[box type=’note’ fontsize=’16’] “ఏ విషయంలోనైనా ఆలశ్యం .. ఆలశ్యమే. ఆ ఆలశ్యంతో భిన్న ద్రవాలు కలవవని ఋజువు చేసే పరిస్థితుల గురించి ‘అందని తీరం‘ కథలో వివరిస్తున్నారు పి.ఎల్.ఎన్. మంగారత్నం. [/box]
[dropcap]ఆ[/dropcap] సాయంత్రం.. తల్లి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం.. టీ.వీ చూస్తూ వింటుంది అమల.
అమ్మకి ఈ మధ్య తన పెళ్ళి గురించి తప్ప మరో ఆలోచన లేదు. తన తోటి వాళ్లందరూ పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నా తనే.. ఉద్యోగం అంటూ కాలయాపన చేసింది.
నిజానికి తనకి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. చదువుకున్నాకదా! కొన్నాళ్ళయినా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలని అనుకోవడంతో.. తెలియకుండానే ఆలశ్యం అయ్యింది. అందుకే తల్లి ఆత్రుత.
“అదే మొన్న మాట్లాడాను కదా.. ఏ విషయమూ చెప్పలేదు మీరు” తన్ను తాను పరిచయం చేసుకుంటూ వివరాలు తెలియచేసే పనిలో పడింది జలంధర.
అవతల వాళ్ళు ఏమన్నారో గాని “ఎందుకు రాదండీ. ఆడపిల్ల అన్న తరువాత అత్తవారింటికి వెళ్ళాల్సిందే కదా! అలాగే మా అమ్మాయీ వస్తుంది మీ ఇంటికి” భరోసాగా చెప్పింది. వాళ్ళ మధ్య సంభాషణలు తెలియకపోయినా తల్లి మాటల్ని బట్టి, అది రాజమండ్రి సంబంధం అని అంచనా వేసింది అమల.
ఆ డాక్టరు అబ్బాయి తనకి నచ్చాడు. కాకపోతే దూరం.. అతన్ని చేసుకుంటే ఆ ఊరు వెళ్లిపోవాలి కాబోలు. మొన్నటి వరకూ హైదరాబాదు సంబంధాలే చూసి.. తననీ దగ్గర ఉంచుకోవాలని అనుకున్న అమ్మ ఈమధ్య బయటి సంబంధాలు కూడా చూసే పనిలో పడింది.
అయితే, అందుకు కారణం లేకపోలేదు.. హైదరాబాదు అబ్బాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు, వాళ్ళ కోరికలు తమకు అందుబాటులో లేనంతగా. కార్లు కావాలని, ఆఫీసుకి దగ్గరలో ఇంటి స్థలం కావాలని డిమాండులు చేసారు. అవి తట్టుకోలేక, ఎక్కడైతే.. పిల్లకో సంబంధం కుదిరితే చాలు అన్నట్లు మాట్రిమోని ‘వెబ్ సైటు’ని ఆశ్రయించింది జలంధర.
అప్పటినుంచీ లైకులకు, ఫోన్ కాల్స్ విరామం లేకుండా వస్తున్నాయి.
వాటిలో నచ్చినదల్లా ఒక్కటే సంబంధం, అదీ జలంధర పుట్టిన ఊరు అయిన… రాజమండ్రికే చెందిన డాక్టరు సంబంధం.
ఆ అబ్బాయే ఎర్రగా, చూడడానికి బాగున్నాడు.
జీవిత భాగస్వామిగా మరో డాక్టరుని ఎన్నుకోక ఎం.ఎస్సీ చదివిన తన కూతురికి లైకులు పెట్టడం సంతోషాన్ని ఇచ్చింది జలంధరకు.
అందుకే.. కాబోయే పెళ్ళికొడుకు తల్లి ‘దూరాభారం’ అని ఆసక్తి చూపకపోయినా, మళ్ళీ పలకరించింది, ప్రయత్నిస్తే పోయేదేముందని.
