జవాబునారీ

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రతి వంద రూపాయలకీ కొడుకుకీ కోడలికి లెక్క చెప్పుకోవాల్సిన ‘జవాబునారీ‘ కథ ఇది. రచన పురాణం శ్రీనివాస శాస్త్రి. [/box]

[dropcap]‘అ[/dropcap]మ్మో! నాన్న’ సందు మొగలో నిలబడి వీధి చివరకి చూస్తూ దూరం నించి బైక్ మీద దూసుకొస్తున్న తండ్రిని గమనించి భయంతో గట్టిగా అరవబోయాడు శీను. అమృత వెనకనించి పట్టుకొని చెయ్యి అదిమి పెట్టింది వాడి నోటికి.

‘నడు ఇంటికి’ అంటూ ఓ చేత్తో వాడి నోరు అలాగే అదిమి పట్టుకొని ఇంటికి బలవంతంగా నడిపించింది అమృత. ఆ సందులోనే వాళ్ల ఇల్లు.

మధ్యలో వాడు పెనుగులాడాడు. తల్లి చేతుల్లోంచి విదుల్చుకుని పారిపోవాలని చూశాడు. అయితే అమృత సాగనివ్వలేదు. ఆమెకి తెలుసు, వాడు ఏదో తప్పు చేసాడని. అదిలింపులని లెక్కచేయడు. వాడికి తండ్రి భానోజీ అంటేనే భయం. ఇప్పుడు తండ్రి వచ్చేస్తున్నాడనే తల్లి అదిలింపుని వినీ విన్నట్టు వింటున్నాడు. అప్పటికీ విదిలించుకు పారిపోవాలన్న ప్రయత్నం మానలేదు. కొడుకు నోటిని అదిమి పెట్టి, వెనక్కి తిరిగి భర్త కోసం చూసింది అమృత. అతను మధ్యలో ఆగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

‘ఆయనొచ్చేలోగానే వాడేం చేశాడో కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకుని “చెప్పు. ఎందుకలా నాన్నని చూసి భయపడుతున్నావ్. పారిపోవాలని చూస్తున్నావ్” పట్టుకుని కుదుపుతూ అడిగింది శీనుని.

వాడు బిక్కు మొహంతో ఏదో నసుగుతున్నాడు. తప్పు చేసేసి బాధ్యత ధీమాగా తల్లి మీదకి తోసేసి, ఉట్టినే భయం నటించడం వాడికి ఆనవాయితీ.

అమృతకి అనుమానం వచ్చింది. వాడు చెయ్యకూడని తప్పే చేసాడని.

భర్తది ప్రైవేటు ఉద్యోగం. సీనియారిటీ మీద ఇంక్రిమెంట్లు కలిపి జీతం ఫర్వాలేదు. దేనికీ లోటు లేని సంసారం. ఊరవతల శివారులో ఎప్పుడో చవగ్గా కొన్న ప్లాటు ఇప్పుడు కొద్దిగా కాసులు ఘల్లు మనిపించడంతో, ఆ ఘల్లులో కొంత బ్యాంకుకి వినిపించి లోన్ సంపాదించారు ఆయన. దాన్తో ఓ టు-బెడ్‌రూమ్ ప్లాట్ కొన్నారు. నలుగుర్నీ పిలిచి, తోరణాల పండగ ‘ధూంధాం’ అనిపించారు. ఇల్లు అమరిన ఆనందం అక్కడితో సరి. దాచిందంతా అరగదీసిన మంచి గంధంలా ఆవిరయిపోయింది. అయితే దాని సువాసనలు అంతో ఇంతో మిగిలి తాకుతూనే ఉన్నాయి నాసికాపుటాల్ని.

తరవాత అమృతకి కొత్త చిక్కొచ్చి పడింది. అసలే ఆచి తూచి ఖర్చు చేసే భర్త అడిగే ప్రశ్నలకి దొరకని జవాబులు ఇల్లు కొన్నాక ఎక్కువైపోయాయి అమృతకి.

‘ఏమిటీ సర్ఫ్ ప్యాకెట్ రెండు రోజులకే అయిపోయిందా?’

“శీనిగాడి టెక్స్టు పుస్తకాలు బజార్లోకొచ్చాయి. ఏం చేద్దామిప్పుడు?”

“నాన్నకి, అమ్మకి ఒంట్లో బాగోలేదు. సమస్య ముదరక ముందే ఇప్పుడే వెళ్లి తీసుకొచ్చేద్దామంటావా?”

“అయినా ఆ పల్లెటూరి ఇల్లు వదిలి వాళ్లు రాకపోతే ఏం చేయాలి?” – ఇలా ఉంటాయి ఆయన ప్రశ్నలు.

