[box type=’note’ fontsize=’16’] కళారంగమూ కురుక్షత్రం లాటిందే. కీర్తికాంత కోసం తపన, పోరాటం, ఆరాటం తప్పవు అంటూ తెలుగు సినీరంగంలోని అతిరథ మహారథుల గురించి, అర్ధరథుల గురించి వివరిస్తున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు ఈ రచనలో. [/box]
[dropcap]క[/dropcap]థానాయకుడు… హీరో..
కథానాయకుడు కావాలని ఎవరికుండదు.. “ఫేవరెట్” కోసం ప్రాణాలకు తెగించే వాళ్ళెందరో! చిన్న పిల్లలకి ఇష్టమైన హీరో సినిమా చూస్తొచ్చాకా రాత్రి ఎన్ని కలలో.. తానే ఆ కథానాయకుడైపోయినట్లు “డిష్యుం.. డిష్యుం” అంటూ ఎగిరెగిరి తంతున్నట్లు ఇంకా ఎన్నో.. వయసు పిల్లలకైతే ఇంకా హీరోయిన్ కూడా వస్తుంది కలలోకి. ఆడపిల్లలకైతే వాళ్ళవన్నీ “బంగారుకలలే”. మగాళ్ళని “రంగుల” కలలు. కలల “రాజకుమారుడు” ఎలా ఉంటాడు?
హీరో ఆరడుగులు.. తగిన ఒడ్డు. అందమైన క్రాఫ్, గంభీరమైన స్వరం. పైగా పాటగాడు.. ఆటగాడు, మాటగాడు. మంచి వాళ్ళకు మంచివాడు.. మోసగాళ్ళకు మోసగాడు. ఒక్క చేత్తో వందమందొచ్చినా సమాధానం చెప్పే.. మగధీరడు. బైక్‌లు, కార్లే కాదు గుర్రపుస్వారీ కూడా చేస్తాడు.. ఒకటా.. ఇలా ఎన్నో గుణగణాలతో కథానాయకులు “జీవితాంతం” కొనసాగుతుంటారు.
నిజజీవితంలోనూ “కథానాయకులు” ఉంటారు.. వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తుంటారు.. ఎందరికో సేవ చేస్తుంటారు.. దానధర్మాలు చేస్తుంటారు.. సంఘాన్ని సంస్కరిస్తుంటారు.. కానీ వీరు బాగుంటారని చెప్పలేం.. మాటగాళ్ళు, పాటగాళ్ళు కాకపోవచ్చు.. ఒక్కరినీ కూడా ఎదుర్కోలేకపోవచ్చు. మరి కేవలం మంచి పనులు చెయ్యడమే కాకుండా పైన చెప్పిన లక్షణాలన్ని కల కథానాయకులు ఎక్కడుంటారు? అటువంటి “సకళకళావల్లభులు” కేవలం “వెండితెర” మీద మాత్రమే కనిపిస్తారు. ముఖ్యంగా “తెలుగు” వెండి తెర మీద “ఎక్కువ”గా ఉంటారు.. బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ కనిపిస్తారు.. హాలీవుడ్‌లో కూడా ఇన్ని లక్షణాలుండవు.
టాలీవుడ్ హీరోకి “ఇన్ని” లక్షణాలు ఉంటాల్సిందే లేకపోతే ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు “ఫీలవుతారు”. మరి అన్ని లక్షణాలనూ తెరమీద ప్రదరిస్తూ కథానాయకులుగా ఇప్పటి వరకూ ఎంత మంది వచ్చి కొనసాగారు?.. ఎంతమంది కనుమరుగయ్యారో!! ఓ సారి చూద్దాం..
