రాజకీయ వివాహం-8

0
4

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘.  ఇది 8వ భాగం.  [/box]

అధ్యాయం- 8

[dropcap]గ[/dropcap]త కొంతకాలంగా హాస్పిటల్‌కు పరిమితం అయిపోయి ఉంది ప్రియాంక. తన తండ్రికి రెండవసారి హార్ట్ ఎటాక్ వచ్చిన దగ్గర నుంచీ పరిస్థితి అంతంతకూ క్షీణిస్తున్నట్లు డాక్టర్లు గుర్తించి ఆమెతో చెప్పారు. తన తల్లి పరిస్థితి అయితే ఇంక చెప్పనలవి కావడం లేదు. ఇంతకాలం ఆయనను వెన్నంటి అంటిపెట్టుకుని ఉన్న జె.హెచ్. పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ముఖం చాటేశారు. ఎవరో ఒకరో ఇద్దరో చుట్టపుచూపుగా వస్తున్నప్పటికీ వారు కూడా తన ద్వారా పార్టీలో లబ్ది పొందడానికి మాత్రమే వస్తున్నట్లుగా ఆమె తెలుసుకోగలిగింది.

తన తండ్రి పార్టీలో సిద్ధార్థ చేరాడు అని తెలుసుకున్న దగ్గరనుంచీ ఆమె తనతో ఎక్కువగా మాట్లాడలేదు.  అలా ఆమె సొంతంగా నిర్ణయించుకోనప్పటికీ పరిస్థితులు ఆ విధంగా సంభవించడం జరిగింది. తనని అన్నిటికన్నా ఎక్కువ బాధించిన సంఘటన ఏంటంటే ప్రొఫెసర్ వరదరాజన్ మృతి.  ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ తన వంతుగా ఏదో కృషి చేసి నలుగురికీ తమ కర్తవ్యం గుర్తువచ్చేలా చెయ్యాలి అనే మంచి నిశ్చయంతో వచ్చిన ఆయన అకారణంగా మరణించడం చాలా దురదృష్టకరం. ఆయనను విశాఖపట్నం ప్రాంతంలో జరిగిన బహిరంగ సభకు ఆహ్వానంపై తీసుకువెళ్తున్న సమయంలో రాహుల్ తనకి ఫోన్ చేసాడు.

తన ఉద్దేశం ఏమై ఉంటుందో అతని మాటల ద్వారా తెలుసుకుని చాలా ఆనందపడింది. ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ అతని తండ్రిలాంటి వాడు కాదేమో అని ఆమెకు అనిపించింది. అయితే మీడియాలోనూ, పత్రికల్లోనూ తదితర మాధ్యమాల్లోనూ అందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోంది అని తెలుసుకుని ఇంకా మథనపడింది.

అసలు వరదరాజన్ మృతి వల్ల లాభపడేది ఎవరో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. కానీ జోగేశ్వరరావు మాత్రం తన తండ్రి మీద కక్ష కట్టినట్లుగా పాత కేసులన్నీ తిరగదోడడమే కాకుండా వరదరాజన్ మరణం కూడా ఒక రాజకీయ హత్యనీ దానికి కారణం జె.హెచ్.పార్టీలో కొంతమంది బడా నాయకులనీ, ఇదివరలో ఇలాగే జరిగిన కలెక్టర్ హత్య కేసుకీ దీనికీ ముడిపెట్టి బయటకు చెప్పకుండానే తన తండ్రిపైన అసత్యప్రచారానికి పూనుకున్నాడు.

అంతేకాకుండా ఆ విధంగా సిబిఐ వారు ఆలోచించడానికి సరిపడే సాక్ష్యాలను కూడా ఎవరో సృష్టిస్తున్నారు అని ఆమెకు తెలిసింది. ఈ సంగతులన్నీ తెలుసుకోవడానికి ఆమెకు ప్రసాద్ గారు చాలా సహాయపడ్డారు.  ఇంకా తమకు పార్టీలో ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రసాద్ గారే అని ఆమె అభిప్రాయం.

ఈమధ్య కాలంలో హనుమంతరావనే వ్యక్తి పార్టీలో బలపడడం కూడా ఆమెకు తెలియజేస్తూ వచ్చారు ప్రసాద్ గారు. ఆమె ఇవన్నీ తలచుకుంటుంటే తను ఈలోకంలో ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లుగా అనుభూతి చెందింది.  తనకు సహాయం చేసేవాళ్ళు లేరు తను చిన్నప్పటినుండి కూడా అంతే ఒంటరి పోరుకే అలవాటు పడింది, దానికి కారణం తాను వెళ్ళిన చోటల్లా తనకి అందరికన్నా ప్రత్యేకమైన గుర్తింపు లభించడం.

తను ప్రభుత్వ పాఠశాలల్లో చదివినప్పటికీ తన తండ్రి పరపతీ, హోదా తనను అనుసరిస్తూ వచ్చింది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను తెచ్చిపెట్టుకున్న ఆరాధనా భావంతో చూసేవారు, అది ఆమెకు నచ్చేది కాదు. అందుకే ఒక మనిషిలో తనకు తెలీకుండానే జాగృతమై ఉన్న ఈ గాంభీర్యతను దూరం చెయ్యాలి అని ఆమె అనుకుంది.

మనిషి తన ఆత్మశక్తిని తాను గ్రహించగలిగిన రోజున తనపైన తనకు విశ్వాసం పెరిగి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. అందుకే అవసరం లేకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయాలకు దూరంగా ఉండాలి అని ఆమె నిర్ణయించుకుంది. అయితే జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండడం విచారకరం.

సిబిఐ వారు తన తండ్రిని పదేపదే విచారణ పేరుతో హింసించడం ఆమె చూడలేకపోతోంది. దీనికి ఎలాగైనా పరిష్కారం ఆలోచించాలి అని పరధ్యానంగా హాస్పిటల్ కాంపౌండ్‌లో ఒంటరిగా కూర్చుంది ప్రియాంక.

వెంటనే తను మొట్టమొదటిసారి చెన్నైలో పీజీ చేస్తుండగా అనుకున్న మాటలు ఆ సమయంలో సిద్ధార్ధ దొంగచాటుగా వినడం, సిద్ధార్థ్ చేసిన సూచనలు, ఆ తరువాత తనకు రాహుల్‌కూ మధ్య జరిగిన సంఘటనలు ఇవన్నీ సినిమాలో రీళ్ళలాగా తన కళ్ళముందు తిరిగాయి. ఇంతలో తన పక్కనే ఉన్న సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో తన ఆలోచనలకూ అంతరాయం కలిగింది.

“హలో ఎవరు మాట్లాడుతున్నారు” తనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడంతో అవతలి వ్యక్తి ఎవరి ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రశ్నించింది ప్రియాంక.

“హలో నమస్తే మేడం. నా పేరు సంధ్య. నేను నేషనల్ టీవి కరెస్పాండంట్‌ని. ఒక ల్యాండ్ డీలింగ్ విషయమై మీతో మాట్లాడాల్సిన పని పడింది” డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చినట్లుగా మాట్లాడింది ఫోన్ లోని వ్యక్తి.

