జీవన రమణీయం-37

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

నాన్నకి నా పిల్లలంటే, అందులోనూ మా పెద్దవాడంటే ప్రత్యేకమైన ప్రేమ. ఆదివారాలొస్తే వాడిని తీసుకొని ఆబిడ్స్‌లో పేవ్‌మెంట్ మీద పెట్టే పుస్తకాలన్నీ చూపించి వాడికి బోలెడు కామిక్స్ కొనిపెట్టేవారు! తాతంటే వాడికి ప్రాణం… అలా అలవడిందే మా ఇద్దరు పిల్లలకీ పుస్తకాలు చదివే అలవాటు… మా అన్నయ్య పిల్లలకి అంతగా అబ్బలేదు! ఇప్పటికీ పెట్టెల నిండా వున్న కామిక్స్, టింకిల్స్ అలాగే దాచి పెట్టుకుంటారు పిల్లలు. పుస్తకాల షాప్‍కెళ్తే నాలాగే ఒళ్ళు తెలియకుండా కొనేస్తుంటారు!

నాన్న మేం పైన ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినప్పుడు కూడా వున్నారు. సుగర్ వ్యాథి వల్ల, పథ్యం సరిగ్గా చెయ్యక ప్రాణం మీదకి తెచ్చుకున్నారు.

నాన్న పోయేముందు మాత్రం నాకు మానని గాయం ఇచ్చి పోయారు. మా బాబాయి వాళ్ళ చెట్టు రాచ ఉసిరికాయలు పిన్ని పచ్చడి చేస్తే, నాకు ఇష్టం అని రెండు బస్సులు మారి పట్టుకుని వచ్చారు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు! నేను ఇంటికి వస్తూ వున్నాను ఏదో సిట్టింగ్ నుండి… ఇంటికి తాళం చూసి ఆ పచ్చడి బాటిల్ ఎదురింటావిడకి ఇచ్చి, వెళ్ళి బస్ ఎక్కేశారు! ఆ పచ్చడి వంక పెట్టుకుని ఎంత ప్రేమగా నన్ను చూడ్డానికొచ్చారో పాపం! నేను ఆయన వెళ్ళిన పది నిమిషాల్లో వచ్చానుట… ఎదురింటావిడ తాళం ఇస్తూ చెప్పింది!… “అయ్యో… తాళం ఇచ్చి వెయిట్ చెయ్యమనలేకపోయారా?” అన్నాను. “ఆయన వద్దన్నారు. టైం లేదన్నారు” అందావిడ. నాకు కన్నీళ్ళు ఆగలేదు. బస్‍స్టాపు దాకా పరిగెత్తి చూశాను. అక్కడ లేరు! బస్ ఆ రోజు నా మీద పగబట్టి తొందరగా వచ్చేసినట్లుంది… వెళ్ళిపోయారు. నేను ఆదివారం వెళ్ళి చూద్దాం అనుకున్నాను. కానీ ఆయన ఆదివారం దాకా నా కోసం వెయిట్ చెయ్యలేదు! అందుకే టైం లేదన్నారు! ఇది రాస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో నా మనసు బరువెక్కిపోయింది…. కన్నీళ్ళు ఆగడం లేదు… మీరు అంతా కూడా మీ పిల్లలకి సమయం కేటాయించినట్టే, కన్న తల్లిదండ్రులకు కూడా టైం కేటాయించండి… టైం లేదని కానీ, తర్వాత చూద్దాం అని వాయిదా వెయ్యడం కానీ చెయ్యకండి… ఓసారి పోతే రానిది జీవితంలో… సమయమే! నన్ను నేను ఎన్నిసార్లు నిందించుకుంటానో ఈ సంఘటన తర్వాత చెప్పలేను!

నాన్న పోయేముందు నన్నే తలచుకుని వుంటారని నాకు గట్టి నమ్మకం!