***
తెలుగులో మొట్టమొదటి చిత్రం (టాకీ) పెచ్.ఎం రెడ్డి దర్శకత్వం వహించిన భక్తప్రహ్లాద.. 06-02-1932న తొలి తెలుగు సినిమాగా బొంబాయిలో విడుదలైంది. రెండు వారాల తరువాత విజయవాడ మారుతీ టాకీస్‌లో విడుదలైంది. (దీని విడుదల 15-09-31 అనే అభిప్రాయము కూడా వినబడుతోంది) చిత్రంలో హీరో ఎవరు? హిరణ్య కశ్యపుడు. హీరో “పాత్ర” కాదు కాబట్టి ఆ ప్రాత్ర పోషించిన మునిపల్లె సుబ్బయ్యగారిని ఆ చిత్ర కథానాయకుడనలేం. ప్రహ్లాదుడే హీరో కావాలి. ప్రహ్లాదుడి పాత్రను పోషించిన ‘కృష్ణారావు’ అనే కుర్రవాడిని కూడా మనకు “తెలిసిన” కథానాయకుడిగా అనుకోలేము.. ముప్పైవ దశాబ్దంలో బళ్ళారి రాఘవ, రాఘురామయ్య, యడవల్లి సుర్యనారాయణ, సి.హెచ్.నారాణరావు, చిత్తూరు నాగయ్యలు కథానాయకులుగా రంగ ప్రవేశం చేశారు.. నలభైలలో అక్కినేని నాగేశ్వరరావు, ముక్కామల, ఎస్వీరంగారావు, నందమూరి తారకరామారావు; ఏభైలలో గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య, చలం, సత్యనారాయణ, హారనాథ్, శోభన్‌బాబులు; అరవైలలో రామకృష్ణ, కృష్ణ, చంద్రమోహన్, రామ్మోహన్, కృష్ణంరాజు, విజయచందర్‌లు; డెభ్భైలలో బాలకృష్ణ, మురళీమోహన్, రంగనాథ్, శరత్‌బాబు, నరసింహహాజు, మోహన్‌బాబు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, భానుచందర్, సుధాకర్‌లు; ఎనభైలలో నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు. రాజశేఖర్, సుమన్‌లు; తొంభైలలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, సుమంత్, శ్రీకాంత్, శ్రీహరులు; రెండువేల సంవత్సరం తరువాత ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు కథానాయకులుగా వెలుగొందాలని చిత్రరంగంలో ప్రవేశించారు.
కానీ “తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది” అన్నట్లుగా అందరూ హీరోలు కాలేకపోయారు.. అయినా నిలద్రొక్కుకోలేకపోయారు. కొంత మంది క్యారెక్టర్ నటులుగా, కామెడీ హీరోలుగా, విలన్‌లుగా కొంత కాలం విలన్‌గా మళ్ళీ హీరోగా రూపాంతరం చెందారు. వారిలో ప్రభావాన్ని చూపిన తొలి కథానాయకుడెవరూ అంటే చిత్తురు నాగయ్యగారనే చెప్పాలి. నలభైలలో లక్షరూపాయలు పారితోషికాన్ని పుచ్చుకొన్నారంటే ఆయనంటే ఏమిటో తెలుస్తుంది. కేవలం నటుడే కాదు నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీతదర్శకులు కూడా. బళ్ళారి రాఘవ, రఘురామయ్య వేమూరి గగ్గయ్యలు గొప్ప నటులే ఆయనప్పటికి వారు ఎక్కవగా నాటకరంగంలోనే ప్రభావాన్ని చూపగలిగారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే “తొలి తెలుగు సూపర్‌స్టార్” చిత్తూరు నాగయ్యగారే.. దక్షిణ భారత దేశం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొన్న తొలి నటులు నాగయ్యగారే.. వివాదరహితుడిగా, దానశీలిగా ఉన్నత ప్రమామాలతో జీవించి నటులకు ముఖ్యంగా కథానాయకులకు గౌరవాన్ని తెచ్చేలా నటించారు.. జీవించారు.. అయితే నాగయ్యగారు కథానాయకుల శకాన్ని ఆరంభించారు అంతే!
ఒక నటుడు సినిమా ప్రేక్షకుల పైనే కాక సామాన్య జనావళి మీద ఎంతప్రభావం చూపగలదో వారి దైనందిన జీవితాలలో ఎంతగా మమైకం చెందగలదో ఎంత కీర్తిప్రతిష్ఠలు సంపాదించగలడో ఒక కొలమానాన్ని (benchmark) ఏర్పర్చి తెలుగు చిత్ర సీమని శాసించిన నటులు ఏఎన్నార్, ఎన్టీఆర్‌లు. ఆ నటసామ్రాట్ నటరత్నల స్థానాన్ని మరెవరూ ఎన్నటికీ అందుకోలేరు. తెలుగు సినీ తల్లి రెండు కళ్ళతోనూ సినీ ప్రపంచంలో సూర్యచంద్రులతోను వాళ్ళు పోల్చబడ్డారు.. కళ్ళు రెండే ఉంటాయి.. సూర్యచంద్రులు ఇద్దరే ఉంటారు. కాబట్టి వారి సరసన నటుడు నిలచే అవకాశమే లేదు.
అది ముందుగానే గ్రహించిన ఎస్వీరంగారావు, గుమ్మడి వంటి నటులు క్యారెక్టర్ నటులుగా స్థిరపడిపోయారు.
వారు చిత్రరంగాన్ని ఏలుతున్నప్పుడు వారి తరవాత శ్రేణి చిత్రాలలో కాంతారావు విజయం సాధించారనే చెప్పాలి. అప్పుడప్పుడు వారి చిత్రాలలో సహనటుడిగా నటిస్తూ కత్తుల కాంతారావుగా తనకొక ప్రత్యేకమైన “ముద్ర”ను ఏర్పర్చుకోగలిగారు.. జగ్గయ్య హీరోగా విజయాన్ని అందుకోలేకపోయినా క్యారెక్టర్ నటులుగా ప్రతినాయకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వెలుగొందారు..
