గతించని గతం-3

0
5

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]ఏ[/dropcap]పుగా పెరిగి వంగి గాలి తాకిడికి ఊగిసలాడుతున్న పొలాలు, మనసును రంజింపజేసేటి పచ్చటి పచ్చికబయళ్ళు, ఆకాశాన అలవోకగా ఎగిరే పక్షులు, గుంపులుగా తరలివెళ్ళే పశువులు, వాటెన్ట నడిచే పుశువుల కాపరులు, మావితోపులు, డొంకలు వాగులు, వర్రెలు… అద్భుతంగా అనిపిస్తుంది. పల్లె కల్లా కపటం అంతగా దరిచేరనిది. అనురాగాలు మరువనిది.  అక్కడ ఎవ్వరిని పలకరించినా వారి వ్ంశపు కతలు, ఆచారాలు, పట్టింపులు, దిక్కారాలును. వారి నుంచి వచ్చే మాట – వారి కట్టుబాట్లపైనా, సాంప్రదాయాల పైన, తీరుతెన్నుల పైన, సమీక్షలా అనిపిస్తుంది, వినడానికి కనడానికి మొరటుదనం, సూటితనం! కానీ మనిషి మనసు సున్నితపు తెరను కూడా వారు తడమగలరు. చంటివాడిని ఎదురు రొమ్మునే ఉంచుకుని నిశ్చింతగా చెట్టు నీడనే నిదురించే కన్న తల్లిని, నాగటి కోయ్యను భుజాన వేసుకుని ఎద్దులెంట కలలు కంటూ చేల కెళ్ళే మామూలు రైతును, అతని వెన్నంటి ఉండే కూలీని, తంగడిపూలు తలన తురుముకుని మంచె పైనుంచి పరికెపిట్టలను తోలే పల్లె పడతులని, దున్న నెక్కి గొడ్లను అదిలిస్తూ పల్లెను చేరే పోరగాళ్ళనును, ఎక్కడ చూసినా స్వచ్ఛత, అందం-ఆనందం. ఎవ్వరెదురు పడినా మంచి పలకరింపు, చేతనైనంత ఆదరణా, తోటివాడి కష్టాలలో పాలుపంచుకోవడం, ఓదార్పు. అందుకే అంటారు కావచ్చు దేశానికి పట్టుకొమ్మలు పల్లెలని. సమతా, సహజీవనం, మనుగడ కలమెలగిన పల్లె బతుకే జీవన కృతి అనిపిస్తుంది. లేగ మోరెత్తి అంబా అంటే మెడపలుపు విప్పడం, పిల్లి మ్యావ్‌మంటే తినే అన్నంలో ఒక ముద్ద వేయడం, యాచకుడు బాబయ్య అంటే దోసెడు ధాన్యం జోలెన వేయడం, ఒక కుటుంబంగా మెదిలి ఒకరినొకరు సాదరంగా పలకరించుకొనటం, ఒక్క కట్టుబాట్ల పట్ల మాత్రం నాగరీకులకు అనాగరీకులుగా కనిపించినా అందరికీ ప్రేమను పంచడం ఈ పల్లెన మాత్రమే చూస్తాం. అమ్మతనాన్ని మరిపిస్తుంది పల్లె. పట్టెడన్నం పెడుతుంది. డొక్క నిండా మజ్జిగ నీళ్ళిస్తుంది. అలాంటి చోట నేను పుట్టాను. పెరిగాను. నా మానసిక అసంతృప్తి ఇంతటి ఆదరనీయతను కూడా ఒదిలేసేలా చేసింది. బాధగా అనిపించి అడుగు కదిపాను. నా నడకన కూడా ఇది నా తలను వదలక నిలిచే ఉంది.

ఇల్లు వదిలిన రాత్రి పూర్తవుతుండగా హైదరాబాద్ చేరాను. ఎక్కడో ఒకచోట బస చేయాలి కదా. చాలా సేపు తిరిగాక రవీంద్ర లాడ్జ్ కనిపించింది, అడిగి లోనికి వెళ్లి గదిని చూసాను, పరువాలేదని అనిపించింది. గది చూపిన కుర్రవానితో మాట్లాడుతుండగా మడత మంచాలు కూడా అక్కడ దొరుకుతాయని తెలిసింది. ఆ మరునాడే మడత మంచంలోకి మారాను. బట్టలేసుకుని బయటకు వచ్చాను. బాగా ఆకలి అనిపించింది. ఇంత తిని వెనక్కు మళ్ళాను. ‘రిక్షా హోనా సాబ్’ అన్నాడు ఒక రిక్షావాడు, అక్కరలేదన్నట్టు చూసి నడిచాను. కాలేజీ పిల్లలు కొందరు ఎదురొచ్చారు. ఏ బరువూ – బాధ్యతా లేని ఆనందమయ జీవితం వారిదని అనిపించింది. అవధులనతిక్రమించి ఉత్సాహంగా బ్రతికే వయసు కదా. అలా నడుస్తుండగా నా ముందు ఒక రిక్షా ఆగి కనిపించింది. పరదా కప్పి ఉంది. అందులో ఒక ఆడపిల్ల కూడా కనిపించింది, రిక్షావాలా నన్ను ఆపి ఏదో అడిగాడు. నాకర్థం కాలేదు. నా వెనుకున్న అతనితో మాట్లాడి రిక్షా పరదాలో దూర్చాడు. అది కదిలింది. కొద్దిసేపు తిరిగి బస కెళ్ళాను. అక్కడ దొరికిన పేపరు చూస్తూ మడత మంచమెక్కాను. నిద్ర పట్టింది. తెల్లవారక కాలకృత్యాలు తీర్చుకుని సర్టిఫికెట్‌లు పట్టుకుని రోడ్డెక్కాను. చేస్తున్న నౌకరీనీ ఉన్న ఊరునూ ఇంటిని వదిలి ఏమిటిదని అనిపించింది. ఇప్పుడేమనిపించినా ఏదో ఒకటి చేయనిది తప్పదు కదా. చాలా షాపులూ ప్రైవేట్ ఆఫీస్‌లు తిరిగాను. ఈ తిరుగులాటలో వారం గడచింది. పదవనాడు నా ప్రయత్నం ఫలించింది. ఒక ప్రైవేట్ ఆఫీస్‌లో నౌకరీ దొరికింది. నెలకు ఏడువందల యాభై జీతం. చేరిపోయాను. పనిలో చేరాక అదొక రకమయిన ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ అని అర్ధమయ్యింది. నాతో పాటూ ఆఫీస్‌లో పనిచేసే గుమాస్తాలు ఇంకా నలుగురున్నారు. ముగ్గురు మగవాళ్ళు ఒక లేడీ టైపిస్టు. ఆవిడ ఆంగ్లో ఇండియన్ లాగా అనిపించింది. పేరు మోరియా. మా పైన సూపర్‌వైసింగ్ మానేజర్ ఒకావిడ ఉంది. తెలుగమ్మాయే, పేరు సుమతి. దినమంతా ఊపిరి సలపనంత పని ఉండేది. ఉదయం తొమ్మిదింటికి వెళితే రాత్రి ఏడుగంటలకు వదిలేవారు. అయినా చేస్తూ వఛ్చాను. ఒకనాడు ఒక ఫైలు పై సంతకం పెట్టించుకునేందుకు సుమతి దగ్గరకెల్లాను. ఫైలు చూస్తూ కూర్చోమంది. కొద్దిసేపటి తరువాత పైలు చేతికిస్తూ “చివరి సంతకానికి పేపర్ తెచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్రాయాలి” అంది. తల ఊపి వెనక్కు మళ్ళాను. వయసు పాతికకు అటు ఇటుగా ఉంటాయనిపించింది. ముఖ్యంగా ఆవిడ గడ్డం చివరన ఉన్న తేనెవర్ణపు పుట్టుమచ్చ చాలా బాగా అనిపించింది, నేను వస్తుంటే “లోగడ ఎక్కడయినా పనిచేసావా” అని అడిగింది. లేదన్నాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు చూసింది. వచ్చాను.

