[box type=’note’ fontsize=’16’] పట్టించుకోని కొడుకు, హేళన చేసే కోడలితో సర్దుకుపోవాలని చూసిన ఓ వృద్ధురాలి జీవనాన్ని ‘ఓ అమ్మ(వ్యథ) కథ‘ లో చెబుతున్నారు అద్దేపల్లి ఉమాదేవి. [/box]
”అత్తయ్యా! కాఫీ కలిపారా!” అన్న గొంతు వినగానే, ఫిల్టర్ దిగిందో, లేదో చూస్తున్న సుభద్రమ్మకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టనిపించింది.
”అమ్మయ్యా! లేచావా తల్లీ! శనివారం కదా, ఇప్పుడే ఆ శ్రీనివాసునికి దండం పెట్టుకున్నాను, ఇవాళయినా నువ్వు లేవాలని.. వుండు. ఇప్పుడే ఫిల్టర్ డికాషన్ దిగింది. కాఫీ కలిపి ఇస్తా..” సంబర పడిపోతూ వెనుతిరిగి చూడకుండానే కాఫీ డికాషన్ స్టీలు గ్లాసులో పోసి, అలాగే చేతులు వణుకుతుంటే కంట్రోల్ చేసుకొని కాఫీ కలుపుతున్న ఆమె,
”లేవక అలా శాశ్వతంగా నిద్దరపోతాననుకున్నారా!” కోడలు వర్ధని నిష్ఠూరానికి చివుక్కుమన్న మనసుతో,
”అలా ఎందుకనుకుంటాను నా తల్లీ! మీరంతా చల్లగా నూరేళ్ళు బతకాలని, మీ అందరి చేతుల్లో యీ తనువు చాలించాలని ఆ దేముణ్ణి కోరుకుంటాను కానీ”.. అంటూ స్టీలు గ్లాసు చేతిలోనుండి జారి పడిపోతుందేమో అన్నంతగా చేతులు వణుకుతున్నా, మెల్లగా తీసుకొచ్చి టేబిల్ మీదపెడుతూ,
”నిన్నటినుండి ఒకటే తల తిరగుతోంది. చేతులు వణుకుతున్నాయి. నువ్వా మూడు రోజులనుండి తలనొప్పి అంటూ తల కట్టుకొని పడుకున్నావు. అందుకే పొద్దుటే దేముణ్ణి ప్రార్ధించాను, యీ రోజయినా నువ్వు లేచి నీ పనులు చేసుకోవాలని.. చెయ్యలేకపోతున్నానే తల్లీ !..” స్వగతంలా అనుకుంటూ డైనింగ్ టేబిల్ చివరగా వున్న కుర్చీలో కూలబడింది సుభద్రమ్మ.
‘ఏం మీకొడుకు షుగర్ టాబ్లెట్స్ తీసుకు రాలేదా!..” కాఫీ కప్పు అందుకుంటూ ఈసడించినట్టు ముఖం పెట్టి అడిగింది
”వాడికే ఆరోగ్యం బాగులేదు, రెండు రోజులనుండి బ్లెడ్డు చెకప్పులు అవీను, తీరికెక్కడిది..?”
”అవునులెండి. కుక్కకి పనిలేదు, తీరుబాటు లేదు..”
సూటిగా గుచ్చుకుంది ఆ వాగ్భాణం సుభద్రమ్మకి.
”అవునమ్మా! అడ్డాలలో వున్నపుడు నా బిడ్డ ల్లాగానే పెంచాను. పెళ్ళయ్యాక పెళ్ళాలు వచ్చి నా కొడుకుల్ని కుక్కల్ని చేసి గుంజకి కట్టుకున్నారు…” బాధగా అంది.
”ఓహో. పెళ్ళాలు వస్తే మొగుళ్ళు కాపలా కుక్కలయిపోతారన్నమాట, అత్తా ఒకింటి కోడలే. స్వీయానుభవం” వెటకారంగా అంది వర్ధనం.
”చెడీమంటే మంటే ఫెడీమనడం యీ కాలం వాళ్లకి అలవాటయిపోయింది..” చేసేది లేక గొణుక్కుంది తనలో తానే సుభద్రమ్మ.
”మూడు రోజుల తర్వాత ఏదో కాస్త నయంగా వుండి లేచి వచ్చాను. సతాయింపులు ప్రారంభం… అయినా అప్పలకొండ వుంది కదా. అన్ని పై పనులు చేస్తోంది. ఏదో కాస్త నలతగా వుండి పడుకుంటే ఇంటిపనంతా మీ నెత్తిన పడేసినట్టు తెగ భాద పడిపోతారెందుకూ…”
”అప్పల కొండ పైపనులు చూస్తుంది కానీ వంటింటి పనులుచూడలేదు కదా..”
”అవును. ఆచారం, చాదస్తం అంటూ నన్ను ముట్టుకోకు నామాలకాకి అన్నట్టుంటే అంతే మరి.. వంటింటి గడపదాటి రానివ్వరమ్మా పెద్దమ్మగారు అని అది గోల. అయినా చాదస్తాలు మీకేనా! మా అమ్మకీ ఆచారాలున్నాయి అయినా మనుషుల్ని మనుషుల్లా చూస్తుంది.. అవసరం అయితే పనిమనిషి వండిన అన్నం తింటుంది.. భగవద్గీత చదవగానే సరా.. పాటించోద్దు…..” విసురుగా కాఫీ కప్పు పెద్దశబ్దంతో టేబిల్ మీద పెట్టి లేచింది వర్ధనం.
