[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]రెం[/dropcap]డు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.
డిసెంబరు నుండే ప్రతి వారిలో ఆ థ్రిల్ మొదలవుతుంది.
కొత్త సంవత్సరం! కొత్త ఆశలు! కొత్త కోరికలు!
నడుస్తున్న సంవత్సరంలో జరగని ఆశలు, తీరని కోరికలూ, నిస్పృహ పరచిన సంఘటనలు, నిరాశపరిచిన విషయాలు, భరించిన కష్టాలూ అన్నీ ఒక నిముషపు సరిహద్దుని అధిగమించగానే మనకి తీరుతాయేమోనని ఒక ఆశ!
ఇందులో తప్పేమీ లేదు.
ఆశించడం, కలలు కనడం ఆరోగ్య సూచనే!
ఎవరో ‘ఆశ పాప జాతి అన్నింటికంటెన్’ అని అన్నారు గాని ఆశ లేకపోతే జీవితమే లేదు.
ఏదో ఒక ఆశ! వుండాలి! వుండి తీరాలి!
కలలు కనాలి, వాటిని సఫలీకృతం చేసుకునే దీక్షా, ధ్యేయం వుండాలి!
ఆశ దురాశ కాకూడదు కాని – ఆశ లేకపోతే మనం ఊపిరి పీలుస్తూ కుడా ప్రాణం లేని బొమ్మలం అయిపోతాం.
అందుకే కలలు కనాలి. వాటిని సఫలీకృతం చేసుకునే ప్రయత్నాలు చెయ్యాలి.
నా వరకు నాకు చిన్నతనం నుండీ జరుపుకునే పండుగలు మూడే మూడు. ఒకటి ఆగస్టు 15, రెండు కొత్త సంవత్సరం వేడుకలు, మూడు నా పుట్టినరోజు!
వీటి కోసం నా అంతట నేను ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేదాన్ని, డబ్బు దాచుకునేదాన్ని.
ఆగస్టు 15న జండా వందనానికి స్కూలికి ఖచ్చితంగా హాజరయ్యేదాన్ని. దేశం మీద చాలా ప్రేమ ఉండేది. గాంధీ, నెహ్రూలంటే చాలా అభిమానం ఉండేది. జాతీయ గీతం పాడుతుంటే ఒళ్ళు పులకరించేది.
అలాంటి ప్రేమను, అభిమానాన్ని రాను రాను వచ్చిన నాయకులు ధ్వంసం చేసేశారు. ఎంతోమంది జైలుకెళ్ళి, లాఠీ దెబ్బలు తిని తెచ్చిన స్వాతంత్ర్యాన్ని దోపిడీదారులు దోచుకుని – “అయ్యో బ్రిటీష్ పాలన వున్నా బాగుండేదేమో” అనే భావన తెచ్చేరు. దేశాన్ని ప్రేమించడమంటే ఎక్కడబడితే అక్కడ జాతీయ గీతమాలపించడం, లేచి నిలబడటం కాదు కదా! మన దేశం పేరు చెప్పగానే గౌరవ భావం కలగాలి. అందుకోసం ఏదైనా త్యాగం చెయ్యగలగాలి. ముఖ్యంగా ఉదాసీనత మాని దోపిడీ రాజకీయ వ్యవస్థ రూపు మార్చగలగాలి!
కొత్త సంవత్సరం వైపు నుండీ ఎటో వెళ్ళాను కదా!
మా రోజుల్లో పిల్లల చేతిలో పుష్కలంగా డబ్బులుండేవి కాదు. పైగా ఏ చిన్న పని చేయాలన్నా పెద్దల పర్మిషనుండాలి! వారి కాదంటే మానుకోవాల్సిందే.
