ఫండ్రి : హృదయస్పర్శి అలాగే కూసాలు కదిల్చేది కూడా

0
3

[box type=’note’ fontsize=’16’] “భుజాలు తడుముకోవడమా, పాఠం నేర్చుకోవడమా, కళ్ళు తెరుచుకోవడమా యెవరికివారు నిర్ణయించుకోవాలి” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఫండ్రి‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]నా[/dropcap]గరాజ్ మంజులె తీసిన “సైరాట్” చూసిన తర్వాత అతని చిత్రాల పట్ల ఆసక్తి కలిగింది. అతని మొదటి చిత్రమైన “ఫండ్రి” లోనే అతని సత్తా కనిపిస్తుంది. చాలా అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం నాకు శ్యాం బెనెగళ్ తొలి చిత్రాలను గుర్తు చేసింది. ఇందులో నాగరాజ్ వొక పాత్రను కూడా చేశాడు. యేకకాలంలో నటన, దర్శకత్వం తో పాటు సరైన నటుల యెంపికలో, వాళ్ళ దగ్గరినుంచి నటన రాబట్టడంలో వున్న నైపుణ్యాన్ని మొదటి చిత్రంలోనే కనబరిచాడు.

వొక పల్లె శివార్లలో బతుకుతున్న వో దళిత కుటుంబ కథ, ఆ ఇంటి పదమూడేళ్ళ అబ్బాయి కళ్ళతో చెప్పబడింది. జాంబవంత్ కచ్రూ మనే క్లుప్తంగా జబ్యా (సోమ్నాథ్ అవ్ఘడే) యవ్వనంలో తొలి అడుగులు వేస్తున్న నల్లవాడు. తన క్లాసులోనే చదువుకుంటున్న అయినింటి, పెద్దకులపు తెల్ల అమ్మాయి షాలూ (రాజేశ్వరి ఖరాట్) పట్ల ఆకర్షితుడై, యెట్లాగైనా ఆమె కంట పడాలని, ఆమె మెప్పు పొందాలని యెవేవో పగటి కలలు కంటూ వుంటాడు. కొత్త బట్టల కోసం ఇంట్లో మారాం చేయడం, లభ్యం కాకపోతే చిరాకుపడటం, తల దువ్వడం, తయారవడం పట్ల పెరిగిన శ్రధ్ధ ఇవన్నీ అతని వయసుతోపాటు వచ్చే మానసిక మార్పులను సూచిస్తాయి. కైకడి అనే వో తక్కువ కులానికి చెందిన ఆ కుటుంబం చిల్లర పనులవీ చేసుకుంటూ బతుకు నెట్టుకొస్తుంటారు. వెదురు బుట్టలు అల్లడం, పందులను పట్టుకోవడం లాంటివి. తండ్రి కచ్రూ (కిశోర్ కదం) నంగి నంగి గా వుంటాడు, వూళ్ళో యెవరేం చెప్పినా చేస్తుంటాడు. తన కులం కారణంగా సమాజంలో తన స్థానం తెలిసినవాడై, దాన్ని వొప్పుకొని లేదా అలాంటి పరిస్థితికి లోను కాబడి, యెలాంటి ప్రతిఘటనా లేకుండా అలా తయారవుతాడు. భార్య, పెళ్ళై పాపతో ఇంట్లోనే వుంటున్న పెద్ద కూతురు (విధవ రాలో, లేక వదిలివేయబడ్డదో స్పష్టంగా లేదు), పెళ్ళి కావాల్సిన చిన్న కూతురు కూడా అతనికి సహాయపడుతుంటారు. వొక్క జబ్యా మాత్రం తన స్థానాన్ని గ్రహించక, గ్రహించడానికి ఇష్టపడక యేదో ప్రపంచంలో విహరిస్తూ వుంటాడు. తన తోటి విద్యార్థుల ముందు అతని కుటుంబం వచ్చినా తక్కువగా ఫీలవుతాడు. అతని నేస్తగాడు పిర్యా (సూరజ్ పవార్) తో కలిసి యెప్పుడూ నల్ల పిట్ట వేటలో వుంటాడు. అది అందీ అందకుండా పోతూ వుంటుంది. ఆ పసి మనసు నమ్మేది యేమిటంటే ఆ పిట్టను గనక పట్టి, కాల్చి ఆ బూడిదను కావలసిన మనిషి