[box type=’note’ fontsize=’16’] “స్క్రిప్ట్ పై ఇంకాస్త శ్రద్ధపెట్టి, నటీనటుల ఎంపికలో జాగ్రత్త వహించి వుంటే చక్కని సినిమాగా ఎదిగివుండేది. వ్యర్థమయిన చక్కని ప్రయత్నంలా మిగిలేది కాదు” అంటున్నారు కస్తూరి మురళీకృష్ణ ‘యన్.టి.ఆర్. కథానాయకుడు‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా నిర్మించిన చలనచిత్రం ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ చూస్తున్నంతసేపు బాపు రమణలు ఎన్.టి.రామారావు కోరికననుసరించి నిర్మించిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమా గుర్తుకు వస్తూనే వుంది. ఎందుకంటే, ఆ సినిమాని కూడా బాపురమణలు చక్కగా రూపొందించారు. కానీ, ప్రధానపాత్రధారిగా ఎన్.టి.రామారావు వయసుడిగి కనిపించాడు. అస్సలు సరిపోలేదు. అంటే సినిమా ఎవరు కేంద్రబిందువుగా నిర్మితమయిందో, ఎవరి ఆధారంగా సినిమా ప్రజలను రంజింపచేయాలో వారే ఆ సినిమా ప్రజల మెప్పు పొందటంలో ప్రతిబంధకంలా తయారయ్యారన్నమాట. ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమా ఆరంభంలోనే ఈ భావం కలుగుతుంది. అది సినిమా సాంతం కొనసాగుతుంది.
ఎన్.టి.రామారావు మరణించి దాదాపుగా రెండు దశాబ్దాలవుతున్నా, ఆ కాలం నాటి పలు సినీ కళాకారుల్లా ఆయన ఈనాటికీ ప్రజల మనస్సుల్లో సజీవంగానే వున్నారు. ఎస్వీయార్, సావిత్రి, రేలంగి, అక్కినేని నాగేశ్వర రావు, ఘంటసాల ఇలా ఆ కాలం నాటి కళాకారులు మరణంలేని వారు. చిరంజీవులు. పైగా, కేవలం నటుడిగానే కాదు, రాజకీయాల్లో ప్రవేశించి, తెలుగుదేశం పార్టీ ద్వారా, రాజకీయాల ద్వారా కూడా ఆయన సజీవంగానే వున్నారు. అనుక్షణం ఏదో ఒక రూపంలో గుర్తుకు వస్తూనే వున్నారు. దీనికితోడుగా, ఆయన వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్. వంటివారుకూడా ఆయనను అనుక్షణం తలపుకు తెస్తూంటారు. నవ యువతరానికి, తరుణతరానికి కూడా రామారావు మాయాబజార్, పాతాళభైరవి, లవకుశ వంటి సినిమాల ద్వారా పరిచయమే. అంటే, ఎన్.టి.ఆర్. జీవితం ఆధారంగా సినిమా తీయాలంటే, ఇంకా సజీవంగానే వుంటూ, ప్రజల మనస్సులలో ఒక మామూలు మనిషి స్థాయిని దాటి మహానుభావుడిలా నిలచిన వ్యక్తి సజీవచిత్రాన్ని మరపించే రీతిలో వుండాలన్నమాట. ఇది దాదాపుగా అసంభవమయిన విషయం. ఎన్.టి.రామారావులాంటి ఆకర్షణ, ఆంగికము, అభినయము, వాచికము కలవారు యుగానికి ఒక్కరొస్తే గొప్ప. కేవలం ఆయన సంతానమైనందువల్లనో, ఆయన పోలికలున్నందు వల్లనో ఆయన వేషంవేసి ప్రజలను మెప్పించగలమనుకోవటం పొరపాటు. కృష్ణ నటించిన దేవదాసు విడుదల కాగానే నాగేశ్వరరావు దేవదాసు సినిమా విడుదలయినప్పుడు పాత సినిమాపై ప్రేమ మరింత పెరిగింది. ఇక్కడ ఎన్.