సత్యనారాయణ హీరోగా రాణించలేక ప్రతినాయక పాత్రలకి చాలా కాలం పరిమితమైపోయారు.. ఎన్టీఆర్‌కి డూప్‌గా నటించారు.. అయితే శారద చిత్రంలో అసమాన నటనతో కేరెక్టర్ నటుడిగా స్థిరపడిపోయారు.
నాగేశ్వర్రావు, రామారావుల తరువాత ఆ స్థాయిలో కాకపోయినా క్రిందిస్థాయిలో అభిమానులని ఆకట్టుకొని చాలా కాలం నిలబడగలిగింది కృష్ణ శోభన్‌బాబులు. వీరిద్దరూ వారికి పోటి “అనిపించక” పోయినా వారు జైత్రయాత్ర సాగిస్తున్నప్పుడే తమకొంటూ ఒక ఉనికిని ఏర్పర్చుకోగలగడం విశేషంగా చెప్పుకోవాల్సిందే.
చలం, చంద్రమోహన్‌లు హీరోలుగా నిలదొక్కుకోలేపోయాలు. కామెడీ హీరోలుగా, క్యారెక్టర్ నటులుగా కొనసాగారు. రాజేంద్రప్రసాద్‌ది అదే తరహా!
కృష్ణంరాజు హీరోగానే ప్రవేశించినా విలన్‌గా కాంతకాలం కొనసాగి తిరిగి కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతన ఏర్పర్చుకోగలిగారు. మోహన్‌బాబుదీ ఇదే పంథా.
సుధాకర్ హాస్యనటుడిగానే ముద్ర వేయించుకోగలిగారు. రంగనాథ్, శరత్, నరసింహరాజులు హీరోలుగా అంతంత మాత్రమే.. మురళీమోహన్ హీరోగా పరవాలేదనిపించుకోని క్యారెక్టర్ నటుడిగా నిలబడ్డారు..
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌ల తరువాత ఇలా జంటగా నటుల గురించి చెప్పె అవకాశము రాలేదు. వీరి తరువాత సంచలనం కలిగించింది చిరంజీవే. సహనటుడిగా, ప్రతినాయకుడిగా కొన్ని చిత్రాలలో చేసిన స్వయంకృషితో కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొంది పై నలుగురి వలె సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
సుమన్, రాజశేఖర్‌లు అడపాదడపా ముఖ్య పాత్రలలో కనిపిస్తు ఉంటారు.. శ్రీకాంత్‌ది అదే పంథా.
సినీ వారసత్వం ప్రాతిపదికన తెరమీదకొచ్చిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు వారసత్వం మాత్రమే మాకు ఆలంబన అనిపించుకోకుండా స్వీయప్రతిభను జోడించి కొనసాగుతున్నారు.. ఈ కోవకు చెందిన మరొక నటుడు జగపతిబాబు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్నారు..
వారసులుగా ప్రవేశించిన మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, పవన్‌కళ్యాణ్‌లు కూడా పటిష్ఠమైన తమ సినీ నేపథ్యానికి తమవంతుగా ప్రతిభని కూడ జతపరుస్తు కొనసాగుతున్నారు.. ఇంకా ఎందరో యువనటులు సత్తా చూపించడానికి తహ తహలాడుతున్నారు..
అయితే స్వీయ ప్రతిభ లేకపోతే ఎంతో పటిష్టమైన నేపథ్యం ఉన్నా ఉపయోగపడదు. నేపథ్యం అవకాశాలనిస్తుంది. ప్రతిభ లేక పోయినా, సరిగ్గా ఉపయోగించుకోకపోయినా, ఎంత తొందరగా వచ్చారో అంత తొందరగానూ తెరమరుగైపోవడం ఖాయం. ఇందుకు గాను
అరుణ్‌కుమార్(S/O దాసరినారాణరావు)
ప్రకాష్ (S/O కె.రాఘవేంద్రరావు)
ఆర్యన్ రాజేష్ (S/O ఇ.వీ.వీ. సత్యనారాణ)
గౌతం (S/O బ్రహ్మానందం)
విక్రం (S/O ఎమ్.ఎస్.నారాయణ)
తారకరత్న(నందమూరి వంశవాసుడు)
వైభవ్ (S/O కొదండరామరెడ్డి)
శంకర్ (పూరీ జగన్నాధ్ సోదరుడు)
వడ్డే నవీన్ (S/O వడ్డె రమేష్)
రమేష్ బాబు (S/O ఘట్టమనేని కృష్ణ) లను ఉదారణలుగా చెప్పకోవచ్చు.
వీరితో పొలిస్తే అక్కినేని మనవడు సుమంత్, రోజారమణి కుమారుడు తరుణ్ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తున్నాప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.