”మీ అమ్మకేమమ్మా! పెట్టిపుట్టింది, మొగుడి హయాములో, పిల్లల హయాములో కూడా మహారాణి ఆవిడ.. నా మొగుడికి చాదస్తం, నేనలాగే బతికేను ఇన్నాళ్ళు, యీ చివరిరోజుల్లో ఆచారాలు వదులుకోలేను.. మీ అమ్మంత మాడ్రన్ కాదు నేను..” ఇంకా ఏదో అనబోతుంటే,
”ఎప్పుడూ మా అమ్మని చూసి కుళ్ళుకుంటూనే వుంటారు..” కోపంగా జవాబు ఇస్తూ బయటకి వెళ్లబోతుంటే వంటింటి గడప వెనక అప్పలకొండ కనిపించింది.
”వచ్చావా తల్లీ! నీ కోసమే మాటాడుతున్నాము. ఈ రోజేమిటి తూరుపు తెల్లారకుండా దిగబడ్డావు?” వర్ధని విసురు అటు మళ్ళింది.
”ఇయాల నా కూతురింటికాడ పేరంటం వుందమ్మా! నాను పనికి రాలేను, ఆ కబురు సెప్పి పోదారని..” నీళ్ళు నమిలింది..
”ఇవాళ నేను కాస్త లేవగలిగానని నీకు కూడా కబురందీసిందేమిటి? రెండు రోజులు బాగులేదని పడుకున్నానో లేదో, లేచేసరికి అందరూ కలిసి కట్టకట్టుకొని నా నెత్తిన చాకిరీ అంతా రుద్దేద్దామని.. సరే, వచ్చిన దానివి వచ్చావు, అంట్లన్నా తోమి వెళ్ళు..” విసుక్కుంటూ అంది.
”అదికాదమ్మగోరు…”
”ఏమిటే నీ నసుగుడు..?”
”నిన్న మీరు సెప్పారు కదండీ, మీ తలకి హెన్నా ఎట్టాలని.. అందుకే పొద్దుగాలే ఒచ్చీసినానండి..అంట్లు తోమమంటే తోమేసి ఎల్లిపోతా.. రొండు పన్లు సేయ్యలేనండి, టయం నేదండీ..” చెప్పేసింది అప్పలకొండ ఖచ్చితంగా.
”అంట్లు తోమక్కరలేదులే.. అవన్నీటబ్బులో వేసి మూల పడేస్తాను. రేపొచ్చి కడుగు. ఈ రోజు మా ఫ్రెండ్ ఇంట్లో కిట్టీ పార్టీ వుంది, ముందు హెన్నా పెట్టు.. అలా నా గదిలోకి రా..” అని గబగబా వెళ్ళిపోయింది.
”అదీ సంగతి. తల్లి మాలక్ష్మి బారెడు పొద్దేక్కేదాకా లేవదుకదా, ఇంతపొద్దున్నే ఎలా లేచిందా అనుకున్నాను.. కిట్టీ పార్టీ అనగానే తలనొప్పి పోయినట్టుంది, తలకి పేడముద్దలా హెన్నాపట్టించుకోని ఒక గంట గదిలోంచి వూడిరాదు. ఎలాగోలా ఏడవనీ.. ఇవాళ నాకిక ఓపిక లేదు..” అనుకుంది సుభద్రమ్మ.
అంతవరకూ అక్కడేనిలబడి అన్నీ గమనిస్తున్న ఆరేళ్ళ మనుమరాలు ప్రణతి సుభద్రమ్మ దగ్గరకి వచ్చి,
”నానమ్మా! ఒంట్లో బాగులేదా?” అంది ప్రేమగా, పెద్ద ఆరిందాలా ఆమె చెయ్యి నిమురుతూ అడిగింది.
”అవున్రా తల్లివాడూ, నిన్నటినుండి ఒకటే చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి.”
”అయ్యో! మందు వేసుకోలేదా!” జాలిగా చూస్తూ అంది.
”మందుబిళ్ళలు అయిపోయాయి. ఇవాళ మీ నాన్నకి చెప్తాలే తీసుకురమ్మని. సరే కానీ, ముఖం కడిగావా? బోర్నవిటా కలిపివ్వనా!” లేచి నిలబడుతూ ప్రేమగా మనుమరాలి తల నిమిరింది. అలాగే అన్నట్టు తలూపుతూ,
”నువ్వు కాఫీ తాగావా నానమ్మా!” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.. అలా ఆ పసి పిల్ల అడుగుతుంటే,ఆ పాప వయసు తనదిగా, తన వయసు ఆ పాపదిగా అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి చిన్నపిల్ల చూపిన ఆ కొద్దిపాటి అభిమానానికి. ఎప్పుడయినా నువ్వు తిన్నావా, తాగావా, అని ప్రేమపుర్వకంగా అడిగేది ఆ పసిపిల్ల ఒక్కతే. ఐదుగురు పిల్లల్ని కడుపారా కనిపెంచి పెద్ద చేసి ఆవీ, జీవి ధారపోసింది. తండ్రి వున్నంతకాలం తండ్రి సంపాదనని, అతను పోయాక తల్లి రెక్కల కష్టాన్ని దోచుకోవాలనుకొనే వారే, ఎలావున్నావు? అని ప్రేమమీరా అడిగేవారు లేరు. ఎంతసేపు ఇంకా ఏదో పెట్టలేదనో, చెయ్యలేదనో సతాయించేవారే కానీ యోగక్షేమాలు అడిగేవారు లేరు.
