గతించని గతం-8

0
3

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]”నా [/dropcap]పేరు వేణుగోపాల్, నేను లెక్చరర్‌ని. నాకు జయను వివాహం చేసుకోవాలని ఉంది. మీరు అనుమతించి మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో వచ్చాను” అన్నాడు పిల్లవాడు పాఠం ఒప్పచెపుతున్నట్టు.

మా నాన్న అవాక్కయ్యాడు. చేతనున్న పేపర్ మంచం మీద గిరాటేసి “మొదట నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో” అన్నాడు.

వెళ్ళిపోయాడు. కనీసం వెనక్కు కూడా తిరిగి చూడలేదు.

వేణుగోపాల్ దైర్యం, ముక్కుసూటితనం, అతని ప్రవర్తనా నాకెందుకో ముచ్చటగా అనిపించి అతనిపై ఆసక్తి ఇంకొంచం పెరిగింది.

ఆ తరువాత మామిడి తోటలో మొదలైంది మా ప్రణయం. నేనొక నెల రోజులు ఉపేక్షించి చూసినా అతనిపై మా నాన్నకు మంచి అబిప్రాయం కలగలేదు. అయినా మా బంధం విడదీయరానిదిగా బిగుసుకుపోయింది. రాను రాను ప్రతిరోజూ అతన్ని కలిసి క్షణం కోసం వెంపర్లాట మొదలయ్యింది. పరీక్షలు మొదలయినవి. సంతృప్తిగా రాసాను.

ఒకసారి తోట చివర వేణుగోపాల్ ఎదురయ్యాడు, దగ్గరకు వచ్చి “జయా ఆగు” అన్నాడు.

ఆగాను.

“మనం వెళ్లి పోయి పెళ్ళాడి వచ్చేద్దాం. వచ్చాక ఆయనే ఆశీర్వదిస్తారు” అన్నాడు.

నాకంతగా నచ్చలేదు. అట్టాగని ప్రేమా తగ్గలేదు,

చివరకు నా కొత్త ప్రేమ కోసం నా శ్రేయస్సే తన బాధ్యతగా భావించి నా కోసం అన్ని సుఖాలను వదులుకున్న కన్న తండ్రిని వదిలి వేణుగోపాల్‌తో ఊరిని వదిలేసాను.

వయస్సులో ఉన్న అనేకమంది చేసే తప్పే ఇది.

బొంబాయి చేరుకున్నాము. ఆ మరునాడే పెళ్లి చేసుకుందామనుకున్నాము. మంచి ముహూర్తం చూసి నిర్ణయం చేసుకుని వస్తానని వెళ్ళాడు వేణుగోపాల్. వచ్చాడు. మాటాడి, వచ్చి ఉంటాడనుకున్నాను. పది రోజులు ఇలా మాటాడుకుంటూనే ఒళ్ళు మరిచి బొంబాయి అంత తిరిగాము. వేణుగోపాల్ నిర్ణయించి చెప్పిన పెళ్లి తేదీ రేపే. ఇద్దరు సాక్షులతో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్ళాలి.

ఆవేళ సినిమాకి వెళదామన్నాడు. వెళ్ళాం.

సగం సినిమా అయ్యాక ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. సినిమా అయిపోయింది రాలేదు. కొద్దిసేపు చూసి మేముంటున్న బస దగ్గరకు వెళ్లాను. వేణుగోపాల్ అక్కడా లేదు. నేను చేయగలిగినది ఏమీ లేక వస్తాడేమో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను.

రెండు దినాలు చూసినా రాలేదు. నేను కనిపించకపోతే చనిపోతానన్న వేణుగోపాల్ నన్ను బొంబాయి నగరానికి అప్పగించి వెళ్ళిపోయాడు.

నా బ్రతుకున మొదటిసారి దిమ్మరపోయాను. నాన్న అతన్ని ఎందుకు అనుమానించ గలిగాడన్నది మాత్రం అర్థం కాలేదు. మెడనున్న ఒంటి పేట గొలుసును నగల డబ్బాలో వేద్దామని తెరిచాను. గుండె జల్లుమన్నది. కళ్ళు తిరిగినవి. నిస్సత్తువ కలిగి అక్కడే కూలబడిపోయాను. డబ్బా అడుగున నా నగలకు బదులు ఒక కాగితం కనిపించింది. నా ప్రియాతి ప్రియమయిన నా ప్రియుడు రాసిన ప్రేమలేఖ అది.

“జయా.. నేను వెళుతున్నాను. ఇక నీకు కలవను. స్వర్గం అంటూ ఉందో లేదో నాకు తెలియదు కానీ… నువ్వు ఇచ్చిన అనుభవం ముందు అది దిగదుడుపే. ప్రేయసీ ప్రియులు సుఖాలను అనుభవించడం సహజం. ఋణానుభంధాలు ఇందులో ఉండవు. మీ నాన్నకు నువ్వంటే ప్రాణం. నిన్ను క్షమించి ఆదరించగలడనే నమ్మకం నాకుంది. మంచి వరుణ్ణి వెతికి పెళ్లి కూడా చేయగలరు. నీ జీవితం బాగుపడాలంటే వెంటనే వెళ్ళిపో” అని ఉంది.

ఇది వాడు రాసిపెట్టిన ఉత్తరం. నేనా రోజు నిజంగా నిజంగా ఉన్మాద స్థితికి చేరుకున్నాను.

