సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 13

0
4

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః ।
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరిదేవనా॥

తేటగీతి
ఋణము లనుబంధ రూపమ్ము లెలమి దాల్చ
ఆలి యాలయు ఆత్మజు లాలయాలు
వరుస వరియించి విచ్చేయు వరల గాను
ఋణము దీర నొక్కొక్కటి యెడయుచుండు
దుఃఖ మేటికి నిందులో దుఃఖ భాగ ! ౬౧

***

కామః, క్రోధశ్చ , లోభశ్చ
దేహే తిష్ఠంతి తస్కరాః ।
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత ॥

తేటగీతి
పెనగు కామమ్ము క్రోధమ్ము పిసినితనము
దేహ మందున స్థిరముగా తిష్ఠ వేసి
జ్ఞాన రత్నమ్ము నపహరించంగ నెపుడు
తొంగి జూచెడు బలమైన దొంగ లయ్య
జాగరూకత గలిగుండు జగము నందు ౬౨

***

మాతా నాస్తి, పితా నాస్తి
నాస్తి బంధు స్సహోదరః ।
అర్థం నాస్తి, గృహం నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత॥

తేటగీతి
ఎవరు తల్లి ? ఎవరు తండ్రి ? ఎవరు సఖులు ?
సహజు లెవ్వరు ? గృహమేది ? సంపదేది ?
అరసి సత్యమ్ము గ్రహియించి అనవరతము
జాగరూకత గలిగుండు జగము నందు ౬౩

***

క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః ।
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత, జాగ్రత ॥

తేటగీతి
చెలగు విత్తమ్ము , చిత్తమ్ము , జీవితమ్ము
క్షణిక మేనయ్య అరయంగ జగమునందు
జాలి చూపడు సమవర్తి క్షణము కూడ
జాగరూకత గలిగుండు జగము నందు ౬౪

***

జన్మ దుఃఖం, జరా దుఃఖం
జాయా దుఃఖం పునః పునః ।
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత, జాగ్రత ॥

తేటగీతి
అరయ జననమ్ము దుఃఖమ్మె అవని యందు
జరయు జాయయు దుఃఖమ్మె అరయగాను
తుదకు సంసార సంద్రమ్మె దుఃఖమయము
జాగరూకత గలిగుండు జగము నందు ౬౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here