కోరిక నెరవేరేనా…!

    2
    4

    [box type=’note’ fontsize=’16’] లైబ్రరీలో కూర్చుని పత్రికలలోని వార్తలను, సంఘటనలను కథలుగా మలచే ఓ పెద్దాయన రాసిన కథకు బహుమతి ఎలా వచ్చిందో బొందల నాగేశ్వరరావు వ్రాసిన “కోరిక నెరవేరేనా..!” కథ చెబుతుంది. [/box]

    [dropcap]నా[/dropcap]కు పుస్తక పఠనం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే అది నా వృత్తికి సంబంధించినది. అంటే నేను పేరున్న’జనని’ అన్న వార పత్రికలో సబ్ ఎడిటరుగా పని చేస్తున్నాను. అందుకే ప్రతి రోజు ఆఫీసుకు దగ్గరలో వున్న జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి రెండు గంటల పాటు దిన, వార, మాస పత్రికలను చదివి ఆఫీసుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఆ గ్రంథాలయపు లైబ్రేరియన్ కూడా ఏవైనా క్రొత్త పుస్తకాలొస్తే మొదటగా నాకే ఇస్తాడు. నేను చదివిన తరువాతే తతిమ్మా వాళ్ళన్నంతగా మా ఇద్దరి మధ్య సఖ్యతతో కూడికొన్న మంచి స్నేహం వుంది.

    ఆ రోజు యథావిధిగా గ్రంథాలయానికి వెళ్ళాను. లైబ్రేరియన్‌కు నమస్కరించి వెళ్ళి పత్రిక చదవటానికి కుర్చీలో కూర్చొన్నాను. అందరూ పత్రికలు, పుస్తకాలు చదవటంలో నిమగ్నమై వున్నారు. కాని రోజూ నేను కూర్చొనే కుర్చీకి ఎదరేవున్న కుర్చీలో కూర్చొని పత్రికలు చదువుకొంటూ వాటిల్లో నుంచి ఏవో వివరాలను రాసుకొంటూ కనబడే దాదాపు అరవై అయిదేళ్ళ వయసున్న పెద్దాయన ఇవాళ అక్కడ లేడు. మరింకెక్కడైనా కూర్చొని వుంటాడేమోనన్న సందేహంతో హాలు మొత్తం పరికించి చూస్తున్న నన్ను  లైబ్రేరియన్ గమనించాడు .

    “ఏమిటి సార్! రోజూ మీ యెదరే కూర్చొని పత్రికలు చదువుతూ, రాసుకొంటూ వుండే ఆ పెద్దాయన కనబడలేదనా? అదిగో ఆ గదిలో వున్నారు. తనకు అవసరమనుకొన్నప్పుడు  నా పర్మిషనుతో  ఆ గదిలోకెళ్ళి రాసుకొంటాడు” చెప్పాడు లైబ్రేరియన్.

    “అదే నాకర్థం కావట్లేదు. అసలు రోజూ పేపర్లను చూస్తూ, పుస్తకాలను చదువుతూ వాటి నుంచి  ఏమి రాస్తున్నారో తెలియదు కాని రెండు మూడు కాగితాలను తప్పకుండా రాసుకొని జోలె సంచిలో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇవాళ తిన్నగా మీ అనుమతితో లోపలే కూర్చొన్నారు. అంటే అది చాలా ఇంపార్టెంటు విషయమై వుంటుంది” అన్నాను.

    “ఇంపార్టెంటా పాడా! ఆ పెద్దాయన రాసుకొంటున్నవి కథలండి. కేంద్ర ప్రభుత్వపు సంస్థలో పెద్ద ఆఫీసరుగా చేసి దిగిపోయిన ఆయన సాహిత్యం మీద ఆయనకున్న పట్టుదల, మక్కువతో విరివిగా పుస్తకాలను చదువుతారు. ఆ పరిజ్ఞానంతో ఇప్పుడు కథలను రాయటానికి పూనుకున్నారు. నాకు తెలిసి గత రెండు నెలల్లో ఓ ఇరవై కథలను రాసుంటాడు. అదిగో… తన ప్రక్కనున్న ఆ జోలె సంచి నిండుగా తను రాసిన కథలే వుంటాయి” చెప్పాడు.

    ఒక్క నిముషం షాక్‌కి గురైయ్యాను నేను. దాదాపు ముప్పాతిక జీవితకాలం దాటిన తను ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి కలిగి కథలు రాయటమంటే అది గొప్ప సంగతే!