“పోనీ మీరు రాలేకపోతే, నేనే వస్తాను, అమ్మాయిని తీసుకుని. మా పుట్టిల్లూ రాజమండ్రి, మీ బొగ్గులదిబ్బకు దగ్గరే. అయితే, ముప్పై సంవత్సరాల క్రిందట.. మా మామగారి కుటుంబంతో సహా ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోవడంతో.. ఎప్పుడో గాని అటువైపు రావడం కుదరలేదు. ఇక అమ్మాయి కోసం అయినా.. మా వాళ్ళని కలుసుకునే అవకాశం వస్తుందంటే అంతకంటే కావాల్సింది ఏముంది” చెప్పింది సంతోషపడుతూ.
అవతల వాళ్ళని వప్పించానన్న ఆనందంతో వెలిగిపోతున్న తల్లి ముఖం.. చూసి విస్తుపోతూ “అదేమిటమ్మా.. నన్ను తీసుకుని వస్తాను అని ఎవరితోనో అంటున్నావ్. అవతల వాళ్ళు మనింటికి రావాలా. మనమే వాళ్ళ ఇంటికి ఎదురెళ్ళాలా.. ఉన్నట్టుండి ఏమిటీ ప్రయాణం? అతను బాగుంటే, మాత్రం ఈ సిటీని వదిలిపెట్టి.. ఆ పల్లెటూరు.. అదే మీ ‘బొగ్గులదిబ్బ’కు వెళ్లి ఉండాలా. నేను ఉండను” ఆవేశంగా చెప్పింది అమల.
చేతిలో వాకింగ్ స్టిక్ తాటించుకుంటూ, అటుగా వచ్చిన జలంధర భర్త సతీష్ రెడ్డి కూడా “అవును. ఎవరితో పిల్లని తీసుకొచ్చి చూపిస్తానని అంటున్నావు. అది సంప్రదాయానికి విరుద్ధం. మనం అలా ఎదురెళ్ళకూడదు. వాళ్ళే మన ఇంటికి వచ్చి మన అమ్మాయిని చూసి వెళ్ళాలి. నచ్చితే, నచ్చుతుంది లేకపోతే, లేదు. అంతేగాని .. ఎంత మీ ఊరి సంబంధం అయితే మాత్రం పుట్టింటి పేరుతో.. పిల్లని తీసుకెళ్ళి చూపించడం మంచిపని కాదు” చెప్పాడు.
తన సంకల్పానికి భర్త అడ్డుపడడం అలవాటైన విషయమే. పైకి చెప్పుకోకూడదు గానీ, వచ్చిన సంబంధాలు అన్నీ తిరిగి పోవడానికి ఒక కారణం భర్త అవిటితనమే.
ఆ రోజుల్లో.. తన తండ్రికి సరిఅయిన ఆర్ధికస్తోమతు లేకపోవడం వలన.. ఆ కోటాలోనే ఉద్యోగం తెచ్చుకున్న సతీష్ రెడ్డి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల బాగున్నా పిల్ల తండ్రి నచ్చడం లేదు కొన్ని సంబంధాల వాళ్ళకి.
అందుకే పుట్టింటి వంకతో ‘తను’ మాత్రమే పిల్లని తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. ముందు పిల్ల నచ్చితే, నెమ్మదిగా విషయం నరుక్కు రావచ్చనుకుంటూ.
తండ్రీ, కూతుళ్ళు ఇద్దరూ… ఒక్కటైపోయిపోవడం మండుకొచ్చింది.
