అక్షరానికి ఆవలి వైపు

15
4

[box type=’note’ fontsize=’16’] “పిల్లలు ప్రయోజకులు అవుతున్నారంటే, వాడి సంతానమైనా, మన సంతానమైనా సంతోషించాల్సిందే! కానీ జగతి పరిస్థితి అలా కనిపించడం లేదు కదా!” అని తన స్నేహితుడి మనవరాలి గురించి వాపోతాడో మిత్రుడు డా. కె.ఎల్.వి. ప్రసాద్ రాసిన “అక్షరానికి ఆవలి వైపు” కథలో. [/box]

[dropcap]సా[/dropcap]యంత్రం ఆరుగంటలు దాటి ఉంటుంది.

అప్పటివరకు ఎండ తీవ్రత తట్టుకోలేనంత స్థాయిలో ఉండడంతో, సాయంత్రానికల్లా వాతావరణం కాస్త చల్లబడి, చల్లని గాలి వీస్తుండడంతో, బయట పడక కుర్చీ వాల్చుకుని, అందులో కూర్చుని, ఆ రోజే వచ్చిన వారపత్రిక చేతిలోకి తీసుకుని బొమ్మలు, కార్టూన్లు, శీర్షికలు చూస్తూ పేజీలు తిప్పడం మొదలు పెట్టాను.

‘కనిపించిన ప్రతి పత్రికకి చందాలు కడతావ’ని గొడవ చేస్తుంటుంది నా శ్రీమతి పద్మజ. పుస్తకాలు చదవందే నాకు నిద్ర పట్టదు సరికదా, అసలు జీవితం తృప్తిగా సాగుతున్నట్టు అనిపించదు. పైగా బుర్ర మొద్దుబారినట్టు అయిపోతుంది. ఇది నాకు చిన్నప్పటినుంచి సంక్రమించిన అలవాటు. ఇంట్లో అలాంటి వాతావరణం ఉండడమే దానికి ప్రధాన కారణం కావచ్చు!

అందుకే నా శ్రీమతి పుస్తకాల విషయంలో ఎంత రగడ సృష్టించినా, ఈ ఒక్క విషయంలో మాత్రము నన్ను ఇబ్బంది పెట్టొద్దని హితవు చెబుతుంటాను.

నిజానికి, నా శ్రీమతి బాధ అంతా నేను పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నందుకు కాదు, ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు, మ్యాగజైన్‌లు కుప్పలు తెప్పలుగా పడిఉండడం, వాటిని నేను సరిగా పద్ధతి ప్రకారం సర్దిపెట్టకపోవడం ఆమెకు చికాకు కలిగిస్తుంటుంది.

వీక్లీలో ఒక పూర్తి పేజీ కార్టూన్ ఉండడంతో, దానిని చూసి ఒకటే నవ్వుకోవడం మొదలు పెట్టాను. ఈ లోగా ఉప్పు పంచదార సమపాళ్లలో కలిపిన చల్లని నిమ్మరసం గ్లాసుతో ప్రత్యక్షం అయింది పద్మజ.

“ఏంటండోయ్, మీకు మీరే తెగ నవ్వేసుకుంటున్నారు? అంత నవ్వు తెప్పించిన సమాచారం ఏముందేమిటి అక్కడ” అంది పద్మజ.

“ఇదిగో.. ఇలా చూడవోయ్,నా కార్టూనిస్ట్ ఫ్రెండ్ ‘శరత్’ లేడూ.. అతనే, చూడు.. కార్టూన్ ఎంత బాగా వేశాడో! ఇతని కార్టున్లు వున్నాయి చూశావా.. అవి మనల్ని నవ్వించడమే కాదోయ్, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కార్టూన్ కోసం ఆయన ఎలాంటి సన్నివేశాన్ని ఎన్నుకున్నా అదేదో మనింట్లోని సంఘటన, మనకే జరిగినట్టుగా ఉంటుంది” అన్నాను మిత్రుడు శరత్ గురించి గొప్పగా చెబుతూ.

