గతించని గతం-6

0
3

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]ని[/dropcap]ద్రరాలేదు. దొరికిన మాగజైన్ తిరగేస్తూ కూర్చున్నాను. ఒకమ్మాయి నా బెడ్ దగ్గరకు వచ్చి వెనకనుండి నన్ను నెమ్మదిగా తట్టి “రాజేంద్ర ఉన్నాడా?” అని అడిగింది. ఒకవేళ ఆవిడ పిలిచినా నాకు వినిపించలేదేమో? ఆవిడ గొంతు మాత్రం చాలా ఇంపుగా అనిపించింది.

వెనక్కు తిరిగాను. మనిషి పరవాలేదు. మెరుపుతీగ మాత్రం కాదు. హోమ్లీగా, గౌరవనీయంగా అనిపించింది. మాటతీరు చూత్రం ముచ్చటేసింది. తెల్లటి చీర అదే జాకెట్, చేతికి వాచీ.. కూర్చో అని చెప్పాను.

“పరవాలేదు” అని కూర్చుని “రాజేంద్ర లేడా?” అని మళ్ళీ అడిగింది. టూర్‌లో ఉన్నాడని అన్నాను.

“మీకు తెలిస్తే ఎప్పుడొస్తారో చెప్పగలరా?” అంది.

“తెలియదు నేను అడగలేదు. వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు” అన్నాను.

“నన్ను రమ్మన్నాడే” అంది.

“ఆడపిల్లవు ఇలా రాత్రి రాకూడడు. నాకంత బాగనిపించలేదు. నీకు పని ఉన్నా – అతను లేదు కదా” అన్నాను. నిస్సహాయంగా చూసింది. మాట్లాడలేదు.

‘ఈ వెధవ ఏమని చెప్పి రమ్మన్నాడో?’ అనుకోని… “నాతో చెప్పే విషయమేనా? అతను ఎప్పుడొస్తే అప్పుడు చెపుతాను. వివరాలు చెప్పి వెళ్ళండి” అని అన్నాను.

మొదటి తటపటాయిచ్చినట్టు కనిపించింది, నెమ్మదిగా లేచి నిల్చుని నావైపు తిరిగి “నా పేరు జయమాల. ఐదు వందలు కావలసి అడిగితే ఇస్తానన్నాడు. అతని ఆఫీస్‌లో పనిచేస్తున్నాను. రేపు పొద్దుట ఆసుపత్రిలో నేను కట్టాలి” అని అన్నది నెమ్మదిగా.

“అర్జంట్ అన్న మాట” అన్నాను ఆవిడనే చూస్తూ తల ఊపింది.

“నా దగ్గర ఉన్నవి ఇవ్వనా?” అడిగాను.

చిత్రంగా చూసి ‘మీ ఇష్టం’ అన్నట్టు మొహం పెట్టింది.

మొదట కొంచెం అనుమానంగా చూసి ఆనక తీసుకుంది. థాంక్స్ చెప్పి కృతజ్ఞతగా చూస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ తరువాత అది నేను మరిచిపోయాను, రాజేంద్ర వచ్చాక కూడా….

రోజు స్కూల్‌కి, స్టూడియోకి వెళుతూనే ఉన్నాను. నిద్ర చాలడం లేదు. బ్రతుకు ఉరుకులు పరుగులుగా మారింది. నేను అర్ధరాత్రి లాడ్జ్‌కి చేరేసరికి నెల తరువాత రాజేంద్ర ఉన్నాడు.

బయటనుంచి అప్పుడే వచ్చినట్టున్నాడు, విష్ చేసాడు. అప్పుడు గుర్తొచ్చి జయమాల విషయం చెప్పాను.

“జయమాల ఎవరు?” అన్నాడు నడిమంచాన కూర్చొని. జరిగింది చెప్పాను.

“మా ఆఫీస్‌లో జయమాల అనే ఆవిడే లేదు. ఆ పేరు గల పరిచితురాలు లేదు. అలా ఉన్నా నేను పైసలు ఇస్తా రమ్మని ఎవరికీ చెప్పలేదు” అని ఎగతాళిగా చూస్తూ… “ఎవరో నీ చెవిలో పువ్వు పెట్టి వెళ్ళిందన్న మాట” అని పెద్దగా నవ్వాడు.

రాత్రప్పుడు వచ్చి అంత ధైర్యంగా నన్ను వెధవని చేసిందా? హౌ డేర్ షీ? ఒక్కసారి నాకు కనిపిస్తే బాగుండు. నాకు చిత్రంగాను అనిపించింది. నన్ను మోసపోయిన పిచ్చివానిలా చూస్తూ మిత్రుడు నిద్రపోయాడు.

కానీ… నాకు మాత్రం రాజేంద్రే అబద్ధం చెబుతున్నాడేమో అనిపించింది, అతడి తీరు తెలుసు కనుక. అతనికున్న ఆడపిచ్చి ఎలాంటి కమిట్‌మెంట్స్ నయినా చేయించగలదు.