ఆ మరునాడు అప్పుడే గదిలోకి వస్తున్నా మోరియాను చకచక వస్తూ తగిలేవాడినే. మెలకువగా తప్పుకున్నాను. ఒక నవ్వు పారేసి వెళ్ళిపోయింది. నా సీట్లో కూర్చున్నాక ఒక ధర్మసందేహం కలిగింది. చిన్న వయసుననే ఈ పిల్ల మానేజర్ ఎలా అయ్యింది అని. ఆ తరువాత వారం దినాలు మరీ ఊపిరాడనంత పని తగిలింది. చేసాను. ఎంత చేసినా రాత్రి ఎనిమిది దాకా పని కాలేదు. సుమతి అప్పుడే పైనించి వస్తూ కనిపించింది. నా దగ్గర ఆగి “మీరు రావడం లేదా?” అంది టైం చూసుకుని, “ఆ వస్తున్నా” అన్నాను. ఓ క్షణం ఆగింది. నేను వెంట బయలుదేరాను. రోడ్డున నడుస్తుండగా “ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం, ఇల్లు దొరికితే మూడువంతులు సులువవుతుంది” అని నవ్వింది. వింటూ నడుస్తున్నాను. “ఇంతకీ మీరెక్కడి ఉంటున్నారు” అని అడిగింది. చెప్పాను. “మా ఏరియా పక్కనే అన్న మాట” అంది. బస్ స్టాప్ దగ్గర ఆగి అది రాగానే ఎక్కాం. “దిగాక మా ఇల్లు చూస్తారా చాలా దగ్గర” అంది. తల ఊపి వెంట నడిచాను. ఇంటికి వచ్చాము. ఇల్లు పెద్దగా పొందికగా ఉంది. మూడు నాలుగు పూల కుండీలు ఉన్నవి. ఆవిడ ఉండే వాటాలోనికి తీసుకెళ్ళింది. ఒక హాలు రెండు గదులూ ఉన్నవి. నాకు కుర్చీ చూపింది. సుమతి లోనకకెళ్ళే లోపు ఒక ముసలమ్మ బయటకు వచ్చింది. దైవ ప్రసాదం నా చేత ఉంచి వెళ్ళిపోయింది. ఆనక సుమతి కాఫీ తెచ్చి ఇచ్చింది. చనువుగా ఎదురున కూర్చుంది. కాఫీ తాగాక “ఇవ్వాళ మరీ ఖాళీ దొరకనంత పని కదు” అంది. తల ఊపాను. బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కుని “వస్తారా?” అడిగింది. తల ఊపి వెళ్ళాను. వచ్చాక టైం చూసుకుని “నేనివ్వాళ సినిమాకి వెళదామనుకుంటున్నాను వస్తారా?” అని అడిగింది. బెరకుగా చూస్తూ తల ఉపాను. ఇక్కడికి చాలా దగ్గర సినిమా హాలు. వెళ్లి దాంట్లో కూర్చున్నాము. అంత రద్దీగా లేదు. విశ్రాంతికి ముందు నడిచిన ప్రేమ ఘట్టం అప్పుడు సుమతి నాకు కొంచం దగ్గరగా జరిగినట్టు అనిపించింది. నా చేయి ఆవిడ భుజం దాకా జరిగింది. నాకు ఆఫీసులో మానేజర్ ఈవిడ అన్నదే గుర్తులోనికి రావడంతో చేయి వెనక్కు వచ్చింది. విశ్రాంతి అప్పుడు నేరుగా చూడలేక పోయాను. చూపు మాత్రం ప్రశాంతంగా ఉంది. తిరిగి సినిమా ప్రారంభం అయ్యింది. మరో ప్రేమ ఘట్టం వచ్చింది. ఈసారి నాచేయి కదలలేదు. అయినా ఆవిడ కళ్ళలోనికి చూడాలనిపించింది. కానీ చూడలేకపోయాను. సినిమా వదిలారు. నడుస్తున్నాం. “శివయ్యా” అన్న మాట వినిపించింది. ఆగి వెనక్కు చూసాను. మా ఊరి రాజయ్య. గుండె ఆగినంత పనయ్యింది. వీడు ఊళ్లోకి వెళ్లి నేనిక్కడ కనిపించినట్టు చెప్పడం, నన్ను వెతికేందుకు ఒక తుకిడి బయలుదేరి రావడం, వెతకడం, గుర్తులోకొచ్చింది. ఆగి రాజయ్యను నెమ్మదిగా పలుకరించి, పంపించేసి సుమతిని ఇంటి దగ్గర వదిలి… బసకి వచ్చాను. ఆవిడ అక్కడ ఉండమన్నది. కానీ నాకు కాలు ఆడని పరిస్థితి. ఇక ఒకటి రెండు దినాలకంటే ఇక్కడ ఉండలేము కదా అన్న భావన ఇబ్బంది పెట్టింది. ఆ మరునాడే ఆఫీస్‌కి వెళ్లి ఒక గంట ఉండి బసకొచ్చి పెట్టే బేడా సదురుకుని రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాను. ప్లాట్‌ఫారం పైన బొంబాయి వెళ్ళే రైలు రడీగా కనిపించింది. బొంబాయికి టిక్కెట్ కొని ఎక్కాను. బాగా రద్దీగా అనిపించింది. తెలుగు ప్రాంతం పూర్తీగా దాటినా తరువాత కానీ కూర్చునేందుకు జాగా దొరకలేదు. బండి పూనా చేరింది. తెలుగు మాట బొత్తిగా వినపడలేదు. కసా-బసా అంటూ రాళ్ల చేలో గుంటక తోలినట్టు మాటాడుకోసాగారు. టైం చూసుకున్నాను. రాత్రి రెండు దాటింది. బొంబాయికి ఇంకా ఎంత టైం కి చేరుకుంటాం అని పక్క వాడినడిగాను. చెప్పాడు. నడుస్తున్న రైలులో ఒంటరితనం బరించలేక తెలుగులో నెమ్మదిగా పాట పాడుకున్నాను. నా పాటను గమనించిన ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి “మీరు తెలుగువారా?” అని అడిగాడు. అవునన్నాను. మాటాడుకోను ఒక తోడు దొరికినందుకు సంతోషం అనిపించింది.