ప్రియాంక ఆమె యొక్క ధైర్యానికి ఆశ్చర్యపోయింది. బహుశా ఈ రంగంలో ఉండాలి అంటే ఆ మాత్రం దుడుకుతనం ఉండాలేమో అని కూడా అనుకుంది. అంతేకాకుండా తన తండ్రి పదవిలో లేకపోవడం వల్ల ఆమె ఇలా ఇంత ధైర్యంతో ఆమె మాట్లాడగలుగుతోందా అని ప్రియాంకకు అనిపించింది.

“విషయం ఏంటో కొంత వివరంగా చెప్తారా సంధ్య గారు.  నాకు తెలిసి మనిద్దరికీ ఇంతకముందర పరిచయం లేదు. అందుకని మీరు డైరెక్ట్‌గా విషయం చెప్పడం వల్ల నాకు అర్థం చేస్కోవడానికి కొంత టైం పడుతుంది. సో ఇఫ్ యు కెన్ ప్లీజ్ ఎక్స్‌ప్లైన్ మీ” అని అవతలి వ్యక్తి ఏమి చెప్తుందా అని ఎదురుచూస్తోంది ప్రియాంక.

“ఏమి లేదు మేడం, విశాఖపట్నం దగ్గర ఒక పెద్దాయనకి మీ తండ్రిగారు సీఎంగా ఉన్నప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో ఒక స్థలం ఇప్పించారు. దురదృష్టవశాత్తు ఆయన కొంతకాలం క్రితం చనిపోయారు.  అయితే వాళ్ళ కుమార్తె మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీతో మాట్లాడాల్సి వచ్చింది” అని ఆగింది ఆమె.

 “వెయిట్ వెయిట్.  బేసికల్‌గా నేను ఇలాంటి విషయాలకి దూరంగా ఉంటాను సంధ్యగారు. ఇప్పటివరకు మా నాన్నగారే పార్టీకి సంబంధించిన సంగతులు అన్నీ చూసుకునేవారు, బట్ ప్రస్తుతానికి ఆయన హెల్త్ బాగోకపోవడం వల్ల ఆయన కూడా మీకు ఏ విధంగానూ సహాయపడకపోవచ్చు. సో మీరెందుకు పార్టీలో వేరేవాళ్ళని కాంటాక్ట్ చెయ్యకూడదు. నాకు తెలిసి ప్రసాద్ గారికి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి.  అందులోనూ ఆయన పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా. ఏమంటారు” అడిగింది ప్రియాంక.

“అది కూడా జరిగింది మేడం. ఇన్‌ఫాక్ట్ మీకన్నా ముందరే ప్రసాద్ గారిని సంప్రదించాం, ఆయన సూచన మేరకే మీకు కాల్ చెయ్యడం జరిగింది. అందుకే మీరు మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం” ఆమె గొంతులో ఒకరకమైన గాంభీర్యంతో కూడిన అభ్యర్థన ఉండడంతో ప్రియాంక ఆమె మాటలు కాదనలేకపోయింది.

“ఆల్రైట్ సంధ్యగారు, మీరు సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్ గెస్ట్‌హౌస్‌కి రండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం” అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

ఈ విషయం ఆమె సిద్దార్థతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. ప్రసాద్ గారు తనతో మాట్లాడమని నెంబరు ఇచ్చారంటే తన తండ్రి తరువాత తన చేతికి పార్టీ పగ్గాలు అప్పగించాలి అని ఆయన ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. ఏమిటో తనకు తెలియకుండానే ఈ రాజకీయాలలోకి లాగాబడుతోంది అని తెలుసుకుని ఆమె ఒక నిట్టూర్పు విడిచింది.

తనని కలవడానికి వస్తున్న వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఎలాంటి వాదన వినాల్సివస్తుందా అని కుతూహలంతో గెస్ట్ హౌస్ వైపు దారితీసింది. హాస్పిటల్ నుంచి గెస్ట్‌హౌస్‌కి వెళ్తూ దారిలో ఉన్న విశాలమైన హాల్‌లో వాల్ మౌంటెడ్ టీవీలో సిద్ధార్థ ఎవరో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉండడం ఆమె గమనించింది.  కొద్దిగా ఆసక్తిగా అనిపించి అక్కడే ఆగింది.

అతని ముందు చాలా మైకులు ఉన్నాయి “నకునారెడ్డి గారి ఆరోగ్యపరిస్థితి చాలా హీనంగా ఉందని మాకు డాక్టర్ల నుంచి సమాచారం తెలిసింది, ఆయన ఇకపై కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని అనిపిస్తోంది.  అనేక రకాలైన ఒత్తిడిల వల్ల ఆయన దేహం రోజురోజుకీ క్షీణిస్తోంది. మరిలాంటి సమయంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి.

మీరు అధికారపక్షంలో విలీనమయ్యే యోచనలో ఉన్నారనే ఒక రూమర్ కూడా ఉంది. దీనిపైన మీ కామెంట్ ఏమిటి. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉండగా నకునారెడ్డిగారు మిమ్మల్ని కొత్తగా చేర్చుకుని మీతో సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. దీనితో పార్టీలో మిగిలిన పెద్దలలో మీ పట్ల అసమ్మతి ఉండే అవకాశం ఉంది. దీనికి మీ సమాధానం ఎలా ఉండబోతోంది” మీడియా వారు ఊపిరి సలపకుండా సిద్ధార్థపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఐనప్పటికీ సిద్ధార్థ కొంచెం కూడా జడిసినట్లు లేడు.  బహుశా ఇటువంటి ప్రశ్నలు ఎదుర్కోవడానికి ముందే గ్రౌండ్ వర్క్ చేసినట్లుగా ఉంది అతని ధోరణి.

“మొట్టమొదట నకునారెడ్డి గారి ఆరోగ్యం పట్ల లేనిపోని ప్రచారం చెయ్యవద్దని నా మనవి.  నేను కొన్ని రోజుల క్రితమే ఆయనతో మాట్లాడాను, ఆయన చాలా ధృడంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగానే నాకు అనిపించింది. అయితే ఈ రాష్ట్రంలో రాజకీయాల గురించి నాకు తక్కువగానే తెలుసు, పార్టీకి యువకుల అవసరం ఎంతో ఉంది అని నకునారెడ్డి గారు అంటూ ఉండేవారు.

అంటే నా గురించి ఆయన అలా మాట్లాడుతున్నారు అని నా కాదు నా ఉద్దేశం. నేను వారి అమ్మాయికి స్నేహితుడిని కావడం వలన నాతో సన్నిహితంగా ఉంటున్నట్లు భావించడం సహజమే అయితే ఎప్పుడూ ఆయన పార్టీ రాజకీయాల గురించీ రాష్ట్ర రాజకీయాల గురించీ నాతో మాట్లాడిన దాఖలాలు లేవు. నేను కేవలం పార్టీ కార్యనిర్వహణ, మరియు క్రియా రూపకల్పనలకు అవసరమైన సూచనలు మాత్రమే చెయ్యడం జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక కంపెనీకి టెక్నికల్ సపోర్ట్ కన్సల్టెంట్ లాంటిది అన్నమాట పార్టీకి నేను చేసే పని.

