[box type=’note’ fontsize=’16’] దూరమైన ఆత్మీయుని తలంపులను జ్ఞాపకం చేసుకుని వేదనకు గురయ్యే అతివ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. [/box]
[dropcap]మూ[/dropcap]సిన నా
కనురెప్పల చాటున
దాగిన
ప్రతి కన్నీటి చుక్క
నను ప్రశ్నిస్తుంది.
నీవు రాల్చిన ప్రతి
అశ్రువుకి సమాధానం చెప్పమని
ఏమని చెప్పను ప్రియా?
నీవే కారణమని చెప్పనా
నీ తోడు లేని మనస్సు
ఒంటరి ప్రయాణంలో
అలసి
నీకై తపిస్తుందని చెప్పనా
నీ ప్రతి తలంపు, నన్ను దుఃఖ సాగరంలో
ముంచి వేస్తుందని చెప్పనా?
మిగిలిన ఈ జీవితమంతా
అమావాశ్య రాత్రిగా మారిపోయింది
జీవితాన్ని ప్రేమించి నేను
రేపటి వెలుగును ఆశించలేను
తిరిగిరాని లోకాలకు
నువ్వు వెళ్ళిపోయావు అని తెలిసినా
ఎందుకో తెలియని ఆత్రుత
తిరిగి తిరిగి చూసుకుంటాను
మళ్ళీ మళ్ళీ వెతుకుతుంటాను
వెనుక నువ్వు వున్నావేమో అని
“నిజం ఎంత నిష్ఠూరమైంది
దాని కడుపు కాల”
స్వ పర భేదాలు లేవా
నిన్ను నిలువునా దహించివేస్తుంది
ఎంతటి పరధ్యానంలో ఉన్నా
_____ అన్న నీ పిలువు
నన్ను సావధాన పరిచేది!
నేడు ఆ పిలువు
ఒక ఊహగా మారింది
నా కనురెప్పల చాటున
కన్నీటి బొట్టుగా మారింది
ఏమని చెప్పను ప్రియా?
నీవే కారణమని చెప్పనా
నీ పిలుపే
కరువాయెనని చెప్పనా?