టి.రామారావు ఏ సినిమా కూడా విడుదల చేయాల్సిన అవసరం లేకుండా ఆయన అందరి మనస్సుల్లో సజీవంగా వున్నాడు. కాబట్టి, ఎవరు ఆయన వేషం వేసినా సజీవంగా వున్న మూర్తి మరింత తేజోమయమవుతాడు. వేషం ఎంత బాగా వేసినా తేలిపోతారు. ఎన్.టి.రామారావు ప్రభావం అలాంటిది. అంటే, ఎన్.టి.రామారావు జీవితం ఆధారంగా సినిమా తీయటం అన్నది దాదాపుగా స్వర్గానికి నిచ్చెన వేయటంలాంటిదే అన్నమాట. అయినా, అలాంటి ప్రయత్నం చేసి, నిజాయితీగా, చిత్తశుద్ధితో సినిమాను నిర్మించి అందించినందుకు ఈ సినిమాతో సంబంధంవున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులే. అసంభవమనుకున్న దాన్ని సంభవం చేయాలని ప్రయత్నించటం అభివృద్ధి పథంవైపు పడే సవ్యమైన అడుగు, ఫలితంతో సంబంధం లేకుండా!!!
జీవిత చరిత్ర సినిమాలు తెలుగులోనే కాదు, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అరుదు. ఇటీవలి కాలంలో జీవిత చరిత్ర సినిమాల వ్యాపారలాభాలు తెలియటం వల్ల అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. అంతకుముందు చరిత్ర ఆధారిత సినిమాలయినా, చారిత్రిక పురుషుల జీవితాల ఆధారంగా నిర్మిచిన చిత్రాలయినా నిజం కన్నా, ఊహపైన, పరిశోధన కన్నా కాల్పనిక గాథలపైనా ఆధారపడివుండేవి. మనోజ్ కుమార్ రూపొందించిన షహీద్ భగత్ సింఘ్ జీవిత గాథ, సవ్యమైన రీతిలో జీవితచరిత్ర చిత్రాల నిర్మాణం దిశలో తొలి అడుగు. తరువాత, మళ్ళీ రిచర్డ్ ఆటెంబరో ప్రామాణికమైన రీతిలో మహాత్మా గాంధీ జీవితాన్ని తెరకెక్కించేవరకూ మన కళాకారులు జీవితచరిత్రల జోలికి పోలేదు. ఆ తరువాత వరుసగా వల్లభ్ భాయ్ పటేల్, భీం రావ్ అంబేద్కర్ లాంటి నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు రూపొందాయి. ఇటీవలి కాలంలో ఆటగాళ్ళ జీవితాలను, దొంగలు, హంతకుల జీవితాలను తెరకెక్కించటం ఆనవాయితీగా మరింది. సినీ కళాకారుల జీవితాలను తెరకెక్కించటం వైపు అందరి దృష్టి ‘డర్టీపిక్చర్’తో మళ్ళింది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందింది. హాస్య నటుడు భగవాన్ జీవితం ఆధారంగా మరాఠీలో ఒక సినిమా రూపొందింది. మలయాళం సినిమా పితగా భావించే జే.సీ.డేనియల్ జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందింది. సాదత్ హసన్ మాంటో జీవితం ఆధారంగా ఒక సినిమా తయారయింది. సాహిర్ లూధియాన్వీ జీవితం ఆధారంగా సినిమా తయారవుతోంది. ఈ క్రమంలో నటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ తెలుగులో తయారయింది. ఘన విజయం సాధించింది. దాంతో ఎన్.టి.రామారావు జీవితం ఆధారంగా సినిమా రూపొందించాలన్న ఆలోచన తలెత్తివుంటుంది.