అంతేకానీ మీరు అంటున్నట్లుగా అధికారపక్షంలో విలీనం అవ్వడం ఇలాంటివాటికి సమాధానం చెప్పగలిగిన స్థాయిలో నేను లేను.  అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను నాచిరెడ్డిగారి అరెస్ట్ వల్ల పార్టీ కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యిన మాట వాస్తవం.

ఇకపోతే అసమ్మతి అనేది ఎప్పుడూ ప్రతీచోటా ఉండేదే, అయితే అది నా పైన ఉండే అవకాశం లేదు.  అందరూ నాకు, మీకు లాగే నకునారెడ్డిగారు త్వరగా కోలుకోవాలని పార్టీలో ఒక నాయకుడి అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు” అందరి వంకా చూస్తూ తను అనుకున్నది చెప్పాడు సిద్ధార్థ.

“మీరు ఇప్పటికి పార్టీలో చేరి సంవత్సరం పైన అయ్యుంటుంది.  మా ఉద్దేశంలో మీకు మీరు చెప్పినదానికన్నా ఎక్కువే తెలిసి ఉండాలి. సరే ఆ విషయం అలా ఉంచితే నాచిరెడ్డి భార్యను ఆయన హత్య చేయించినట్లు అధికార పక్షంవాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు ఆ విషయం పట్ల ఏ విధంగా స్పందిస్తారు” ఒక పత్రిక ప్రతినిధి సూటిగా సిద్ధార్థను అడిగాడు. సిద్ధార్థ్ ఒక్కసారి తన కళ్ళజోడు సర్దుకుని

“ఒకే దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే దిస్ కేస్ ఈజ్ బియాండ్ పబ్లిక్ డిబేట్ అండ్ డిస్కషన్.  మన పరిధిలో లేని వాటి గురించి తర్జనభర్జనలు పడడం సమయం వృథా, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది ఎవరనేది క్లారిటీగా మనకి తెలీదు, అందుకు ఈ సమయంలో మనం ఏమి మాట్లాడినా అక్యుజేషన్ అవుతుంది, నేను అటువైపుకు వెళ్ళదలచుకోలేదు.

నాచిరెడ్డి గారు చాలా తెలివైనవారు, ఒక మంచి సాహితీవేత్త. అంతకన్నా ఎక్కువగా ఒకానొకప్పుడు గౌరవ మంత్రి పదవి నిర్వహించిన ప్రజానాయకుడు.  ఆయన మీద ఎంత ఎత్తున దుష్ప్రచారం జరిగినా నిజం నిలకడ మీద తెలుస్తుంది” తను కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా ఆ వ్యక్తికి సమాధానం చెప్పాడు సిద్ధార్థ.

ఇలా రకరకాల ప్రశ్నలకు కొంచెం కూడా సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్తున్నాడు సిద్ధార్థ్.  “వచ్చేవారం హైదరాబాద్‌లో జరగబోయే పార్టీ మీటింగ్‌కు మీకు కూడా ఆహ్వానం అందినట్లుగా తెలిసింది.  ఆ మీటింగ్‌లో పార్టీకి కాబోయే ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది. అందులో మీరు పార్టీ సీనియర్ హనుమంతరావు గారి నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటారని అనిపిస్తోంది. అందుకు ఆయనకు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు” ఇంకొక వ్యక్తి ఆ మీటింగ్ ముగించడానికి ఆఖరుగా అడిగాడు.

“నాకు ఇష్టం లేకపోయినా పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రసాద్ గారి కోరిక మీదట నేను హైదరాబాద్ వెళ్ళడం జరుగుతోంది. అక్కడ ఏమి జరగబోతోందో ఇంకా నాకు కూడా తెలీదు. జరిగిన వెంటనే ఆ విషయం మీకు ఫోన్ చేసి తప్పకుండా చెప్తాను.  అంటిల్ దెన్ కీప్ గెస్సింగ్ గయ్స్” అతడిని చూసి చిన్నగా నవ్వుతూ చెప్పాడు సిద్ధార్థ. అతను వేసిన జోక్‌కి అందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వడంతో వాతావరణం తేలికపడింది.

అక్కడితో ఆ మీటింగ్ ముగియడంతో టీవీలో కమర్షియల్స్ వస్తున్నాయి. చూస్తుండగానే సిద్ధార్థ్ ఎంతో ఎదిగిపోయినట్లు ప్రియాంకకు అనిపించింది. తను పార్టీలో చేరి అప్పుడే సంవత్సరం అయిపోయింది అనే విషయం ఆమెకి ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. తనకు ఇప్పటికీ జర్నలిజం స్కూల్‌లో ఉన్నట్లుగానే అనిపిస్తోంది. కాలం చాల వేగంగా గడుస్తుంది అని అనుకుని ఆమె గెస్ట్‌హౌస్ చేరుకుంది.

***

అనుకున్నట్లుగానే సాయంత్రం అయిదు గంటల సమయంలో ఒక పాతికేళ్ళ యువతి వెంటరాగా నేషనల్ టీవీ కరెస్పాండెంట్ సంధ్య ప్రియాంకను హాస్పిటల్ గెస్ట్‌హౌస్‌లో కలిసింది. ప్రియాంక ఆమె వెంట వచ్చిన అమ్మాయిని గమనించింది, సన్నగా నాజూకుగా ఉన్న ఆ అమ్మాయి ముఖం చాలా అమాయకంగా ఉంది.  ఆమె కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయి. తనను చూడగానే ఆమె చేతులు జోడించి నమస్కరించడంతో ఆ అమ్మాయి పాతకాలం నాటిదని, ఈ ఫాస్ట్ కల్చర్‌కు అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది.

“ఈమె పేరు దుర్గాభవాని మేడం. కొంతకాలం క్రితమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మా కంపెనీలో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తోంది.  ఈమెది మా ఊరే, చదవడం అయితే పట్నంలో చదివినా కానీ ఈమెకు పట్నం అలవాట్లు ఏమీ వంటపట్టలేదు. అందుకే తన ల్యాండ్ విషయం ఎంతో కాలానికి కానీ మాకు చెప్పలేదు.  ఒకే కంపెనీలో పనిచేస్తున్నా కానీ ఆమెకు నాతో ఈ విషయం షేర్ చేసుకోవడానికి భయం. అసలు తన తండ్రి చనిపోయాడనే విషయమే మాకు చెప్పలేదంటే మీరు అర్థం చేసుకోండి ఆమె ఎంత నెమ్మదస్తురాలో” తనతో వచ్చిన దుర్గ గురించి చెప్తూ పరిచయం చేసింది సంధ్య. వారు ముగ్గురూ హాస్పిటల్ గెస్ట్‌హౌస్‌లో అభిముఖంగా కూర్చుని ఉన్నారు.

