రైటర్స్ బ్లాక్

1
3

[box type=’note’ fontsize=’16’] “రైటర్స్ బ్లాక్ కన్నా ఇబ్బందికరమైనవీ, ప్రమాదకరమైన బ్లాక్స్ వేరేవి మన సమాజంలో చాలా ఉన్నాయి” అంటున్నారు కొల్లూరి సోమ శంకర్ ఈ రచనలో. [/box]

[dropcap]ఏం[/dropcap] రాయాలో అర్థం కావడం లేదు. ఏమీ తోచడం లేదు. కాలమ్ సబ్మిట్ చేయాల్సిన టైమ్ దగ్గర పడుతోంది. బుర్ర పనిచేయడం లేదు. ఎఫ్.ఎం. ఆన్ చేశాను,

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయి

ఓటమి తప్పలేదు భాయి

మరి నువు‌ చెప్పలేదు భాయి

అది నా తప్పుగాదు భాయి

మరి నువ్వు చెప్పలేదు భాయి..” అని చరణం వినబడింది.

ఇంతలో సెల్ మోగింది. ఓ రచయిత మిత్రుడు.

ఏదో సమావేశం ఉంది వస్తావా అని అడిగాడు. నేను నా పరిస్థితిని వివరించి రాలేనన్నాను.

“ఓ.. రైటర్స్ బ్లాకా? గట్టిగా ప్రయత్నించు… ఏదో ఒకటి తడుతుంది…” అని ఫోన్ పెట్టేశాడు.

ఇప్పటిదాక ఆ పదం వినడమే గానీ, అనుభవంలోకి రాలేదు.

***

ఇంతలో నా మిత్రుడొకరు ఇంటికి రావడంలో నా ఆలోచనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

టీ తాగుతూ, మాటల మధ్యలో “ఏమైనా కొత్తగా అనువాదాలు చేశావా ఈ మధ్య?” అడిగాడు.

తల అడ్డంగా ఊపాను.

“సొంత కథ ఏదైనా…”

“ప్లాట్స్ ఉన్నాయి… కానీ కథ కీబోర్డుకెక్కడం లేదు”

“ఎందుకలా….”

“ఏమో…?”

“ఏం రాయాలో తెలియక కాదు ఎలా రాయాలో తెలియక… రచన ముందుకు సాగడం లేదు కదా!”

నేను మౌనంగా ఉండిపోయాను.

“పోనీ లైట్ రీడింగ్ ఫీచర్స్ రాస్తావుగా…

“ఏమో… నేను రాయదలచిన టాపిక్ మీద అప్పటికే ఎవరో ఒకరు రాసేస్తున్నారనిపిస్తుంది…” చెప్పాను.

“నడక గురించి రాశావు, ప్రకటనలు గురించి రాశావు, పాటల గురించి రాశావు, టీ గురించి రాశావు… ఇంకేం రాస్తావు? అని అడిగాడు నా మిత్రుడు.

“అదే తెలీయడంలా…” అన్నాను

“పోనీ ఈ సారి కాఫీ గురించి రాయి…” అన్నాడు.

నేను మావాడి కేసి గుర్రుగా చూశాను.

“పోనీ సమోసా గురించో, ఉస్మానియా బిస్కట్ గురించో….” అంటూ నాకేసి చూసి మధ్యలో ఆపేశాడు.

నేను రెండు చేతులతో నుదురు నొక్కుకోసాగాను.

“ఓహ్ తలనొప్పా! పోనీ దీనిమీద రాసేయ్…”

“ఒరే నాయనా… వీటన్నింటి మీద చాలామందే రాసేశార్రా బాబూ” అన్నాను విసుగ్గా.

“అయితే నీకు కొత్త ఐడియాలు కావాలన్నమాట. మన కాలనీలో మొన్నటి దాకా ఎన్నికల ప్రచారం జరిగింది కదా! అభ్యర్థుల వాగ్దానాలు గుర్తు చేసుకో, వాళ్ళు పంచిన పాంప్లెట్లు చదువు. ఏవైనా ఐడియాలు తట్టచ్చు” అన్నాడు.

‘అవును నిజమే’ అని మనసులో అనిపించింది.

“లేదా హనుమంతుడి గురించి ఈమధ్య నలుగురు నేతలు ఒక్కో రకంగా చెప్పారు. ఆ నాలిగింటిని పరిశోధించి, అందులో ఏది వాస్తవమో తేల్చుతూ ఓ వ్యాసం రాయచ్చు లేదా మరో కొత్త సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించచ్చు.”

