[box type=’note’ fontsize=’16’] ఒక ఆహ్లాదం చిన్ని నీటి పిచ్చుకలై ముఖాన వాలి వుక్కిరి బిక్కిరి చేసి దాహాగ్నిని చల్లార్చేది ఎప్పుడో చెబుతున్నారు డా. విజయ్ కోగంటి “కొంచెం వాన కురవాలంటే” అనే ఈ కవితలో. [/box]
[dropcap]నె[/dropcap]లల పాటు
ఫెళ్ళున ఎండ కాయాలి
నేల వేడెక్కాలి
వడగాలి తిరిగి
నీటి చెలమలు ఆవిరవ్వాలి
దాహంగా వెర్రితో భూమి బీటలు తేలాలి
ఎదురు చూసిన కనులు వేసారి
ఇక వానలే కురవవని దుఃఖం ముంచెత్తాలి
అంతలో ఉడుకుతో ఆవిరి పట్టిన మేఘాన్ని
ఓ చిరుగాలి నీలా తాకాలి
అప్పుడు కదా
సాగుతూ తూగుతూ తేలుతూ
ఒక ఆహ్లాదం చిన్ని నీటి పిచ్చుకలై ముఖాన వాలేది
వుక్కిరి బిక్కిరి చేసి దాహాగ్నిని చల్లార్చేది
కరిగించి ప్రవాహాలను చేసి
ఆనవాలందని సముద్రాలను చేసేది
ఇక ఈ ఆనందం ఎక్కడికీ పోదని మరిపించేది
గుండె వేడెక్కితేనే చాలదు
కొంచెం చల్లగాలీ తగలాలి.