“నిజమేనండీ, నేను కూడా అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు చూస్తుంటాను కదా! ఎంత బావుంటాయో.. ఆయన కార్టూన్లు” అంది కాస్త సాగదీస్తూ పద్మజ.

“ఇదిగో.. ఇది ఒకసారి చూడవోయ్ పద్దూ,.. ఈ ‘ఖాళీ కప్పు’ శీర్షిక చూడు,నాలుగైదు లైన్లు మాత్రం రాసి,గొప్ప అర్థవంతమైన సందేశాన్ని అందించాడు రచయిత” అన్నాను, పద్మజ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ.

“…. ఏమండోయ్, అది సరేగాని, అల్లదిగో.. ఆ రోడ్డు మీదికి చూడండి.. మీ బాల్య మిత్రులుంగారు వేంచేయుచున్నారు. ఈ సాయంత్రం పూట ఇలా ఎందుకు వస్తున్నాడో మహానుభావుడు. మీ ఇద్దరి సోదీ నేను వినలేను గానీ,… ఆయన్ని కాస్త త్వరగా పంపించేసి పుణ్యం కట్టుకోండి. వెళ్లిపోయే ముందు చెబితే, రెండు కప్పుల కాఫీ లక్షణంగా పంపిస్తాను” అంటూ వడివడిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది పద్మజ.

పద్మజ ఇంట్లోకి వెళ్లిందో లేదో, నేను గబుక్కున కుర్చీలోనించి లేచి, గేటు దగ్గరికి పరిగెత్తినంత పని చేసి అప్పుడే ఇంటి గేటు తీస్తున్న జగన్‌ను ఒక్క ఉదుటున వాటేసుకున్నాను. నా ఆ చర్యకు వాడు సంతోషంతో తబ్బిబ్బు అయిపోయాడు.

“ఒరేయ్, ఉండరా. నువ్వెప్పుడూ ఇలానే చేస్తావ్. కానీ, నిన్ను చూడ్డానికి నేను రావాలసిందే తప్ప,.. నువ్వు మాత్రం గడప దాటవు కదా!” అన్నాడు నిష్టూరంగా జగన్.

“నువ్వన్నది అక్షరాలా నిజం రా జగన్, కాదనడం లేదు! పైగా మనిద్దరి ఇళ్ల మధ్య దూరం రెండు కాలనీలే కదా! అయినా ఏమిటో మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా సరదాగా నీదగ్గరకు వద్దామని హుషారుగా బయలుదేరతానా.. సరిగ్గా, అదుగో అప్పుడే మీ చెల్లెమ్మ ఏదో ముఖ్యమైన పని అంటూ పురమాయించి, నా ముందరి కాళ్లకు బంధం వేసేస్తుంది! అలా ఎన్నిసార్లు జరిగాయో చెప్పినా నువ్వు నమ్మవులేరా జగన్” అన్నాను.

“ఒరేయ్.. ఒరేయ్.. అటు ఇటు చేసి నీ తప్పును మా చెల్లాయి మీదికి తోసేస్తున్నావా? పోనీ లేరా.. నువ్వు రాలేకపోయినా, నీలోని అప్పటి ఆత్మీయత – అభిమానం, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్నాయి, అది చాలురా నాకు! అనవసరంగా ఈ విషయంలో నువ్వేమీ బాధ పడనక్కరలేదు” అన్నాడు జగన్, ఆప్యాయంగా నా భుజంమీద చెయ్యి వేసి గట్టిగా నొక్కుతూ.

ఇద్దరం చేయి చేయి పట్టుకుని వరండాలో వున్న రెండు కుర్చీలు దగ్గరకు లాక్కుని కూర్చున్నాం. నా శ్రీమతి పద్మజ ఊహించినట్టుగానే సర్వం మరిచి లోకాభిరామాయణంలో పడ్డాం.