“ఇంకోలా కూడా చెయ్యచ్చు… క భాష లో లేదా జ భాషలో గాని రాసేసుకోవచ్చు.. అదేదో స్రవంతి అంటారే… దాన్ని కూడా ట్రై చెయ్యచ్చు…” అన్నాడు.

“చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాయడం అందరికీ సాధ్యం కాదురా. మనకు చేతకానిదానిలో మనం తల దూర్చకూడదు” అన్నాను.

“పోనీ ఓపిక చేసుకుని యూట్యూబ్‍లో ఉన్న రకరకాల ఛానెల్స్‌లో ఎవడికి తోచినట్టు వారు వండి వడ్డించే వార్తల విశేషాల గురించి ఓ సంచలనాత్మక విమర్శనాత్మక సమీక్షాత్మక వ్యాసాత్మక కథనం రాసి పారేయ్.”

“నీకో దండం రా బాబూ… నన్నొదిలెయ్” అన్నాను.

” ‘అసలిది రెండు వందల కోట్లతో తీయాల్సిన సినిమా, కాని డబ్బుల్లేక కోటిన్నరలో ముగించాం’ అని ఓ డైరక్టరు చెప్పుకున్నట్టు… ఏదేదో రాసి నాది జ్ఞానపీఠ రేంజ్ అనేలా చాటింపు వేసుకో.”

మావాడి సలహాలకు నాకు చిరాకు మొదలైంది.

“లేదూ పలికేందుకు కష్టంగా ఉండే పదప్రయోగాలతో భారీ సంస్కృత సమాసాలతో ఎవరికీ అర్థం కాని రీతిలో నాలుగు పేజీలు రాసి, ‘తిలకాష్టమహిషబంధనం’ లాంటి పేరేదో పెట్టి ఆ రచన ఏం చెప్పిందో పాఠకుల ఊహకే వదిలేయచ్చు” అన్నాడు బయల్దేరడానికి లేస్తూ.

ఎప్పుడూ అనేడట్టు – “ఇంకాసేపు కూర్చో” అని అనలేదు నేనీసారి.

***

రైటర్స్ బ్లాక్! నా మెదడంతా ఈ పదబంధమే నిండిపోయింది.

అసలు ఈ పదానికి అర్థమేమిటా అని వెతికాను. ‘the condition of being unable to think of what to write or how to proceed with writing’ అని వచ్చింది.

తెలుగులో చెప్పుకోవాలంటే రాయడం కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి అన్నమాట. అమ్మయ్య… నాది ఈ పరిస్థితే అని గ్రహించాను.

కొద్ది సేపటి క్రితం విన్న ఆ పాటలోని ఆ చరణాన్ని గుర్తు చేసుకుంటే – స్వల్పమార్పులతో అది నాకూ వర్తిస్తుందనిపించింది.

ఎంతోమంది సుప్రసిద్ధ రచయితలంతా తమ కెరీర్‍లో ఏదో ఒక దశలో ఈ స్థితికి లోనయినవారేనని తెలిసింది. ఒక్క రచయితలే కాదు వివిధ రంగాల కళాకారులు కూడా ఈ స్థితికి లోనయి కొన్నాళ్ళపాటు తమ సృజనాత్మకతని కోల్పోయారట. వరుస ఫ్లాపులను ఎదుర్కోవడంతో 1997లో హిట్లర్ సినిమాకి ముందు దాదాపు ఒక ఏడాది కాలం పాటు చిరంజీవి నటనకు దూరంగా ఉండి తప్పొప్పులను విశ్లేషించుకున్నారని అంటారు.

కాసేపు కంప్యూటర్ ఆపేసి, మా ఆవిడ ఎక్కడుందో చూశాను. తను బెడ్ రూమ్‌లో ఏదో పుస్తకం చదువుకుంటోంది.

“టీ తాగుతావా?” అని అడిగాను. తలూపింది.

కిచెన్ లోకి నడిచి టీ కోసం కెటిల్‌లో నీళ్లు పోసి గాస్ స్టవ్ వెలిగించాను. నీళ్ళు మసలుతుంటే నాలో ఆలోచనలు…. టీపొడి వేసి మళ్ళీ కొంచెం సేపు మరిగించాను. పాలు పోశాను. చక్కెర డబ్బా కనిపించలేదు. మా ఆవిడని అడిగాను.

“అక్కడే ఉంటుంది చూడండి…” అంది.

“కనబడడం లేదు…” అని అరిచా.

పుస్తకం పక్కనపెట్టి వంటింట్లోకి వచ్చింది.

“ఇదిగో ఇక్కడే ఉందిగా…” అంటూ నాక్కొంచెం ఎడంగా ఉన్న డబ్బాని చూపించింది.

