[dropcap]తె[/dropcap]లంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి తెలంగాణా ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. అందులో కవి,ఉద్యోగి, పాత్రికేయుడు అందరికీ చిరపరిచితులు అయిన కందుకూరి శ్రీరాములు గారు ఆధునిక వచన కవిత్వం విభాగంలో ”తెలంగాణ స్టేట్ లెవల్ అవార్డ్స్ 2018” అందుకున్న సంతోష సందర్భంగా ఆయన రాసిన మొట్టమొదటి సంపుటి “వయొలిన్ రాగమో వసంత మేఘమో” అనే పుస్తకాన్ని పరిచయం చేయదలుచుకున్నాను.
కందుకూరి శ్రీరాములు సిద్దిపేట మండలం రావురూకుల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో రత్నమ్మ,క్రీశే వెంకటాద్రి గార్లకు జన్మించారు.చిన్నప్పటినుండే నాటకాలు వేయడం,పాటలు పాడటం, కవిత్వం రాయడం ప్రవృత్తిగా ఎంచుకున్నారు. పల్లె జీవనం, సామాన్య ప్రజల జీవనవిధానం, ఎలా ఉంటుందో శ్రీరాములు గారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 1972నుండి కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఒకసారి ఒక కందపద్యాన్ని రాసి డా. సి. నారాయణరెడ్డి గారికి పంపితే శ్రీరాములు రాసిన పద్యం చదివి ”నీ కవితాజిజ్ణాస అభినందనీయం” అని అభినందిస్తూ కార్డు రాసి పంపారు. ఆ అభినందన వల్ల రచనలు చేయాలనే కోరిక బలపడేటట్లుచేసింది. “పత్రికలకు పంపే వచన కవితలు కూడా బాగున్నాయి“ అని కలిసినప్పుడు అభినందనందించేవారు సి.నారాయణ రెడ్డి గారు. అలా మొదలైన రచన దాదాపుగా 48 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా కందుకూరి శ్రీరాములు కవిత్వం అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంది. అప్పటినుండి రాసుకున్న శ్రీరాములు కలంనుండి జాలువారిన కవితల మణిహారం మొట్టమొదటి సంపుటి” వయొలిన్ రాగమో వసంతమేఘమో” మే 1993లో మొదటి ప్రచురణ జరిగింది.
మొదటిది దివిటీ (మినీ కవితా సంకలనం) 1974, వయోలిన్ రాగమో వసంతమేఘమో 1993, సందర్భం(2001), కవ్వం (2002), దహనకావ్యం “దీర్ఘ కవిత”(2003), పీఠభూమి (2005), వెన్నెల బలపం (2008), రావురూకుల (2009), తెలంగాణ రథం (2013), అలుకు పిడుచ (2017),లో అచ్చయ్యాయి. అవార్డులు చాలానే వచ్చాయి. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు (సందర్భం) 2003, తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం (సందర్భం) 2004, సినారె కవితా పురస్కారం (రావురూకుల)2010, ఉమ్మడి శెట్టి కవితా పురస్కారం (వయొలిన్ రాగమో వసంతమేఘమో) 1994, ఈదూరు సుబ్బయ్య సాహితీ పురస్కారం (రావురూకుల)2010, ఆంధ్ర సారస్వత సమితి ప్రతిభా పురస్కారం (కవ్వం)2003, అల్లూరి సీతారామరాజు కళాపీఠం ‘కవితారమ’ పురస్కారం (వెన్నెల బలపం) 2010, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (ఆంధ్ర ప్రదేశ్)2008, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (మెదక్)1995, శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ (రాష్ట్ర స్థాయి ముదిగంటి వేంకట నరసింహారెడ్డి సాహితీ పురస్కారం)2014, స్వర్గీయ కర్పూరం మధుసూధనస్వామి సాహిత్య పురస్కారం (2016) ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక విషయానికొస్తే మొట్టమొదటి కవితా సంకలనం ‘వయొలిన్ రాగమో వసంతమేఘమో’ 1970 లలో మన తెలంగాణా లోని పరిస్థితికి అద్దం పడుతుంది. ఇందులో మొత్తం 43 కవితలున్నాయి. 1981 నుండి 1993 వరకు వివిధ పత్రికల్లో అచ్చు అయిన కవితల సమాహారం ఈ వయొలిన్ రాగమో వసంతమేఘమో. మొట్టమొదటి కవిత ‘సముద్ర సభ’, చివరిది ‘వయొలిన్ రాగమో వసంతమేఘమో’.
