[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]బ[/dropcap]యట వీధిలో గోలగోలగా వినిపిస్తుంటే ‘ఏమిటా అని’ బాల్కనీ లోకి వెళ్ళాను. అందరూ వాచ్‌మన్‌ల పిల్లలు! ఇప్పుడు ఎపార్టుమెంట్సు వెలిసాకా అందులో వుండే వారి పిల్లల కన్నా వాచ్‍మన్ల సంతానమే ఎక్కువయి పోతున్నది. అంతా రోడ్డు మీద ఒక వ్యక్తిని టార్జెట్ చేసి రాళ్ళూ రప్పలు విసిరి గేలి చేసి నవ్వుతున్నారు.
ఆ వ్యక్తి కేసి చూశాను.
మాసిన జీన్స్ పాంట్, రంగు వెలసిన టీ షర్టు వేసుకుని వున్నాడు. జుట్టు, గడ్డం పెరిగిపోయి తైల సంస్కారం లేక మట్టికొట్టుకుని ఉన్నాయి. క్రింద పడిన న్యూస్ పేపర్ ముక్కని తీసుకుని అటూ యిటూ చదివి ‘నో వేకెన్సీస్ నో వేకెన్సీస్’ అని చేతులు చిన్నపిల్లాడిగా గాలిలో తిప్పుతూ తన మీదకి పిల్లలు విసురుతున్న రాళ్ళని పట్టించుకోకుండా వెళ్తున్నాడు.
నేను పిల్లలతో పాటు నిలబడి వినోదం చూస్తూ ఆనందిస్తున్న వాచ్‍మన్‌లని కేకలేసాను.
నన్ను కూడా ఒక పిచ్చిదానిలా చూసి వాళ్ళు లోపలికెళ్ళారు. పిచ్చివాళ్ళని చూస్తే వాళ్ళెలా ప్రవర్తించినా నాకు నవ్వు రాదు.
కారణం నా చిన్నప్పుడు మా నాన్నగారు దరిశిలో పని చేసేస్తున్నప్పుడు ఒక పెద్దాయన మా పోస్టాఫీసుకి వచ్చేవారు. శుభ్రంగా వుతికిన ఖద్దరు పంచె, లాల్చీ వేసుకుని ఆయన పోస్టాఫీసు కొచ్చి రోడ్డు మీద నిలబడి మేడ మీద బాల్కనీలో నిలబడ్డ మా వేపు తలెత్తి చూసి, “ఏమ్మా అమ్మాయిలూ బాగుండారా! బాగా చదువుతున్నారా?” అనడిగేవారు.
మేము చిరునవ్వులతో “బాగా చదువుకుంటున్నాం” అని చెప్పేవాళ్ళం.
“ఒక తడవ మనింటికి రండమ్మా. అంతా లచ్చిందేవుల్లా వున్నారు” అనేవారాయన.
మేం సరేనని తలూపే వాళ్ళం.
అప్పుడసలు కథ మొదలయ్యేది.
“మరి మీకేం కూరలిష్టం? వంకాయ మెదిపిన పులుసా? వంకాయ ముక్కల పులుసా? మీరొస్తే మా ఆడదానికి చెప్పి చేయించ పన్లేదా?” అనేవారు.
మేం పకపకా నవ్వే వాళ్ళం.
మా నవ్వులు చూసి ఆయనలో హుషారు పెరిగి ఇంకేవో ప్రశ్నలు వేస్తేండే వారాయన.
ఇదంతా పోస్టాఫీసు లో నుండి మా నాన్నగారు చూసి గ్రహించి ఏ పోస్టుమాన్‌నో పంపి లోపలికి వెళ్ళమని మాకు కబురు చేసేవారు.
“అతనికి కొంచెం పిచ్చుందమ్మా. లోనకి బొండి” అని పోస్టుమాన్ మాకు చెప్పేవాడు.
పిచ్చి అనగానే మాకింకా నవ్వొచ్చేది.
అతని కోసం రోజు దొంగచాటుగా ఎదురు చూసేవాళ్ళం. ఆయన కూడా రోజూ పనిలేక పోయినా పోస్టాఫీసు కొచ్చి “ఆడపిల్ల కాయలు బాగుండారయ్యా” అని పొగిడేవారు.
ఇదంతా చూసి మా నాన్నగారు ఒకరోజు మాకు క్లాసు తీసేరు.
మమ్మల్ని కూర్చోబెట్టి “ఆయన ఒక్కగానొక్క కూతురు అర్ధంతరంగా చనిపోతే ఆయన అలా అయిపోయారు. మీరు ఎప్పుడూ పిచ్చివాళ్ళని చూసి నవ్వకండి. శరీరానికి ఎలా జబ్బులు వస్తాయో, అలాగే మనసుకీ వస్తాయి” అని వివరంగా చెప్పారు.