నేను చాలామంది చెడ్డవాళ్ల గురించి గురించి విన్నాను. కొందరిని చూసాను కూడా. కానీ మంచివాడిగా కనిపించిన ఇంతటి కిరాతకుడ్ని నేడే చూసాను. అసలిలాంటే మనుషులు కూడా ఉంటారా? అనేది అర్థం కాక రెండు మూడు రోజులు ఏడ్చాను.

ఏమిటి? ఎందుకు? అని అడిగేవారు లేరు కదా.

ఎక్కడికెళ్ళాలి?

ఎలా బ్రతకాలి?

బతికేందుకు ఆసరా ఎలా?

నాన్న దగ్గరకు వెళితేనో?

అసలాయన పాదాలను తాకే అర్హత నాకుందా?

అపురూపంగా పెంచినందుకు ఆయనకిచ్చిన మనస్తాపం, మనిషిగా క్షమించగలిగేదేనా?

స్థిమితంగా ఆ మరునాడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. చచ్చినా – బ్రతికినా బొంబాయి లోనే. ఆ నిశ్చయంతోనే బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

నా నిశ్చయానికి మొట్టమొదట ఆసరా అయిన వాడు నరేంద్ర సింగ్. వృత్తి రీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్. ఎక్కువ బాగం తిరుగుతుండేవాడు.

ఏమనుకున్నాడో ఏమో? నన్ను తనంతట తానే పలుకరించాడు.

పలికాను. కులికాడు జుట్టు సర్దుకుంటూ……

నేను మాటాడక నడుస్తుంటే నా గది దాకా వెంట నడిచాడు.

తలుపు తీసి కూర్చోమని సానుభూతి కోసం చూస్తూ నా పరిస్థితి చెప్పాను.

నిల్చున్నాడు. వెళ్ళిపోతాడనుకున్నాను.

తలుపుల దాకా వెళ్లి బేడెం వేసి వెనకకు మళ్ళాడు.

తోడేలు కనిపించింది వాడి కళ్ళలో.

నేను జాగ్రత్త పడబోయే అంతలో నన్ను పశుబలంతో కింద పడవేసే రాక్షసంగా ఆక్రమించుకున్నాడు, నా నిస్సహాయతే అతనికి ఆ శక్తిని ఇచ్చినట్టనిపించింది. చేష్టలుడిగిన దానినయిపోయాను.

ఐదొందల రూపాయలు అక్కడ పడవేసి వెళ్ళిపోయాడు. ఆ డబ్బును తాకేందుకు కూడా నాకు జుగుప్ప అనిపించింది. నాపై నాకు అలవిమాలిన రోత, అసహ్యం అనిపించింది. వాడిచ్చిన నోట్లను అగ్గిపుల్ల గీసి తగలెట్టాను. దీన్నుంచి తేరుకుంటుడగా మా పరీక్షా ఫలితాలొచ్చాయి. కష్టపడి చదివాను కనుక మొదటి తరగతిన ప్యాసయ్యాను.

ఆ రోజే నేను ఆడవాళ్ళు మాత్రమే ఉండే సత్రంలోకి మారాను. నా డిగ్రీ నాకు కొంత దైర్యాన్ని ఇచ్చింది.

నా సర్టిఫికెట్లను ఏదో పద్ధతిన తెప్పించుకుని ఉద్యోగాన్వేషణ మొదలెట్టాను. నేనా అన్వేషణలో ఉన్న తరుణంలో సత్రానికి ఆజుబాజుల్లో ఉండే ‘దూబే’ అనే అతనితో పరిచయం కలిగింది. వీడు పక్కా వ్యాపారస్తునిలా కనిపించాడు. కనిపించడం కాదదే.

నా అవసారాన్ని గుర్తించి డబ్బెమయినా కావాలా అని అడిగేవాడు. అంతటి తెలివిమంతుడు.

మనిషి లిబరల్‌గా సరదాగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ వాడు మోసగాడే అని త్వరలోనే అర్ధమయ్యింది.

ఇలా బతుకంతా నమ్మడం మోసపోవడమేనా? అని చిరాకనిపించింది. అయితే వీడి పరిచయం వల్ల నాకో మేలు జరిగింది. అందుకే వాడు ఎంత ఎదవయినా పలకరిస్తే పలికే దానిని. లేకుంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఎంతటి ఆకలిని చూడాల్సి వచ్చేదో? అది నన్ను ఎంతటికీ దిగాజార్చేదో?

ఆకలి.

దీనిలోని అక్షరాలు మూడే అయినా…. నాకవంటే తగని భయం. జంకు.

నిజానికి ఇదో భయంకరమయిన పదం. ఈ పదం యొక్క స్థితిగతులను గమనించేందుకు దాని ఆర్తిని తీర్చేందుకు… ఈ ప్రపంచాన ఉన్న భూమినంతా పంట పండించినా చాలదు.

ఏదో ఒక చోట ఎప్పుడు విడవక అలుపెరగక విలయతాండవం చేసి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుతూనే ఉంటుంది.

ఈ ఆకలి సృష్టించిన ముద్దు బిడ్డ డబ్బు.