కోపం తెచ్చుకుంటూ “నాకు అలాంటి విషయాలు తెలియవనుకున్నారా! ఆ అబ్బాయి బాగున్నాడు. పైగా డాక్టరు. మన కుటుంబంలో అటుగానీ ఇటుగానీ ఓ డాక్టరు ఉన్నాడా. డాక్టరు అబ్బాయి అల్లుడుగా రాబోతుంటే.. ఎదురెళ్ళడం తప్పేలా అవుతుంది? మనం ఇలా మీన మేషాలు లెక్క పెట్టుకుంటుంటే, ఇంకెవరో.. ఆ అబ్బాయిని తన్నుకుపోయే అవకాశం ఉంది.. అసలే ఇది పోటీ ప్రపంచం” తన ఆలోచనలకు ఆటంకం కలగడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేనట్లు చెప్పింది ఆవేశంగా.
“అబ్బాయి నుంచి ఇంట్రస్టు కనిపిస్తున్నా, ఎందుకనో అతని తల్లి ముందుకు రావడం లేదు. ‘హైదరాబాదులోనే పుట్టి పెరిగిన, పిల్ల మా ఇంటికేం వస్తుంది?’ అంటుంది. అందుకే.. ఓ పిసరు ఆలోచించాల్సి వస్తుంది” అంది కాస్త తగ్గు స్వరంలో తనలో తనే అనుకుంటున్నట్లుగా.
“ఆమె చెప్పింది నిజమే కదా! అమలని మనం ఇక్కడే ఉంచుకోవాలని అనుకున్నాం. మరి అవతల వాళ్ళు ఇష్ట పడనప్పుడు రాజమండ్రి తీసుకువెళ్ళి చూపించడం ఎందుకు? తీరా తీసుకెళ్ళిన పిల్ల నచ్చలేదంటే.. అభాసుపాలవ్వాలి” వద్దన్నట్లు చెప్పాడు సతీష్ రెడ్డి.
“మన అమ్మాయి ఎదుటివాళ్ళకు నచ్చకోపోవడం అంటూ ఉండదు. ఇప్పటివరకూ ఎవరైనా ఆ మాట అన్నారా. ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడా తప్ప. ఎందుకో.. ఆ సంభంధం మనకు అనుకూలంగా ఉంటుందనే అనిపిస్తుంది. ఆవిడ్ని ఎన్నిసార్లు.. ‘మీరు ఎంతలో ఉన్నారు’ అని అడుగుతున్నా.. అమ్మాయి అందానికే ఫస్టు ప్రిఫరెన్సు అంటుందామె.”
“ఆవిడ ఉద్యోగస్తురాలు. మన ఊరు వచ్చి అమ్మాయిని చూసే, తీరిక.. ఓపికలేదంటే, నేనే పిల్లను తీసుకొచ్చి చూపిస్తాను అన్నాను. కలిసొచ్చే సంబంధం కోసం ఎదురెళ్ళడం తప్పేమిటీ? ఎవరికి ఎలా రాసిపెట్టి ఉందో.. ఎవరికి తెలుసు? అందుకే సంప్రదాయాన్ని పక్కన పెట్టి, అమ్మాయిని తీసుకెళ్ళి చూపించాలని అనుకుంటున్నాను” అంటూ తన నిర్ణయం తెలియచేసింది.
ఇక సతీష్ రెడ్డికి మాట్లాడడానికి ఏమీ మిగలలేదు. ఎలా చూసుకున్నా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చడంతో.. జరిగేవన్నీ మంచికేలే అనుకున్నాడు.
***
ఆ మరునాడు..
ఇంటికొచ్చిన మేనత్త పద్మాక్షికి పిర్యాదు చేసింది అమల.. పెళ్ళిచూపుల పేరుతో.. తల్లి తనని బయటకి తీసుకువెళ్ళడం విషయంలో తల్లి మీద ఇంకా కోపం పోలేదు ఆమెకి.
మేనకోడలి వైపు చూసి చిన్నగా నవ్వింది. ప్రొద్దుటే… ఆవిషయం ఫోన్లో చెప్పాడు సతీష్ రెడ్డి, అన్నా చెల్లెళ్ళు తరచు ఫోన్ టచ్‌లో ఉంటారు. వదిన ఏదీ కారణం లేకుండా చెయ్యదని అనుకుంటూనే ‘ఏమిట’న్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది.
