[box type=’note’ fontsize=’16’] “అంకితమై ఆరాధిస్తే అంతరాత్మ జాగృతమైతే జన్మాంతర పుణ్యంతోనే సాధించిన గొప్ప తప్పస్సు సాహితీ తప్పస్సు” అంటున్నారు ఎమ్మెస్వీ గంగరాజు , సాహితీ తపస్సు కవితలో. [/box]
[dropcap]సం[/dropcap]ప్రదాయ సాహిత్యం తో
సాధించిన గొప్ప తపస్సిది!
మహామహుల మహితోక్తులతో
సాగించే ప్రస్థానమ్మిది!
నిర్భరమగు మనస్సుతోనే
నిలుపుకున్న సామ్రాజ్యమ్మిది.
భగవంతుని ప్రతిబింబం లో
ప్రాప్తించిన సంపదయే ఇది!
విద్వేషపు విషవలయంలో
అందరాని సౌందర్యములివి.
మాయా వ్యామోహపు వలలో
చిక్కని చిచ్ఛక్తుల ప్రోవిది!
క్రోధావేశపు చిక్కులలో
మత్సరమను చీకటి తెరలో
కుత్సితమను నున్మాదంలో
వీక్షింపని విశ్రుత పథ మిది!
దంభోక్తుల సంరంభం తో
కౌటిల్యపు ప్రలోభములతో
దౌర్జన్యం జూలు విదిల్చే
దౌర్భాగ్యపు వైముఖ్యమ్మిది!
కుక్షిప్రోద్భవ నైష్టుర్యం
సంక్షోభం నిర్దాక్షిణ్యం
విధ్వంసక వినోద కృత్యం
గుర్తింపని పెను సత్యంబిది!
కల్లోలం పెల్లుబికించే
కాఠిన్యం కానని తెరువిది.
దుర్విదగ్ధ దుశ్చింతలలో
వర్తింపని వాస్తవమియ్యది!
చెలాయించి చిచ్చులు రేపే
దుర్మార్గుల దుర్వ్యూహంలో
ధర్మగ్లానికి మార్మొగమిడి
వర్ధిల్లిన విజ్ఞుల పథ మిది!
అంకితమై ఆరాధిస్తే
అంతరాత్మ జాగృతమైతే
జన్మాంతర పుణ్యం తోనే
సాధించిన గొప్ప తపస్సిది!!