”నానమ్మా” ప్రణతి పిలుపుతో ఉలికిపడి, కళ్ళల్లో నీళ్ళుకళ్ళల్లోనే అదిమిపెట్టి,
”లేదమ్మా! నేనింకా కాఫీ తాగలేదు, నీకు బోర్నవిటా కలిపిచ్చి,నేను కాఫీ తాగుతాలే.” అని స్టవ్ దగ్గరకెళ్ళింది సుభద్రమ్మ. ఆమె బోర్నవిటా కలుపుతుంటే దగ్గర నించొని, గొంతు తగ్గించి, రహస్యం చెప్తున్నట్టు ముఖంపెట్టి
”నానమ్మా! మా అమ్మ అసలు మంచిదికాదు కదూ!” అంది.
”తప్పే. అమ్మనలా అనొచ్చా..” ప్రేమగా మందలించబోయింది. వెంటనే ఆరిందాలా జవాబు ఇచ్చింది ప్రణతి.,
”ఎందుకనకూడదూ! మరేమోనేం, నాన్నకి ఒంట్లో బాగులేదు అంటే, నాకు బాగులేదు అని మూడు రోజులు గదిలో కూర్చొని అన్నీ అక్కడికే తెప్పించుకుంటోంది. అంతా అబద్ధం. మీరెవరు చూడకపోతే అలా మొబైల్‌లో చాటింగ్ చేసుకుంటూనే వుంటుంది. ఒంట్లో బాగులేకపోతే అలా చేసుకుంటారా!”
ప్రణతి మాటలకి జవాబు ఇవ్వకుండా కాఫీ గ్లాస్‌తో వచ్చి కుర్చీలో కూర్చుంది సుభద్రమ్మ. ఆమెకి తెలుసు కోడలు మనస్తత్వం. ఇంట్లో ఎవరికయినా బాగులేదంటే ముందు తాను తలగడ మంత్రం చదువుతుంది. చిన్నపిల్లతో ఆ మాటలెందుకులే అని మౌనం వహించింది. మళ్ళీ ప్రణతి మరొక రహస్యం చెప్తున్నట్టు మెల్లగా అంది,
”నీకు తెలుసా నానమ్మా!”
ఏమిటన్నట్టు చూసింది సుభద్రమ్మ,
”రేపు మా అమ్మమ్మ వస్తుందట.”
”ఎవరు చెప్పారు.?”
”మా అమ్మ అమ్మమ్మతో సెల్ ఫోన్‌లో మాటాడుతుంటే విన్నాను.. నెలరోజులు వుంటుందట ”
”ఆవిడకి అలవాటేగా. మూడునెలలకోసారి రావడం వచ్చినపుడల్లా నెలరోజులుండడం, కోత్తేముంధీ! ఒక్క కూతురు, తల్లికి ప్రాణం కూతురంటే.”
”కానీ నాకు అస్సలు ఇష్టం లేదు మా అమ్మమ్మంటే..” చేదు మందుతాగినట్టు ముఖంపెడుతూఅంది.
”నువ్వంటే అభిమానం కదే మీ అమ్మమ్మకి..”
”అయితే..?”
”మరెందుకిష్టం లేదు.”
”ఎందుకంటే, అమ్మమ్మ వస్తోంది అనగానే నీ గదిలో నీ సామానంతా తీసి బయట హాల్లో పడేస్తుంది అమ్మ. నీ గదిలో, నీ మంచంమీద రాత్రి పగలు పడుకుంటుంది అమ్మమ్మ. నువ్వేమో హాల్లో నేల మీద పడుకుంటావు. నీకు నడుంనొప్పి. హాల్లో ఎప్పుడూ నాన్న ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు. నువ్వు వంటింట్లోకి వచ్చి, కుర్చీలో కూర్చొని, టేబిల్ మీద తలపెట్టి పడుకుంటావు. ఇవన్నీ చూస్తే నాకు ఏడుపొస్తుంది. నువ్వు మా నాన్న దగ్గర వున్నట్టు, అమ్మమ్మ మామయ్య ఇంట్లో ఉండొచ్చుగా..”
”చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అన్నారమ్మా! ఎవరిష్టం వారిది.. మనమాట ఎవడు వింటాడు, ఎవడికి లెఖ్ఖ.?
”నేను నీకొక ఐడియా చెప్పనా!”
”ఏమిటే..? ” నవ్వింది సుభద్రమ్మ.
”మా అమ్మమ్మ ఇక్కడ వున్నన్ని రోజులు నువ్వు చిన్నత్త వాళ్ళింట్లో వుండొచ్చుగా.”
”ఎందుకు?”
”ఎందుకంటే, మా అమ్మ అమ్మమ్మకి కూతురు కదా, బాగా చూసుకుంటుంది. మరి చిన్నత్త నీకు కూతురుకదా! బాగా చూసుకుంటుంది కదా!…..” ఇంకా ఏదో చెప్పబోతుంటే హాల్లోంచి కంచుగంట మ్రోగినట్టు వర్ధని గొంతు వినిపించింది.
