[box type=’note’ fontsize=’16’] అవసాన దశలో అనాథప్రేతాల్లా.. వృద్ధాప్య ఆశ్రమాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టే పుత్రులని చూసి కల్గిన వేదనలోంచి మానాపురం రాజా చంద్రశేఖర్ మదిలో జనించిన కవిత ఇది. [/box]
[dropcap]ని[/dropcap]న్ననే
కురిసిన చినుకుల స్పర్శలోంచి
ఆకాశం
ధవళవస్త్రంలా మొలకెత్తడం చూశాను
ఇంద్రధనుస్సు మెరుపులో
కాలం గుండెపై నడిచే
చీకటివెన్నెల పైటంచును తడిమాను
తేమదనానికి బదులు
మృదుత్వానికి గుర్తుగా
ఏవో కొన్ని ఆచ్ఛాదనలు
దేశ దేహమంతటా విస్తరించి
మౌన సంభాషణ చేస్తోంది
మెరుపుల అలజడి లేదు
ఉరుముల కరచాలనమూ కనబడదు
రెప్పపాటులో కురిసి
మెరిసి మాయమయ్యే ప్రపంచం
ఇప్పుడు
దాని ఆనవాళ్ళను పసిగట్టగలమా
పసిపిల్లలమైతే తప్ప..
బాల్యం తీపిగుర్తులు కరిగిపోయి
చాలా కాలమైంది
వెంటాడే క్షణాల మధ్య
జారిపోయే అనుభవాలను
ఏమని ప్రశ్నిస్తాం!
అనుక్షణమూ
జీవితమే యుద్ధ రంగమైపోతేనూ..
ఈ ఒక్క రాత్రి
తెల్లారిపోతే బావుణ్ణు
నిశ్శబ్దం బద్ధలై
మరో కొత్త ప్రపంచం
ఊపిరి పోసుకుంటుంది
దాని పేరే
మరణం..!
అనేక సంఘటనలను
సంఘర్షణలతో కలిపి కుట్టే నేతకారిణి
ఇప్పుడు
నేత్రావధానం చేసి ఫలితమేముంది!
బోసి నవ్వుల ఆకాశాన్ని
బీభత్స రస ప్రధానంగా చిత్రించే
బతుకు నైపుణ్యం కావాలి
అప్పటిదాకైనా
ఈ కొనసాగింపు దృశ్యానికి
సరికొత్త ముగింపునిద్దాం!!