే మోపిదేవి దోవపట్టాము.

పులిగడ్డ వారధి (మండలి కృష్ణారావు వారధి) మీదనుంచి వెళ్ళాము. ఈ పులిగడ్డ అనే పేరు వింటే చాలు నా మనసంతా సంతోషంతో నిండి పోతుంది. మరి మా నాన్నగారి ఇంటిపేరు పులిగడ్డే. ఆ పేరు మీద ఇష్టంతో పెళ్ళయినా ఇంటి పేరు మార్చుకోలేదు.

పులిగడ్డ వారధి సగం కృష్ణా జిల్లాలో, సగం గుంటూరు జిల్లాలో వుంటుంది. కృష్ణా నది మూడు పాయలు మీద కట్టబడ్డది ఈ వారధి. తర్వాత ఇంకో వంతెన వస్తుంది. అది కృష్ణా జిల్లాలో పొలాలకి నీళ్ళిచ్చే కాలువమీద కట్టబడింది.

మోపిదేవి ఎటూ వెళ్ళాంకదా అని ముందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నాము. భక్త జన సందోహం చాలా ఎక్కువగా వుండటంతో దర్శనానికి కొంత సమయం పట్టింది. దర్శనమయిన తర్వాత సమీపంలో వున్న శ్రీ లలితా త్రిపురసుందరి బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్టులో భోజనానికి వెళ్లాము. అక్కడవున్న శ్రీమతి శ్యామలగారు అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించి కబుర్లు చెబుతూ భోజనం పెట్టించారు. తర్వాత 3-50కి కూచినపూడికని బయల్దేరాముగానీ దోవలో రేపల్లెనుంచి 7 కి.మీ. ల దూరంలో వున్న అడవులదీవి మార్గం పట్టాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here