”ప్రణీ. ఏం చేస్తున్నావే. స్కూల్‌కి వెళ్ళవా!” అనడంతో గ్లాస్ ఖాళీ చేసి పరుగెత్తింది.
మనుమరాలి మాటలకి దీర్ఘంగా నిట్టూర్చింది సుభద్రమ్మ. కొడుకు దగ్గరనుండి కూతురు దగ్గరకు వెళ్ళడం తనకి పొగలోంచి సెగలోకి వెళ్ళినట్టే, పాపం ఆ పసిపిల్లకేమి తెలుసు. అందరూ తన అమ్మ, అమ్మలాగే అనుకుంటుంది.
”ఏమిటో, ఇద్ధరాడపిల్లల్ని పెళ్ళిచేసి అత్తారింటికి పంపి, ముగ్గురు కోడళ్ళని తెచ్చుకున్నాను. అటు పిల్లనిచ్చిన చోట, ఇటు తెచ్చుకున్న చోట కూడా నేనే అణిగిమణిగిఉండాల్సి వస్తోంది. అయినా మన బంగారం మంచిది కానపుడు కంసాలిని అని ప్రయోజనం ఏమిటి? నా పిల్లలే అటు కట్టుకున్న వారికి, అత్తవారికి గులాములయ్యారు. ఏమయినా అంటే నీ పెంపక లోపం అంటారు ఆడపిల్లలు. ఆ గడుసుదనం మాకు నేర్పలేదు అంటారు. గడుసుతనం నేర్పిస్తే వస్తుందా! నాకుంటే కదా నేర్పేదాన్ని. ఏదో సత్తెకాలపు అలవాట్లు, సాంప్రదాయాలు నమ్ముకొని, ఆ మహారాజు బతికి ఉన్నతకాలం నాలుగు డబ్బులు తెచ్చిపడేస్తే గంపెడంత సంసారానికి గొడ్డు చాకిరీ చేస్తూ బతకడమే కానీ, వేరే ఆలోచనలు, బయట ప్రపంచంతో సంపర్కాలు ఉండేవి కాదు. పెళ్ళిచేసి ఆడపిల్లలు అత్తారింటికెళితే బరువు తగ్గుతుందనుకుంటే, తడిపిమోపేడు అయింది. అల్లుళ్ళు రాకలు పోకలు, ఆడపిల్లల పురుళ్ళు,పుణ్యాలు, ఇంకా లాంచనాలు బాగా జరపలేదని వియ్యాలవారి మూతి విరుపులు, ఇది ఆడ పిల్లల ముచ్చట అయితే, ఇక కొడుకుల సంగతి సరే సరి, చేతికి అందివచ్చాక ఏదోకాస్త వేణ్ణిళ్ళకి చన్నీళ్ళల సాయం చేస్తారనుకుంటే, రెక్కలు రాగానే, పెళ్లి కాగానే పెళ్ళాలతో ఎగిరిపోయారు దూరంగా. పోనీ ఎక్కడో చోట వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినా చాలు అనుకుంటే, అయినదానికీ, కానిదానికీ మా నెత్తినే. అమ్మ చాకిరీకి, నాన్న డబ్బులుకి. పెద్దకొడుకు ఉన్నాడంటే వాడొక వాజమ్మ.. పెళ్ళాం హైదరాబాదు బుల్ బుల్. ఎంతడబ్బు ఆమె సోకులకే సరిపోదు. జీతం రాగానే మొత్తం పట్టుకు పుట్టింటికి ఉడాయిస్తుంది, ఇక వీడు దేభ్యం ముఖం వేసుకొని పిల్లలిద్దర్నీ పట్టుకొని వచ్చేసేవాడు. అమ్మ,నాన్న కాదనలేము కదా! ఇక రెండవవాడు కొంచం స్థిరం లేనివాడు, ఆ నెపంతో పుట్టిల్లు అక్కడే కనుక మొగుణ్ణి ఇల్లరికం అల్లుళ్ళా లాకెళ్ళి పుట్టింటికి జీతం, బత్తెం లేని పాలికాపు చేసింది. మూడవ వాడు ఇంటి కష్టసుఖాలు వంటపట్టించుకున్నా, వాడి పెళ్ళాం, దాని తల్లి చేతిలో కీలుబొమ్మ. నోటివాటుతనం. అయినా గుడ్డిలోమెల్ల. ఆ మహారాజు వున్నంతకాలం వీధి దాటి ఎరుగను. ఏదో తెచ్చి పడేస్తే, గుట్టు చప్పుడు కాకుండా అందరికీ ఇంత వండి వార్చడమే తెలిసేది. వున్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకొనిచేసుకొని, సంపాదించినదంతా పిల్లలకే పెట్టారు, ఏనాడు తన సుఖం చూసుకోలేదు. పండగవస్తే అందరికీ బట్టలు కొనేవారు, నాకు ఉప్పాడ, గుంటూరు నేతచీరలు తెచ్చేవారు నేనవే కడతానని. తానెప్పుడు కొత్తబట్టలు కొనుక్కోలేదు. మీకు తెచ్చుకోలేదు, అంటే – ”నాకేందుకోయ్.. వున్నాయికదా!” అనేవారు. ఏమున్నాయి.? ఎప్పుడో పదేళ్ళకొకసారి