ప్రాంతీయ దర్శనం -15: రాజస్థానీ – నాడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా రాజస్థానీ సినిమా ‘బాయీ చలీ ససరియే’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘బాయీ చలీ ససరియే’

[dropcap]నా[/dropcap]టి రాజస్థానీ సినిమాలంటే భక్తీ, పౌరాణికాలే. మొదటి రాజస్థానీ సినిమా 1942లో ‘నిజరానో’ పేర సాంఘికంగా నిర్మించినా, ఆ తర్వాత రెండో సినిమా రెండు దశాబ్దాలకి గానీ నిర్మించలేదు. 1961లో ఆ నిర్మించడం నిర్మించడం ఒకేసారి పూర్తి రంగుల చిత్రంగా, పాటలతో అట్టహాసంగా  ‘బాబాసారీ లాడ్లీ’ అనే సాంఘీకంగా నిర్మించారు. ఇక దీని తర్వాత నుంచీ దశాబ్దం పాటు భక్తీ, పౌరాణికాల బాటే పట్టారు. ఇవి 11 నిర్మించాక, 1973 నుంచీ తిరిగి సాంఘీకాలు మొదలెట్టారు. ఇవన్నీ కుటంబ సెంటిమెంటల్ సినిమాలే. ఇతర ప్రాంతీయ సినిమాల్లాగా వాస్తవిక సినిమాలు తీసే జోలికి పోకుండా, కన్నీరు పన్నీరు మసాలా కుటుంబ సెంటిమెంట్లే, అవీ కుటుంబాల్లో ఆడవాళ్ళ చుట్టూ తిరిగే పుట్టింది – మెట్టింటి సినిమాలే ఉత్పత్తి చేయడం మొదలెట్టారు. ఇవి బాగా ఆదరణ కోల్పోతున్న దశలో మరో అలాటి ఫ్యామిలీ సెంటిమెంటల్ వచ్చి, తిరిగి ఈ తరహా సినిమాలకి కొత్త వూపిర్లు వూదింది. అదే 1988లో  ‘బాయీ చలీ ససరియే’ (బాయీ అత్తారింటి కెళ్ళింది) ఇదెంత సూపర్ హిట్టయిందంటే, మరాఠీలో  ‘మెహర్చీ సాడీ’ గానూ, మళ్ళీ హిందీలో ‘సాజన్ కా ఘర్’ గానూ రీమేక్స్ అయింది. కన్నడలో ఇంకో రీమేక్ అయింది.

దీనికి మోహన్ సింగ్ రాథోడ్ దర్శకత్వం వహించాడు. సుందర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భరత్ నహతా నిర్మించాడు. జగదీప్, నీలూ వాఘెలా, లలితా పవార్, అలంకార్ జోషీ, ఉపాసనా సింగ్ తదితరులు నటించారు. సంగీతం ఓపీ వ్యాస్ నిర్వహించాడు.

శతదినోత్సవం జరుపుకుని, చరిత్ర సృష్టించిన ఈ ఫ్యామిలీ సెంటిమెంటల్‌లో – అందరికీ దురదృష్టాలే వెన్నాడే అనేక మలుపుల, నమ్మశక్యంగాని కథ ఇలా వుంటుంది: ధనరాజ్ అనే పేద పీనాసికి లక్ష్మి పుడుతుంది. పుడుతూనే భార్య చనిపోతుంది. దీంతో ఇది నష్టజాతకురాలని కూతురు లక్ష్మిని ద్వేషించడం మొదలెడతాడు. ఇంతలో భారీ లాటరీ తగిలి ధనికుడైపోతాడు. లక్ష్మిని మేనత్త పెంచడం మొదలెడుతుంది. ధనరాజ్ మాత్రం లక్ష్మిని ద్వేషించడం మానడు. పైగా మళ్ళీ పెళ్లి చేసుకుని కొడుకు సూరజ్‌ని కంటాడు. ఈ తమ్ముడితో లక్ష్మి సన్నిహితంగా వుంటుంది. ధనరాజ్, అతడి కొత్త పెళ్ళాం దీన్ని సహించరు. లక్ష్మీ దురదృష్టం తెచ్చి పెడుతుందని సూరజ్‌ని దూరం చేస్తూంటారు. లక్ష్మిని చిత్ర హింసలు పెడుతూంటారు. వీళ్ళ బారి నుంచి లక్ష్మిని సూరజ్ కాపాడుతూంటాడు. రాఖీ పండగ నాడు సూరజ్ లక్ష్మికి రాఖీ కడతాడు. ఆ వెంటనే ప్రమాదంలో చనిపోతాడు. దీంతో తండ్రీ, సవతి తల్లీ, లక్ష్మిని  చావబాదుతారు.