“అవును వీరి స్థలం గురించి ఏదో చెప్పారు కదా.  ఏంటి విషయం.  ఎవరైనా కబ్జా చేసారా” ఆసక్తిగా అడిగింది ప్రియాంక. ఆమెకు ఇలాంటి విషయాలు డీల్ చెయ్యడం ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.

“ఒకరకంగా చెప్పాలంటే కబ్జానే మేడం. బట్ దిస్ ఈస్ ఏ లీగలైజ్డ్ అక్విజిషన్. పూర్తి అధికారంతో చేసిన కబ్జా” ఆమె వంక నిస్సహాయంగా చూస్తూ చెప్పింది సంధ్య.

“అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తారా” కుతూహలం ఎక్కువ కాగా అడిగింది ప్రియాంక.

“ఏమీ లేదు మేడం. గతంలో జె.హెచ్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి కొంతభాగాన్ని ప్లాటులుగా విభజించి వివిధ రంగాలలో అర్హులైనవారికి అందజేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఈమె తండ్రిగారికి కొంత స్థలం దక్కింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో వ్యర్థ నిర్వహణ ప్లాంట్ నిర్మించడానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ నామమాత్రపు ధరలను ఆ అర్హులకు చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంది.

చాలామంది కోర్టులను ఆశ్రయించి కూడా భంగపడ్డారు. మీరు ఏ విధంగా అయినా మీ తండ్రిగారితో మాట్లాడి, కోర్టులు మిగిలిన వాటి అవసరం లేకుండా ఈమెకు తన స్థలం ఇప్పించగలిగితే ఎంతో మేలు చేసినవారు అవుతారు.  చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఈమెకు ప్రస్తుతానికి ఇల్లు కూడా లేదు. ఆ స్థలం మీదే ఆశలు పెట్టుకుంది. ఇక్కడ హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది” దుర్గ కథను స్థూలంగా ఆమెకు వివరించింది సంధ్య. అంతా విన్న తరువాత ప్రియాంక ఆలోచనలో పడింది.

ఆమెకు వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఈ వ్యర్ధ నిర్వహణ ఫ్యాక్టరీ గురించి రాహుల్ పదేపదే టీవీల్లోనూ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ చాలా గొప్పగా చెప్పడం, అది తమ ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అని కేంద్రం నిర్వహిస్తున్న హరితభూమి కార్యక్రమానికి అనుసంధానంగా ఈ ప్రాజెక్ట్ పని చేస్తుందని జోగేశ్వరరావు గారు కూడా పలుమార్లు అసెంబ్లీలో ఉద్ఘాటించడం ఆమె దృష్టిలో పడింది.

అయితే గతంలో కూడా తన తండ్రి దగ్గరకు స్థలం విషయమై చాలా మంది సంప్రదించడం ఆమెకు గుర్తు వచ్చింది.  దీనిప్రకారం చూస్తే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఇటువంటి భూమికి సంబంధించిన లావాదేవీల్లో బాధితులు అయ్యుంటారు. కానీ ఆమె ధృడంగా నమ్మే విషయం ఏంటంటే భూయాజమాన్యం అనే వ్యవహారం చాలా అవకతవకలతో కూడుకున్నది.

దీనికొక శాశ్వతమైన పరిష్కారం చూపకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ప్రభుత్వం, ప్రతిపక్షం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క పౌరుని మీదా ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఆమెకు దుర్గను చూడగానే ఎందుకో ఒకరకమైన ఆత్మీయత కలిగింది

“చూడండి సంధ్యగారు, మీరు చెప్పినదంతా నాకు అర్థం అయ్యింది. ఇదివరలో కూడా కొంతమంది మారుమూల గ్రామాల నుండి వచ్చినవారు విన్నవించుకున్నారు. ఇది ఈమె ఒక్కదాని సమస్య కాదు చాలామందిది, ఇంకా చెప్పాలంటే మన అందరిదీ కూడా. దేవుడు చల్లగా చూసి నాన్నగారు కోలుకున్న వెంటనే నేను ఈ విషయం ఆయనతో చర్చిస్తాను.

భూయాజమన్యం అనేది ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న గడ్డు సమస్య. చాలా వరకూ సమస్యలన్నీ దీనితోనే ముడిపడి ఉన్నాయని నాకు అనిపిస్తోంది. దీని గురించి నేను రీసెర్చ్ కూడా చేసాను. మీరేమీ దిగులుపడకండి దుర్గకు నేను అండగా ఉంటాను. నాకు ఈమెను చూడగానే సొంత చెల్లెల్ని చూసిన అనుభూతి కలిగింది, చిన్నప్పటి నుంచీ ఒంటరిగా పెరిగిన నేను ఎప్పుడూ నాకొక చెల్లెలు కావాలి అని కోరుకునేదాన్ని, మీకు అభ్యంతరం లేకపోతే తన స్థలం తనకు దక్కేవరకూ దుర్గ మాతోపాటుగా మా ఇంట్లోనే ఉంటుంది” దుర్గ వంక ప్రేమగా చూస్తూ చెప్పింది ప్రియాంక.  దుర్గ ఆమె వంక కృతజ్ఞతగా చూసింది.

సంధ్య చాలా ఆనందపడుతున్న దానిలాగా “చాలా థాంక్స్ మేడం, మీరు మీ తండ్రిగారిని మించిన ఔదార్యం చూపించారు. నో డౌట్ ఎబౌట్ ఇట్. వస్తాను” అని అంటూ మళ్ళీ కలుస్తాని అని దుర్గను తీసుకుని అక్కడ నుండి నిష్క్రమించింది.

***

చుట్టూ చీకటి ఆవరించి ఉంది. శీతాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడం వల్ల చల్లటి గాలులు వీస్తున్నాయి.  అదొక అటవీ ప్రాంతం. చాలామంది ఆటవికులూ గిరిజనులూ ఇతర తెగల వాళ్ళూ అక్కడ ప్రకృతిమాత ఒడిలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.  ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో దొరికే రకరకాల మూలికలు, అరుదైన పూలు, ఫలసంపద వగైరా విశాఖపట్నం పరిసర ప్రాంతంలోకి తీసుకుని పోయి అమ్మడం ద్వారా అక్కడ ప్రజలు జీవనం సాగిస్తారు.

వారికి అవసరమైన ఆహారపదార్థాలను వారే సమకూర్చుకుంటూ ప్రపంచంతో అతితక్కువ సంబంధం పెట్టుకుంటూ వారు ప్రకృతిమాత ముద్దుబిడ్డలుగా కనిపిస్తారు. ప్రభుత్వం వారిచే నడుపబడే ఒక ప్రాథమిక పాఠశాల కూడా కలిగిన ఆ ప్రాంతం పేరు ‘నాయుడుపల్లి’. పేరుకైతే పాఠశాల ఉంది కానీ అందులో చదువుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం వలన దాదాపుగా అది సంవత్సరంలో ఎక్కువభాగం ఖాళీగానే ఉంటుంది.