కొత్త సంవత్సరం అంటే – నేను, మా అక్క డ్రాయింగ్ షీట్లు తెచ్చుకుని వాటిని అందంగా కత్తిరించి రకరకాల బొమ్మలు వేసి గ్రీటింగ్స్ తయారు చేసేవాళ్ళం. బొమ్మలంటే బొమ్మలు కాదు, బయట ఎక్కడా దొరకనంత అపురూపంగా లంబాడీ అమ్మాయిలూ, మంచి ప్రకృతి దృశ్యాలూ, ఇలా అద్బుతంగా వాటర్ కలర్స్‌తో చిత్రించేవాళ్ళం. వాటిని ఒక పెద్ద టేబుల్ మీద ఆరబెట్టి, కవర్లు కూడా మేమే తయారు చేసేవాళ్ళం. వాటి మీద అందమైన రోజాపూలు, పిట్టల బొమ్మలు వేసేవాళ్ళం.
నిజం చెప్పాలంటే పూర్తయ్యేక వాటిని అందరికీ పంపాలంటే చెప్పలేని బాధ!
వాటిని బుక్ పోస్టులో పంపాలంటే లోపల గ్రీటింగ్స్‌ని ఎవరైనా తీసేసుకుంటారని కవరు మూసేసి అంటించేవాళ్ళం.
మా నాన్నగారొకసారి చెప్పారు “కవర్ల మీద పెయింట్లు చెయ్యకండి. వాటిని చూసి ఆకర్షితులై తీసేసుకుంటారు” అని.
ఆయన తన పోస్టల్ సూపర్నెంటిండు గారి కోసం ఒక గ్రీటింగ్ కార్డు అడిగేవారు.
ఆయన కోసం ప్రత్యేకంగా వేసేవాళ్ళం.
ఆయన “మీ కోసమే ఎదురుచూస్తున్నా సీతారామయ్య గారూ! ఈసారి అమ్మాయిలు ఏ బొమ్మ వేశారు?” అని ఆత్రంగా కవరు తెరచి చూసేవారట!
“ఓ… ఈసారి అమ్మాయి కూర్చుందే! లాస్టియరు నిలబడింది కదా” అని వ్యాఖ్యానించి వారి శ్రీమతిని పిలిచి చూపించేవారట.
“మీ అమ్మాయిలు నిజంగా బ్లెస్‍డ్. మీరు అదృష్టవంతులు” అని అభినందించి గౌరవించి పంపేవారాయన.
అక్కణ్ణుంచొచ్చేక నాన్న మొహం వికసించేది. అమ్మకి చెప్పి ఆనందించేవారు.
జనవరి 1st కి పోస్టులో పంపేవన్నీ పంపేసేవాళ్ళం.
తిరిగి మాకొచ్చే వాటి కోసం మా నాన్నగారి కోసం ఎదురు చూసేవాళ్ళం.
ఇక వాటిని చూసుకుని – అందులో కొటేషన్స్ చదువుకుని – బొమ్మలు బాగుంటే వచ్చే సంవత్సరం వెయ్యడం కోసం దాచుకుని… నిజంగా అదొక కుటీర పరిశ్రమే. ఆ ఆనందం అనితర సాధ్యం!
గ్రీటింగ్స్ అందుకుని తిరిగి జవాబు రాయడం చెప్పలేని సంతోషాన్నిచ్చేది.
అప్పుడు ఖర్చుకి మాత్రం మా అమ్మగారు డబ్బులిచ్చేవారు. రోజులు మారిపోయాయి.
పిల్లలు చాలా వరకు వారి చదువులకే అంకితమవుతున్నారు. ఏదయినా డబ్బులు పడేసి కొనుక్కోవచ్చు అనే ధోరణిలో పడిపోయారు. స్వయంగా తయారు చేయడానికి విముఖత చూపిస్తున్నారు.
ఒకవేళ పెయింటింగ్స్ వేసినా దానికి సంబంధించిన సామాగ్రి ఎన్నో రకాలుగా లభ్యమవుతోంది. ఆ రోజుల్లో నేర్పేవారు అరుదు! రంగులు కూడా మిశ్రమం చేసుకోవాలి. ఎక్కువ ప్రైమరి కలర్సే వుండేవి! సెకండరీవి దొరికేవి కావు. పెయింటింగ్ సామాగ్రి, బ్రష్‌లూ ఎప్పుడూ ఖరీదైనవే!