    “సార్! నేను ఆయనతో మాట్లాడాలి” అడిగాను.

    “దాందేముంది రండి” అంటూ లోనికి తీసుకు వెళ్ళి “చూడండి! పేపర్లను ముందేసుకొని ఎలా రాసేస్తున్నాడో! రోజూ కథకు సంబంధించి రెండు పేజీలైనా రాయకపోతే ఆయనకు నిద్ర పట్టదంటాడు” అని నాతో చెపుతుండగా పెద్దాయన తలపైకెత్తి కళ్ళజోడును సర్దుకొని చూసి “కూర్చొండి సార్” అన్నాడు.

    ఇద్దరం కూర్చొన్నాం. పెద్దాయన రాయడం ఆపేసి “చెప్పండి సార్! ఆల్ ఆఫ్ సడన్‍గా ఈ గది కొచ్చారేంటి?”అడిగాడు.

    “నేనే మిమ్మల్ని చూడాలన్నాను! అవును. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూస్తున్నా మీరో రచయితని, రోజూ మీరు రాస్తున్నవి కథలని వీరు చెప్పేంతవరకు నేను గుర్తించలేక పోయాను” అన్నాను.

    “అవునండి. మీ గూర్చి చెప్పాను. సారు కూడా…” అని పెద్దాయనకు నా గూర్చి చెప్పబోతుండగా నేను లైబ్రేరియన్ చెయ్యి పట్టుకొని ‘చెప్పొద్దన్నట్టుగా’ నొక్కాను. లైబ్రేరియన్ మౌనంగా వుండిపోయాడు.

    “నేను రచయితను కానండి. అయితే నా జీవితంలో గొప్ప రచయితలు, కవుల యొక్క రచనలను చదివిన అనుభవంతో నేనూ రచనలు చేయాలనుకొని కథలను రాస్తున్నాను. అయితే నేను రాస్తున్న కథలలో వున్న లోపమేమిటో తెలియదు కాని పత్రికలకు పంపుతున్న ప్రతి కథ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి నన్ను బాధకు గురి చేస్తున్నాయి” అంటూ జోలెసంచిలో వున్న ఓ పది కవర్లను తీసి నా చేతికిచ్చాడు.

    “ఇవన్నీ కథలేనా! మీ ఓపికను ఖచ్చితంగా హర్షించాలండి. నాకు మీ కథలను చదవాలనుంది. మరోలా అనుకోకపోతే ఇవ్వండి. చదివి ఓ వారంలో తిరిగి ఇచ్చేస్తాను” అన్నాను.

    పెద్దాయన లైబ్రేరియన్‌ని చూశాడు. లైబ్రేరియన్ ఇమ్మన్నట్టు తలూపాడు. వెంటనే ఆయన “అదేం భాగ్యం! బ్రహ్మాండంగా తీసుకెళ్ళండి. బాగున్నా లేకపోయినా చదవండి. లోపాలుంటే చెప్పండి. సరిదిద్దుకొంటాను” అంటూ పది కథలను ఓ ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి నా చేతికిచ్చి “వస్తాను సార్!” అంటూ బయలుదేరాడు.

    పెద్దాయన వెళ్ళిపోయిన తరువాత “ఏంటి సార్! ఈ కథలను మీ ‘జనని’ వార పత్రికలో కాని వేయిస్తారా” అడిగాడు లైబ్రేరియన్ .

    “తప్పకుండా! ఏమాత్రం శైలి, ఎన్నుకున్న కథా వస్తువు, కథనం బాగున్నట్లయితే ప్రచురించి, రచయిత కావాలనుకొంటున్న ఆ పెద్దాయన చిరకాలపు కోరికను తీర్చి పెడతాను” అన్నాను.

    “అలాని పేరున్న మీ పత్రిక విలువలను దిగజార్చుకోకండి సార్! జాగ్రత్తగా పరిశీలించండి” అన్నాడు లైబ్రేరియన్.

    ఈ లోపు పెద్దాయన నాకిచ్చిన ప్రతి కథ ప్రారంభం, చివర ముగింపులను చదివాను. వాటిలో కరుణ రసంతో ప్రాధాన్యతను సంతరించుకొని నన్ను కదిలించిన కథనొకదానిని తీసుకొని బ్యాగులో పెట్టుకొని “సార్! పెద్దాయన వస్తే ఈ కథలను వారికి చేరవేయండి. ఒక్క కథను తీసుకు వెళుతున్నాను. దానిని పోటీ కథలలో పెడతాను. న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేస్తే బహుమతి వచ్చినా రాకపోయినా తప్పకుండా పత్రికలో ప్రచురిస్తారు. అంతటితో పెద్దాయన ఆనందపడిపోతాడు” అన్నాను.