సముద్ర సభ శ్రీరాములు సముద్రం పై రాసిన మొట్టమొదటి కవిత
ఓ నా విశాఖ సముద్రమా!
నువ్వాకాశమంత ఎదగడానికి
ఎన్నేళ్ళ మహర్షి దీర్ఘ తపస్సమాధి బాధపడ్డావో?
……….
నీవు సభను చూసినా
నీవు సముద్రాన్ని చూసినా
నీవు చూసేచూపువేరుగాఉంటేతప్ప
ఎరుపెక్కిన సముద్రం ఎక్కుపెట్టిన బాణం
ఎందుకో నీకర్థంకాదు.
………..
గనులను తవ్వండి ఎంతకూ తరగవు
ప్రజలను తవ్వండి జీవితాలు తరగవు
సముద్ర సభ అనే కవితలో గనులను తవ్వితే ఎలాగైతే తరగవో ప్రజల జీవితాలు కూడా అంతే అంటాడు.ఒక “అల”తో జీవితం “రణరంగం” లా ఎలా మారుతుందో ప్రజల బతుకు పోరాటంలో ఉప్పెనలా వచ్చే కష్టానికి మనిషి అలాగే బలి అవుతాడు అంటాడు.
“నగ్న నగలమీద మెరుపుల కౌపీన పీతాబరుడు వాడు
గస్తీ చౌరస్తా మీద నవ యవ్వన దివ్వెలా వెలుగుతున్నాడు”.
ఆకలి రాజ్యానికి రాజు లోతైన పొట్టమీద కిరీటాన్ని ధరిస్తాడు
………
జల్లెడమేఘమో చలిపిడుగో కప్పుకొని తిరుగుతాడు.
వాడి ఆకలి సామ్రాజ్యాన్ని జయించడానికి అందరూ పిరికి వాళ్ళవుతారు. “ దీపస్తంభం “అనే కవితలో
బిచ్చగాడి ని ఏకంగా రాజును చేసి వాడి సామ్రాజ్యాన్ని జయించడం ఎవరితరం కాదు అని సుతిమెత్తగా చెప్పాడు.
“రెండక్షరాలు చల్లి మొక్కల్ని మొలిపించటం తప్పే అయితే
రక్తాన్నిచ్చి వాడి గుండె కు ప్రసరింప జేసి బతికించటం తప్పే అయితే
పారతంత్రాన్ని పారదోలటమే తప్పయినట్టలయితే
స్వేచ్చను నీ ముంగిట్లో నే పాతుకుని
నీ ఒక్కడివే రెపరెపలాడటం తప్పు “ “ పాట పతాకం “అనే కవితలో ఆనాటి భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ లో శ్రామికుడు తన శ్రమను ఎలా దోచుకున్నారో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
నువ్వు యుద్దాన్ని నేర్పక పోవచ్చు
మేం యుద్దతంత్రాన్ని నేర్చుకున్నది నిన్ను చూసే!
యుద్దానికి పిరికితనం ఉండకూడదని నేర్చుకున్నది నీవల్లనే!
నువ్వే మా ఏకలవ్య గురువ్వి
నిన్నెట్లా వదులు కుంటాం!
నీకు గురుదక్షిణగా ఒక చెవ్వో ఒక కన్నో
ఒక కాలో ఇవ్వటం లేదు
మా సాంతం శరీరాన్ని నీకు నైవేద్యంగా సమర్పిస్తాం! అంటూ “విశాఖ” అనే కవితలో సముద్రం యుద్దం చేయటం నేర్పకపోవచ్చు కాని యుద్ద తంత్రాన్ని నేర్పిస్తుందట. ఏకలవ్య గురువట గురుదక్షిణగా శరీరంలో ఒక భాగం కాదు శరీరం మొత్తం నైవేద్యంగా సమర్పిస్తామంటాడు.
