[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 7వ భాగం. [/box]
అధ్యాయం- 7
ఈ దుర్ఘటన రాష్ట్రం మొత్తంలోనే కాకుండా దేశంలో కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి కారణం ఆక్సిడెంట్‌లో అనుమానాస్పదమైన సందర్భాల్లో మరణించింది మాజీ కేంద్రమంత్రి భార్య, ఆమె ప్రియుడుగా భావింపబడిన టెన్నిస్ ప్లేయర్ చరణ్. ఈ సందర్భంగా వరదరాజన్ సంగతి మరుగునపడిపోయి మొత్తం మీడియా అంతా నాచిరెడ్డిపై విరుచుకుపడడం ప్రారంభించింది.
ఆ విధంగా వరదరాజన్ విషయం మీడియాలో కనిపించకుండా ఉండడానికి భూషణరావు సుదర్శన్ సహాయం తీసుకుని దృష్టి మొత్తం సుకన్య చరణ్ యొక్క సంబంధం, దానికి నాచిరెడ్డి స్పందన వైపు మళ్ళేలా నిరంతరం మీడియావారికి ఇన్ఫర్మేషన్ అందేలా చర్యలు తీసుకున్నాడు, ఇందులో భాగంగానే సుకన్య స్నేహితురాలు మానవహక్కుల సంఘం అధ్యక్షురాలు ఐన ఛాయాదేవిగారితో నాచిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసంగాలు, టీవీ షోలూ చేయించడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఛాయాదేవి నాచిరెడ్డిపై తీవ్రమైన విమర్శలు కూడా గుప్పించారు.
తను ఒక అనుమానం పక్షి అని, పెళ్ళాన్ని వేధింపులకు గురిచేసేవాడని, చరణ్‌కూ తన భార్య సుకన్యకూ మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహాన్ని అర్థం చేసుకోలేని సంకుచిత స్వభావం అతనిదని, అందుకే పథకం ప్రకారమే ఆమెను చరణ్‌తో పాటుగా కిడ్నాప్ చేయించి తన గురించి ఆమె నిజాలు బయటపెడుతుందని, తన కిడ్నాప్ భాగోతం బయటపడుతుంది అని భావించిన నాచిరెడ్డి చరణ్‌ను, సుకన్యనూ హత్య చేయించాడని మీడియాలో ఎలుగెత్తి చాటడం ప్రారంభించింది.
అందుకు తగినట్లుగా సాక్ష్యాలు అవీ పోలిసువారికి ఏ సమయంలో దొరకాలో కూడా నిర్ణయించి పెట్టుకున్నారు భూషణరావు బృందం. జరిగిన ఈ దుర్ఘటన విషయంలో సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలి అని అమెతోపాటుగా ప్రస్తుత జోగేశ్వరరావు ప్రభుత్వం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకానొక సమయంలో జరిగిన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఛాయాదేవి – “మొదటినుంచీ నాకు నాచిరెడ్డిగారి ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉండేది. కేంద్రమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించే శాఖకూ, తన వ్యక్తిగత వ్యాపార జీవితంలో చేసే రచనలకూ అసలు ఏ విధమైన పొంతన లేకుండా ఉండేది. ఆయన రచనల్లో నాకు ఎప్పుడూ స్త్రీపట్ల ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉండేది. మీకు తెలిసే ఉంటుంది చాలావరకు ఆయన కథల్లోని స్త్రీ పాత్రలు హత్యకు గురవుతూ ఉంటాయి, దీన్నిబట్టి అనలైజ్ చేసి చూస్తే కనుక ఆయనకు సహజంగానే స్త్రీలమీద ద్వేషం ఉందనేది అవగతమవుతోంది.
అందుకే ఇటువంటివారిని మనం ఎప్పుడూ క్షమించకూడదు, వీరిని తమ పార్టీ నుంచి బర్తరఫ్ చెయ్యాల్సిందిగా నేను జె.హెచ్. పార్టీవారిని కోరుతున్నాను. ఇది నేను ఒక సంస్థ తరఫున కాదు, చనిపోయిన నా ప్రాణస్నేహితురాలికి ఎంతో దగ్గర మనిషిగా కోరుతున్నాను. అందుకే తక్షణమే నాచిరెడ్డిని అరెస్ట్ చేసి ఈ కేస్ మీద పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేపట్టాలని నా కోరిక. ఇక్కడకు నన్ను పిలిచినందుకు ఈ మాత్రమైనా ఉపయోగం ఉంటే సుకన్య ఆత్మ శాంతిస్తుంది” అనిచెప్పి అశ్రునయనాలతో సభ ముగించారు ఛాయాదేవిగారు.
ఆ విధంగా తను చేయించిన ఒక రాజకీయ హత్యను, ఒకరి వ్యక్తిగత కక్షగా నిరూపించడంలో సఫలీకృతం అయ్యాడు భూషణరావు. అటు తరువాత పరిణామాలన్నీ చాలా నాటకీయంగా జరిగాయి. నాచిరెడ్డి పూర్తిగా బయటకు రావడం మానేసి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు, ఈ సమయంలో తను ఆధ్యాత్మిక జీవితం వైపు కొద్దిగా మళ్ళినట్లు అనిపించింది. సుకన్య వాళ్ళ తల్లిదండ్రులు తనమీద జరుగుతున్న దుష్ప్రచారానికి లోబడిపోయి తన పాపను వాళ్ళ దగ్గరే ఉంచుకోవడానికి సిద్ధపడ్డారు.
నాచిరెడ్డి కూడా పెద్దగా ప్రతిఘటించలేదు. ఇక అక్కడ ఉండడం ఇష్టంలేక తన పనులన్నీ హైదరాబాద్ నుండే చేసుకుంటానని పోలీసువారి దగ్గర నుండి అనుమతి తీసుకుని అవసరమైతే రావడానికి సిద్ధంగా ఉన్నానని హైదరాబాద్ వచ్చేసాడు నాచిరెడ్డి. సుకన్య ఆక్సిడెంట్‌ను మర్డర్‌గా నిరూపించడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని కొంతమంది సన్నిహితులు తనకు చెప్పారు. అందులో భాగంగానే ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ తానే అయ్యే విధంగా సాక్ష్యాలు సృష్టించబడ్డాయి.