రెండుజతలు కుట్టించుకొనేవారు. వాటినే జాగ్రత్తగా వాడుకొనేవారు. చెప్పులు అరిగిపోయి, కన్నాలు కూడా పడిపోయాయి. అలాగే ఆఫీస్‌కి వెళ్తే నాకు సిగ్గేసేది. కనీసం మంచి చెప్పులు కొనుక్కోండి, అంటే, పరవాలేదులే. ఇంకా కొంచం లైఫ్ వుంది నాలాగే, అదిపోతే చెప్పులయినా, మనిషినయినా పారెయ్యక తప్పదు అనేవారు. ఏమిటో..! ఏది చెప్పినా వేదంతమే.. చివరికి ఆ చెప్పులు పారేసి కొత్తవి కొనుకుందాం అనుకున్న ముందు రోజే చిక్కి శల్యావశిష్టమైన అతని అస్థిపంజరాన్ని వదిలి చిలక ఎగిరిపోయింది. అప్పటినుండి యీ చంటాడి పంచన చేరక తప్పలేదు. కోడలు పుల్లవిరుపు మాటలు, వియ్యపురాలి వ్యంగ్య భాణాలు ఒక్కోసారి బాధ కలిగించినా భరించక తప్పదు. పిల్లల దగ్గర ఇబ్బందులున్నాయని ఏ వృద్దాశ్రమానికో వెళ్ళిపోయినా, అక్కడ మాత్రం అగచాట్లు తప్పుతాయా! పిల్లల పరువు పోగోట్టడమే తప్ప ఎక్కడున్నా ఏదో రోజు యీ కట్టె కాలక తప్పదు. ఈ పాటిదానికి ఎందుకు అక్కరమాలిన ప్రయాసలు, సర్దుకుపోతే పోలా..!” స్వగతంగా తన గతాన్ని నెమరువేసుకుంటూ, మెల్లగా లేచి వెళ్ళి, స్నానం చేసి, దేముడి దగ్గర దీపం వెలిగించి వచ్చింది. ఈ లోపల కొడుకు వాసు అందరికీ ఉడిపీ హోటల్ నుండి ఇడ్లీలు తెచ్చాడు. టిఫిన్ చేస్తూ వాసుతో అంది వర్ధని,
”చూడండీ.తోటకూర పప్పుచేసి, అన్నం రైస్ కుక్కర్లో పడేసాను. భోజనం చేసేముందు తీసుకోండి.చల్లారకుండా వుంటుంది. నిన్నటి చారు, మీ అమ్మ చేసిన వంకాయకూర ఫ్రిజ్‌లో వున్నాయి,వెచ్చపెట్టుకోండి. కావాలంటే నాలుగు అప్పడాలు కాల్చుకోండి..” ఆమె మాటని తుంచేస్తూ,
”ఇంతకీ ఎందుకీ అప్పగింతలు, నువ్వెక్కడికివెళ్తావు?..” ఆమెవైపు చూడకుండానే అడిగాడు
” పొద్దున్న చెప్పానుగా.. యీ రోజు కిట్టీ పార్టీ వుంది వెళ్తున్నాను అని..”
”నిన్నటి వరకూ బాగులేదన్నావు వంట్లో….”
”అవును. నిన్నటివరకు బాగులేదు, ఇప్పుడు బాగుంది.. ఏంటట…?” తలంటుకున్న జుట్టు ఆరబెట్టుకుందికి గాలికి వదిలేసింది.. హెన్నా పెట్టిందేమో, గాలికి ఎర్ర జెండాలా ఎగురుతోంది… అది ఎడమచేత్తో సవరించుకుంటూ,
”మీ అమ్మకి కూడా బాగులేదన్నారు. అందుకే మీకు అప్పచెప్తున్నా పనులు… ” అంది.
”ఏమ్మా! ఒంట్లో బాగులేదా!” తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు.
”అవున్రా! రెండురోజులనుండి కొంచం నలతగా వుంది.”
”ఆవిడగారి షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయట.. తెచ్చి పడేయ్యోచ్చుగా…” కలుగజేసుకుంటూ అంది వర్ధని.
”అవునా! చెప్పోచ్చుకదమ్మా!” విసుగ్గా చూస్తూ అన్నాడు.
”చెప్పాన్రా, మర్చిపోయావు..”
”మరచిపోతే ఇంకోసారి గుర్తుచెయ్యాలికదా! అయినా నువ్వు తెచ్చిపెట్టొచ్చుగా, నేనేవో పనుల్లో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను..” వర్ధనితో అన్నాడు కోపంగా.
”ఇది మరీ బాగుంది. నాకు మాత్రం ఏమి తెలుస్తుంది..? ఆవిడగారు చెప్పాలిగా.. అయినా నాకు వంట్లో బాగులేదు కదా!..”
”నీకు నెలకి పాతిక రోజులు ఒంట్లో బాగుండదు.అయినా మీ అమ్మకి ఏదయినా కావాలంటే అర్ధరాత్రయినా ఆటోలో పరుగెడతావు..”