డబ్బు పైన ఈ మనిషికున్న వ్యామోహానికి, కాంక్షకి, తనివి తీరని తనానికి, తిరిగి ఆకలి చెలరేగుతూనే ఉంటుంది. అందుకే ఊహించనంత ధనముండి, ఇందనముండి, దాన్యం సమృద్ధిగా ఉండి… ఆకలి చావులు మనకళ్ళ ముందు కదలాడతవి.

అంటే ఆకలికి చావులేదు. ఆకలిని ఈ కలి చంపలేదు.

దీన్ని పరిష్కరిస్తామని, రూపుమాపుతామని, అనేక రకాల అర్థశాస్త్రాలు నిజాలు అజాలు, అనేకం ముందుకు వచ్చినవి. వస్తున్నవి. ఎదురెల్లినవి. వెన్ను చూపినవి, ఆకలి ముందు ఓడిపోవడం మినహా శరణం నాస్తి.

ఈ ఆకలి ఫలితంగా నేనేమయిపోయేదానినో ఊహకి అందదు.

బొంబాయి నగరానికి నిత్యం వస్తుండే కొత్తవారిని దగ్గరుండి ఎలా మోసగించాలో నేర్పించాడీ వెధవ.

మాట తానుగా నిల్చుని నాలుగైదు పార్టీలను చీట్ చేయించాడు. ఆ తరువాత నేను అతన్నుంచి వేరయాను. నా అదృష్టమేమో కానీ… దూబే నా నుంచి కమీషన్ తీసుకోవడం తప్ప నా శరీరాన్ని ఎన్నడూ ఆశించలేదు.

దిక్కు మాలిన అది ఏదయినా సరే ఆపాటునే అలవాటు పడ్డాను. ఒక సారి అనుకోకుండా పోలీసులకి చిక్కాను. నా మాట తీరు, తద్వారా నాలో కనిపించే సంస్కారం నా అందమూ నన్ను రక్షించినవి. ఇన్‍స్పెక్టర్ మంచివాడు అవడాన నేను చెప్పింది నమ్మి నా పట్ల జాలిపడి పంపేశాడు.

ఇంతలో నర్సుల కోసం దరఖాస్తులు కోరినట్టు పేపర్‌లో వచ్చింది. అప్లై చేసాను. పరీక్ష పెట్టారు. నాకు దొరికింది.

ఈ పాపిష్టి బ్రతుక్కి ముగింపిచ్చి దాన్లో చేరిపోయాను

కొత్త మనుషులు, కొత్త వాతావరణం, పద్నాలుగు నెలల ట్రైనింగ్ కోర్స్ కూడా పూర్తి చేసాను. ఈ కాలంలో నాకు ముగ్గురు తోటి ట్రైనీలు బాగా దగ్గరయ్యారు. ట్రైనింగ్ టైంలో మేము చూస్తున్న హాస్పటల్లకు మెడికల్ విద్యార్థులు తరచుగా రోగులను చూసి నేర్చుకునేందుకు వచ్చి పోతుండేవారు. వాళ్ళ వెంట ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన పేరు డాక్టర్ గార్గి. కొంచం టిపికల్‍గా కనిపించేవాడు. చాలా కష్టమయిన కేసయితేనే ఆయన్ని పిలిచేవారు.

ఒకసారి రవీంద్ర అనే రోగి దగ్గర గార్గికి సహాయకురాలిగా నేనతనితో ఉన్నాను. ఇక రోగి రవీంద్ర – చూసేందుకు చాలా ఆరోగ్యంగా కనిపిస్తాడు. సాయంత్రపు వేళ మరీ ఉత్సాహంగా కనిపిస్తాడు. అతని జబ్బేమిటో నాకర్థం కాలేదు కానీ… పేషంట్‌గా చేరిపోయాడు ఆసుపత్రిలో. బయటకి వచ్చాక నేను గార్గి సాబ్‌ను అడిగాను, అతని జబ్బేమిటో తెలుసుకోవాలనిపించి. గార్గి నవ్వి నావైపు ఆసక్తిగా చూసి “ఇది చాలా చిత్రమయిన జబ్బులే” అన్నాడు.

చెప్పమని అడిగాను ఈ సారి రిక్వెస్ట్ చేస్తూ.

“అతనికి గుండెనుంచి సన్నగా నొప్పి మొదలవుతుంది, కానీ గుండె జబ్బు కాదు. అది భుజాల నుంచి మెలితిరిగి చేతి బొటన వేలిదాకా వచ్చి అక్కడ సలపడం మొదలౌతుంది. ఆ బాధ పదినిముషాల దాకా తగ్గదు. ఈ పది నిముషాలు తట్టుకోవడం అతనికి కష్టమయిపోతున్నది. కేకలేస్తాడు. లేచి పరిగెడతాడు. ఒకరిద్దు పట్టుకున్నా ఆగడు. కిందపడి చేయి పట్టుకుని మెలికలు తిరిగిపోతాడు. నిజంగా ఆ బాధ చూడలేము. అంతటి దయనీయమయిన స్థితిన కనిపిస్తాడు. ఇక ఇది ఒకసారి వచ్చిందంటే నాలుగైదు రోజులదాకా మళ్ళీ రాదు. ఈ నాలుగు రోజులు అతను పేషంట్ కాదు. అతనిలో ఏ అనారోగ్య లక్షణాలు కనిపించవు” చెప్పాడు.

ఐతే దీన్ని దీర్ఘకాలం పరీక్షించిన తరువాత బొటన వేలును ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు గార్గి.