అన్నయ్య అన్ని కార్యక్రమాలకీ ఏర్పాట్లు చేసేడప్పుడు బాబాయ్ వచ్చి, “మీ నాన్న ఇమ్మన్నాడు రా…” అని ఒక కవర్ ఇచ్చాడు. అందులో 27వేల రూపాయలున్నాయి. తన అంతిమ కార్యాలకి అవి ఉపయోగించమని, తను పోయాక కొడుకుకిమ్మని నాన్న అవి బాబాయ్ చేతికిచ్చారట. బాబాయ్ మధ్యలో ఒకసారి పెన్షన్ రాలేదని ఆయన బాధపడ్తుంటే, ఇవ్వబోయారుట… కానీ ఆయన తీసుకోలేదుట. “అవి ఆ కార్యక్రమాలకే” అని ఖచ్చితంగా చెప్పారట. అలా ఎవరిమీదా, చివరికి పోయినప్పుడు కూడా, ఆధారపడకుండా, ఇంట్లో ఓ నాలుగు విరేచనాలయి, కళ్ళు మూసుకుని పడుక్కుని, మా అమ్మని ఆట్టే కంగారు పెట్టకుండా, తను ఎక్కువగా బాధ పడకుండా, ప్రశాంతంగా హరిపురీ కాలనీలో వున్న కొడుకు స్వంత ఇంట్లో, భార్య సమక్షంలో పోయారు!

నేను అప్పుడు జీ తెలుగు ఛానెల్‍లో ‘కల కానిది’ సీరియల్ వ్రాస్తున్నాను. నాన్న పోయిన వార్త విని ఏడుస్తూ వెళ్ళిన నేను… ఆ రోజు కూడా మర్నాటికి డైలాగ్స్ రాశాను… ఆ తర్వాత రోజుకి ఎవరితోనైనా రాయించమన్నాను… ఎందుకంటే వారికి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎంత నష్టమో నాకు తెలుసు! నాన్న పోతూ ఎవరికీ నష్టం చేసి పోవడం నాకిష్టం లేదు!

ఆయన బ్రతికుండగా నేనెప్పుడూ వ్యక్తపరచకపోయినా, నాకు నాన్నంటే చాలా ప్రేమ! నాన్నతో నా ప్రతి విజయం ఇప్పటికీ చెప్పుకుంటాను. అమ్మని మొదటిసారి ఫ్లయిట్ ఎక్కించినప్పుడూ, విదేశానికి తీసుకెళ్ళినప్పుడూ, నాన్నకి ఇవన్నీ చెయ్యలేదే అని కుమిలిపోతుంటాను!

నాన్న పుట్టిన రోజెప్పుడో తెలీదు! నాన్నకి గుత్తి వంకాయ కూరా, ముద్దపప్పూ, ఆవకాయా ఇష్టం అని మాత్రం తెలుసు! నాన్నకి పేపర్ చదవడం, అందులో వార్తలు డిస్‍కస్ చెయ్యడం ఇష్టం అని తెలుసు!

ఇంట్లో పిల్లాడు ఏం చదువుతున్నాడో… పిల్లకి ఎన్నేళ్ళొచ్చాయో ఆయన పట్టించుకునేవారు కాదు. ‘పాలస్తీనాలో దాడుల’ గురించో… కాళీపట్నం రామారావు గారి ‘యజ్ఞం’ కథ గురించో, అందులోని పాత్రల గురించీ సీరియస్‌గా డిస్‌కస్ చేస్తుండేవారు!

“చంద్రబాబు వెళ్తే… ఎన్.టి.ఆర్. కుర్చీ ఖాళీ వున్నా కూర్చోమనలేదు అమ్మా” అనేవారు… అమ్మ వంటింట్లో నుండి “చివర ‘ట!’ అని పెట్టాలి… ‘కుర్చీ ఖాళీ వున్నా కూర్చోమనలేదట!’ అనాలి… మీరు చూశారా? ‘ట!’ అని పెట్టరూ?” అనేది. ప్రతి విషయం అలాగే చూసినట్లు చెప్పేవారు.

“చొక్కా వేసుకుని ఇంటర్వ్యూ ఇమ్మంటే మధురాంతకం రాజారాం గారు ఇవ్వను పొమ్మనాడు” అని అక్కడే వుండి చూసినట్లు చెప్పేవారు!

పేపర్ చదవడం, బస్సులెక్కి రోజూ త్యాగరాజ గానసభకో రవీంద్రభారతికో వెళ్ళి నాటకాలు చూడ్డం, నా గురించి మాట్లాడడం ఆయనకి ప్రియాతిప్రియమైన విషయాలు…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here