ఇదంతా అందరికీ తెలిసిన హైడ్రామా, ఇలాంటివాటిని చిలువలు వలువలుగా చేసి తమ పాపులారిటీని పెంచుకోవడానికి ఛాయాదేవి లాంటివారు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆమె ఇందుకోసం ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్లు కూడా చాలానే నిర్వహించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇంక తాను చేసేడేదీ లేక తన బాధనంతా సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్‌లో వెళ్ళబుచ్చుకుంటున్నాడు నాచిరెడ్డి.
తన దృష్టి ఈ సమయంలో వ్యాపారంపై మళ్ళడానికి తన బావమరిది సహకారం అందించాడు. తనపై జరుగుతున్న అసత్యప్రచారానికీ, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించింది ఎవరని తెలుసుకోవడానికి, సరైన వ్యక్తి ఎవరని వెతుకుతూ ఉండగా, ప్రతాప్ బర్త్ డే పార్టీకి చరణ్ సుకన్యను పిలవడం అనే సంగతి వెలుగులోకి వచ్చింది. ఇంకా ఆరా తీయగా ప్రతాప్ భూషణరావు కొడుకే అని కూడా సమాచారం తెలిసింది. దానితో కొంత విషయం తనకు చూచాయగా అర్థం కావడం ప్రారంభించింది.
ఈ విషయంలో తను బాక్ ఎండ్ మీడియా ప్రతినిధి సుదర్శన్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుని అతనితో సంప్రదింపులు జరిపాడు. సుదర్శన్ ప్రత్యేకత ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరికి సమాచారం ప్రొవైడ్ చెయ్యడం. అంతేకాకుండా సాధ్యమైనంత ఎక్కువగా రాజకీయ, వ్యాపారపరమైన ప్రత్యర్థులు అందరితోనూ టచ్‌లో ఉండడం, ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలతో ఒకరకమైన పొలిటికల్ సిండికేట్‌ను ఎవరికీ తెలియకుండా సుదర్శన్ నడుపుతూ ఉంటాడని ఒక పుకారు ఉంది.
ఏది ఏమైనా తనకిప్పుడు సుదర్శన్ అవసరం ఎంతో ఉంది, వీలైతే ఛాయాదేవి సంగతి కూడా ఇతని ద్వారా తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు నాచిరెడ్డి. ఈ మధ్యలో సిబిఐ విచారణ జరపాలనే ప్రజలనుంచి కూడా డిమాండ్ తీసుకురావడంలో ఆమె కృతకృత్యురాలు అయ్యింది. ప్రతిపక్షాల నుంచే కాదు, ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి అధికం కావడంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఈ కేసును అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనితో ఒకేపార్టీలో ఇద్దరు అగ్రనేతలపై విచారణ జరగడంతో ప్రజలు ఇంక జె.హెచ్. పార్టీ శాశ్వతంగా భూస్థాపితం అయిపోయిందనే భావనలోకి వచ్చారు. పైకి చెప్పకపోయినా ఈ విషయం పట్ల జోగేశ్వరరావు మనసులో ఆనందపడ్డాడు. ఇంక తనపార్టీకి రాష్ట్రంలో తిరుగులేదనే అభిప్రాయానికి వచ్చాడు. చాలామంది నకునారెడ్డి ఇంక తన పార్టీని అధికారపక్షంలో విలీనం చేసేస్తాడేమో అనే ఊహాగానాలు కూడా చేసారు.
ఇవన్నీ తలచుకున్నప్పుడల్లా నకునారెడ్డికి చాలా బాధకలుగుతుంది. కానీ ఏమి చేస్తాడు. ఏ విధంగా అయితే నాచిరెడ్డి తన భార్య కేసులో ఉచ్చులో ఇరుక్కున్నాడో అదేవిధంగా తను కూడా రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయాడు. ఇది తనకు కొత్తేమీ కాదు, ఐనప్పటికీ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయం.
***
“సిబిఐను రంగంలోకి దింపడానికి ఇదే సరైన సమయం మంత్రిగారు, ఇప్పటివరకు నకునారెడ్డిగారు ఆయన వెనకాల ఉన్న బడా వ్యాపారవేత్తలు ప్రజలకు చేసిన మేలు చాలు. ఆ పార్టీవారు ఎలాంటివారో చెప్పడానికి నిన్నకాక మొన్న జరిగిన నాచిరెడ్డి భార్య మరణం చూస్తే మనకు తెలుస్తుంది. అలాంటివారి గురించి ప్రజలకు పూర్తిగా తెలియచేయ్యడమే కాకుండా వారికి శిక్ష పడడం కూడా ఎంతో ముఖ్యం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటివి ఎప్పటికీ సహించాను.
అందుకే గతంలో జరిగిన అశోక్ త్యాగీ హత్యకేసుపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపించాలని నా కోరిక. అంతేకాకుండా ఆ కేసుకీ నాచిరెడ్డి భార్య మరణానికీ ఏదో లింక్ ఉండి ఉండాలని నా అభిప్రాయం. దయచేసి ప్రజలందరికీ ఇటువంటి హత్యారాజకీయాల నుంచి విముక్తి కలిగించండి సర్. అసలు ఈ సందర్భంలో అపారమైన అనుభవం, అద్భుతమైన మేధస్సు కలిగిన ప్రొఫెసర్ వరదరాజన్ లాంటి వ్యక్తులను పోగొట్టుకోవడం ఎంతో దురదృష్టకరం, అంతేకాకుండా ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం.
ప్రజల్లో ప్రభుత్వం పైన నమ్మకం కలగడానికి వరదరాజన్ గారు ఎంతో సహకరించారు, అందుకే తక్షణమే ఈ విషయంలో నకునారెడ్డిపైన, ఆయన పార్టీలో ఇతరులపైన విచారణ చేపట్టాల్సిందిగా నేను కోరుతున్నాను” చాలాకాలంగా తన మదిలో మెదులుతున్న మాటలను కేంద్ర హోం శాఖామంత్రితో పంచుకున్నాడు జోగేశ్వరరావు.
చాలా రోజుల తరువాత ఇంత ఎక్కువసేపు కేంద్ర ప్రభుత్వంలోని ఒక ప్రముఖునితో మాట్లాడాడు జోగేశ్వరరావు. హోం మంత్రిగారు కూడా చాలా ఓపికగా జోగేశ్వరరావు మాటలు విన్నారు.