దాంతో ఇక పిచ్చివాళ్ళని చూసి నవ్వడం మానేసాం.
ఆ స్థానే చాలా బాధ కల్గుతుంది అటువంటి వారిని చూస్తే.
జీవితంలో ఓడిపోయినవారు – ఇతరుల వలన అనేకానేక బాధలకి గురయినవారు – ఓర్చుకునే స్థాయి దాటి పోయినప్పుడు – ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేనివారు – ఆ సమయాన నేను వున్నానని ఊరడించే తోడు లేని వారే పిచ్చివారవుతారని రాను రాను నేను గ్రహించాను.
నేను పైన చెప్పిన అబ్బాయి కూడా చదువుకుని వుంటాడు. ఎంతకీ వుద్యోగం రాక, ఆర్థిక యిబ్బందులతో అలా మానసిక వైకల్యానికి గురయి వుంటాడు.
ఈ సందర్భంగా నా చిన్ననాట కాకినాడలో నేను చూసిన ఒక వుదంతం చెబుతాను.
మా వీధి చివర నాలుగు రోడ్ల కూడలిలో మా వీధికి అభిముఖంగా ఒక పెంకుటిల్లు వుండేది. గోపీ చందనం రంగు గోడలతో రాయల్ బ్లూ రంగులోని తలుపులతో రెండు గదుల యిల్లది! అందులో ఒక వ్యక్తి వుండేవాడు.
గమ్మత్తేమిటంటే అతని పేరెవరికీ తెలియదు.
అతను చూడడానికి వత్తయిన క్రాఫుతో, కొద్దిగా బర్మావారి పోలికలతో, వెల్వెట్ క్లాత్ లాంటి పాంట్లు వేసుకుని పైన క్రీం కలర్ షర్ట్‌లు వేసుకునేవాడు.
అతను బుల్‌బుల్ అనే ఒక వాయిద్య పరికరంతో హిందీ సినిమాల పాటలు చాలా అద్భుతంగా వాయించేవాడు.
అంచేత అతన్నందరూ ఎంతో మర్యాదగా ‘బుల్‌బుల్ గాడు’ అని పిలిచేవారు.
పెద్దలేం చేస్తే పిల్లలదే చేస్తారు కదా!
మేమందరం కూడా అదే మర్యాదతో బుల్‌బుల్ గాడనే వాళ్ళం. అందులో వున్న అమర్యాద మాకర్థం కాని వయసు మాది.
వీధి వీధంతా అదే పిలుపు!
అసలు పేరెవరికీ తెలియనే తెలియదు. కారణం – అతనసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు.
ప్రొద్దుటే తన సైకిల్‌కి ఆ ఇన్‌స్ట్రుమెంటు తగిలించుకుని వెళ్ళిపోతే సాయంత్రమే రావడం!
వచ్చేడప్పుడు మాత్రం బరువుగా రెండు మూడు సంచుల్లో ఏమిటో తెచ్చుకునేవాడు.
ఎప్పుడైనా మా పెదనాన్న గారుంటే “ఏవోయ్ బుల్‌బుల్ – ఇలా రా” అని పిలిచేవారు.
పెదనాన్న అతన్ని కూర్చోబెట్టుకుని తనకిష్టమైన హిందీ పాటలు ఏవేవో అతన్ని వాయించమని వినేవారు.
అప్పుడు పిల్లలంతా అక్కడ మూగేవాళ్ళం.
వాటిల్లో నాకిప్పటికీ గుర్తున్నవి ‘ఆవారా హుఁ!’, ‘మేరా దిల్ యె పుకారే ఆ జా!’ అన్న పాటలు!
చాలా అద్భుతంగా వాయించేవాడు. పెదనాన్న బాగానే డబ్బు ఇచ్చి పంపేవారు. “పొద్దున్నే యిద్దరికీ పని లేదు” అని మా దొడ్డమ్మ అంటుండేది.
సాయంత్రం అతని సంచులు చూసి మా దూరపు బంధువయిన వరసకి అత్తయిన చంద్రకాంతం అత్త “మాయదారోడు… పెళ్ళీ పెటాకులు లేకపోయినా సంచుల్తో ఏంటో మోసేస్తున్నాడు” అని వెటకారం చేసి నవ్వేది.
కాని బుల్‌బుల్ అంటే అందరికీ ఆసక్తే!
ఎవరితో మాట్లాడడు.
ఎవర్నీ ఏమీ అడగడు.
ఎక్కడి నుంచి వచ్చాడో – ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరికీ తెలియదు.
అలా అతని ఎదుటే మేం స్కూల్లో జేరడం, కాలేజీ చదువులు ముగించడమూ జరిగిపోయింది. కాని అతను మాత్రం అదే రూపురేఖల్లో ఏమీ తేడా లేకుండా అలాగే వున్నాడు.
ఒకసారి మేం అక్కడ వుండగానే బుల్‌బుల్ యింటి ముందు పెద్ద అలజడి!