కాబట్టి నేపథ్యం సినీరంగ ప్రవేశాన్ని సునాయాసంగా కలిగిస్తుంది. కాని నిలదొక్కుకొని కొనసాగడానికి ప్రతిభ తప్పనిసరి. ప్రేక్షకులు మరీ అంత అమాయకులు, మొహమాటస్తులు కారు మరి!
ప్రతిభ ఉన్నప్పటికి కొనసాగడానికి తెలివితేటలు కావాలి. క్రమశిక్షణ, పాత్రల ఎన్నికలో విచక్షణా జ్ఞానం, ప్రేక్షకుల నాడిని పట్టుకొనేశక్తి ఉండాలి.. అరవైల చివర వరకూ జానపద చిత్రాలు బాగావే ఆడేవి.. ఆ తరువాత ఆగిపోయాయి.. కాతారావుగారు చిక్కుల్లో పడ్డారు.. పౌరాణికాలు తగ్గిపోవడంతో అటు కత్తులు పోయి ఇటు కృష్ణ, నారద పాత్రలు లేకపోవడంతో ఆయన దెబ్బతిన్నారు.. జేమ్స్ బాండ్ చిత్రాలున్నంత వరకే కృష్ణ ఉంటాడు. తరువాత కాతారావుకి మల్లే కృష్ణ పనీ అయిపోతుందనుకొన్నారు.. మోసగాళ్ళకు మోసగాడు తరువాత పండంటి కాపురం లాంటి మంచి కుటుంబ కథాచిత్రం తీసి పంథాను మార్చుకోవడమే కాక ఎన్నో సాహసాలకు శ్రీకారం చుట్టి జైత్రయాత్ర కొనసాగించారు కృష్ణ. నాగేశ్వరరావు చిత్రరంగ ప్రవేశం చేసిన పదేళ్ళకు గానీ సాంఘికాలలోకి మారలేదు. పాత్రల ఎన్నికలోనూ, పరిస్థితులను ఎప్పటికప్పడు బేరీజీ తీసుకొంటూ సాగిపోవడంలోను ఆయన తరువాతే ఎవరైనా. దైవదాసు వంటి ట్రాజెడీ చేసిన తరువాత చక్రపాణి, మిస్సమ్మలో హాస్య పాత్రలు తీసుకొన్నారంటే ఆయన అవగాహన శక్తిని అర్థం చేసుకోవచ్చు.
గత కాలం నటులలో ఇద్దరు నటులు అన్నీ ఉండి కూడా రాణించలేకపోయారు. వారు హరనాథ్, రామకృష్ణలు.. వారు ఆశించిన స్థాయిలో రాణించి ఉంటే బహుఃశా ఎన్టీఆర్ ఏయన్నార్ జోడీ కృష్ణ శోభన్ జోడీల మధ్య హరనాథ్ – రామకృష్ణల జోడీ ఉండి ఉండేది. హరనాధ్, భీమవరం బుళ్ళోడు రామకృష్ణలకు రామారావు వలె సాంఘిక, జానపద, పౌరాణికాలు పాత్రలకు సరిపోయే ఆహార్యం ఉండేది.. హరనాథ్, రామకృష్ణలు ఇద్దరు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించినవారే.. రామకృష్ణకు తగినన్ని అవకాశాలు రాక, వచ్చిన అవకాశాలను త్రాగుడు మైకంలో దుర్వినియోగం చేసుకొని హరనాథ్ భంగపడ్డారు. చంద్రమౌహన్ మరో నాలుగు అంగుళాలు పొడువు ఉండి ఉంటే అగ్రనటుల స్థానం తరువాత నిలచేవాడు.. ఏ పాత్రనైనా పోషించగల ప్రతిభ ఉన్ననటుడు మరి! ఈ విషయాన్ని స్వయంగా అక్కినేనే చెప్పారు.
కళారంగమూ కురుక్షత్రం లాటిందే. కీర్తికాంత కోసం తపన, పోరాటం, ఆరాటం.. కొండొకచో కుట్రలు, కుతంత్రాలు, కీర్తికాంత దొరికితే అన్నీ పొందినట్లే. కీర్తికాంత కనకం లేకుండా రాదుగా! యువనటులు ముందుగా తమతమ గుణగణాలను శోధించుకొని, సంస్కరించుకొని నాటి అగ్రనటుల ప్రధాన గుణాలైన క్రమశిక్షణ, బలహీనతలకు లోనుకాకుండా ఉండటం వంటివాటిని అలవరిచుకొని సాగిపోవాలి. నాటి నటులకు లేని “సాంకేతికత” వీరికి పుష్కలంగా లభిస్తోంది. ఆధునిక సౌకర్యాలను మౌలిక సూత్రాలనూ మేళవించుకొంటూ జైత్రయాత్ర సాగించడమే చేయవలసినది.