“అన్నీ ఆలోచించాను పద్మా. ఈ సిటీలో అబ్బాయిల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక.. మన గోదావరిజిల్లా అబ్బాయిలనైనా చూడాలని అనిపించింది. ఇష్టమైతే వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉంటారు. ఈ హైదరాబాదులో ఉద్యోగాలకి లోటేమిటి? అందరూ పుట్టిన ఊర్లలోనే ఉండిపోతున్నారా! ఎంత మంది సిటీకి వచ్చేయడం లేదు.”
“ఇద్దరి నక్షత్రాలూ, జాతకాలూ బాగా కలిసాయి. ఇంకా చెప్పాలంటే, అబ్బాయి ప్రస్తుతం మన దగ్గరే.. సికింద్రాబాద్లో, యశోద హాస్పిటల్లోనే పోస్టు గ్రాడ్యుయేషను చేస్తున్నాడట.. ఇంకా ఒక సంవత్సరం కోర్సు ఉంది. హాస్టల్లో ఉంటున్నాడు.”
“ఈ విషయం మాత్రం రాత్రే తెలిసింది. ఇక్కడే ఉండే అబ్బాయిని ఒడిసిపట్టుకోవడం తప్పేమిటీ? అందుకే, వెంటనే అమ్మాయిని తీసుకుని వచ్చి చూపిస్తానని, వాళ్ళ అమ్మతో చెప్పేసాను.”
“ఆవిడ హైదరాబాదు ‘దూరం’ అని ఆలోచిస్తుంది. పెద్దగా కట్న కానుకల మీద ఆశ కూడా ఉన్నట్టు లేదు. ఇక్కడి వాళ్ళని చూసావుగా .. లాంచనాలకు అదనంగా.. కారు కావాలని ఒకడంటే, ఆఫీసుకి దగ్గరలో ప్లాట్ కావాలని ఇంకొకళ్ళు. అందుకే కాస్త దూరం అయినా ఈ సంబంధమే అనువుగా కనిపిస్తుంది నాకు. అన్నీ బాగుండి సంబంధం కుదిరితే, పెళ్ళి తరువాత.. ఇక్కడే ఉంటారు.. అబ్బాయి కోర్సు పూర్తి అయ్యేంత వరకూ. ఆ తరువాత సంగతి.. తరువాత ఆలోచిద్దాం.”
“అసలు రాయి వెయ్యకుండానే పండు పడాలంటే ఎలాగ” చెప్పింది జలంధర తన ఆలోచనా అమలు విధానాన్ని..
వదిన చెప్పిన దానిలో అసంబద్ధం ఏమీ కనిపించలేదు పద్మాక్షికి. ఇప్పుడు ఆఫీసులో బాస్‌ని సెలవు ఎలా అడగాలా అని ఆలోచిస్తుంది అమల.
***
రామచంద్ర ఇంటిలో…
“నువ్వు ఆ హైదరాబాదు అమ్మాయి అమలకి లైక్స్ ఎందుకు పెట్టావు? అంతదూరం సంబంధం ఎందుకు మనకి? అక్కడే పుట్టి, పెరిగి, అక్కడే ఉద్యోగంలో ఉన్న పిల్ల మన ఇంటికి వచ్చి ఏం ఉంటుంది? మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి లైకులు పెడితే బాగుండేది. ఇలా అనువు గాని సంబంధాలు.. ఎందుకు” మందలించింది శ్రావణలక్ష్మి కొడుకుని ఫోన్లో.
“హైదరాబాదు దూరం ఏమిటమ్మా! నేను అస్తమానం వెళ్ళి రావడం లేదా! ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ దిగుతాం. అక్కడ రైలు ఎక్కితే ఇక్కడ దిగుతాం. అదో పెద్ద కష్టం ఏమిటి. అయినా.. నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలా! నేనేమన్నా చిన్న పిల్లడినా! నాకంటూ ఏ ఒపీనియన్ ఉండకూడదా!” కోపం తెచ్చుకున్నాడు రామచంద్ర.