“దేఖియే రావుజీ, ముజే లగ్ రహా హై కీ ఆప్ బాత్ బహుత్ పర్సనల్లీ లే రహే హై. మై జాంతాహూ కీ జో కుచ్ భీ హువా హై ఓ గలత్ హువా హైన్. వరదరాజన్ జీ కే మౌత్ పర్ ముఝే బహుత్ అఫ్సోస్ హై, మీ ఉస్కా దో తీన్ భాషన్ సున్ చుకా హూ. లేకిన్ నకునారెడ్డి భీ ఆప్ జైసా ఆద్మీ హైనా, ఆప్ తో జాంతే హై కి పిచ్లేబార్ వహ్ గవర్నమెంట్ కో సహీ సలామాత్ రఖ్నేమే బహుత్ మదద్ కియా. ఈ అశోక్ త్యాగీ కేసు మళ్ళీ బయటకి తీసుకురావడం అంత మంచిపని కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఓతో ఉసీ సమై మే ఆక్సిడెంట్ మోత్ కర్కే క్లోస్ కర్ చుకా హై. కోయీ బాత్ నహీ ఆప్కా మర్జీహోతో సిబిఐ ఎంక్వయిరీ జరూర్ హోగా. ఆప్ ఫికర్ మత్ కీజియే కానూన్ అప్నా కాం ఖుద్ దేఖ్ లేగా. హం తో సిర్ఫ్ రాస్తా దిఖానా హై” అని చెప్పి తనకు చేతనైన సహాయం చేస్తానని జోగేశ్వరరావుకి హామీ ఇచ్చాడు హోం మంత్రి.
వారిప్పుడు ఢిల్లీ లోని పార్లమెంటు మెంబర్స్ అతిధిగృహంలో ఉన్నారు. వరదరాజన్ ఆక్సిడెంట్‌లో చనిపోయిన కొంతకాలం తరువాత తనకు రాష్ట్రంలో ప్రతిపక్షం పటిష్టం అవుతుందేమో అని భయంతో శాశ్వతంగా నకునారెడ్డిని అణచివెయ్యడానికి పన్నాగం పన్నుతున్నాడు జోగేశ్వరరావు. ఇప్పటికే విశాఖపట్నం ఏరియాలోని స్థలం తన ప్రభుత్వం కైవసం చేసుకుంది, దానిపైన హైకోర్ట్ తీర్పు తనకు తనకు అనుకూలంగా ఇవ్వడంతో రాబోయే కాలంలో సుప్రీంకోర్టుకు వెళ్లి మళ్ళీ తనకు లేనిపోని తలనెప్పులు తీసుకురాకుండా ఉండడానికి పాతకేసును తిరగదోడి ఏదోక విధంగా నకునారెడ్డి రాజకీయ భవిష్యత్తుకి శాశ్వతంగా చరమగీతం పాడాలనే ఉద్దేశంలో తన సన్నిహితులు కొందరితో ఢిల్లీ వచ్చి హోం మంత్రిని కలుసుకున్నాడు జోగేశ్వరరావు.
అయితే ఆయన ఉద్దేశం ఏంటో ముందే అర్థం చేసుకున్న హోం మంత్రి కర్రవిరగకుండా పాము చావకుండా జోగేశ్వరరావుకి సమాధానం చెప్పాడు. ఆ రాష్ట్రంలో నకునారెడ్డి, జోగేశ్వరరావులు ఒకరిని మించిన రాజకీయ శక్తి ఒకరిదని ఆయనకు తెలుసు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి పూర్తిగా మద్దతు పలికేది ఈ రాష్ట్రమే. అందుకే ఇందులో ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టినా తమకే నష్టం. ఐనప్పటికీ ప్రస్తుతానికి నకునారెడ్డి పదవిలో లేకపోవడం వలన ఆయనంత పవర్ఫుల్ కాకపోవచ్చు. అందుకనే ఎంక్వయిరీ వెయ్యడం వలన తమకు వచ్చే నష్టం ఏమీ లేదు.
ఈ ఎంక్వయిరీలో ఏమి కొత్త విషయాలు బయటపడినా కానీ తమ ప్రభుత్వం ఇద్దరికీ న్యాయం చేసినట్లు అవుతుందని హోం మంత్రి అభిప్రాయపడ్డాడు. ఆయన ఇచ్చిన భరోసాతో తిరిగి తన రాష్ట్రానికి చేరుకున్నాడు జోగేశ్వరరావు.
“డాడీ అసలు మనం ఈ నకునారెడ్డి గారి గురించి ఎందుకు అంత ఎక్కువగా ఆలోచించాలి. ఆయనిప్పుడేమీ పెద్ద పవర్ఫుల్ కాదని మొన్నమొన్ననే వచ్చిన కోర్ట్ తీర్పు చెప్తోంది. మీరు ఆయనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు నాకు అనిపిస్తోంది” తను రిటర్న్ ఫ్లైట్లో ఉండగా రాహుల్ తన తండ్రిని ఉద్దేశించి అడిగాడు.
ఢిల్లీలో వరదరాజన్ మృతిపట్ల తమ సంతాపాన్ని తెలుపుతూ తమ పార్టీ యువనాయకుడిగా నిరసన ప్రదర్సనలు నిర్వహించడానికి పూనుకున్నాడు రాహుల్. అవి జరిగిన తరువాత తన తండ్రితోపాటే హైదరాబాద్‌కి తిరుగుప్రయాణం అయ్యాడు.
“చూడు రాహుల్ నీకు ఇలాంటి విషయాల్లో పెద్దగా అనుభవం లేదు. వరదరాజన్ గారి మరణం వెనకాల ఎవరెవరు ఉన్నారు అన్న విహాయం నువ్వు ఊహించను కూడా లేవు. నేను అనుకున్నది కరెక్టే అయితే వరదరాజన్ చావు వెనకాల ఉన్నవాళ్ళే గతంలో అశోక్ త్యాగీని చంపించి ఆక్సిడెంట్ కింద నిరూపించి ఉండాలి. అందుకే ఇది మనకు మంచి అవకాశం, వరదరాజన్ మృతిపట్ల నాకు చాలా బాధగా ఉంది.
అంతేకాకుండా నువ్వు స్టార్ట్ చేసే ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లాండ్ విషయంలో కోర్ట్ మనకు ఫేవర్‌గా తీర్పు ఇచ్చినప్పటికీ నకునారెడ్డి అంత తేలికగా ఈ విషయాన్ని వదలడు. ఒకవేళ అతను ఒదులుదామనుకున్నా అతని వెనక ఉన్నవారు వదలనివ్వరు. ఇదంతా ఒక చదరంగం లాంటిది, అందుకే వాళ్ళు మళ్ళీ మనజోలికి రాకుండా ఉండేలాగ తమ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చెయ్యాలి” తన కళ్ళజోడు సవరించుకుంటూ చెప్పాడు జోగేశ్వరరావు. తను చెప్పినదంతా విన్న తరువాత సానుకూలంగా తల పంకించాడు రాహుల్.