దానికి కారణం అక్కడ ప్రజలు తాము ఏదైతే పండించుకుంటారో అదే తిని అందులో మిగిలినది మాత్రమే అమ్మకం చేస్తారు. అందువల్ల వారికి ప్రకృతితో పని ఉంది తప్ప లెక్కలు, చదువులు, అక్షరాలతో పనిలేదు అని అక్కడున్నవారి నమ్మకం. ఎన్నో సార్లు ప్రభుత్వ ప్రతినిధులు అక్కడ ప్రజల్లో ఈ అవగాహనారాహిత్యాన్ని పారద్రోలి చదువు ద్వారా ప్రకృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అని వారికి తెలియపరచడానికి ప్రయత్నించినా వారు పెద్దగా స్పందించలేదు. అంతేకాకుండా వారు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

అయితే ఈ ప్రాంతం వారు చేసుకున్న అదృష్టమో మరేదో తెలీదు కానీ మొత్తం ఆ ప్రదేశం అంతా అపారమైన జీవరాసులతో, పెద్ద పెద్ద కొండలతో పశుపక్ష్యాదులతో నిరంతరం కళకళలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రతీ ఏటా ఆశ్వయుజ శుద్ధ దశమినాడు మహంకాళీ దేవికి పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతూ ఉంటుంది.  ఎంతోకాలంగా ప్రయత్నించినా కానీ ఆ వేడుకను ఇప్పటివరకూ ఎవరూ చిత్రీకరించలేకపోయారు.

అది సాక్షాత్తూ కళ్ళతో చూడవలసినదే తప్ప వర్ణింపలేనిది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అక్కడ దర్శనం ఇచ్చే దివ్యజ్యోతిని కనులారా తిలకిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అక్కడవారి నమ్మకం. అధిక మొత్తంలో తనకు ముడుపులు అందించి ఏ విధంగా అయినా ఆ వేడుకను కెమెరాల్లో బంధించవలసినదిగా ఒక ఇంగ్లీష్ టీవీ చానెల్ వాళ్ళు బ్యాక్ ఎండ్ మీడియా అధిపతి సుదర్శన్‌ను కోరడం జరిగింది. అసలే నష్టాల్లో ఉన్న తమ ఛానెల్ ఇటువంటి ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రాం టెలీకాస్ట్ చెయ్యడం ద్వారా కొంత సొమ్ము చేసుకోవచ్చు అని ఆ టీవీ ఛానెల్ వారి అభిప్రాయం.

వారి ఉద్దేశం ఏమైనప్పటికీ తనకు రావలసిన పైకం తనకి వస్తే ఎలాంటి పని చెయ్యడానికైనా సుదర్శన్ సిద్ధంగానే ఉంటాడు. అందుకే ఆ ప్రాంతంలో నక్సలైట్ల భయం ఉందని తెలిసినప్పటికీ ధైర్యం చేసి విశాఖపట్నం నుండి నూట ఏభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయుడుపల్లికి నానా తంటాలు పడి చేరుకున్నాడు. ఊరికి ఇరవై కిలోమీటర్ల ముందువరకు మాత్రమే రహదారి మార్గం ఉంది, అక్కడ నుండి అడవి మధ్యగా ప్రయాణం చేసి కాలినడకన చేరుకోవాలి.

ఆ ప్రాంతం వారికి వేరే ఊరినుండి వచ్చేవారు అంటే పెద్దగా సదభిప్రాయం లేదు. పైగా పట్నం వాళ్ళు అంటే ఇంకానూ, అయితే ఈ విషయాలు ముందుగానే గ్రహించిన సుదర్శన్. తన తెలివితేటలను ఉపయోగించి అక్కడ గ్రామపెద్ద కుమారుడు భూక్యానాయాక్ ద్వారా తనకు అవసరమైన వసతీ అదీ ఏర్పాటు చేయించుకున్నాడు. తనతోపాటుగా వచ్చిన ఇద్దరు క్రూ మెంబర్స్ కూడా అక్కడ ఉన్న గుడిసెలో తమ సామగ్రి అంతా సెటప్ చేసుకుని జరగబోయే వేడుకను తమ కెమెరాలలో బంధించడానికి సిద్ధంగా ఉన్నారు.  సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో నృత్యగానాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.

తన అసిస్టెంట్లు ఇద్దరూ ఆ సందడిని విపులంగా చిత్రీకరిస్తూ ఉండగా ఊరికి దక్షిణం వైపున ఉన్న కొండల మీద ఏదో వెలుగుతున్నట్లుగా అనిపించి భూక్యాను ఆ విషయం అడిగాడు సుదర్శన్.

“దొరా అటుపక్కకు పోమాకు దొరా. ఆడికి ఎల్లినోరు యారూ పానాలతో తిరిగి రారు. ఆ దారంతా మరుమెకాలు తిరుగాడుతుంటవని ఊరిమాట. మాపట ఒచ్చిన పట్నమోళ్ళు నీకు మల్లేనే ఎల్లి ఆ మేకం నోటికి బలైనారు.  సెప్పినది ఆలకించు దొరా” అని తనకు తెలిసినది చెప్పాడు భూక్యా. సుదర్శన్‌కు ఎందుకో అతని మాటలు నమ్మాలి అనిపించలేదు.

అందుకే వారందరూ ఆ ఉత్సవం హడావిడిలో ఉండగా ఎవరికీ తెలీకుండా మెల్లిగా ఆ దక్షిణం వైపు కొండదగ్గరకు చేరుకున్నాడు. భూక్యా చెప్పినట్లుగా దగ్గరలో తనకు పులులు, సింహాలూ ఇతర క్రూర జంతువులేమీ కనిపించలేదు. అయితే చెట్లతో గుబురుగా నిండి ఉన్న ఆ కొండను ఎక్కగానే అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. కారణం అక్కడ ఏభై మందికి పైగా వ్యక్తులు సమావేశం అయ్యారు. వారందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి.

విశాలమైన మైదానం చివరన ఒక ఎత్తైన బండ లాంటిది ఉంది. దాని మీద నిలుచున్న ఏభై సంవత్సరాల వ్యక్తి ఎవరో క్రింద ఉన్న మనుషులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. ఆ ప్రదేశం నాలుగు వైపులా కాగడాలు నిలుపబడి ఉన్నాయి.  బహుశా కొండకింద తను చూసిన వెలుగు వాటినుంచి వచ్చినదే అయ్యుండాలి.

“కామ్రేడ్స్ మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామో మీకు తెలుసు. ప్రకృతితో సహజీవనం చేసే మన ఈ తండావారు, గిరిజనులూ, కోయలూ వీరంతా ఎంతో అమాయకులు. నిరక్షరాస్యులైన వీళ్ళను మన పెట్టుబడి దారీ ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేస్తోంది. గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్, ఏకనమిక్ రిఫార్మ్స్ అంటూ అపురూపమైన వన సంపదను నాశనం చేస్తూ, పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ మానవాళికి తీరని లోటు చేస్తోంది.