మా ఇద్దరికీ పెళ్లిళ్లు కావడం, పిల్లలు పుట్టడం వాళ్లకు పెళ్ళిళ్ళుకావడం.. మేమిద్దరం రిటైర్ కావడం వంటి జీవితంలోని మైల్ స్టోన్స్ ముద్ర పడినా, కలిసినప్పుడల్లా మేము ఎక్కువగా మాట్లాడుకొనేది మా బాల్యం గురించిన విశేషాలే! ఎందుచేతనంటే గ్రామీణ జీవితంతో మమేకమైన మా బాల్యం గురించి ఎంత చెప్పుకున్నా తరగనంత చరిత్ర ఉంటుంది. అలా కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్న తరుణంలో,ఉన్నట్టుండి —

‘’ఒరేయ్.. కరుణా.. ! చెప్పడం మరిచాను, మొన్న మన కాముడు ఫోన్ చేసాడురా, ఎందుచేతనో గానీ ఈ సారి చాలాసేపు మాట్లాడాడు. నిన్ను మరీ.. మరీ.. అడిగినట్టు చెప్పమన్నాడు రా! నీకు తర్వాత ఫోన్ చేస్తానన్నాడు” అన్నాడు జగన్.

“ఇంకా ఏమి మాట్లాడాడురా వాడు? వాడు, వాడి పిల్లలు పూర్తిగా ఆ దేశానికే అంకితం అయిపోయారు. అక్కడ బ్రతికినవాళ్లు ఆ సుఖాలకు, విలాసాలకు అలవాటు పడిపోయి మన దగ్గర మనుగడ సాగించలేరురా. వాడు ఎప్పుడు వచ్చినా, ముందుగా ఎప్పుడు తిరిగి వెళ్లి పోతాడన్న విషయం గురించే ఎక్కువగా మాట్లాడతాడు” అన్నాను.

“ఏమో లేరా, వాడి బాధలేవో వాడికి వుండి ఉంటాయి. అందుచేత వాడి వ్యక్తిగతం పక్కన పెడితే, నీకు ఈ విషయం తెలుసా! మనవరాలిని విజయవాడలో ఇంటర్‌లో చేర్చాడట. పైగా ఒక కార్పొరేట్ కాలేజీలో. ఇంకో వింత ఏమిటంటే ఆ పిల్ల సైన్స్ గ్రూపు తీసుకుందట!’’ అన్నాడు జగన్ ఆశ్చర్యపోతూ, ఏదో జరగకూడని పని జరిగిపోయినట్టు.

“అది కాదురా జగన్, నాకు తెలుసుగా మన కాముడి మనుమరాలు జగతి గురించి. పైగా మా వియ్యంకుడి మనవడు, జగతి చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు. అసలు జగతి పదో తరగతి ఎలా పాసయిందా అని నేను ఆశ్చర్యపోతుంటే, నువ్వు మరో ఆశ్చర్యకరమైన విషయం చెబుతున్నావు మరి!” అన్నాను.

“అదేరా, కరుణా.. నేను చెబుతున్నది. కాముడి సుపుత్రుడి ఆలోచన ఏమోగానీ, పట్టుపట్టి మరీ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాడట!” అన్నాడు జగన్.

“పొనీలేరా…. ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పు! పిల్లలు బాగా చదువుకోవాలనీ, ప్రయోజకులు కావాలని, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి, విలాసవంతమైన జీవితం గడపాలని. మన పిల్లలైనా, మన పిల్లల పిల్లలైనా… మనందరిలో ఉండేది అదే ఆలోచన కదా! మన కాముడు గల్ఫ్ దేశాలకు వెళ్లి కొడుక్కు దారి సుగమం చేసాడు. వాడికి చదువు పెద్దగా వంటపట్టకపోయినా, అక్కడేదో బాగా డబ్బులొచ్చే ఉద్యోగమే సంపాదించుకున్నాడు. ఇక్కడ కాముడి కోడలు ఆమె పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కాముడంటావా, పిల్లలు ఎక్కడ ఎన్ని రోజులు ఉండమంటే, అన్ని రోజులు వుంటాడు. చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి కనుక, ఒక్కగానొక్క కూతురిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించుకోవాలనుకుంటున్నాడేమో కాముడి కొడుకు” అన్నాను.