అసలు ఆ అశోక్ త్యాగీ కేసుగురించి తెలుసుకోవాలని ఎందుకో అతనికి అనిపించింది. తను కూడా రెండుమూడు సార్లు పేపర్లలోనూ టీవీల్లోనూ చూసేవాడు తప్పితే అప్పట్లో తనకు అంతగా ఆసక్తిగా ఉండేది కాదు. వారిద్దరూ ఇంటికివచ్చేసరికి పొద్దుపోయింది. డిన్నర్ టైంలో అశోక్ త్యాగీ గురించి ప్రస్తావిద్దాం అనుకుంటూ ఉండగా తన తండ్రే తనని ఎదురు ప్రశ్నించాడు
“అది సరే నువ్వు ఆ నకునారెడ్డిగారి అమ్మాయితో షాపింగ్‌లకూ వాటికీ వెళ్తున్నావట కదా ఏంటి విషయం.” అతనివంక చూస్తూ అడిగాడు జోగేశ్వరరావు.
ఒక్కసారిగా ఆయనలా అడిగేప్పటికి ఏమి చెప్పాలో తెలియక తడబడ్డాడు రాహుల్. జోగేశ్వరరావు భార్య శాంతాదేవి కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఆమాటలు అనడంతో ఆమె కొడుకువంక ఆనందంగా చూసింది. ఇంక ఈ వయసులో ఆమె కోరుకునేది తన కొడుకు వివాహం ఒక్కటే.
వెంటనే సద్దుకున్న రాహుల్ “ అబ్బే అలాంటిదేమీ లేదు డాడీ. జర్నలిజం స్కూల్లో తనూ నేనూ క్లాస్మేట్స్ అప్పుడప్పుడు ఫంక్షన్స్‌లో కలిసేది. తన ఫ్రెండ్ ఎవరో నన్ను కలవాలి అంటే జస్ట్ ఒకసారి సరదాగా మీట్ అయ్యాం అంతే. అలాంటిదేమైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను” తండ్రికి హామీ ఇచ్చాడు రాహుల్. అతని మాటలమీద నమ్మకంతో మరింకేమీ మాట్లాడలేదు జోగేశ్వరరావు. నిజం చెప్పాలంటే ప్రియాంకపైన తనకు ఎటువంటి అభిప్రాయం ఉందో తానే తేల్చుకోలేకపోతున్నాడు రాహుల్.
***
“సిబిఐ సమన్లు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి నకునారెడ్డి, జె.హెచ్. పార్టీ ఎక్స్ ఎంపీ నాచిరెడ్డి” ఆ తరువాత రోజు, అన్ని స్థానిక, జాతీయ దినపత్రికల్లో ఈ వార్తలు ప్రముఖంగా ప్రచురింపబడ్డాయి. వివరాల్లోకి వెళ్తే గతంలో ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుండి అనేకరకాలైన విచారణలకు గురికాబడిన నాచిరెడ్డి తనపై ఇప్పటికే ఉన్న అక్రమ ఆస్తుల కేస్ విషయమై ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ చరణ్ పై పగ పెంచుకున్నాడు.
అంతేకాకుండా తన భార్య సుకన్యకూ చరణ్‌కూ మధ్య అక్రమ సంబంధం ఉందని భ్రమపడిన అతను ఒక పథకం ప్రకారం వాళ్ళను హత్య చేయించి ఉంటాడని సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నట్లుగా పత్రికల వాళ్ళు కథనం ప్రచురించారు. అది మాత్రమే కాకుండా ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ వరదరాజన్ తన ప్రతిభతో ప్రభుత్వానికి సహాయపడుతున్నట్లుగా అనుకున్న నకునారెడ్డి ఇదే అదును చూసుకుని అంతకంతకీ తగ్గిపోతున్న తన ప్రతిపక్షబలాన్ని కూడగట్టుకోవడానికి నాచిరెడ్డితో చేతులుకలిపి చరణ్, సుకన్య వరదరాజన్ ముగ్గురినీ కలిపి ఒకే ఆక్సిడెంట్‌లో మరణించేలా పథకం పన్నినట్లుగా ప్రాధమిక అంచనా వేస్తున్నట్లు తెలుస్తోందని ఇంకొక పత్రికవారు ప్రచురించారు.
ఇదంతా ఒకెత్తు అయితే తను పదవీకాలంలో ఉండగా జరిగిన కలెక్టర్ అశోక్ త్యాగీ కేసుకీ, ప్రస్తుతం జరిగిన హత్యలకీ ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా సిబిఐ దర్యాఫ్తు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇందుకోసమై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జోగేశ్వరరావుగారు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిని కలిసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఒకొక్కరూ ఒకోక్కరకమైన వార్తలతో విభిన్న కథనాలతో జనాలను ఊపిరిపీల్చుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
తలాతోకా లేని ఇలాంటి సమాచారం చూస్తుంటే నకునారెడ్డి మనస్సు చివుక్కుమంటోంది. ఒకపక్క భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు, ఆశయాలూ పెట్టుకోవడానికి భయపడుతూ జనాలుంటే మరొకపక్క నిరంతరం నిద్రాహారాలు మాని ఉన్నదీ, లేనిదీ అని తేడాలేకుండా ప్రతీ చిన్నవిషయాన్ని ప్రజలకు చేరవెయ్యడానికి మీడియా తాపత్రయపడుతోంది.
ఈ విషయాలన్నీ ఒక్కసారిగా తనమీదకు విరుచుకుపడినట్లుగా అనుభూతి చెందినా నకునారెడ్డి మరొకసారి గుండెపోటుకు గురయ్యి హాస్పిటల్లో చేర్చబడ్డారు. ప్రియాంక అప్పుడు హాస్పిటల్ లోనే ఉంది. తనకు ఆ సమయంలో సహాయంగా ఉండడానికి సిద్ధార్థ కూడా అందుబాటులో లేడు. అతనికి విశాఖపట్నంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు చూడవలసినదిగా అక్కడ నియమించడం జరిగింది. అంతేకాకుండా భూషణరావుకి సంబంధించిన లాండ్ కూడా అక్కడే ఉండడంతో దాని తాలూకు వ్యవహారం అంతా చక్కదిద్దవలసినదిగా అతడిని నకునారెడ్డి అక్కడ ఉంచాడు. తాను కూడా ఈ కేస్ విషయాల్లో సిబిఐ విచారణ ఎదురుకోవడం వల్ల హైదరాబాద్‌లో ఉండవలసిన అవసరం కలిగి నాచిరెడ్డి తన బావమరిది ఇంట్లో ఉన్నాడు. ఈ సమయంలో నకునారెడ్డికి పార్టీలో ఇతరులనుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు.