“అరే… నేను చూడలేదు…” అన్నాను.

“ఏంటి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?” అడిగింది నన్ను గమనిస్తూ.

“ఈ వారం కాలమ్ రాయడానికి… టాపిక్ ఏదీ దొరకలేదు… మా ఫ్రెండ్ దీన్ని రైటర్స్ బ్లాక్ అని అంటున్నాడు” చెప్పాను.

తనూ ఏదో ఆలోచించసాగింది.

టీ కప్పులు పట్టుకుని హాల్లోకి వచ్చాం. దీవాన్ మీద కూలబడి ఒక్కో గుటక టీని ఆస్వాదిస్తున్నాను.

“రైటర్స్ బ్లాక్ కన్నా ఇబ్బందికరమైనవీ, ప్రమాదకరమైన బ్లాక్స్ వేరేవి మన సమాజంలో చాలా ఉన్నాయి” అంది.

“ఏంటవి?”

“చాలానే ఉన్నాయి. మొదటిది పొలిటికల్ బ్లాక్. ఎన్నికలప్పుడు అందరినీ రాసుకుపూసుకుని తిరిగి, కాళ్ళూగడ్డాలు పట్టుకుని ఓట్లు వేయమని బ్రతిమాలే నేతలలో చాలామంది ఎన్నికలు ముగిసాకా… మాయమైపోతారు. ఓడినవాళ్ళు కొన్నాళ్ళు విషాదయోగంలో ఉంటారు. గెల్చినవాళ్ళు కదనోత్సాహంలో ఉంటారు. ఎన్నికల ప్రచారంలో తమ్ముడూ అన్నా, కాకా, చాచా అని పిల్చినవాళ్ళనే తరువాత.. ఓయ్, ఏం రా, అంటారు. అధికార మైకం కమ్మేస్తుంది. నియోజకవర్గంలో ఏం జరిగినా తమకి తెలియాలంటారు. అన్నిటా తమ అనుచరులే ఉండాలనుకుంటారు. వచ్చే ఎన్నికలలో తనకి అవకాశం ఉండదనుకుంటే, తమ కొడుకులకో బంధువులకో సీటు వచ్చేలా చూసుకుంటారు. ఇతరుల అవకాశాలను బ్లాక్ చేస్తారు.”

“అవును. పొలిటికల్ బ్లాక్ ఓకే, తరువాత?”

“ఇంకా ఉంది. పొలిటికల్ బ్లాక్ అప్పుడే పూర్తి కాలేదు. ఇక్కడ మగవాళ్ళ ఆధిపత్యం కొనసాగించడానికి స్త్రీల అవకాశాలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుని ఎంత కాలం నుంచి బ్లాక్ చేస్తున్నారో కదా!”

అంగీకారంగా తలూపాను.

“తరువాత కేస్ట్ బ్లాక్! ఇది పొలిటికల్ బ్లాక్ కన్నా ప్రమాదకరమైనది. పైకి కనబడకుండా చాప కింద నీరులా సమాజమంతా వ్యాపించి ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యవహారాలన్నీ వాళ్ళ కులస్తులకే అప్పజెప్పాలని చూస్తారు. ప్రతీ రంగంలోనూ అవ్యక్తంగా ఉన్న బ్లాక్ ఇది. లౌక్యంగా మనవాళ్ళేనా అని ధ్రువీకరించుకుంటూంటారు. మిగతావాళ్ళ అవకాశాలను బ్లాక్ చేస్తుంటారు. ఒక్కోసారి కేస్ట్ బ్లాక్ బహిర్గతమై, పొలిటికల్ బ్లాక్ సరసన నిలుస్తుంది.”

“కరక్టే.. ఇంకా ఏయే బ్లాకులున్నాయి…”

“ట్రేడర్స్ బ్లాక్. పంట పొలంలో ఉండగానే కొనేసి, సరుకు బయటకి రావల్సిన సమయానికి రాకుండా కోల్డ్ స్టోరేజీల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక లాభాలు పిండుకోవాలనుకోవడం ఈ మధ్య బాగా ఎక్కువవుతోంది. రైతుల వద్ద తక్కువ ధరకి కొనడం, వినియోగదారులకి అధిక ధరలకి అమ్మడం… సామాన్య ప్రజలని మోసం చెయ్యడం!”

“నిజమే. మంచి పాయింట్” అన్నాను.

మళ్ళీ నేనే మాట్లాడుతూ… “నువ్వు వీటి గురించి చెప్తుంటే… నాకు ఇంకో బ్లాక్ గుర్తుస్తోంది. అదే టెక్నాలజీ బ్లాక్. ఉపగ్రహాలు, మిస్సైల్స్‌కి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి అగ్రదేశాలు” చెప్పాను.