కొంచెం జాలిపడేవాళ్ళుగా అనిపిస్తే ఇలా మోసగించేవారు చాలామందే ఉన్నారని తరువాతే తెలిసింది. నా మనస్సుని అనుమానం వదల్లేదు.

అసలావిడ ఎవరు? లోగడ చూడలేదు. పరిచయమూ లేదు. కనీసం ఆ పేరు తెలియదు.

రాజేంద్ర పనే ఇది అనుకున్నాను. బొంబాయి మొత్తం గాలించయినా ఆవిడను కలుసుకోవాలని, విషయం తెలుసుకోవాలని అనిపించింది. కానీ నా తీరుబాటు వెనులుబాటు రెండూ లేవు.

మరో నెల గడిచింది. నిద్ర చాలక చికాకు అసహనం ప్రారంభం అయ్యింది. సుజాత స్టూడియోకి వచ్చి చూస్తానంటే ఒకనాడు తీసుకు వెళ్లాను. రాత్రి పదింటి దాకా స్టూడియో కలియ తిరిగి ఎంజాయ్ చేసి మరీ వెళ్ళిపోయింది.

ఆ మరునాడు స్కూల్‌కి సెలవు ఉంది. అది గమనాన ఉండి ఆలస్యంగా లేచాను. లేవగానే సుజాత వస్తూ కనిపించింది. ఇప్పుడే వస్తానని పేపర్ ఆవిడ ముందేసి బాత్రూంలోకి చొరబడ్డాను. బట్టలేసుకున్నాక “ఇవ్వాళ సెలవే కదా, ‘ఫిషరీ లాండ్’ చూసి వద్దామా? అంది. తలూపాను.

ఇద్దరం బయలుదేరి బస్ ఎక్కాము.

“స్టూడియో పని మానేయరాదు” అంది సుజాత.

“నాకు కెమెరా పని నేర్చుకోవాలనుంది” అన్నాను.

“బయట నేర్పేందుకు చాలా సంస్థలున్నాయి, నేర్చుకున్నాక సర్టిఫికెట్ ఇస్తారు, అది చేత వుంటే స్టూడియోలో కొద్దో గొప్పో గౌరవం ఉంటుది కాదా?” అంది.

వినీ విననట్టుగా ఉండిపోయాను. బస్ దిగాము, టికెట్లు కొని ‘ఫిషరీ లాండ్’ లోకి దూరాము.

ఒక్కసారిగా వింత ప్రపంచం లోనికి వచ్చినట్టుగా అనిపించింది. రంగు రంగుల చిన్నా పెద్ద చేపలు, వివిధ రకాల వింత ఆకారాలతో, చిత్రంగా కదులుతూ తిరుగాడుతూ, ఆహ్లాదంగా కనిపించింది. గ్లాస్ కేస్ లన్నింటిని వదలక శ్రద్ధగా చూసాము. అక్కడ నుంచి బయటపడి దాపున కనిపించిన భేల్‌పూరి తిని గేట్ వే ఆఫ్ ఇండియా దాకా నడిచాము. అక్కడ ఒక గంట సరదాగా కాలక్షేపం చేసి బస్ ఎక్కాము.

దిగి సుజాత ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఒక గంట నిద్రపోయి స్టూడియోకి వెళ్లాను. రాము నన్ను ఆ రోజు నాలుగవ ఫ్లోర్‌కి తీసుకెళ్ళాడు. ఓ డాన్స్ చిత్రీకరిస్తున్నారక్కడ.

నెగిటివ్ ఫిలింని కెమెరా లోనికి లోడ్ చేయడం, లైట్ పడకుండా వెలికి తీయడం చూపాడనాడు. షాట్స్ తీస్తున్నంత సేపు పూర్తి సహాయకుడిగా ఉంచుకున్నాడు. కెమెరా ఫిక్స్ చేయడం, లాంగ్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ అప్‌లు, తీస్తుంటే శ్రద్ధగా గమనిస్తూ పోయాను. ఆవేళ డాన్స్ చేస్తుంది బాగా పేరున్న తార. సెట్ లోనే డాన్స్ డైరెక్టరు తన పని చేసి చూపుతున్నాడు. సంగీతపరంగా భంగిమలను ఎలా ఎంత దూరం నుంచి టైం సెన్స్‌తో చూపితే, ఆవిడ చేసి చూపుతుంది. అనుభవమున్న తార కదా. ఆవేళ షూటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి మూడయింది, నేను లాడ్జ్‌కి చేరి తీరుబాటుగా కాలకృత్యాలు తీర్చుకునేసరికి సూర్యోదయం వేళ అయ్యింది. కళ్ళు ఎర్రగా బొబ్బల్లాగా అయ్యాయి. మండుతున్నవి. ఒళ్ళంతా తీపులు. జ్వరం తగిలినట్టుగా అనిపించింది. అట్టాగే ఎనిమిది గంటల దాకా కూర్చున్నాను. పోస్ట్‌మాన్ వచ్చి నాకో ఉత్తరం ఉందని ముందు పడేసి వెళ్ళిపోయాడు.

