[box type=’note’ fontsize=’16’] తెలుగు వారి పెద్ద పండుగ మకర సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు మట్ట వాసుదేవమ్. [/box]
[dropcap]రా[/dropcap]వమ్మా సంక్రాంతి రావమ్మా!
వస్తూ కోటి సుఖశాంతులను తేవమ్మా!!
భోగిపళ్ళేరుకొని భోగి స్నానము చేసి
భోగిమంటల బొట్టు పెట్టుకొనగ!!
కొత్తబట్టలతోడ పిల్లలూ పెద్దలు,
ఆటపాటల తోడ ఆనందమున తేల (..రావమ్మా॥)
సంక్రాంతి అనగానే నెలకొక్కటంటారు!
మకరసంక్రాంతి మరి పెద్ద పండగ కద!!
ఉత్తరాయణ పుణ్యకాలమున వచ్చి!
పెద్దలకు పిండములు నువు చేర్చవమ్మా!! (..రావమ్మా॥)
గంగిరెద్దుల వారి గమ్మత్తు పాటలతో!
డూడూ బసవన్న యను నీతైన ఆటలతో
జీయరులు పాడేటి హరినామ స్మరణతో!
జంగములు పాడు లింగరా దేవరల పదములతో (..రావమ్మా॥)
నగరాలలోనుంచి నాణ్యమగు సినిమాలు
పల్లెల్లో పొట్టేల్ల, కోడి పందెములతో!
కొత్త కోడళ్లతో! కొత్త అల్లుళ్ల తో!!
పులకించి పోతున్న మాదు వాకిండ్లకు (..రావమ్మా॥)
మగ పిల్లలకు బొంగరాల్ గాలి పటములు
ఆడపిల్లలకు రంగురంగైన ముగ్గులు
ముత్తయిదువల పిండివంటల ఘుమఘుమలు!
అవ్వా తాతయ్యల అలరించు మాటలతో!! (..రావమ్మా॥)
ఆరుగాలము శ్రమించిన కర్షకులు!
పండిన పంటను కోసేసి కుప్పేసి
నూర్చినా ధాన్యమును తూర్పార బోసుకొని
సంతసమ్మున గాదెలన్నియు నింపగ (..రావమ్మా॥)
మగువలందరు కూడి తలకు స్నానము చేసి!
ఆవు పేడను తెచ్చి ముద్దగా చుట్టేసి
గొబ్బిపూలతోడ గొబ్బెమలను చేసి
ఉత్తరేణితో సంకమయ్య పూజలు చేయ (..రావమ్మా॥)