“బొటన వేలు ఆపరేషన్ అవసరమా?” అడిగాను, తెలియక.

“అవసరమని కాదు. అతనికి ఉపశమనం దొరుకుతుందేమో” అని అన్నాడు.

ఆ తరువాత రెండు రోజులకు ఆపరేషన్ జరిగింది. డ్యూటీ మారిన డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదపు అంచుకు చేరుకున్నాడు.

నిజానికి ఆపరేషన్ తరువాత ఉత్సాహంగా కనిపించాడు. అప్పుడు ఏ రకమయిన నెప్పి లేదు కనుక రఫ్‌గా ఉన్నాడని చెప్పవచ్చు. పక్కనున్న వారితో సరదాగా మాట్లాడాడు.

ఆ మరునాటి ఉదయం డ్యూటీకి వెళాక రవీంద్రను పలకరిద్దామని అతను బెడ్ వద్దకు వెళ్లాను. ఎడంగా ఉంది. పిలిచాను, పలకలేదు. పరీక్షగా చూసాను. మాములుగా ఉండే కదలిక కనిపించలేదు. అనుమానంగా వెళ్లి చూసాను. కళ్ళు ఎటో చూస్తున్నట్టుగా ఉన్నావి, రెప్పలు వాలడం లేదు. చేయి పట్టుకుని చూసాను. ప్రాణం లేదు. డాక్టర్ దగ్గరకు పరిగెత్తాను.

డాక్టర్ల సంభాషణల్లో ఆపరేషన్‌లో జరిగిన పొరపాటు ఏమిటో అర్థమయ్యింది. పోస్ట్‌మార్టంలో తెలిసినా బయటకు రానివ్వలేదు. గార్గి పైన అంతులేని అసహనం కలిగింది. వారి మధ్య ఏదో బాంధవ్యం అని తెలిసింది. గార్గి దూరంనుంచి కనపడినా నా వంట్లో కంపరం మొదలయ్యేది. అక్కడినుంచి గార్గిని ఎటయినా పంపడమో చేయాలనిపించేది. ఒకసారి అతని గదిలోకెళ్ళి అవమానించాను కూడా. అది మనసులో ఉంచుకుని గార్గి నాపై మరో డాక్టర్‌ని ప్రయోగించాడు. అతని టార్చర్ భరించలేక చెప్పిడిచి మీదకెళ్ళాను. ఆలోచిస్తే అక్కడ ఉండటం మంచిది కాదనిపించింది. ఉద్యోగం మాని బయటకి వచ్చాను. మళ్ళీ ఏం చేయాలనే ప్రశ్న. నన్ను ప్రాణంగా ప్రేమించి పెంచిన నా తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చేవాడు. తలచుకుని ఏడవడం తప్ప ఏమి చేయగలను. కానీ…. ఎందుకో నేను పుట్టిన ఊరికి మాత్రం వెళ్ళబుద్ధి కాలేదు. ఆయన  మాత్రం మనసు నుండి కదిలేవాడు కాదు.

ఇలా చెప్పుకుంటూ పోతోంది జయ. నేను తననే చూస్తూ వింటున్నాను…

ఆవిడ ఒంటరి పోరాటం వింటున్నాక ఇంకా గౌరవం పెరిగింది. తొలి జీవితాన పడ్డ ఒక్క తప్పటడుగు పూర్తి జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా కాటేసింది.

ప్రేమించడం తప్పయితే జయ చేసింది తప్పే. ఏ మనిషి జీవితాన అయినా ఇటువంటి ఆటుపోటులు తప్పవేమో?

“జయా…. మరి ఈ ఉద్యోగం ఎప్పటినుంచి?” అడిగాను.

“నిన్ను మోసగించినప్పటి నుంచి.”

“ఏం?”

“నీలో అమాయకత్వం కనిపించినా మోసగించాను కదా..! ఆ తరువాత అనిపించిది బ్రతుకును మంచి మార్గంలోకి మలుపుకుందామని, ఎంతో కొంత కష్టానయినా సహించి. అది మొదలు ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. ఫలించింది కూడా. నా కాళ్ళ మీద నేను నిలబడి ఇప్పుడు స్థిమితంగా నడుస్తున్నాను” అంది.

ఆ తరువాత నేను ఏమి ప్రశ్నించలేదు.

ఇంతలో ఎవరో అమ్మాయి ఇంటి ముందు నుంచి వెళ్ళడం కనిపించింది.

ఆమెను చూపి “ఆ వెళుతున్న అమ్మాయిని గమనించావా? నాకు ఈ మధ్యే తెలుసు. ఆ పిల్ల పేరు రవళి. చదువు పది దాటలేదు. దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. గుడిచేటి వారు అంటారట వీరిని. శతాబ్దాల ముందు పవిత్రమయిన దేవదాసీలుగా ఆలయ సేవన నియమితులయ్యారు. కాలక్రమాన వీరిని దేవాలయాలు వదిలేసినవి. భుక్తి కోసం శరీరాన్ని అమ్ముకోవడం ప్రారంబించారు. వీరికి భర్తలుండరు. పిల్లలుంటారు. రవళి చేస్తుంది అదే వృత్తి, బ్రతికేందుకు ఇంత తిండి కావాలి కదా!