మూడు రోజులుగా బుల్‌బుల్ తలుపులు తెరవలేదట! చుట్టు పక్కల వాసనొస్తుంటే తలుపులు బద్దలు కొట్టారు.
అతను చనిపోయేడు.
ఏడ్చేవాళ్ళు కాని, తలకొరివి పెట్టేవాళ్ళు కాని ఎవరూ లేరు.
అతని విగత శరీరం మున్సిపాలిటీ బండిలో శ్మశానం చేరింది. ఎంత ఆర్భాటం చేసి పూలతేరుల్లో మేళతాళాలతో తీసుకెళ్ళినా, మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్ళినా చేరే గమ్యం మాత్రం అదే కదా!
ఆ తర్వాత అసలు కథ మొదలయ్యింది.
ఇల్లంతా అతను నింపిన సంచుల మీద అందరి దృష్టీ పడింది. వాటిల్లో ఏం దాచి వుంటాడో అన్న ఆసక్తి పెరిగిపోయింది.
పంచుకోవడానికి అయిన వారెవరూ లేకపోవడంతో వీధంతా (రా)బంధువులే అయిపోయారు.
‘నాతో బాగా మాట్లాడేవాడోయ్’ అని ఒకరంటే… ‘అవసరమైతే నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు’ అని మరొకరు అతనితో బంధుత్వం కలుపుకుని ఆ సంచుల్లో సంపదకి తామే వారసులమని అన్యాపదేశంగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు.
తగువెంతకీ తెగడం లేదు.
చివరకి సమ భాగాలుగా తీసుకోవడానికి ఒక ఒప్పందం ప్రకటించుకుని పెద్దల్ని ఎదురుగా పెట్టుకుని ఆ సంచుల్ని తెరవడం మొదలుపెట్టేరు.
మా మండువా యింటి పొడవాటి వరండాలో మేం అంతా కూర్చొని జరుగుతున్న తతంగాన్ని ఆసక్తిగా చూస్తున్నాం.
ఒక్కొక్క సంచి బోర్లిస్తుంటే… దాని నిండా చిత్తుకాగితాలూ, టైలర్స్ దగ్గర మిగిలిపోయిన గుడ్డ పేలికలూ బయటపడసాగేయి.
‘దొంగ ముండా కొడుకు… గట్టోడే… వీటిల్లో ఎక్కడో దాచేసాడు’ అని అభినందిస్తూనే వెతుకుతున్నారు.
చివరికి ఒక సంచీలో చిన్న ప్లాస్టిక్ డబ్బా దొరికింది. అందరి దృష్టీ దాని మీద పడింది.
ఏదో విలువైన వస్తువు అందులో వుంటుందని ఆసక్తిగా చూసేరు.
డబ్బా మూత తెరవగానే, అందులో ఒక కాగితం మడిచి వుంది.
‘హమ్మయ్య… అసలు డబ్బు ఎక్కడ దాచేడో వివరాలిందులో రాశాడన్న మాట. పిచ్చి ముండా కొడుకు, గడుసు వెధవ!’ అంటూ ఆ ఉత్తరం చదివేరు.
అందులో ఇలా వుంది.
“మన వీధి మిత్రులకి – నేను ఎప్పుడైనా చనిపోతే మీరు నా గురించి చాలా ఆసక్తి కనబరుస్తారని నాకు తెలుసు. ఇన్నాళ్ళుగా ఇక్కడ వుంటున్నాను. నేను ఏం తింటున్నానని గాని… ఎక్కడి నుండి వచ్చావని గాని ఎవరు అడగలేదు. ఎవరు ఒక పూట అన్నం పెట్టలేదు. నా ఆస్తి వివరాలు మాత్రం అడిగేవారు. నాకు పిచ్చివాడనే టైటిల్ కూడా ఇచ్చారు. ఎవరేమన్నా నేనెప్పుడూ పట్టించుకోలేదు. కాని యిప్పుడు నాకు నవ్వొస్తున్నది. నేను పోగానే మీరంతా నా యిల్లు సోదా చేస్తారు. నేను సంపాదించింది పంచుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి – ఎవరు పిచ్చివాళ్ళు! అయాచితంగా యితరుల సొమ్ము కాజేయాలనుకునే వాళ్ళా… నేనా?”
ఇలా సాగిందా వుత్తరం!
అది చూసి మేమంతా పిల్లలం విరగబడి నవ్వుకున్నాం.
వీధిలో పెద్దలకి మాత్రం కత్తిగాటుకి నెత్తురు చుక్క లేదు.
నిజమే కదా… ఈ దేశంలో ఎంతమంది పిచ్చివాళ్ళు ప్రముఖులుగా చలామణీ అవ్వడం లేదు!
పిచ్చివాడు కూడా సందేశం యివ్వగలడు!
కదా…!