అందిన చోటల్లా అందరి భూములనూ లాక్కుంటూ అందని చోట అవసరమైన చట్టాలు చేస్తూ అందరిపైనా నియంతృత్వ ధోరణి చూపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఒకప్పుడు వ్యాపారరీత్యా మనదేశానికి వచ్చి మన సంపదలను కొల్లగొట్టి రెండు వందల సంవత్సరాలు మనల్ని నిరంకుశంగా పరిపాలించిన బ్రిటీష్ కాలం నాటి రోజులు పునరావృతం అవుతాయి.

అందుచేతనే కామ్రేడ్స్ అండ్ మై లెర్నడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిజం గ్రహించాల్సిన సమయం వచ్చింది. మన భూములను మనం దక్కించుకుందాం, మన ప్రజల భూములను వారికే ఉండేలాగా చేద్దాం. పెట్టుబడులనూ, పరిశ్రమలనూ, తవ్వకాలనూ వ్యతిరేకిద్దాం. మన భూముల్లో మనమే పండించుకుని మనమే తిని తిరిగి ఉత్పత్తి చేసి ఏ పెట్టుబడులూ అవసరం లేని స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా మన భారతజాతిని తీర్చిదిద్దుకుందాం. అందుకు అవసరమైతే సాయుధపోరాటం చెయ్యడానికి కూడా మనలో ఎవరూ వెనుకాడరాదు అని నేడే ప్రతిజ్ఞ చేద్దాం.

ఇది కేవలం మన ఒక్కరివల్లా సాధ్యమయ్యే పని కాదు. అందుకే మన భారతజాతికి మేలుచెయ్యడానికి కంకణం కట్టుకున్న మానవతామూర్తి శ్రీ భూషణరావు గారి అవసరం ఎంతైనా ఉంది. కనుక భూషణరావు గారి సహాయసహకారాలు అందుకోవడానికి మీ అందరి తరఫున నేను చేతులు కలుపుతున్నాను” అని భూషణరావుని అందరికీ పరిచయం చేసాడు బండపై నిలుచుని ఇప్పటివరకూ మాట్లాడిన వ్యక్తి.

ఆ మాట్లాడిన వ్యక్తి ప్రముఖ మానవతావాది, విప్లవ సాహిత్యవేత్త ఆదిత్యనారాయణ. అతను భూషణరావుని ఆ వేదికకు పరిచయం చెయ్యడం నిజంగా సుదర్శన్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే తనకు సుప్రీం కోర్టుకు వెళ్ళినా ఫలితం దక్కకపోవచ్చు అని ఊహించిన భూషణరావు నక్సలైట్లతో చేతులు కలిపి ప్రజా ఉద్యమం ముసుగున ప్రభుత్వం పై పోరాటం చేసి తన భూమిని దక్కించుకునే ఉద్దేశంలో ఉన్నాడన్నమాట.

ఇది ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందో అని ఆలోచిస్తున్న సుదర్శన్‌కు మరొక షాక్ తగిలింది.  నాయుడుపల్లికి కొంతదూరంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న వ్యర్థనిర్వాహణ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగనుంది. అదే రోజు ఆ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి తనయుడు రాహుల్‌పై దాడి జరపాలి అని ప్రస్తుతం తను చూసిన ఈ గ్రూప్ సిద్ధపడింది.

పైకి చూడ్డానికి ఈ పథకం అమలు జరిపేది ఆదిత్యనారాయణ క్రింద వర్గం అయినా దీని వెనుక మాత్రం భూషణరావు హస్తం ఉండబోతోంది సుదర్శన్ గ్రహించాడు. ఇది ప్రభుత్వం పైన ప్రజల్లో అసమ్మతి తీసుకురావడానికి పన్నిన కుట్ర.  వెంటనే తన ఫోన్ అందుకుని సిధ్ధార్థకు కాల్ చేసాడు సుదర్శన్.

“సార్ ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలిసింది. రేపు ఇరవై నాలుగున జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో రాహుల్‌పై ఎటాక్ జరిగే అవకాశం ఉంది” అని తను ఇప్పటివరకూ విన్నది, తను ఎక్కడ ఉన్నదీ అంతా సిధ్ధార్థకు వివరించాడు. ఆ సమయానికి తను పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ చేరుకొని నేరుగా నకునారెడ్డిగారిని చూడడానికి హాస్పిటల్‌కు వెళ్తున్నాడు. అంతా విన్న తరువాత సిద్ధార్థ్

“ఈ విషయం మీరు నేరుగా రాహుల్‌కే ఇన్ఫార్మ్ చెయ్యచ్చు కదా, నాకెందుకు చెప్తున్నారు” అర్థం కానట్లుగా అడిగాడు.

“భలేవారు సార్ ఏ విషయం ఎవరికి చెప్తే ఎలాంటి ప్రాఫిట్ వస్తుందో మాకు తెలుసు. ఈ సంగతి వారికి చెప్తే విన్న వెంటనే ఇలాంటి బెదిరింపులు తమకేమీ కొత్తవికాదని కొట్టిపడేస్తారు. అందులో నిజముందా లేదా అన్నది తరువాత విషయం. ఇకపోతే మీకీ విషయం చెప్తే మీకు రాజకీయపరంగా, నాకు వ్యాపారపరంగా ఇద్దరికీ లాభమే” అని మెల్లిగా చెప్పాడు సుదర్శన్

“అంతేకానీ మీరు డైరెక్ట్‌గా ప్రభుత్వానికి ఉపయోగపడను అంటారు. అవునా” అడిగాడు సిద్ధార్థ.

“అయ్యో ఉపయోగపడకపోయే వాడిని అయితే ఈ విషయం ఎవరికీ తెలీకుండా భూషణరావుతోనే బేరం మాట్లాడుకునే వాడిని కదా సార్. నాక్కూడా అంతో ఇంతో దేశభక్తి, నీతీ నిజాయితీ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ నేనొక బిజినెస్‌మాన్‌ని, నా వ్యాపారంలో నాకుండే ఎథిక్స్ నాకున్నాయి. అర్థం చేసుకోండి” అని చెప్పి వెకిలిగా నవ్వాడు సుదర్శన్.

సరే అని అతనితో పెద్దగా వాదన పెట్టుకోకుండా కాల్ డిస్కనెక్ట్ చేసి హాస్పిటల్ రిసెప్షన్‌లో ప్రియాంక ఉన్న గెస్ట్‌హౌస్ దారి తెలుసుకుని వెళ్ళాడు సిద్ధార్థ. అతను వెళ్ళేప్పటికి ఆమె అక్కడ హాల్లో ఉన్న సోఫాలో కునికిపాట్లు పడుతోంది. అతను అక్కడకు రావడం చూడగానే ఎంతో ఆనందపడింది ప్రియాంక.