ఇక్కడ వింత విషయముంది. ఒకసారి ఒక ధనికుడిలాంటి వాడు ‘రావాలా?’ అని అడిగాడట ఎదురుగా వచ్చి. తను నిలబడింది బేరాల కోసమే కనుక తల ఊపింది, వచ్చాడు. ఆవిడ దగ్గర అనుభవాన్ని పొందాడు. లేచి వెళ్ళే ముందు డబ్బియ్యమన్నాడట. తనకు ఇవ్వాల్సింది పోయి ఇదేమిటని బిత్తరపోయింది.

‘ఏయ్. అట్టా చూస్తావే? నా రేటు రోజుకు నాలుగు వేలు’ అన్నాడట. మరీ అయోమయాన పడింది. అప్పుడు చెప్పాడట ‘నేను మగ వేశ్యను. నన్ను ఈ మధ్య ఒక జమిందారిణి తీసుకెళ్ళి రెండు రోజులుంచుకుని పదివేలిచ్చి పంపింది’ అనగానే హతాశురాలాయి కూలబడి పోయిందట.

‘మా లాంటి వారు మీలానే పెద్ద నగరాలలో ఉంటున్నారు’ అనగానే ‘నా దగ్గరేముంది, నీవిస్తావని వచ్చాను’ అందట నెమ్మదిగా.

ఛీ అని కసిరికొట్టి ‘తెలుసుకోకుండా ఎందుకు పిలిచావ్?’ అని నెత్తిపై ఒకటి కొట్టి వెళ్ళిపోయాడట.

ఒకసారి కలిసినప్పుడు ఈ సంగతి చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఇది నిజం. వ్యభిచారం మాన్పించే కృషి ఒకపక్క జరుగుతుంటే… బొంబాయిలో ప్రభుత్వం దీనికి అనుమతి పత్రాలిస్తుంది. పాలకులు ఎందుకు చేస్తున్నారో తెలియదు” అని ఆగింది.

***

ఆ రాత్రి చాలాసేపు నిద్ర కరువయింది. వాలు కుర్చీలో పడుకుని ఆలోచనల్లో జారాను. నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. నిద్ర లేచాక జయమాలి మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. కన్నీటి చారికలు ఆవిడ చెక్కిళ్ళపై జారి ఎండి కనిపించినవి.

ఇంత బాధను మనసునిండా దాచుకుని మాములుగా ప్రవర్తించడం కష్టం.

“జయా….” అని పిలిచాను.

నా పిలుపు నాకే కొత్తగా, చిత్రంగా అనిపించింది. ఉలిక్కిపడి లేచింది. నన్ను గట్టిగా పట్టుకుని లేచింది. గోడ గడియారం వంక చూసి గబుక్కున వదిలేసింది. లోనకు నడిచింది.

జయ స్నానపానాదులు పూర్తి చేసి, బయట అడ్డంగా కూర్చుని ఉన్న నన్ను చూసి “ఇహ లేచే పనిలేదా?” అంది నవ్వుతూ. ఆవిడ మొహంలోకి ప్రసన్నంగా చూడటం మినహా ఏమి చేయలేకపోయాను.

“సత్యాగ్రహం ప్రాక్టీస్ చేస్తున్నావా ఏమిటి? ఇప్పుడు ప్రయోజనం లేదబ్బా, బాగా అవుట్ డేట్ అయింది” అంది నవ్వుతూ.

“అదేం లేదు” అని లేచాను.

“నన్ను స్కూల్ కి వెళ్ళమంటావా?” అడిగింది.

“జయమాలా..”

“మౌనవ్రతం పూర్తయ్యిందన్న మాట!”

“ఇలా కొంచం దగ్గరకు రా.”

వచ్చింది.

“ఎంత కాలం ఇలా ఒంటరిగా ఉండగలవ్?”

“జంట దొరకాలి కదా? అంది నవ్వి.

నెత్తిన నెమ్మదిగా మొడుతూ “ఇదడగడానికా, పిచ్చిమొద్దూ” అని వెళ్ళిపోయింది.

ఆ నవ్వున ఎంతటి స్వచ్చత. మొత్తం సృష్టినే సమ్మోహన పరచగలదని అనిపించింది.

“నీకు తోడుగా ఉండే ఉండే అర్హత నాకుందా?” అని అడిగా నొకసారి.

అయోమయంగా చూసింది. నేనుగా లేచి జయ దాపునకు నడిచి ఆవిడ చేతులను నా చేతుల్లోకి తీసుకుని “తోడుగా ఉంటానేం…!” అని అడిగాను.

ఆవిడ మొహాన మేఘాలు అలుముకున్నాయి.

“అందని దానికోసం నేను ఎదురు చూడను. అసలు కోరుకోను” అన్నది

జయమాలకు ఇంకా దగ్గరయ్యాను.

అభ్యంతరమూ చెప్పలేదు… దూరంగా జరగలేదు. కానీ అసహనంగా అనిపించింది.

“మనం కలిసి ఉందాం” అన్నాను మళ్ళీ.

ఈ సారి నా కళ్ళల్లోకి చూసి మరీ దగ్గరయ్యి గుండెమీద అర క్షణం తల ఉచింది.

“నన్ను నమ్ము” గొణిగాను.