చింపాను. అక్షరాలు కుదురుగా అందంగా కనిపించినవి. డాక్టర్ గారి రాత కాదది. ఆడపిల్ల రాతలా అనిపించింది.

శివ గారికి అని ఉంది. ఈ గారేమిటి? ఎవరు అనుకున్నాను. మనస్సు లోకి ఎవరూ రాలేదు.

మిమ్మల్ని ఎలా సంబోధించాలో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే నేనెవరో మీకు తెలియదు కదా. మరి ఈ ఉత్తరము ఎందుకనిపించింది? యాదృచ్ఛికంగా మీ పేరు వినడం తప్ప నాకు బొత్తిగా తెలియదు. ఒక్కసారి మాత్రమే నేనుగా మీ లాడ్జ్‌కి వచ్చాను. ‘రాజేంద్ర గారు ఉన్నారా?’ అంటూ వచ్చి ఆయన పైకం ఇస్తానంటేనే అక్కడకు వచ్చానని అబద్దం చెప్పి నాపై జాలి కల్గేలా నే చెప్పిన కథను నమ్మి మీరిచ్చిన డబ్బు తీసుకు వెళ్లాను. ఇప్పుడు నేనెవరో గుర్తులోకొచ్చి ఉంటాను. జయమాల అని పేరు కూడా చెప్పిన్న గుర్తు. ఆ అమ్మాయినే ఇప్పుడు మీకు ఉత్తరం రాస్తున్నాను.

ఉత్తరం చదవడం ఆపాను. చీట్ చేయడమే కాక ఉత్తరం. గుండెలు తీసిన బంటులా ఉంది. ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ ఉత్తరం లోకి తలదూర్చాను. అక్షరాలూ నడుస్తున్నవి…..

నేను మోసగించానని రాజేంద్ర అనేవాడు రాగానే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఆడపిల్లకు ఇంత దైర్యమా? ఏం కాలమిది? అని అసహనంగా అనుకుని ఉంటారు. కోపం రావడమూ సహజమే.

ఇక నేను నిజం చెపుతున్నాను. ఇల్లాంటివి నేను అనేకం చేసాను. చాలా చోట్ల నేనూ మోసపోయాను. ఏదేమయినా నా ప్రయాణంలో మిమ్మల్ని మాత్రమే మన్నించమని అడగాలనిపించింది. నిజం. పైగా అదేం చిత్రమో కానీ….. మీ ధ్యాస నన్ను పూర్తిగా వదలడం లేదు.

అమ్మో ఇంకా ఎం టెండర్ పెడుతుందో అని బయపడకండి.

నాకు మొదటిసారిగా నన్ను గురించి మరొకరికి చెప్పుకోవాలనిపించింది. కారణం తెలియదు. కానీ మీతో చెప్పుకుంటే ఆ బరువు తీరిపోతుందేమో అనిపించింది. మీరు నన్ను నమ్మరు. ఆ విషయం నాకు తెలుసు, అయినా నాకు కలిగిన అభిప్రాయాన్ని నేను మీకు చెపుతున్నాను. మీరు ఇప్పటికి అంటే ఈ ఉత్తరం మీకు చేరేప్పటికి బహుశా నన్ను పూర్తిగా మరిచిపోయే ఉంటారు. మీరు నమ్మాలి. మనసు విప్పి చెప్పుకుంటున్నాను. ఇదీ మోసమే అని అనుకోవద్దు. నేను చేస్తున్న తప్పులను మీరు కాయగలరని కాదు. నాకో తెలియని విశ్వాసం.

నాకిక్కడ కొందరు స్నేహితులున్నారు. వారు పూర్తిగా నా వృత్తికి సంబందించిన వారు. ఇదో వృత్తా? అని ఆశ్చర్యం అనిపించింది.

మేము నిత్యం చేస్తున్నది.. కొత్తగా ఇక్కడికి వచ్చే వారిని ఏదో రకంగా, మోసగించి బ్రతకడం. మొట్టమొదట నన్ను ఈ వృత్తిలోకి దింపింది మా వాళ్ళే. ఆ తరువాత నాకు తప్పలేదు. నాకు జరిగిన నష్టానికి ఏడ్చి కలిగిన బాధతో కటువుగా ప్రవర్తించడంతో నాకు నావాళ్ళన్న వారెవరు మిగలలేదు. నేను ఏకాకిని. వేరుగా బ్రతుకుతెరువు లేని దానిని. నేను అనాథనని కానీ, ఒంటరి దాన్నని కానీ, భయస్తురాలని కానీ ఈ సమాజానికి అర్థమయితే నా బ్రతుకెప్పుడో ఆగమయి పోయేది, చాలా నికచ్చిగా వల విసిరి సర్వనాశనం చేసేవాళ్ళు.