“ఒపినియన్ వేరు, నిజజీవితం వేరు. ఇక నాకు రైళ్ళు ఎక్కే ఓపికలేదు. ప్రయాణాలు చేసే ఓపిక అసలేలేదు. ఇప్పుడు ప్రయాణం అంటే.. దగ్గరలో మన కారులో వెళ్లి వచ్చేదిలా ఉండాలి గానీ, అస్తమానం రైలు టిక్కెట్టు కొనుక్కుంటే గాని.. అవతల వాళ్ళని చూడలేం.. అంటే, ఎలాగ”
అమ్మ ఎప్పుడూ అంతే, ఎప్పుడూ ఏదో వంక పెడుతుంది. తను అనుకున్నదే జరగాలనుకుంటుంది.. అనుకుంటూ “నాన్న ఏమంటున్నారు?” తండైనా తన వైపున ఉంటే, చాలనుకుంటూ.
“మీ నాన్నకు ప్రత్యేకించి ఓ అభిప్రాయం అంటూఏముంటుంది! అంతా నిమిత్తమాత్రం” తండ్రి వ్యతిరేకించనందుకు, ధైర్యం తెచ్చుకున్నాడు.
“నాకు అంత దూరం సంబంధం ఇష్టం లేదని అంటున్నా, నీ ఇంటరెస్టు చూసి.. ఆ అమ్మాయి తల్లి జలంధర.. అమ్మాయిని మన ఇక్కడికి ‘రాజమండ్రి’ తీసుకుని వచ్చి చూపిస్తాను అంటుంది.”
“సరే! అలాగే! అయినా నువ్వు చూపించిన వాళ్ళు నాకు ఎవరైనా నచ్చారా! ఈ అమ్మాయి నచ్చింది కాబట్టే. లైక్ చేశాను. అన్నీ నీ ఇష్టం ప్రకారమే జరగాలా ఏమిటి? చేసుకునే వాడిని.. నేను, నాకు ఇష్టం కావద్దా! వాళ్ళు ఎప్పుడు బయలుదేరి వస్తారో చెప్పు, అప్పుడు నేనూ బయలుదేరుతాను” చెప్పాడు ఉత్సాహంగా.
***
పెళ్ళిచూపుల్లో..
అమ్మాయిని ఉద్దేశించి “అక్కడ నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావట మరి మా వాడిని చేసుకుంటే.. దాన్ని వదులుకుని ఇక్కడికి.. రాగలవా” అడిగాడు పెళ్ళికొడుకు మేనమామ.
“టైము పాస్ కోసం చేస్తున్న ఉద్యోగమే … ఇదేం పర్మనెంటు కాదు. ఎప్పుడు మానేయ్యాలనుకుంటే అప్పుడే మానెయ్యవచ్చు” చెప్పింది అమల.
“నా రెండవ కోడలు కూడా అందమైన పిల్లే’ అనుకున్నా, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు శ్రావణలక్ష్మిలో.
పెళ్ళి పేరుతో.. కొడుకు దూరం అయిపోతాడన్న.. దిగులు ఆమెలో అప్పుడే పొడసూపింది. మోడరన్ లుక్‌తో ఎంతో అందంగా ఉన్న ఆ పిల్ల ఉంటున్న సిటీని వదిలి, చేసే ఉద్యోగాన్ని వదిలి కొడుకు ఉద్యోగం చేసే ఊరు వచ్చి ఉండిపోతుంతుందన్న నమ్మకం ఆమెకు ఇంకా కలగలేదు.
ఎందుకంటే హైదరాబాదు కంటే అందమైన నగరం మరొకటి లేదు గనుక.
***
శ్రావణలక్ష్మికి.. ఈ విషయంలో భర్త చలపతిరావు తనకి పూర్తిగా వ్యతిరేకం.