“ఎక్కడి దాకా” అని అడిగాడు.

“బొంబాయి”

“ఏం చేస్తున్నారక్కడ?”

ఉద్యోగం కోసం అన్నాను.

“తెలిసిన వాళ్ళున్నారా?”

తల అడ్డంగా ఊపి మొదటిసారి బొంబాయి వెళుతున్నానని చెప్పాను.

“దాదర్‌లో బండి ఆగుతుంది. అక్కడ నాతో దిగండి. ఒక రోజుండి వెల్దురుకాని, మీరు నగరానికి సంబందించిన కొన్ని వివరాలు తెలుసుకుందురుగాని. నేను వివరంగా చెపుతాను” అన్నడు.

సంతోషం అనిపించింది. ఆరాంగా నిద్రపోయాను. దాదర్లో నిద్రలేపుతాడు కదా అని. నిద్రనున్న నన్ను రైల్వే పోర్టర్ నిద్ర లేపితే లేచాను. బండి ఆగి ఉంది. నేను తప్ప ఎవ్వరూ కనిపించలేదు. భగవంతుడి దయవలన తలకింద పెట్టుకున్న సంచి మాత్రం భద్రంగానే ఉంది. కిటికీ నుంచి బయటకు చూసాను. విక్టోరియా టెర్మినల్స్ అన్న బోర్డ్ కనిపించింది. దాదర్‌లో దిగమన్న తెలుగు మిత్రుడు కనిపిస్తాడేమోనన్న ఆశతో నాలుగువైపులా చూసాను. కనిపించలేదు. స్టేషన్ దాటి కిందికి వచ్చి ఆటో ఎక్కాను. చిన్న లాడ్జ్ చూపమన్నాను. ఆటో నాలుగో మలుపు తిరిగే సరికి “స్టార్ ఆఫ్ కొచ్చిన్” అన్న బోర్డ్ కనిపించిది. అక్కడ దిగాను. పైసలిచ్చి అతన్ని పంపి గేటు ముందు జోగుతున్న వాచ్‌మెన్‌ని తట్టి “కమ్రా మీల్తా క్యా?” అని అడిగాను. ‘హాఁ’ అని లోనికి తీసుకెళ్ళాడు. అక్కడ కౌంటర్ దగ్గర విచారిస్తే నెల వారీగా మంచాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఒక బెడ్ కు నెలరోజులు అడ్వాన్స్ ఇచ్చి నా మంచం చూపగా దాని పైకి ఎక్కాను. ఆ మరునాడు తొమ్మిది గంటలకు గానీ మెలకువ రాలేదు. నన్ను లేపిన వాడు కానీ పలుకరించిన వాడు కానీ లేడు. లాడ్జ్ కుర్రాడితో బాత్రూం ఎక్కడో కనుక్కుని కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళుతుంటే నా పక్క మంచం అతను కావచ్చు విష్ చేసాడు. పైగా “నన్ను రాజేంద్ర అంటారు” అని చెప్పుకున్నాడు. నేనూ చెప్పాను. నేను వచ్చాక “బయటకు వస్తావా? ఉంటావా?” అన్నాడు. తల ఊపాను. “అయితే మొదట మా ఆఫీస్ కెళదాం” అన్నాడు. సరేనని త్వరగా ముగించుకుని బయలుదేరాను.