కనుక ఎవరికీ అర్థం కాని విధంగా గుట్టుగా ఇలాంటి మోసాలు చేసి గడుపుకొస్తున్నాను, ఒక్కోసారి పోలీసులు వలపట్టుకుని రెడీగా ఉంటారు. అయితే నా మాట తీరు, సంస్కారిలా మెలిగే రీతి, నా చదువు, భగవంతుడు నాకిచ్చిన ఆకర్షణ నన్ను రక్షిస్తున్నాయి. అనుమానం రాకుండా చేస్తున్నాయి. అంచేతే నాపైన నాకు అంతులేని నమ్మకం, ఈ మధ్య మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. ‘ఇదేదో ప్రేమా గీమా లాంటిది అనుకునేరు, బొత్తిగా కాదు, It is only affection, affection is not love, మరేమిటిది? తెలియదు. కానీ మిమ్ముల్ని దూరం నుంచి చూసాను ఆ తరువాత కూడా. ఓ ఆత్మీయుడిలా నా తలపుల్లోకి రావడం మాత్రం మానలేదు. ఆ గుర్తు వదలడం లేదు. మనకు ఒక్కోసారి అపరిచితుడు కూడా ఆత్మీయుడిలా అనిపిస్తారు. ఒక్కోసారి విరోధిలా, ఎందుకు? అనేది తలబాదుకున్నా అర్ధం కాదు. ఏదేమయినా…. మీతో ఒకసారి కలిసి మాట్లాడాలని మాత్రం ఉంది. కానీ ఎలా? నేనెలా చెప్పుకున్నా మీరెలా రియాక్ట్ అవుతారనేది నాకు తెలియదు కదా!

స్వార్థం ఎంత ఉన్నా….. చంద్రున్ని ఎప్పుడూ వెన్నెల ఇవ్వమని అడగలేము కదా!

మా ఇంటి ఎదురుగా ఉండే పసిపాప పేరు నర్మద, నాకేమీ కాదు. అదేమో కానీ పాప కనిపిస్తే చాలు అన్నీ మరిచిపోతాను. తెలియని ఆనందం, బంగారు కొండ దొరికినట్టు. దాన్ని ఎత్తుకోవాలని, ఆడుకుంటూ ముద్దాడాలని, అది పరిగెడుతుంటే దానివెనక అంబాడాలని, గిలిగింతలు పెట్టి కేరింతలు పెట్టాలని… అనిపిస్తుంది, ఎందుకలా అనిపిస్తుందో అర్థం కాదు. అదంతే!

అందాన్ని అనుభవించడం కంటే అనుభూతిగా మార్చుకుని ఆస్వాదించడంలో, ఊహలో బతకడంలో, వాటిని మనసు నిండా పదిలపరుచుకోవడంలో, భద్రంగా దాచుకుని నెమరేసుకోవడంలో… దొరికే మజా గొప్పది. ఆ లోతు తెలిసినప్పుడే అర్థమవుతది. ఏదో భ్రమ పడతాం కానీ ఒక్క సారి మనస్సుపెట్టి ఆలోచించు. అనుభవమెంత క్షణికం అయినదో తెలుస్తుంది. మనస్సు పరపంచుకొని, అదుపును అధిగమించి ఊహల ఊయల లోకి పరుగెత్తినప్పుడు….

ఈ సృష్టి వెనక అందని అనూహ్యమయిన అందం ఇంద్రదనస్సులా మరేదోలా ఉందని ఆ రహస్యం అభేద్యంలా అనిపిస్తుంది. దాన్ని వెతికి పట్టుకునేందుకు మనస్సు ఆరాటపడుతుంది, అందుకే అందమయిన గడ్డిపూలను ఏ భావనా లేక తొక్కుకుంటూ నడిచే మనుషులను చూస్తే జాలనిపిస్తుంది. పూలను పక్కలపై చల్లుకుని స్థూల శరీరాలని వాటిపై గానుగలా తిప్పడం తద్వారా ఆనందం పొందడం… అదే ఆసలయిన ఆనందంగా భావించడం…. ఛా అనిపిస్తుంది. మనస్సుకు గాయమవుతుంది. ఎంచేతనంటే ఒకసారి పసిదాని బోసి నవ్వుల గమనించు, శిల్పి ప్రాణప్రదంగా మలిచిన శిల్పాన్ని చూడు, రెండు కొండల మద్య చెట్ల గీబువ అడవి అంచుని గుట్టుగా కాపురం చేసుకుంటున్న గోరింకల జంటను చూడు, ఇంతెందుకు నా గదిన సాలీడు అల్లిన గూడు మనిషి నిర్మించిన ఎన్ని తాజ్‌మహళ్లకు సమానమవుతుంది. అనంతానంతమయిన అందాల్ని ఎక్కడని ఎలా వెతకగల, మనిషి మనిషే అయిన మనీషిగా మారినా ఎంత ఎదిగినా, అతనికి అందనిదేదో ఉందని అదేమిటో అర్థం కాదని అర్థమయినట్టుగా అనిపిస్తుంటుందని…

ఇంట్లో ఒక నాడు ఇల్లు బాగాలేదని బూజు దులిపాను. దులిపాక అంతా చూసుకుని పరిశుభ్రంగా ఉందనుకున్నాను. అయితే ఆ మరునాటి నుంచే సాలీడు తన పని తను ప్రారంభించినట్లు అర్థమయ్యింది.

