సిరి ముచ్చట్లు-20

0
4

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో 20వ ముచ్చట. [/box]

ఇంట్లో అమ్మకు వంట పనిలో సాయపడుతూనే చక చకా తయారై కాలేజీ కెళ్తున్నది సిరి. చక్కగా హుషారుగా చదవుకుంటున్న తమ గారాల పట్టిని చూసి మురిసిపోతున్నారు అమ్మ నాన్నలు. రాజు, రాములు కూడా ఆడుతూ – పాడుతూనే తమ ఉద్యోగాలు చేసుకొంటున్నారు.

ఒకరోజు అందరూ తీరిగ్గా కూర్చున్నప్పుడు నానమ్మ నాన్నతో “ఒరే బాబూ, ఆ దేవుడి దయవల్ల మన పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. సిరి చదువు యింకా పూర్తి కాలేదు. కానీ రాజుకు పెళ్ళీడు వచ్చింది. మేముండగనే వాడికి పెళ్ళి చేయరా, మనవడి పెళ్ళి చూసి పోతాం” అన్నది.

అక్కడే వున్న పెద్దన్నయ్య విని “ఎక్కడికి పోయేది? అన్నీ పిచ్చి ఆలోచనలు చేయకండి. ఓ 3,4 సంవత్సరాలన్నా జాబ్ చేయాలి. మన ఇల్లు విస్తరింపచేయాలి. అయినా చెల్లి పెళ్ళి చేయకుండా నాకు పెళ్ళేంటి నానమ్మా?” అన్నాడు.

“అది కాదురా, ఏ రోజు ఎలా వుంటుందో? బాగా పండిన పండు ఇంకా చెట్టుకే వుంటుందా? రాలి పోదూ? అలాగే మా సంగతి కూడా. నీ ఒక్కడి పెళ్ళన్నా చూసే భాగ్యం కలిగించరా?” అన్నది నాన్నమ్మ.

“ఆ మాట నిజమేరా రాజూ ఏ రోజేం గానుందో తెలియదుగా?” అన్నాడు తాతయ్యా కూడా.

అమ్మ కల్పించుకొని “ఊర్కోండి అత్తయ్యా మామయ్యా పైన తథాస్తు దేవతలుంటారట. మీకేవ్వరికీ ఏమీ కాదు. అలాంటి మాటలనకండి. మీ మనవళ్ళ పెళ్ళీ, మనమరాలి పెళ్ళీ చూడడమే కాదు. వాళ్ళ పిల్లలనూ చూస్తారు. సరేనా?” అన్నది.

తాతయ్య బోసి నోటితో నవ్వి “ఎంత ఆశమ్మా నీకు?” అన్నాడు.

“మరేంటి మామయ్యా ఇప్పటి నుండే యిలాంటి మాటలు?” చిరు కోపం ధ్వనించింది అమ్మ గొంతులో.

నాన్న తాతయ్యా, నానమ్మలిద్దరి చేతులు పట్టుకొని “ఇంకెప్పుడు అలాంటి మాటలనకండి అమ్మా, నాన్నా మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా వుంటారు. వుండాలి” అన్నాడు గద్గద స్వరంతో.

“అది కాదురా నాన్నా. ఎన్నాళ్ళున్నా మరణం తప్పదు గదా? ఏదో మేము ఆరోగ్యంగా వుండగానే మనువళ్ళ ముద్దూ ముచ్చట్లు చాడాలని ఆశ. అంతే” అన్నాడు తాతాయ్య.

“వూరికే బాధపడ్తావేరా పిచ్చి నాయనా” అంటూ నాన్న తలను ప్రేమగా నిమిరింది నానమ్మ.

రాజన్నయ్య నవ్వుతూ “అలాగైతే నా సంగతి వదిలేసి రామూకు చూడండి పెళ్ళి కూతురిని. వాడూ జాబ్ హోల్డరేగా?” అన్నాడు.

“సరిపోయింది నేనే దొరికానా ఏంటి? ముందు చెల్లికి చూడండి” అన్నాడు రామన్నయ్య.

“ఊ పాపం, అదే అనుకొంటున్నారు. మా ఫ్రెండ్సంతా నాకు సీనియర్సయ్యారు. అనవసరంగా నాకు ఏడాది వృథా చేసారు. నా డిగ్రీ పూర్తయ్యే దాకా ఎవరన్నా పెళ్ళి మాటెత్తితే వూర్కునేది లేదు. తెల్సిందా?” అని తర్జనితో బెదిరింస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళింది సిరి.

అందరూ సరదాగా నవ్వేసారు..

నిజంగానే తథాస్తు దేవతలుంటారేమో గానీ 6 నెలల తేడాలో మొదట నాన్నమ్మ గుండెపోటుతో, తర్వాత ఆమె మీద బెంగతో తాతయ్య తనువులు చాలించారు.

ఆ ఇంట్లో పెను విషాదం ఆవరించింది.

చాలా కాలం దాకా నాన్నను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. నవ్వుల గలగలలు, సరదాలు, సరాగాలు ఆ ఇంటి నుండి నిష్క్రమించాయి. అందరూ యాంత్రికంగా, నిశబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొంటున్నారు. అప్పుడుప్పుడూ సిరే అమ్మ నాన్నలను ఏదో ఒకటి చెప్పి నవ్వించేందుకు ప్రయత్నించేది. అన్నయ్య లిద్దరూ బలవంతంగా వాళ్ళను సినిమాలకనీ పార్కులకనీ దేవాలయాలకనీ తీసుకెళ్తూ మెల్ల మెల్లగా నానమ్మ తాతయ్యల వియోగ దుఃఖము నుండి బయటికి లాగసాగారు.

రోజులాగవు గదా? సిరి డీగ్రీ సెంకడ్ ఇయర్‌లోకి వచ్చింది. అన్నయ్యల ఉద్యోగాలు సజావుగానే సాగుతున్నాయి. క్రమ క్రమంగా అమ్మా నాన్నా మామూలు మనుషులయ్యారు. సంక్రాంతి సెలవులు వచ్చాయి.

ఎప్పటి నుండో పిన్ని అందరినీ రమ్మని అంటున్నది.

“సరే, ఇప్పుడు సిరికి సెలవులిచ్చారు కదా? ఈ పండక్కన్నా రండి” అని పిన్ని ఉత్తరం వ్రాసింది. అన్నయ్య లిద్దరూ పండగప్పుడు వస్తాం. ముందు మీరు ముగ్గురూ వెళ్ళండి అన్నారు. అమ్మా నాన్నా సిరి నాలుగైదు రోజులు ముందు గానే పిన్ని వాళ్ళ ఊరికి బయల్తేరారు.

రైలులో కిటికీ ప్రక్కన కూర్చుని పచ్చని పంట చేలనూ, ఎత్తయిన చెట్లపై తెల్లని పెద్ద పెద్ద పువ్వుల్లా వాలిన కొంగలనూ, నీటి మడుగుల్లో అరవిరిసి అందాలోలికిస్తున్న కలువలనూ, దారి ప్రక్కనే వున్న రంగు రంగుల పూతీవలనూ, కదుల్తున్నట్లు కనిపిస్తున్న కరంటు స్థంబాలనూ చూస్తూ చిన్న పిల్లలా కేరింతలు కొడ్తున్న సిరిని చూసి చాలా రోజుల తర్వాత అమ్మా నాన్నా మనసారా నవ్వుకొన్నారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here