“వాడికి ఇష్టం అయ్యింది. పిల్ల నచ్చినప్పుడు.. చేసెయ్యాలి అంతే. దూరం ఏమిటి? వాడు ఎక్కడ ఉండాలనుకున్నదీ వాడి ఇష్టమే’ అని అనడమే కాదు, పై పెచ్చు ‘నువ్వెప్పుడైనా నీ అత్తగారింటిలో ఉన్నావా.. ఆ పిల్ల వచ్చి నీ ఇంటిలో ఉండడానికి’ అంటూ మూర్ఖపు వాదన చేసేవాడు.
వయసు మీద పడుతుంటే.. పెంచి పెద్దచేసిన చెట్టు క్రింద సేద తీరాలనుకోరుకోవడం తప్పు కాదు. శ్రావణలక్ష్మి ఆరోగ్యం అంతంతమాత్రం. సెలవులు పెడితే, జీతం ఆగిపోతుందేమో, సాఫీగా సాగే ‘జీవన నావ’.. ఒడుదుడుకులు పడుతుందేమోనన్న భయానికి ఓపిక తెచ్చుకుని కష్టపడింది.
భర్త చలపతిరావుది తుమ్మితే, ఊడిపోయే ముక్కులాంటి ప్రైవేటు ఉద్యోగం. దేనికీ బాధ్యత లేదు. సంసారాన్ని ఒంటి రెక్క మీద లాక్కొచ్చింది. అలా కష్టపడుతూనే పెద్దవాడిని ఇంజనీరింగు, చిన్న వాడిని డాక్టరు కోర్సు చదివించింది.
పెద్దవాడికి పెళ్ళి చేసినప్పుడు గానీ, అమెరికా వెళుతున్నప్పుడు గాని ఒక్క క్షణం బాధపడలేదు.
అలాంటిది చిన్నవాడు పిల్ల అందానికి దాసుడై అటే వెళ్ళిపోతాడనుకుంటే, తను అప్పుడే ఒంటరిది అయిపోయినట్లు దుఃఖసాగరంలో మునిగిపోయింది.
సాఫ్టువేరు వాడు బయటకు వెళ్ళాడంటే అర్ధం ఉంది గానీ, స్వంతగా ప్రాక్టీసు చేసుకోగలిగే డాక్టరు కూడా బయటికి వెళ్ళిపోతానంటే, తట్టుకోలేక పోతుంది తల్లి మనసు.
చలపతిరావుకు ఆమె అభిప్రాయంతో పనిలేదు. సలహా చెప్పబోయిన వాళ్ళని కసిరికొట్టాడు.
***
వాళ్ళ ఆహ్వానం మీద హైదరాబాదూ వెళ్ళింది శ్రావణలక్ష్మి కుటుంబం. అక్కడ..
“మా అమ్మాయి కార్పొరేటు ఊరిలో పుట్టి పెరిగింది. ఈ ఊరు తప్ప మరో ఊరు తెలీదు నువ్వూ వచ్చి ఇక్కడే ఉండు. ఇక్కడే ప్రాక్టీసు పెట్టుకోవచ్చు” అడిగింది పద్మాక్షి రామచంద్రని.
ప్రక్కనే తల్లి ఉంది.. అభ్యంతరం చెబుతుంది అని కూడా అనుకోలేదు. పెళ్ళిచూపుల్లోనే ఓ నిర్ణయానికి వచ్చేస్తే .. ఆ తరువాత ఎవరెంత మొత్తుకున్నా ఫర్వాలేదు. వాళ్ళకి పెళ్లికొడుకే టార్గెట్.
శ్రావణ లక్ష్మి ఏ విషయానికి భయపడుతుందో ‘అదే’ పలికింది మేనత్త.
“నాకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పలేను. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వస్తే.. అక్కడ ఉంటాను నేను” చెప్పాడు రామచంద్ర.