అదిక మహానగరం. ఎంత వేగంగా తిరిగినా ఆరునెలల దాకా కొత్తదనం పోదు. ఏదో పారేసుకున్నట్టు జనం బజార్లంటే పరిగెత్తడమే ఎక్కువగా కనిపించింది. బ్రాములు-బస్సులు-కార్లు-మోటార్ సైకిళ్ళు, వేటితోవ వాటిదే.. అంతా మెకానికల్‌గా అనిపించింది. ఇదే చిత్రమయిన జనార్యణం? అనిపించింది. హైదరాబాద్‌కీ దీనికి పొంతన లేదు. బస్‌స్టాప్ లో నుంచి నిముషానికి ఒక బస్సు నడుస్తున్నా క్యూ మాత్రం కొండవీటి చాంతాడులాగే కనిపించింది, రాజేంద్ర ఆఫీసు మాతుంగ ఏరియాలో ఉంది. వెళ్ళాం. చాలాపెద్ద ఆఫీసు, దాదాపు ముప్పై శాతం ఆడవాళ్ళూ పనిచేస్తూ కనిపించారు. రాజేంద్రను చాలామంది విష్ చేయడం నా కంటపడింది. కొందరిని నాక్కూడా పరిచయం చేసాడు. ఆఫీస్ పని చూసుకుని బయలుదేరాము. రాత్రి పడుకునే ముందు “నేను బి.ఏ. వరకు చదివాను. ఏదైనా నౌకరీ చేయాలి” అన్నాను రాజేంద్రతో. ప్రయత్నిద్దాం అనడమే కాక మరునాటి సాయంత్రం ఒక తెలుగతన్ని వెంటపెట్టుకుని వచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. మాటల సందర్భంలో ఆంద్రసభ సభ ఒకటి ఇక్కడ ఉందని, వాళ్ళు హై స్కూల్ వరకు ఇక్కడ బడిని నిర్వహిస్తున్నారని, బహుశా టీచర్ ఉద్యోగాలు దొరకవచ్చునని తెలిసింది. తెల్లవారి అక్కడకు వెళ్ళాను వెతుక్కుంటూ…. ఒకరిద్దరు గుమాస్తాలు తప్ప నేను వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు. సాయంత్రం నాలుగు గంటలకు గానీ ఆ స్కూల్ చూసే కరస్పాండెంట్ రాడని చెప్పారు. ఆయన వచ్చినదాకా ఉండి కలిసాను. నన్ను నేను పరిచయం చేసుకుంటూ నా సర్టిఫికెట్‌లు చూపించాను. ఎనిమిది వందలు జీతం పైన ఇష్టమయితే చేరిపోమ్మన్నాడు. ఆ మరునాడే చేరిపోయాను. స్కూల్ సిబ్బంది ఇరవై మంది దాకా ఉన్నట్టు అర్థమయ్యింది నాలుగైదు రోజుల్లో. అయితే ఇంగ్లీష్ మీడియంలో చెప్పాల్సి రావడాన కొంచం కష్టపడాల్సి వచ్చింది. లాడ్జ్‌లో ప్రిపేర్ కావాల్సి వచ్చేది. మొదటి రోజు జంకుతూనే నన్ను నేను పంచం

చేసుకోవాల్సి వచ్చింది. “ఇవ్వాల్టికి పిచ్చాపాటి మాట్లాడుకుని రేపటినుండి పాఠాలు ప్రారంబించుకుందాం” అన్నాను. పిల్లలు తలలు ఊపారు. ఆ రోజుతో నా బెరకు తీరిపోయింది. ఏడెనిమిది లక్షలకు పైగా తెలుగువారున్న ఇక్కడ తెలుగుతనం కనిపించదు. బడిన తప్ప తెలుగుమాట వినిపించడు. ఇక్కడ ఆకాశహర్మ్యాలు హంగులు హరివిల్లులా అనిపిస్తాయి. ఆకర్షణా పెరుగుతుంది. వాటిని అందుకోవాలని జరిగే కొద్దీ ఎండమావిలా దూరం జరుగుతూ ఉంటాయి. లేనివానికి ఏమీ అందదు, వున్నవానికే అన్నీ. తెగించితే అందని అంచులూ ఉండవు. దాదాపు అన్ని బేరంలో దొరుకుతాయి. పల్లెల్లో కొందామన్నా దొరకనివి ఇక్కడ అనేకం అందుబాటులో కనిపిస్తాయి. చిత్రమేమంటే అవన్నీ పల్లెలనుంచి వచ్చినవే.

మనం ద్విపాద పశువులం. కాలగమనం మనల్ని మనిషిగా మార్చింది. ఆ మనిషికి కావలసిన మంచితనం నిలుపుకోవడం కనీస ధర్మం. ఇక్కడ పైకి ఎదిగేవారికి పతనం వైపుగా నడిచే వారికి బోలెడు అవకాశాలు. మనం ఏమవుతామన్నది మన నిర్ణయమే. మా మాస్టారు ఒక కథ చెప్పేవారు. దానినే క్లాసున చెప్పాను. శివాజీ మహారాజ్ ఒడిపోయి కొండ గుహన తలదాచుకున్నాడని దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆయనకు ఒక చీమ ఆహారాన్ని తీసుకుని రాయినెక్కుతూ అనేక సార్లు కిందికి దొర్లడం, తిరిగి పైకి ఎగబాకడం, చివరికి గమ్యాన్ని చేరడం కనిపించిందని, ఆ సత్యానీ మనసునందు ఉంచుకుని తన గమ్యం కోసం తీవ్రంగా ప్రయత్నించి సపలత పొందాడు అని నేను అంటుండగా బెల్ మోగింది.

లేస్తూ పిల్లల మొహాలని చూసాను. ఉత్సాహంగానే కనిపించారు. స్టాఫ్ రూమ్‌కి వెళ్ళాను. చాలా మంది కలిసారు. బాగా పరిచయం కాలేదు కనుక కలుపుగోలుగా లేరు. సాయంత్రం లాడ్జ్‌కి చేరాను. స్నానం చేసి మంచం ఎక్కాను. నిద్ర రాకపోగా మనస్సు తెలియను బాధకు లోనయ్యింది. నేను ఏమయిపోతున్నాను అనే ప్రశ్న తలన మెదిలింది. సమదానం లేదు. ఏ కొద్ది మంది మాత్రమే తాము అనుకున్న దాని ప్రయాణం చేసి అంచును చూడగలరు. ఏదో కావాలనుకునడం మరేదో కావడం ఎక్కువగా చూస్తాం. దానర్ధం మన చేతుల్లో మనం లేమని.