జీవిత చరిత్రల సినిమాలను బయోపిక్ లంటారు. విదేశీ కళాకారులు ఎవరినీ వదలకుండా, ఏమాత్రం నాటకీయత వున్నా సరే ప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తారు. అవార్డులు కొట్టేస్తారు. చివరికి అగాథ క్రిస్టీ జీవితంలో ఒక వారంపాటు ఆమె అదృశ్యమైన సంఘటనను కూడా, ఆ వారంలో ఏమి జరిగివుంటుందో ఊహించి మరీ సినిమా తీసేశారు. కానీ, మన దగ్గర అలాంటి పద్ధతి లేదు. పైగా, ఒక జీవిత చరిత్ర తీయాలంటే ఎన్నో వివాదాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుంది. ముఖ్యంగా రామారావు లాంటి పలు విభిన్నమయిన కోణాలున్న ప్రముఖ వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించాలంటే ఎంతో ఆలోచించాల్సివుంటుంది. ఈ అడ్డంకులనన్నీ దాటుకుని సినిమాను రూపొందించటం ప్రశంసనీయం.
బయోపిక్‌లు రెండు రకాలు. ఒకటి, ఎవరి బయోపిక్ తీస్తున్నారో ఆ వ్యక్తిపై ప్రజలకు సానుభూతి కలగాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించినవాడు, చివరికి అధోపాతాళానికి దిగజారాలి. సావిత్రి జీవితంలో ఆ డ్రామా వుంది. సెంటిమెంట్ వుంది. ఒకవైపు సావిత్రి నటనను గుర్తుకుతెచ్చుకుంటూ, మరోవైపు సినిమాలో సావిత్రిపై, తమ మనస్సుల్లో వున్న సావిత్రిని ఆరోపించి చూసుకుని సానుభూతి చూపిస్తూ ప్రేక్షకులు స్పందించారు ‘మహానటి’ సినిమాకు. రెండవది, ఎవరి బయోపిక్ తీస్తున్నారో ఆ వ్యక్తిపై ఆరాధనాభావంతో తీస్తారు. ఆ వ్యక్తి గొప్పతనాన్ని అడుగడుగునా చూపిస్తారు. దీనివల్ల జరిగేదేమిటంటే, సినిమాతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందటం కష్టమవుతుంది. ఆ వ్యక్తిని ఎంతగా అభిమానించినా రెండు మూడు గంటల సేపు ఒక వ్యక్తి గొప్పతనం చూస్తూండటం కష్టం. అందుకే, దైవం గొప్పతనం చూపే సినిమాల్లో ప్రేమలు, అద్భుతాలు, సెంటిమెంట్లు వుంటాయి. అవి సరిగా పండకపోతే, దేవుడి సినిమా అయినా ప్రేక్షకులు మెచ్చరు. ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమా రెండవ కోవకు చెందినది. అందుకే, ‘మహానటి’ సినిమాకు స్పందించినట్టు ప్రేక్షకులు ఎన్.టి.రామారావు సినిమాకు స్పందించలేదు.