“రా సిద్ధూ, ఇప్పుడే డాడీని చూసి వస్తున్నాను. ఆయనకు నయమైంది కానీ ఇంక ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరం. ఇప్పటికే ఆయనకు చాలా స్ట్రోక్స్ వచ్చాయి కదా, ఇకమీదట ఎటువంటి ఒత్తిడి కలిగించే విషయాలూ ఆయనకు తెలియజేయవద్దని డాక్టర్లు అన్నారు. సాధ్యమైనంతవరకు ఆయనకు తోడుగా ఎవరినైనా ఉంచమని డాక్టర్లు అన్నారు. ఇప్పటివరకూ అక్కడే ఉండి ఇప్పుడే మా అమ్మగారి సజెషన్ మీదట ఇక్కడికి వచ్చాను. ప్రసాద్ గారు కూడా ఇందాకటివరకూ ఇక్కడే ఉన్నారు. రేపు జరగబోయే మీటింగ్ నీకు క్రూషియల్ కదా” తన తండ్రి గురించి అన్ని వివరాలూ చెప్తూనే అతడిని గురించి కూడా ఆరాతీసింది ప్రియాంక.  అవునన్నట్లుగా తల ఆడించిన సిద్ధార్థ రాహుల్ గురించి తనకు తెలిసిన విషయం నకునారెడ్డి గారికి తెలియపరచాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు.

“అది సరే ఇంతకీ అంకుల్‌కి ఇప్పుడు బాగానే ఉంది కదా. ఆయనను ఇంటికి తీసుకువెళ్ళవచ్చా డాక్టర్స్ ఏమన్నారు” అడిగాడు సిద్ధార్థ

“యా సిద్ధూ, రేపు ఉదయమే డిశ్చార్జ్ చేస్తామన్నారు.  మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకల్లా ఇంట్లో ఉంటాం. పాపం ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేసారు. నాన్నగారికి అనారోగ్యంగా ఉన్న దగ్గరనుండి ప్రసాద్ గారు తన సొంత ఫ్యామిలీని కూడా వదిలి డాడీతోనే ఎక్కువగా ఉంటున్నారు. నిజంగా ఈ రోజుల్లో అంతటి నమ్మకస్తుడైన స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం” ఆమె కళ్ళలో ప్రసాద్ పట్ల కృతజ్ఞతా భావం తొంగిచూసింది.

“సరే ప్రియాంక అయితే రేపు మార్నింగ్ అంకుల్‌ని ఇంట్లో డ్రాప్ చేసి, మెడిసిన్స్, నర్స్ ఇవన్నీ సెటప్ చేసిన తరువాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి నువ్వు పార్టీ ఆఫీస్‌కు తప్పకుండా రావాలి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్” అభ్యర్ధనగా అడిగాడు సిద్ధూ.

“నేనా ఎందుకు సిద్ధూ” ఆశ్చర్యంగా అడిగింది ప్రియాంక. ఇంకా తన దగ్గర దాచి లాభం లేదనిపించి రాహుల్‌పై జరగబోయే ఎటాక్ గురించి తనకు సుదర్శన్ చెప్పినదంతా వివరించాడు సిద్దార్థ.

“ఈ సమయంలో అంకుల్‌కి ఈ విషయం తెలియడం ఆయన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.  అందుకే నీకు చెప్తున్నాను.  సో నువ్వు ఏమి చెయ్యాలో డిసైడ్ చేసుకుని రేపు మాత్రం పార్టీ ఆఫీసుకు రావడం మర్చిపోకు. అంతకన్నా నేను నిన్న కోరగలిగినది ఏమీ లేదు. ఉంటాను” అని చెప్పి అక్కడి నుండి కదిలి తను రిజర్వ్ చేయించుకున్న హోటల్‌కి వెళ్ళాడు సిద్ధార్థ.

ఆలోచనలతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోయింది, కొంతసమయం తరువాత ఏమి చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అక్కడ సోఫాలో నిద్రపోయింది ప్రియాంక.

***

పార్టీ ఆఫీస్ అంతా కోలాహలంగా ఉంది, ఒకొక్కరుగా పార్టీ నాయకులు అంతా చేరుకుంటున్నారు. బయటంతా యథావిధిగా మీడియావారు గుమిగూడి ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకుంటూ మధ్యమధ్యలో ఎమ్మెల్యేలు వస్తే ఇంటర్వ్యూ కోసం వారి వెంట పడుతున్నారు.

ముఖ్యంగా ఆరోజు చర్చించబోయే అంశాలు ప్రభుత్వం నిర్మించబోతున్న వ్యర్థ నిర్వహణ ప్రాజెక్ట్ విషయంపై తమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ప్రస్తుతం పార్టీకి నాయకుడిగా ఉన్న నకునారెడ్డి అస్వస్థతతో ఉండడం వయసు మీద పడడంతో, ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావడం అనుమానాస్పదం అని పుకార్లు వస్తున్న నేపధ్యంలో పార్టీకి సారధ్యం వహించవలసినది ఎవరైనదీ నిర్ణయించడం.

ఇకపోతే నకునారెడ్డి అనారోగ్యంతో పార్టీ రెండువర్గాలుగా చీలిపోయింది. మొదటిదాంట్లో ప్రసాద్, సిద్ధార్థతో కూడిన యువరక్తం ఉంటే, రెండో దాంట్లో హనుమంతరావు ఆయనకింద ఉన్న ఇరవైమంది ఎమ్మెల్యేలు, తదితర సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ హనుమంతరావుని కూడా గతంలో నకునారెడ్డే పార్టీలోకి తీసుకురావడం జరిగింది.

అతనికి గతంలో బ్లాక్ మార్కెటింగ్, లిక్కర్ బెల్ట్ మాఫియా లాంటివాటితో సంబంధం ఉంది.  ఐనప్పటికీ పార్టీకి గడ్డుసమయంలో చాలా వెన్నుదన్నుగా ఉండి తన విశ్వసనీయతతో పార్టీలో స్థానం సుస్థిరం చేసుకుంటూ వచ్చాడు. గత ప్రభుత్వంలో హోం మంత్రిగా పదవి నిర్వహించిన హనుమంతరావు పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ప్రజల్లో బాగానే పలుకుబడి సంపాదించుకున్నాడు.

అయితే నకునారెడ్డిగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా నోరు మెదపని హనుమంతరావు, తను ఇంకా పార్టీలోకి రావడం కష్టం అని తెలుసుకోగానే, మిగిలి ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి అవసరమైన పనులన్నీ చేసి అందులో తొంబైశాతం వరకూ కృతకృత్యుడయ్యాడనే చెప్పుకోవచ్చు. అతడి మీద ఉన్న నెగటివ్ రిమార్క్ దుందుడుకు స్వభావం, ఇంకా వ్యర్థ ప్రేలాపనలూ. అలా ఒకటిరెండు సార్లు బహిరంగ సభల్లో నోరు జారి ప్రజల ఆగ్రహానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి.  అలాంటి సమయంలో నకునారెడ్డి ఆయనకు అండగా నిలిచాడు.