“ఒరేయ్.. పిల్లలు ప్రయోజకులు అవుతున్నారంటే, వాడి సంతానం అయినా, మన సంతానం అయినా సంతోషించవలసిందే! నిండు హృదయంతో మనం మెండుగా దీవెనెలు అందించి అభినందించవలసిందే! కానీ జగతి పరిస్థితి అలా కనిపించడం లేదు కదా! ఆ పిల్ల చదివే చదువుకి, ఒక లాప్‌టాప్, ఒక టాబ్, ఒక స్మార్ట్‌ఫోన్ వగైరా అవసరం అంటావా? అది ఎప్పుడు ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తుంటుంది. లేకపోతే వీడియో చాట్లు ఎలానూ ఉంటాయి. ఇక శ్రద్ధగా చదివే సమయం ఎక్కడిది చెప్పు?’’ అన్నాడు జగన్.

“మరి, అక్కడే వుంది కిటుకు. మన కాముడు ఆ కాలేజీ వాళ్ళ దగ్గర మనమరాలి కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడట. ఇలాంటి వాళ్లందరికీ ఒక స్పెషల్ గది కేటాయిస్తారట వాళ్ళు. మేనేజ్మెంటుకి డబ్బులు కావాలి, మన వాళ్లకి జల్సా జీవితం కావాలి, చదువుతో సంబంధం ఉండదు అంతే!’’

“బాగానే వుంది సంబరం. కాముడుకూడా ఇలాంటివాటిని సమర్థించడం ఏమీ బాగోలేదురా. వాడికి అసలు బుర్ర పని చేస్తున్నట్టు లేదు” అన్నాడు జగన్.

“అసలు విషయం నీకు అర్ధం కావడం లేదురోయ్ మిత్రమా! కొడుకు ఏమి చెబితే అది మనవాడు తు.చ. తప్పకుండా పాటించాలి. లేకుంటే, వీడు తాగి తందానాలు ఆడడానికి వనరులు సమకూరవు మరి! అందుచేత వాడి స్వార్థం అలా పని చేయిస్తుంటుంది మరి! మనం ఏమి చేయగలం చెప్పు” అన్నాను నిట్టూరుస్తూ.

“అందుకేగా.. మనం వాడికి సలహాలు ఇవ్వడం మానేసాం” అన్నాడు ఆవులిస్తూ జగన్.

“ఎంతసేపు కబుర్లేనా ఏంటి? అన్నయ్య గారిని కూర్చోబెట్టి ఏకధాటిగా వాయించేస్తున్నారు? ఇక,కాళ్ళు చేతులు కడుక్కొని రండి, స్నాక్స్ పెట్టి కాఫీ ఇస్తాను” అని పద్మజ వార్నింగ్ బెల్ కొట్టడంతో ఇద్దరం వాష్ రూమ్ వైపు బయలుదేరాం.