హనుమంతరావు అనబడే వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చి తానే పార్టీ అధ్యక్షుడు కావాలని నకునారెడ్డి వెనకనుండి ప్రయత్నం చేస్తున్నట్లుగా సిద్ధార్థ్ సమాచారం అందించాడు. ఇవన్నీ తెలుసుకున్న నకునారెడ్డి మనసు ఎంతో గాయపడింది. ఎందుకో తెలీదు కానీ ఆయన ఆ రోజు ప్రియాంకతో మాట్లాడాలి అనుకున్నారు. ఆ సమయంలో నాచిరెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. సిబిఐ వాళ్ళు తమతో ఏదో మాట్లాడడానికి మళ్ళీ రేపు వస్తున్నారనే సమాచారం అందించడానికి వచ్చాడు అతను.
అతని మాటల్లో అశోక్ త్యాగీ విషయంలో ఈసారి తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చూచాయగా నకునారెడ్డికి అనిపించింది. ప్రియాంక తండ్రివైపు నిస్సహాయంగా చూసింది. ఈ విషయం గమనించిన నకునారెడ్డి ఏమి జరిగితే అదే జరుగుతుంది అన్నట్లుగా ఒక విరక్తితో కూడుకున్న నవ్వు విసిరాడు. ఆలోచనలతో ఆయన మనసు గతంలోకి పరుగుతీసింది.
***
“నమస్కారం అశోక్ గారూ. మిమ్మల్నిలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” ఆనందంతో కలెక్టర్ చాంబర్ లోకి అడుగుపెడుతూ అన్నాడు నకునారెడ్డి.
ఆయనిప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన ఒక నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చెయ్యడానికి వచ్చిన ఆయన భూషణరావు ప్రోద్బలం మీదట అతని వివాదం పరిష్కరించడానికి కలెక్టర్ ఆఫీస్‌కు రావడం జరిగింది. అతన్ని చూసినా కానీ అశోక్ త్యాగీ పెద్దగా స్పందించలేదు.
ఆలిండియా లోనే ఐఏఎస్ టాపర్ అయిన త్యాగీ మహారాష్ట్రకు చెందినవాడు. అతను విజయనగరంకు కలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచీ ఎన్నో రకాలైన మంచిపనులను చేసాడు. అక్రమ కట్టడాలను నిర్మూలించడం, రవాణా, మునిసిపాలిటీ, పౌరసరఫరాలు, వస్తు నిర్వహణ వంటి వాటిలో దళారులకు ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకున్నాడు. ధరణికోట అనే ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన నాలుగువందల ఎకరాల స్థలాన్ని అక్రమంగా సొంతం చేసుకుని, నిర్మాణాన్ని ప్రారంభించాడు భూషణరావు.
నకునారెడ్డి ఈ విషయంలో ఏమీ చెయ్యలేక మిన్నకున్నాడు. విషయం తెలుసుకున్న అశోక్ త్యాగీ ఇందులో ముఖ్యమంత్రి హస్తం కూడా ఉందని గ్రహించినా కానీ లెక్కచెయ్యకుండా నిర్మాణంలో ఉన్నకట్టడాలని తన స్టాట్యూటరీ పవర్స్ ఉపయోగించి కూలగోట్టించాడు. అందుకనే అతనికి నచ్చజెప్పి తమదారిలోకి తెప్పించుకోవడానికి భూషణరావు నకునారెడ్డిని ఆఖరిప్రయత్నంగా పంపించాడు. సాధారణంగా సెక్యూరిటీ లేకుండా బయటకు రాని నకునారెడ్డి ఈరోజు తన కారు తానే స్వయంగా నడుపుకుంటూ, తన సెక్రెటరీ చెప్తున్నా వినకుండా కలెక్టర్ దగ్గరకు వచ్చాడు.
“ఓ… ముఖ్యమంత్రిగారూ మీరా? ఎంత అదృష్టం చేసుకున్నాను నేను. సాధారణంగా సమావేశాల్లో చూడడం తప్ప ఇలా ప్రత్యేకంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి.” అతను బాయ్‌ని పిలిపించి ఇద్దరికీ టీ అండ్ స్నాక్స్ తెప్పించాడు.
“క్షమించాలి గవర్నమెంట్ సర్వెంట్‌ని కదా. మీకు ఇంతకన్నా గ్రాండ్‌గా ఏమీ అరేంజ్ చెయ్యలేను” అని తన ఎదురుగా ఉన్న గ్లోబ్‌ను తిప్పుతూ చెప్పాడు అశోక్. అతను డ్యూటీ నిమిత్తం ఆంధ్రాలో ఉండడం వలన తెలుగు బాగానే మాట్లాడగలడు. అతని మాటల వెనక ఉన్న వ్యంగ్యాన్ని నకునారెడ్డి గమనించకపోలేదు.
ఎందుకో అవసరం ఉన్నా లేకపోయినా తన నిజాయితీని పలుగురికి వ్యక్తపరచడం అతని నైజమై ఉంటుంది అనుకున్నాడు నకునారెడ్డి. ఇలాంటివారి గురించి తనకు బాగా తెలుసు, పని చెయ్యకపోయినా బతకగలరు కానీ, పని చేస్తున్నాం అని నలుగురికీ చెప్పకుండా నలుగురి ముందరా తమ గురించి చెప్పుకోకుండా ఉండలేరు.
“అశోక్ గారూ, మీ గురించి నేను చాలా విన్నాను. ఆలిండియా ఐఏఎస్ టాపర్ అవ్వడమే కాకుండా ఎంతో ఆక్టివ్ అండ్ డైనమిక్‌గా మీ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిసింది. మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం” తను వచ్చిన విషయాన్ని చెప్పకుండా తాత్సారం చేస్తున్నట్లుగా అనిపించి అశోక్ త్యాగీ అన్నాడు.