రోజులు ఎవరికోసం ఆగవు కదా? నెల గడిచింది. స్కూల్ దూరమాయె. కొంచెం ఇబ్బంది అనిపించగా దగ్గరలో ఏదయినా బస దొరుకుతుందేమో అని ప్రయత్నించాను. దొరకలేదు. అప్పుడు రొట్టెలు మాత్రమే తినడం వలన కడుపు ఆటుపోటుకు లోనయ్యింది, తప్పనిసరయి దాపునున్న డాక్టర్ని కలిసాను. అప్పుడు పరిచయమయ్యాడు డా. దేశ్‌పాండే. ఈయన ఆసుపత్రి చాలా దగ్గరగానూ, పరిశుభ్రం గానూ ఉంటుంది. పాండే దృఢంగా అందంగా ఉంటాడు. పసుపు ఎరుపు రంగున చెదరని చిరునవ్వు. అన్ని మరిచి అతన్ని చూస్తూ కొంతకాలం ఉండొచ్చు అనిపించింది. అతని ప్రవర్తన అంత బాగా ఉంటుంది. నా వివరాలు అడుగుతూ ఓ ఇంజక్షన్ ఇచ్చి నాలుగు మాత్రలు రాసిచ్చాడు. ఎందుకో గానీ ఆయనతో గడిపిన అయిదారు నిముషాలు హాయిగా అనిపించింది. స్నేహం చేస్తే ఇలాంటి వ్యక్తి తోనే చేయాలనిపిస్తుంది. నయమయ్యాక ఒకనాడు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడి “నీతో స్నేహం చేయాలని ఉంది” అన్నాను. “వై నాట్?” అంటూ పెద్దగా నవ్వాడు. ఆ తరువాత ఆయన తీరుబాటును బట్టి వెళ్లి వస్తూ ఉండేవాడిని.

స్కూల్ అంతా తెలుగువారమే కనుక బాగానే ఉంది. నాతో పాటు పని చేసే వారిలో రాణి అనే అమ్మాయితో బాగా పరిచయం అయ్యింది. చాలా కలుపుగోలు మనిషి. అరమరికలు లేక చురుకుగా నీట్‌గా కనిపించేది. అనేక సార్లు నిర్మలంగా ఉండేది. ఒక డు ఒక స్ఫురద్రూపిని నాకు పరిచయం చేసింది. ఆయన పేరు రాజేష్ యం.యస్.సి. ‘మెడికేర్’ లో పని చేస్తున్నాడట. బొంబాయి యునివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మొదటిసారి నేను కలిసినా బాగా తెలిసినవానిలా చనువుగా మాట్లాడాడు. బహుశా నన్ను గురించి రాణి లోగడనే అతనికి చెప్పి ఉంటుంది. నాలుగో నాడు సినిమాకి వెళ్దామన్న ప్రపోజల్‌తో వచ్చాడు. నేను రానన్నాను కానీ వదలలేదు. కారు ఎక్కించుకుని మెట్రో థియేటర్ దగ్గర కార్ ఆపాడు. పార్క్ చేసి లోనికి వెళ్ళాం. సినిమా చూసాక నన్ను లాడ్జ్ దగ్గర దింపి వెళుతూ “ఇక్కడే ఉంటున్నారా” అని అడిగాడు, తల ఉపాను. “మా ఇంటివద్ద ఒక గది ఉంది. మీకయితే ఇస్తాను. నేను అమ్మ మాత్రమే ఉంటున్నాము. రేపొకసారి రండి” అంటూ వెళ్ళిపోయాడు. ఉదయం స్కూల్‌కి వెళుతుండగా డా. దేశ్‌పాండే కలిసాడు. మాటాడుకుంటూ కొద్దిదూరం కలిసి నడిచాం. “మీ కారేది?” అడిగాను. ఆయన చెప్పబోతుండగా మా వెనుకగా ఒక కార్ వచ్చి ఆగింది, మెరుపు తీగ లాంటి పాతిక సంవత్సరాల లోపు అమ్మాయి కార్ దిగింది. పాండే ఆగి “షీ ఈజ్ మై వైఫ్ వినత” అని పరిచయం చేసాడు, నమస్కారం చెప్పాను. వారిద్దరిని కలిపిచూసాక ఇలాంటి జంట కుదరడమే అరుదు అనిపించింది. వారు హాస్పిటల్‌కు నేను స్కూల్‌కి చేరిపోయాము.

ఆ సాయంత్రం గది చూసే నెపంతో రాణి నేను రాజేష్ ఇంటికి వెళ్ళాము. ఆయన తల్లి కావచ్చు మమ్మల్ని లోనికి రమ్మంది. రాజేష్ రమ్మన్నాడని చెప్పాము. వివరాలడుగుతూ కూర్చోమంది. చెప్పాను. నేను చెపుతుండగానే ఆవిడ మొహంలో రంగులు మారుతున్నాయి. పెదవులు వణికినాయి. “తెలుగువాడివా, లే మొదట బయటికి నడువు” అని పెద్దగా అరిచింది. రాణి తెలుగమ్మాయి అని ఆవిడకు తెలియదా? అర్థం కాలేదు. ఆవిడ వేగం చూస్తే వెంటపడి తరుముతుందేమో అన్న భయం వేసింది. రాణి సంగతి సరేసరి. నాకంటే ముందే పరిగెత్తి రోడ్ ఎక్కింది. నాకేదో చెప్పాలనిపించినా లాభం లేదని వెనక్కు మళ్ళాను. ఆవిడ ప్రవర్తన చూసాక మెంటల్ కేస్ ఏమోనని అనిపించింది. మరి రాజేష్ ఎందుకు రమ్మనట్టు? అన్నది మాత్రం తోచలేదు.

నేను నిద్రలేచే సరికి నాకోసం ఎవరో వచ్చినట్టు చెప్పాడు. కిందికి వెళ్ళాను. రాణి కనిపించింది.

ఏమిటీలా?” అన్నాను.

“ఊరికే” అంది. కానీ ప్రసన్నంగా కనిపించలేదు.

“రండి” అని పైకి తీసుకెళ్ళాను.

రాజేంద్ర క్యాంప్‌కి వెళ్ళడాన బెడ్ ఖాళీగా ఉంది. కూర్చునేందుకు దాన్ని చూపాను. అసహనంగా చూస్తూనే కూర్చుంది. నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఆవిడకు ఇచ్చి నాలుగు నిమిషాల్లో వస్తానని బాత్రూం లోకి జోరబడ్డాను. నేనోచ్చే సరికి పుస్తకం మూసి ఏదో ఆలోచనలో ఉంది.