***

నేను, జగన్, కాముడు అనబడే కామేశ్వర రావు చిన్ననాటి స్నేహితులం. ఒకే వూరికి చెందినవాళ్ళం, హై స్కూల్ వరకూ ముగ్గురం ఒకేచోట కలిసి చదువుకున్నాం. ప్రాథమిక విద్య మా ఊరి బడిలోనూ, హై స్కూల్ విద్య తాలూకా కేంద్రంలోను పూర్తి చేసాం. కాముడు హైస్కూల్ విద్యతో చదువుకు స్వస్తి పలికాడు. బీదరికం,ఇంటి పరిస్థితులు ఇక వాడిని అడుగు ముందుకు వేయనీయలేదు. ఎవరో పుణ్యాత్ముడు సకాలంలో కాముడికి పని చూపించి ఖతార్ దేశానికి దారి చూపించాడు. అక్కడ కష్టనష్టాలను ఓర్చుకుని, స్థిరంగా నిలదొక్కుకోగలిగాడు కాముడు. అంత మాత్రమే కాదు, అక్కడ పది సంవత్సరాలు కష్టపడి పని చేసాక, ఆర్థికంగా కాస్త బలపడి, తన కుటుంబ సభ్యుల్ని కొందరిని, ఒక్కొక్కరిగా అక్కడికి రప్పించుకోగలిగాడు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో అందమైన భవంతి, పదెకరాల పంటపొలం సంపాదించుకోగలిగాడు. పిల్లలు చేతికంది రావడంతో తాను కొన్నాళ్ళు స్వంతవూరిలో, కొన్నాళ్ళపాటు ఖతార్‌లో ఉండడం తప్పనిసరి అయింది. అంతేకాకుండా, ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్సు వగైరా.. అక్కడే ఉండడంతో, అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు కాముడు.

నేను, జగన్ డిగ్రీలు చేసిన తర్వాత, జగన్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఒక చిరుద్యోగిగా కుదిరిపోయాడు. నేను డిగ్రీ తర్వాత బి.ఎడ్ చేసి ఒక ప్రభుత్వపాఠశాలలో బడిపంతులుగా కుదిరిపోయాను.

పరిస్థితులను బట్టి, ఉద్యోగరీత్యా ముగ్గురం మూడు విధాలుగా విడిపోయినా, స్నేహం విషయంలో మాత్రం, అది చెక్కుచెదరకుండా అలానే వుండిపోయింది. మేము ఇద్దరం రిటైర్ అయిన తర్వాత మా జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కాముడి విషయంలో మాత్రం అప్పటి దర్జా, దర్పం అలానే కొనసాగుతున్నాయి.

***

“ఏమండోయ్.. ఇందాకటి నుంచి ఆ మొబైల్ అలా మోగుతుంటే మీకు వినపడడం లేదా?’’ అని భార్యామణి గట్టిగా అరిచే వరకు, నా ఆలోచనల నుండి బయటకు రాలేకపోయాను.

“పద్దూ.. డియర్.. కాస్త ఆ ఫోను ఇట్లా నా చేతిలో పాడేద్దూ..’’ అన్నాను కూర్చున్నచోటి నుండి లేవలేక.

పద్మజ నుండి ఫోన్ తీసుకుని మిస్సెడ్ కాల్స్ లిస్ట్ చూద్దును కదా, అది కాముడు నుంచి కాల్! రీకాల్ చేసి “హలో కాముడూ… ఎలా వున్నావురా ? నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను యేవో ఆలోచనల్లో ఉండడం వల్ల రింగ్ సౌండ్ నాకు వినపడలేదోయ్! పద్మ చెబితేను చూసి నేనే నీకు మళ్ళీ కాల్ చేస్తున్నాను, ఏంటి సంగతులు? ఇండియా వస్తున్నావేమిటీ?’’ అన్నాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ.

“నీకు ఇప్పుడు పరాకు పడేంత ఆలోచనలు ఏమిటిరా? నీకు సమస్యలు ఏమున్నాయని ఆ ఆలోచనలు! అయినా ఆ ప్రశ్నల తూణీరాలు ఏమిట్రా బాబు” అన్నాడు నవ్వుతూ కాముడు.

“ఒరేయ్… కాముడు… మనిషన్న తర్వాత యేవో సమస్యలు ఉండక పోవురా. లేదంటే వేరు వేరు రూపాల్లో వుంటాయంతే! అది సరేలే గానీ చెప్పరా ఏంటి విశేషాలు?” అన్నాను

“ఒరేయ్.. కరుణా.. ఒక అత్యవసర విషయం గురించి నీకు ఫోన్ చేసాను రా” అన్నాడు.

