దొంగ దొర

1
4

[box type=’note’ fontsize=’16’] వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా మిగిలిన దంపతుల గురించి ‘దొంగ దొర‘ కథలో చెబుతున్నారు జొన్నలగడ్డ సౌదామిని. [/box]

ఒకటో రంగం

“ఇదిగో, ఏం చేస్తున్నారూ,”

“—–“

“రిటైరయ్యి ఏడాది అయ్యింది, ఇప్పుడన్నా కాస్త సహాయం చేయచ్చుగా”

“హుఁ శుభోదయం, ఎలా వున్నావోయ్”

“వొంట్లో ఏమాత్రం బాలేదు”

“ఏమయ్యిందీ?”

“వికారమూ, వాంతులూ”

“మళ్ళీ నెల తప్పావా, పొరపాటున?”

“ఆ, అదొక్కటే తక్కువ? వొళ్ళు కాలి వొకళ్ళేడుస్తుంటే అని సామెత, పైగా నిన్న రాత్రి నిద్దర కూడా పట్టలేదు, పక్కన జొన్నలగడ్డ వారి చానెల్లో గురక సంగీతం కూడానూ”

“అవును, వద్దన్నా వినకుండా, ఆ పాడు మిరపకాయ బజ్జీలు ఒక దాని తరవాత ఒకటి వదలకుండా”

“అమ్మా”

“అంత నెప్పిగా వుందా, ఒక్క క్షణం”

“హూఁ… హుఁ..”

“ఇందా, ఈ నిమ్మకాయ సోడా తాగు, కొద్దిగా సద్దుకుంటుంది”

“బ్రేవ్…”

“కాస్త సద్దుకుందా?”

“వూ ఇటు రండి. అరటి పువ్వులో దొంగా దొరా విడదీయండి”

“అబ్బా, మళ్ళీ ఈ దరిద్రం ఇంట్లోకి ఎల్లా వొచ్చిందీ?”

“పక్కింటి బామ్మ గారు ఊరినించి వస్తూ పట్టుకొచ్చారు, మరి మొదలెట్టండి”

“చంపావు పో, ఇది నాకు అస్సలు ఇష్టంలేని కూర, కావలిస్తే నువ్వు చేసుకుని నువ్వే తిను”

“అల్లాగయితే ఆ దురదలు రేపే వంకాయలు, కఫం పుట్టించే బెండకాయలూ రేపణ్ణించి–“

“ఆగవే, నాక్కాస్త వాక్స్థానంలో శని ఉన్నాడు. నోటి దూల తగ్గించుకో అని ఆ శాస్త్రులుగారు చెబుతున్నా– సరే ఆ గోలెందుకుగానీ, ఏం చెయ్యాలో చెప్పు?”

“ఈ అరటి పువ్వు”

“అర్థమైంది, తీసిపెడతాను”

“తరవాత”

“ఇంకా తరవాత కూడానా? సరే సెలవియ్యి.?”

“ఈ కిలో వాక్కాయలకి గింజలు తీసి భోజనం చెయ్యటమే”

“నీ అమ్మ కడుపు మాడ, వాటన్నిటికి గింజలు తీసేసరికి సాయంత్రం అవుతుంది గదే”

“మీ అమ్మ కడుపు చల్లన, తొందరగా మొదలెట్టండి, మళ్ళీ మీరు ఆకలికి అసలే ఆగలేరు.”

“చంపేశావ్ పో, తప్పదా, కాస్త దయ చూడు”

“ముందర మొదలెట్టండి, తరవాత చూద్దాం”

రెండో రంగం

“అన్నీ వొడ్డించావా?”

“ఆ..త్రికాల సంధ్యాతత్పరులు దిగివచ్చారు, వొడ్డించని పదార్థాన్ని వదిలేస్తారా?.”

“అది సరే గానీ..”

“ఏమైంది”

“అరటి పువ్వు కూర, వాక్కాయ పచ్చడి, చారు, ఆవకాయా, ఆ.. గుర్తుకొచ్చింది. దొంగా, వంట గదిలో నువ్వు ఇందాక చేసిన నువ్వు పచ్చడి దాచుకున్నావు.”

“అవును మరి, రెండు వాక్కాయలు తీసి, నాలుగు దొంగ, దొర విడదీసి పరారు, మళ్ళీ అన్నీ లెక్కలు”

“తీసుకురావే?.”

“సాయంత్రానికి గారెలపప్పు నాన పోశా. వాటిల్లోకి వుంటుందని.”

“నువ్వు పచ్చడి మళ్ళీ రెండు నిమిషాల్లో చెయ్యగలవు, తీసుకురావే?.”

“సరే తినండి, నా రాత బావుంటే, సాధువుగా వుండే ఆ సాధువారికి ఇవ్వకుండా, ఈ జొన్నలగడ్డవాళ్ళకి ఇచ్చాడు చూడు మానాన్న, ఆయనని అనాలి. ఏం చేస్తాం, ఖర్మ, ఖర్మ”

“అబ్బా, స్వర్గం కనిపించింది”

“మా అత్తగారూ, మావగారూ కనిపించారా?”

“మధ్యలో వాళ్ళ గోల ఎందుకే..”

“అవును, నా చాదస్తం కానీ, వాళ్ళు అక్కడ ఎందుకుంటారు?”

“ఇంకాస్త వాక్కాయ పచ్చడి?”

“తీయటానికి వంద తిట్లూ, రెండొందల వ్యాఖ్యానాలూ, తింటానికి మట్టుక్కు మొత్తం కావాలి?”

“బావుంది, వెయ్యవే?”

“గిన్నె మొత్తం మీదగ్గిరే వుంది. నాక్కూడా ఏమీ మిగల్చలేదు మీరు. ఇంకాస్త తెమ్మంటే?”

“సరే ఇవ్వాల్టికి ముగిద్దాం, అన్నదాతా సుఖీభవ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here