మీద జల్లినట్లైతే ఆ మనిషి తన వశమవుతాడు/వశమవుతుంది. అంత అమాయకత్వంలోనూ ఆర్థిక, సామాజిక వ్యత్యాసాల కారణంగా తను కోరుకుంటున్నది జరిగే పని కాదని తెలుసు. అందుకే ఆ పిట్టను పట్టగలిగినా తన కల సాకారమవుతుందన్న ఆశ. అది కేవలం అతని కలలోనే నెరవేరుతుంది. వొకసారి వూరి పటేలింటి ముందు గుంతలో పడిపోయిన పంది పిల్లను తీయమంటే నిరాకరించిన జబ్యా చివరికొచ్చేసరికి తనే తన కుటుంబంతో పాటు పందులను పట్టుకునే బృహత్కార్యంలో పాల్గొనాల్సి వస్తుంది. అది యెట్లా అంటే ఆ వూరి వో పండగ సందర్భంలో దేవుని వూరేగింపు ముందు కొత్త బట్టలు వేసుకుని డాన్స్ చేస్తుంటాడు జబ్యా, అలాగైనా షాలు కంట పడాలని. వో పక్క పైకులపు వాళ్ళు ఇతన్ని నెట్టేస్తూ వుంటారు. మరో పక్క తండ్రి వచ్చి పిలుచుకుని వో పెట్రొమేక్స్ లాంతరు మోసే పనిలో పెడతాడు. డాన్స్ చేస్తున్నవారి మధ్య ఆ లాంతరు పట్టుకుని యేడుస్తూ నిలబడతాడు జబ్యా. ఇంతలో వో పంది యెటునుంచో వచ్చి పల్లకి కిందనుంచి తుర్రుమంటుంది. దాన్ని అశుభంగా భావిస్తారు అందరూ. రెండు రోజుల తర్వాత కూతురు పెళ్ళి జరగాల్సి వుండిన సమయంలో కచ్రూని పిలిపించి పటేలు పందులను పట్టే పని చెబుతాడు. పెళ్ళుందని నసిగితే డబ్బు ఆశ పెట్టి సాయం కోసం కుటుంబం మొత్తాన్ని కలుపుకుని మరీ ఆ పని మీద వుండమంటాడు. ఇక్కడి నుంచి ఆ పందులను పట్టే సన్నివేశం చాలా విస్తారంగా వుండి వొక layered constructive గా మన ముందు నిలుస్తుంది. డబ్బు అవసరమైన కుటుంబం మొత్తం ఆ పనిలో నిమగ్నమైనా జబ్యాకి మాత్రం సిగ్గు వేస్తుంది. తన సామాజిక స్థితి (status) నుంచి తప్పించుకోలేని ఘట్టం. పైగా వూరంతా చుట్టూ చేరి చూస్తున్నారు. షాలూ కూడా అందరితోపాటే యెగతాళిగా నవ్వుతూ తిలకిస్తూ వుంటుంది. దాక్కోలేడు, తప్పించుకోలేడు. మరో పక్క అతని పెళ్ళి కావాల్సిన అక్కను మాటలతో ఆటపట్టిస్తుంటాడు వో తుంటరి. పనిలో శ్రధ్ధ పెట్టడంలేదని తండ్రి నుంచి దెబ్బలు తింటాడు జబ్యా అందరి ముందూ. వొక్కసారిగా నిస్సహాయత్వం ఆవరిస్తుంది. తన నిజమైన ఉనికి తెలుస్తుంది. అణిచివేత అనుభవానికి వస్తుంది. పోనీలే, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అన్న అక్క మాటలు పట్టవు. కోపం కట్టలు తెంచుకుంటుంది. తండ్రి లాగా అణిగి పోవడమా లేక ప్రతిఘటించడమా? తనని కొట్టవస్తున్న ఆ తుంటరి మీద రాయి రువ్వుతాడు, కసిగా. అది అతనికి తగిలిందో లేదో గాని తెర మాత్రం నల్లబారుతుంది, అదేదో మనల్నే తగిలినట్టు. తగలాల్సినచోటే దెబ్బ తగులుతుంది. తెర మీదే కాదు, తెర ముందు కూడా వున్న అరాచక మూకల మీద ఘాతం. భుజాలు తడుముకోవడమా, పాఠం నేర్చుకోవడమా, కళ్ళు తెరుచుకోవడమా యెవరికివారు నిర్ణయించుకోవాలి.