ఇప్పుడు కొత్తగా పార్టీలోకి చేరిన సిద్ధార్థ పట్ల ఆయనకు ఈర్ష్యగా ఉండడానికి కారణం కూడా అదే. పార్టీని యువరక్తంతో సంస్కరించాలి అని నకునారెడ్డిగారు రెండు మూడుసార్లు తనతో అనడం కూడా హనుమంతరావుకి రుచించలేదు. పైగా పార్టీని అప్రతిష్ఠ పాలు చేసాడు అన్న నెపంతో ప్రస్తుతం జైల్లో ఉన్న నాచిరెడ్డిని బర్తరఫ్ చేసే ప్రతిపాదన పార్టీ ముందు పెట్టాలి అని తాము అనుకుంటూ ఉండగా మీడియా ముందర నాచిరెడ్డికి సపోర్ట్‌గా సిద్ధార్థ మాట్లాడడం కూడా ఆయన అక్కసుకు కారణం అయ్యింది.

అంతేకాదు తమకిలాగ కాకుండా సిద్ధార్థ విరివిగా ప్రజల మధ్యకు వెళ్తూ రాష్ట్రం మొత్తం క్షణం కూడా తీరిక లేకుండా తిరగడానికి ప్రయత్నిస్తూ, పార్టీలో అందరి మన్నలు పొందుతున్నాడని పార్టీలో తన వర్గం ద్వారా తెలుసుకున్నాడు. ప్రసాద్ గారు వెంటరాగా అప్పుడే హాల్‌లోకి ప్రవేశించాడు సిద్ధార్థ. అతని వెనకే యువకార్యకర్తలు చాలామందే ఉన్నారు.

అక్కడ ఉన్న పెద్ద హాల్లో నేలమీద పరుపులు లాంటివి పరిచి ఉన్నాయి. హనుమంతరావు తరఫు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, పోలిబ్యురో మెంబర్స్ అందరూ కలిపి దాదాపు వందమందిపైగా ఆ హాల్లో సమావేశమై ఉన్నారు. మీడియా ప్రతినిధులకు ఆ హాల్లోకి ప్రవేశం లేని విధంగా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు. సభకు గౌరవ అధ్యక్షత వహించవలసినదిగా హనుమంతరావు డాక్టర్ ప్రసాద్ గారిని కోరడం జరిగింది.

“ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్యకారణం పార్టీకి ఎంతోకాలం సేవ చేసి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు శ్రీ నకునారెడ్డిగారి అస్వస్థత.  ఆయనకు అత్యంత సన్నిహితుడ్ని అవ్వడం వల్ల ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన ఇంక రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నట్లుగా నాతో చెప్పారు. ఐనప్పటికీ ప్రస్తుతం సిబిఐ ఆయనపై జరుపుతున్న విచారణలో ఆయన ఒంటరి కాదని పార్టీ వెన్నుదన్నులు ఆయనకు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను” అని చెప్పాడు ప్రసాద్. ఆయన ఆ మాట అనగానే సభంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

“ఇకపోతే జరుగుతున్న పరిణామాలూ, రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంలో నాయకత్వలేమితో ప్రజల సమస్యలు ఆలోచించేకన్నా అంతర్గత వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి అని మీడియాల్లోనూ, తదితర మాధ్యమాల్లోనూ వార్తలు రావడం దురదృష్టకరం. ఈ నేపధ్యంలో మన పార్టీ ఎజెండాలో ముఖ్య ఉద్దేశాల్లో ఒకటైన ‘అందరికీ భూమి’ అనే అంశాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల తరఫున పోరాడాలన్నా మనకి నాయకుని అవసరం ఎంతైనా ఉంది.

అంతేకాకుండా ప్రజల్లో మన పార్టీ కోల్పోతున్న విశ్వసనీయత తిరిగి రాబట్టుకోవాలంటే ధృడమైన నాయకత్వం చాలా అవసరం. అందుకే మన పార్టీ నాయకుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని నిర్ణయించడం జరిగింది. అభ్యర్ధులు ఇద్దరూ వేదికమీదకు రావలసినదిగా కోరుచున్నాను” అని చెప్పి వేదికకు ఎడం పక్కగా వెళ్ళాడు ప్రసాద్.

హనుమంతరావు వేదికను ఎక్కుతుండగా నాయకుల్లోనూ, ఎమ్మేల్యేల్లోనూ, కార్యకర్తల్లోనూ అత్యంత ఉత్సాహం ప్రవేశించింది.  వారి అరుపులూ, గోలలూ చప్పట్లతో హాల్ దద్దరిల్లిపోయింది. కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేసారు.

“అయ్యా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు నేనూ, నకునారెడ్డి సిరకాలంగా మిత్తుర్లం. ఏదో అదృష్టం వల్ల ఆ టైములో ఆడు సీఎం అయ్యాడు, మరి నాను ఓముతో సరిపెట్టుకున్నాను. అయినా కానీ నేను ఏరోజూ ఏడిసింది లేదు, మా నకునారెడ్డి ఏటంటే అదే సేత్తూ ఉండేవాణ్ణి.  పిల్లకాయలు సెమించాలి, ఆడు నేను పెండ్స్ అందుకే సనువుగా మాట్టాడతాండా. మరి ఈరోజు అంతటి మగానుబావుడికి అనారోగ్యం రావడమనేది సానా ఇచారించదగిన ఇసయం. మడుసులన్నాకా అనారోగ్యం రాకుండా పోద్దా ఏటి, అలా అని మన పెజల కష్టాలు ఆగుతాయా, లే, మనమే ఏదో ఒకటి సేసి మన నాయకుడు లేని లోటును భర్తీ సెయ్యాలి. మరింతకాలం పార్టీకి కుక్కలా సేవ జేసినా నన్ను నాయకునిగా ఉండమంటారో, లేదా కొత్తగా వచ్చిన పిల్లకాయ్ ఈ సిద్ధార్థ బాబుని ఎన్నుకుంటారో మీ ఇట్టం అబ్బాయి. ఏమైనా పార్టీకి పతీసారి సేవ చెయ్యడం, పెజల ఇక్కట్లు తీర్చడం మాత్రమే నాకు ఎరుకైంది అబ్బా. ఇగ మిగిలింది మీరు దేవులాడుకోండి. ఏంది” అని చెప్పి అక్కడి నుండి క్రిందకు దిగారు. ఆయన మాట్లాడిన వెంటనే అక్కడున్న వారిలో గుసగుసలు మొదలయ్యాయి.

కాసేపటికి సిద్ధార్థ మైకు ముందుకి వచ్చాడు “ఆయన్ను నేను ఎంతో ఆప్యాయంగా అంకుల్ అని పిలిచేవాడిని. నిజంగా నకునారెడ్డిగారు నాకొక గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన స్ఫూర్తితోనే నేనీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నాయకత్వం మీద నాకు ఎప్పుడూ ఆసక్తి లేదు. నేను కేవలం కార్యాచరణకు మాత్రమే నిమిత్తం, అందుకే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను.  ఆమెకే నేను ఈ పార్టీ నాయకత్వం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్‌కమ్ ‘మిస్ ప్రియాంకా’ ” అని అన్నాడు సిద్ధార్థ.  అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సమావేశం మధ్యకు ప్రవేశించింది ప్రియాంక.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here