”అవును. మా అమ్మ గురించి నేను ఆలోచిస్తాను.. మీ అమ్మ గురించి మీరు చూసుకోవచ్చుగా అంత ప్రేమ వుంటే…”
”నా గురించి ఎందుకర్రా ఆ వాదులాడుకోవడం..” వారించబోయింది సుభద్రమ్మ.
”ఎందుకేమిటమ్మా! షుగర్ మాత్రలు వాడకపోతే, ఏదయినా అయితే..” నొచ్చుకుంటూ అన్నాడు వాసు..
”ఏమవుతుంది..? చస్తాను, అంతేకదా..”
”చావు పుట్టుక మనచేతిలో లేవులేండి. పిలవగానే అందరికీ పలికేయ్యవు..” హేళనగా అంది వర్ధని.
”అవునవును. రేపు నేనే చస్తానేమో, ఎవరికీ తెలుసు” విసురుగా అంటున్న వాసు మాటలకి చివుక్కుమంది సుభద్రమ్మ మనసు.
”ఎందుకురా నిండింట్లో అలాటి అపశకునం మాటలు. రేపు తెల్లారితే నీ పుట్టిన రోజు.. అలాటి మాటలు అనకు.. నా పిల్లలు, వాళ్ళ కుటుంబాలు పదికాలాలు చల్లగా వుండాలని దేముణ్ణి ప్రార్దిస్తుంటాను” అంది కళ్ళనీళ్ళతో.
”సరేలే. సాయంత్రం వచ్చినపుడు టాబ్లెట్స్ తెస్తాను” అని లేచి వెళ్ళిపోయాడు.
హాల్లో సోఫాలో కూర్చొని భగవద్గీత చదువుతున్న సుభద్రమ్మ డ్రెస్ వేసుకొని బయటకి వెళ్ళబోతున్న వాసుని చూసి,
”ఒరేయ్ నాన్నా! రేపు నీ పుట్టిన రోజుకి ఒక జత కొత్తబట్టలు తెచ్చుకోరా!” అంది వాత్సల్యంగా
”ఉండమ్మా! బట్టలంటావు.. ఇప్పుడు డాక్టర్ దగ్గరకి రిపోర్ట్లు తెచ్చుకుందికి వెళ్తున్నాను. ఏమిచేప్తాడో, ఏమో.. ట్రీట్మెంట్‌కి ఎంతవుతుందో..?” అని ఫైల్ సవరించుకుంటూ, ఎప్పుడూ లేనిది తల్లి పాదాలకి నమస్కరించాడు, ”వెళ్ళొస్తా ” అని.
చేతిలో భగవద్గీత పక్కని పెట్టి, వణుకుతున్న రెండు చేతులు అతని తలపై పెట్టి,
”శుభం జయం నాన్నా! పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నూరేళ్ళు బతకాలిరా” అంటుంటే గాద్గదిక మయింది ఆమె స్వరం.
”సరే వస్తా ” అని వెళ్ళిపోయాడు వాసు.
మధ్యాహ్నం వస్తూనే ఆనందంతో, అన్నీ నార్మల్‌గా వున్నాయని రిపోర్ట్స్‌లో వుందని చెప్పగానే సంతోషించింది తల్లిప్రాణం.. ఆరుగంటలకి వర్ధని ఫోన్ చేసింది, ఫ్రెండ్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేసుకున్నామని, బయట డిన్నర్ చేసి వస్తానని, తల్లి కొడుకులిద్దరికీ ఏదో చేసుకు తినమని చెప్పి ఫోన్ కట్ చేసింది.
”ఏమంటుంది మీ ఆవిడ..?” అడిగింది సుభద్రమ్మ
”ఏమంటుంది. తన శ్రాద్ధమేదో చెట్టుకింద పెట్టుకుంటుందట, మనిద్దర్నీ ఏదో చేసుకు తినమని బోడి సలహా..” కోపంగా అన్నాడు.
”అదేమిట్రా. పొద్దున్నుంచి అలా అమంగళకరమైన మాటలు మాటాడుతున్నావ్.. స్నేహితులతో వెళ్ళింది. వెళ్ళనీ. ఇంట్లో వరి నూక వుంది. నీకు ఉప్పుడు పిండి ఇష్టం కదా! ఐదు నిముషాల్లో చేసేస్తానులే..” లేని ఉత్సాహం తెచ్చుకొని లేచి వంటింటి వైపు వెళ్తున్న తల్లిని చూసి చిన్నగా నిట్టురుస్తూ
”అమ్మా ఇప్పుడు కూడా టాబ్లెట్స్ మరచిపోయానమ్మా! ఒక్క పదినిముషాల్లో బైక్ మీద వెళ్ళి వచ్చేస్తాను..” బయలుదేరబోతున్న వాసుతో
‘పర్వాలేదులేరా. మెడికల్ షాపు చాలా దూరం. పొద్దుటే వెళ్ళి తీసుకొనిరా.. ఇప్పుడు పొద్దుపోయింది.. ఇవాళ శనివారం అని పొద్దుట కొబ్బరికాయ కొట్టాను దేముడి దగ్గర. ఒక చిప్ప కోరిపెట్టు, ఉప్పుడుపిండిలో వేస్తే బాగుంటుంది. నేను కోరలేను. చేతులు వణుకు..” అని వంటింట్లోకి వెళ్ళిందామె..