“నేను కూడా మీ గురించి విన్నాను ఈ రాష్ట్రంలో మీ అంత పవర్ఫుల్ సీఎం ఇప్పటివరకూ లేడని, ఈ రాష్ట్రప్రజలు చేసుకున్న అదృష్టం మీరు ముఖ్యమంత్రి కావడం అని చాలా పత్రికల్లో చదివాను. అంతేకాకుండా మీకు షాకిచ్చే న్యూస్ ఏంటంటే మీరు ఇక్కడికి ఎవరు పంపితే వచ్చారో కూడా నాకు తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే మీరు వచ్చిన పని జరగదని మీకు ముందుగానే తెలిసినా మీరు నా దగ్గరకు భూషణరావు తరఫున వకాల్తా తీసుకుని రావడం” అతని వైపు సూటిగా చూస్తూ చెప్పాడు అశోక్ త్యాగీ.
అతనన్న మాటలకు ఏమాత్రం తొణకని నకునారెడ్డి అతనివంక సానుభూతిగా చూస్తూ “అయ్యో నేను వకాల్తా తీసుకుని రాలేదు మిస్టర్ అశోక్, రాజీ కుదర్చడానికి వచ్చాను. మంత్రులందరూ చేసేది అదే కదా ప్రజలకూ, అధికారులకూ మధ్యవర్తిగా ప్రవర్తించడం. అందుకే ఆ లాండ్ విషయం మీరు ఇంతటితో మర్చిపోతే అందరికీ చాలా మంచిది.
అందులోనూ భూషణరావు నిర్మించబోయేది కూడా పవర్ ప్ర్రాజెక్టే కదా, దానివల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. అది మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్వర్తించే ప్రయత్నంలో జరుగుతుందనే విషయం మీరు గమనించాలి. ఇలాంటివాటికి మీ సహకారం కూడా లభిస్తుంది అనే ఆశతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఏ ఒక్కరికో లాభం చేకూర్చడానికి కాదు అర్థం చేసుకోండి” అని కొంచెం నెమ్మదిగా అతనితో చెప్పడానికి ప్రయత్నించాడు.
“ఏమిటండీ మీరు చెప్పేది, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు లాభం చేకూరుతుందో లేదా భూషణరావు ఎగ్రిమెంట్ చేసుకున్న ఫారిన్ కంపెనీకి లాభం చేకూరుతుందో తెలుసుకోలేనంత వెర్రివాడినేమీ కాను. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కు అవసరమైన ముడిసరుకును అక్రమంగా తరలిస్తున్న ఆ భూషణరావు యొక్క వాహనాలు చాలావరకూ సీజ్ చెయ్యబడ్డాయి.
ఇంక మీరు ఏమి చేసినా ఆ స్థలాన్ని చేజిక్కించుకోలేరు. ఈవిషయం మీద ఫర్దర్‌గా మీరు ప్రొసీడ్ అవ్వకుండా ఉండడానికి హైకోర్టులో దావా కూడా వెయ్యదలుచుకున్నాను. అక్కడ విశ్వవిద్యాలయం స్థాపించాలని ఎంతోకాలంగా పబ్లిక్ డిమాండ్ ఉంది, మీరు అందుకు సహకరించాల్సింది పోయి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా భూషణరావు లాంటివాళ్లకు ఫేవర్ చెయ్యాలి అనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను” ఆవేశపడుతూ అన్నాడు అశోక్ త్యాగీ.
అతన్ని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూసాడు నకునారెడ్డి. కొద్దిసేపు ఆయనేమీ మాట్లాడలేదు. అతను చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకున్నట్లుగా ఉన్నాడు.
కొంచెం సేపటి తరువాత “మీరు ఎక్కువగా ఆవేశపడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. ఇందాకా మీరు అన్నారే నా అంత పవర్ఫుల్ సీఎం లేరని, అందులో ఎంతమాత్రం నిజం లేదు. నాకన్నా పవర్ఫుల్ అయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. నేను చాలా సామాన్యుడిని. అలా అని చెప్పి ఎవరిచేతిలోనైనా కీలుబొమ్మను అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. పవర్ అంటే ఏంటో, ప్రజలు అంటే ఏంటో, ప్రజలు దేన్నీ పవర్ అని అనుకుంటారో నాకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి” ఆయన వంక సూటిగా చూస్తూ చెప్పాడు నకునారెడ్డి. అక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతున్నట్లుగా అనుభూతి చెందారు వారిద్దరూ.
“ఏమిటో ఆ అభిప్రాయాలు” ఆయన చెప్పినదానికి కొంచెం కూడా తొణుకూబెణుకూ లేకుండా అంతే సూటిగా ఆయనను ప్రశ్నించాడు అశోక్ త్యాగీ
“చూడండి అశోక్ గారు, మీరూ ప్రజలకు సేవచేసే వారే, నేను కూడా ప్రజలకు సేవచేసే వాడినే, అయితే మీరు ఎప్పుడైనా మీకూ, నాకూ అంటే నాలాంటివాళ్ళకూ, మీలాంటివాళ్ళకూ మధ్య తేడా ఏమిటి అని ఆలోచించారా?” మళ్ళీ అతడిని అడిగాడు నకునారెడ్డి. తను అడిగినదానికి సమాధానం చెప్పకుండా తిరిగి తనని ప్రశ్నిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసాడు అశోక్.
“తేడానా ఏమిటది?” కొంచెం కుతూహలంగా అడిగాడు
“మీలాంటి నియమిత ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవచేయాలని తాము కంకణం కట్టుకున్నట్లుగా స్వచ్ఛందంగా పరీక్షలు రాసి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యి ప్రజాసేవ చేస్తున్నామని ప్రజాధనం నష్టపోతోంది అంటూ ఉద్వేగభరితమైన భ్రమలో ఉంటారు. ఇంక ఎటువెళ్ళాలో మార్గం తెలియని ప్రజలు మాకొక మార్గం చూపించండి అని తమంతట తాముగా మమ్మల్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు చెప్పండి నిజంగా ప్రజలవల్ల ఎవరికి ఎక్కువగా ఉపయోగం జరుగుతుందో” ఆశ్చర్యంగా తన వంక రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉన్న అశోక్ ఎదురుకుండా ఉన్న స్నాక్స్ తీసుకుని తింటూ వెనక్కివాలి కూర్చున్నాడు నకునారెడ్డి
“అంటే మీ ఉద్దేశం ప్రజలకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కలెక్టర్లు, కమీషనర్లూ వీళ్ళందరికన్నా ప్రజలను నిరంతరం జలగలా పీడించి, ప్రజల సొమ్ము కాజేసి కోట్లకు పడగలెత్తిన గుత్తేదార్లకు కొమ్ముకాసే రాజకీయ నాయకులు ఎక్కువ అవసరమనా” తన మాటల్లో వ్యంగ్యం ధ్వనిస్తూండగా నకునారెడ్డితో కొంచెం గట్టిగానే అన్నాడు అశోక్.