    “ఏంటి సార్! పెద్దాయన రాసిన ఆ కథ అంత బాగుందా! మీరెప్పుడూ అంటుంటారే శైలి, కథ, కథనమని అవి అంత బాగున్నాయా?” ప్రశ్నించాడు లైబ్రేరియన్.

    “అవును. బహుశా అది వారి జీవితంలో జరిగిన నిజ సంఘటనై వుంటుందని భావిస్తున్నాను. కథను అంతటి ఇన్వాల్వుమెంటుతో రాశారు. టూకీగా కథ ఏమిటంటే… అమెరికాలోనే సెటిలయిన కొడుకు కూతుర్ని ఇండియాలో వున్న కూతురి కొడుక్కి చేసుకోవాలన్న ఆశతో ఓ పెద్దాయన అమెరికాకు వెళతాడు. అక్కడ ఓ నెల్లాళ్ళు వుంటాడు. కొడుకుతో విషయాన్ని మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు. కాని కొడుకు ఆఫీసులో పని వొత్తిడి, పార్టీలు, మీటింగులు, గెట్ టుగెదర్‌లన్న వాటితో బిజీగా వుండి పోతూ తండ్రికి ఏ మాత్రం సమయం కేటాయించలేక పోతాడు. ఇక కోడలూ, మనవరాలు కూడా ఆఫీసు పనులు, షాపింగులు, స్నేహితులను కలవడాలంటూ రోజూ వెళ్ళిపోతుంటారు. కనీసం శని, ఆదివారాలు కూడా పెద్దాయన్ను పలకరించాలనుకోరు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కట్టుబాట్లు లేని, ఆడామగలకు తేడాలు తెలియని, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లా విచ్చలవిడిగా వుంటున్న వాళ్ళ జీవన సరళిని చూసి కొడుకు కుటుంబం అమెరికనులతో కలిసిపోయిందని గ్రహించి భారతదేశంలో మన కట్టు, బొట్టుతో కూడుకొన్న సంస్కృతి సాంప్రదాయాలతో వాళ్ళను పోల్చుకొని అది అగ్రరాజ్యమే అయినా మన దేశంతో ఏ విధంగానూ సాటి రాదన్న నిర్ణయాని కొస్తాడు. అయినా కొడుకు కూతుర్ని, కూతురి కొడుక్కి ఇచ్చుకుంటే… రక్త సంబంధాలు కలిసిపోతాయని, మనవరాలిని భారత దేశానికి తెచ్చుకుంటే  మన సంస్కృతికి, సాంప్రదాయాలకు చేరువ అవుతుందని ప్రయత్నిస్తాడు. కాని కొడుకుతో మాట్లాడే సందర్భం దొరక్కపోయేసరికి ఓటమి నెదుర్కొన్నట్టు బాధతో ఇండియాకు ప్రయాణం అవుతాడు. ఇండియాకు వస్తున్న ఆ రోజు ఎయిర్‌పోర్టులో “నాన్నా! నన్ను ఏదో అడగాలన్నారు. అడక్కుండానే వెళ్ళిపోతున్నారే”అని కొడుకంటే అందుకు జవాబుగా “నిజమేరా! నాకు నువ్వే రోజు సమయాన్ని కేటాయించావు కనుక. నేనొచ్చింది నీ కూతుర్ని అంటే నా మనవరాలిని నా కూతురి కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేసి పెట్టుకోవాలని. కాని పరిస్థితులను చూస్తే మీకూ మాకూ భూమి ఆకాశానికున్నంత తేడా వుందని తెలుసుకున్నాను. మీకూ, మాకూ అస్సలు పొసగదు. నా దృష్ఠికి మన దేశాన్ని విడిచి పెట్టి ఈ దేశంలో లగ్జూరియస్‌గా బ్రతుకుతున్న మన వాళ్ళందరూ ఎందుకో బానిసల్లా కనిపిస్తున్నారు. నువ్వూ అంతే! చివరిగా నాదో కోరిక. నీకు కుదిరితే… తండ్రినన్న మమకారంతో కూడికొన్న అనుబంధ ఏ కోశానైనా నీకుంటే… నా చావుకైనా ఇండియాకు వస్తావని ఆశిస్తున్నాను” అంటూ వీల్ చేర్లో ముందుకు వెళ్ళిపోతాడు ఆ తండ్రి. ఆ సన్నివేశం నన్ను బాగా కలిచి వేసింది. అందుకే ఆ కథను తీసుకున్నాను. దాన్ని పోటీల కొచ్చిన కథలలో చేరుస్తాను.  బహుమతి వచ్చినా రాకపోయినా తప్పకుండా ప్రచురణకు అర్హమౌతుందని నమ్ముతున్నాను” అన్నాను.