‘బతుకు ఫిడేలు నాదంలా ఉండాలంటే ఖర్చులు విషయంలో రేకు అంచు మీద నడకలా మనం సాగాలి’ అంటాడు భానోజీ.

ఇల్లు కొన్నాక ఆ మాట కొంచెం పట్టి పట్టి మరింత గట్టిగా అంటున్నాడు. తనకి జాలేస్తుంది. అందుకే తన అదుపులో ఉన్న ఖర్చులని ఆ మేరకు బిగపట్టడం నేర్చుకుంది అమృత.

ఇప్పుడు “సర్ఫ్ ప్యాకెట్” తెమ్మని చిల్లర లేక వందరూపాయల నోటిచ్చింది శీనుకి. వాడి భయం చూస్తుంటే ఆ డబ్బుతో ఏదో గల్లంతు చేసినట్టే ఉంది. డబ్బు తప్పులకే అంతగా భయపడతాడు వాడు. వాడి చేతిలోంచి సర్ఫ్ ప్యాకెట్ గుంజుకుని ‘ఏదీ చిల్లర’ అని నిలేసింది.

చిల్లర చూడకుండానే అదిలిస్తున్న తల్లిని కేర్‌లెస్‌గా, దూరంగా ఇంటిదారి మధ్యలో ఆగి ఉన్న తండ్రిని భయంగా చూసాడు శీను.

వాడి చొక్కాజేబులో చెయ్యిపెట్టి చిల్లర బైటికి తీసి లెక్కపెట్టింది అమృత. పది రూపాయలు మాయమయ్యాయి. కేవలం పది రూపాయలు. కాని భర్త భాషలో ‘అయ్యబాబోయ్ పది రూపాయలే’ అని తలచుకున్నాక అమృత బిగుసుకుపోకుండా భయాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలో పడింది.

“ఆయన అడుగుతారు. ప్రతి పదిపైసలకి లెక్క చెప్పాలి నేను. పిల్లాడు ఏ చాక్లెట్‌కో తగలేసినా ఆయన ఊరుకోరు. నీ నిర్వాకం ఏమయింది. వృథా ఖర్చులు చేయకుండా వాడిని అదుపాజ్ఞల్లో ఉంచలేవా. ఈ వేళ పదిరూపాయలయింది. రేపు వెయ్యిస్తే వంద గల్లంతేగా?” అని నిలవేస్తారు. ఎదురవబోయే ప్రశ్నల వర్షంలో ఎలా తడవకుండా తప్పించుకోవాలో ఆలోచిస్తూ తల్లడిల్లే తల్లి భంగిమలో నుదురు కొట్టుకుంటూ నిలబడింది అమృత.

***

ఇప్పుడు దశాబ్దాలు గడచిన గుర్తుగా అమృత తల ముగ్గుబుట్ట అయింది. భానోజీ తలకి మగ్గుబుట్ట కాకుండా కొత్త పేరేదైనా పెట్టాలిప్పుడు. అమృతవి పది నల్ల వెంట్రుకల మథ్య ఐదు తెల్లవైతే, భానోజీవి వంద మధ్య వెయ్యి అన్నట్టుగా ఉంది.

బియ్యం 20 కిలోల బస్తా కావాలని చెప్పిందతనికి. ఆ వీధిలోనే డిపో. వెళ్ళి గంటయినా పత్తా లేరు.

“మీ వల్ల ఏమౌతుంది. మీరు ఇంట్లో కూచోండి. నేను ఫోన్లో అర్డరిస్తే వాడే తెచ్చి పడేస్తాడు బస్తా” అన్నా వినిపించుకోకుండా వెళ్లాడు భర్త. ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని చూస్తోంది. తామిద్దరికి వయస్సులైపోయాయి. అంతగా పనిపాటా తెలిసిన మనిషి కాదు. వద్దుంటుంటే ఎందుకు వెళ్లినట్టు అని తలపోస్తోంది భర్త గురించి.

హఠాత్తుగా ఆమెకి తట్టింది. వెయ్యి రూపాయలు. అవును డిపోలో అడ్వాన్స్ ఇస్తానంటూ పట్టుకెళ్ళారు ఆయన. ‘అడ్వాన్సొద్దండీ. బస్తా ఇంటికొచ్చాక ఇవ్వొచ్చు’ అని చెప్పింది తను. కాదు కూడదు అన్నారు. తనకి చిన్నతనంగా ఉంటుందని మరీ మరీ అడిగి పట్టుకెళ్ళారాయన. వెళ్లిన మనిషి ఇంకా రాలేదంటే ఏం చేస్తున్నట్టూ.