”అదికాదమ్మా!..” అని ఏదో అనబోయి, సరేలే, ఆ పని అయ్యాకనే వెళ్ళొచ్చు..” అనుకున్నాడు.
వేడి వేడి ఉప్పుడుపిండిలో మాగాయి వేసుకొని తింటూ,
”ఉప్పుడు పిండి చెయ్యడంలో నిన్ను మించినవాళ్ళు లేరమ్మా!” అన్నాడు వాసు రుచిని ఆస్వాదిస్తూ.
ఆ చిన్న పొగడ్త ఆ తల్లి మనసుకి అక్షర లక్షలు అనిపించింది. పిల్లలికి మనసారా చేసి, కడుపారా తినిపించడంలో వున్న ఆనందం ఇక దేనిలో లేదనిపిస్తుంది ఆమెకి. వాసు పొగడ్తకి మనసు ఆర్ద్రమయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకో ఉదయం నుండి పదే పదే కళ్ళల్లో నీళ్ళు. మనిషి, మనసు బలహీనమయితే కళ్ళల్లో నీళ్ళు చిందుతాయేమో.
”అమ్మా! నువ్వు కూడా తినేయ్యి.. లేటయితే అరగదు ”
”లేదురా! రాత్రి ఏమి తిన్నా అరగదు. బ్రెడ్ ఉందిలే.. రెండు బ్రెడ్ ముక్కలు పాలతో తీసుకుంటాను” అందామె.
”సరే నీ ఇష్టం” అని వాసు తినడం ముగించి హాల్లోకి వెళ్ళాక చంటిదానికి కూడా అన్నం కలిపి పెట్టి, వంటింటి పని ముగించుకొని వచ్చి తనగదిలో కూర్చుంది.. పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. టివిలో క్రికెట్ ఫైనల్ మాచ్ చూడడంలో మునిగిపోయాడు వాసు. ప్రణతి తోమ్మిదికే నిద్రపోయింది. పదిన్నరకి తిరిగివచ్చిన వర్ధని భర్త ముభావం చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది తిన్నగా.
పన్నెండు దగ్గరవుతోంది. హాల్లోకి వచ్చింది సుభద్రమ్మ… క్రికెట్ నడుస్తోంది, కునుకు పాట్లు పడుతున్నాడు వాసు. టివి ఆపబోతే ”వుంచమ్మా..చూస్తున్నాను” అన్నాడు విసుగ్గా.
ఒంటిగంట దగ్గరలో ”వాసు,వాసూ..”అని కొంచం గాభరాగా పిల్చింది సుభద్రమ్మ. వెంటనే చెవినిపడింది, లోపలి వెళ్ళాడు.
”వాసూ.. గుండెల్లో గాభరాగా వుందిరా. కొంచం పంచదార కలిపిన నీళ్ళు తెస్తావా!” అడిగింది గుండెలమీద చేత్తో రాసుకుంటూ.
”ఖాళీ కడుపు. చెప్తే వినవు సరిగా తినలేదు..” మాట పూర్తి కాకుండా
”ఉత్త మంచినీళ్ళు కాదురా. పంచదారనీళ్ళు తీసుకురా..” బాధగా వుందామె ముఖం.
”షుగర్ కదమ్మా!..” ఏదో అనబోయి మరేమీ అనకుండా లోపలి వెళ్ళి పంచదార కలిపిన నీళ్ళు తెచ్చిఇస్తూ,
”ఇదిగో అమ్మా!”అని అదించబోతే
”ఉండు.. వాంతి వచ్చేలా వుంది” అని లేచి నిలబడిందామె. ఆ సవ్వడికి వర్ధని కూడా లేచి వచ్చి ”ఏమయింది?” అడిగింది.
”అమ్మకి వాంతి వచ్చేలా వుందట. అలా చెయ్యిపట్టుకోని తీసుకెళ్ళు” అన్నాడు.
”తిన్న ఉప్పుడు పిండి అరిగి వుండదు..” నిర్లక్ష్యంగా అంటున్న భార్యని చూస్తూ ఉగ్రుడయ్యాడు.
