ప్రేమకు వేళాయరా… ‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ – పుస్తక పరిచయం

0
3

[dropcap]న్యూ[/dropcap]వేవ్ బుక్స్ వారు ప్రచురించిన ఈ సంకలనంలో పన్నెండు ప్రేమ కథలున్నాయి.

ఈ పుస్తకం ఎందుకు ప్రచురించారో వివరిస్తూ, “అందరిని అలరించి చదివించే కథాంశం ఏమిటి అని ఆలోచిస్తే ‘ప్రేమ’ అని తేలింది… మన జీవితాన్ని నడిపించేది ప్రేమే. అసలు ప్రేమించి ఎంత కాలమైంది? ప్రేమను ఆస్వాదించి ఎంత కాలమైంది? ప్రేమను ప్రేమగా చదివి ఎంత కాలమైంది? అందుకే మేము కూడా ప్రేమ కథల సంకలనం తీసుకురావాలనే ఆలోచనకి వచ్చాం” అన్నారు ఈ పుస్తకం సంపాదకులు ముందుమాట “ప్రపోజల్”లో.

***

రెండు భిన్న కులాలకి చెందిన యువతీ యువకులు ప్రేమించుకోడం, పెద్దల కట్టుబాట్లు, ప్రేమికుల మధ్య ఎడబాటు – ఒకరికొకరు దూరమవడం, ఇక కలవలేమనుకోవడం – ఒక బాధాకర పరిస్థితిలో ప్రియుడు ప్రేయసిని చూడడం నాగేంద్ర కాశి వ్రాసిన “సత్యవేణి” కథకి ఇతివృత్తం. చిన్ననాటి ఆకర్షణ వయసొచ్చేసరికి ప్రేమగా మారడం, పల్లెటూరి నేపథ్యపు వివరాలు, వీళ్ళ ప్రేమని అడ్డం పెట్టుకుని ఊర్లో తగాదాలు రెచ్చకొట్టాలని చూడడం – వంటివి కథని ముందుకు నడుపుతాయి. పంతాలకు పోయి, ప్రేమించిన పాపానికి సత్యవేణిని పిచ్చిదాన్ని చేశారే అన్న బాధ కలుగుతుంది కథ పూర్తయ్యాకా. ప్రియుడు నగరంలో ఉద్యోగం చేసుకుంటూ, ప్రేయసి జ్ఞాపకాలతో బతుకుతాడు, కాని అక్కడ ప్రేయసిని మాత్రం మందులతో పిచ్చిదాన్ని చేస్తాడామె తండ్రి. కృష్ణ పాత్ర కంటే, సత్యవేణి పాత్రకే అన్యాయం జరిగిందీ కథలో.  కథని నెమ్మదిగా, సరళంగా చెప్పిన తీరు చదివించేలా చేస్తుంది.

తను ఇష్టపడిన వ్యక్తి/తనని కావాలనుకున్న వ్యక్తి – ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో అనే విచికిత్స శ్వేతకి ఎదురవుతుంది అపర్ణ తోట రాసిన “వాలంటైనుడెవ్వరే…?” కథలో. తనని పెళ్ళాడమని పదే పదే అడిగే సందీప్‌తో “స్ట్రాటజీ మార్చి ఆడితే గెలవడానికి ప్రేమ ఏమీ చెస్ గేమ్ కాదు” అంటుంది శ్వేత. తన మీద గౌరవం లేని వాళ్ళను ప్రేమించను అన్న శ్వేతకి – అటువంటి గౌరవం కృష్ణ ఇవ్వగలడన్న నమ్మకం కలుగుతుందీ కథలో. మధ్యతరగతివాళ్ళు కార్పొరేట్ నిచ్చెనలెక్కి ఉన్నత స్థానాలకు చేరాలంటే ఎలా నడుచుకోవాల్సొస్తుందే శ్వేత పాత్ర చెబుతుందీ కథలో.

తన తండ్రి డైరీలను కాబోయే భార్యకి చదివి వినిపించి, తన తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళ అమ్మానాన్నలు ఆమోదించకపోవడంతోనూ వాళ్ళెంత బాధపడ్డారో గ్రహించి తానెవరినీ ప్రేమించలేదని చెబుతాడో యువకుడు. ప్రేమ అనేది లేని ప్రపంచం ఉంటే అందులో కన్నీళ్ళు ఉండవేమో, డబ్బులు, హాస్పిటల్ బిల్స్, మెడిసిన్స్, కన్సల్టేషన్ ఫీజ్… ఇలాంటివే ఉంటాయేమో అంటారు అరిపిరాల సత్యప్రసాద్మూడో కథ“లో.