“ఏమిటలా ఉన్నారు? రాత్రి నిద్రపోయినట్టు లేరు?” అని అడిగాను బట్టలేసుకుంటూ…

“తెలుగువాళ్ళంటే ఆవిడకు అంత ద్వేషం దేనికో”…  నిన్న జరిగినదానిని గుర్తు చేసుకుంటూ…. అంది. ఎంతయినా ఆవిడ రాజేష్ తల్లి. అంటే రాణికి కాబోయే అత్తగారు.

“పిచ్చేమయినా ఉందేమో” అన్నాను.

తల అడ్డంగా ఊపింది.

“రాజేష్‌ని అడిగితే చెపుతాడు కదా!” అన్నాను.

“ఆయన ఇలాగ ఆవిడలా మరోలా అయితే?”

“ఎందుకలా అనుకుంటున్నావ్? విషయం చెపుతాడు కదా. మనకున్న అనుమానం తీరిపోతుంది.”

“ఏమనుకుంటాడో ఏమో” అని సణుగుతూ లేచింది. ఏది ఏమయినా ఆవిడ మనస్సు మనసున లేదులా ఉంది.

“నేను రాజేష్ పెళ్ళిచేసుకుందాం అనుకున్నాం” అంది. అంత చిరాకులోనూ రాణి మొహం కందింది. “తెలుగు వాళ్ళంటేనే అలా మండిపడే ఆవిడ ఇంటికి కోడలుగా వెళ్ళడం?”

“రాజేష్ కలుస్తాడు కదా, తెలుసుకుందాం” అన్నాను.

తల ఊపి లేచింది. ఇద్దరం స్కూల్‌కి బయలుదేరాం. హాస్పిటల్ దాటుతుండగా డా. పాండే -వినత కనిపించారు. విష్ చేస్తూ ఆగాను. కారు ఆపి “లోనావాలా వెళ్తున్నాం. నువ్వూ రారాదు” అని అడిగారు. రాలేనని చెప్పి రాణిని వారికి పరిచయం చేసి వారు వెళ్ళాక స్కూల్ దిశగా నడిచాము. స్కూల్ కాంపౌండ్ ముందే రాజేష్ కార్ కనిపించింది. రాణి అతని దిశగా పరిగెత్తింది. నేను విష్ చేసి స్కూల్ లోకి నడిచాను. రాజేష్ చప్పట్లు కొట్టి నన్ను ఆగమన్నాడు. నా దగ్గరకు వచ్చి “నేను టైంకి మా ఇంటికి రాలేక పోయాను. ఆవిడ మిమ్మలని అవమానించి ఉంటుంది” అన్నాడు నన్నే చూస్తూ. మౌనంగా ఉన్నాను.

“మనం అలా బయటకు వెళ్లామా” అన్నాడు.

“ఇప్పుడు క్లాస్‌లు ఉన్నాయి”

“చెప్పి రండి”

సరేనని లోనికి వెళ్లి అనుమతి తీసుకుని వచ్చి రాజేష్ కారులో కూర్చున్నాను. తరువాత రాజేష్, రాణి ఎక్కారు. ఒక పెద్ద హోటల్ ముందు కార్ ఆపాడు రాజేష్. మూడో అంతస్తు లోని ఒక విశాలమయిన గదిలోనికి తీసుకెళ్ళాడు. కూర్చున్నాక  “మా ఇంట మీకు అవమానం ఎదురయ్యింది కదూ, ఎందుకలా ప్రవర్తించి ఉంటుందనుకున్నారు. పిచ్చి అని అనిపించి ఉంటుంది” అన్నాడు ఇద్దరినీ చూస్తూ.

“కాదా?” అన్నాను తలదించుకుని.

“కాదు” అన్నాడు.

“మరి”

అతని మొహంలోనూ రంగులు మారినవి. కొంత విడత ఆవేశానికి లోనయ్యి రోడ్ వైపుగా ఉన్న కిటికీ దగ్గరకు నడిచి కర్టెన్ పక్కకు జరిపి “నేను ఒక సంఘటన చెబుతాను” అని మొదలెట్టాడు.

“మా నాన్న గారు, రామకృష్ణ గారు మంచి స్నేహితులు. కలిసి కలప వ్యాపారం చేసారు. చేసిన వ్యాపారం ఇద్దరికీ కలిసి వచ్చింది. బాగా స్థిరపడ్డారు. మాది పూణా. రామకృష్ణది ఖమ్మం. ఒకసారి ఎవరికోసమో అట్టిపెట్టిన టెండర్ అనుకోకుండా వీరికి తగిలింది. అందువల్ల ఊహకందనంత లాభించే అవకాశం ఉంది. ఈ అవకాశం అందినందుకు చాలా ఆనందించారు. అయితే అకస్మాత్తుగా మా నాన్నగారు హంతకునిగా పోలీస్ లాకప్‌కు, అక్కడినుండి సబ్-జైలుకు తరలించబడ్డారు. ఆ తరువాత సాక్షాలు బలంగా ఉండటంతో నాన్నగారికి యావజ్జీవ శిక్ష పడింది. అమ్మ దిక్కులేనిదయ్యింది. రామకృష్ణ జాడ మాత్రం లేదు. ఏమయ్యాడో అంతుపట్టలేదు. అమ్మ మాత్రం రామకృష్ణ వచ్చి ఆదుకుంటాడని చాలా ఆశగా ఎదురుచూసింది. మా కుటుంబానికి చాలా దగ్గరవాడు కనుక ఆశపడటంలో తప్పు లేదు. విధి అని తలచి గుండె దిటవు చేసుకొని చాలా కస్టపడి నన్ను చదివించింది. నాలుగు సంవత్సరాల క్రితం శిక్షాకాలం పూర్తయ్యి మా నాన్న బయటకు రావలసి ఉంది. అయితే సరిగ్గా నెలరోజుల ముందు మానాన్న గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఇది మా అమ్మను మరీ వేదనకు గురిచేసింది. భగవంతుడా ఏమిటీ అన్యాయం అని అరుస్తూ పడిపోయేదప్పుడప్పుడూ. మా నాన్న చనిపోయిన ఏడాదికి ఒకనాడు ఒక పెద్దమనిషి కారులో మా ఇంటి ముందు దిగాడు. నేను ఇంట్లోనే ఉన్నాను…

“ఇది పలానా వారి ఇల్లేకదు” అడిగాడు.