నిరంతర శ్రమే వాటి ధ్యేయం.

చీమా అంతే! దాని జీవన క్రమాన కృషి లేని నిముషం మనకు కనిపించదు. బ్రతుకు, భవిత నిస్తేజం కారాదని, జీవి బ్రతకడంతో పాటు బ్రతుకేందుకు చేసే కృషి విధి నిర్వహణేననీ.

‘ఆశ’ ఈ క్రతువును నిర్వహించడంలో వెన్ను తట్టి తోడ్పడే వెలుగు దివ్వె.

చీకటీ వెలుగు చాలా సహజం. ఒక్కోసారి ప్రళయ గర్జన చేసి భయపెట్టే ఆకాశం ఆనక అతి ప్రశాంతంగా ఉండి ఎంత ఆహ్లాదాన్నో కలిగిస్తుంది.. నిజానికి ఇవన్నీ మనందరికీ తెలిసినవే కనిపించేవే. కానీ, అసలిటు చూసేందుకు వీలు దొరక్క పరిగెట్టే మనిషిని, తెలిసి నిర్లిప్తంగా ఉండే మనిషిని, తెలియకపోయినా తెలిసినట్టు నటించే మనిషిని, ఏదో అందుకోవాలని పరిగెత్తి ఆశాభంగం పొందిన వాడిని…. మనం చూస్తూ కూడా ఏమనగలం. ప్రశ్నలు మిగలడం… అవి అనంతంగా అనిపించడం, వీటికి ప్రపంచాన ఏమి సమాధానం దొరుకుతుంది. ఇంతలో ఏదో కొసమెరుపు. ఆ మెరుపుకోసం తిరిగి జీవన సమరం-క్రమం.

ఇలాంటి ఆలోచనలు పెరిగి పెరిగి నాకు నేను అర్థం కాకుండా పోయాను.

చెట్టుకు పూలు, కాయలు, ఆకులు, ఎంత సహజమో… ఆకులని రాల్చడం, పూతపూయడం,కాయలవ్వడం, అలా జీవన స్రవంతికి అందిస్తూనే కూలిపోవడం కూడా అంత సహజమే. ఈ లోపు ఆగక జరిగే నిరంతర ఘర్షణ చీకటినుంచి వెలుగుకు చేరుకునే నిర్వేదపు నిర్విరామ యత్నం. వెలుగు కనిపిస్తున్నా చీకటి భయం వదలకపోవడం, ఆ నీలి ఛాయ అంత త్వరగా చెరిగిపోదు. మనషి జీవితం స్కృతి పేటిక లాంటిది. సరస శృంగార కరుణ విషాద, భీభత్స రసాలు…. ఆ తంత్రి పైనే పలుకుతవి. దాన్ని వాడుకునే కళాకారులను బట్టి.

ఈ మధ్యన ఇక్కడే రచయితల సమావేశం ఒకటి జరిగింది. వెళ్లాను, చదవరిని కనుక. వారిని చూసాను. శ్రద్దగా విన్నాను. కొందరు రచయితలతో మాట్లాడాను. నాకు మాత్రం అది చింపాంజీల సభగా అనిపించింది. చింపాంజీ అనే ఎందుకు అనాల్సి వచ్చిందంటే నాలుగు కాళ్ళ జంతువునుంచి మారిన ఈ జీవి చివరి దశ. కరెక్ట్‌గా ఆ దశను అంటిపెట్టుకొనే ఉంది. మనిషిగా ఎదగలేదు. ఇంకా మనస్సు పెట్టి ఆలోచిస్తే నాకు వాటితో పోల్చడమూ సరికాదనిపించింది.

వాటికవి పర్ఫెక్ట్. మరునాడు పేపర్‌లో కూడా ఆ సభల గూర్చి చదివాను. స్వోత్కర్షతో కూడిన మాగుడు కంపు కనిపించింది. మనదేశపు రచయితలు మాత్రం ప్రస్తుతం అనేక రకాలుగా అనుసరించడం తోనే సరిపెట్టుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న మనిషి, అతని జీవనం, ఆలోచనలు కనిపించటం లేదు. అంతా కలలు అలలు.

వీటికి తోడు అయోమయపు అసంబద్ధపు ప్రతిపాదనలు. అవి సమాజాన్ని ఎలా మారుస్తాయో? అనే ఆలోచన మృగ్యం.

శివ గారు….. అనవసరంగా ఉత్తరం రాసి అంతకన్నా అనవసరపు విషయాలను గూర్చి మాట్లాడాను. కోపగించుకోవద్దు. నే చేసింది తప్పే. దాచుకునే తప్పు కాదు. నా పరిస్థితి మనసు విప్పి మీతో చెపుతాను. అంచేత మీతో మాట్లాడాలన్నది నా కోరిక. నాలోని పశ్చాతాపం మీరు గుర్తిస్తే సంతోషం. ఉంటాను. సెలవు.