ఒకప్పటి బాల్య/కౌమార వివాహాలు, బహుభార్యత్వంలో రొమాన్స్ గురించి ఇప్పటి ప్రిజుడిస్ రిషి శ్రీనివాస్ రాసిన “నిద్ర గన్నేరు” కథ. “ఆడదానికి నిద్రలేకుండా చెయ్యడం కన్నా ఆమె ప్రశాంతంగా ఆదమరచి నిదురించే సాంత్వనలో స్త్రీని ఉంచడం ఎక్కువ మగతనం అనిపించిన ఘడియల గురించి కథలో ప్రొటాగనిస్ట్ చెప్తాడు. ఈ కథ నేను అరవయ్యేళ్ళ క్రితమే రాయాల్సింది అంటాడు.

బండ్లమూడి స్వాతికుమారి రాసిన “లవ్ మే హాపెన్” కథలో – ఎప్పుడు ఏ రిలేషన్‌లో ఉన్నా, ఎవర్తోనూ కలిసి ఉండాలనుకోని యువతికి, తర్వాత అనిపిస్తుంది – ‘ఐ నీడ్ ఎ ప్రెసెన్స్ ఎట్ హోం, టు మేక్ ఇట్ ఎ హోమ్’ అని. సన్నిహితంగా వచ్చిన ఓ వ్యక్తి కూడా దూరమైపోతాడేమో… అతను కాదంటే జీవితంలో ‘మూవ్ ఆన్’ అవ్వడం ఎంత కష్టమో అనుకుంటుంది. “For love that smiled in April, is false to me in May” అనే Sara Teasdale కోట్‌తో మొదలైన ఈ కథ “Who knows Sara could be wrong at times! అనే వాక్యంతో ముగుస్తుంది.

పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన ‘బాక్వాటర్స్‘ కథలో ఉష తను ఇష్టపడిన శరత్‌కి అండగా ఉండాలన్న తాపత్రయంతో, అవసరంలో ఆదుకోలేకపోతున్నాన్న అపరాధ భావనతో, తమ బంధాన్ని కాపాడగలిగేంత శక్తి తన ప్రేమకి ఉందో లేదోనన్న అనుమానాలుంటాయి.  ఆ అనుమానం నిజమవుతుంది శరావతి బ్యాక్ వాటర్స్ ట్రెక్‌లో. మనసుని బరువెక్కిస్తుందీ కథ.

“ప్రేమకి లింగం లేదు, అలాంటప్పుడు లింగ భేదాలు తారతమ్యాలు ఉండవు” అనే మానస ఎండ్లూరి వ్రాసిన కథ “నా జూలియా“. అన్నీ తెలిసిన అనుభూతులే. అనుభవించిన జ్ఞాపకాలు కళ్ళ ముందే ఉన్న మళ్ళీ నూతనంగా ప్రేమలో పడడం బాగుంది” అనుకుంటుంది బాల, జులియాకి సన్నిహితమైనప్పుడు.

“మరిచిపోడానికి అతను ఓ జ్ఞాపకం కాదు… వదులుకోడానికి తనేమీ మామూలు మనిషి కాదు… అతనో ప్రేమ స్వరూపం” అని గతించిన తన తండ్రి గురించి తెలుసుకున్న కూతురు ఆయన ఆపిన చోటనుంచే తన పని మొదలుపెడుతుంది “గన్స్ అండ్ మాన్‌సూన్స్” కథలో. శ్రీలంకలోని జాతుల వైరాన్ని, అంతర్యుద్ధాన్ని, యుద్ధం మిగిలిచిన విషాదాల్నీ స్పర్శిస్తూ హృద్యంగా సాగుతుంది మహి బెజవాడ రాసిన ఈ కథ. కథాంశాన్ని, పాత్రల ఉద్వేగాలని చక్కగా సమన్వయించిన కథ.