“ఇదే” అని చెప్పి అతిథిలా వచ్చిన అతడిని కూర్చుండబెట్టాను.

“నువ్వు రాజేష్‌వే కదూ” అడిగాడు. ఆశ్చర్యంగా చూసాను. ఇంటిని పరిశీలనగా చూస్తూ “అమ్మ ఏది” అని అడిగాడు.

అమ్మకూడా తెలుసునన్న మాట అనుకుని కొంచం పరిశీలనగా చూసాను. మాసిన కోటు పండిన జుట్టు, వెడల్పాటి పైజామా, మొకంలోని ముడతలు, కళ్ళు ఆర్పడాలు… అంత సంస్కారిలా కనపడలేదు. అయినా లోనికెళ్ళి అమ్మను పిలిచాను. బయటకు వచ్చిన అమ్మ నిలబడి చూసింది. తలపై చీరచెరుగు సరిచేసుకుంటూ,

“నమస్తే బాయి….” అన్నాడతను లేచి. ఆ కంఖాన్ని వెంటనే అంతలా గుర్తించినట్టు లేదు. అయితే మళ్ళీ నిశితంగా అతన్ని చూసింది. అప్పుడు అమ్మకు గుర్తులోకొచ్చాడతాను.

“నేను బాయి, రామకృష్ణను… నన్ను మన్నిచాలి” అని కాళ్ళపై పడ్డాడు.

అమ్మలో మార్పు రావడం కనిపించింది. “ఇంకా బ్రతికే ఉన్నావన్న మాట, చచ్చావనుకున్నాను” అంది కటువుగా.

తల మాత్రం బాధగా ఊపి “బాగా ఆర్జిద్దామని చాలా దూరం వెళ్లాను బాయి. నాది దురాశ అని కొద్దికాలానికే అర్థమయ్యింది. నేను నమ్మిన స్నేహితులూ నామాదిరే నన్ను వంచించారు. తాతల నాటి మూకుడు తలాపిననే ఉంటది కదా. ఇహ నా కుటుంబం కలరా వాతపడి ఊహించని విధంగా వరుసగా చనిపోయారు. నరకాన్ని ఈ కళ్ళతో చూసాను. ఏది ఎలా జరిగినా చాలా ఆలస్యమయినా జరిగింది చెప్పాలని ఉంది, జీవచ్ఛవంలా వచ్చి మీముందు నిల్చున్నాను.”

“జైలు జీవితం పూర్తి కాకుండానే ఆయన చనిపోతే ఇప్పుడా నువ్వు వచ్చేది” అని పిచ్చిదానిలా నవ్వింది అమ్మ,

“అలాకాదు. బాయి, నిజం చెపుతున్నాను, ఇక్కడ పాపం అంటింది. ఇక్కడే వినిపించింది, అందుకేనేమో నేనుగా చనిపోయేందుకు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. మృత్యువుని ఎంతగా ఆహ్వానించినా దూరంగా జరిగింది. చేయని నేరానికి నా స్నేహితుడు శిక్షను అనుభవించాడు. ఇది తెలిసి కనీసం సానుభూతిని చూపేందుకు రాలేకపోయాను. నాకున్న శక్తి యుక్తులు స్నేహధర్మాన్ని మరిచినాయి, కఠినంగా మారింది గుండె. నేను పేరాశతో పరిగెట్టడం ఆపి వెనక్కి చూస్తే ఏం మిగల్లేదు. నిజానికి నిష్కృతి లేని జీవితం నాది. అందుకేనేమో ఎంతవేదన నన్ను పింసిస్తున్నా కంటతడి రాదు. కన్నీరు కారితే కదా బాధ తగ్గేది” అంటుండగానే..

“రామక్రిష్టా చెప్పింది చాలు, ఇక చెప్పకు వెళ్ళిపో. మళ్ళా నా కంటపడకు” అని అరిచింది అమ్మ.

“నన్ను క్షమించు బాయి” అని లేచి భయం భయంగా వెళ్ళిపోయాడు.

అమ్మ అలాగే చూస్తూ కూర్చుంది. ఆవిడ కళ్ళ నుండి నీరు ఆగడం లేదు. ఆవిడని పలకరించడం బాగా అనిపించలేదు. తెలియకుండా అంతులేని బాధ నన్ను ఆవహించింది. బయటకు నడిచాను,

నేను ఇంటికి చేరేసరికి బాగా రాత్రి అయ్యింది. డ్రాయరు సొరుగునే దాచిన పుస్తకం ఒకటి తెరిచాను. ‘రాజేష్‌కు’ అని ఒక కవర్ కనిపించింది. లక్షాయాభైవేల రూపాయలకు ఓ చెక్కు, ఉత్తరం ఉంది. గబగబా విప్పి చదివాను,

“బాబూ నేనయ్యా, రామకృష్ణను. ఈ పేరు ఉచ్చరిస్తే పుణ్యలోకాలు దొరుకుతాయేమో కానీ, పేరున జీవిస్తున్న నాకు మాత్రం నరకాన కూడా చోటు దొరకదు. నన్ను నా మనసునూ వంచించుకున్నాను. నన్ను ఆవరించిన దురాశ నాలోని మంచితనాన్ని చంపేసింది. ఇప్పుడు నేనభవిస్తున్న నరకం ఎక్కడా దొరకకు. దీన్నీ ఎక్కువకాలం నేనూ భరించలేను, ఇహ విషయంలోకి వస్తాను. మీ నాన్న జైలు కెళ్ళాడు – చేయని హత్యకు. నువ్వు కొంచెం నిబ్బరంగా విను. జరిగినదేమయిననా ఇవ్వాల పూడ్చేది కాదు. సరిచేసుకొనే కలిగేది కాదు. నువ్విప్పుడు మేజర్‌వి. లోకావలోకనం ఎంతో కొంత నీకు తెలిసి వుంటుంది. మీకు మీ అమ్మ న్యాయస్థానానికి తెలియని నిజాన్ని నీకు చెపుతున్నాను. దీన్ని మీకు చెప్పేందుకే నా బ్రతుకు ముగింపు కాలేదేమో? ఇహపై మీకు కలువను. నిర్దోషి అయిన మీ నాన్నకు కోర్టులో శిక్ష పడింది. నిర్దోషి అని నాకు తెలిసీ నేను రాలేదు. బహుశా మీ నాన్న ఎదురుచూసి ఉండవచ్చు. స్నేహితుడినయి ఉండి న్యాయం చేయలేకపోయాను. ఎందుకో తెలుసా…?