బాలకృష్ణ తరువాత ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ స్క్రిప్ట్. బయోపిక్ అనేది కొన్ని సంవత్సరాల జీవితాన్ని కొన్ని గంటలలో చూపుతుంది. అలాంటప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని వరుసగా చూపించే బదులు, ఏదో ఒక ప్రధానాంశాన్ని ఎన్నుకుని సినిమాను ఆ అంశం కేంద్రంగా రూపొందిస్తే, రెండు గంటలలో ఆసక్తికరంగా సినిమాను రూపొందించవచ్చు. పలువురి ప్రశంసలు పొందిన ఆంగ్ల చిత్రం లింకన్, అబ్రహాం లింకన్ జీవితంలోని ఒక ప్రధాన ఘట్టాన్ని ఆధారం చేసుకుని రూపొందించింది. దాన్లో అబ్రహాం లింకన్ జీవితమంతా కనబడదు. కానీ, ఆయన వ్యక్తిత్వం కనిపిస్తుంది. మిల్కా సింగ్ సినిమా మిల్కా సింగ్ జీవితంలోని ప్రధాన ఘట్టమయిన ఒలంపిక్ ఆట కేంద్రంగా నడుస్తుంది. దంగల్, మేరీ కోం వంటి సినిమాలూ ఇంతే. అంటే, సినిమా ఆరంభం నుంచీ ఒక లక్ష్యం వైపు పరుగెత్తుతుందన్నమాట. అది సాధించిన తరువాత వారి జీవితం ఏమైనా సినిమాకు అనవసరం. అయితే, ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమాలో రామారావు జీవితాన్ని మొత్తంగా చూపాలనుకోవటం పెద్ద అత్యాశ. ఇందువల్ల, సాగర సంగమం కోసం పరుగుడాల్సిన నది, దారితప్పి సగంలోనే ఎండిపోయినట్టు, లక్ష్యమన్నది లేకుండా తయారయింది సినిమా. ఒక దృశ్యం తరువాత మరో దృశ్యం వస్తూంటుంది. ఒక విజయం తరువాత మరో విజయం వస్తూంటుంది. కానీ, ఈ పయనం ఎటువైపు అన్నది ప్రేక్షకుడికి తెలియదు. దాంతో సినిమా లక్ష్యరహితంగా అనిపించి విసుగు కలిగిస్తుంది. ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేకపోతాడు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చే సంఘటనలను ఏకసూత్రంతో స్క్రిప్ట్ బంధించకపోవటంతో ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేకపోతాడు. దాంతో సినిమా ఒక వ్యక్తి జీవితంలోని సంఘటనలను ప్రతిబింబించే డాక్యుమెంటరీలా తోస్తుంది. ఈ సినిమా విషయంలో జరిగిందీ అదే.అంటే, ప్రవహించే నదిలా సినిమాను ఊహించాల్సిన స్క్రిప్ట్, అక్కడక్కడా సుళ్ళు తిరిగుతూ కదలని ప్రవాహంలా రూపొందింది. అంటే, సినిమాకు లక్ష్యాన్ని నిర్ణయించటంలో స్క్రిప్ట్ విఫలమయిందన్నమాట. ఇది సినిమా ఆరంభ దృశ్యం స్పష్టం చేస్తుంది.
సినిమా కేన్సర్ ఆస్పత్రిలో ఆరంభమవుతుంది. ప్రధానపాత్ర భార్య, పిల్లలు ఆస్పత్రి ఆవరణలో మాట్లాడుతూంటారు. ఆల్బంలో సైకిల్ తొక్కుతున్న యువ రామారావు కనిపిస్తాడు. సినిమా ఫ్లాష్‌బాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్‌బాక్ లోకి వెళ్ళగానే ప్రేక్షకుడికి షాక్ తగులుతుంది. యవ్వనంలో రామారావు సన్నగా, నాజూకుగా, మిసమిసలాడుతూ వుంటాడు (నీకెలా తెలుసు అని అడగకండి. అందరికీ తెలుసు). కానీ, తెరపై సైకిల్ తొక్కుతున్న రామారావు యవ్వనవంతుడు