“నమ్మకమే బ్రతుకు, కానీ మనిషంటే కృతజ్ఞత. నాకది కావాలి” అంటూ మొదటిసారి పెళ్ళి పిల్లలా సిగ్గుపడింది. రెండు రోజులు సెలవు తీసుకున్నది. అడుగు కదపకుండా ఇంటిలోనే గడిపాం. అతి కొద్ది రోజులలో ఇద్దరం చాలా దగ్గరయ్యాం.

రోజులు గడిచి పోతున్నాయి. ఒకనాడు అడిగింది, “శివా… నేనుగా నీకేమి ఇవ్వగలను? నేనంటే ఎందుకంత ఇష్టం” అని.

జయ చేతిని పట్టుకుని “నిన్ను చూస్తే చాలు తెలీని సంతోషం, నీతో ఉన్న ప్రతీక్షణం ఆనందం. నీతో మాట్లాడుతూ ఉంటే మైమరపు. ఇంతకన్నా ఈ జీవితానికి ఎవరేమి ఇవ్వగలరు?” అంటుండగా నా భుజంపై తల వాల్చింది ప్రేమగా.

***

ఆ రాత్రి నుంచి లాయరు గారు ఉన్నప్పటి ప్రశాంతత పోయి మా ఇంటి పక్కన కొద్ది రగడ ప్రారంభం అయ్యింది. ఆ వేళ జయ, నేను వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నాము. రాత్రి పది గంటలు కావస్తుంది. ఒక టాక్సీ వచ్చి మా ఇంటిముందు ఆగింది,

ఈ వేళప్పుడు వచ్చేదెవరా? అని చూస్తున్నంతలో ఒకతను దిగి టాక్సీ వాడికి ఓ వంద నోటు పారేసి ఎదురింటి లోకి నడిచాడు. టాక్సీ వెళ్ళిపోయింది.

జయ, నేను నిల్చున్నాము. అతను మెట్లెక్కబోతున్న వాడల్లా మమల్ని చూసి ఓ క్షణం ఆగి నో అని ఏదో నసుగుతూ.. నాలుగు వైపులా పరీక్షగా చూసి పక్క వాటా వైపు తూలుతూ వెళ్ళి తలుపుపై చేతితో బాదాడు బెల్ నొక్కకుండా,

తలుపులు తెరుచుకున్నాయి.

ఏం చేస్తున్నావని గద్దించి తూలుతూనే లోనికెళ్ళాడు.

ఆ తరువాత కొద్ది సేపటికి ఆయన ఇల్లాలట్టుంది, బయటకు వచ్చింది. ఆవిడ ఉన్న తీరు గమనించాను, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన దానిలా… ఆ వెన్నెల్లో కనిపించింది. పది నిముషాలు కలక మెదలక ఉండి నెమ్మదిగా లోనికి నడిచింది.

“వీళ్ళిద్దరూ భార్యాభార్తలా?” అని అడిగాను జయను.

“అవును.”

“తాగివస్తే ఏమి మాట్లాడదా?”

“మాట్లాడితే వినిపించుకోవాలి కదా?”

‘ఆవిడ ఉన్న తీరుకు దాసోహమనాల్సిన వాడు ఇలా……’ అనుకుని “ఇతనేం చేస్తుంటాడు?” అన్నాను.

“ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరట!”

“మరిదేం మాయరోగం?”

“ఇది వస్తు సహా ఉన్నది కాదు. కొనుకుంటాడట్టుంది. మనిషి కొంచం మెతక, టాక్స్ ఎగవేత గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అవసరానికి ఈయన్ని ఇలా చేస్తుంటారు.”

“పాపం ఆవిడ.”

“అవును. అసహనంగానే ఉంటుంది. ఇట్టాంటివి భరించడం కష్టం కదా! కానీ తాళి కట్టిన భర్తాయే. వదిలించుకుని వెళ్ళడం ఈ సమాజాన అంత తేలిక కాదు కదా! ఆమె ఒక్కతే అయితే ఎప్పుడో మెడపట్టి గెంటి అదుపు చేసుకునేదేమో. లేక గుడ్ బై చెప్పడమో చేసేది. ఆమెకు గౌరవనీయమైన తల్లి తండ్రులున్నారు.  హోదాలో ఉన్న బంధువులున్నారు. సమాజాన వారికి మంచి పేరు ఉంది. లేకుంటే అంతా గాలి అవుతది. చిత్రం ఏమిటంటే ఈ పూటనే ఇతగాడు ఈ తంతు, సూర్యోదయంతో చాలా  బాగుంటాడు. ‘రాముడు మంచి బాలుడు’ తీరున. పైగా మాటా-పద్ధతి-వ్యవహారము బాగా తెలిసినవాడు. ఇంతెందుకు మందు గొంతు దిగనంత వరకూ ‘దేవేరి ఏం చెప్పినా నవ్వుతూ వింటాడు’. ఈ వేళప్పుడు మాత్రం ఆవిడ వినాల్సిందే. పొద్దుటే పొరపాటని అంటాడు. ఇహ ఈ తప్పు జరగదనీ అనరాని ఒట్టూ వేసుకుంటాడు. పెద్దమనిషిలా, బుద్ధిమంతుడిలా ఆఫీసుకు వెళతాడు. ఇక అక్కడ ఈయనతో పని వున్నవాళ్ళు కాపేసి, అమ్మాయినీ, మందునూ వచ్చేడప్పుడు చూపితే…. కుక్క తోకే.”

“బాగా సేకరించావ్ సమాచారం”

“పొరుగు వాళ్ళు కదా! కాస్త గమనం ఉండటం మంచిదని.”