ఉత్తరం చదవడం అయిపోయింది. ఇది విపరీతపు వ్యవహారంలా అనిపిచింది. జరిగింది పొరపాటని ఒప్పుకుంది.

పైసలు పోయినా చిత్రమయిన మనిషితో పరిచయం అయినందుకు అంతగా బాధ అనిపించలేదు. కవరు విప్పి పోస్టల్ ముద్రను చూసాను. బోరివలి పోస్టల్ ముద్ర కనిపించింది. ఇది బొంబాయి లోదే, కాకుంటే ఇదో చివర. నిజంగానే జయమాల ఒకసారి కనిపిస్తే బాగు అని మనస్సులో అనిపించింది. ఉత్తరాన్ని తలగడ కింద దాచి కిందకి దిగాను. సుజాత కోసం చూడకుండా బడికి చేరుకున్నాను. విరామమప్పుడు సుజాత రాలేదని తెలిసింది. ఆ వెంటనే జయమాల ఉత్తరం గుర్తులో కచ్చింది. మంచి భావన మనసున ఉన్నా చివరంటా ఈ సమాజాన అదే మిగలాలని లేదు. జయమాల పై సానుభూతి కలిగింది. ఆవిడకున్న లోకావలోకనం నచ్చింది.

క్లాస్‌లు మొదలయినాయి. స్కూల్ వదిలేప్పుడు ప్రిన్స్‌పాల్ గారు అందరికి కబురు చేసి వార్షికోత్సవం గురించి వివరించారు. గంగిరెద్దులా తల ఊపి లాడ్జ్‌కి చేరుకున్నాను. సుజాతను పలకరించి వస్తే అనిపిచింది. వెళ్లి వద్దామనుకుని రావు గారి ఇంటికి నడిచాను. ఏవేవో ఆలోచనలు తలన ముసురుతుండటంతో సరాసరి ఇంట్లో వెళ్ళాను. హాల్లో ఎవరూ కనిపించలేదు. పిలుద్దామనుకుని లేచాను. సుజాత గది తలుపు దగ్గరకు వెళ్లి నెమ్మదిగా జరిపాను. పక్కగా ఉన్న బాత్రూం తలుపు అప్పుడే తెరుచుకుంది. సుజాత స్నానం ముగించి బయటకు వస్తూ కనిపించింది. ఆవిడ శరీరం పై అరకొరగా టర్కీ టవల్ మాత్రం ఉంది. నన్ను గమనించలేదు. నాలుగడుగులు వేసాక నేను కనిపించాను. అసలే కురచగా ఉన్న టర్కీ టవల్ తో శరీరాన్ని పూర్తిగా దాచుకునే ప్రయత్నాన పడింది. ఆ ప్రయత్నాన చంకల లోని పట్టు జారి పాదాల కింద పడింది. నేనట్లాగే చూస్తూనే ఓ క్షణం ఉండిపోయాను. అజంతా శిల్పంలా అనిపించింది. అటునుంచి దృష్టి మరల్చుకునే ప్రయత్నం చేస్తాను కానీ విఫలమయ్యాను. శరీరం వేడెక్కింది. నాలోని కానరాని మృగం నన్ను అధిగమించింది. సిగ్గుతో సతమతమయ్యి గదిలోనికి పరిగెత్తబోతున్న సుజాత వైపు అడుగులు కదిపాను. నేనలా ఎందుకు చేస్తున్నానో నాకే తెలియని స్థితి. సుజాత అకస్మాత్తుగా గదిలోకి కదిలి తలుపులు బిగించుకుంది. అప్పటికి నేను చేసిన పని నాకే అసహ్యంగా అనిపించింది. పరిగెత్తుతున్నట్టుగా బయటపడ్డాను. కనీసం వెనక్కి తిరిగి చూడాలని అనిపించలేదు. ఎప్పుడూ ఎక్కే లాడ్జి మెట్లే అయినా చాలా ఉన్నట్టు అనిపించినాయి. నా బెడ్ దగ్గరకు వచ్చి బోర్లాపడ్డాను. దుఃఖం ముంచుకుని వచ్చింది.

అసలు రేపు సుజాతను ఎలా చూడాలి. ఆ వెంటనే అక్కడ అర క్షణం ఉండాలనిపించలేదు. లేచాను. కౌంటర్ దగ్గరకు వచ్చి మంచం ఖాళీ చేసాను. వచ్చి సామాను సర్దుకుని మెట్లు దిగాను. టాక్సీని పిలిచి సామాను దాంట్లో వేసి కూర్చున్నాను.

“ఎక్కడికి?” అన్నాడు డ్రైవర్.