కొడుకు నిర్ణయానికి స్వాగతిస్తూ, పిల్లాడి తల్లిగా తను అప్పుడూ నోరు మెదపకపొతే, మౌనం అర్ధ అంగీకారం అయిపోతుందని భావించి “మీరు అమ్మాయిని తీసుకుని మా ఊరు వచ్చారని, నేను మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు అబ్బాయిని ఇక్కడే ఉండమంటారా! అమ్మాయి, అబ్బాయితో పాటు ఎక్కడికైనా వస్తుందనే కదా! ఆ రోజు అన్నది” విస్మయం చెందింది శ్రావణ లక్ష్మి.
అక్కడికి వెళ్ళిన తరువాతే.. తెలిసిన పెళ్ళికూతురి తండ్రి శారీరకవైకల్యం ఆమెను ఇరకాటంలో పడేసింది.
మింగలేక .. కక్కలేక అన్నట్లు, చదువుకున్నది కాబట్టి, వేలెత్తి చూపలేకపోయింది. ఆ సంబంధం ఆహ్వానిస్తే పుట్టే, మనవలు ఎలా పుడతారో! అన్న సంశయం ఓ ప్రక్కన ముల్లులా దొలుస్తుంటే, పులి మీద పుట్రలా పిల్ల మేనత్త మాటలొకటి అసహనం కలిగించాయి..
పెళ్ళిచూపుల్లో “ముగ్గురు కలిసి రాకూడదనే నేనే అమ్మాయిని తీసుకొచ్చాను” అంటూ ఆరోజు జలంధర ఇచ్చిన సంజాయిషీ మర్మం ఇదన్న మాట.
ఆ అభ్యంతరానికి పద్మాక్షి భర్త కలగచేసుకుంటూ ..
“మనం ఇప్పుడే ఆ మాట అనకూడదు. ఎక్కడ ఉండేదన్నదీ… వాళ్ళ ఇష్టమే. అయినా.. అమ్మాయిని వాళ్ళ ఊరు.. రాజమండ్రి తీసుకెళ్ళి ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఆవిడ ఏమంటుందీ?.. మనం పిల్లని ‘అక్కడికి’ తీసుకెళ్లబట్టి.. వాళ్ళు మన ఇంటికి వచ్చారట. తప్పు కదా! సంప్రదాయానికి విరుద్దంగా పిల్లని ఎందుకు వాళ్ళ ఊరు తీసుకు వెళ్ళాలి” అంటూ వరసకు చెల్లెలు అయిన జలంధరను నిలదీసాడు.
ఆ విషయం.. పెళ్ళికొడుకు తల్లి అంటేనే, తనకు అప్పుడే తెలిసినట్లు. తండ్రీకొడుకుల పట్టుతో .. సంబంధం అంగీకరించాల్సి వచ్చింది శ్రావణ లక్ష్మికి.
***
లైను క్లియర్ అయి, సంబంధం నిశ్చయం అయిపోవడంతో అమల, రామచంద్రలు సంతోషపడ్డారు.
పెళ్ళి ముహూర్తాలకి నాలుగు నెలల సమయం ఉండడంతో.. పనులు ఊపందుకోలేదు. హైదరాబాదు వెళ్ళివచ్చిన తరువాత.. మనుషుల్ని పట్టించుకోవడం మానేసింది శ్రావణ లక్ష్మి. స్తబ్దుగా మారిపోయింది.
కొడుకు.. పెళ్ళి మాట ‘తప్ప’ అన్ని మాట్లాడుతుంది. రోజులు గడచి ముహూర్తం ముంచుకొస్తే, కొడుకు దూరం అయిపోతాడన్న దిగులు..