అమృతకి అనుమానం వచ్చింది. ఆయనేదో చేసారని. అది డబ్బు తప్పయితేనే అమృతకి గొంతులో పచ్చివెలక్కాయ పడుతుంది.

ఈమధ్యన కొడుక్కి జావాబిచ్చుకోనక్కరలేకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు ఖర్చుల విషయంలో.

కొడుకు ఐదేళ్ల క్రితం, ఆయన రిటైరైన రెండేళ్లకి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళాడు. కొడుకు కోడలు ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. తల్లిదండ్రుల మీద భక్తి అనురక్తి హెచ్చు కాబట్టి తమ బాగోగులు కొడుకు చూసుకొంటున్నాడు.

అమెరికాలో పిల్లల దగ్గర కొన్నాళ్లు గడిపి వచ్చిన కొందరి మాటలు వింటుంటే అమృతకి పెద్ద దిగులైపోయింది.

“అక్కడ ఎంత సంపాదించినా మొగుడు, పెళ్లాలు ప్లానింగ్ ప్రకారం ఖర్చు చేసుకోవాలమ్మా. అటూ ఇటూ అయితే.. అబ్బో.. కుడితిలో పడ్డ ఎలకలే మన పిల్లలు” అని ఈ మధ్యనే కోడలికి టెక్సాస్‌లో పురుడు పోసి వచ్చిన అండాళ్లు గుండెని చరుచుకుంటూ చెప్పింది.

కాగా ఈ మధ్యన కొడుకూ, కోడలూ కొత్తిల్లు కొనుక్కుని గృహప్రవేశం దృశ్యాలు వెబ్ క్యామ్‌లో చూపించారు. లంకంత ఇల్లు. ఎంత ఖర్చయి ఉంటుందో అని బెంగపడింది అమృత.

దానికి తగ్గట్టు బ్యాంకు లోను వివరాలు చెబుతూ కోడలు చాలా సేపు మొబైల్‌లో మాట్లాడింది. వాట్సప్‌లో ఇంటి తాలుకు చిత్రాలు, బ్యాంకు కాగితాలు నకళ్ళు పంపించారు. ఆ ఇంటి ఫోటోలు సరే, కాని బ్యాంకు కాయితాలు ఎందుకు పంపిచినట్లు. నెల నెలా తమకు పంపే మొత్తంలో ఎందుకు కోత కోసినట్టు.

అమృత, బానోజీరావు దంపతులు ఓ రాత్రంతా చర్చించుకొన్నారు. ఏదో తెలియని దిగులు పట్టుకుంది ఇద్దరికీ తెల్లారగానే బానోజీ అన్నీ మరిచిపోయాడు.

అమృతకి గుండెల్లో ఏదో కలుక్కుమంటూనే ఉంది. కాసేపటికి బియ్యం బస్తాతో ఆటోలోంచి భానోజీ ఆ వెనకే స్కూటీ మీద షాపు తాలూకు కుర్రాడు దిగారు. వాడు బస్తా లోపల పెట్టి బిల్లు అమృత చేతిలో పెట్టాడు. బియ్యం సరుకులు కలిపి పదిహేను వందల బిల్లు అయింది. “ఆయనిచ్చారుగా వెయ్యి ఇదిగో ఐదు” అంటూ ఐదు వందనోట్లు కుర్రాడి చేతిలో పెట్టింది.

బానోజీ కొత్త చెప్పుల కేసి మురిపెంగా చూసుకున్నాడు.

“బియ్యం, రేజరు, షేవింగ్‌క్రీమ్ తెస్తే పోయేదానికి ఈ కొత్త చెప్పులు ఎందుకు కొన్నారండి. ఉన్న చెప్పులతో సర్దుకుంటే ఆనక వాడితో మాట పడక్కరలేదు కదా. ప్రతి వంద రూపాయలకీ కోడలికి వాడికి లెక్క చెప్పుకోవాలి నేను. ఏ మాత్రం డబ్బు తగలేసినా వాళ్లు ఊరుకోరు. నీ నిర్వాకం ఏమయింది అంటారు” అంది. చిన్నప్పటి తన కొడుకులా ఇప్పుడు భానోజీ అమృతని లెక్కలేనట్లుగా చూశాడు.

‘దుబారా ఖర్చులు చేయకుండా నాన్నని కట్టడిచేయలేవా? ఈ నెల మూడు వందలయింది. రేపు పదిహేనువేలు పంపిస్తే వెయ్యి గల్లంతేగా’ అని కొడుకు నిలదీస్తునట్టు ఉలిక్కిపడింది అమృత.

ఎదురవబోయే ప్రశ్నల వర్షంలో తడవకుండా ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ తల్లడిల్లే తల్లి భంగిమల్లో నుదురు కొట్టుకొంటూ నిలబడిపోయిది ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here