కాడు. పైగా ఎంతగా మేకప్ చేసినా వయసును కళ్ళు పట్టించేస్తూంటాయి. ఇక్కడే ప్రేక్షకుడికి నిరాశ కలుగుతుంది. సినిమా విఫలమవటానికి, ప్రేక్షకుడిని ఆకర్షించలేకపోవటానికి నాందీ ప్రస్తావన జరిగిపోయింది. అయితే, స్క్రిప్ట్ రచనలో ప్రధాన సూత్రం ఏమిటంటే, ఆరంభంలో ఫ్లాష్‌బాక్ వుంటే, చివరలో సినిమా అక్కడే వర్తమానంలోకి రావాలి. ఫ్లాష్‌బాక్ అనేది బ్రాకెట్ లాంటిది. సినిమా ఆరంభించి ఫ్లాష్‌బాక్ లోకి వెళ్ళటమంటే, అక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసినట్టు… అంతంలో మళ్ళే అక్కడ వర్తమానంలోకి రావటమంటే, బ్రాకెట్ క్లోజ్ చేసినట్టు. ఇది ఈ సినిమాలో జరగదు. రెండవ భాగంలో బ్రాకెట్ క్లోజ్ చేస్తుండచ్చు అనుకుని సంతృప్తి పడ్డా… అది అసంతృప్తినే మిగులుస్తుంది. స్క్రిప్ట్ రచనలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న భావన కలిగిస్తుంది. నిజానికి కాన్సర్ ఆస్పత్రి దృశ్యాలు లేకుండా సినిమాను తిన్నగా ఆరంభించినా నష్టంలేదు. అనేక హాలీవుడ్ నవల ఆధారిత సినిమాల్లోలాగా, ఆరంభంలో ఆల్బం చూపి ఒకో పేజీ తిప్పుతూ, ఒక పేజీ ఫోటోను క్లోజ్ అప్ చూపి అటునుంచి లైవ్ సినిమా ఆరంభించవచ్చు… అందువల్ల ఫ్లాష్‌బాక్ సమస్య రాదు. అనవసరంగా అనిపించే కాన్సర్ ఆస్పత్రి సన్నివేశాలు తప్పుతాయి. ఎందుకంటే మొదటి దృశ్యం కాన్సర్ ఆస్పత్రిలో రోగిని చూపితే ఆ రోగి మరణంతో సినిమా అంతమవాలి. అది జరగకపోతే లోపం స్క్రిప్టు రచయితది. కానీ, ఆమె మరణం చూపాలంటే స్క్రిప్ట్ రచయిత ఊహించిన రెండవభాగం కథ దెబ్బతింటుంది. అంటే, సినిమా రామారావు నట జీవితంలో చాలెంజెస్‌కో, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలకో, పరిమితం చేసి, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలకు, సినీ జీవితంలోని చాలెంజెస్‌కూ సమన్వయం చేసి సమాంతరంగా స్క్రిప్ట్ రూపొందిస్తే సినిమా మరోరకంగా వుండేది. అంటే, మొత్తం జీవితం కాకుండా కొన్ని అంశాలను ఎన్నుకుని, వాటిని ఏకసూత్రంతో బంధించి లక్ష్యాన్ని నిర్ణయించివుంటే సినిమాకొక గమనం ఏర్పడి వుండేది.
స్క్రిప్ట్‌లో రెండవ లోపం, ఏ పాత్రనీ ఎదగనివ్వకపోవటం. సినిమా ప్రధానంగా రామారావు చుట్టూ తిరిగినా, పక్కన వున్న ఇతర పాత్రలు ఆ పాత్రకు దీటుగా ఎదిగినప్పుడే ప్రధాన పాత్ర ఎలివేట్ అవుతుంది. ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమాలో సన్నివేశాలు ఒకటొకటిగా వచ్చిపోతూంటాయి, కానీ, ఏ పాత్రనూ ఎలివేట్ చేయవు. ఏ పాత్ర కూడా ప్రేక్షకుడి మనస్సులో ముద్రవేయదు. చివరికి రామారావు భార్య పాత్ర కూడా, అలా వచ్చిపోతూంటుంది తప్ప రక్త మాంసాలతో సజీవంగా నిలవదు. ఈ లోపం ‘మహానటి’ సినిమాలోనూ చూడవచ్చు. కానీ, ఆ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ఈ లోపాన్ని అధిగమించింది. దీనికితోడు సినిమా సంఘటనలను నిజజీవితానికి సమన్వయం చేస్తూ జర్నలిస్ట్ పిట్టకథ వుంటుంది. ఇది అప్రస్తుతం అనిపించినా సినిమా పూల దండను పట్టివుంచిన దారంలాంటిది. ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమాలో రామారావుకూ ప్రేక్షకులకూ వున్న మానసిక అనుబంధం తప్ప, సినిమాలో ప్రత్యేకంగా మరో ఆకర్షణీయ అంశం, దీటయిన మరో పాత్ర, స్పందించే అంశం లేకపోవటం ప్రేక్షకుడిని పట్టి కూచోపెట్టలేకపోవటానికి కారణం. అయితే, ఒకవేళ అలాంటిది వున్నా రామారావుగా బాలకృష్ణ ప్రేక్షకుడిని పాత్రలో లీనమవనివ్వడన్నది వేరే విషయం. అయితే, సినిమాలో, అప్పుడప్పుడూ చూపించే బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు ఒరిజినల్ రామారావువి చూపించి వుంటే సినిమా విలువ పెరిగి వుండేది. అవీ బాలకృష్ణతో చూపించటం తీవ్రమైన నిరాశను కలిగించటమే కాదు, విముఖతనూ కలిగించిన అంశం. రామారావు జీవితచరిత్ర సినిమాలో రామారావు కనబడని భావనను మిగిల్చిందీ సినిమా… అయితే, రామారావు క్లిప్స్ చూపించి వుంటే, అప్పుడు సినిమాలో రామారావు పాత్రధారి తేలిపోయేవాడు. ఇప్పుడు కృష్ణుడిగా, సుయోధనుడిగా రామారావును అనుకరించబోయి అభాసుపాలయ్యాడు. రామారావు, ఎస్వీ రంగారావు లాంటి వారిని ఎవ్వరూ అనుకరించి మెప్పించలేరు. చివరికి వారే వచ్చి ఆయా వేషాలు వేసినా మెప్పించలేరు. దీనికితోడు సినిమాలో ఏ పాత్రధారి కూడా తాను వేసిన పాత్రకు ఆధారమయిన వ్యక్తిని పోలివుండకపోవటం కూడా సినిమాలో ఒక లోపం.
అయితే, ‘మహానటి’లో, సావిత్రి, జెమినీ గనేషన్ పాత్రలకో పాట డ్యూయెట్ పెట్టినట్టు పాటలు పెట్టకపోవటం అభినందించవలసిన విషయం. అయితే, సినిమాను మరింత ఆకర్షణీయం చేసే పాటలు, నేపథ్య సంగీతం లేకపోవటమూ ఒక లోపమే.
అలాగని సినిమా బాగాలేదని కాదు. ఇది ఎన్.టి.రామారావు జీవితచరిత్ర అన్న భావనను పక్కనపెట్టి చూస్తే, దర్శకుడు అక్కడక్కడా సన్నివేశాలను ఆకర్షణీయంగా చిత్రించినట్టనిపిస్తుంది. కానీ, సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయి. ఇది స్క్రిప్ట్ లోపాన్ని మరింత స్పష్టం చేస్తుంది.
‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమా ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. తెలుగు సినిమాలు ఈనాటికి కూడా స్క్రిప్ట్ కన్నా ఇతర అంశాల ద్వారా సినిమాను ఆకర్షణీయం చేయాలని చూస్తున్నాయి. నిజానికి స్క్రిప్ట్ సరిగా లేకపోతే, మిగతా ఎన్ని ఆకర్షణీయమైన అంశాలున్నా, అవన్నీ ప్రాణంలేని శరీరానికి చేసిన అలంకారాలే. స్క్రిప్ట్ పై ఇంకాస్త శ్రద్ధపెట్టి, నటీనటుల ఎంపికలో జాగ్రత్త వహించి వుంటే ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ చక్కని సినిమాగా ఎదిగివుండేది. వ్యర్థమయిన చక్కని ప్రయత్నంలా మిగిలేది కాదు.