అక్కడ అమల కూడా మనసులో అలానే అనుకుంటుంది… అబ్బాయి నచ్చినంత మాత్రాన.. పెళ్ళి పేరుతో.. పుట్టి, పెరిగిన స్వంత ఊరులాంటి అన్ని సౌకర్యాలూ ఉన్న హైదరాబాదు వదిలి… జీవితం తిరోగమనంలా పయనిస్తున్నట్లు పల్లెటూరి వైపుకి వెళ్ళిపోవాలా.. జీర్ణించుకోలేక పోతుంది. అయిన వాళ్ళనీ, బంధువుల్నీ, స్నేహితుల్నీ వదిలి చీకట్లోకి వెళ్ళిపోతున్నట్లు.
ఇలాంటి నేపద్యంలో… ఓ పెళ్ళి వేడుక జరిగింది జలంధర బంధువుల ఇంట్లో. ఊరిలోనే ఉన్న ‘కాబోయే అల్లుడు’ రామచంద్రను కూడా ఆహ్వానించారు.
“మా ఊర్లో వచ్చి ఉండవచ్చు కదా! సిటీ అన్ని విధాలా బాగుంటుంది. ఏ హాస్పిటల్లో పని చేసినా .. కావాలసిన్ని డబ్బులు. దేనికీ ఇబ్బంది ఉండదు. పైగా నాకు మా అమ్మా వాళ్ళు.. ఇచ్చే స్వంత ప్లాటు లోనే.. మనం ఉండవచ్చు” చెప్పింది అమల కన్విన్సుడుగా, ఎన్నో ట్రయల్స్ వేసుకుని.
ఆ రోజంటే, కాబోయే అత్తగారు ఉండి.. అడ్డుపడింది. ఈరోజు ఒంటరిగా ఉన్నాడు. ఇలాంటి టైములో నైనా తను అవకాశం ఉపయోగించుకాకపోతే ఎలాగ?
విషయం మళ్ళీ మొదటికి వస్తే ఎలాగ అన్నట్లు కళ్ళతోనే ఆశ్చర్యం ప్రకటిస్తూ “ప్రస్తుతం.. నేను ఆంద్రప్రదేశ్‌కి చెందిన వాడిని, ఇప్పుడు రాష్ట్రాలు వేరై పోవడంతో.. నాకు తెలంగాణా అయిన గవర్నమెంటులో ఉద్యోగానికి స్థానికత అడ్డువస్తుంది. టెన్త్ క్లాస్ ఎక్కడ చదివితే, అక్కడే స్థానికత ఉంటుంది. నేను మా దగ్గరే టెస్త్ చదివాను కాబట్టి, ఇక్కడి గవర్నమెంటులో పోస్టులు రావడం కష్టం. నాన్-లోకల్‌లో ఎన్నో పోస్టులు ఉండవు. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడికి రావడం కుదరదు. మా ఆంధ్రా ఏరియాలోనే ఉంటాను.. అది ఖచ్చితం.. ఆలోచించుకో” చెప్పాడు.
తల్లి ఈరోజుకీ సంతోషపడని విషయం అతనికి బాగానే గుర్తుంది.
***
ఏ విషయంలోనైనా ఆలశ్యం .. ఆలశ్యమే. ఆ ఆలశ్యంతో భిన్న ద్రవాలు కలవవని ఋజువు చేసాయి పరిస్థితులు. అమల మెట్రో రైలు తప్ప.. మరో రైలు ఎక్కాలనుకోలేదు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రరాష్ట్రం .. రెండుగా విడిపోవడంతో.. లోకల్, నాన్ లోకల్ అంటూ తెలియని అడ్డుకట్టపడిందని, ఎక్కడి స్థానికత.. అక్కడికే పరిమితమవడంతో ఆ ప్రభావం, ఉద్యోగాల మీదే కాదు.. పెళ్ళిళ్ళ మీద కూడా పడుతుందని అప్పుడే అనుభవ పూర్వకంగా తెలుసుకుంది జలంధర.
కూకట్‌పల్లిలో ఉన్న మేనత్త చెప్పిన మరో సంబంధం గురించి ఆలోచనలో పడింది.. దూరాభారం అన్న మాటకు అవకాశం లేకుండా.