    “నిజం సార్! మీరు చెపుతున్నప్పుడే ఆ బలమైన సన్నివేశం నా గుండె లోతుల్ని తాకింది. నాకైతే తప్పకుండా కనీసం ప్రచురణకు నోచుకుంటుందన్న నమ్మకం కలుగుతుంది” అన్నాడు లైబ్రేరియన్ కర్చీఫ్‍తో ముఖం తుడుచుకొంటూ.

    ***

    నెల తరువాత-

    యథావిధిగా పెద్దాయన లైబ్రరీకి వచ్చాడు.కాని మునుపటిలా లేడు. ముఖంలో సంతోషాన్ని పులుముకొని ఓ విధమైన విజయగర్వంతో హుందాగా వున్నాడు. తిన్నగా లైబ్రేరియన్ వద్దకెళ్ళాడు. తన ముందున్న కుర్చీలో కూర్చొన్నాడు. జోలెసంచిలో నుంచి ఓ కవరును తీసి లైబ్రేరియన్ చేతికిస్తూ “సార్! ఇన్నేళ్ళగ్గాను ఇప్పుడు నా కోరిక నెరవేరింది. మీరు నా వద్ద  తీసుకొని ‘జనని’ వార పత్రికకు పంపిన నా కథ  పోటీలలో నెగ్గి దానికి మొదటి బహుమతి వచ్చింది. ఇందుకు కారణం మీ ప్రోత్సాహంతో కూడుకొన్న గైడ్‌లెైన్సే!” అన్నాడు పెద్దాయన లైబ్రేరియన్‌కు షేకండ్ యిస్తూ.

    “చాలా సంతోషం. అయితే ఇందుక్కారణం నా ప్రోత్సాహం మాత్రమే కాదు. తిరిగొచ్చిన పది కథల్లో రాతి గుండెలను సైతం కరిగించి చక్కటి సందేశాన్ని పాఠకులకు అందించిన మేటి కథ మీ ‘నిర్ణయం’ను ఎన్నుకొని పత్రికకు పంపి పోటీలో నెగ్గి  బహుమతి సైతం వచ్చేందుకు కారకుడైన ఆ ‘జనని’ వార పత్రిక సబ్ ఎడిటర్ శంకర్ గారిదే! అడుగో… అక్కడున్నారు” అన్నాడు లైబ్రేరియన్.

    “శంకర్ గారా! ఆయన ఆ పత్రిక సబ్ ఎడిటరా!!” అని నా వేపు చూస్తుండగా నేనే లేచి వాళ్ళ  దగ్గరకు వెళ్ళాను.

    “నమస్తే సార్!” అంటూ నాకు నమస్కరిస్తూ కవరును అందించాడు పెద్దాయన.

    “పెద్దలు! మీకే నేను నమస్కరించాలి. పోతే… మీతో ఒక్కమాట చెప్పాలి. సార్! మీలో మంచి కథకుడు వున్నాడు. ఆ కథకుణ్ణి ఇన్నాళ్ళు ఈ పత్రికా ప్రపంచం గుర్తించలేదు. మా పత్రిక  గుర్తించింది. కరుణరసంతో పాఠకుల మనసులను ఇట్టే దోచుకొనే విధంగా వున్న మీ కథను ఎన్నుకొని మొదటి బహుమతిని ప్రకటించింది. ఇదే మీకు తొలిమెట్టు. ఇకపై కూడా సమాజాన్ని చైతన్యపరచే అలాంటి అర్థవంతమైన మంచి కథావస్తువుతో కథలను రాసి పాఠకులకు అందించాలని కోరుకొంటున్నాను. నమస్తే!” అంటూ పెద్దాయన్ను అభినందించాను నేను.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here