“మీరు చెప్పినదాంట్లో జలగల్లా పీడించడం, కోట్లకు పడగలెత్తడం ఇలాంటి ప్రోపగాండా సినిమా డైలాగ్స్ అన్నీ తీసేస్తే స్థూలంగా నేను చెప్పదలచుకున్నది అంతే. ప్రజలకు మీలాంటి సెల్ఫ్ మేడ్ ప్రొఫెషనల్స్ కంటే, ప్రజల బాధను స్వయంగా అనుభవించి ప్రజలలోంచి పుట్టిన ఒకరాజకీయ నాయకుడి అవసరం మీకన్నా ఎక్కువ ఉందని నా అభిప్రాయం.
ఇకపోతే ఇందాకా నేను చెప్పినట్లుగా పవర్ అంటే నలుగురికీ అర్థం అయ్యే రీతిలో నచ్చేపని చెయ్యడం. ఆ విషయంలో మీలాంటివారికన్నా మీరు చెప్తున్నటువంటి గుత్తేదారులు ఎంతో మేలు. ఈరోజుల్లో సామాన్య ప్రజలు సొంతంగా తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతున్నారు అంటే మీకన్నా మాకన్నా ఆ కాంట్రాక్టర్స్ దయ ఎంతో ఉంది. అలాంటివారికి సాధ్యమైనంతవరకూ తోడ్పడాలి కానీ అడ్డుతగలకూడదు అని నా అభిప్రాయం.
ఈ దేశంలో చడువుకున్న, చదువుకోని ఎంతోమంది అలాంటివారి మీద ఆధారపడుతున్నారు అంటే వారు చేసే పనుల్లో ఒకటి రెండు అవకతవకలను చూసీ చూడనట్లుగా వదిలెయ్యడం ఏమంత పెద్ద తప్పు కాదని కూడా నాకు అనిపిస్తోంది. ఏమంటారు” కనుబొమ్మలు ఎగరేస్తూ అతనివంక చూసి చెప్పాడు నకునారెడ్డి.
“హమ్మయ్యా ఇంతసేపటికి అవకతవకలు ఉన్నాయి అన్న విషయం ఒప్పుకున్నారు. మీరు చెప్పినదంతా వినడానికి చాలా బాగుంది రెడ్డిగారు. మీరు అంత పెద్ద ప్రజానాయకులు ఎలా అయ్యారో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. పోతే ఎవరు చేసే ప్రొఫెషన్ పట్ల వారికి గౌరవం ఉండడం పెద్ద తప్పు కాదు, ఇంకా చెప్పాలంటే అవసరం కూడా. కానీ మీరు చెప్పిన ఆ కాంట్రాక్టర్లు చాలా మంది హత్యలకు కారణం అయ్యారు. అందులో భూషణరావు తక్కువేమీ కాదు, స్థలం ఇవ్వానికి నిరాకరించిన ఇద్దరి రైతులను బలవంతంగా చంపించి ఆత్మహత్య కింద అందరినీ నమ్మించాడు. దీనికి తగిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఎవరివల్ల ఉపయోగమో” ఇంకా ఆవేశపడుతూ గట్టిగా అరిచినంత పనిచేసాడు అశోక్. నిశ్శబ్దంగా అతను చెప్పినది అంతా విన్న నకునారెడ్డి ఎలాంటి స్పందన లేకుండా
“మీరు చెప్పినదాంట్లో నిజానిజాలు ఎంతవరకూ ఉన్నాయన్నది నాకు తెలీదు. ఒకవేళ నిజమే అయితే ప్రజలు ఎప్పుడో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చేవారు. అలాంటిదేమీ జరగలేదు అంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మీరు ఈ విషయం మీద మరొకసారి పునరాలోచన చేసి ఆ భూమి భూషణరావుకి వచ్చేలా చేయాలని మా విజ్ఞప్తి. మీ సహకారం లేకుండా ఎందుకో మేము కూడా ముందుకు వెళ్ళలేమేమో అనిపిస్తోంది, ఒక్కసారి ఆలోచించండి.
చివరగా ఒక్కమాట, మీరు ఏకాలంలో ఉన్నారండీ, బహుశా ఈకాలంలో భూషణరావు లాంటివారు అవసరం అందరికీ ఉందేమో. టూ ఎస్టాబ్లిష్ ప్రోస్పరిటీ వీ నీడ్ టు మేక్ మనీ ఫస్ట్. గెట్ ఏ సెన్సిబిల్ గ్రిప్ ఆన్ దిస్ రియాలిటీ మిస్టర్ అశోక్” కొంచెం అనునయంగా చెప్పాడు గంభీరమైన స్వరంతో చెప్పాడు నకునారెడ్డి
“సంతోషం, మీరు చెప్పదలచుకున్నది పూర్తయ్యింది అనుకుంటాను. ఇక మీరు బయలుదేరితే నేను ఆనందిస్తాను” ఈసారి కొద్దిగా సీరియస్‌గా చెప్పాడు అశోక్. తను అనుకున్న పని జరగనందుకు నిరుత్సాహంగా వెనుదిరిగాడు ముఖ్యమంత్రి నకునారెడ్డి. ఇదిజరిగిన కొంతకాలానికి ఒక ప్రజావేదికకు వెళ్లి తిరిగివస్తున్న కలెక్టర్ అశోక్ త్యాగీపై గుర్తు తెలియని దుండగులు దాడిచేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు, అతనితోపాటు ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ దాడిలో మృతి చెందారు.
ఆలోచనల నుంచి బయటకు వచ్చిన నకునారెడ్డి తన తదుపరి ప్రణాళిక ఏవిధంగా ఉండబోతోందో మనసులోనే అంచనా వేసుకున్నాడు. ఈ విషయంలో తనకు భూషణరావు నుండి ఎటువంటి సహాయం అందదని ఆయనకు ముందే తెలుసు. తన అవసరం భూషణరావుకి తను పదవిలో ఉన్నంతవరకే ఉంటుందని ఎప్పుడో ఊహించాడు. అందుకే ఏమి చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సిద్ధార్థకు ఫోన్ చేసాడు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ కేసులతో గొడవలతో ఇంకా కృంగిపోయి ఈ రోజో రేపో అన్నస్థితికి వచ్చాడు.ఆయనను ఈ పరిస్థితుల్లో చూసిన ప్రియాంక హాస్పిటల్లోనే, మౌనంగా రోదించింది.