“సస్పెన్సులో పెట్టక త్వరగా చెప్పి చావరా బాబు!’’ అన్నాను కాస్త ఆందోళనగా.

“నువ్వు అంత కంగారుపడవలసిన విషయం ఇక్కడ ఏమీ లేదు గానీ, సావధానంగా విను. నువ్వు నాకొక సహాయం చెయ్యాలిరా” అన్నాడు అభ్యర్ధించే ధోరణిలో.

“.. సహాయమా! నేనా..! నీకా… ఏంట్రా… జోకులేస్తున్నావా?’’ అన్నాను.

“జోకులు కాదు, పరాకు మాటలు కాదు, నిజం చెబుతున్నానురా.. నువ్వు నాకు సాయం చెయ్యాలి” అన్నాడు.

“సరే.. నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. అదేంటో చెప్పారా బాబు” అన్నాను.

“అది, నువ్వు చేయగలిగిందేలేరా…నా మనవరాలు జగతి నీకు తెలుసు కదా! అది కాలేజీ హాస్టల్‌లో ఉంటోంది, దానికి నెల రోజులు సెలవులు ఇచ్చారు.”

“అయితే ఏమిటిరా?’’ అన్నాను కాస్త వ్యంగ్యంగా.

“..ఈ నెల రోజులు, దాన్ని మీ ఇంట్లో ఉంచుకోవాలి. చెల్లెమ్మ సంరక్షణలో కొద్ది రోజులు ఉంటే బావుంటుందని.. !’’ అని ఇంకా ఏదో చెప్పవుతుండగా —

“వూళ్ళో మీ కోడలు వుంది కదరా… అక్కడ ఆమె ఉండగా… !’’ అన్నాను.

“మొన్ననే … కోడలు కూడా కువాయిట్‌కి వచ్చిందిరా. ఆమె రావడానికి కనీసం ఆరు నెలలు అయినా పట్టొచ్చు” అన్నాడు.

“సరే.. దానిదేముందిగానీ, జగతి యెట్లా చదువుతుందిట?’’ అన్నాను.

“చదువు లేదు, దాని ముఖమూ లేదు… తండ్రి దాన్ని అక్కడ చదువుకోసం చేర్పించాడనుకుంటున్నావా? నువ్వు అలా అనుకుంటే గనక పప్పులో కాలేసినట్టే … !!’’ అన్నాడు కాముడు.

“..మరి… మరింక దేనికోసం రా? చాలా వింతగా మాట్లాడుతున్నావు నువ్వు” అన్నాను కాస్త సీరియస్‌గా.

“ఒరేయ్.. కరుణా, దాని చదువు సంగతి నీకు తెలీనిదేముందిరా! మేమందరం గల్ఫ్ మోజులో అస్తమానం అటు ఇటు తిరుగుతున్నామా! వయసొచ్చిన ఆడపిల్ల, అది ఆ వూళ్ళో ఉంటే కుర్రకారు దానిని సరిగా బ్రతకనిస్తారా?ప్రస్తుత గ్రామాల పరిస్థితి నీకు తెలియనిది కాదు. అందుకే మావాడు కాలేజీ యాజమాన్యం కాళ్ళు పట్టుకుని, వాళ్ళు అడిగినంత డబ్బు కట్టి, జగతిని కేవలం రక్షణ కోసం కాలేజీలో చేర్పించాడు. తప్పదు కదా, ఒక్కగానొక్క కూతురు.. తప్పలేదు వాడికి” అన్నాడు బరువుగా కాముడు.

“సరే.. పంపించరా, దాని విషయం మాకు వదిలేయ్, మీరు నిశ్చింతగా వుండండి” అన్నాను, కాలేజీల్లో ఇలాంటి సదుపాయాలుకూడా ఉంటాయా… అని మనస్సులో గొణుక్కొంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here