చక్రం తిరిగి తిరిగి కర్పూరం కరిగి కరిగి
వాడి ఆవరణలోనే పచ్చని ఆకు పండు ఆకై రాలిపోతాడు.రాలిపోయాక ఎండి మంటయినా మండడు
చెత్త కుప్పల్లోనో మురికి గుంటల్లో నో మురిగి ములిగి
కుళ్ళిన కాగితంపువ్వైనా కాడు
అందరి దృష్టి లో పడ్డ అక్షర నక్షత్ర మన్నా కాడు
రంగునీళ్ళు రక్తం కానట్లే బానిసెవడైనా వీరుడు కాడు. “బానిస “అనే కవితలో …..
బానిస బతుకు దుర్భరంగా ఉంటుంది .బానిస బతుకు బతుకు కాదు బానిసలా ఉన్నవాడు ఎప్పటికీ వీరుడు కాలేడు అంటాడు.
నాలుగు మునివేళ్ళకు అంగుష్ఠం
కాసింత దూరమున్నా
దాని కర్తవ్యాన్ని విస్మరించదు
ఏకంగా కలిసే నోటికి ముద్ద అందిస్తుంది.
ఒంటరి తల్లే అయినా
మరో సృష్టి కి గర్భాన్ని ధరిస్తుందనేది మరిచిపోవద్దు
పగిలిన అద్దం వేయి ముక్కలవుతుంది
రవ్వరవ్వలో వినూత్న తేజాల
విస్పులింగాలుద్భవిస్తాయనేది వాస్తవం .
ఒంటరి కవాతు అనే కవితలో
ఈ ప్రపంచంలో ఒంటరి ఎవరూ కాదని ఒంటరి తల్లి కూడా మరో సృష్టికి గర్భాన్ని ధరిస్తుందని
మన చేతికున్న బొటనవేలు కూడా మునివేళ్ళకు కాస్తా దూరంగా ఉన్నా తన పని తాను చేస్తుంది కదా అంటాడు రచయిత.
“పుస్తకాలమీద ప్రజావీరుల పాదముద్రలుంటాయి
జీవన సమరం లో పారిన రక్తపుటేరులుంటాయి”
“లాంగ్ మార్చ్” అనేకవితలో పుస్తకాల మీద ప్రజావీరుల పాదముద్రలుంటాయి ఎర్రని జెండాలను వెలిగిస్తాయి అంటాడు.
అత్తరు చుక్కకోసం నెత్తుటి చుక్క ను బలిపెట్టి
నీదైన నీటిచుక్కను వాడుకుందామనుకున్నాడు వాడు
నీటి చుక్క కన్నీటి చుక్కై బగ్గు మంటుందని తెలియదు వాడికి “ధిక్కారం” అనే కవితలో…..
ధిక్కారం అంటే ఏమిటి ఎలా ఏర్పడుతుంది . ఒక ఘటనకు ప్రతిఘటన ఎలా ఏర్పడుతుంది అనేందుకు చక్కని ఉదాహరణ ఈ కవిత.
మతాలు మట్టీ కాదు, మానవత్వమూకాదు
నమ్మకాల వాల్మీకాలు
అందులో పాములున్నాయి జాగ్రత్త!
కాటేస్తాయి.
“బాబ్రీమందిరం“ అనే కవితలో మతాలగురించి కొట్లాడుతూ మానవత్వాన్ని మరిచిపోతున్నాం.రామజన్మభూమో బాబ్రీమసీదో కాదు మనకు కావలసింది.
పొట్ట కోసం అడుక్కుంటున్న అనాథకు ఆశ్రయం కావాలనికోరుకుందాం అంటాడు.
“ఇల్లంతా కొల్లకొడ్తున్న
మద్యం బందిపోటు అవుతున్నప్పుడు
కుటుంబం అంటుకున్న టపాకాయల దుకాణమవుతుంది
ఇల్లాలు గుండె పగిలి బజారు పాలవుతుంది.