”నోరు ముయ్యి. అమ్మ ఏమీ తినలేదు..” అంటూ
”రా అమ్మా!” చెయ్యి పట్టుకోబోయిన వాసు చేతిని సున్నితంగా తొలగించి, అతని ముఖంలోకి చూసింది.. మూసుకుపోతున్న ఆమె కళ్ళల్లో ఏవో విషాద చాయలు, ఎప్పుడూ వెలుగొందుతుండే ఆమె వదనంలో ఏవో నీలి నీడలు. మెల్లగా బయటకు వచ్చింది. వీధి గుమ్మంలో కూర్చోని వాంతి చెయ్యబోతే, రాలేదు.. కేవలం వాంతి అయిన ఫీలింగ్. లేచి నిలబడగానే, పక్కనే వున్న వాసు తల్లికి చెయ్యి అందించబోయాడు. అందుకోకుండా పక్కనే కూర్చొని వాంతి రాకపోయినా ఒవ్, ఒవ్ అంటూ పీండ్రించుకుంటున్న వర్ధనిని చూపించి,
”ఎవరికయినా వాంతి వస్తే మీ ఆవిడకి కూడా కడుపులో వికారం ప్రారంభం అవుతుందని నీకు తెలుసు కదరా.. ముందు ఆమెని చూసుకో ” మెల్లగా, నిర్లిప్తంగా అని వెళ్ళి వసారాలో వున్న కుర్చీలో కూలబడింది. అలా కూర్చొని తలని వెనక్కి వాల్చింది. కుర్చీ వెనుక నిలువెత్తు శ్రీనివాసుడి చిత్రం వుంది. వెనక్కి వాలినపుడు ఆమె తల శ్రీనివాసుని పాదాలకు అనుకుంది. ముఖంలో ఏదో ప్రశాంతత. సేద తీరినట్టు కనిపిస్తున్నఆమె పెదవులపై కనీకనిపించని చిరునవ్వు. తల్లి ప్రశాంతవదనాన్నిచూస్తూ సంతోషంగా
”ఎలా వుందమ్మా!” కుర్చీ వద్ద కూర్చొని, ఆమె మోకాళ్ళపై చెయ్యివేస్తూ అడిగాడు, ఆ స్పర్శకి ఆమె తల పక్కకి వాలిపోయింది. అది చూస్తూనే ఒక్క వుదుటన కంగారుగా లేచి పిలిచాడు, ఉలుకు, పలుకు లేదు. అప్పటికే యీ అలజడికి పక్కపోర్షన్ వాళ్ళు వచ్చారు కంగారుగా. పక్కింటి అబ్బాయితో, ”ఒక్కనిముషం చూస్తుండు బాబు, నేను డాక్టర్ని పిల్చుకోస్తాను” అని వాసు వెళ్లబోతుంటే,
”మీరుండండి అంకుల్, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను, ఎదురిల్లే కదా!” అని పరుగెత్తాడు.
డాక్టర్ వచ్చి పరీక్షించి, ప్రాణం పోయి పదినిముషాలు అయిందన్నాడు.
”అమ్మా!” ఒక్కసారి భునభోనాంతరాలు దద్దరిల్లేలా అరిచాడు వాసు.
”అత్తయ్యా !”అని రాగం అందుకుంది వర్ధని కూడా .
”అమ్మా! ఎంతపని చేశావమ్మా!” తల్లిని కుదుపుతూ పిచ్చివాడిలా రోదిస్తున్న అతన్ని పక్కింటి వాళ్ళు ఓదార్పుగా వెనక్కి తీయబోతే విదుల్చుకొని
”ఎందుకమ్మా! ఎందుకమ్మా! ఇంత శిక్ష వేసావు. ఇంత త్వరగా వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావమ్మా! నాకు తెలుసు.. నాకు తెలుసమ్మా! తప్పంతా నాదే. ఒక్కరోజు కూడా నీ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. ఎలా వున్నావని అడగలేదు, షుగర్ మాత్రలు అయిపోయినా, నువ్వు చెప్పినా నిర్లక్ష్యం వహించాను. సరయిన సమయంలో నీకు మందులు అందిస్తే యీ ఘోరం జరిగేదా!. అందుకే కదమ్మా నన్నిలా శిక్షించావు… నన్నుక్షమించమ్మా!” దేవతా విగ్రహంలా అచలంగా వున్నఆమె ఒడిలో తలపెట్టుకొని గుండెలు అవిసేలా ఏడ్చాడు. ఆ కుదుపుకి కుర్చీహాండిల్ పై నున్న చెయ్యి జారి అతని తలపై పడింది ఆశీర్వదిస్తున్నట్టు. ఉలిక్కి పడ్డాడు, చలనం వచ్చిందా అమ్మలో అనుకున్నాడు. కానీ అదే నిర్జీవమైన చిరునవ్వు..
”నా ఆయుర్దాయం కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బతకమని నన్నాశీర్వధించి, నీ ఆయుస్సు నాకు ధారపోసావా అమ్మా! జన్మనిచ్చావు,బతుకునిచ్చావు. మా కోసం అష్టకష్టాలు పడ్డావు. నా కష్టాల్లో నీ బంగారం అంతా నాకిచ్చి ఆదుకున్నావు. ఇన్ని చేసిన నీకు నేనేమి చేసాను..? నీ పిల్లల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే, నీ గుండెల్లో గునపాలు దిగినంత విలవిల్లాడేదానివి. కనీసం ఒక్కరోజు ఎలా వున్నావని అడగలేదు. చివరి క్షణం వరకూ నిన్ను బానిసలా ఉపయోగించుకున్నాము. ఆ కోపం ఇలా తీర్చుకున్నావా అమ్మా! నన్ను క్షమించవా!”
అతని హృదయ విదారక రోదనకి చుట్టుపక్కల వారి కళ్ళు సంతత ధారాపాతాలయ్యాయి. ఆమె సజీవంగా వున్నపుడు అతని మాటలు విని ఎలా స్పందించేదో మరి, ఆత్మ సత్యమైతే అది ఇంకా అక్కడే పరిభ్రమిస్తుంటే, కొడుకు రోదనకి మరల తన శరీరంలో ప్రవేశించి కన్నీరు తుడిచి ఒదార్చాలనుకుంటుందా! లేక పోనీ ఇప్పుడయినా తల్లి విలువ తెలుసుకున్నాడని సంతోషించి శాంతిగా పై లోకాలకి విశ్రాంతి కోసం తరలిపోతుందా!