***
ప్రముఖ రచయిత మరియు మాజీ కేంద్రమంత్రి అయిన నాచిరెడ్డిని ఆయన భార్య హత్యకేసులో అనుమానిస్తూ సిబిఐతో కలిసి పనిచేసే స్పెషల్ పోలీస్ టీం అరెస్ట్ చేసింది. అతని భార్యకు సంబంధించి కొన్ని బలమైన సాక్ష్యాలు సిబిఐ వారి చేతులకి చిక్కినట్లుగా సమాచారం. అయితే ఆ సాక్ష్యాలు ఏమై ఉంటాయి అని బయటపెట్టడానికి సిబిఐ వారు నిరాకరించారు. అతని భార్య సుకన్యకూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు చరణ్‌కు సంబంధించిన వివరాలు అయి ఉంటాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తన అరెస్ట్ విషయంలో నాచిరెడ్డి ఏ విధమైన ప్రతిఘటనా చూపించలేదు, ఒకవిధమైన నిర్లిప్త ధోరణిలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ విషయాలు పార్టీకి ఏమీ తెలియకుండానే పార్టీ నుండి ఎటువంటి సహాయం ఆశించకుండానే పార్టీకి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు నాచిరెడ్డి. అంతేకాకుండా తనిక రాజకీయాలకు స్వస్తి పలికానని కూడా ఈ సందర్భంగా ప్రకటించాడు ఆయన.
ఈ సంఘటనతో అసలే అంతంత మాత్రంగా ఉన్న జె.హెచ్.పార్టీ పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలం అయ్యింది. తమ నాయకుడైన నకునారెడ్డి అస్వస్థత, ఆయనపై సిబిఐ దర్యాఫ్తు ఇంకొక పార్టీ ప్రముఖుని అరెస్ట్‌తో పార్టీ కకావికలం అయిపోయింది. దానితో పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వ్యక్తులు తమ పరిస్థితి అగమ్యగోచరం అయినట్లుగా అనుభూతి చెందుతున్నారు. ఈ వార్తలన్నీ ఒక టీవీ న్యూస్ ఛానెల్ కొన్నికొన్ని ఫుటేజస్‌తో కలిపి చాలా అందంగా చూపిస్తున్నారు.
అది చూస్తున్న సిద్ధార్థ మనసు ఎందుకో బాధపడింది. అందుకు కారణం ఆ టీవీ వాళ్ళు చెప్పినట్లుగా తను పార్టీలోకి కొత్తగా చేరినవాడు కావడం ఏమో అని ఒక్కక్షణం అతనికి అనిపించింది. అయితే వెంటనే తన ఊహకి తనకే నవ్వొచ్చింది. ఈ మీడియా వాళ్ళు ప్రజలనే కాదు రాజకీయంలో ఉన్నవాళ్ళను కూడా తమకు నచ్చినట్లు అలోచింపచేయగల ఘనులు. తను ఈ ఆలోచనల్లో ఉండగానే తనకు నకునారెడ్డి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.
“చూసావా బాబూ, ఆ జోగేశ్వరరావు ఆఖరికి అనుక్కున్నంత పనీ చేసాడు. కోర్టు కేసులో గెలవడమే కాకుండా, తనకు అడ్డు తగిలే సామర్ధ్యం ఉన్న ఒకోక్కరినీ రకరకాల కేసులలో ఇరికించి ఇంక ఈ రాష్ట్రానికి వేరే ప్రత్యామ్నాయం లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇంక భూషణరావు లాంటివారి నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇంతకాలం నేను ఏదైతే జరగకుండా అడ్డుపడుతూ వచ్చానో అది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ భూషణరావే కనుక జోగేశ్వరరావుకి దాసోహమని అతనితో చేతులు కలిపాడంటే ఇంక మన రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు.” తన బాధంతా ఫోన్లోనే సిద్ధార్థతో పంచుకున్నాడు నకునారెడ్డి.
“కూల్ డౌన్ అంకుల్. మీరు అనవసరంగా ఎగ్జైట్ అవ్వకండి, అసలే మీకు ఇప్పటికి రెండుసార్లు స్ట్రోక్ వచ్చింది. మీరు అంతగా ఆవేశపడడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ తరువాత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న మాలాంటివారి పరిస్థితి ఏమి కావాలి” కొద్దిగా అనునయంగా ఆయనతో అన్నాడు సిద్ధార్థ్.
“అదే సిద్ధూ, నా బాధ. ఇన్నాళ్ళూ ప్రజాసేవ పేరుతో భూషణరావు లాంటివారికి నాకు ఇష్టం లేకపోయినా సహాయపడడమే కాకుండా వారు చేసే పనులతో నేను కూడా పాపం మూటగట్టుకున్నాను. ఇంకా ఎక్కువ కాలం నేను బతకనేమో అనిపిస్తోంది బాబూ. అందుకే ఈ సమయంలో నీ సహాయం అర్ధించడానికి ఫోన్ చేసాను” కుతూహలంగా వింటున్నాడు సిద్ధార్థ్ అతనికి ఈ సంభాషణ అంతా చాలా కొత్తగా ఉంది.
“ఏమిటది అంకుల్ సంకోచం లేకుండా చెప్పండి” అడిగాడు. ఏమీ లేదు బాబు “నా తరువాత నా స్థానాన్ని భర్తీ చెయ్యడానికి మా ప్రియాంకను ఒప్పించాలి. తను నా మాట ఎప్పటికీ వినదు నేను రెండుమూడు సార్లు ఆమె దగ్గర ఈ ప్రస్తావన తీసుకువచ్చి విఫలం అయ్యాను. ఇప్పటికీ ప్రజలు భూషణరావు లాంటివాళ్ళు సృష్టించే భీభత్సాలతో విసిగిపోయి ఉన్నారు.
ఇంకా కొత్తగా జోగేశ్వరరావు రాజకీయ ఎత్తుగడలతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయ్యారయ్యి ప్రజలెంతో నష్టపోతున్నారు. ఈ సమయంలో కావలసినది ఒక కొత్త ఆలోచన, ఒక యువ నాయకత్వం. అందుకే నువ్వు ఆమెను రాజకీయాల్లోకి వచ్చే విధంగా ఒప్పించాలి” తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు నకునారెడ్డి. తనకు చేతనైన రీతిలో ఆయన్ను సమాధానపరిచి ప్రియాంకను ఒప్పిస్తానని హామీ ఇచ్చిఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు సిద్ధార్థ.
(సశేషం)