”ఉద్యమధ్వని అనే కవిత ద్వారా మద్యానికి బానిస కాకూడదని రక్తాన్ని శుభ్రపరచని పదార్థంఏదైతే ఏమిటి ? రక్తం ఎక్కాల్సిన నాళాల్లో ఎక్కుతున్న విషం అని తెలిసి కూడా తాగి ఇంటిని బజారు పాలు చేసుకోకండి ఇల్లాలు మనసు బాధ పెట్టకండి అంటాడు.
“అది మొగ్గే కావచ్చు
స్పృశించు
వేయి రెక్కలై విచ్చుకుంటుంది
ఆపాప మూగేకావచ్చు
కదిపిచూడు
కళ్ళతో మాట్లాడుతుంది.”
(శిలను చెక్కితే…….) కవితలో మూగవారికి కూడా మనసుంటుందని వారిని కదిపితే కళ్ళతో కూడా మాట్లాడగలరని అంటాడు.
కాలి వేళ్ళు చేతి వేళ్లయి
కాలం రీఫిల్ వేసి మరతిప్పి
కాగితంమీద అచ్చేయటం ఎంత గొప్ప సాధన!
………….
నిండైన హాస్యసభలో నవ్వుల ఝల్లులు కురిసినప్పుడు
అందరి కరతాళ ధ్వనులమధ్య
వాడి భుజాలకు వేళ్ళాడుతున్న
కుక్క చెవుల చేతులు టపటపలాడినప్పుడు
అంతటి వాడి సంతోషం
మనకు దుఃఖంగా,
అప్పటి వాడి ఆనందం
మనకు అంతర్మథనంగా మారకపోతే
అసలు మనం మనసులున్న మనుషులం కాదు.
”శబ్ద శరీరం” అనే కవిత చేతుల్లేని ఒక విద్యార్థి ని చూసాక మనసు చలించిపోయి బాధతో రాసిన కవిత ఆసాంతం చదివితే కవి హృదయం ఎంత సున్నితమో అర్థమవుతుంది.
బట్టకోసమో పొట్టకోసమో
వలస పోతున్నారంటే నమ్మొచ్చు
ఎక్కడా కనిపించని
గుక్కెడన్ని నీటి కోసం
ఎక్కడికి ఈ వలస!?
……….
స్వేచ్ఛ కోసం
గీతం పోరాటమైనప్పుడు
అరాచక సత్యం
కవి కంఠానికి ఉరి బిగిస్తుంది
చచ్చిన వారు అయిదుగురే కావచ్చు
దూకి చచ్చారనటానికి
అది గోడ కావచ్చు
మేడ కావచ్చు
చెరువేకావచ్చు చార్మినారే కావచ్చు
ప్రాణగండాలకు నిలయాలైన
ఎంత గొప్ప కళాఖండాలైతేనేం?
వచ్చింది
వయొలిన్ రాగమైనా
వసంత మేమేమైనా
రానీ ఈ భూమ్మీదకు రుచి చూడాల్సిందే.
”వయొలిన్ రాగమో వసంతమేఘమో” అనే దీర్ఘ కవిత 1987 లో రాసింది కవిత చదివితే హృదయం చలించి పోతుంది. అప్పటి సమాజం లోని ఒడిదుడుకులు అన్నీ ఈ కవిత ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా శ్రీరాములు రచనలో సమాజం గుండెలోతులను దగ్గరి నుండి చూసి తనదైన పద్ధతిలో కవిత్వ నిర్మాణం చేయడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. పదనిర్మాణం లాగే వ్యక్తిత్వం చాలా సాదాసీదాగా హంగులూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఉంటుంది. ఈ పుస్తకంలోని కవితలు శ్రీరాములు చదువుకునే రోజుల్లో సమాజ పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తుంది. ఇంత గొప్ప కవిత్వం మనకు అందించిన కందుకూరి శ్రీరాములు అభినందనీయులు.
(ఆధునిక వచన కవిత్వం విభాగంలో కందుకూరి శ్రీరాములు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం 2018) (తెలంగాణ స్టేట్ లెవల్ అవార్డ్స్ 2018 జూన్ 2 న అందుకున్న సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలుపుతూ…)