[dropcap]ఈ [/dropcap]బాలల కథా సంకలనంలో 40 కథలున్నాయి. ఈ చిట్టిపొట్టి కథలలో ఎంతో విలువైన సందేశాలు నిక్షిప్తమై వున్నాయి. హాయిగా చదివించే ఈ కథలు ఆలోచింప జేస్తాయి కూడా.
మనం చేసే పని యేదైనా అది మనకు సంతృప్తి కలుగజేయాలి. మనపై వచ్చే విమర్శలను నవ్వుతూ తేలికగా తీసుకోవాలి. ఎటువంటి వాంఛా లేకుండా జీవించగలగాలి. లోకంలో భగవానుడొక్కడే పురుషుడని గ్రహించాలి. ప్రపంచాన్ని ప్రేమతో మాత్రమే జయించగలం, ద్వేషంతో కాదు. అహంకారాన్ని వదులుకోవాలి. బుద్ధిమంతునికి ఈ లోకంలో లభ్యం కానిది అంటూ ఏమీ లేదు. అందరి పట్లా సమదృష్టిని కలిగి వుండాలి. వారసత్వ సంపదగా వచ్చిన విలువలను వదిలి ఆకర్షణీయమైన వాటి వెంట పడితే పతనం తప్పదు. తల్లి ప్రేమకు మించినది లేదు. వర్తమానం పట్ల సంయమనంతో కూడిన ఎరుక కలిగి వుండాలి. మన ధ్యాస పూర్తిగా మనం చేసే పనిమీదే వుండాలి. అభాగ్యులకు సేవ చేయాలి. స్వేచ్ఛ ఎంతో విలువైనది. ఓటమిని చిరునవ్వుతో స్వాగతిస్తూ అడుగు ముందుకు వేస్తేనే విజయం లభిస్తుంది. మనకు స్వాతంత్ర్యం లభిస్తేనే ఆర్థిక స్వావలంబన సిద్ధిస్తుంది. విజయాలను, కష్టాలను ఒకే రకంగా స్వీకరించాలి. పవిత్రులకు సకల గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎదుటి వాడు ఎంతటి గజదొంగ అయినా ఔదార్యం ప్రదర్శించగలగాలి. ఆత్మ స్థైర్యంతో జీవితంలో ఓటమి అనేది వుండదు. దయాగుణం కలిగి వుండాలి. జీవం ఉన్నంతవరకే మనిషికి విలువ. స్తుతించినప్పుడు పొంగి పోరాదు. నిందించినప్పుడు బాధపడరాదు. మనోనిగ్రహం లేనిదే ఏ విద్యలోనూ పరిపూర్ణత సాధించలేము. పేదరికానికి పరోక్షంగా అందరూ బాధ్యులే. గురువు ఏ పాఠం చెప్పినా దానిని త్రికరణశుద్ధిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తల్లిని మించిన దైవం లేదు. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి నొప్పి కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఏది సవ్యమైన చర్యో అదే గమ్యము. జీవితంలో మన ఎదుగుదలకు, విజయాలకు తోడ్పడిన వారిపట్ల కృతజ్ఞులమై వుండాలి. సౌమ్యంతో కోపాన్ని అణచివేయవచ్చు. తాను తీసుకునే నిర్ణయం పట్ల అచంచలమైన విశ్వాసం కలవానికే విజయం వరిస్తుంది. అజ్ఞాని అల్పమైన విషయాలతో సంతోషపడతాడు. లోపం అనేది శాపం కాదు. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా నిష్ఠను వదలరాదు. పదార్థాలను వృథా, దుబారా చేయరాదు. గొప్పదనం అనేది ఒకరు చెసే ఘనకార్యాలను బట్టి అంచనా వేయరాదు. మనం చేసే పనిని బట్టే మనం అనుభవించే ఫలితమూ వుంటుంది. ఎదుటివానిలోని చెడ్డగుణాలను పట్టించుకోకుండా అతనిలోని మంచి గుణాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. జీవిత పరమార్థం తెలిసినవారు తమ జీవితాన్ని సత్కార్యాలకు వినియోగిస్తారు. ఈ విషయాలన్నీ ఈ సంపుటిలోని కథలు చదివి తెలుసుకోగలం.
రూజ్‌వెల్ట్, డయోనీసియస్, అలెగ్జాండర్, మీరాబాయి, స్వామీ రామతీర్థ, వ్యాసరాయలు, భక్త కనకదాసు, బాణుడు, రాజా రంజిత్ సింగ్, అబ్దుల్ కలాం, థామస్ అల్వా ఎడిసన్, లోకమాన్య తిలక్, ఆర్థర్ ఏష్, శ్రీ శారదాదేవి, ఛత్రపతి సివాజీ, పరమహంస యోగానంద, అశోక చక్రవర్తి, గౌతమ బుద్ధుడు, రామనాథన్ కృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, కేశవరావు థోంగ్డే, జిడ్డు కృష్ణమూర్తి, సమర్థ రామదాసు, రతన్ టాటా, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, రమణ మహర్షి వంటి ప్రముఖ వ్యక్తుల జీవిత ఘట్టాలను చిన్న చిన్న కథలుగా మలిచి పాఠకులు ఆసక్తి కరంగా చదివేలా చేయడంలో రచయిత కృతకృత్యుడైనాడు.
కథలకు తగిన బొమ్మలతో ఈ పుస్తకం బాలలనే కాకుండా అన్ని వయసులవారినీ అలరిస్తుంది. అక్కడక్కడా కొన్ని అచ్చుతప్పులున్నాయి. వాటిని మినహాయిస్తే ఈ పుస్తకం చాలా చక్కగా వచ్చింది. అందుకు రచయితకు, ప్రచురణకర్తలకు అభినందనలు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతియేటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం ఈ పుస్తకాన్ని పరిగణిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
***
కథా సుధ -1
డా.దుగ్గిరాల రాజకిశోర్
ప్రచురణ: శిక్షణ మండల్ ప్రకాశన్, విశాఖపట్నం
పుటలు:64, వెల:రూ 120/-
ప్రతులకు: డా.దుగ్గిరాల రాజకిశోర్, 6-20-6, ఈస్టుపాయింట్ కాలనీ, విశాఖపట్నం – 17, 9963782445