చర్చించదలిస్తే ఇంకా చాలా సూక్ష్మంగా అల్లిన కథనాలున్నాయి. జబ్యా అక్కను పెళ్ళి కోసం చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ (కైకడి) భాషలో సంభాషించడం, కట్నం గురించి బేరసారాలు వగైరా. అంతా జబ్యా కళ్ళ ముందే. కేవలం ఆ కులానికి చెందడం వల్ల వూరు వూరంతా వారిని హీనంగా చూడటం. వూరి కోసం కడుతున్న శౌచాలయ నిర్మాణం కోసం కచ్రూ అతని భార్యే కాక బడికి శలవు పెట్టించి ఇష్టానికి వ్యతిరేకంగా జబ్యా చేత కూడా పని చేయించడం. ఇలా చాలా విషయాలు వున్నాయి. ఆ చివరి పందులను పట్టే సన్నివేశం నాకు పార్ లో చివర్న నసీరుద్దిన్ షా, షబానా ఆజ్మిలు పందులను నదిని దాటించే సన్నివేశాన్ని తలపుకు తెచ్చింది.

రెండో చిత్రమైన సైరాట్ ను నేను ముందు చూసి మెచ్చుకున్నాను. అది చాలా ప్రజాదరణ పొందింది. కాస్త రెగ్యులర్ కమర్షియల్ మూసలో వున్నా చాలా బలమైన కథనం, మంచి సబ్జెక్టు వున్నాయి. అది అలా రావాల్సిన అవసరం వుంది, అలాగే అది బహుళ ప్రజానీకాన్ని చేరింది కూడా. కాని నాగరాజ్ మొదటి చిత్రమైన ఫండ్రి నాకు యెక్కువ తృప్తినిచ్చింది. మరి సినెమా హిట్ అయ్యిందో లేదో తెలీదు. నాగరాజ్లో మంచి దర్శకుడు, నటుడు కనిపించాడు. కిశోర్ కదం తండ్రిగా బాగా చేశాడు. కొత్తగా పరిచయమైన సోమ్నాథ్ అవఘడే చాలా బాగా చేశాడు. బాల్యపు గొంతు పోయి వొక గీర వచ్చిన గొంతుతో సంభాషణ, కళ్ళల్లో సిగ్గు, అమాయకత్వం, అమ్మాయి వైపు దొంగ చూపులు, ఆమె మెప్పు కోసం, ఆమె దృష్టిలో పడటం కోసం తపన, తన కులం కారణంగా సమాజంలో వున్న స్థితిని వొప్పుకోకపోవడం, నిజం నుంచి తప్పించుకోవాలని చూడటం అన్నీ చాలా సమార్థవంతంగా చేశాడు. కష్టమైన పాత్ర అమోఘంగా చేసి జాతీయ అవార్డు కూడా పొందాడు. ఈ చిత్రానికి నాగరాజ్ మంజులే కూడా కొత్త దర్శకునిగా (best debut director) జాతీయ అవార్డును పొందాడు. అందమైన చాయాగ్రహణం (విక్రం అంలాది), అంతే అద్భుతమైన నేపథ్య సంగీతం (ఆలోకనంద దాస్గుప్తా) ఆకర్షిస్తాయి, గుర్తుండిపోతాయి.

ఇదివరకే చూసి వుండకపోతే తప్పక చూడండి ఫండ్రి. అన్నట్టు ఫండ్రి అంటే పంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here