స్వార్థంతో ఇద్దరు ప్రేమికుల జీవితాలతో ఆడుకోవలనుకున్న ఓ సంతతి లేని జంటలో సరైన సమయంలో విచక్షణ కలిగి తమ ప్రయత్నాలను విరమించుకున్న వైనాన్ని మిథున రాసిన “రామి” కథ చెబుతుంది. శ్రీకాకుళం యాసలో కథని అలవోకగా నడిపారు రచయిత్రి.

“దేహసౌఖ్యంలోని దైవత్వాన్ని అనుభవించలేని వాళ్ళని ప్రేమే కాదు, ఏ భావావేశమూ తాకలేదేమో?” అంటుంది కథానాయిక ఉషజ్యోతి బంధం రాసిన ‘మోహఋతువు‘ కథలో. “ఒక మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. నిజమైన ప్రేమ ఏది అని లాలూచీలో పడి, చేతుల్లో ఉన్న ఆనందాన్ని ఒలకబోసుకుంటాం మూర్ఖంగా” అంటుదామె. తీవ్రమైన భావోద్వేగాలతో ప్రేమని అన్వేషించి, పొందిన యువతి కథ ఇది.

ఫోటోగ్రఫీ అనేది లైఫ్ అండ్ టైం మధ్యలో ఒక ఇంటర్‌సెక్షన్ అని నమ్మిన ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్‌లో ఓ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం హైదరాబాద్ వస్తాడు. పాత జ్ఞాపకాలతన్ని చుట్టుముడతాయి. బాల్యం, పేదరికం, కష్టాలు, ఉద్యోగం తెచ్చుకోవడం… అన్నీ మనసున కదలాడుతాయి. ఈ అసైన్‍మెంట్‌లో ఆమెను చూడడం… మరో జ్ఞాపకం వెల్లువవడం… తనొచ్చింది ‘ఆమె’ పెళ్లికేనని తెలియడం… అతని ఉద్వేగాలు… చదువరులనూ అల్లుకుపోతాయి వెంకట్ శిద్ధారెడ్డిది గేమ్స్ వియ్ ప్లే” కథలో.

కె.వి.కరుణకుమార్ రాసిన “జింగిల్ బెల్స్” ప్రేమించమంటూ, లేదంటే ఆమె మొహం మీద యాసిడ్ పోయడానికి సిద్ధమైన యువకుడి కథ చెబుతుంది. క్రిస్‌మస్, చర్చి నేపథ్యంలో ఎక్కువభాగం కథ సాగుతుంది. తన కూతురుని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించిన తండ్రి ముందు కొన్ని ఆలోచనలు చేసి, అవేవి ఆశించిన ఫలితాన్ని ఈయవని గ్రహించి- బెదిరిస్తున్న యువకుడిని విషమిచ్చి చంపేస్తాడు. ఉద్విగ్నతకి గురిచేసే కథ ఇది. ఈ కథలోని పాత్రలు మాట్లాడే భాష పాత్రోచితంగా ఉండి ఆసక్తిగా చదివిస్తుంది.

***

“ప్రేమ అనేది అందరికీ కామన్ అయిన ఒక ఇంటెన్స్ హ్యుమన్ ఎమోషన్. ఏ ప్లేన్‌లో ఉన్న పాఠకులకి అయినా, ఇన్‌స్టెంట్ కనెక్ట్ తీసుకుగారల శక్తి. సామాజిక ఆర్థిక, జెండర్ వలయాలను దాటి, అందరికీ అనుభవంలోకి వచ్చే ప్రేమ గురించి డిఫరెంట్ డిగ్రీల్లో, డిఫరెంట్ టోన్స్‌లో రాసి, అందుబాటులో ఉంచడం అనే పర్పస్‌ని ‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ నిర్వర్తించిందంటారు చైతన్య పింగళి “మళ్ళీ కలిసేదాక”లో.

***

‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ (పన్నెండు ప్రేమ కథలు)
ప్రచురణ: న్యూవేవ్ బుక్స్
పుటలు: 226. వెల: 200/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, ప్రచురణకర్త
న్యూవేవ్ బుక్స్, ఎమ్.ఎల్.ఎ. కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్ 500034. ఫోన్స్: 9705972222, 9849888773
ఈబుక్: కినిగె.కామ్
http://kinige.com/book/In+The+Mood+For+Love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here