“బోరివలి” అన్నాను అనుకోకుండా. అలా ఎందుకన్నానో ఇప్పటికీ అర్థం కాలేదు. టాక్సీ బోరివలి సెంటర్‌న ఆగింది. ఏదయినా పరవాలేదనుకునే లాడ్జ్ చూపమన్నాను. చూపించాడు. అదంత బాగా అనిపించలేదు. అయినా సామాను దింపుకొని టాక్సీని పంపాను. లాడ్జ్ అతను పదకొండవ నెంబర్ గది ఇచ్చాడు. సామాను తెచ్చుకుని మంచంపై అడ్డంపడ్డాను. నిద్ర పట్టింది. మనస్సంతా చిందర వందరగా ఉంది. కలత నిద్ర.

తెల్లవారి తొమ్మిది గంటలకు గానీ మెలకువ రాలేదు. లేచి చూస్తే అంతా కొత్త వాతావరణం. పైగా ఇరుకుగా అనిపించింది. గది బయటకు వచ్చి చుట్టూరా పార చూసాను. కింద వరసన పది పన్నెండు దాకా గదులు కనిపించినవి. వాటిలో కుటుంబాలున్న జాడ మాత్రం అంతగా కనిపించలేదు. కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగేందుకు కిందికి వచ్చాను. కాంపౌండ్ దాటగానే నాలుగైదు టీ బంకులు కనిపించినవి. కాఫీ తాగి పాన్ దుకాణం కోసం చూసాను. అదీ కనిపించింది. దగ్గరకు వెళ్లాను. రెండు మూడు సంవత్సరాల పాప కొట్లో కూర్చుని కనిపించింది. తెల్లటి శరీరం, ఎరుపు గౌను, రెండు పిలక జడలు చేసుకుని చక్రాల్లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ ముద్దులొలుకుతున్నది.

“పాన్ హోనా” అన్నాను. నా పాన్‍లో ఏమేమి వేయాలో చూపుతూ.

“బాబా నహీనా” అంది నత్తి నత్తిగా. ఇంకా ముద్దొచ్చింది.

“తూ బనా సక్తీ” అన్నాను దగ్గరకు జరిగి.

“నై” అంది రెండు చేతులు అడ్డంగా ఊపుతూ.

“బాబా కిదర్ గయా? పచారీ దూకాన్ పే?”

“అభీ ఆయేగానా?”

“హాఁ” అంది చేతులతో కూడా చూపుతూ.

“బిటియా తుమ్రీ నామ్ నయీ బోలా” అన్నాను.

“మంజు” అని నవ్వింది.

“బహుత్ అచ్ఛా నామ్ హై” అంటుండగా మంజు వాళ్ళ బాబా చేతి సంచితో వచ్చాడు.

వస్తూనే “క్యా హోనా బాబూజీ” అని అడిగాడు వినయంగా.

“రాజరతాన్ కత్తామే బనావ్” అన్నాను.

చక చకా కట్టిచ్చాడు. బాగా పాన్ కట్టే అలవాటున్న చేయిలాగానే అనిపించింది. అడిగిన పైసలిచ్చి వెనకకు మళ్ళాను. మంజు బాబా పక్కనే కూర్చుని నన్ను గమనిస్తున్నది.

“మంజు బిటియా ఫిర్ మిలేంగే” అని చేయి ఊపుతూ నడిచాను. పాప కూడా చేయి చూపింది.

ఆ సాయంత్రం స్టూడియోకి వెళ్లాను. సుజాత సంగతి, తను ప్రవర్తించిన తీరూ మనసును చాలా చికాకు పెట్టింది. అంత స్నేహశీలిని ఎలాంటి స్థితినయినా అలా అదుపుతప్పడం మనిషితనంగా అనిపించలేదు.

“నిన్న రాలేదు?” అడిగాడు దూభే.

“రాలేక పోయాను సర్.”

“జీతం ఏర్పాటు చేశానయ్యా. మేనేజ్‍మెంట్ ఒప్పుకుంది. ఏదయినా పని ఉండి రాదలుచుకోకపోతే చెప్పి వెళ్ళడం అలవాటు చేసుకో. ఛార్టున నీ పేరు ఎక్కింది. సంతకం చేసే పని లోకి వెళ్ళడం అలవాటు చేసుకో.”

తల ఊపాను.

స్టూడియో స్టాఫ్. కెమెరా వద్ద అసిస్టెంట్ నన్న మాట. తొమ్మిది వందలు జీతం.

రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నంతసేపు తిండీ తిప్పలు అన్ని స్టూడియోవే. ఇరవై రూపాయలు బత్తా ఇస్తారు. ఈ జీతం రాళ్ళ కోసం స్టూడియోకి తప్పక వెళ్ళాల్సి వచ్చేది. రోజులు గడవడంతో సుజాత ధ్యాస కొద్దిగా తగ్గింది. గుర్తులోనికి వచ్చినప్పుడల్లా బాధ మెలిపెడుతూనే ఉంది. పాప మంజుతో బాగా చనువయింది. అప్పుడప్పుడు నా గదికి కూడా వచ్చేది. కిందికి దిగినదాకా నాతోనే కాలక్షేపం చేసేది. స్టూడియోకి వెళ్ళని సమయమంతా ఖాళీయే కదా, స్కూల్‌కి వెళ్ళడం మానేసాను, మరో పని కోసం తిరగడం లేదు. ఇవ్వాళ రేపు పిలిచి ఉద్యోగం ఇచ్చేవారు ఎవరు? ఒకనాడు నేను మంజుతో బంతి ఆట ఆడుతుండగా నా విద్యార్థి ఒకడు అనుమానంగా చూస్తూ నా దగ్గరకు వచ్చి విష్ చేసి వెళ్లిపోయాడు.

నా మాట స్కూల్‌లో తెలిసి ఆనక ఇక్కడికెవరైనా వస్తారా? నా భ్రమ కానీ ఎందుకొస్తారు. సుజాత రాదలిస్తే స్టూడియోకి రాగలదు కదా! పైగా నేనుండే టైం కూడా తెలుసు. ఇలా సతమతమవుతున్న తరుణంలో మరో పిల్లవాడు కనిపించాడు, ఈ ఏరియా వాడట్టుంది. నేను అతన్ని పిలిచి పలుకరించాను,

“సివిక్స్ చెప్పేందుకు మీరు వెళ్ళాక మంచి టీచర్ దొరకలేదు సర్” అన్నాడు.

నాక్కొంచెం గర్వoగా అనిపించింది. ఆ మాటా ఈ మాట మాట్లాడక సుజాత టీచర్ వస్తున్నది రానిది అడిగాను. రావడం లేదని చెప్పాడు. స్కూల్ ఫంక్షన్ బాగా జరిగిందని, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారని చెప్పాడు.

మంజు పాన్ షాప్ పక్కనే అదే బజార్‌న పాండు అనే అతనున్నాడు. వానిది హైదరాబాద్, నేను స్టూడియోకి వెళ్ళే సమయం అతను ఇంటికి వచ్చే టైం ఒకటే. అంచేత ఎక్కువ సార్లు ఎదురుపడే వాళ్ళం. మాట్లాడుకుంది లేదు. ఏదో టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్నాడట.

ఒకనాడు ఎదురయినప్పుడు ఆగి “నాకు స్టూడియో చూపించండి సర్” అని అడిగాడు. సరే అని తలూపాను.

ఆ మరునాడు రెండింటికి స్టూడియో నుంచి తిరిగి వస్తుంటే పాన్ డబ్బా పక్కన కూర్చుని బీడీ కాలుస్తూ కనిపించాడు.

ఆగి అడిగాను “ఈ వేళప్పుడు ఇక్కడేమిటని?”

“మీ కోసమే” అన్నాడు.

“ఏమిటి” అన్నాను ఆశ్చర్యపోతూ.

“నిద్ర రాక మాత్రం కూర్చోలేదు సర్” అన్నాడు. “మా ఊరిలో మా బాబాయి గుండెపోటుతో చనిపోయాడు సర్” అని కళ్ళు తుడుచుకున్నాడు. అతని మరణం పాండును బాగా కదిలించినట్టుంది. ఒక వంద రూపాయలు అప్పడిగాడు. ఇచ్చాను. ఎవరి దోవన వాళ్ళం వెళ్ళిపోయాము.

తెల్లవారి పదిగంటలకు గానీ నాకు మెలకువ రాలేదు. స్నానపానాదులు ముగించుకుని కిందికి వచ్చాను. ఎందుకో అకస్మాత్తుగా జయమాల గుర్తులోనికి వచ్చింది.

మాట తీరు, ఆ రూపం మనస్సునే నిండి అలా ఓ క్షణం నిలబడేట్టు చేసింది. వాస్తవానికి ఆ ఒక్కసారి తప్ప మళ్ళీ నాకు కనిపించలేదు.

కాఫీ తాగేందుకు టీ బంకు దగ్గరకు వెళ్ళినా తలని ఆలోచనలు వదల్లేదు.

మరో ఆరునెలల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఆవేళ పగలు డ్యూటీ పడితే స్టూడియోకి వెళ్లాను. నేను ఫ్లోర్‌లో కెమెరామెన్‌తో ఉండగానే సుజాత అక్కడ కనిపించింది. నా మనస్సున జంకు మొదలయ్యింది. నిలుచున్న చోటునుండి కదలలేకపోయాను. ఆమె వైపు సూటిగా చూడలేకపోయాను. ఆమెతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చినట్టుంది. వారితో మాట్లాడుతూ.. నన్ను చూసింది. కానీ గమనించనట్టుగానే ఉంది. నాకేమి అర్థం కాలేదు. అసలావిడ సుజాతేనా అనిపించింది. కానీ ఆవిడ సుజాత. బ్రతుకు జీవుడా అనుకున్నాను. ఆవిడ స్టూడియో నుంచి బయటకు వెళ్ళాక నా మనస్సు స్థిమితపడింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here