“నాతో అనలేదేం?”

“అనేదేముంది కనుక, పక్కనే ఉంటున్నారాయే”

“జయా ఇక ఇంట్లో కెళదామా?”

“అలాగే” అని లేవబోయింది జయ.

అమాంతం చేతిలోకి తీసుకున్నాను. నా మెడను వాటేసుకుంది. గుండెల్లో తలదాచుకుంది. లోపలికి వచ్చాం.

ఇంతలో ‘బ్రూట్ గెటౌట్’ అన్న మాటలు వినిపించినాయి.

జయను దింపి ఉలికిపాటున అటు చూసాను.

ఆవిడను మెడ పట్టుకుని మెట్ల కిందుకి నెడుతున్నాడు ఆఫీసరు గారు.

వరండా చివరి దాకా నడిచాం..

“నాకు నీతులు చెప్పేంత దానినయ్యానన్న మాట, నిన్ను ఏం చేస్తానో చూడు” అంటూ మీద మీదకు వచ్చాడు. అరకొరగా సోయిలో ఉన్నాడు. కొద్ది తడబాటుతో నోరు మాత్రం బాగానే ఉంది. ఆవిడ పాపం చెట్టు కిందకు వచ్చి నిల్చుంది. పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ….

తూలుతూ అక్కడి దాకా వచ్చి ఆమెను పట్టుకోబోతున్నాడు. దొరగ్గానే చేయెత్తి కొట్టబోతున్నాడు, పక్కకు తప్పుకుంది. అతను చేయి చెట్టుకు తగిలింది. ‘అబ్బా’ అని మళ్ళీ అందుకోబోయాడు, తూలిపడి వేపచెట్టును పట్టుకుని హిందీ, ఇంగ్లీష్‌లో తిట్టాడు కాసేపు. “ఏది? ఎక్కడ?” అంటూ చుట్టూరా చూసాడు, చెట్టు నీడన కనిపించింది. అటుగా వేగంగా నడవబోయి రెండు సార్లు తూలిపడ్డాడు. పడ్డాడు కదా అని భార్య చేయందించింది. దగ్గరగా గుంజుకున్నాడు. అక్కడే ముద్దులు ప్రారంభించాడు.

పట్టు విడిపించుకుంటూ “లోనకెళదాం!” అన్నది. మెట్ల దాకా గబగబా నడిచి ఆగింది.

“నిను వదలను, వస్తున్నా…” అంటూ నిలబడలేక నేలమీద పాకుతూ నడిచాడు. పాపం ఆవిడ మెట్లెక్కి దూరంగా కూర్చుని ఏడుస్తున్నది. తిడుతూనే నెమ్మదిగా ఆవిడ దాకా డేకి “నాకు తెలుసు నువ్వే ఇక్కడే ఉన్నావ్” అని బలవంతం చేసే ప్రయత్నం చేసాడు.

నాకావేశం వచ్చింది. వెళ్లి నాలుగిస్తే అంతా దిగిపోద్దని అనిపించింది. అటు కదిలాను. జయ నా చేయి పట్టుకుని గట్టిగా ఆపింది. ఆ తరువాత నాకూ అనిపించింది అలా వెళ్ళడం సభ్యత కాదని. ఆవిడ పడుతున్న బాధకు మనసంతా ఎలాగో అయ్యింది.

ఆవిడను పట్టుకుని బొడ్లో చేయి వేసి చీర ఊడదీసే ప్రయత్నంలో పడ్డాడు. సోయిలేక మెట్ల పక్కనున్న తలుపులోకి జారాడు.

ఇహ అక్కడ ఉండటం మంచిది కాదనిపించింది మాకు. జయ నేను లోపలి వెళ్ళాం.

చదువుండి, సంస్కారం తెలిసి, పెద్ద గౌరవనీయ ఉద్యోగంలో ఉండి.. ఇలా…. అర్థం కాలేదు. తలంతా చికాకయింది.

చదువు వేరు, సంస్కారం వేరు. చదువు రాని వాడు కూడా సంస్కారి కావచ్చు. చదివిన ప్రతివాడు సంస్కారి కానవసరం లేదు. ఎక్కువ శాతం కారు కూడా.

జయ బాగా బాధపడింది. అసలీ సృష్టిలోనే ఆడది బలహీనతకు చిహ్నం అంది. అలా బాధపడుతూనే నిద్రపోయింది.

తెల్లవారింది. మెలకువ రాగానే వరండాలోకొచ్చాను. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి అటుగా చూసాను. రాత్రి అంత రాద్ధాంతం చేసిన ఆయన సోఫాలో కూర్చుని బుద్ధిమంతుడిలా పేపర్ చదువుకుంటున్నాడు. నేనటు చూస్తుండగానే నన్ను గమనించి ఆప్యాయంగా ‘విష్’ చేసాడు. నేను చేయి ఊపాను. అంతటితో ఆగిపోయింది అతనితో పరిచయం.

***

నాలుగో ఫ్లోర్‌లో మధ్యాహ్నం పని ఉండడాన కబురొస్తే వెళ్లాను. పెద్ద సెట్టు వేసారు. వెళ్ళేసరికి పనయితే మొదలు కాలేదు. వచ్చిన వారు మాత్రం మాటా మంతిలో ఉన్నారు.