 

ఇక అమర్ అనే వాడితో పెళ్లి చేసి పంపించెయ్యాలనుకుంటారు. అమర్ ఆర్మీ అధికారి. కూతురి పెళ్లి చేయగానే ధనరాజ్ ప్రమాదంలో మరణిస్తాడు. అతడి భార్య, కొడుకు సూరజ్ ఆస్తిపాస్తులు కోల్పోయి వీధిన పడతారు. తర్వాత ఇటు లక్ష్మికి గర్భస్రావమవుతుంది. మళ్ళీ గర్భం ధరిస్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ హెచ్చరిస్తాడు. ఈ విషయం భార్య లక్ష్మీ సహా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచుతాడు అమర్. కానీ కోడలు లక్ష్మి ఎంతకీ గర్భం దాల్చకపోవడంతో అత్తగారికి అనుమానం వస్తుంది. ఇక ఇది గొడ్రాలేనని నిర్ణయానికొచ్చేసి చంపెయ్యాలని తయారవుతుంది. అమర్ ఇక ఉండలేక తల్లికి నిజం చెప్పేస్తాడు. ఇది విన్న లక్ష్మి ఇక తన ప్రాణాలు పోయినా సరే బిడ్డని కనాలని నిర్ణయించుకుంటుంది. అమర్‌ని నిలదీస్తుంది. కోపంతో రెచ్చిపోయిన అమర్ డాక్టర్ హెచ్చరికని మర్చిపోయి ఆ రాత్రి ఆమెతో గడుపుతాడు. ఆమె గర్భవతవుతుంది. ఇప్పుడేం చేయాలో తోచక ఆర్మీ డ్యూటీ కెళ్ళిపోతాడు.

లక్ష్మి గర్భవతవడం భరించలేని అత్తగారు ఇంట్లోంచి గెంటేస్తుంది. బయట పనులు చేసుకుంటూ బతుకుతున్న లక్ష్మి బిడ్డని కంటుంది. ఆ బిడ్డతో వచ్చి అత్తగారి చేతిలో పెట్టి ప్రాణాలు విడుస్తుంది. అమర్ వచ్చేస్తాడు. ఆమె చితిముందు అందరూ కన్నీళ్లు పెట్టుకుని మరుజన్మలో ఆమె సుఖపడాలని ప్రార్ధిస్తారు.

అడుగడుగునా ఇన్ని దురదృష్టాలతో, మలుపులతో, వీటి తాలూకు కష్టాలతో, కన్నీళ్ళతో సాగే ఈ కుటుంబకథ లాజిక్‌కి అందదు. కానీ  దైవికంగా కావచ్చేమో అన్పిస్తుంది. విధి ఒకొక్కర్ని పట్టుకుని పీడిస్తూంటే, ప్రాణాలే తీసేస్తూంటే, దానికేం కావాలో అర్ధంగాని పాత్రల దీనావస్థ బాక్సాఫీసుకి కావాల్సినంత భరోసా నిచ్చింది.

ఇందులో లక్ష్మిగా నీలూ వాఘెలా నటించింది. భర్త అమర్‌గా జగదీప్, అత్తగారుగా లలితా పవార్, తమ్ముడుగా అలంకార్ జోషీ నటించారు. పాటలు కావాల్సినన్ని వున్నాయి. హిందీ రీమేక్‌లో రిషికపూర్, జుహీ చావ్లా నటించారు. సురేంద్ర కుమార్ బోహ్రా దర్శకత్వం వహించాడు. 1990 నుంచీ 2004 దాకా రాజస్థానీ సినిమాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. భారీ నష్టాలే ప్రాప్తిస్తున్నాయి. ఇలాటి గడ్డు పరిస్థితిలో  1988లో సూపర్ హిట్టయిన ‘బాయీ చలీ ససేరియే’ విజయ కారణాలని విశ్లేషించుకుని, మళ్ళీ అలాటి సినిమాలు తీయడం మొదలెట్టడంతో కళకళలాడ సాగింది రాజస్థానీ మసాలా సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here