“ఎకానామిక్ బ్లాకేడ్… రాష్ట్రాల మధ్య ఏవైనా గొడవలైతే.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు, ముడిపదార్థాలు వెళ్ళకుండా అడ్డుకోడం.. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా జరుగుతుంది” చెప్పింది.

“అంతే కాదు, తనని ఎదిరించిన దేశాలని అమెరికా బ్లాక్ చేస్తుంది. ఆయా దేశాలపై అనేక ఆంక్షలు విధిస్తుంది…” అంది.

“అమ్మాయ్! మనం మరీ సీరియస్ డిస్కషన్‌లోకి వెళ్ళిపోతున్నాం…” అన్నాను.

“ఇవన్నీ వాస్తవాలే కదా! మాట్లాడుకోడంలో తప్పేముంది?”

“అయినా నా కాలమ్‌కి… ఇవి డైరక్ట్‌గా రిలేటెడ్ కాదు….” అన్నాను.

“అసలేమీ రాయకుండా ఉండడం కన్నా రైటర్స్ బ్లాక్ గురించి రాయడం ఉత్తమం అంటాడు Charles Bukowski. మధ్యాహ్నం నెట్‌లో చదివాను. మీ ఆర్టికల్‌లో ఇవన్నీ రాయచ్చు…” అంది.

“ఇవన్నీ సమాజంలోని కొందరు జనాల మెంటల్ బ్లాక్స్! ఓ గిరి గీసుకుని ఉంటారు, వాళ్ళు బయటకి రారు, ఇతరులని లోనికి రానివ్వరు.” అంది.

“నాకు ఇంకో బ్లాక్ గుర్తొస్తోంది… థియేటర్ల బ్లాక్. పెద్ద హీరోల సినిమాలు రిలీజయ్యేడప్పుడు ఆ నిర్మాతలు థియేటర్లను బ్లాక్ చేసి చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తారు. బాగా ఆడుతున్న చిన్న సినిమాలని కూడా బలవంతంగా తీసేస్తారు…” చెప్పాను.

“పర్లేదు.. వార్తలని బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు…” అంది మా ఆవిడ.

“ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఉండకూడని బ్లాక్‌లు! ఉపయుక్తమైన బ్లాక్స్ కూడా ఉన్నాయి. అవే లెగో బ్లాక్స్! పిల్లల్లో సృజనాత్మకతని పెంచుతాయీ బ్లాక్స్” అన్నాను.

టీ తాగడం పూర్తయ్యింది. తను పుస్తకం చదువుకోడానికీ, నేను ఆర్టికల్ టైప్ చేయడానికీ లేచాము.

***

నా ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. టైప్ చేయడం మొదలుపెట్టాను. ఎఫ్.ఎం. పెట్టుకుని పాటలు వింటూ ఆర్టికల్ సిద్ధం చేస్తున్నాను.

కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం” అంటూ చిల్లరదేవుళ్ళు సినిమాలో ఆత్రేయ గారు రాసిన పాట వస్తోంది. “నవ్వు నవ్వుకి తేడా ఉంటుంది నవ్వే అదృష్టం ఎందరికి ఉంటుంది” అని సాగుతోంది. అప్రయత్నంగా నాకు పేరడీ తట్టింది.

“బ్లాక్ బ్లాక్‌కీ తేడా ఉంటుంది. బ్లాక్‌ని బ్రేక్ చేసే అదృష్టం ఎందరికి ఉంటుంది” అని పాడుకున్నాను.

ఇందాక మేం మాట్లాడుకున్న బ్లాక్‌లన్నింటికీ మూలకారణం స్వార్థం! జియో ఔర్ జీనేదో అన్న సూక్తిని అందరూ పాటించగల్గితే ఎంత బాగుండు అనిపించింది.

కాసేపటికి నా ఆర్టికల్ పూర్తయ్యింది. మనసు తేలికపడింది ఎఫ్.ఎం వింటున్నాను.

“రాను రానంటునే చిన్నదో… చిన్నదో… రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది” అనే పాట వస్తోంది.

ఈ పాటకి కూడా నా మనసులో పేరడీ తట్టింది

“రాయ రాయలేనంటూ పిల్లడో…. పిల్లడో… పేజీలు పేజీలు రాసిండె పిల్లడో పిల్లడు…” నవ్వుకుని ఫైల్ సేవ్ చేసి, ఒకటి రెండు సార్లు మళ్ళీ చదువుకుని, ఎడిటర్‌కి మెయిల్ చేసి, ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here