ఆ హత్య చేసింది నేనే, ఈమాట చదవగానే వెర్రివాడవు కాకు. నన్ను హతమార్చేటంత కోపం వచ్చినా పర్వాలేదు. కానీ ప్రశాంతచిత్తుడవయి చదువు.

మేము చేస్తున్న వ్యాపారంలో అనూహ్యంగా లాభాలు వచ్చినయి. ఫారెస్ట్ రేంజర్ మమ్మల్ని వెంటాడి వేధించసాగాడు. అతను మాకు జీవన్మరణ సమస్యలా మారాడు. ఏదో ఒకటి చేయాలనుకుంటున్న సమయాన సర్వే కొచ్చిన రేంజరు కాలుజారి రాళ్ళ గుట్టపైనుంచి లోయకి దొర్లి స్పృహ కోల్పోయి కనిపించాడు. నీను వైద్య సహాయం చేస్తే అతను బ్రతికేవాడే.. అతను పడివున్న తీరు దయనీయంగా అనిపించింది, జాలీ కల్గింది. కానీ అప్పటిదాకా మమ్మల్ని వెంటాడి, భాదించిన తీరు గుర్తుకొచ్చి నాలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. నేను మోయగలిగిన బండ ఎత్తి బలంగా అతని తలపై వేసి చేతులు దులుపుకుని నడిచాను, అప్పుడే మీ నాన్న ఆటు వస్తూ దూరంగా కనిపించాడు. నేను పారిపోయాను. పడివున్న రేంజర్ ను మీ నాన్న జాలిపడి బ్రతికించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఈ లోపల కోయలు చుట్టుముట్టారు. మా వైరం వారికి తెలుసు. మీ నాన్నే హత్య చేసాడనే భావన వారికి కలిగింది. శవంతో పాటు ఆయన్ని కదలనివ్వలేదు, వాళ్ళే పోలీసులకప్పగించి సాక్ష్యం చెప్పారు. అయితే వారిలో కొందరిని యాక్సిడెంట్ చేసి చంపేసాను. అయినా నా ఆవేదన చల్లారలేదు. సమయానికి మిత్రునికి సాయం చేయలేక పోయాను. పైగా వాస్తవానికి ఆ హత్య చేసింది నేను. అతను దోషి అయ్యాడు. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించపడింది. నేనుగా చేసిన తప్పు అంగీకరించేందుకు మనసొప్పలేదు. ఆయన శపించినా శ్రమించినా నేనేదో చోట దిక్కుమాలిన చావే చేస్తాను. కానీ బాబు బంగారం లాంటి మీ కుటుంబం వీధిన పడింది. మీకు క్షోభ కలిగించాను. నా తప్పిదానికి నిష్కృతి లేదు, బాయి పాదాలపై పడీ మన్నించమని ఏడవాలనిపించింది. బాబు ఎంతో మంచిగా వ్యాపారం ప్రారంబించాం. ఊహకందని మలుపులు నా బ్రతుకులనిలా చేసినవి. నేను కఠిన శిలను. ఇప్పుడే కరుగుతున్నాను….. ఉంటాను —–రామకృష్ణ,

ఉత్తరం పూర్తయ్యేసరికి నా శరీరం చెమటతో తడిచిపోయింది. అమ్మ దగ్గరకెళ్ళి చెప్పాను. ఆవిడ స్పృహ తప్పింది. డాక్టర్ దగ్గరకు చేర్చాను, నాలుగోనాడు స్పృహ వచ్చింది. అది మొదలు తెలుగు మాట విన్నా, తెలుగు వాండ్లన్నా ఏదోలా అయిపోయి విపరీతంగా ప్రవర్తిస్తుది.

నేను రామకృష్ణ కోసం చాలా వెతికాను. కనిపించలేదు. అని ఆగి.. మావైపు చూసాడు.

రాణి ఏడుపు ఆపుకునే ప్రయత్నంలో ఉంది.

“అవును అందుకే అలా ప్రవర్తించి ఉంటుంది” అన్నాను.

“శివా” అన్నాడు రాజేష్ నా భుజం పై చేయివేసి.

“ఆవేశంగా మాట్లాడానా?”

“అదేం లేదు. మనిషి బ్రతుకే చిత్రమయినది. ఒంటరిగా పుట్టి ఒంటరిగానే పోతాడు. మధ్యన మాత్రం నలుగురితో కలసిమెలసి ఉన్నట్టు కనిపిస్తాడు. అదే మనిషి కథ” అని, “రాజేష్ రాణి తెలుగమ్మాయి కదా?” అని నా సందేహం చెప్పాను.

“రాణి నా ప్రాణం, రాణి లేనిదే నేను బ్రతకలేను” అన్నాడు రాజేష్.

కళ్ళు తుడుచుకుని రాణి రాజేష్‌కి చేరువయ్యింది.

“ఇహ వెళదామా?” అన్నాను

“కాఫీ తాగి” అన్నాడు రాజేష్.

తరువాత నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు. నేను వచ్చి నా మంచం ఎక్కాను. ఆ పూట ఏమి తినాలనిపించలేదు. రామకృష్ణ పైకి నడిచినయి ఆలోచనలు. విధి ఆడిన నాటకంలో స్నేహితులిద్దరూ బలి అయిపోయారనిపించింది. రామకృష్ణలో స్వార్థం కనిపించినా మరో మార్గం లేదు గదా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here