అందుకేనేమో చాలామంది కులీనులే ఆర్టిస్టులుగా చలామణీ అయ్యేవారు.
ఒకానొక దశలో చిత్రకళకి స్వస్తి చెప్పి నేను రచనల మీదే దృష్టి సారించాను. కారణం – కాలం, డబ్బు.
జనవరి 1st వస్తుందంటే ఇప్పటి తరానికి విందులూ, వినోదాలూ, కేకలూ, అరుపులూ! ఆ రోజు రోడ్లనీ, బార్లని చూస్తున్నాం! ఈ సంస్కృతి నగరాల నుండి పల్లెల దాకా పాకింది.
ఒకప్పుడు స్త్రీలు పోటీ పడి ముగ్గులేసేవారు. ఒకరి ముగ్గు కన్నా తమది బాగుండాలని తాపత్రయపడేవారు. రాత్రి ఒక్కొక్కరి ముగ్గూ వెన్నెల్లో చలికి ముడుచుకుని చూస్తు వెళ్తుంటే యమ థ్రిల్‌గా వుండేది. ఆ సరదాలు అడుగంటి పోయాయి. కారణం శరవేగంగా మారిపొతున్న పరిస్థితులూ, వాతావరణం.
స్త్రీలకిప్పుడు బాధ్యతలెక్కువైపోయాయి. అటు వేళాపాళా లేని ఉద్యోగాలు, ఇటు ఇంటి బాధ్యతలౌ – దూర దూర ప్రయాణాలూ!
ఇళ్ళూ వాలిళ్ళు లేని ఎపార్టుమెంటు జీవితాలు! ఇక్కడ ఎన్నో రకాల మనుషులు! ఎన్నో రకాల స్వభావాలతో ఇమడాలి! ఎవరికి సంస్కారం లేకున్నా పక్కవాళ్ళు బాధ పడాలి! ఒక్కసారి తగాదా వచ్చిందా – అంతే సంగతులు!
జీవితం చాలా చిన్నది! మనం కన్న కలలు తీరకుండానే – ఒక్కోసారి మన ఆశలు ఫలించకుండానే అది కరిగి పోతుంటుంది.
అరె! మొన్నే కదా – ఆడుకున్నాం – అటు మొన్నే కదా పాడుకున్నాం అనే లోపునే అది మనల్ని అంచుల చివరికి తీసుకెళ్ళిపోతుంది.
అందుకే జరిగిపోయిన వాటిని – అవి నిరాశపరిచినా సహృదయంతో స్వీకరించి మన బాధ్యత మనం హుందాగా నిర్వర్తించినందుకు మన భుజం మనమే తట్టుకుని – ఇతరుల గొప్పదనాన్ని హర్షిస్తు ముందుకు సాగితే ఎంతో హాయి!
ఈ సంవత్సరంలో ఎవరి మీదయినా కోపతాపాలుంటే వదిలేద్దాం. అందరినీ సరదాగా, ప్రేమగా పలకరిద్దాం. మనకున్న శక్తిలో మనం పంచగల్గేది ఒక ప్రేమపూరితమైన మాట – పలకరింపు – ఒక చిరునవ్వు!
తెలియక తప్పులు చేసి వుంటే క్షమించమని అడిగేద్దాం. మన పట్ల ఎవరైనా అపరాధం చేసి వుంటే మరచిపోదాం!
అందరం ముంచుకొస్తున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రయత్నిద్దాం. వీలున్నవాళ్ళు ఆకుపచ్చని విస్తరింపజేయండి.
రానున్న పిల్లల తరానికి గాలిని, నీటిని పరిశుద్ధంగా అందజేయడానికి మన వంతు కృషి చేద్దాం.
చేయి చేయి కలుపుదాం.
ఇది కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదని నా మనసుకు నేనే చెప్పుకుంటూ – మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!