“హీరో రాలేదా” అని అడిగాను రామ్‌ని.

“మందెక్కువయ్యి పడిపోయారట” అన్నారు. నిర్మాతేమో జరుగుతున్న నష్టానికి మింగలేక కక్కలేక తలపట్టుకుని కూర్చుని అటు వచ్చిన వాడినల్లా కేకలేస్తున్నాడు. సాయంత్రానికి గాని హీరోగారు తాగింది దిగబడి నెమ్మదిగా ఫ్లోర్ లోకి రాలేదు.

స్టూడియో ఆవరణలో గిరిధర్ కనిపించారు. నాకు రెండు ఉత్తరాలు వచ్చాయని చెప్పారు. డా. పాండే గుర్తులోకొచ్చారు. ఆయనే వ్రాసి ఉంటారనుకున్నాను. తెల్లవారి స్కూల్‌కి వెళ్లి కరస్పాండెంట్‌తో కాసేపు మాట్లాడి నా ఉత్తరాలు తీసుకుని వచ్చాను. రెండూ అయన రాసినవే. అయితే ఆ రెండు ఉత్తరాల మధ్య ఆరునెలల తేడా కనిపించింది. మొదటిది విప్పాను.

“శివా…. చాలా రోజుల తరువాత నీకీ ఉత్తరం రాస్తున్నాను. నేను నా పరిశోధన నిమిత్తం జర్మనీ వెళ్ళేందుకు రడీగా ఉన్నాను. ప్రయాణించే తేదీ కూడా కరారయ్యింది. నాలుగైదు రోజుల్లో బొంబాయి వస్తున్నాను. నిన్ను చూసేందుకే. అదీ నేను నా శ్రీమతితో వస్తున్నాను. మనకున్న అనుబంధం సంగతి ఆమెకు చెప్పాను లే. నిన్ను మా ఆవిడకు చూపేందుకే ఈ ప్రయాణం. ఉంటాను..”

వచ్చి వెళ్ళే ఉంటాడు ‘పాపం. ఎక్కడెక్కడ వెతికాడో? ఎంత బాధపడ్డాడో?’ బాధనిపించింది.

రెండవ ఉత్తరం విప్పాను.

“శివా…. నీకోసం బొంబాయి వచ్చాము. ముందు ఉత్తరం రాసి వచ్చినా కలవలేక పోయావు. అడ్రెస్ తెలియలేదు. స్కూల్‌కి వెళ్లాను. తెలియదన్నారు. కలుస్తావేమో అని ఒక రోజు అదనంగా ఉండి చూసాము. అసలు నేను రాసిన ఉత్తరం అందలేదో ఏమో అని స్కూల్‌కి ఫోన్ కూడా చేసి చూసాను. నీ పేర వచ్చిన ఉత్తరం అక్కడే ఉందన్నారు. ఏదేమయినా నేను నా కొత్త శ్రీమతి చాలా నిరుత్సాహంగా వెనక్కొచ్చాము.

శివా… నేనొక కొత్త ప్రపంచం నుండి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఇక్కడి పరిస్థితి చూసాక ఇంకో రెండు మూడు దశాబ్దాల నిర్విరామ కృషి జరిగితే తప్ప మనమా దశకు చేరుకోలేము అనిపించింది.

రెండవ ప్రపంచ యుద్ధపు పరిణామాలను అధిగమించి చాలా వేగంగా జర్మనీ వాళ్ళు అభివృద్ధి సాధించారు. ఆ ప్రగతిని చూసాక మనిషి ఆశాజీవి కాదు చిరంజీవి అనిపించింది. శివా…. శ్రమిస్తే ఏదయినా సాధించవచ్చయ్యా, శ్రమే ముఖ్యం, అదే అంతా అని ‘మార్క్స్’ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు.

పని పట్ల వారికున్న శ్రద్ద, ఆసక్తి, తపన, చూసాక ఎంత సంతోషమనిపించిందో? ఇతరుల పట్ల తోటి వారిపట్ల వారి ఆదరాభిమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ అనుభవాన్ని మనం కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇహ పోతే, నువ్వు ఎప్పటికయినా ఆ స్కూల్ కి వస్తావనే ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. దీనికి సమాదానం వచ్చాకనే నేనేం రాసినా. కింది అడ్రెస్స్ ఉంది. నీ పూర్తి చిరునామాతో ఉత్తరం రాయి. ఉంటాను.”

నేను ఆ వెంటనే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి డా. పాండే అడ్రెస్‌కి ఉత్తరం రాసి పోస్ట్ చేసి వచ్చాను. అప్పటి గాని నాకు తృప్తి అనిపించలేదు.

మనిషి బ్రతుకు చిత్రమయిన సంఘటనల సమాహారంలా అనిపిస్తుంది. కావాలన్నవి జరగకపోవడం, ఊహించనివి అడ్డంగా ఎదురు పడటం, ఏదేదో అయిపోయి వణికి పోవడం. దానంట ఆహ్లాదం కలగడం, ఒకసారి దిక్కు దిశా తెలవక పోవడం, మనమీద మనకే భయమూ జాలీ కలగడం.. ఇదంతా జరుగుతున్నా మనిషిగా బ్రతికుండి ప్రేక్షకుడిగా మిగలటం, అలా చూస్తూ చూస్తూనే కాలగర్భంలో కలిసిపోవడం. ప్చ్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here